అభినయ దర్పణము/అపాత్ర లక్షణమ్

  
ప్రగల్భా సరసా కున్తా కుశలా గ్రహమోక్షయోః. 26

చార తాళ లయాభిజ్ఞా మణ్డలస్థానపణ్డితా,
హస్తాంగస్థాననిపుణా కరణేషు విలాసినీ. 27

విశాలలోచనా గీతవాద్యతాళానువర్తినీ,
పరార్థభూషాసమ్పన్నా ప్రసన్నముఖపజ్కజా. 28

నాతిస్థూలానాతికృశా నాత్యుచ్చానాతివామనా,
ఏవంవిధగుణోపేతా నర్తకీ సముదాహృతా. 29

తా. నటించెడుపాత్రము రూపవతియు, యౌవనమధ్యస్థురాలును, బలిసి నిక్కిన పాలిండ్లుగలదియు, ప్రౌఢయు, రసికురాలును, మనోహరిణియు, పట్టువిడుపులందు సమర్ధురాలును, తాళలయగతులను దెలిసినదియు, మండల స్థాననృత్యమందు పండితురాలును, హస్తవిన్యాసాంగ విన్యాసములయందు నేర్పుగలదియు, కరణములయందు చాకచాక్యము గలదియు, విశాలములగు కన్నులుగలదియు, గీతవాద్యతాళముల ననుసరించి నడచునదియు, వెలగల సొమ్ములు ధరించినదియు, ప్రసన్నముఖము గలదియు, మిగుల లావైనదిగాని మిగుల పొడువైనదిగాని మిగుల చిక్కినదిగాని మిగుల పొట్టిదిగాని కానిదియునై యుండవలెను.

అపాత్ర లక్షణమ్‌.

 
పుష్పాక్షీ కేశహీనా చ పీనోష్ఠీ లమ్బకస్తనీ,
అతిస్థూలాప్యతికృశాప్యత్యుచ్చాప్యతివామానా. 30

కుబ్జా చ స్వరహీనా చ వేశ్యా నాట్యవివర్జితా,

తా. పూలుపడియున్న కన్నులు గలదియు, తలవెండ్రుకలు లేనిదియు, బలిసిన పెదవులు గలదియు, వ్రేలఁబడిన స్తనములు గలదియు, మిక్కిలి పొట్టిదియు, గూనుగలదియు, హీనస్వరము గలదియు నగు వేశ్య నాట్యమునకుఁ దగినది కాదు.

కిజ్కిణీ లక్షణమ్‌.

కిజ్కిణ్యః కాంస్యరచితాః తామ్రేణ రజతేన వా. 31

సుస్వరాశ్చ సురూపాశ్చ సూక్ష్మా నక్షత్ర దేవతాః,
బన్ధయే న్నీలసూత్రేణ గ్రంథిభిశ్చ సమన్వితమ్‌. 32

శతద్వయం శతం వాపి పాదయోర్నాట్యకర్మణి,
శతంవా దక్షిణే పాదే ద్విశతం వామపాదకే. 33

తా. గజ్జెలు కంచువిగానైనను, రాగివిగానైనను, వెండివిగానైనను ఉండవలయును. అవి మంచిస్వరము గలవిగాను, అందమయినవిగాను, చిన్నవిగాను ఉండవలెను. నక్షత్రాధిదేవతగల అట్టి గజ్జెలను నల్లదారమునఁ గ్రుచ్చి గజ్జెగజ్జెకు ముడివేయవలయును. నాట్యమాడెడి కాలములయందు పాత్రము కాళ్ళలో ఇన్నూరిన్నూరుగాని నూరునూరుగాని గజ్జెలుండవలయును. లేనిచో కుడికాలియందు నూరును, ఎడమకాలియం దిన్నూరునైన నుండవలయును.

నట లక్షణమ్‌.

రూపవాన్ మధురాభాషీ కృతీ వాగ్మీ పటుస్తథా,
కులాంగనాసుతశ్చైవ శాస్త్రజ్ఞఓ మధురస్వరః. 34

గీతవాద్యాదినృత్యజ్ఞఓ సిద్ధకః ప్రతిభానవాన్,
ఏతాదృశగుణైర్యుక్తో నట ఇత్యుచ్యతే బుధైః. 35

తా. చక్కనివాఁడును, ఇంపుగ మాటలాడువాఁడును, పండితుఁడును, మాటకారియు, సమర్ధుఁడును, కులాంగనా సుతుఁడును, భరతశాస్త్ర పరిజ్ఞానము గలవాఁడును, మంచిశారీరము గలవాఁడును, గానవాద్యనృత్యాదులలో పూర్ణజ్ఞానము గలవాఁడును, పట్టుగలిగినవాఁడును, కల్పనాశక్తి గలవాఁడునగు వాఁడు నటుఁడని పెద్దలు చెప్పుదురు.