వీరమతి

    స్త్రియస్తథా పాఠనీయా యథా తా: కార్యవస్తుని
    పుంవత్ ప్రవృత్తి మాధాయ సాధయేయు రనాకులా:,*

సంసారరూపమయిన రథమునకు స్త్రీపురుషులు రెండు చక్రములని యందరికిని దెలిసిన విషయమే. ఈ రెండు చక్రములు సమానముగా నుండినగాని, సంసారరథము తిన్నగా నడవదు. రెండుచక్రములలో నెంతెంత భేదముండునో, యంతంత కష్టముగా రథము నడచును. పురుషుడు జ్ఞానవంతుడును, స్త్రీ యజ్ఞానాంధకారమగ్నయు నైనయెడల గుటుంబములో గొంత మాత్రమైనను సౌఖ్యముండనేరదని మనలోని యనేకోదాహరణముల వలన స్పష్టమగుచున్నది. భార్యా భర్తృరూపమయిన రెండు గిర్రలు విద్యాబుద్ధులయందు సమానముగానుండిన పక్షమున సంసారశకటము బహు సులభముగా నడచు ననియు, నడుమ నెన్ని సంకటములు వచ్చినను ఆగక, చక్రద్వయ సహాయముచే సులభముగా గదలు ననియు, తుద కానందముగా నీప్సితస్థలమునకు రథము చేరుననియు జూపుటకు వీరమతి చరిత్ర మత్యంతోపయోగకరమైనది. కాన చదువరులు దీనిని విశేష శ్రద్ధతో జదువవలయును.

శాలివాహన శకాబ్దమందలి రెండవ శతాబ్దముననో, లేక మూడవ శతాబ్దముననో గుజరాతు దేశమున చావడా వంశస్థు


  • "పురుషులవలె ధైర్యము నవలంబించి, భీతిజెందక సర్వకార్యములను నిర్వహించునటుల స్త్రీలకు విద్య నేర్పవలయును." డగు బిరజుడనురాజు, టుకటోడా యను గ్రామమును రాజధానిగా నేర్పరచుకొని ప్రజాపాలనము జేయుచుండెను. ఇతని తండ్రి బ్రతికియున్నను, అతడతివృద్ధు డయినందువలన, బిరజుడే ప్రజాపరిపాలనము చేయుచుండెను. వృద్ధరాజుకు బిరజుడుగాక వేరుసంతానముండెను. వారందరిలో గడగొట్టు కూతురి పేరు వీరమతి. ఈమె యందరికంటె జిన్నదయినందున గడు గారాబముగా బెరుగుచుండెను. చిన్ననాటినుండియు రాజపుత్రులతో గలసి మెలసి యుండుటవలన నామె రాజపుత్రులు నేర్చుకొను విద్య లన్నియు నేర్చుకొనెను. కావ్య వ్యాకరణాదుల యందు నామె కృషి చేసినదో లేదో తెలియదుగాని, చక్కగవ్రాయుట, చదువుట, లెక్కలు మొదలైనవానిలో నామె ప్రవీణత సంపాదించినదని చరిత్రము వలన దెలియవచ్చుచున్నది. ఇదియును గాక అశ్వారోహణము, గజారోహణము, సాము చేయుట, గద ద్రిప్పుట, యుద్ధములో వింట నంబుపయోగించుట మొదలైన రాజపుత్రుల కత్యంతావశ్యకమైన ధనుర్విద్యలును ఆమె నేర్చుకొనెను! ఇట్లు యుక్తవయస్సు వచ్చు వరకు వీరమతి స్త్రీలకు స్వాభావికములగు సౌందర్య గాంభీర్య వినయాది సుగుణములను విడువకయే 'పుంవత్ర్పగల్భ్' యయ్యెను.

వీరమతి దినదినప్రవర్ధమానయై పదునారు సంవత్సరంబులది కాగానే, యామె వివాహ యోగ్యయైనదని తలచి అప్పుడు గల యత్యంత శ్లాఘనీయమయిన స్వయంవర పద్ధతి ననుసరించి యామె వివాహము చేయ నిశ్చయించి, ఆమె యన్నగారగు బిరజమహారాజు దేశ దేశములకు విప్రుల పంపి, అచ్చట చ్చటి రాజపుత్రుల లక్షణము లరసి వారి పటములను తెండని చెప్పెను. విప్రు లాప్రకారమే దేశదేశములకు వెళ్లి యనేక రాజపుత్రుల స్వరూపపటములను దెచ్చి వీరమతికిజూపి, యా యా రాజపుత్రుల స్వభావగుణములను నోటితో వర్ణనచేసిరి. వారిలో, ధారానగరములో రాజ్యము చేయుచున్న ఉదయాదిత్య మహారాజుగారి కుమారుడగు జగదేవు డను రాజపుత్రుని సద్గుణములను వినియు, నతని సుందరరూపమును జూచియు దానాతని దప్ప మరియొకరిని వరింపనని వీరమతి నిశ్చయించు కొనెను! ఈ సంగతి యామె యన్నగారికి దెలుపగా నతడు 'నాచెల్లెలగు వీరమతిని మీ కుమారుడగు జగదేవున కిచ్చెద' నని ఉదయాదిత్యునకు శుభ లేఖ పంపెను.

ఉదయాదిత్యుడు సూర్యవంశపురాజు, విక్రమాదిత్యుని వంశములోని 48 వ పురుషుడు. ఈయన మాలవదేశములోని ధారానగరమును తన రాజథానిగా జేసికొని యనేక సామంతులకు జక్రవర్తిగానుండెను. చావడావంశస్థు డగు బిరజ రాజతనికి సామంతుడుగానే యుండెను. ఉదయాదిత్యు డత్యంత శౌర్యవంతుడని ప్రఖ్యాతిని జెందినవాడు. ఇతని భార్యలిద్దరుండిరి. ఈ రాణీల నామములు తెలియకపోయినను పెద్ద భార్య వాఘేలీవంశములోని దనియును, రెండవభార్య సోళంక వంశములోని దనియును దెలియచున్నది. వాఘేలీ రాణికి రణధవలు డనియు, సోళంకీరాణికి జగదేవుడనియు బుత్రులు గలిగిరి.

వాఘేలీ, సోళంకీ రాణులు సవతులయినందున నొండొరు లొండొరులపయి నత్యంత మత్సరముతో బ్రవర్తించుచుండిరి. బహు పత్నీత్వదోష మీ దేశమునందు బహుకాలమునుండి, శిష్టాచారముగా నడుచుచున్నందున, ననేక కుటుంబముల గృహసౌఖ్యము నాశన మగుచున్నదని సకల జనులకు దెలిసినవిషయమే. ఒక స్త్రీని వివాహమాడి, యామె తన సహధర్మచారిణి యనియు, అర్ధాంగియనియు, 'నాతిచరామి' యని వివాహము నందు నామెకు వచన మిచ్చితిననియు మరచి, రెండవ భార్యను వివాహమాడి, మొదటి భార్యయందలి ప్రేమను విభజించుట గొప్ప అన్యాయమని చెప్పవలెనా ? ఏక పతి వ్రతమును, ఏక పత్నీ వ్రతమును, ఉత్తమ నాగరికతా ద్యోతకములని పెద్దలు చెప్పెదరు. మన సమాజములో స్త్రీలయెడ జరగెడి అన్యాయంబులలో బహుపత్నీ కత్వ మొక గొప్ప యన్యాయము. 'సవతిపోరు స్వర్గమునందయిన నక్కర లేద'న్న సామెతవలననే యీ బహుపత్నీత్వమువలన సమాజమునందు గలిగెడి కల్లోలములు వ్యక్తము కాగలవు. కావున కుటుంబ దు:ఖమునకు గారణమయిన యీ బహు పత్నీకత్వమును మాన్పి, యనాదికాలము నుండి యీ దేశమున నడుచుచున్న యేకపతివ్రతమువలెనే యేక పత్నీ వ్రతమును దేశాభిమానులు స్థాపించెదరని నమ్ముచున్నాను.

ఉదయాదిత్య మహారాజు వాఘేలిరాణియందు బద్ధానురాగుడయి, సోళంకిరాణిని దాసివలె జూచుచుండెను. కొంత కాలమునకు సవతిమత్సర మధికమయి వాఘేలిరాణి సోళంకిరాణిని ఇల్లు వెడలగొట్టించెను. కాని, మంత్ర్యాదులు మధ్యస్థులయి, సోళంకిరాణి యొక్కయు, నామె కుమారునియొక్కయు నుదర నిర్వాహకమునకు రెండుగ్రామముల నిప్పించి వాసము చేయుటకయి యూరిబైట నొక గృహమునిప్పించిరి. సోళంకిరాణి విచారశీల గావున, సంప్రాప్తమయిన దుస్సితియందుగూడ తన కుమారునకు విద్యాబుద్ధులు చెప్పించుటకు మరచినది కాదు. ఇతర వ్యయము లన్నియు దగ్గించి, మిగిలిన ధనముతో గుమారునకు రాజయోగ్యమైన విద్యలన్నియు జెప్పించెను. ఇట్లు జగదేవుడు కొన్ని దినములలో రణధవలునికంటె నధిక శూరుడని విఖ్యాతిని జెందెను. ఇందుచే రాజ్యమునందలి లోకులందరును జగదేవునియందే బద్ధానురాగులయి యుండిరి. రాజుగూడ జగదేవుని శౌర్యసాహసముల విని సంతోషించుచుండెను. కాని వాఘేలి రాణికి గోపము వచ్చునేమోయని రాజు తనకు జగదేవుని యందుగల ప్రేమ స్పష్టపరచుటకు వెరచుచుండెను. ఇట్లు కొంతకాలము జరిగినవెనుక బైని వర్ణింపబడిన బిరజ రాజుగా రంపిన శుభ లేఖను దీసికొని కొందరు బ్రాహ్మణు లుదాయాదిత్యుని సభకు వచ్చిరి. ఆ శుభపత్రికలను జూచి, రాజు ఆనందభరితుడాయెను. గాని, రణధవలుని వివాహము కానందున వాఘేలి రాణి జగదేవుని వివాహమున కనుజ్ఞ ఇచ్చునో, లేదోయని సంశయించెను. కాని, జగదేవుని యదృష్టము వలన రాజుగారు వాఘేలిని త్వరలోనే సమాధాన పరుపగలిగిరి.

ఇట్లు పెద్దభార్య యనుజ్ఞ పుచ్చుకొని ఉదయాదిత్యుడు టుకుటేడా గ్రామమునకు దరలి వెళ్ళి, కుమారుడగు జగదేవునకు వివాహము జేసి కోడలగు వీరమతిని వెంబడిదీసికొని, ధారానగరమునకు వచ్చెను. జగదేవుని వివాహమయినప్పటి నుండియు సోళంకిరాణియు, జగదేవుడును, పూర్వగృహమునందుండక రాజగృహమునందే యుండిరి. కొన్నిరోజు లత్తవారి యింటనుండి, వీరమతి పుట్టినింటికి వెళ్ళెను.

రాజగృహమునందుండి, రోజును రాజసభకువచ్చి రాజకార్యము లనేకములు నిర్వహించుచుండుటవలన జగదేవునికీర్తి దినదినము వృద్ధినిజెంది సభవారందరును, అతనినే ప్రేమించు చుండిరి. వాఘేలీకుమారు డయిన రణధవళుడు చిన్నతనమునాటి నుండియు వెర్రివానివలె నుండుటచేత వా డెవరికిని ప్రియుడు గాక పోయెను. ఇట్లు తన కుమారునిజూచి యందరసహ్యపడుదురనియు, దన సవతికుమారుని నందరు ప్రేమించెదరనియు జూచి, యటులనే కొన్నిరోజులు జరగనిచ్చినయెడల దనకుమారుని వెడలగొట్టి జగదేవుడే రాజగుననియు వాఘేలిరాణి తలంచెను. జగదేవుడు తన సవతితల్లియగు వాఘేలిరాణిని సదా సంతోష పెట్టవలయుననియు, తనపయినామె పుత్రవాత్సల్యము నుంచవలయుననియు, నెల్లప్పుడు ఆమె యంత:పురమునకు బోయి యామె కరుణను బడయుటకు బ్రయత్నించు చుండెను. ఇట్లు తన యంత:పురమునకు శుద్ధాంత:కరణముతో బలుమారు వచ్చెడి బాలునిపై గొప్ప నెపమొకటి మోపి, రాజునకు నమ్మిక పుట్టునటుల జేసి, వాఘేలి యా జగదేవుని రాజ్యము వెడలగొట్టించెను. అప్పుడా కుమారుడు ఒక గుర్రమును, తన యాయుధములను మాత్రము వెంటబుచ్చుకొని, పట్టణమను స్వతంత్ర సంస్థానమునకు వెళ్ళి, యచ్చటి రాజువద్ద నేదియైన నధికారము సంపాదించుకొనవలయునన్న యుద్దేశముతో నా సంస్థానమునకు బయలుదేరెను. కాని యంతలో దన సహధర్మచారిణియగు వీరమతినిజూచి, యామె యనుజ్ఞ వడసి, పట్టణమునకు వెళ్లుదమనితలచి, గుర్రమును టకుటేడా పట్టణము వైపునకు ద్రిప్పెను. ఇట్లు జగదేవుడు బయలుదేరి కొన్ని దినములకు టకుటేడా గ్రామసమీపమున నున్న యొక యుద్యానవనము చేరెను. అచ్చటికి జేరువరకు సాయంకాలమైనందు వలనను, గుర్రము ప్రవాసముచే నత్యంతాయాసము పడినందువలనను, అచ్చట కొద్దికాలము శ్రమ దీర్చుకొని, రాత్రి వెన్నెలలో గ్రామము చేరవచ్చునని దలచి, జగదేవు డా యుద్యానములోనికి వెళ్లి, గుర్రమును విడిచి, తాను ఫలాహారము చేసి నిదురించెను.

జగదేవుని వెడలగొట్టిన తరువాత వాఘేలిరాణి వెంటనే కొందరు దుర్మార్గులకు ధనాశ జూపి జగదేవుని ద్రోవలో దెగటార్చి రండని వారిని బంపెను. జగదేవుడు వెళ్ళిన దిక్కునకే వారు వెళ్లిరి; గాని తన సవతితల్లి తనను జంపుటకై యిటుల మనుష్యులను బంపునేమో యని తలచి, జగదేవుడు పెద్ద త్రోవను విడిచి వంకర దారిని నడుచుచుండెను. కనుక వాఘేలీ పంపిన మనుష్యుల కతడు త్రోవలో గనుపడినవాడు కాడు. పైని వర్ణించిన యుద్యానవనములో నిదురించినపుడు, ఆనలుగురు మనుష్యులచ్చట బ్రవేశించి, నిదురించుచున్న రాజపుత్రుని బంధించి యడవిలోనికి గొనిపోయిరి. ఇంతలో దైవవశమున వీరమతియు, నామె చెలికత్తెయు బురుష వేషములు వేసికొని, వేటాడి యా వనములోనికి వచ్చిరి. అప్పుడచటి సేవకజనము లామెతో నెవరో రాజపుత్రు డచ్చటికి వచ్చెననియు, నిద్రించుచున్న సమయమున నతనిని నలుగురు దొంగలు పట్టుకొని పోయిరనియు జెప్పిరి. ఆమాటలు వినినతోడనే వీరమతియు, నామె చెలికత్తెయు దొంగలు పోయినత్రోవనే రాజపుత్రుని విడిపించుటకై గుర్రములను పరుగెత్తించిరి. కొంతదూరము పోయిన తరువాత నొక యరణ్యములో నాశూర స్త్రీలు, కాలుచేతులు కట్టబడియున్న జగదేవుని నడుమ బెట్టుకొని యతనిని జంపవలెనా వలదా యని తమలో దాము వాదించుకొనుచుండిన చోరచతుష్టయమును గాంచిరి. పురుష వేషధారులగు వీరిద్దరిని జూచి దొంగలు వారివద్ద ధనము దీసికొనవలెనన్న యిచ్ఛచే వారి మీదికి వచ్చిరి; కాని వీరమతియు నామె సహచరియు భీతినొందక వారిపై తమ కంక పత్రములను, భల్లెములను బ్రయోగింప సాగిరి. ఆ దుష్టులు చేయగలిగిన ప్రయత్నముల జేసిరి గాని, వారిలో నొకడు వీరమతిచే జచ్చెను; మరియొకడు చెలికత్తె యొక్క భల్లెప్రహరణమువలన దొడ తెగి క్రింద గూలెను. వీరమతిని జూచి మిగిలిన యిద్దరును పారి పోయిరి. అప్పుడు వీరమతి జగదేవుని బంధనములు విప్పి, యతడు తన పెనిమిటి యని తెలిసికొని, తానెవరో చెప్పక యతనిని గ్రామమునకు రమ్మని బలవంతము చేసి, వెంట దీసికొనిపోయెను. అచ్చటికి వెళ్ళిన తరువాత నిజస్వరూపము జూపగా, తన ప్రాణములు రక్షించినది తన యర్ధాంగియే యని తెలిసికొని, జగదేవు డత్యంతసంతోష చిత్తు డయ్యెను. అప్పుడు వీరమతి "మాకు దెలియపరుపక యిటుల నొక్కరు వచ్చుటకు గారణం బేమి" యని భర్తను అడిగెను. అందుపై నతడు తన వృత్తాంతమంతయు జెప్పి "నన్నుగొని పోయిన దుష్టులు మాసవతితల్లిగారిచే బంపబడినవారు. నేనికమీద నిచ్చటనుండిన పక్షమున, నీయన్నగారు మాతండ్రికి సామంతుడుగాన, నతనికి జేటు వాటిల్లును గనుక, నేను పట్టణ సంస్థానమునకుబోయి యచ్చట నుద్యోగమును సంపాదించుకొని, నిన్ను బిలిపించుకొందును. పోవుటకు ననుజ్ఞయిమ్ము అని పలికెను. అందుపయి వీరమతి, తన్ను వెంటదీసికొని వెళ్ళవలయునని తొందర పెట్టసాగెను. అందుమీద జగదేవుడు బావమరదియగు బిరజుని సమ్మతి బుచ్చుకొని, భార్యను వెంట దీసుకొని పోవుటకు సమ్మతించెను. వెంట గొంతసైన్యము దీసి కొనవలసినదని బిరజుడు బలవంతపెట్టెనుగాని, యందుకు జగదేవుడు సమ్మతింపక పోయెను. భార్యాభర్తలిరువురు రెండుగుర్రములపయినెక్కి, యుద్ధమునకు నుపయోగించు శస్త్రములను వెంట దీసుకొని, పట్టణమునకు బయలుదేరిరి.

ఇట్లుప్రవాసము చేయుచు వారొకనాడు మధ్యాహ్నమొక యూరిలోదిగి, భోజనముచేసి, విశ్రమించి, యచటి వారిని పట్టణమునకు ద్రోవయేదియని యడుగగా, వారు రెండు దారులుగలవనియు, నందొకదారిలో మనుష్యులను దిను రెండు బెబ్బులులున్నవనియు జెప్పిరి. అప్పుడు పులులున్న త్రోవనే మనము వెళ్లి, వానిని వేటాడి చంపి లోకుల కుపకారము చేయుద మని వీరమతి జగదేవునితో జెప్పెను. భార్యయొక్క శౌర్యోత్సాహములను జూచి జగదేవుడు సంతసించి యాదారినే వెళ్లుటకు సమ్మతించెను. వారాత్రోవను నాలుగు క్రోశముల దూరముపోగానే వారు "ఈ క్రూరమృగమునుజంపి మాప్రా ణములను రక్షింపుడి" యన్నధ్వనిని వినిరి. ఆ శబ్దమువచ్చెడి దిక్కునకు వారిరువురు తమగుర్రములను దిప్పి కొంతదూరము వెళ్లిరి. దూరమునుండి చూడగా బెద్దచెట్టుపై నిద్దరుమనుష్యులు కూర్చుండి గజగజ వణకుచుండుటయు, క్రిందనొక పెద్దపులి బొబ్బలుపెట్టుచు, నెగురుచు భయంకర మయిన రూపమును దాల్చి చెట్టుపైనున్న మనుష్యులను క్రిందబడవైచుటకు బ్రయత్నించుచుండుటయు గానవచ్చెను. ఇటుల జూచి వారిరువురు ఆ పులిని సమీపించి యొక పొదచాటునుండి దాని వీపునకు దగులునట్టుగా బాణము వెసిరి. అంతనాపులి వృక్షముమీది మనుష్యులను వదలి, వెనుకకు దిరిగి తనను నొప్పించిన దంపతులపయికి నురికెను. అంతలో జగదేవుడు మరియొక బాణమువేయగా నది తప్పిపోయెను. అందుచేత నాపులి, మరింత గర్జించుచు, జగదేవుని సమీపించెను. అప్పుడు వీరమతి తన చేతిబల్లె మాపులి పొట్టలో గ్రుచ్చగా, నది క్రిందబడి ప్రాణములు విడుచుచు బెద్దగా బొబ్బరించెను. ఆఘోర శబ్దమును విని, పొదలలోనున్న యాడుపులి యంతకంటె పెద్దగా నరచుచు తనప్రాణనాయకుని సహాయమునకు వచ్చెను. అప్పుడాశూరదంపతులు గూడి యాపులినిగూడా జంపిరిగాని దానిగోళ్ళచే గీరబడినందున జగదేవుని గుర్రమా బాధచే మృతి బొందెను. అందుకు జగదేవుడు మిక్కిలి చింతించి, తనదేహము పయి పచ్చడము దానిపై కప్పెను. చెట్టుపయిని యిద్దరుమనుష్యులు దిగివచ్చి, తమ ప్రాణదాతలకు నమస్కరించిరి. మీరెవ్వరని జగదేవుడు వారినడుగగా వారిట్లు చెప్పిరి. "ఉదయా దిత్య మహారాజుగారికి రెండవకుమారుడగు జగదేవు డిరువది దినముల క్రిందట నేకారణమువలనో యింటినుండి బయలుదేరి యెవరికి జెప్పక యెచ్చటికో పోయినాడు. అతనితల్లియగు సోళంకిరాణి యతనిని వెదకుట కయి ధీరసింహుడను మంత్రిని బంపినది. మేము ధారానగరమువద్ద నున్నయొక పల్లెలోనివారము. ప్రవాసములో నందరికంటె ముందుపోయి భోజన ప్రయత్నము చేయుట కయి ధీరసింహుడు మమ్ము వెంబడి తెచ్చినాడు. నిన్నిటిరోజు మేము ధీరసింహునకంటె మొదట బయలుదేరి ముందటిగ్రామమునకు బోవుచుండగా త్రోవతప్పి యీ యడవిలోకి వచ్చి పెద్దపులులచే బాధితుల మయితిమి." ఇట్లు వారిచే దనతల్లి క్షేమసమాచారమును, తనను వెదకుట కయు తనతల్లి గారు తన కత్యంతప్రియుడగు ధీరసింహుని బంపిన దనియును విని, జగదేవు డత్యంత ముదితుడయి ధీరసింహు డెచ్చట నున్నవాడో యచ్చటికి దీసికొనిపొండని వారి నాజ్ఞాపించెను. వారిలో నొకడు ముందు, నడుమగుర్రముపయి, జగదేవవీరమతులు వారి వెనుక నింకొక సేవకుడు, ఇట్లు నడుచుచు కొంతదూరము వెళ్లిన తరువాత వారికి నెవరో గుర్రపురౌతులు, ఎనిమిది పదిమంది యెదురుగా వచ్చుచున్నట్లు గానిపించిరి. వారు ధీరసింహుని మనుష్యులేయని నమ్మి జగదేవాదులు వారిరాకకు నెదురు చూచుచు నిలవబడిరి. కాని కొంతసేపటికి వచ్చెడి వారు తమకు మిత్రులుగాక, యెవరో శత్రువులని తెలిసెను. అప్పుడు జగదేవవీరమతులు శస్త్రాస్త్రములను సవరించుకొని యుద్ధమునకు సన్నద్ధులయిరి. వారివెంబడి నున్న సేవ కులు కొన్ని రాళ్ళను పోగు చేసికొని యచ్చటనున్న యొక వృక్షమునెక్కి శత్రువులపయి రువ్వసాగిరి.

ఇంతలో నాగుర్రపురౌతులు వచ్చి, యాదంపతులను జుట్టుకొనిరి. వారెనిమిదిమంది యున్నందున వారితో బోరిగెలుచుట యసాధ్యమని తలచి, జగదేవుడు వారు తమపయికి రాకుండ ఖడ్గము తనచుట్తు త్రిప్పుకొనుమని తనభార్యకు సూచించి, తానును అదేప్రకారము చేసెను. వీరిలో వెనుక జగదేవుని పట్టుకొనిపోయినవారిలోనివాడొక డున్నందున, వీరందరును వాఘేలిరాణిగారిచే దమ్ము చంపుటకు నై పంపబడిన వారని వారు గ్రహించిరి. ఇట్లు కత్తి చుట్టుద్రిప్పుకొని యాత్మ సంరక్షణము చేసికొనుచున్న యా దంపతులపయి నాశత్రువు లనేక బాణములు గురిపించిరిగాని, యవియన్నియు వేగముతో ద్రిప్పబడుచున్న ఖడ్గముచే ఖండితము లయ్యెను. ఆ సమయమున వారిశరీరమును స్పర్శించుటకు వాయుదేవునికిగూడ శక్యముకాక పోయెను. ఇట్లు మహావేగముతో గత్తికొంతసేపు ద్రిప్పిడస్సి యిక నటుల చాలసేపు సేయుట యశక్యమని తలచి వీరమతి వారుచుట్టిన యావరణమును పగులదీసి యవతలకి బోవయత్నించెను; అటులనే సేయుటకయి పతికిని సూచించెను. వారిరువురు రెండుప్రక్కల నావరణమును బగులదీయుటయి యత్నింప జొచ్చిరి. వీరమతి యాశత్రువుల నాయకునిపయి నొక బాణము వేయగా నతడాబాణమునుదప్పించుకొనెనుగాని, యాబాణము దగిలి వానిగుర్రము కూలెను, ఆగుర్రము కూలగానే యతడును క్రిందబడి మూర్ఛిల్లెను. ఇట్లు వీరమతిచే దమనాయకుడు భంగపడుట చూచి యితరులందరు గ్రోధావేశ పరవశులై యా యబలపైకి నురికిరి. వారంద రిట్లొక్కసారి పేర్చి యూర్చిన వీరమతి వారితో బోరాడెనుగాని, యావరకు ఖడ్గము త్రిప్పి త్రిప్పి యలసి యున్నందున నా ఘోరకలహములో నాచేతిపట్టు బడి ఖడ్గము క్రిందబడెను. దానిని తీసికొనుటకై ఆమె ప్రయత్నించు నంతలో రెండుబాణములు వచ్చి యొకటి యామె కాలికిని, మరియొకటి యామె చేతికిని తగిలెను. వానిని దీయుటకై యత్నించుచుండ నొకడు వెనుక నుండి వచ్చి యామె మెడబట్టుకొనెను. ఇందుపై నామె మూర్ఛిల్లెను గాని, యింతలో జగదేవుడు తన ఖడ్గముచే నా దుర్మార్గుని రెండుచేతులును దునిమి తన ప్రియభార్యను విడిపించుకొనెను. ఇక జగదేవునకు మూర్ఛిల్లిన భార్యను రక్షించుకొనుటయు, శత్రువులతో యుద్ధము చేయుటయునను రెండు పనులు చేయవలసివచ్చెను. ఇట్లు జగదేవుడు తన శౌర్యమంతయు జూపుచుండగా ధీరసింహుడిరువది గుర్రపురౌతులతో నదేమార్గమున వచ్చుట సంభవించెను. ఆయన జగదేవుని గుర్తెరిగి యా దొంగల నందరిని కైదు చేసెను. తరువాత ధీరసింగు గుర్రముదిగి జగదేవుని గౌగిలించుకొని, అతనిచే దొంగల వృత్తాంతమంతయు విని మూర్ఛిల్లియున్నది వీరమతి యని తెలిసికొని యామెకు శీతోపచారములు చేయించి, గాయములకు గట్లు కట్టించెను. అంత నామె స్మృతినొంది లేచి, ధీరసింగును చూచి యతనికి మ్రొక్కెను. తరువాత వారందరును ఆ రోజున నచ్చటనే కూడి భోజనాదులు చేసిరి. భోజనోత్తరము ధీరసింగు జగదేవునితో నిట్టులనియె "ఇది యంతయు వాఘేలి రాణిగారు చేసిన పనియే. కనుక, నీవు ధారానగరమునకు వచ్చి యీ సంగతినంతయు, మీ తండ్రిగారికి విశదపరచి, నీయందు దోషము లేకపోవుట స్థాపించుకోవలసినది. ఇందుకై నేను నీవైపున సాక్ష్యమిచ్చెదను." అందుపై, తానట్లుచేసిన తన సవతితల్లికి నవమాన మగుననియు, తా నింటినుండి బయలుదేరినప్పుడు తన బాహుబలముచే గీర్తి సంపాదించిగాని తండ్రికి ముఖము జూపనని ప్రతిజ్ఞ జేసితిననియు, తాను పట్టణమునకు వెళ్ళి యచ్చట తన బాహు విక్రమముచే గీర్తియు, శ్రీయు సంపాదించి, తల్లిని దండ్రినిజూచుటకు వచ్చెదననియు జగదేవుడు ధీరసింహునితో జెప్పెను. ధీరసింహుడందుకు సమ్మతించి, తన గుర్రములలో నొక దానిని జగదేవుని కిచ్చి, యతనియాజ్ఞ బుచ్చుకొని ధారానగరమునకు వెడలెను. అప్పుడు జగదేవుడు "మాతల్లిగారికి నా క్షేమసమాచారము చెప్పి, యామెకు నేమియు నాయాసము గాకుండ జూచుచుండవలసినది" యని చెప్పెను. ఆ మంత్రి సత్తముడు రాజధానికి బోయి యటులనే చేసెను. ఇచట నా దంపతు లిద్దరు గుర్రములపయి సవారులయి మార్గములో ననేక సంకటముల బడుచు కొన్ని రోజులకు బట్టణమని యపరనామము గల అణహితపురమునకు జేరిరి. ఆ గ్రామమునకు సమీపమున సహస్రలింగతటాకమను నొక చెరువున్నది ఆ తటాకతీరమున దిగి యచ్చటనే గుర్రములను, వీరమతిని ఉంచి తాను బసచూచివచ్చెద నని జగదేవుడు గ్రామములోనికి బోయెను. జగదేవుడు గ్రామములోనికి వెళ్ళిన కొంతసేపటికి చెరువున కొకవనిత నీళ్ళకువచ్చి వీరమతిని జూచి నేర్పుగా నామెపేరు, ఆమెపెనిమిటిపేరు, మామపేరు కనుగొనిపోయి ఆసంగతులన్నియు దన యజమానురాలితో జెప్పెను. ఆ కాలమున నా పట్టణము పండ్రెండుక్రోశముల వైశాల్యముగలది యయి బహు రమ్యముగనుండెనట. జయసింగు సిదరాజసురా" బ్రజా పరిపాలనము చేయుచుండెను. ఆయన ధర్మాత్ముడనియు, దయాశాలి యనియు బ్రసిద్థికెక్కెను కాని, అతడు రాజ్యములోని యధికారుల బరీక్షింపక వారిపయి నమ్మకగలిగి ప్రవర్తించుటచే నా పట్టణమందు ననేకాన్యాయములు జరుగుచుండెను. ఆ పట్టణమునకు గొత్వాలనగా, దండనాయకుడుగా నున్న డుంగరసీయనువాడు స్వయముగా నన్యాయములు చేయించుచుండెను. స్వయముగా దొంగలను బ్రోత్సాహపరచి వారు తెచ్చిన సొమ్ములో భాగము గొనుచుండెను. వేశ్యాంగనాసక్తుడయి గ్రామమునందనేక వేశ్యాంగనలను దెచ్చియుంచెను. వారిలో జామొతీయను వేశ్యాంగన మిక్కిలి చక్కనిదియై లెక్కింపరాని ధనమును సంపాదించెను. దానియిల్లు రాజభవనమువలెను పూదోటలు రాజోద్యానములవలెను గానుపించును. ఈ వేశ్యాంగనలలోని రాణి తన దేహమును విక్రయించుటయే గాక పట్టణములోని యనేకసాధ్వీమణులను మోసపుచ్చి తన యింటికి రప్పించి, బలవంతముగా వారిని కామిజనుల కర్పించి వారి ప్రాతివ్రత్యమును భంగము చేయుచుండును. దండనాయ కుని కుమారుడగు లాలదాసనువాడుగూడజారశిరోమణి యని పేరుగాంచి యీ జామోతికి దాసుడయి యొప్పుచుండెను.

పైని చెరువునకు నీళ్ళకొరకువచ్చి వీరమతి నామ గ్రామములు కనుగొనినదని చెప్పిన వనిత ఈ జామోతియొక్క సేవకురాలు. దాసి చెప్పినమాటలు విన్నతోడనే యా వేశ్యాంగన రాజస్త్రీకి యోగ్యమయినవేషము వేసికొని, మేనాయెక్కి వెంట గొందరు భటులను దీసికొని వీరమతి యున్నచోటికి వెళ్ళెను. అచ్చట నామెనుగాంచి ఎవరో కావలసిదానివలె నామెవద్దకి వచ్చి, "పరాయివారివలె మీరిట్లు వేరుబస చూచుకొనుట న్యాయమా? మీరువచ్చెదరని మొదలే కబురుచేసినపక్షమున మేము మీ కెదురుగనే వచ్చియుందుము. నేను ఉదయాదిత్యుని పినతండ్రి కూతురను; జగదేవునికి వేలువిడచిన మేనయత్తను. బసచూచుటకయి జగదేవుడు పట్టణములోనికి రాగా రాజుగారతనినిజూచి యానవాలుపట్టి రాజమందిరములోనికి దోడుకొని వచ్చిరి. అచ్చట నతనిచే నీవిచ్చటనున్న సంగతి విని నిన్ను రాజ భవనమునకు దీసికొని పోవచ్చితిని. ఈ గుర్రములు మొదలైన వానిని నాబంట్లు దీసుకొనిరాగలరు. ఈ మేనాలో గూరుచుండుము. పద, పోయెదము" అని పలికెను. ఆమాటలువిని యామె చెప్పిన సంగతులన్నియు నిజమనుకొని వీరమతి యామె వెంబడి రాజగృహమునకు సరితూగుచున్న యామె గృహమునకు బోయెను. అచ్చటికి వెళ్ళినపిదప నా వేశ్యాంగన వీరమతికి నభ్యంగన స్నానముచేయించి, కొంతసేపటికి భోజనమునకు లెమ్మని పిలిచెను. అందుపైని మీమేనయల్లుడు భోజనముచేసినగాని నేను భోజనముచేయనని యామె యుత్తరమిచ్చెను. అందుపై జామోతి తన పరిచారికలలో నొక దానిని, 'మీకొరకు మీమేనయత్త కని పెట్టుకొని కూర్చున్నది, అని చెప్పిజగదేవుని దీసికొనిరమ్మని పంపెను' ఆదాసి పోయినటుల నటించి, తిరిగివచ్చి, రాజుగారితో జగదేవుడు భోజనము చేసినాడు; మిమ్మును, వీరమతి గారిని భోజనము చేయమని చెప్పినాడు అనిచెప్పెను. అందు పయి వీరమతి కొంచెము భుజించెను. తరువాత నా వారయువతి యొక సుందరమైన యరచూపి వీరమతిని అచ్చట విశ్రముంచుమని చెప్పివెళ్ళెను. ఈసంగతులన్నియు జూచి వీరమతికి సంశయము కలిగెనుగాని, సాయంకాలమువరకు బెనిమిటి వచ్చునేమోయన్న యాశచే నామె యాగదిలో శయనించెను. సాయంకాలము కాగానే యింటి యజమానురాలు మరల వచ్చి భోజనమునకు రమ్మని పిలిచెనుగాని, భర్త వచ్చి భోజనము చేయనిది తాను అన్నము ముట్టుట లేదని వీరమతి తననిశ్చయము తెలిపెను. అప్పుడు జామోతి యేమియు జేయలేక కొన్ని ఫలాహారము లచ్చట బెట్టి తినుమని చెప్పి వెళ్ళిపోయెను. పోవుచు జామోతి గదియొక్క వెలుపలి గొళ్ళెమును వేసికొనెను. అదియంతయు జూచి ఇదియొక మాయగానున్నదని తలచి వీరమతి మరింత భీతి నొందెను. ఆమె యాగదిలో గూరుచుండి పెనిమిటిని నెప్పుడు చూచెదనా యని చింతించుచుండెను.

ఆ పట్టణములోని దండనాయకుని కుమారుడగు లాలుదాసునకు బ్రతిదినమున నొకక్రొత్త యువతిని సమర్పించుట జామోతియొక్క నిత్యవ్రతము. ఆరోజు వీరమతివంటి చక్కని స్త్రీ దొరకి నందుకు జామోతి యెంతయు సంతసించి, తనకు గొప్ప బహుమానము దొరకునని నిశ్చయించుకొని యుండెను. సాయంకాలము కాగానే, యావారకాంత యాదినము జరిగిన వృత్తాంత మంతయు లాలుదాసునకు దెలిపి, వీరమతి పెనిమిటి పేరు చెప్పి, యతని బట్టి కారాగృహములో వేయించి, రాత్రికి నతనిని (లాలుదాసును) తనయింటికి రమ్మని చెప్పెను. ఆ నరాధముడు రాత్రి నియమితకాలమునకు వేషమువేసికొని, సురాపానము చేసి, జామోతి గృహమునకురాగా ఆచండాలిని పుచ్చుకొనవలసిన ధనమంతయు బుచ్చుకొని, యతనికి వీరమతి యున్న మేడ జూపి, తన నివాసస్థలమునకు వెళ్ళిపోయెను. ఆ నరధాముడు మేడయెక్కునప్పుడయిన చప్పుడువిని, భర్తృధ్యానరత యై న చరిత్రనాయిక, తనభర్త వచ్చెనని తలంచి సంతసించెను గాని, యాకీచకుడు లోనికిరాగా వానిభయంకరమైన స్వరూపమునుజూచి పరపురుషుడని యెరిగి గజగజవడక సాగెను. అంతలో రాజస్త్రీలకు స్వాభావికమైన ధైర్యము నవలంబించి, యెన్నియో బోధవచనములచే నా దుష్టుని దుర్మార్గమునుండి తొలగింపయత్నించెను. ఆ మాటలువినక, ఆ నరపశువు, మదోన్మత్తుడయి, వివేకశూన్యుడై, వీరమతియొక్క పవిత్ర దేహమును దనపాపపు హస్తములతో స్పర్శించుటకై యత్నించెను. ఇక నూరకుండిన మానమునకు భంగము కలుగునని తలచి, యాయతులపరాక్రమశీల యగు అబల, తన నడుములోని గుప్తఖడ్గము సర్రున దీసి యా నరాధముని రెండు తునకలుగా ద్రుంచెను. ఈఖడ్గ మెక్కడిది యని చదువరులకు సందేహము వచ్చునేమో, ఆ కాలపు ప్రతిరాజపుత్ర స్త్రీకి నడుమున మొలకట్టురూపమున నొక సన్నఖడ్గము అమరియుండును. ఈఖడ్గములు వంచిన విరగనట్టి యుక్కుతో జేసినవి; ఇవి మొలకట్టు ఆకారముగల బంగారపు వరలో నుండుటవలన జూచువారికి మొలకట్టులవలెనే గానుపించును. మానమునకు మోసము గలుగుచున్న పక్షమున రాజపుత్ర స్త్రీలా ఘడ్గమును ఉపయోగించుచుండిరి. ఆఖడ్గమునే సంకట సమయమున వీరమతి ఉపయోగించి, తనమానమును సంరక్షించుకొనినది! ఆహా! ఇట్టి పతివ్రతా తిలకంబుల గినియాడ నెవరితరము? స్త్రీపురుషుల కందరికినివంద నార్హయైన యీ నారీతిలకము మునితిలకుడైన మనువు

    అరక్షితా గృహే రుద్థా: పురుషై రాప్తకారిభి:
    ఆత్మాన నూత్మనా యాస్తు రక్షేయుస్తాస్సురక్షితా:*

వ్రాసిన అనిన వచనమును సోదాహరణగా స్థాపించి, స్త్రీలకయి మహోపకారము జేసినది. ఓ సోదరీమణులారా! చూచితిరా పాతివ్రత్యప్రభావము! వనితలకు బాతివ్రత్యమే శ్రేయమనియు, గ్రాహ్యమనియు, లలామభూతమనియు నమ్ముడు. ప్రాతివ్రత్యమునకంటె నెక్కుడుధర్మము స్త్రీల కెద్దియులేదు. పతివ్రతా స్త్రీలను సంరక్షించుటకయి సదా సర్వేశ్వరుడు సిద్ధముగా నుండును. పాతివ్రత్యమునకు దన్ను దానే రక్షించుకొను సామర్థ్యముగలదని కొందరు చెప్పుదురు. అనగా పతివ్రతా స్త్రీలెంత దుర్బలలైనను, ఎన్ని సంకటములలో మునిగియున్నను, వారికి స్వసద్గుణములను గాపాడుకొను సామర్థ్యమీశ్వరుడిచ్చును.


  • ఆప్తులైన పురుషులచే గృహమున నిర్బంధింపబడు స్త్రీలు రక్షితురాండ్రు కారు; ఏ స్త్రీలు తమయాత్మను తామే కాపాడుకొందురో వారే సురక్షితురాండ్రు. పతివ్రతలను దుష్టుల చరలోనుండి విడిపించుట కయి పతివ్రతల వెంబడి యెల్లప్పుడును దేవదూత లదృశ్యులై తిరుగుచుందురని యొక పాశ్చిమాత్యకవి వ్రాసియున్నాడు. కీచకుని గృహమునకు బోవునపుడు ద్రౌపదీదేవి తనపాతివ్రత్యము రక్షింపవలసినదని సూర్యునికి విన్నవింపగా,

క. "తరణియు దు:ఖిత యగున
   త్తరుణిం గాంచుటకు నత్యుదగ్రభుజావి|
   స్ఫురణాడ్యు నొక్కరక్కసు|
   గరుణార్గ్రమనస్కుడగుచు గ్రక్కున బనిచెన్"

అని మహాభారతమున జదువుచున్నారముగదా? దమయంతి శాపంబున గిరాతుడు దగ్థుడయ్యెననియు విందుము. ఈ దేవదూతలును, రాక్షసుడును, శాపసామర్థ్యమును పతివ్రతా స్త్రీల యొక్క సత్ప్రవర్తనమును, దృడనిశ్చయమును, శౌర్యసాహసములును అనియె చెప్పవచ్చు. తమధర్మమునకు భంగము కలుగుట సంభవించినప్పుడు పతివ్రతా నారీమణులకు గ్రోధాతిరేకము కలుగును. ఆక్రోధాతిశయమునందె దుష్టుని శిక్షించి, పాతివ్రత్యమును సంరక్షించుకొనుసామర్థ్యము గలదు. కనుక నో హిందూసుందరులారా! ప్రాణములైన బోగొట్టుకొని మీ పాతివ్రత్యమును రక్షించుకొనుడు. మీసచ్ఛీలమనుధనమును అపహరించుట కయి యనేక నరచోరులు సదా తత్పరులైయుందురు. మీకు విద్యనేర్పక మూర్ఖులనుజేసి తమవలలో వేసికొనవలెనని యనేకులు స్త్రీవిద్య యక్కరలేదని ప్రతిపాదించెదరు. వారిమాటలు వినకుడి. సద్విద్యను గరచి, పతివ్రతల చరిత్రము లను జదివి, వారివలె ప్రవర్తించుటకు యత్నించుడి. విద్యనేర్చుకొనిన నిట్టి సంకటములు రావని నా తాత్పర్యముకాదు. కాని యిట్టి సంకటములు సంప్రాప్తించినపుదు మూర్ఖులవలె నిరాశను బొందక, విద్య నేర్చిన స్త్రీలు ధైర్యము నవలంబింతురు. సంకటమును దొలగించుకొనుటకు వారికి ననేక యుక్తులు తోచును. వీరమతికి శస్త్ర మెటుల నుపయోగించినదో, యటులనే విద్య యిప్పటి స్త్రీలకు సంకట సమయమునందుపయోగించును. కనుక, మీ పాతివ్రత్య రక్షణార్థమై మీ రెల్లప్పుడును విద్యయను శస్త్రమును వెంబడి నుంచుకొనుడి.

ఇట్లు నరాధముడగు లాలుదాసును యమసదమునకు బంపి, వాని శరీరమును గుడ్డలో మూటగట్టి వీరమతి యా మూటను గవాక్షంలోనుండి వీధిలో బారవైచెను. తదనంతరము లోపలికి మరియెవరు రాకుండునటుల మేడత్రోవ లోపల బిగియించుకొని యిక నేమేమి విచిత్రములు జరుగునో చూతమని చేత ఖడ్గమును ధరించి గవాక్షమువద్ద నిలువబడెను. అంత రాత్రి గస్తితిరుగు సంరక్షకభటులు కొంద రా మూటను జూచి, విప్పి, దండనాయకుని కుమారుని శవమని తెలిసికొని, తక్షణమే యా సమాచారము దండనాధునికి దెలియ జేసిరి. తన పుత్రుని శవమును జూచి దండనాయకుడు శోకాకులచిత్తుడై, యా శవ మెచ్చటదొరికినదని యా భటుల నడిగెను. జామోతియొక్క గుప్తగృహ సమీపమున దొరికినదని వారు చెప్పగా, నతడు వెంటనే యా వారకాంత యింటికి బోయి లాలుదాసుడేడియని యడిగెను. అందుపై జామోతినవ్వి యత డొక క్రొత్త రంభావిలాసములో నున్నాడు. వెరవకుడి; పిలుచుకొని వచ్చెదనని మేడపైకి బోవుటకు వెడలెను. కాని పైకిబోవు త్రోవయె మూసియున్నందున, నెన్ని పిలుపులు పిలిచినను, ఎవరును బలుకకపోయిరి. అప్పుడామె మరలివచ్చి యాసంగతి యంతయు గొత్వాలుతో జెప్పెను. అప్పుడతడు కొందర భటులను బిలిపించి, యా మేడతలుపులను దీయ యత్నించెను. కాని జామోతియింట జరిగిన ఘోరకృత్యము లన్నియు నామేడలో జరుగుచున్నందున నా వేశ్యాంగన యెవ్వరికి దీయ నలవిగాని ఘనతరమైన తలుపు ఆ మేడకు బెట్టించి యుండెను, కనుక గొత్వాలు చేసిన యత్నము లన్నియు విఫలములయి తలుపు రాకపోయెను. అప్పుడు వీధికోడకు నిచ్చెనవేసి గవాక్షములో నుండి లోపలికి బోదమని నిశ్చయించి యటులనే నిచ్చెన వేసికొని యొకభటుడు పైకెక్కి గవాక్షములో దల బెట్టగానే యచ్చట నిలుచున్న వీరమతి తన ఖడ్గముతో వానిమెడ ద్రుంచెను. అంత వానిమెడ లోపలబడి, వాని మొండెము వీధిలో బడెను! అందుకు భయమునొందక మరియొకడు పైకి రాగా పతివ్రతాతిలక మగు మన చరిత్రనాయిక వానినిగూడ ఖడ్గమునకు బిలియిచ్చెను! ఇట్లు పదునొకండుగురు మేటిమగలా యబలచే నిహతులైరి! అప్పుడు పైకెక్కుట కే శూరుడును సాహసింపక పోయెను. ఇంతలో నీవార్త ప్రాత:కాల మగుటవలన గ్రామములో నంతయునిండి, యా వారవనిత గృహమునకు లోకులు గుంపులు గూడి రాసాగిరి. ఒక స్త్రీ పండ్రెండుగురు భటులను గూల్చినదని యందరనుకొనగ నా పట్టణపు రాజు కూడ వినెను. అతడిట్టి విచిత్రమును చూచుటకయి స్వయముగా నచ్చటికిపోయెను. అచ్చట నామె చంపినవారి నందరినిజూచి, స్వయముగా నిచ్చెనపైకి నెక్కి, గవాక్షమువద్ద నిలువబడి, యిట్లనియె. "ఓ యసమాన శౌర్యముగల స్త్రీ! నీ వెవ్వరవు? ఇట్లు నా ప్రజలను జంపుటకు గారణమేమి? నేనీ పట్టణమునకు రాజును. నీ కెవరైన నపరాధము చేసిన పక్షమున జెప్పుము. వారిని నేను దండించెదను." అందుపయి "మహారాజా! నేను చావడా కులోత్పన్నుడయిన బిరజ మహారాజు గారి చెల్లెలను; ధారానగరమునకు నధిపతియైన యుదయాదిత్య మహారాజుగారి కోడలను. నా పేరు వీరమతి" అని చెప్పి తన వృత్తాంతమంతయు, తన్ను మోసపుచ్చిన వేశ్యాంగన యిచ్చటికి దీసికొని వచ్చిన విధమును సవిస్తరముగాజెప్పి, లాలుదాసుని యనుచిత కృత్యమును దెల్పి, "నా పాతివ్రత్య రక్షణమునకయి నేను వానిని జంపితిని; నన్ను బట్టుకొనవచ్చిన పదునొకండురనుగూడ అందునకే వధించితిని; నేను క్షత్రియకన్యను. నా దేహము నందు బ్రాణ ముండువరకు నన్యపురుషస్పర్శ కానియ్యను" అని స్ఫుటముగా వీరమతిపలికెను. ఆ మాటలువిని రాజెంతయు సంతసించి "రాజపుత్ర స్త్రీలకు దగినపని చేసితివి, వెడలి రమ్ము; నిన్ను నేను నా పుత్రికవలె బాలించెదను. నీ పెనిమిటిని వెదకించెదను" అని పలికెను. కాని "నా పెనిమిటి వచ్చినగాని యీ మేడతలుపు తియ్యనని ప్రతిజ్ఞ చేసియున్నాను. కనుక మొదట నా పెనిమిటిని దెప్పించిన పక్షమున తమయాజ్ఞ శిరసావహించెదను. లేనిపక్షమున నిచ్చటనే దేహమును విడిచెదను" అని వీరమతి యుత్తర మిచ్చెను. జగదేవునికి నధికార ప్రాప్తియైనప్పటినుండియు, దుష్టులకు బహుబాధ గలుగుచుండెను. కనుక, వారందరును జగదేవుని జంపుట కైయనేకోపాయములబన్నిరి గాని, యవియన్నియు నిష్ఫలములయ్యెను. కాని యొక సంవత్సర మాపట్టణమున గత్తరలు పుట్తిలోకులనేకముగా జచ్చుచుండిరి. ఎన్ని యుపాయములు చేసినను గత్తర ఆగకపోయెను. అప్పుడు రాజు సర్వప్రజాసంహారమగునేమో యని భీతిల్లి, తన్నివారణమునకై యూరిబైటనున్న కాళికాదేవినిబూజించుటకు రోజును స్వయముగా వెళ్లుచుండెను. ఇట్టి సంకటసమయమున నెవరేమిచెప్పినను, ఎట్టి యసంభవములైన దైవిక చమత్కారములను జూపినను, రాజుగారు నమ్మగలరని తలచి దుష్టులొక యుక్తిని గల్పించిరి. వారిలో నొకడు కాళికాదేవి విగ్రహమునకు వెనుక నిలుపబడి, రాజుగా రేకాంతముగా బూజచేయునప్పుడు, దేవి పలికినటులే యిట్లనియె. "ఓ మహారాజా! నీభక్తికి మెచ్చితిని; ఈ రోగముపోవుట కొక యుపాయము చెప్పెదను వినిము. సర్వసద్గుణ సంపన్నుడైన యొక రాజకుమారుని నాకు బలియిచ్చిన పక్షమున, ఈరోగము పోయి ప్రజలు సుఖింతురు; నీవును నూరేండ్లు రాజ్యము చేసి ఆనంద మొందెదవు." అందుకు రాజు "ఓ తల్లీ! నారాజ్యములో సకల సుగుణములుగల రాజపుత్రుడెవ్వడుగలడో నీవే యానతి యిమ్ము" అనెను. అప్పుడు కాళికాదేవి యిట్లనియె. "వత్సా! నీరాజ్యములో నిట్టి రాజకుమారుడు లేడని చింత పడకుము. నీ దండనాయకు డగు జగదేవు డిన్నిగుణములు గలవాడు. కనుక నతనిని బలి యిచ్చిన పక్షమున నీవును, నీ ప్రజలును సుఖించె దరు." ఈ మాటలువిని రాజు మిక్కిలి ఖిన్నవదనుడై యింటికి బోయెను. రాజు ఖిన్నవదనుడగుటకు గారణమేమి యని, జగదేవుదు 'విచారించి' యా సంగతిని దెలిసికొని, చిన్న పోవలదనియు, లోకులకొరకును, రాజుగారికొరకును దాను సంతోషముతో బలిపోయెద ననియును, రాజుగారితో జెప్పెను. రాజు వలదని చెప్పెనుగాని, యామాటలువినక జగదేవుడింటికి బోయి భార్యతో నా మాటలు చెప్పగా నామె తానును, దనకుమారుడును బలివచ్చెదమని చెప్పెను. ఇట్లు లోకహితార్థమై యాత్మ దేహములను సమర్పింప నిశ్చయించి, యా దంపతులు తమ సొత్తంతయు బీదలకు బంచిపెట్టి, యభ్యంగనస్నానము లాచరించి, ప్రాత:కాలమున మంగళవాద్యములతో దేవికడకు బోయిరి. దేవికిబూజచేసి, మొదట పిల్లవానిని, పిదప వీరమతిని తరువాత జగదేవుని బలియియ్య దలంచిరి. ఇట్లు ఆ దంపతులు కృతనిశ్చయులైయున్న సమయమున రాజుగారికి నా సమాచారము తెలిసి, వారిని వారించుటకై యతడు దేవిగుడికి వచ్చెను. వచ్చి జగదేవుని వలదని రాజు వారించుచుండగా నా దుష్టులలో నొకడు మరల దేవి వెనుకకుబోయి దేవివలెనే యిట్లనియె - "రాజా! వలదని యతని నివారింపకుము. ఈ బలివలన నీకు జాల లాభము గలుగును," ఈ మాటలు వినగానే రాజుగారికి సంశయము గలిగి, దేవి వెనుక వెదకిచూడగా నా దుష్టుల కృత్రిమము తెలిసెను, ఇదేకథ కొందరిట్లు చెప్పుదురు. జగదేవుడును అతని భార్యాపుత్రులును కాళికాదేవి వద్దకుబోయి స్వదేహములను స్వహస్తములతో బలి యిచ్చికొనిరట. వీరందరు మృతు లయినవెనుక రాజచ్చటికి వచ్చి, వారినిజూచి దు:ఖించి, తన దేహమునుగూడా దేవికి సమర్పింపబోగా దేవి ప్రత్యక్షయయి యతని నివారించి, మృతులయి పడియున్న జగదేవాదుల లేపెనట. ఈ రెండు చరిత్రములలో నేది నిజమైయుండవచ్చునో చదువరులే గ్రహింపగలరు.

ఇట్లు దుష్టుల దుర్మార్గత తెలిసినతోడనే రాజుగారు వారికి దగినశిక్షలను విధించి జగదేవుడు లోకహితార్థమైయును, రాజహితార్థమైయును జూపిన సాహసమునకయి యతనికి నేమి ఇచ్చినను ఋణము దీరనేరదని యెంచి, యతనికి బ్రభావతియను తన కుమార్తెనిచ్చి వివాహముచేసెను. కూతుతో ననేక గ్రామాదుల నల్లునికి వరదక్షిణ యిచ్చెను. దుష్టులు జగదేవునకు గీడుచేయదలచిరిగాని, యందువలన నతనికి మేలే కలిగెను.

ఈ ప్రకారము జగదేవుడు సుఖముగా కాలక్రమణము చేయుచుండగా నచ్చట ధారానగరములో ఉదయాదిత్యుడు వాఘేలిరాణీగారి కుతంత్రములనుగానలేక యామె చెప్పునట్టు రాజ్యము చేయుచున్నందున, రాజ్యములో నంతయు నన్యాయములు జరుగుచుండెను. ప్రజలందరు అసంతుష్టులై యుండిరి. ఈ సంగతులన్నియు జూచి దగ్గరనున్న యొకరాజు దండెత్తి వచ్చి, ఉదయాథిత్యుని రాజ్యమును దీసికొని, యతనిని, అతని బాంధవుల నందరిని గారాగృహములో వేసెను. ఈ సంగతి యంతయు జగదేవునికి దెలిసి యతడు, మామగారియాజ్ఞ పుచ్చుకొని, బయలుదేరి, ధారానగరమునకు బోయి, శత్రురాజుల నోడించి, తండ్రిగారిని మరల రాజ్యారూడునిగా జేసెను. అప్పుడు మంత్రిసత్తముడగు ధీరసింహుడు రాజునకు జగదేవుని సమాచారమంతయు జెప్పి, యతనియందెంతమాత్రము తప్పులేదనియు, వాఘేలీరాణియొక్క కుయుక్తులే జగదేవుని దు:ఖములకు గారణములనియు దెలియజెప్పెను. అప్పుడుదయాదిత్యుడు జగదేవుని కౌగిట జేర్చుకొని, ముద్దాడి, యతనిని యువరాజుగా నియమించెను. అప్పటినుండి ఉదయాదిత్య మహారాజుగారికి వాఘేలీరాణియం దసహ్యతగలిగి, యాయన సోళంకీరాణిగారినే ప్రీతితో జూచుచుండెను; కాని వాఘేలిని దిన్నగా జూడవలసినదని పతివ్రతాతిలకమగు సోళంకీరాణిభర్తకు జెప్పుచుండును. ఉదయాదిత్యుని యనంతరము జగదేవుడు సింహాసనమునెక్కి న్యాయముగా రాజ్యపరిపాలనము చేసెను.

జగదేవునకు ముగ్గురు భార్యలుండినను, వారియందరిలో మొదటినుండి, పతికి బ్రతికార్యమందును సహాయముచేసి, యతని ఛాయవలెదిరిగిన వీరమతియే యతని ముఖ్యమహిషిగా నుండెను. కాని, యామె సద్గ్రంథములను జదివినదిగనుక గణ్వ మహాముని శకుంతలకు నుపదేశించిన

    శుశ్రూష స్వ గురూన్ కురు ప్రియసఖీవృత్తిం సపత్నీజనే
    భక్తి ర్విప్రకృతాపిరోషణను యాస్మప్రతీపం గమ:
    భూయిష్ఠం భవ దక్షిణౌ పరిజనే భౌగ్యేష్వనుత్సేకినీ
    యాంత్యేవం గృహిణీపదం యువతయో వామా: కులస్యాధయ:

అను సదుపదేశము ననుసరించి సదాచారిణియై, గృహిణియన్న సార్ధక బిరుదమును వహించెను.


_____________