అభినయ దర్పణము/నవవిధశిరోభేధ లక్షణమ్‌

ఉపాంగాని ద్వాదశితాన్యన్యాన్యంగాని సంతి చ,
పార్ష్ణిగుల్భౌ తథా౽జ్గుళ్యః కరయోః పదయో స్తలే. 53
ఏతాని పూర్వశాస్త్రానుసారేణోక్తాని వై మయా,

తా. చూపు, ఱెప్పలు, నల్లగ్రుడ్దు, చెక్కిళ్ళు, ముక్కు, దవుడలు, అధరము, దంతములు, నాలుక, గడ్దము, మొగము, శిరస్సు ఈ పండ్రెండును ఉపాంగములు. వీని అంగాంతరములుగా గుదికాలు, చీలమండ, కాళ్లచేతులవ్రేళ్లు, అరచేతులు, అరకాళ్లు. ఇవి పూర్వశాస్త్రము ననుసరంచి నాచేత చెప్పఁబడినవి.

అంగానాం చలనాదేవ ప్రత్యజ్గోపాజ్గయోరపి. 54
చలనంప్రభవే త్తస్మాత్స ర్వేషాం నా౽త్రలక్షణమ్&,

తా. అంగములు చలించుటవలననే ప్రత్యంగోపాంగములకును చలనము కలుగును. కాఁబట్టి వీని కన్నిఁటికిని వేరువేరుగా లక్షణములు చెప్పలేదు.

నృత్యమాత్రోపయోగ్యాని కథ్యంతే లక్షణై క్రమాత్.
ప్రథమం తు శిరోభేదః దృష్టిభేద స్తతః పరమ్‌,
గ్రీవాహస్తౌ తతః పశ్చాత్క్రమేణైవం ప్రదర్శ్యతే. 56

తా. నృత్యమున కుపయోగించునవి మాత్రము లక్షణయుక్తముగఁ జెప్పఁబడును. మొదట శిరోభేదము, తరువాత దృష్టిభేదము, పిమ్మట గ్రీవాభేదము, అటుపిమ్మట హస్తభేదము నీవిధముగ వివరింపఁబడును.

అథ నవవిధశిరోభేదా లక్ష్యన్తే.

సమముద్వాహితమథోముఖమాలోలితం ధుతమ్,
కమ్పితఞచ పరావృత్త ముత్తిప్తమ్పరివాహితమ్‌. 57

నవధా కథితం శీర్షం నాట్యశాస్త్రవిచక్షణైః,

తా. సమము, ఉద్వాహితము, అధోముఖము, ఆలోళితము, ధుతము, కంపితము, పరావృత్తము, ఉత్తిప్తము, పరివాహితము నని శిరోభేదములు తొమ్మిది.

1. సమము :-
నిశ్చలం సమమాఖ్యాతమున్నత్యానతివర్జితమ్‌. 58

తా. క్రిందకి వంపక, మీఁదికెత్తక నిశ్చలముగ నుంపఁబడునది సమశిరస్సు.

వినియోగము:-
నృత్తరమ్భే జపాదౌ చ గర్వే ప్రణయకోపయోః,
స్తమ్భనేనిష్క్రియాత్వేచ సమశీర్ష ముదాహృతమ్‌.
59

తా. నృత్తారంభము, జపాదులు, గర్వము, ప్రీతి, కోపము, స్తంభించి యుండుట, క్రియారహితత్వము- వీనియం దీశిరస్సు ఉపయోగింపఁబడును.

2. ఉద్వాహితము :-
ఉద్వాహితశిరో జ్నేయ మూర్ధ్వభాగోన్నతం శిరః,

తా. మీఁదికెత్తి నిలుపఁబడునది యుద్వాహితశిరము.

ధ్వజే చన్ద్రేచ గగనే పర్వతే వ్యోమగామిషు.
తజ్గవస్తుని సంయోజ్య ముద్వాహితశిరో బుధైః,
60

తా. ధ్వజము, చంద్రుఁడు, ఆకాశము, పర్వతము, ఆకాశమున సంచరించెడువస్తువులు, ఎత్తైనపదార్ధము--వీనిని చూచుటయందు ఈశిరస్సు వినియోగింపఁబడును.

3. అధోముఖము:-
అధస్తాన్నమితం వక్త్ర మధోముఖమితీరితమ్‌. 61

తా. క్రిందికి పంపఁబడిన శిరస్సు అధోముఖ మనఁబడును.

వినియోగము:-
లజ్జాఖేదప్రణామేషు దుశ్చిన్తా మూర్ఛయో స్తథా,
అధస్థ్సితార్థనిర్దేశే యుజ్యతే జలమజ్జనే.
62

తా. సిగ్గు, ఖేదపడుట,మొక్కుట, దురాలోచనచేయుట, మూర్ఛిల్లుట, క్రిందుగా నుండుపదార్ధమును చూచుట, నీటమునుఁగుట వీనియందు ఈ శిరస్సు ఉపయోగింపఁబడును.

4. ఆలోలితము:-
మణ్డలాకారవద్భ్రాన్త మాలోలితశిరో భవేత్,

తా. చక్రాకారముగాఁ ద్రిప్పఁబడునది అలోలితశిర మనఁబడును.

వినియోగము:-
నిద్రోద్వేగే గ్రహావేశే మదే మూర్ఛాతురే తథా. 63
భ్రమణేచ వికల్పాదౌ హాస్యేచా౽౽లోలితం శిరః,

తా.తూగాడుట, దయ్యముసోకుట, మదము, మూర్ఛపోయినవాఁడు, గిరగిరతిరుగుట, వికల్పాదులు, నవ్వు వీనియందు ఈ శిరస్సు ఉపయోగింపఁబడును.

5.ధుతము:-
వామదక్షిణభాగే తు చలితం తద్ధుతం శిరః 64

తా. ఎడమ కుడిప్రక్కలకు కదలింపఁబడునది ధుతశిర స్సనఁబడును.

వినియోగము:-
నా స్తీతి వచనే భూయః పార్శ్వదేశావలోకనే,
జనాశ్వానే విస్మయే చ విషాదే ౽నీప్సితే తథా. 65
శీతార్థే జ్వలితే భీతే సద్యఃపీతాసవే తథా,
యుద్ధయత్నే నిషేధే చ అమర్షే స్వాజ్గవీక్షణే. 66
పార్శ్వాహ్వానే చ తస్యోక్తః ప్రయోగో భరతాగమే,

తా. లేదనుట, మాటిమాటికి ప్రక్కలఁజూచుట, జనుల నూరడించుట, ఆశ్చర్యము, ఖేదము, ఇచ్చలేమి, చలి, మండుట, భయపడుట, అప్పుడు త్రాగినకల్లు, యుద్ధప్రయత్నము, త్రోపుడు, కోపము, తన అవయవములను జూచుకొనుట, ప్రక్కలనుండువారలను బిలుచుట వీనియందు ఈ శిరస్సు ఉపయోగింపఁబడును.

6. కంపితము:-
ఊర్ధ్వాధోభాగచలితం కంపితం తచ్ఛిరో భవేత్. 67

తా. క్రిందుమీఁదుగాఁ గదలింపఁబడునది కంపితశిరస్సనఁబడును.

వినియోగము:-
రోషే తిష్ఠేతి వచనే ప్రశ్నసంజ్నోపహూతయోః,
ఆవాహనే తర్జనే చ కమ్పితం తచ్ఛిరో భవేత్.
68

తా. కోపము, ఉండుమనుట, అడుగుట, పిలుచుట, ఆవాహనము, బెదరించుట వీనియందు ఈశిరస్సు వినియోగింపఁబడును.

7. పరావృత్తము:-
పరాజ్ముఖీకృతం శీర్షం పరావృత్తమితీరితమ్,

తా. ప్రక్కగాఁ ద్రిప్పిన పరావృత్తశిర స్సగును. వినియోగము:-

తత్కార్యం కోపలజ్జాది కృతే వక్త్రప్రసారణే. 69
అనాదరే కచే తూణ్యాం పరావృత్తశిరో భవేత్,

తా. కోపము, సిగ్గు మొదలైన వానివలన ముఖమునుచాఁచుట, ఉపేక్షించుట, జడ, అమ్ములపొది వీనియందు ఈశిరస్సు ఉపయోగింపఁబడును.

8. ఉతిక్షప్తము:-

పార్శ్వోర్ధ్వభాగచలిత మతిక్షప్తం నామ శీర్షకమ్‌. 70

తా. ప్రక్కన మీఁదికెత్తఁబడునది ఉత్తిక్షప్తశిరస్సనఁబడును.

వినియోగము:-

గృహాణ గచ్ఛేత్యాద్యర్థే సూచనే పరిపోషణే,
అజ్గీకారే ప్రయోక్తవ్య మతిక్షప్తం నామ శీర్షకమ్‌. 71

తా. తీసికొనుము పొమ్ము అనుట మొదలగునవి, జాడచూపుట, పోషించుట, సమ్మతించుట వీనియందు ఉత్తిక్షప్తశిరస్సు ఉపయోగింపఁబడును.

9. పరివాహితము:-

పార్శ్వోర్ద్వయోశ్చామరవన్నతం చేత్పరివాహితమ్‌,

తా. వింజామరమువలె ఇరుప్రక్కలకు పంపఁబడునది పరివాహిత శిరస్సనఁబడును.

వినియోగము:-

మోహేచ విరహే స్తోత్రే సన్తోషే చాఽనుమోదనే. 72
విచారే చ ప్రయోక్తవ్యం పరివాహిత శీర్షకమ్‌,

తా. వలపు, ఎడబాటు, పొగడుట, సంతోషము, ఒప్పుకొనుట, విచారము వీనియందు ఈశిరస్సు ఉపయోగింపఁబడును.

గ్రంథాంతరస్థ శిరోభేదాః.

ధుతం విధుతమాధూత మవధూతం చ కంపితమ్‌. 73
అకంపితో ద్వాహితే చ పరివాహిత మంచితమ్‌,
నిహంచితం పరావృత్త మతిక్షప్తాధోముఖే తథా. 74
లోలితం చేతి విజ్ఞఏయం చతుర్దశవిధం శిరః,
తిర్యజ్నతోన్నతం స్కంధానతమా రాత్రికం సమమ్‌. 75
పార్శ్వాభిముఖమిత్యన్య భేదాన్‌ పంచ పరే జగుః,
సౌమ్యమాలోకితం చైవ తిరశ్చినం ప్రకంపితమ్‌. 76
సౌందర్యం పంచధాప్రోక్తం శిరోభేదా ఇదం క్రమాత్,
భరతాదిభిరాచార్యై శ్చతుర్వింశతిరీరితాః. 77

తా. ధుతము, విధుతము, అధూతము, అవధూతము, కంపితము, అకంపితము, ఉద్వాహితము, పరివాహితము, అంచితము, నిహంచితము, పరావృత్తము, ఉత్తిక్షప్తము, అధోముఖము, లోళితము, తిర్యజ్నుతోన్నతము, స్కంధానతము,అరాత్రికము, సమము, పార్శ్వాభిముఖము, సౌమ్యము, ఆలోలితము, తిరశ్చీనము, ప్రకంపితము, సౌందర్యము అని శిరోభేదములు ఇరువదినాలుగువిధములుగా భరతాచార్యులు మొదలైనవారిచేఁ జెప్పఁబడి యున్నవి.

1. ధుతము:-

పర్యాయేణ శనైస్తిర్యగ్గతముక్తం ధుతం శిరః,

తా. క్రమము చొప్పున మెల్లఁగా అడ్డముగాఁద్రిప్పంబడునట్టిశిరము ధుతమనఁబడును.

వినియోగము:-

శూన్యస్థానే స్థితేచైవ పార్శ్వదేశావలోకనే. 78

గ్రంథాతరస్థశిరో భేదలక్షణమ్.

అనాశ్వాసే విస్మయే చ విషాదే౽నీప్సితే తథా,
ప్రతిషేధే చ తస్యోక్తః ప్రయోగో భరతాదిభిః. 79

తా. ఏమిలేనిచోటు, ప్రక్కలుచూచుట, ఊరటలేమి, ఆశ్చర్యము, ఖేదము, ఇచ్చలేమి, త్రోపుడు వీనియందు ఈశిరస్సు వినియోగింపఁబడును.

2. విధుతము:-

ద్రుతగత్యథతత్త స్మా ద్విధుతం తత్ప్ర చక్షతే,

తా. అదేశిరస్సు వడితోఁ ద్రిప్పఁబడినయెడ విధుత మనఁబడును.

వినియోగము:-

శీతార్థేజ్వలితే భీతే సద్యః పీతాసవే తథా. 80

తా. చలి, వేండ్రము, పిరికివాడు, అప్పుడు కల్లు త్రాగినవాఁడు వీరియందు ఈశిరస్సు వినియోగింపబడును.


3. ఆధూతము:-

ఆధూతం తు సకృత్తిర్యగూర్ద్వనీత శిరోమతమ్,

తా. రవంత అడ్డముగా నిక్కించిన శిరస్సు అధూత మనఁబడును.

వినియోగము:-.

సర్వేషు స్వాంగవీక్షాయాం పార్శ్వస్థోర్వనిరీక్షణే. 81
శక్తో౽స్మీత్యభిమానే చ ప్రయోగస్తస్య చోదితః,

తా. సమస్తముననుట, తనదేహమును జూచుకొనుట, పార్శ్వములందు నిక్కిచూచుట, సమర్ధుఁడనైతినను గర్వము వీనియందు ఈ శిరస్సు వినియోగింపబడును.

4. అవధూతము:

యదధస్సకృదానీత మవధూతం తదుచ్యతే.82 తా. కొంచము క్రిందుగా వంపఁబడునది యవధూత మనఁబడును.

వినియోగము:

   స్థిత్యర్థేదేశానిర్దేశే ప్రశ్న సంజ్ఞోపహూతయోః,
   ఆలా వేచ ప్ర యోక్తవ్య మిదమాహుర్మనీషిణః, 83

తా. ఉండుమనుట, తావుజూపుట, అడిగెడుజాడ, పిలుచుట, సంభాషణము వీనియందు ఈ శిరస్సు వినియోగింపబడును.


5. కంపితము:-

బహుళోద్ధృతమూర్ధ్వం చ కంపనొక్కంపితం శిరః,

తా. మిక్కిలి పొడువుగనెత్తి చలింపఁజేయఁబడిన శిరస్సు కంపితమనఁబడును.

వినియోగము:-

జ్ఞానాభ్యుగమే కోపే వితర్కే తర్జనే తథా. 84
త్వరితే ప్రశ్న వాక్యే చ ప్రయోక్తవ్యమిదం శిరః

తా. జ్ఞాపకము తెచ్చుకొనుట, కోపము, ఆలోచన, బెదిరించుట, త్వరితము, ప్రశ్నముచేయుఁట వీనియందు ఈశిరస్సు వినియోగింపబడును

6. అకంపితము:-

అకంపితం తదేవ స్యా త్కంపితం తు శ నైర్యది. 85

తా. ఆ శిరస్సే మెల్లమెల్లఁగ చలింపఁజేయఁబడెనేని అకంపిత మనఁబడును.
వినియోగము:

పురఃప్రస్థితనిర్దేశే ప్రశ్న సంజ్ఞోపదేశయోః,
ఆవాహనే స్వమనసికథనే తత్ప్రయుజ్యతే. 86.

తా. ముందుపోవుదాని జూపుట, అడిగెడిజాడ చూపుట, ఉపదేశించుట, ఆవాహనము చేయుట, తనమనస్సునందు చెప్పుకొనుట వీనియందు ఈ శిరస్సు ఉపయోగింపఁబడును.

7. ఉద్వాహితము:—

సకృదూర్ధ్వం శిరోనీత ముద్వాహితశిరోమతమ్,

తా. కొంచెము మీఁది కెత్తఁబడిన శిరస్సు ఉద్వాహిత మనఁబడును.

వినియోగము:—

శక్తో౽హమస్మి కార్యేష్విత్యభిమానే ప్రయుజ్యతే.

87

తా. అన్నిటికిని నేను చాలుదు నను గర్వమున నీ శిరస్సు వినియోగింపఁబడును.

8. పరివాహితము:—

పరం మండలికాకారం భౌమితం పరివాహితమ్,

తా. చక్రాకారముగ మిక్కిలి త్రిప్పఁబడు శిరస్సు పరివాహిత మనఁబడును.

వినియోగము:—

లజ్జాభావేభ్రమేమౌనే వల్లభానుకృతౌ తథా.

88


విస్మయేచ స్మి తేహర్షే రోమాంచే౽పి ప్రమోదనే,
విచారేచ విచారణైః కార్యమాహురిదం శిరః.

89

తా. సిగ్గులేమి, భ్రమము, మానము, ప్రియుని అనుకరించుట, ఆశ్చర్యము, చిరునవ్వు, సంతోషము, పులకాంకురము, సంతోషింపఁ జేయుట, విచారము వీనియందు ఈ శిరస్సు వినియోగింపఁబడును.

9. అంచితము:—

శిరస్స్యాదంచితం కించిత్పార్శ్వయోర్నతకంధరమ్,

తా. ఇరుప్రక్కలకును ఇంచుక వంపఁబడినమెడ గలశిరస్సు అంచిత మనఁబడును.

వినియోగము:—

దుశ్చింతా మోహమూర్ఛాదౌ తత్కార్యమధరేక్షణే.

90

తా. దురాలోచనము, మోహము, మూర్ఛ మొదలైనవి, క్రింద నుండు వస్తువులను చూచుట వీనియందు ఈ శిరస్సు ఉపయోగింపఁబడును.

10. నిహంచితము:—

ఉత్క్షిప్తబాహుశిఖర లగ్నగ్రీవం నిహంచితమ్,

తా. పొడువుగ నెత్తఁబడిన మూఁపుతో మెడను జేర్చిన శిరస్సు నిహంచిత మనఁబడును.

వినియోగము:—

విలాసే లలితే గర్వే బిబ్బోకే కిలికించితే.

91


మోట్టాయితే కుట్టమితే మౌనే స్తంభేచ తద్భవేత్,

తా. విలాసము, లలితము, గర్వము, బిబ్బోకము, కిలికించితము, మోట్టాయితము, కుట్టమితము, మౌనము, స్తంభము ఆను వీనియందు ఈ శిరస్సు వినియోగింపఁబడును. (ఇందలి విలాసము మొదలగువాని అర్థము భరతరసప్రకరణమునందు వివరింపఁబడియున్నది.)

11. పరావృత్తము:—

పరాఙ్ముఖీకృతం శీర్షం పరావృత్తం శిరోభవేత్.

92

తా. పెడమొగముగలదిగాఁ ద్రిప్పఁబడిన శిరస్సు పరావృత్త మనఁబడును.

వినియోగము:—

తత్కార్యం కోపలజ్జాది కృతే వక్త్రప్రసారణే,

పరావృత్తానుకరణే పృష్ఠతః ప్రేక్షణే భవేత్.

93

తా. కోపము, లజ్జ మొదలగుదానిచే ముఖమును చాఁచుట, ఒకతట్టు తిరిగినదాని ననుకరించుట, వెనుకతట్టు చూచుట వీనియందు ఈశిరస్సు వినియోగింపఁబడును.

12. ఉత్క్షిప్తము:—

ఊర్ధ్వవక్త్రం శిరోజ్ఞేయ ముత్క్షిప్తం తత్ప్రచక్షతే,

తా. మీఁది కెత్తఁబడిన మొగముగల శిరస్సు ఉత్తిక్షిప్త మనఁబడును.

వినియోగము:—

దర్శనే తుంగవస్తూనాం చంద్రాదివ్యోమగామినామ్.

94

తా. ఎత్తైన పదార్థములను జూచుట, చంద్రుఁడు మొదలైన ఆకాశసంచారులను జూచుట వీనియందు ఈ శిరస్సు వినియోగింపఁబడును.

13. అధోముఖము:—

అధోముఖం శిరోయత్ర తత్ర ప్రాహురధోముఖమ్,

తా.క్రిందుమొగముగా వంచఁబడిన శిరస్సు అధోముఖ మనఁబడును.

లజ్జా ఖేద ప్రణామేషు స్యాదన్వర్థమధోముఖమ్.

తా. సిగ్గు, దుఃఖము, మ్రొక్కుట వీనియందు ఈశిరస్సు వినియోగించును.

14. లోలితము:—

శిరస్స్యాల్లోలితం గర్వాధిక్యాచ్ఛిథిలలోచనమ్.

95
తా. గర్వాధిక్యము చేత తేలవేయఁబడిన కన్నులు గలశిరస్సు లోలిత మనఁబడును.

వినియోగము:—

నిద్రాగమగ్రహావేశ మదమూర్ఛాసు తన్మతమ్,

తా. నిదురవచ్చుట, దయ్యము సోఁకుట, మదము, మూర్ఛ వీనియందు ఈశిరస్సు చెల్లును.

15. తిర్యఙ్నతోన్నతము:—

తిర్యఙ్నతోన్నతిం ప్రాప్తం శిరస్తిర్యఙ్నతోన్నతమ్.

96

తా. అడ్డముగవంచి యెత్తఁబడిన శిరస్సు తిర్యఙ్నతోన్నత మనఁబడును.

వినియోగము:—

బిబ్బోకాదిషు కాంతానాం తత్ప్రయోజ్యం ప్రచక్షతే,

తా. స్త్రీలయొక్క బిబ్బోకము మొదలగు విలాసచేష్టలయందు ఈ శిరస్సు వినియోగింపఁబడును.

16. స్కంధానతము:—

స్కంధానతం తదాఖ్యాతం స్కంధేయన్నిహితం శిరః.

97

తా. మూఁపుమీఁదికి వంపఁబడిన శిరస్సు స్కంధానతమనఁబడును.

వినియోగము:—

తన్నిద్రామదమూర్ఛాసు చింతాయాం చ ప్రయుజ్య తే,

తా. ఆశిరస్సు నిద్ర, మదము, మూర్ఛ, చింత వీనియం దుపయోగింపఁబడును.

౧౭. ఆరాత్రికము:—

స్కంధే తు కించిదాశ్లిష్య భ్రాంతమారాత్రికం మతమ్.

98
తా. మూఁపులయందు కొంచెము తాఁకించి త్రిప్పఁబడుశిరస్సు ఆరాత్రిక మనఁబడును.

వినియోగము:-

విస్మయే దృశ్యతే తచ్చ పరాభిప్రాయవేదనే,

తా. ఆశ్చర్యము, ఇతరులయభిప్రాయము నెఱుఁగుట వీనియందు ఈశిరస్సునకు వినియోగము.

18. సమశిరము:—

స్వాభావికం సమం శీర్షం స్వభావాభినయాదిషు.

99

తా. ఉన్నది యున్నట్టుండు శిరస్సు సమము. ఇది స్వభావాభినయము మొదలైనవానియందు వినియోగించును.

19. పార్శ్వాభిముఖము:—

పార్శ్వాభిముఖమన్వర్థం పార్శ్వస్థ స్యా౽వలోకనే,

తా. ప్రక్కకుఁ ద్రిప్పఁబడు శిరస్సు పార్శ్వాభిముఖ మనఁబడును. అది ప్రక్కనుండువారిని జూచుటయందు ఉపయోగించును.

20. సౌమ్యము:—

నిశ్చలం సౌమ్యమాఖ్యాతం నృత్తారంభే ప్రయుజ్య తే.

100

తా. చలనము లేక ఉండు శిరస్సు సౌమ్య మనఁబడును. అది నాట్యారంభమం దుపయోగింపఁబడును.

21. ఆలోలితము:—

సమంతాల్లాలితం యత్తదాలోలిత మితీరితమ్,

తా. అంతటను ద్రిప్పఁబడు శిరస్సు ఆలిత మనఁబడును.

వినియోగము:—

పుష్పాంజలిక్రమే చారినటనే లవణే తథా.

101


ఆలోలితస్య శిరసో వినియోగో౽భిధీయతే,

తా. పుష్పాంజలిక్రమము, చారినాట్యము, లావణ్యము వీనియందు ఈశిరస్సు వినియోగింపఁబడును.

22. తిరశ్చీనము:—

పార్శ్వద్వయాదూర్ధ్వభాగే చలనాత్తిర్యగీరితమ్.

102

తా. ఇరుప్రక్కలందును మీఁదితట్టు చలించు శిరస్సు తిరశ్చీన మనఁబడును.

వినియోగము:—

లజ్జానిరూపణే నృత్తే ముఖ చారీయనామని,
తత్తదౌచిత్యకాలేషు తిరశ్చీనముదీరితమ్.

103

తా. సిగ్గును కనపరచుట, ముఖచారి అనునృత్తము వీనియందును, ఇంక నిట్టి తగిన సమయములందును ఈ శిరస్సు చెల్లును.

23. ప్రకంపితము:—

పునఃపునః ప్రచలనాత్పురోభాగే చ పార్శ్వయోః,
ప్రకంపితశిరః ప్రోక్తం నాట్యశాస్త్రేషు సమ్మతమ్.

104

తా. ముందరికిని ఇరుప్రక్కలకును మాటిమాటికి చలించు శిరస్సు ప్రకంపిత మనఁబడును.

వినియోగము:—

అద్భుతాఖ్యరసే గీతే ప్రబంధే భ్రమరే తథా,
ప్రత్యర్థియుద్ధభావే౽పి ప్రకంపితశిరో భవేత్.

105

తా. అద్భుతరసము, పాట, ప్రబంధము, తుమ్మెద, శత్రుయుద్ధభావము వీనియందు ఈ శిరస్సు చెల్లును.

24. సౌందర్యము:—

ఊర్ధ్వాధోముఖవిన్యాసా త్పశ్చాద్భాగేనచాలనాత్,

సౌందర్యాఖ్యశిరః ప్రోక్తం సర్వనాట్యే ప్రశస్యతే.

106

తా. క్రిందుమీఁదులకు త్రిప్పుటవలన వెనుకతట్టు చలించుట గలది సౌందర్య శిరస్సు. ఆది యెల్ల నాట్యములందు ప్రశంస చేయఁబడుచున్నది.

వినియోగము:—

కారణాభినయే హస్తభ్రమణాఖ్యేచ నర్తనే,
సౌందర్యాఖ్యశిరః ప్రోక్తం యోగాభ్యాసేషు యుజ్యతే.

107

తా. కారణాభినయము, హస్తభ్రమణము అను నృత్తము, యోగాభ్యాసము వీనియందు ఈ శిరస్సు చెల్లును.

అథా౽ష్టదృష్టిభేదా లక్ష్యన్తే

సమమాలోకితం సాచీ ప్రలోకితనిమీలితే,
ఉల్లోకితానువృత్తే చ తథాచైవా౽వలోకితమ్.

108


ఇత్యష్టదృష్టిభేదాస్తు కీర్తితా భరతాగమే,

తా. సమము, ఆలోకితము, సాచి, ప్రలోకితము, నిమీలితము, ఉల్లోకితము, అనువృత్తము, అవలోకితము, అని దృష్టి యెనిమిదివిధములు గలదిగా భరతశాస్త్రమునందుఁ జెప్పఁబడినది.

1. సమము:—

వీక్షితం సురనారీభిస్సమానం సమవీక్షణమ్.

109

తా. దేవతాస్త్రీలవ లే రెప్పపాటులేక చూచుట సమదృష్టి యనఁబడును.

వినియోగము:—

నాట్యారమ్భే తులాయాఞ్చ అన్యచిన్తావినిశ్చయే,
ఆశ్చర్యే దేవతారూపే సమదృష్టి రుదాహృతా.

110

తా. నాట్యారంభము, త్రాసు, ఇతరచింతను నిశ్చయించుట, ఆశ్చర్యము, దేవతారూపము వీనియందు ఈ దృష్టి యుపయోగింపఁబడును.

2. ఆలోకితము:—

ఆలోకితం భవేదాశు భ్రమణం స్ఫుటవీక్షణమ్,

తా. వడితోడి తిరుగుడుగల స్పష్టమైనచూపు ఆలోకితమనఁబడును.

వినియోగము:—

కులాలచక్రభ్రమణే సర్వవస్తుప్రదర్శనే.

111


ఇచ్ఛాయాంచ ప్రయోక్తవ్య మాలోకితనిరీక్షణమ్,

తా. కుమ్మరిసారె తిరుగుట, అన్ని వస్తువులను జూచుట, ఇచ్ఛ వీనియందు ఈ దృష్టి వినియోగింపఁబడును.

3. సాచి:—

స్వస్థానే తిర్యగాకార మపాఙ్గచలనక్రమాత్.

112


సాచీదృష్టిరితిజ్ఞేయా నాట్యశాస్త్రార్థకోవిదైః,

తా. స్వస్థానమందుండి కడకంటివరకు అడ్డముగా చలించునది సాచీదృష్టి యనఁబడును.

వినియోగము:—

ఇఙ్గితేశ్మశ్రుసంస్పర్శే శరలక్షే౽౦శుకే స్మృతౌ.

113


సూచనాయాంచ కులటా నాట్యే సాచీనిరీక్షణమ్,

తా. అభిప్రాయము, మీసము దువ్వుట, గురి, వస్త్రము, తలఁపు, సయిగ, కులటానాట్యము వీనియందు ఈ దృష్టి వినియోగింపఁబడును.

4. ప్రలోకితము:—

ప్రలోకితం పరిజ్ఞేయం చలనా త్పార్శ్వభాగయోః.

114

తా. ఇరు ప్రక్కలయందును చలించునట్టి దృష్టి ప్రలోకితమనఁబడును.

వినియోగము:-

ఉభయోః పార్శ్వయోర్వస్తుదర్శనే సూచనే తథా,
చలనే బుద్ధిజాడ్యే చ ప్రలోకితనిరీక్షణమ్.

115

తా. ఇరుప్రక్కల నుండువస్తువులను జూచుట, సయిగ చేయుట, కదలుట, కలవరము వీనియందు ఈ దృష్టి యుపయోగింపఁబడును.

5. నిమీలితము:—

దృష్టేరర్ధవికాసే నిమీలితా దృష్టిరీరితా,

తా. సగము కన్ను దెరచి చూచెడి చూపు నిమీలిత మనఁబడును.

వినియోగము:—

ఋషి వేషే పారవశ్యే జపే ధ్యానే నమస్కృతౌ.

116


ఉన్మాదే సూక్ష్మదృష్టౌనిమీలితా దృష్టిరీరితా,

తా. ఋషివేషము, పరవశత్వము, జపము, ధ్యానము, నమస్కారము, చిత్తచలనము, సూక్ష్మదృష్టి వీనియందు ఈ దృష్టి ఉపయోగింపఁబడును.

6. ఉల్లోకితము:—

ఉల్లోకితమితి జ్ఞేయ మూర్ధ్వభాగోన్నతానతమ్.

117

తా. మీఁదికి నిక్కించి వంపఁబడినదృష్టి ఉల్లోకిత మనఁబడును.

వినియోగము:—

ధ్వజాగ్రే గోపురే దేవమణ్డపే పూర్వజన్మని,
ఔన్నత్యే చన్ద్రికాదౌ చ ఉల్లోకితనిరీక్షణమ్.

118

తా. ధ్వజముకొన, గోపురము, దేవమండపము, పూర్వజన్మము, పొడుగు వెన్నెల మొదలగువానియందు ఈ దృష్టి వినియోగింపఁబడును.

7. అనువృత్తము:—

ఊర్ధ్వాధో వీక్షణం వేగా దనువృత్తనిరీక్షణమ్,

తా. వడిగ క్రిందుమీఁదుగాఁ జూచునట్టిచూపు అనువృత్త మనఁబడును.

వినియోగము:—

కోపదృష్టౌ ప్రియామన్త్రే౽ప్యనువృత్తనిరీక్షణమ్.

119

తా. కోపముతోఁ జూచుట, ప్రీతితోఁ బిలుచుట వీనియందు ఈదృష్టి వినియోగించును.

8. అవలోకితము:—

అధస్తాద్దర్శనం యత్త దవలోకితముచ్యతే,

తా. క్రిందుచూచెడిచూపు అవలోకిత మనఁబడును.

వినియోగము:—

ఛాయాలోకే విచారేచ శయ్యాయాం పఠనక్రమే.

120


స్వాఙ్ఞావలోకనే యానే౽ప్యవలోకితముచ్యతే,

తా. నీడను చూచుట, విచారము, శయనము, చదువుట, తన యవయవములను జూచుకొనుట, నడక వీనియందు ఈ దృష్టి వినియోగింపఁబడును.

గ్రన్థాన్తరస్థదృష్టిభేదాః

సమాప్రలోకితా స్నిగ్ధా శృంగారో ల్లోకితా౽ద్భుతా.

121


కరుణా విస్మయాదృప్తా విషణ్ణా చ భయానకా,
సాచీద్రుతా వీరరౌద్రే దూరేంగితవిలోకితాః.

122

వితర్కితా శంకితా చ అభితప్తావలోకితా,
శూన్యాహృష్టోగ్రవిభ్రాన్తాః శాన్తామీలితసూచనే.

123


లజ్జితామలినాత్రస్తామ్లానా ముకుళకుఞ్చితే,
ఆకాశాచార్ధముకుళా అనువృత్తాచ విప్లుతా.

124


జిహ్మవికోశామదిరా హృద్యాలలితసంజ్ఞికా,
చతుశ్చత్వారింశదితి దృష్టిభేదాః ప్రకీర్తితాః.

125

తా. సమ, ప్రలోకిత, శృంగార, స్నిగ్ధ, ఉల్లోకిత, అద్భుత, కరుణ, విస్మయ, దృప్త, విషణ్ణ, భయానక, సాచి, ద్రుత, వీర, రౌద్ర, దూర, ఇంగిత, విలోకిత, వితర్కిత, శంకిత, అభితు, అవలోకిత, శూన్య, హృష్ట, ఉగ్ర, విభ్రాంత, శాంత, మీలిత, సూచన, లజ్జిత, మలిన, త్రప్త, మ్లాన, ముకుళ, కుంచిత, ఆకాశ, అర్ధముకుళ, అనువృత్త, విప్లుత, జిహ్మ, వికోశ, మదిర, హృద్య, లలిత ఆని దృష్టిభేదములు నలువదినాలుగును.

1. అందు సమము:—

వీక్షితం సురనారీణామివదృష్టిస్సమాభవేత్,

తా. దేవతాస్త్రీవలె రెప్పపాటులేనిది సమదృష్టి యనఁబడును.

వినియోగము:—

సమాధిషు ప్రయోక్తవ్య మితి నాట్యవిదో విదుః.

126

తా. సమాధులయందు ఈదృష్టి వినియోగింపఁబడునని నాట్యశాస్త్రజ్ఞులు చెప్పుదురు.

2. ప్రలోకితము:—

ప్రలోకితా పరిజ్ఞేయా దర్శనం పార్శ్వభాగయోః,

తా. ఇరుప్రక్కలను జూచెడి చూపు ప్రలోకిత యనఁబడును.

వినియోగము:—

ఉభయోః పార్శ్వయోరస్తు దర్శనాదిషు యుజ్యతే.

127

తా. ఇరుప్రక్కలనుండు వస్తువులు జూచుట మొదలైన వానియందు ఈదృష్టి వినియోగించును.

3. స్నిగ్ధ:—

సహర్షాసాభిలాషాచ మనోజ్ఞా౽న్తః ప్రకాశినీ,
స్మరోద్రేకాభవేత్స్నిగ్ధా స్నిగ్ధాదిషు నియుజ్యతే.

128

తా. సంతోషముతోడను, అభిలాషముతోడను గూడునదియు, మనోజ్ఞత గలదియు, అంతర్వికాసము గలదియు, మన్మథోద్రేకము గలదియు నైన దృష్టి స్నిగ్ధ యనఁబడును. ఇది స్నేహముగల వస్తువు మొద లైన వానియందు వినియోగించును.

4. శృంగారము:—

హర్షిత్పన్నప్రమోదోత్థా కామం కామవశంవదా,
శృంగారదృష్టిః కాన్తానాం భ్రూక్షేపాపాఙ్గసమ్భవా.

129


భవేన్మనోభవావిష్ట కామినీ వీక్షణాదిషు,

తా. సంతోషమువలనఁ బుట్టిన సుఖవిశేషమునందుఁ గలిగినదియు, మిక్కిలి మన్మథాధీనమయినదియు, మనోజ్ఞురాండ్ర కనుబొమ్మలు నిక్కించుటవలనను, కడగంటిచూపువలనను గలిగినదియునైన చూపు శృంగారదృష్టి యనఁబడును. ఈదృష్టి మన్మథావేశముగల స్త్రీల వీక్షణము మొదలగువానియందు చెల్లును.

5. ఉల్లోకితము:—

ఉల్లోకితా పరిజ్ఞేయా ఊర్ధ్వభాగావలోకనమ్.

130
తా. మీఁదిభాగము జూచునట్టిది ఉల్లోకితదృష్టి యనఁబడును.

వినియోగము:—

దర్శనే తుంగవస్తూనాం పూర్వజన్మనియుజ్యతే,

తా. ఎత్తైనపదార్థములను జూచుటయందును, పూర్వజన్మమును తలఁచుటయందును ఈదృష్టి చెల్లును.

6. ఆద్భుతము:—

కిఞ్చిత్కుంచితపక్ష్మాన్తా విస్మయోత్క్షిప్తభ్రూలతా.

131


సవికాససమాదృష్టి రద్భుతేతిప్రకీర్త్యతే,

తా. కొంచెము వంచఁబడిన రెప్పకొనలును, ఆశ్చర్యముచేత నెత్తఁబడిన కనుబొమ్మలును గలిగి వికాసముతోఁ గూడియున్న సమదృష్టి అద్భుతదృష్టి యనఁబడును.

వినియోగము:—

ఏషాతు భావశాస్త్రజ్ఞైరద్భుతాదిషు కీర్తితా.

132

తా. ఈదృష్టి ఆశ్చర్యము మొదలైనవానియందు వినియోగించును.

7. కరుణ:—

విస్రస్తార్ధ వికాసాస్యాదశ్రుమన్ధరతారకా,
నాసావలోకినీ దృష్టిః కరుణా కరుణే రసే.

133

తా. దిగువకు వ్యాపించినదియు, సగము తెరవఁబడినదియు, కన్నీళ్లచే మెల్లగా తిరుగుచున్న నల్లగ్రుడ్ లుగలదియు, ముక్కుకొనయందు నిలువఁబడినదియు నైన చూపు కరుణాదృష్టి యనఁబడును. ఈదృష్టి కరుణారసమునందు వినియోగపడును.

8. విస్మయము:—

ఉద్ధతా రచనా౽౽త్యర్థం సమా వికసితా తథా,
విస్పష్టపుటయుగ్మాచ విస్మయా విస్మయాదిషు.

134

తా. మిక్కిలి నిక్కును చూపునదియు, సమమయినదియు, వికాసము గలదియు, చక్కగా తెరవఁబడిన రెప్పలు గలదియునైన చూపు విస్మయదృష్టి యనఁబడును. ఈదృష్టి ఆశ్చర్యము మొదలైనవానియందు చెల్లును.

9. దృప్తము:—

స్థిరావికాససహితా నిశ్చలీకృత తారకా,
స్వసన్నివేశినీదృప్తా దృష్టిరుత్సాహగోచరా.

135

తా. నిలుకడగలదియు, వికాసముతోఁ గూడినదియు, చలింపనినల్లగ్రుడ్లు గలదియు, స్వస్థానగతమయినదియు నైన దృష్టి దృప్త యనఁబడును. ఇది ఉత్సాహమందు చెల్లును.

10. విషణ్ణము:—

విస్తారితపుటద్వన్ద్వా విస్రస్తాన్త నిమేషణా,
స్తబ్ధతారామనాగ్దృష్టి ర్విషణ్ణేతి నిగద్య తే.

136

తా. విరిసిన రెప్పలును, తొలఁగిన రెప్పపాట్లును, చలింపని నల్లగ్రుడ్లునుగలది విషణ్ణదృష్టి యనఁబడును.

వినియోగము:—

విషాదే చైవ చింతాయాం దృష్టి రేషా ప్రకీర్తితా,

తా. భేదమునందును, చింతయందును ఈదృష్టి వినియోగించును.

11. భయానకము:—

సభోద్వృత్త్వాపుటా౽త్యర్థం చఞ్చలాఫుల్లతారకా.

137


భయానకా భవేద్దృష్టిః భృశంభీతే భయానకే,

తా. చలింపనిమీఁదికి ఎత్తఁబడిన రెప్పలతో, మిక్కిలి చలించుచు, వికాసము నొందియున్న నల్లగ్రుడ్లుగలచూపు భయానకదృష్టి యనఁబడును. ఇది మిక్కిలి భయపడుటయందును, భయానకరసమునందును వినియోగపడును.

12. సాచి:—

సాచీదృష్టిరితిజ్ఞేయా అపాఙ్గచలనక్రమాత్.

138


ఇఙ్గితాదిష్వియంప్రోక్తా భరతాగమవేదిభిః,

తా. కడకంటి చలించునది సాచీదృష్టి యనఁబడును. ఈదృష్టి ఇంగితము మొదలైనవానియందు వినియోగించును.

13. ద్రుతము:—

తారాద్వయస్య చలనాద్ద్రుతదృష్టిరుదాహృతా.

139

తా. రెండునల్లగ్రుడ్లయొక్క చలనముగలది ద్రుతదృష్టి యనఁబడును.

వినియోగము:—

ఏతస్యా వినియోగస్తు సమమాదిషు కీర్తితా,

తా. ఈదృష్టి సంభ్రమము మొదలైనవానియందు వినియోగింపఁబడును.

14. వీరము:—

దీప్తా వికసితాఫుల్లా మధ్యా గామ్భిర్యశాలినీ.

140


వీరా వీరరసే యోజ్యా అక్షుబ్ధా సమతారకా,

తా. వెలుఁగునదియు, తేటయయినదియు, విరిసినదియు, ఉగ్రమును శాంతమునుగాక మధ్యస్థమై యుండునదియు, లోపల నణఁగిన యభిప్రాయము గలదియు, కలక లేనిదియు, సమములయిన నల్లగ్రుడ్లు గలదియు నైనచూపు వీరదృష్టి యనఁబడును. ఈదృష్టి వీరరసమునందు ఉపయోగించును.

15. రౌద్రము:—

అస్నిగ్ధా లోహితాక్రూరా నిస్తబ్ధపుటతారకా.

141


భ్రుకుటీకుటిలోద్వృత్తా రౌద్రారౌద్రే దృగుచ్యతే,

తా. ప్రీతి లేనిదియు, ఎఱ్ఱనయినదియు, క్రూరమయినదియు, చలించని రెప్పలు నల్లగ్రుడ్లు గలిగినదియు, వంకరైన కనుబొమలు గలిగినదియు, మీఁదికి తెరవఁబడినదియు నైన చూపు రౌద్రదృష్టి యనఁబడును. ఈదృష్టి రౌద్రరసమునందు వినియోగించును.

16. దూరము:—

కిఞ్చిదూర్ధ్వ వికాసేన దూరదృష్టిరుదాహృతా.

142

తా. కొంచెము మీఁది కెత్తఁబడిన చూపు దూరదృష్టి యనఁబడును.

వినియోగము:—

దూరావలోకనే ప్రోక్తా భావశాస్త్రవిచక్షణైః,

తా. దూరముననుండు వస్తువులను జూచుటయందు ఈదృష్టి వినియోగపడును.

17. ఇంగితము :—

సహర్షేఙ్గితదృష్టిస్స్యాత్కటాక్ష చలనక్రమాత్.

143


ఇంగితాదిష్వియంభావ నేతృభిస్సముదాహృతా,

తా. కటాక్షచలనము గలిగి సంతోషముతోఁ గూడిన చూపు ఇంగితదృష్టి అనఁబడును. ఇది ఇంగితము మొదలైనవానియందు వినియోగింపఁబడును.

18. విలోకితము:—

వీక్షణం పృష్ఠభాగేయత్తద్విలోకిత ముచ్యతే.

144


ఇయందృష్టి ర్భవేత్పశ్చా ద్దేశవృత్త్యవలోకనే,

తా. వెనుకతట్టు చూచునట్టిచూపు విలోకితదృష్టి యనఁబడును. ఇది వెనుకతట్టు ఉండువానిని జూచుటయందు వినియోగపడును.

19. వితర్కిత:—

వికాసితోద్వృత్తపుటా తథైవోత్ఫుల్ల తారకా.

145


త్రాసితాసమతారాచ దృష్టిర్జ్ఞేయా వితర్కితా,

తా. తేటయై మీఁదికి తెరవఁబడిన రెప్పలు గలదియు, విరిసి భయముతోఁ గూడినవివలె సమములైన నల్లగ్రుడ్లుగలదియు నైన చూపు వితర్కితదృష్టి యనఁబడును.

వినియోగము:—

ఏషాతుభావశాస్త్రజ్ఞై రూహాదిషునియుజ్యతే.

146

తా. ఈదృష్టి ఊహించుట మొదలైన వానియందు వినియోగించును.

20. శఙ్కితము:—

కిఞ్చిచ్చలాస్థిరాకిఞ్చదున్నతా తిర్యగాయతా,
గూఢాచకితతారా చ శఙ్కితా దృష్టిరుచ్యతే.

147

తా. కొంచెము చలనము గలదియు, కొంచెము నిలుకడ గలదియు, నిక్కినదియు, అడ్డపువిరివి గలదియు, మరుగైనదియు, బెదరును తోపించెడి నల్ల గ్రుడ్లుగలదియు నైనచూపు శంకితదృష్టి యనఁబడును.

వినియోగము:—

శఙ్కాదిషు ప్రయోక్తవ్యా ప్రోక్తానాట్య విశారదైః,

తా. ఇది శంక మొదలయినవానియందు వినియోగింపఁబడును.

21. అభితప్తము:—

పుటప్రచలనం యత్రతారకే దర్శనాలసే.

148


అభితప్తా భవేద్దృష్టిర్నిర్వేద ప్రముఖే ష్వియమ్,

తా. రెప్పలకదలికయు, దర్శనాలసములగు నల్లగ్రుడ్లును గలచూపు అభితప్తదృష్టి యనఁబడును. ఇది విసుగు మొదలగు వానియందు వినియోగించును.

22. అవలోకితము:—

అధస్తాదర్శనం యత్తదవలోకిత ముచ్యతే.

149

తా. క్రిందుగ చూచెడిచూపు అవలోకితదృష్టి యనఁబడును.

వినియోగము:—

వినియోగో భవేదస్యా విచారపఠనాదిషు,

తా. ఈ దృష్టి విచారము, చదువుట మొదలైన విషయములందు వినియోగించును.

23. శూన్యము:—

సమతారా పుటాబాహ్యా నిష్కమ్పా శూన్యదర్శనా.

150


బాహ్యర్థాగ్రహణే చేయం శూన్యదృష్టిరుదాహృతా,

తా. సమములైన నల్లగ్రుడ్లును రెప్పలును గలదియు, బయలుపడినదియు, చలనము లేనిదియు, శూన్యమును చూచునదియు నైన చూపు శూన్యదృష్టియనఁబడును. ఇది బాహ్యార్థాగ్రహణమునందు వినియోగించును.

24. హృష్టము:—

చఞ్చలాదృశ్యతే యాతు రుచిరాచ నిమేషభాక్.

151


ఈషత్సఙ్కో చితాదృష్టిర్హృష్టాహాసే ప్రయుజ్యతే,

తా. చలించునదియు, మనోహరమయినదియు, రెప్పపాట్లు గలదియు, కొంచెము సంకోచింపఁబడినదియు నైన చూపు హృష్టదృష్టి యనఁబడును. ఈదృష్టి నవ్వునందు వినియోగపడును.

25. ఉగ్రము:—

సమ్యగ్వికసితా కిఞ్చిదపాఙ్గ ద్వయశోణిమా.

152

ఉగ్రదృష్టి స్సమాఖ్యాతా ఉగ్రాదిషునియుజ్యతే,

తా. లెస్సగా వికసించినదియు, రెండుకనుగొనలందును ఎరుపుగలదియు నైనచూపు ఉగ్రదృష్టి యనఁబడును. ఇది ఉగ్రము మొదలైనవానియందు చెల్లును.

26. విభ్రాంతము :—

చలత్తారాచ విభ్రాంతా దృష్టిర్విస్రంభదర్శనా.

153


మధ్యేచ వికలోత్ఫుల్లా విభ్రాంతా సంభ్రమాదిషు,

తా. చలించుచున్న నల్లగ్రుడ్లు గలిగినదియు, భ్రమించునదియు, ప్రీతిని గనబరుచునదియు, నడుమనడుమ వెలవెలపాటును తేటదనమును గలిగినదియు నైనచూపు విభ్రాంతదృష్టి యనఁబడును. ఇది సంభ్రమము మొదలైనవానియందు వినియోగపడును.

27. శాంతము—:

క్రమమాణపుటా సన్నాకిఞ్చిచ్చఞ్చలలోచనా.

154


చలత్తారా కృతాపాఙ్గా దృష్టిశ్శాంతాశమాదిషు,

తా. మూఁతపడు రెప్పలు గలదియు, కొంచెము చలించునట్టి కన్నులు గలిగినదియు, చలించుచున్న నల్లగ్రుడ్లు గలిగినదియు నైనచూపు శాంతదృష్టి యనఁబడును. ఇది శమము మొదలైనవానియందు చెల్లును.

28. మీలితము:—

దృష్టేరర్ధ వికాసేన మీలితా దృష్టిరీరితా.

155

తా. సగము తెరవఁబడిన కన్నులు గలది మీలితదృష్టి యనఁబడును.

వినియోగము:—

పారవశ్యాదిభావేషు ప్రయోక్తవ్యానిమీలితా,

తా. పరవశత్వము మొదలైన భావములయందు ఈదృష్టి యుపయోగింపఁబడును.

29. సూచన:—

హస్తాభియోగచలనాత్కిఞ్చిన్ముకుళితాకృతిః.

156


సూచనాదృష్టిరాఖ్యాతా సూచనాదిషుయుజ్యతే,

తా. చేసైగ ననుసరించి కొంచెము మూయఁబడిన కన్నులుగలది సూచనాదృష్టి యనఁబడును. ఇది జాడ చూపుట మొదలైనవానియందు చెల్లును.

30. లజ్జిత:—

పతితోర్ధ్వ పుటావ్రీడా భరతఃచ్యుతతారకా.

157


కిఞ్చిత్కుఞ్చిత పక్ష్మాగ్రా లజ్జితా లజ్జితాదిషు,

తా. వాలిన మీఁదిరెప్పలును, సిగ్గువలన వాల్పఁబడిన నల్లగ్రుడ్లును, కొంచెము ముడిగిన రెప్పలకొనలును గలది లజ్జితదృష్టి యనఁబడును. ఈదృష్టి సిగ్గుపడుట మొదలైనవానియందు వినియోగించును.

31. మలినము:—

మలినాంతా చలత్పక్ష్మా కిఞ్చిన్ముకుళితాకృతిః.

158


అక్షిభ్యాం కృష్ణతారాదృఙ్మలినా దృశ్యతే స్త్రియామ్,

తా. సంకోచించిన కనుగొనలును, చంచలములైన రెప్పలును గలిగి కొంచెము ముడిగి కన్నులచే ఆకర్షింపఁబడిన నల్లగ్రుడ్లు గలది మలినదృష్టి యనఁబడును. ఇది స్త్రీయందు గనుపడును.

32. త్రస్తము:—

అంతర్వికసితా పూర్వం పశ్చాద్విరళతారకా.

159


త్రస్తాత్రాసేమదేదృష్టి స్సమోద్వృత్త పుటద్వయా,

తా. తొలుత వికాసముగలదై పిమ్మట చలించుచున్న నల్లగ్రుడ్లతో సరిగా మీఁది కెత్తఁబడిన రెప్పలుగలది త్రస్తదృష్టి యనఁబడును. ఇది భయమందును మదమునందును చెల్లును.

33. మ్లానము:—

శిథిలాచార్ధచలనాత్ క్రమాన్నిర్భుగ్నతారకా.

160


పక్ష్మాగ్రభ్రూపుటామ్లానాయోజ్యామ్లానాదికేష్వియమ్,

తా. సడలి, కొంచెపుకదలికతో క్రమముగా సోలుచున్న నల్లగ్రుడ్లు గలిగి రెప్పలకొనలనంటుచున్న కనుబొమ్మలు గలది మానదృష్టి యనఁబడును. ఇది వాడినవస్తువులు మొదలయిన వానియందు చెల్లును.

34. ముకుళము :—

స్ఫురదాసక్తపక్ష్మాగ్రా సౌమ్యామిళితతారకా.

161


మీలితోర్ధ్వపుటాదృష్టిరానందే ముకుళాభవేత్,

తా. కదలుచున్నట్టియు, ఆసక్తితోఁ గూడినవియు నయిన కొనరెప్పలును, తిన్నదనమును, కలసిన నల్లగ్రుడ్లును, మూయఁబడిన పైరెప్పలును గలది ముకుళదృష్టి యనఁబడును. ఇది యానందమునందు వినియోగించును.

35. కుఞ్చితము:—

కిఞ్చిత్కుఞ్చిత పక్ష్మాగ్రపుటా౽త్యర్థం నికుఞ్చితా.

162


తారాభ్యాం కుఞ్చితాదృష్టి రసూయానిష్టతాదిషు,

తా. కొంచెము వాల్పబడిన కొనరెప్పలును, మిక్కిలి లోఁగొనఁబడిన నల్లగ్రుడ్లును గలది కుంచితదృష్టి యనఁబడును. ఇది అనిష్టమునందును అసూయత మొదలైనవానియందును వినియోగపడును.

36. ఆకాశము:—

ఆకాశదృష్టిరాకాశే బహువ్యావృతతారకా.

163


ఏషాప్యా౽౽కాశ సఞ్చారివస్త్వాదిషు నియుజ్యతే,

తా. మిక్కిలి విరిసినగ్రుడ్లతో నాకాశమున నిగుడ్పఁబడిన దృష్టి యాకాశదృష్టి. ఆకాశమునందు సంచరించు వస్తువులు మొదలగు వానియం దిది చెల్లును.

37. అర్ధముకుళము:—

సస్మితాచ భవేత్తారా కిఞ్చిదున్ముషితాపుటా.

164


స్యాదర్ధముకుళా దృష్టిశ్చా౽౽నందాహ్లాదగోచరా,

తా. చిరునవ్వుతో విూఁదికి కూరుకొనఁబడుచున్న రెప్పలు గలది అర్ధముకుళదృష్టి యనఁబడును. ఇది ఆనందాహ్లాదముల గోచరమైయుండును.

38. అనువృత్తము:—

అనువృత్తా యదుక్తం తద్భూయో భూయోనిరీక్షణం.

165

తా. మాటిమాటికి చూచుట అనువృత్తదృష్టి యనఁబడును.

వినియోగము:—

త్వరాదిషు ప్రయోక్తవ్యా కలితాభావకోవిదైః,

తా. ఇది తత్తరపాటు మొదలగువానియందు వినియోగింపఁబడును.

39. విప్లుతము:—

స్ఫురితోత్ఫుల్ల పతితపుటాదృగ్విఫ్లుతాభవేత్.

166

తా. కదలింపఁబడి, విరిసి, వాల్పఁబడిన రెప్పలుగలది విప్లుతదృష్టి యనఁబడును.

వినియోగము:—

ఏషాతు సర్వవస్తూనాం సౌందర్యాద్యవలోకనే,

తా. ఈదృష్టి అన్నివస్తువులయొక్క సౌందర్యాదులను జూచుటయందు చెల్లును.

40. జిహ్మము:—

ఆకుఞ్చితపుటా గూఢతిర్యఙ్మంధరలోకినీ.

167


జిహ్మదృగ్గూఢతారాస్యాత్ గూఢార్థాదిషు యుజ్యతే,

తా. అంతటను వాల్పఁబడిన రెప్పలు నిగూఢములయిన గ్రుడ్లు గలిగి, పయికి తెలియక అడ్డముగాను మెల్లగాను చూచుట జిహ్మదృష్టి యనఁబడును. ఇది గూఢార్థములయందును అసూయ మొదలైన వానియందును చెల్లును.

41. విరోశము:—

ఆనిమేషాచలత్తారా వ్యాకోచితపుటద్వయా.

168


వికోశాఖ్యా భవేద్దృష్టిః హర్షాదిషు నియుజ్యతే,

తా. రెప్పపాటు లేనిదియు, చలించుచున్న నల్లగుడ్లు గలదియు, సంకుచితములైన రెప్పలుగలదియు నైన చూపు విఠోశదృష్టి యనఁబడును. ఇది సంతోషము మొదలైనవానియందు చెల్లును.

42. మదిర:—

అఞ్చితామార్గితామధ్యా క్షుబ్ధాక్షీ కుంచితాచలా.

169


మునినా కీర్తితాదృష్టిః మదిరాతరుణే మదే,

తా. ఒప్పిదమును దిక్కులు జూచుటయం కలతపాటును గలదియు, మధ్యస్థమయి క్రిందికి వాల్పఁబడినదియు, బెదరుగలదియు నైనచూపు మదిరాదృష్టి యనఁబడును. ఇది తరుణమదమునందు చెల్లును.

43. హృద్య:—

అవ్యవస్థితసమ్భ్రాంతామనాగ్లులితతారకా.

170


ఆకుంచితపుటా హృద్యా మధ్యమాదిషు యుజ్యతే,

తా. నిలుకడలేనిదై తడబాటు గలిగి కొంచెము చలింపఁజేయఁబడిన నల్లగ్రుడ్లును వంచఁబడిన రెప్పలును గలచూపు హృద్యదృష్టి యనఁబడును. ఇది మధ్యమములైన వస్తువులయందు చెల్లును.

44. లలితము:—

భ్రూక్షేపకుంచితాపాఙ్గా స్మి తేనా౽నంగసంభువా.

171


వికాసేనా౽న్వితాదృష్టిః లలితాలలితాదిషు,

తా. కనుబొమ్మలకదలికచే ముడుగఁజేయఁబడిన కడకన్నులు, మన్మథవికారమువలని చిరునవ్వును, తేటదనమును గలది లలితదృష్టి యనఁబడును. ఇది ఆనందకరములైన వస్తువులయందు చెల్లును.

అథ గ్రంథాన్తరస్థభ్రూభేదానిరూప్యంతే.

సహజా పతితోత్క్షిప్తా చతురా రేచితా తథా.

172


కుంచితేతి షడేవా౽త్ర భూచాతుర్యవతిక్రియాః,

తా. సహజ, పతిత, ఉల్లిప్త, చతుర, రేచిత, కుంచిత అని భ్రూభేదములు (కనుబొమలచతురత్వము గలక్రియలు) ఆరువిధములుగాఁ జెప్పఁబడుచున్నవి.

1. సహజము:—

సహజాస్యాత్స్వభావభ్రూఃవికారరహితా ముఖే.

173


సహజాదిషు యుజ్యేత ఇతి భావవిదో విదుః,

తా. ముఖమం దేవికారమును లేక స్వాభావికముగనుండెడి కనుబొమ్మ సహజభ్రువనఁబడును. ఇది స్వభావము మొదలైనవానియందు చెల్లును.

2. పతితము:—

అచంచలభ్రూయుగంచ పతనాత్పతితామతా.

174
తా. చలింపని కనుబొమ్మలను వాల్చిన పతితభ్రువగును.

వినియోగము:—

జుగుప్సాయాం విస్మయేచ అసూయామాం భవేదసౌ,

తా. ఇది రోఁతపడుటయందును, ఆశ్చర్యమందును, ఓర్వనితనమందును చెల్లును.

3. ఉత్క్షిప్తము:—

ఏకావాసా ద్వితీయావా యదుత్క్షిప్తతీతరామ్,

175


ఉత్క్షిప్తాసాభవేత్ స్త్రీణాం కోపే సత్యవచస్యసి,
శృఙ్గారభావే లీలాయాం భ్రూరేషా వినియుజ్యతే.

176

తా. కనుబొమ్మలు రెంటియందును ఒక్కటిగాని రెండుగాని మిక్కిలి నిక్కింపఁబడునేని అది ఉత్క్షిప్తభ్రు వనఁబడును. ఇది స్త్రీలకోపమునందును, సత్యవచనమునందును, శృంగారభావమందును, లీలయందును వినియోగింపఁబడును.

4. చతుర:—

ద్వితీయసహితా స్తోకా స్ఫురితామదమంథరా,
చతురా ముఖసంస్పర్శే హృదానందేచ సమ్భ్రమే.

177

తా. రెండుకనుబొమ్మలకూడికతో కొంచెము మెల్లగా చలింపఁజేయఁబడియెనేని చతురభ్రు వగును. ఇది ముఖము తాఁకుట, మనస్సంతోషము, వేగిరపాటు వీనియందు ఉపయోగింపఁబడును.

5. రేచితము:—

లావణ్యమధురాక్షిప్తా యద్వేకారేచితామతా,

తా. అందముగాను ఇంపుగాను ఒక కనుబొమ్మ వంపఁబడునేని అది రేచితభ్రు వనఁబడును.

వినియోగము:—

రహస్యశ్రవణేసాధు కలనే పదవీక్షణే.

178

తా. ఇది రహస్యమును వినుట, మంచిది అనుట, స్థానవీక్షణము వీనియందు చెల్లును.

6. కుంచితము:—

ఏకావాసా ద్వితీయావా కుంచితాంచితవా మతా,

తా. ఒక కనుబొమ్మయేని రెండు కనుబొమ్మలేని ముడిగింపఁబడినయెడ అది కుంచితభ్రు వనఁబడును.

వినియోగము:—

మోట్టాయితే కుట్టమితే విలాసే కిలికించితే.

179

తా. ఇది మోట్టాయితము, కుట్టమితము, విలాసము, కిలికించితము అను శృంగారచేష్టావిశేషములందు వినియోగింపఁబడును. మోట్టాయితము మొదలగు వానియర్ధము భరతరసప్రకరణమందు వివరింపఁబడియున్నది.

అథ చతుర్విధ గ్రీవాభేదానిరూప్యంతే.

సుందరీ చ తిరశ్పీనా తధైవ పరివర్తితా,
ప్రకమ్పితా చ భావజ్ఞైర్జ్ఞేయాగ్రీవా చతుర్విధా.

180

తా. సుందరి, తిరశ్చీన, పరివర్తిత, ప్రకంపిత అని గ్రీవా(మెడ)భేదములు నాలుగువిధములు.

1. సుందరి:—

తివ్యక్ప్రచలితా గ్రీవా సుందరీతి నిగద్యతే,

తా. అడ్డముగాఁ గదలింపఁబడినది సుందరీగ్రీవ యనఁబడును.

వినియోగము:—

స్నేహారమ్భే తథాయత్నే సమ్యగర్థే ౽పిచ స్మృతౌ.

181


సరసత్వేనుమోదేచ సా గ్రీవా సుందరీ మతా,

తా. స్నేహారంభము, యత్నము చేయుట, మంచిదనుట, తలఁచుట, సరసము, అనుమోదము వీనియందు ఈ గ్రీవ యుపయోగింపఁబడును.

2. తిరశ్చీనము:—

పార్శ్వద్వయోర్ధ్వభాగే తు చలనాత్సర్పయానవత్.

182


సాగ్రీవాతు తిరశ్చీనేత్యుచ్యతే నాట్యకోవిదైః,

తా. ఇరుప్రక్కల నూర్ధ్వభాగములయందు సర్పగతివలెఁ గదలిక గలది తిరశ్చీనగ్రీవ యనఁబడును.

వినియోగము:—

ఖడ్గభ్రమే సర్పగత్యాం తిరశ్చీనానిగద్యతే.

183

తా. కత్తిని ద్రిప్పుటయందును, పామునడకయందును ఈ గ్రీవ వినియోగించును.

3. పరివర్తితము:—

సవ్యాపసవ్యచలితా గ్రీవా యత్రా౽ర్ధచంద్రవత్,
సా తు నాట్యకలాభిజ్ఞైర్విజ్ఞేయా పరివర్తితా.

184

తా. వామదక్షిణములకు అర్ధచంద్రాకారముగా కదలింపఁబడునది పరివర్తితగ్రీవ యనఁబడును.

వినియోగము:—

శృంగారనటనే కాంతా కపోలపరిచుమ్బనే,
నాట్యతంత్ర కలాభిజ్ఞైర్విజ్ఞేయా పరివర్తితా.

185

తా. శృంగారనటనమునందును, స్త్రీల చెక్కిళ్లు ముద్దు పెట్టుకొనుటయందును ఈ గ్రీవ యుపయోగించును.

4. ప్రకమ్పితము:—

పురఃపశ్చాత్ప్ర్పచలనాత్కపోతీకణ్ఠకమవత్,
ప్రకమ్పితేతి సా గ్రీవా ప్రోక్తానాట్యవిశారదైః.

186

తా. పావురాయి మెడ కదలించునట్లు ముందు వెనుకలుకుఁ గదలింపఁబడునది ప్రకంపితగ్రీవ యనఁబడును.

వినియోగము:—

యుష్మదస్మదితిప్రోక్తే దేశీనాట్యవిశేషకే,
డోలాయాఙ్గణితేచా౽పిప్రయోక్తవ్యాప్రకమ్పితా.

187

తా. నీవు నేను అనుటయందును, దేశీనాట్యమునందును, ఉయ్యెలయందును, లెక్కపెట్టుటయందును, ఈ గ్రీవ యుపయోగింపఁబడును.

అథ ద్వాదశహస్తప్రాణలక్షణం నిరూప్యతే.

హస్తానాం ద్వాదశ ప్రాణాస్తేషాం లక్షణముచ్యతే,

తా. హస్తప్రాణములు పండ్రెండు, వానిలక్షణము చెప్పఁబడుచున్నది.

ప్రసారణం కుంచితఞ్చ రేచితం పుఙ్ఖితం తథా.

188


అపవేష్టితకంచా౽పి ప్రేరితోద్వేష్టితే తథా,
వ్యావృత్తః పరివృత్తశ్చ సఙ్కేతస్తదనంతరమ్.

189


చిహ్నం పదార్థ టీకేతి ప్రాణా ద్వాదశహస్తజాః,

తా. ప్రసారణము, కుంచితము, రేచితము, పుంఖితము, అపవేష్టిత శము, ప్రేరితము, ఉద్వేష్టితము, వ్యావృత్తము, పరివృత్తము, సంకేతము, చిహ్నము, పదార్థటీక అని హస్తజప్రాణములు పండ్రెండు.

1. ప్రసారణము:—

ప్రసారణమితిజ్ఞేయమఙ్గుళీనాం ప్రసారణాత్.

190

తా. వ్రేళ్లను జాఁచుట ప్రసారణ మనఁబడును.

2. కుంచితము:—

కుఞ్చనాదంగుళీనాంచ కుంచితం సముదీరితమ్,

తా. వ్రేళ్లను ముడుచుట కుంచిత మనఁబడును.

3. రేచితము:—

అంగుళీనాం ప్రచలనా ద్రేచితం పరికీర్తితమ్.

191

తా. వ్రేళ్ళను గదలించుట రేచిత మనఁబడును.

4. పుఙ్ఖితము:—

పురోభాగే కుంచితోవా రేచితో వా ప్రసారితః,
యోహ స్తస్తుపతాకాదిర్నామ్నా౽సౌ పుఙ్ఖితో భవేత్.

192

తా. పతాకాదిహస్తములందు వ్రేళ్లు ముందరికి వంచుట, కదలించుట, చాఁచుట అను నిట్టిది పుంఖిత మనఁబడును.

5. అపవేష్టితము:—

అధస్తాద్ధమనంయస్య హస్తోనామ్నా౽పవేష్టితః,

తా. వ్రేళ్లను క్రిందుగా చాఁచుట యనెడి హస్తప్రాణము అపవేష్టిత మనఁబడును.

6. ప్రేరితము:—

పశ్చాద్భాగేకుఞ్చితోవా రేచితోవా ప్రసారితః.

193


యోహస్తఃకథితస్సోయంప్రేరితః పూర్వసూరిభిః,

తా. వ్రేళ్లను వెనుకప్రక్కకు ముడిగించుట, కదలించుట, చాఁచుట యను హస్తప్రాణము ప్రేరిత మనఁబడును.

7. ఉద్వేష్టితము:—

హస్తానామూర్ధ్వభాగేయద్గమనంచా౽స్తినర్తనే.

194


తదుద్వేష్టితమిత్యాహు ర్భరతాగమవేదినః,

తా. నాట్యకర్మమునందు చేతులను మీఁది కెత్తుట యనెడి హస్తప్రాణము ఉద్వేష్టిత మనఁబడును.

8. వ్యావృత్తము;—

ఉదగ్రతఃపార్శ్వభాగే హస్తోవ్యావృత్తకోభవేత్.

195

తా. పార్శ్వభాగములందు మీఁది కెత్తఁబడిన చేతులుగల హస్తప్రాణము వ్యావృత్త మనఁబడును.

9. పరివృత్తము:—

పార్శ్వాభ్యాంచ పురోభాగే యోహస్తో నటనే కృతః,
పరివృత్తస్సమాఖ్యాతో నామ్నాహస్తవిశారదైః.

196

తా. నాట్యము చేయునపుడు పార్శ్వములనుండి ముందరితట్టునకు చేతులను తెచ్చుట అనుహస్తప్రాణము పరివృత్త మనఁబడును.

10. సజ్కేతము:—

ఊహావిధానరచనావినాస్థూలోక్తిపూర్వకమ్,
యోహస్తోనియమంప్రాప్తస్ససఙ్కేత ఉదాహృతః.

197
తా. స్థూలోక్తి పరంపరలేక ఊహచేత తెలిసికోఁదగిన సైగగల హస్తప్రాణము సంకేత మనఁబడును.

11. చిహ్నము:—

ప్రత్యక్షాణాం పరోక్షాణాం వస్తూనాంనాట్యకర్మణి,
స్థావరత్వం జఙ్గమత్వమీయుషామపితాదృశమ్.

198


తదాకారప్రకటనం తన్ముఖస్య నిరీక్షణమ్,
తత్స్థానదర్శనంచా౽పి తచ్చేష్టా తద్ధ్వజానాం చ దర్శనమ్.

199


తదాయుధప్రకటనం తద్దతార్థనివేదనమ్,
తద్వ్యాప్తదర్శనం చా౽పి తచ్చేష్టా దర్శనం తథా.

200


అష్టలక్షణమిత్యేతచ్చిహ్న మిత్యభిధీయతే,

తా. నాట్యకర్మమునందు ప్రత్యక్షపరోక్షవస్తువులయొక్క స్థావరజంగమత్వములను దెలుపు చిహ్నములు ఎనిమిది. అవి వానియాకారములను జూపుట, వానిముఖములను జూపుట, అవి యుండుతావులను జూపుట, వానిటెక్కెములను చూపుట, వాని యాయుధములను దెలుపుట, వానియందుఁగల ప్రయోజనములను దెలుపుట, వానిచే వ్యాపింపఁ జేయఁబడినవానిని దెలుపుట, వానిచేష్టలను దెలుపుట, ఈయెనిమిదిలక్షణములు గలహస్తప్రాణము చిహ్నము అనఁబడును.

12. పదార్థటీక:—

పదానాం కథితానాం స్యాదర్థనిర్వాహతా యది.

201


ఇయంపదార్థటీకేతి కథితా భరతాదిభిః,

తా. చెప్పఁబడుచుండెడు భావవ్యంజకములైన పదములయర్థములను నిశ్చయపరచునట్టి హస్తప్రాణము పదార్థటీక ఆనఁబడును.

అథ హస్తభేదానిరూప్యన్తే.

అథేదానీంతు హస్తానాం లక్షణాని యథాక్రమమ్.

202

అసంయుతాస్సంయుతాశ్చ ద్వేధాహస్తాః ప్రకీర్తితాః,

తా. ఇక హస్తములయొక్క లక్షణములు చెప్పఁబడును. హస్తములు అసంయుతములు సంయతములు నని రెండువిధములు గలవి.

అథా౽ష్టావింశతివిధా సంయుతహస్తా నిరూప్యన్తే.

పతాకస్త్రిపతాకో౽ర్ధపతాకః కర్తరీముఖః.

203


మయూరాఖ్యో౽ర్ధచన్ద్రశ్చా౽ప్యరాళశ్శుకతుణ్డకః,
ముష్టిశ్చశిఖరాఖ్యశ్చ కపిత్థః కటకాముఖః.

204


సూచీచంద్రకలాపద్మకోశం సర్పశిరస్తథా,
మృగశీర్ష స్సింహముఖో లాఙ్గూలస్సోలపద్మకః.

205


చతురో భ్రమరశ్చైవ హంసాస్యో౽హంసపక్షకః,
సందంశోముకుళశ్చైవ తామ్రచూడ స్త్రిశూలకః.

206


అష్టావింశతి హస్తానా మేవం నామాని వై క్రమాత్,

తా. పతాకము, త్రిపతాకము, అర్థపతాకము, కర్తరీముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, శుకతుండము, ముష్టి, శిఖరము, కపిత్థము, కటకాముఖము, సూచి, చంద్రకల, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, సోలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్యము, హంసపక్షము, సందంశము, ముకుళము, తామ్రచూడము, త్రిశూలము అను ఇరువదియెనిమిదియు ఆసంయుతహస్తము లనఁబడును.

1. పతాకహస్తలక్షణమ్

అఙ్గుళ్యః కుఞ్చతాఙ్గుష్ఠా
స్సంక్లిష్టాః ప్రసృతా యది.

207


సపతాకకరః ప్రోక్తో
నృత్యకర్మవిశార దైః,

తా. అన్ని వ్రేళ్లను చేర్చి చాఁచి బొటనవ్రేలిని వంచిపట్టునది పతాకహస్తమని నృత్యశాస్త్రవిశారదులు చెప్పుదురు.

వినియోగము—

నాట్యారమ్భే వారివా హే వనే వస్తునిషేధనే.

208


కుచస్థలే నిశాయాంచ నద్యామమరమణ్డలే,
తురగే ఖండనే వాయౌ శయనే గమనోదితే.

209


ప్రతాపేచ ప్రసాదేచ చంద్రికాయాం ఘనాతపే,
కవాటపాటనే సప్తవిభక్త్యర్థే తరఙ్గకే.

210


వీథీప్రవేశభావే౽పి సమత్వేచా౽ఙ్గరాగకే,
ఆత్మార్థే శపథేచా౽పి తూష్ణీం భావస్య దర్శనే.

211


ఆశీర్వాదక్రియాయాం చ నృపశ్రేష్ఠస్య భావనే,
తాళపత్రేచ పేటేచ ద్రవ్యాది స్పర్శనే తథా.

212


తత్రతత్రేతి వచనే సింధౌతు సుకృతిక్రమే,
సంబుద్ధాతు పురోగే౽పి ఖడ్గరూపస్యధారణే.

213


మానే సంవత్సరే వర్షే దినే సమ్మార్జనే తథా,
ఏవమర్థేషు యుజ్యన్తే పతాకా హస్తభావనాః.

214