అబలా సచ్చరిత్ర రత్నమాల/విద్యాసాగరజనని భగవతీదేవి

విద్యాసాగరజనని భగవతీదేవి

తే. ఒక పరోపకారంబు చేయుటయె కాదె
   యిలపయిని జన్మమెత్తి:ఫలము మనకు;
   గాన మన మేలుచూడకయైన దరుణి!
   పరులకుపకార మొనరింపవలయు జూవె. - వీరేశలింగకవి.

బీదలయొక్కయు, దు:ఖితులయొక్కయు బంధుడును, వంగదేశముయొక్క సత్పుత్రుడును, భారతవర్షమను ఆకాశమునకు దేజోమయమగు నక్షత్రమును, విధవాబంధుడును నగు ఈశ్వరచంద్ర విద్యాసాగరుని తల్లియగు భగవతీదేవీ చరితము సకలజనులకు ననుకరిణీయము. ఏ సద్గుణములవలన విద్యాసాగరుడు ప్రాత:స్మరణీయి డాయెనో, యా సద్గుణములకు మూలకారణ మాతని తల్లియే యని బహుజనులకు దెలియదు. ఎట్టి విత్తో, యట్టి ఫలమే కలుగుననుట భగవతీదేవీ విద్యాసాగరుల చరిత్రమువలన దెలియును. దయ, ధర్మము, క్షమ మొదలైన సద్గుణములు భగవతీదేవి వలన నే విద్యాసాగరునికి బట్టుపడెను. కావున విద్యాసాగరుడు తన తల్లిని సాక్షాదన్న పూర్ణనుగా భావించి పూజించుచుండెను.

ఈమె 1724 వ బంగాలీ సంవత్సరము ఫాల్గుణమాసము నందు బంగాలీదేశము నందలి యొక పల్లెయందు బ్రాహ్మణ వంశమున నవతరించెను. ఈమె తండ్రిపేరు రామకాంతచట్టోపాధ్యాయుడు. తల్లి గంగాదేవి. రామకాంతుడు చిన్నతనము నుండియు దైవభక్తిగలిగి విరక్తుడయ్యెను. ఆతడు విశేషముగా నెవ్వరితోను మాటలాడక అరణ్యమున కరిగి,, యేకాంతముగ జపము చేసికొనుచుండెడివాడు. ఆయన బొత్తుగ సంసారమూ నందు విరక్తుడగుట విని గంగాదేవి తండ్రియగు విద్యావాగీశుడు తన పుత్రికను సంతానసహితముగా పాతూలగ్రామమునకు గొని చనెను. నాటినుండియు గంగాదేవి తన యిరువురు కూతులతో పుట్టినింటనే యుండెను. పంచానన విద్యావాగీశునకు నిరువురు కన్యకలును, నలుగురు కొమాళ్లును ఉండిరి. వారిలో బెద్దకొడుకు పేరు రామమోహన విద్యాభూషణుడును, రెండవవాని పేరు రామధన్‌తర్క వాగీశుడును, మూడవవాని నామము గురుప్రసాద శిరోమణియును, నాల్గవాని పేరు విశ్వేశ్వర తేర్కాలంకారుడును. ఈ కుటుంబము విద్య, దయ, ధర్మము, అతిథిసత్కారము మొదలయిన సద్గుణములచే విశేషఖ్యాతి వహించెను. విద్యాసాగరుడు తన జీవనచరితమునం దీ పరివారమును గూర్చి యిట్లు వ్రాసెను. "అతిథి సేవయందును, అభ్యాగతుని సన్మానించుట యందును నీ కుటుంబమునకుగల శ్రద్ధ మిగుల స్తుత్యము. అట్టి శ్రద్ధ మరియొక చోట గానుపించదు. ఆ పరివారమునం దీ సద్గుణములు లేనివా రొకరును గానరాకుండిరి. రాధామోహనవిద్యా భూషణుని వాకిటికి వచ్చి యన్న మడిగి దొరకక వెళ్ళిపోయిన యతిథి యొకడును కానరాడయ్యె. ఆ యింటనుండు బాలురు వృద్ధులు నందరును ఇట్టి గుణములు గలవారే." ఇట్టి పరివారములో బెరిగి నందుననే భగవతీదేవికి నట్టి సద్గుణములు పట్టువడెను. అందువలననే యదివరకు దురదృష్టవంతురాలగు వంగజనని తేజోమయమగు నక్షత్రమువంటి విద్యాసాగరుడను న్యాయరత్నమును గాంచ సమర్ధురాలాయెను. తమ సంతానమునకు సద్గుణములు నేర్పుటకయి కుటుంబ మెటలుండ వలయునో నేర్చుకొన దలచినవారికి పాతూల గ్రామమునందలి విద్యావాగీశుని పరివారమే చాలినంత దృష్టాంతము. భగవతీదేవి యొక్కయు విద్యాసాగరుని యొక్కయు చరితములందు బ్రకాశించుదయ, ధర్మము మొదలగు సద్గుణములకు విద్యావాగీశుని కుటుంబమే మూలము. 1732 వ. సంవత్సరమున బనిమాలాపురమునందలి రామజయబంద్యోపాధ్యాయునిపుత్రుడగు ఠాకుర్‌దాసుని భగవతీదేవి వివాహమయ్యెను. ఈ దంపతులకే ప్రాత: సంస్మరణీయుడగు ఈశ్వరచంద్రవిద్యాసాగరుడు జన్మించెను.

ఠాకూర్‌దాసుని బాల్యమునందే యాతనితండ్రి సంసారము నందు విరక్తుడయి స్వదేశపరిత్యాగము చేసి తీర్థయాత్రలు చేయుచుండెను. కాన ఠాకూర్‌దాసుని తల్లియగు దుర్గాదేవి తన పుట్టినింటి కరుగవలసినదాయెను. అచ్చట నామెదు:ఖ మెంత మాత్రము తగ్గక, మీదుమిక్కిలి యన్నలయొక్కయు, వదినెలయొక్కయు బాధవిశేషమయ్యెను. కావున నామె యాగ్రామముననే యొకకుటీరము నిర్మించుకొని యొకవిధముగా కాలము గడుపుచుండెను. ఆమె రాత్రియంతయు దారమువడికి దాని నమ్మి తానును కొమారుడును భోజనము చేయుచుండిరి. బుద్ధిమంతుడగు ఠాకూర్‌దాసు, తల్లికష్టము చూడనోపక, కలకత్తా కరిగి యతికష్టముతో విద్య నభ్యసించెను. ఆయన త్వరగా స్వల్పవిద్య నేర్చి యల్పవేతనముగల యుద్యోగమును సంపాదించెను. ఆ దినములలో భోజనసామగ్రి చవుకగా దొరకుట వలన స్వల్పవేతనముగల యుద్యోగము దొరకినను ప్రజలానందించు చుండిరి. ఠాకుర్‌దాసునకు 8 రూపాయల వేతనముగల పని దొరకుట విని దుర్గాదేవి తన పర్ణకుటీరములో నానందోత్సవము చేసెను. వారి హితకాంక్షులందరా సమయమున మిగుల సంతసించిరి. తదనంతరము కొన్ని దినములకు రామజయుడు (విద్యాసాగరుని తాతవచ్చి) భార్య కష్టములనువిని మిగుల చింతనొంది పుత్రుని గనుగొని యాతని వివాహము జేసి మరల తీర్థాటనమున కరిగెను; గాని యాతడు పూర్వమువలె విశేష దినములు తీర్థాటనము చేయచునుండక త్వరలోనే యింటికి వచ్చెను. ఆయన వచ్చినందున కిట్లొక కారణమును జెప్పెదరు. ఒకదిన మాతడు కేదారపర్వతమున నిదిరించుచుండగా నొక మహాపురుషుడాయన స్వప్నమున నగుపడి ఇట్లనెను. "ఓ రామజయుడా! నీ వేల నీ కుటుంబమును విడిచి తిరిగెదవు? త్వరగా నీవు యింటి కరుగుము. మీ వంశమునందొక మహాపురుషుడు పుట్టగలడు. వాని దయాదాన విద్యాదిగుణములచే మీవంశము కీర్తిగాంచును. పరమేశ్వరునికి మీయందు విశేషదయగలదు." ఈ స్వప్నముజూచి రామజయుడు వీరసింహగ్రామమునకు వచ్చి చూచునప్పటికి ఠాకూర్ దాసు కలకత్తాలో నుద్యోగము చేయుచుండెను. అతని భార్యయగు భగవతీదేవి గర్భవతియయి యున్మాదముగలిగి యింటియొద్దనే యుండెను. రామజయుడు కోడలి పిచ్చిపోవుట కనేకౌషధములలును, మంతతంత్రములును చేసి చూచెను. గాని యందువలన నాపిచ్చి కుదరకుండెను. కాన తుదకొక జ్యోతిష్కుని బిలిచి యడుగగా నాజ్యోతిష్కుడు భగవతీదేవియొక్క జాతకమును ఆమెయవయవములును జూచి ఇట్లుచెప్పెనట. " ఈమె గర్భమునం దొకమహాపురుషుడు గలడు. ఆయనప్రభావము వలననే యీమె కిట్టియున్మాదావస్థగలిగెను. బ్రసవానంతర మీమె బాగగును. ఇప్పుడౌషధోపచారములు చేయుటవలన నేమియు బ్రయోజనములేదు." 1742 వ సంవత్సరము ఆశ్వయుజమాసమునందు సాక్షాత్‌దయయొక్క యపరావతారు డగు ఈశ్వరచంద్రుడు జన్మించెను. నీళాడిన పిదప భగవతీదేవికిగల యున్మాదము పోయెను.

భగవతీదేవి విశేషరూపవతి గాకున్నను, ఆమెముఖమునందలి తేజము విశేషహృద్యముగా నుండెను. వంగదేశము నందలి యాధునిక ప్రఖ్యాతకవి యగు రవీంద్రనాధుడు భగవతీదేవి రూపమునుగూర్చి యిట్లు వ్రాసెను - "భగవతీదేవి ముఖమునందలి గాంభీర్యము, నుదారతయు నెంత చూచినను తృప్తికలుగదు. అమె బుద్ధియొక్క ప్రసారతను దెలుపునున్నత లలాటము, సుదూర దర్శులును స్నేహవర్షులునునగు ఆ యతనేత్రములు, సరలనాసిక, దయాపూర్ణమైన యోష్ఠోదరము, దృడతా పూర్ణమైన చుబుకము - ఇట్లన్ని యవయవములు పొంకముగగలిగి మహిమ మయమైన యామె ముఖసౌందర్యము చూచువారి హృదయమున కధికముగా బూజ్యభావమును బుట్టించును. ఇందువలన (భగవతీదేవి ముఖమునందు దైవికకళ గలిగినందున) నే విద్యాసాగరుడు ఇతర పౌరాణిక దేవతల నేరిని బూజింపక తనతల్లినే దేవతయని పూజించుటకు గారణము కూడ వ్యక్తమగుచున్నది."

పేదలదు:ఖముల గనినభగవతీదేవికి మిగుల జాలిపుట్టి కన్నుల నీరు గారుచుండెను. ఆకొన్నవారికి నన్నమిడుటయు, రోగుల కౌషధోపచారము లొనర్చుటయు, త్రుష్ణాతురుల కుదకదానము చేయుటయు, చలికి బాధపడువారికి వస్త్రములొసంగుటయు లోనుగాగలవి భగవతీదేవియొక్క నిత్యవ్రతములు. ఎవ్వరికేని రోగమువచ్చినయెడల భగవతీదేవి చేత నౌషధములు తీసికొని వారిసేవచేయుటకు సిద్ధముగా నుండెను. ఎవ్వరేని అర్ధాభావము వలన బాధపడుచుండినచో, భగవతీదేవి తనచేత గలది కొంగున గట్టుకొని వారికి గుప్తముగా సహాయపడుటకు చనును; ఎవ్వరేని చలివలన బాధపడుచుండినచో భగవతీదేవి తనవెచ్చనిబట్ట వారి కిచ్చును! ఆమె బ్రాహ్మణ కులమునందు జన్మించినదైనను నీచకులీనుల మలమూత్రములు తీసి వారి కుపచారములు చేయుటలో నెన్నడును అసహ్యపడినదికాదు. ఇదియే నిజమయిన భూతదయ.

ఒకాకొక సమయమునందువిద్యాసాగరు డింటివారుకప్పుకొనుటకు గొన్నిఊర్ణ వస్త్రముల నింటికి బంపెను. అవి ఇంటికిరాగా జూచి తమపొరుగువారలు చలిచే బాధపడుచుండుట గని భగవతీదేవి వానిని పొరుగువారల కిచ్చి కొడుకున కిట్లు వ్రాసెను. "ఈశ్వరా! నీవు పంపినబట్టలు మనపొరుగువారలు చలిచే బాధపడుచుండగా వారి కిచ్చితిని, కాన మనయింటి కొరకు వేరేబట్టలు పంపవలయును." తల్లియొక్కభూతయకు సంతసించి విద్యాసాగరుడు 'మనయింటికొరకును బీదవారికొరకును మరియెన్నిబట్టలు కావలయునో వ్రాసినయెడల బంపెద' నని తల్లికి వ్రాసెను. తల్లి యెట్టిదో కుమారుడు నట్టివాడే యగును గదా?

విద్యాసాగరుని సహోదరుడగు దీనబంధు న్యాయరత్నమును మిగుల నుదారుడుగానే యుండెను. ఆయన వస్త్రహీనులను జూచినచో తన పైవస్త్రమునైనను వారి కిచ్చుచుండెను. పరుల దు:ఖమును గనిన నాతడా దు:ఖము తనకే కలిగినటుల విచారపడును. ఒక దినము దీనబంధుడు వీధిలో నొంటరిగానిలిచి యుండగా నొక బీదస్త్రీ చింపిరిబట్టను గట్టుకొని పోవుచుండెను. దాని గని దీనబంధుడు పైనున్న చిన్న వస్త్రమును, తాను కట్టు కొనిన కట్టుబట్టను దానికిచ్చివచ్చి తల్లికావృత్తాంతమునంతను చెప్పెను. అందు కామె మిగుల సంతసించి "నాయనా! నీవు బహు మంచిపని చేసితివి. నే నొకదినము రాత్రి నూలు వడికిన నీకు దోవతియగు" నని చెప్పెను. ఇట్టి బీదతనమునందును వారి యిల్లు అతిథి అభ్యాగతులకును, దు:ఖులకును సుఖప్రద మగు చుండెను. పిదప విద్యాసాగరుని బుద్ధికౌశలముచే లక్షాధీశులయినప్పు డెంత పరోపకారము చేసియుందురో చదువరులే గ్రహింపగలరు.

పండిత ఈశ్వరచంద్ర విద్యాసాగరులవారు వితంతూ ద్వాహములను గురించి యత్నముచేయుట భగవతీదేవిగారి ప్రేరణచేతనే యని చెప్పెదరు. ఇందును గురించి జనానాపత్రిక యందిట్లు వ్రాయబడి యున్నది"విద్యాసాగరుడు మహూన్నత పదవియందుండి తన సత్పాత్రదానమువలన వంగదేశమున కొక కష్టము రాకుండ గాపాడుచున్న సమయమునందొకనాడు శ్రీభగవతీదేవిని సందర్శించుటకై యొక బాలవితంతువు వచ్చియుండెను. ఆమె శ్రీభగవతీదేవిని దర్శించి సంభాషణవశమున దన నిర్బంధ వైధవ్యదశను గూర్చి దు:ఖముతో నించుక ముచ్చటించెను. ఆర్తత్రాణపరాయణత్వమును వహించిన భగవతీదేవి యామె కష్టమును వినగానే పట్టజాలని దు:ఖముతో దన కుమారునివద్దకు బారివచ్చి "కుమారా! నీవు సమస్తశాస్త్రములను జదివితివిగదా, ఆపన్నులయిన బాలవితంతువులను సంరక్షించు శాస్త్రమేదియును నీకు గానుపించ లేదా?" అని యడిగెను.

"విద్యాసాగరునికి దన తల్లియందతి గౌరవము గలదు. అతడు తన యౌన్నత్యము నంతను జిన్ననాడు తన కామె కరపిన సద్గుణపుంజమువలన నందియుండెను. దు:ఖముతోనట్లు తనతల్లి చెప్పిన మాటలను వినగానే విద్యాసాగరుడు తిరిగి శాస్త్రములను జదువుట కారంభించి తుట్టతుదకు బరాశర స్మృతి యందు స్త్రీ పునర్వివాహములు తప్పక జరుపబడవలెనని విధించు నీ క్రింది వాక్యమును గాంచెను."

    "నష్టే మృతే ప్రవ్రజతే క్లీబే చ పతితే పతౌ
    పంచస్వాపత్సు నారీణాం పతి రన్యో విధీయతే."

"తన కుమారుడు స్త్రీపునర్వివాహములను జేయ నారంభించిన తరువాత నాతనికి బహువిధముల ధైర్యము నొసంగుచు కుమారా! నీ వవలంబించిన మార్గమును విడువక పూనిన యీ మహాకార్యమును నిర్వహింపుము. నీ కెన్నికష్టములు వచ్చినను మేమెప్పుడును నిన్ను విడువక నీకు సహాయులమై యుండెదము. ఒకవేళ మేము నిన్ను విడిచిపెట్టినను నీవు నిరుత్సాహుడవు గాకుమా" యని యాతనికి బోధించుచు శ్రీభగవతీదేవి బాలవితంతువులపాలిటికి సత్యమయిన రక్షకురాలయి నిలిచెను.

పునర్వివాహము చేసికొనిన వధూవరులను ఆ కాలమునందు వారియాప్తులు తిరస్కారముగ జూచి, మిగుల బాధపెట్టు చుండిరి. ఆ యువతులను దనయొద్దకి బిలిచి భగవతీదేవి వారికి ననేక బుద్ధుల గరపి, బుజ్జగించి వారిని దనపొత్తున గూర్చుండబెట్టుకొని, భోజనముచేసి యాప్తుల తిరస్కారమువలన ఖిన్నులైన వారిని సంతోషపెట్టుచుండెను. ఇంటికి వచ్చిన అతిథిని తాను సన్మానించి పంపనిదినము భగవతీదేవికి మిగుల దు:ఖదినముగా నుండెను. తన శరీర మస్వస్థముగా నున్నను అతిథి కన్నము పెట్టించిగాని, యామె నిద్రించుచున్నది కాదు.

సివిలియన్ హరిసన్ దొరగారొకదినము వీరియింటికి విందారగింప వచ్చెను. అప్పుడు భగవతీదేవి తానే పాకముచేసి వడ్డించెను. భోజానానంతరము వారందరు మాటలాడుచుండ నాదొర భగవతీదేవిని జూచి 'మీయొద్ద చాల ధనమున్నదా' యని యడిగెను. అందుకామె కార్నేలియావలె తనకొమారుల జూపి వీరే నాధనమని చెప్పెను. ఆమెనుగని యాదొర విద్యాసాగరునితో 'నీ సాధ్వివలననే నీవింత సద్గుణవంతుడవయితివ'ని పలికెను. భగవతీదేవియొక్క సుగుణసంపదలగని యామె యందధిక పూజ్యభావము గలిగి యా యాంగ్లేయు డామెకు హిందూరీతిని ననుసరించి సాష్టాంగముగా నమస్కరించెను.

స్త్రీలయినను, పురుషులయినను, శ్రీమంతులయినను, బీదలయినను, కులీనులయినను, కులహీనులయినను, విద్వాంసులయినను, మూర్ఖులయినను, భేదభావములేక భగవతీదేవి యందరను సమానముగా జూచుచుండెను. ఈ సమభావము చేతనే యామె సకలజనులచే సకలదిక్కుల బూజింపబడు చుండెను.

భగవతీదేవిగారి దయకు మితిలేకయుండెను. పరుల దు:ఖముం గనిన నామెహృదయము కరగిపోవుచుండెను. ఆమె యతిథులకు, నభ్యాగతులకు, విద్యార్థులకు, రోగులకు సహాయము చేయుచు వీరసింహ మనుపల్లెలోనే వాసము చేయుచుండెను. ఒక సమయమునందు విద్యాసాగరు లామెను కలకత్తాకు దీసికొనివచ్చిరి. కలకత్తాలో వీరసింహములో జేసినట్టు పరోపకారము చేయుటకు వీలులేదని చూచి, యామె కుమారునితో బలికిన పలుకులు వినిన పాషాణహృదయులు గూడ దయామయులగుట వింతకాదు. ఆమె కుమారునితో నిట్లనెను. "నేను వీరసింహమునకు బోకుండిన మనయింట నారగించి విద్య నభ్యసించు విద్యార్థుల కెవరు భోజనము పెట్టగలరు? ఎండ వానలలో నడచి యలసివచ్చిన యతిథులకు నాశ్రయ మొసగువారెవరు? నిరాశ్రయమగు కుటుంబమునకు నాశ్రయ మొసంగువారెవరు? ఇట్లచ్చట ననాథులు కష్టపడుచుండగా నేనిచ్చట నెట్లు సుఖముగా నుండగలను? నన్నుత్వరగా వీరసింహమునకు బంపుము." విద్యాసాగరు లామె యభిప్రాయమును గనిపెట్టి దీనరక్షణార్థమై యామెను వీరసింహమునకు బంపిరి. మరియొకసారి యామెను ఈశ్వరచంద్రులు దమయొద్దకి దోడ్కొని వచ్చుటకు యత్నించిరి. కాని పరోపకారార్ధమై యామె యా పల్లెను విడిచినదికాదు.

స్వర్ణాలంకారములయందు భగవతీదేవి కెంతమాత్రము నిష్టము లేక యుండెను. "నగలు పెట్టుకొనిన నేమి ప్రయోజనము? ఒక దినము దొంగలు తీసికొనిపోగలరు. కాని యా ధనముతోనే సహాయహీనకుటుంబములకు, దరిద్రులగు విద్యార్థులకు సహాయముచేసిన నెంతయో యానందము కలుగును!" ఇట్లు భగవతీదేవి లోకుల కుపదేశించుచుండెను. ఒకసారి విద్యాసాగరుడు తల్లితో నిట్లనియె. "అమ్మా దేవిపూజ చేయుట మేలా? లేక యాధనముతోనే పరోపకారము చేయుట మేలా?" అందు కాపరోపకారపరాయణ "అదే ధనముతో దు:ఖితుల దు:ఖము నివారణమయ్యెడి యెడల బూజచేయుట కంటె దు:ఖితుల కిచ్చుటయే మేలు" అనెను. ఆహా! భూతదయ యనిన నిట్టిదియే కదా! ఈమె వార్ధక్యకాలమునందు కాశీవాసము చేసి యచ్చటనే కాలధర్మము నొందెను.


________