అబలా సచ్చరిత్ర రత్నమాల/రాణి సంయుక్త

రాణి సంయుక్త

12 వ శతాబ్దమునందు రాఠోడ్ వంశీయుడగు జయచంద్రుడుకనౌజ (కాన్యకుబ్జ) రాజ్యమును, చవ్హాణవంశొద్ధారకుడగు పృధివీరాజు డిల్లీరాజ్యమును పాలింపుచుండిరి. ఈయసామాన్య పరాక్రమవంతు లిరువురిలో సంయుక్త జయచంద్రునకు గూతురును, పృథివీరాజునకు భార్యయు నయ్యెను. కాన నా రెండువంశములును నామెవలన బవిత్రములయ్యె ననుటకు సందేహము లేదు.

జయచంద్రునకు సంయుక్త యొక్కతయే కూతురగుట వలన, జయచంద్రుడు సంయుక్త నెక్కువ గారాబముతో బెంచెను. సంయుక్త స్వభావమువలననే సద్గుణవతిగాన, బెరిగిన కొలదిని ననేకవిద్యల నేర్చి మిగుల నుతికెక్కెను. ఆమె సద్గుణములును లావణ్యమును గనిన ప్రజలందరు దమ జన్మము సార్ధకమయ్యెనని తలచి సంతసింపుచుండిరి. ఇట్లీమె కొన్నిదినములు బాల్యావస్థయందు గడపియౌవ్వనావస్థం దాల్చెను.

ఇట్లు యుక్తవయస్కురాలగు బిడ్డకు దగినవరు డెవడాయని జయచంద్రుడు చింతింపసాగెను. సంయుక్త రూప లావణ్యములకీర్తి సకలదిక్కులను వ్యాపించినందున ననేక రాజపుత్రులామెను దమ కిమ్మని కోరుచు వర్తమానము లంపిరి. డిల్లీ పతియగు పృథివీరాజామె రూపగుణములను విని యామెను నెటులయిన జేపట్ట నిశ్చయించెను. సంయుక్తయు ననేకపర్యాయములు పృథివీరాజు పరాక్రమములను విని రూపము చూచియున్నందువలన నాతనినే వరించెదనని మనంబున నిశ్చయించుకొనియెను. జయచంద్రుడు తన కూతునకు దగినవరుడు దొరకవలయునని స్వయంవరము చేయనెంచెను. పుత్రికా వివాహమునకు బూర్వము రాజసూయముచేయ నిశ్చయించి సకలదిక్కుల రాజులకును వర్తమానము లంపెను. జయచంద్రుడు పరాక్రమవంతు డగుటవలన నితర మాండలిక రాజులందరాయన పిలిచినదినమునకు వచ్చి కనోజనగరము నలంకరించిరి. పృథివీరాజుమాత్రము జయచంద్రునితోగల పూర్వవైరమువలన నాయుత్సవ మునకు రాకుండెను. అందునకు జయచంద్రుడు మిగుల కోపించి యాతనితో గల వైరము వలన, పృథివీరాజు ప్రతిమ నొకదానిని జేయించి, యాప్రతిమను ద్వారపాలకుని స్థలమునందుంచి తనపగ సాధించెను. యజ్ఞమువిధిప్రకారము జరిగినపిదప స్వయంవరోత్సవ మారంభ మయ్యెను. అప్పుడనేక దేశాధీశు లొకచోట నానందముగా గూడినందున కనౌజపట్టణము మిగుల నందముగా గానుపించెను.

రాజాజ్ఞప్రకారము మంత్రులు మండపము నలంకరించి రాజుల నందరిని వారి వారికి దగుస్థానముల గూర్చుండబెట్టిరి. అటుపిమ్మట సంయుక్తచేత బుష్పమాలను ధరియించి సఖీ సహితమయి యా మండపమునకు వచ్చెను. రాజకన్య సభకు రాగానే రాజపుత్రు లందరి చూపులునామెవైపునకే మరలెను. ప్రతిభూపతియు నామె తనను వరియింపవలెనని కోరుచుండెను. సంయుక్త మిగుల గంభీరదృష్టితో రాజలోకము నంత నొక్కసారి కలయజూచెను. తన కిస్టుడగు పృథివీ రాజచటికి రాలేదనియు, ఆయనను బరిహసించుట కాయన ప్రతిమనొక దానిని జేసి ద్వారమునందుంచిరనియు నామె కంతకుపూర్వమే తెలిసియుండెను. అందువలన నా బాల యొక గడియవరకే యోచించి, తుదకు దృడనిశ్చయురాలై, తిన్నగా నడిచి డిల్లీశ్వర ప్రతిమను సమీపించి యామూర్తికంఠమునందు బుష్పహారమును వేసెను. దాని గనినతోడనే సభయందంతట నొకటే కల్లోల మయ్యెను. జయచంద్రుడిట్టి యవమానమును సహింపజాలక కోపావేశపరవశుడై "దుష్టురాలగు దీనిని గారాగృహమునందుంచు"డని యాజ్ఞాపించెను. అంత రాజులందరు నిరాశనుబొంది తమతమ నగరములకు జనిరి. ఇదియే యీ దేశమున జరిగిన కడపటి స్వయంవరము.

ఈ సంగతి యంతయు విని పృథివీరాజు పరమానంద భరితుడయ్యెను. జయచంద్రుడు తనను బరచిన యవమానమును సంయుక్త తనయందు గనపరచిన ప్రేమయు నేకీభవించి తన్ను ద్వరపెట్ట పృథివీరాజు జయచంద్రునిపై యుద్ధయాత్ర వెడలెను. ఇట్లాయన శూరులగు యోధులతో గనోజిపట్టణము సమీపమున విడిసెను. అచటనున్న కాలముననే యొక రాత్రి మిగుల రహస్యముగా పృథివీరాజు సంయుక్తనుగలిసి గాంధర్వ విధిచే నామెను వరియించెను.

వీరి వివాహవార్త యొకరిద్దరు దాసీలకు దప్ప నితరుల కెంతమాత్రము దెలియదు, పృథివీరాజు వచ్చి తన గ్రామము బైట విడియుట విని యాతనినిబట్టి తెండని జయచంద్రుడు మూడువేల సైన్యము నంపెను. కహరకంఠీరుడను వాని ముందిడుకొని శత్రుసైన్యములు తమవైపునకు వచ్చుట గని పృథివీరాజును వారితోబోరుటకు సిద్ధముగా నుండెను. తదనంతర మారెండుసైన్యంబు లొండొంటిందాకి మిగుల ఘోరంబుగా బోరసాగెను. అందు పృథివీరాజు సేనానియగు ఆతతాయికిని, జయచంద్రుని సైన్యాధిపతియగు కహరకంఠీరునకును ద్వందయుద్ధంబు ప్రాప్తించెను. ఆ శూరు లిరువురును సింహనాదములు చేయుచు నొండొరులతో నెక్కుడు పంతంబులు పలుకుచు, నొకరినొకరు నొప్పించుచుండిరి. అంత గొంత సేపటికి భటులయొక్కయు, గుర్రములయొక్కయు, నేనుగుల యొక్కయు, దేహములనిండ కారు రక్తము ప్రవాహమయి పారదొడగెను. అట్టి సమయమున కహరకంఠీరుని రోషవేశ మధికమయినందున నాతడు తన రధంబు డిగ్గి ఆతతాయిని తన ఖడ్గమునకు బలియిచ్చి పృథివీరాజు కంఠము తెగవేయ నుంకించెను. కహరకంఠీరుని శౌర్యమునకోడి పృథివీరాజు బలంబులు చెదరి పారసాగెను. అట్టి సమయంబునందాకస్మికముగా నొక శౌర్యనిధి యచటికివచ్చి పృథివీరాజు కంఠముపైబడనున్న ఖడ్గమును దునియలుచేసి యాతని గాపాడెను. ఈ పరాక్రమ వంతుడెవడో యొక రాజపుత్రుడని చదువరులు భ్రమపడ వలదు. అట్లు తన సాహసమువలన పృథివీరాజును గాపాడినది. యాతని పత్నియు, జయచంద్రుని కూతురునగు సంయుక్తయే. ఆమె తన భర్తనుగలసి యాతనితో వెళ్ళవలయునని బహు ప్రయాసముతో గారాగృహమువెడలి యతి యోగ్యమైన సమయమున నా స్థలము ప్రవేశించెను. తా నెన్నడును సంగ్రామము జూడనిదైనను, ఆమెజంకక సమయసూచకత గలదియై తానును యుద్ధముచేసి తన భర్తప్రాణముల గాపాడెను.

సంయుక్త వచ్చిన పిదప పృథివీరాజు బలములు మరల చేరుకొని జయచంద్రుని సేనల నోడించెను. తదనంతరము పృథివీరాజు భార్యసహితుడయి డిల్లీనగరమున కరగెను. ఈ దంపతులిరువురును గొంతకాలమువరకు పరస్పరానురాగము కలవారయి ప్రజలను తమబిడ్డలవలె బాలింపుచుండిరి.

ఇచ్చట జయచంద్రుడు పృథివీరాజు తన సైన్యము నోడించి, తనకూతును గొనిపోవుటవలన సంతప్తహృదయుడయి పగతీర్చుకొన సమయము వేచియుండెను. ఇట్లీ దేశపురాజులలో నన్యోన్యద్వేషములు కలిగిన సమయమున 'శాహబుద్దీమహమ్మద్‌గోరీ' యను మహమ్మదీయుడు హిందూదేశముపై దండు వెడలెను. వాడిచటికి వచ్చి దేశమంతను మిగుల నాశము చేయసాగెను. అనేక దేవాలయముల బడగొట్టి, మునిజనుల నన్యాయంబుగా జంపియు, స్త్రీల పాతివ్రత్యంబుల జెరిచి వారిని తమ దాసులను చేసికొనియు, మహాక్రూరత్వమును జూపదొడగెను. వానిపాదము సోకిన చోటెల్లను నాశ మొందుచుండెను. కాన నట్టి వాని నోడించి పతివ్రతల పాతివ్రత్యమును, మఠమందిరములను గాపాడనెంచి పృథివీరాజు గోరీని శిక్షించ వెడలెను. అప్పుడు జయచంద్రు డొకడుదక్క నితరరాజులందరాతనికి దోడుపడిరి. కోపమే ప్రధానముగా గల జయచంద్రుడు దేశక్షేమముగోరి పృథివీరాజునకు దోడుపడకున్నను, దేశీయుల దురదృష్టమింకను ముదరనందున నప్పటికిమాత్రము గోరికి సాహాయుడు గాకుండెను.

పృథివీరాజు మహాశౌర్యముతో దిలావడియను యెడారియందు గోరీసైన్యముల పలుమారు నోడించెను. పృథివీరాజు పరాక్రమమున కోర్వజాలక తుదకు గోరీ బహుకష్టముతో పలాయితుడయ్యెను. పృథివీరాజును విజయానందముతో నితర సామంతులతో దననగరు బ్రవేశించెను.

పృథివీరాజున కయిన జయమువలన జయచంద్రున కధిక వ్యసనము గలిగి యాతని మనం బెప్పుడును పృథివీరాజు చెరుపునే కోరుచుండెను. అందువలన నాతడెట్టి నీచోపాయము వలన నయినను బృథివీరాజునకు జెరుపుచేయ నిశ్చయించెను. అందువలన నాతడు తన దూతనంపి పారిపోవుచున్న గోరీని మరల మనదేశమునకు గొనివచ్చెను. ఇట్లు రప్పించి యాకుత్సితుడు తా నతనికి దోడుపడుటయేగాక, యితర రాజులనేకులను నీకు దోడు తెత్తునని నమ్మిక దోపబలికి యాతనిని మరల పృథివీరాజు పైకి యుద్ధమునకు బురికొల్పెను.

జయచంద్రుని సహాయమువడసి మిగుల ధైర్యముతో గోరీ మరల డిల్లీనగరముపై దండువెడలెను. జయచంద్రుడు తా నన్నప్రకార మితరరాజుల ననేకులను దనవెంట దీసికొని యా తురష్కునికి దోడుపడెను. ఇట్లు చేసి పృథివీరాజున కిక జయము దొరకదని యా దీర్ఘక్రోధి సంతసింపుచుండెను. దుర్జనులు తమకార్య మీడేరుటవలన దేశమున కంతకును నష్టము కలుగునని తెలిసినను వెనుక దీయరుకదా? కాలిందీనదీతీరమునందు జయచంద్రుడు తనసేనలతో దిగి యొకదినము తన శిబిరంబులో గూర్చుండి రాబోవుస్థితిని దలచుకొని సంతోషింపుచుండెను. ఇంతలో నొక సేవకుడు వచ్చి తమ వైరిసైన్యములోనుండి యొకరాయబారి తమతో మాటలాడ వచ్చెననియు, దమ సెలవయినయెడల నాతని నిటకు దోడ్కొని వత్తుననియు జెప్పెను. అందు కాతడాపరిచారకునతో నీ వావలనేయుండి యాతనిని నావద్దికి బంపుమని చెప్పి తాను తన ఖడ్గము చేతగొని కూర్చుండెను.

అంత గొంతసేపటికి నొకతరుణు డచటికివచ్చి జయచంద్రునిపాదముల కెరగెను. ఆవచ్చినయోధుడు పురుషుడుగాక మన కథానాయికయగు సంయుక్తయే. కాన జయచంద్రుడు తనకొమార్తెను గుర్తించి నీ వేమికోరెదవని యడిగిన తోడనే యామె యిట్లనియె. "నాయనా! నేను తమయనుజ్ఞనుబొంది మనదేశమునకు శత్రువగు గోరీనీ జంపగోరి వచ్చితిని. ఈ సమయమునందు బెద్దల యాశీర్వచనము వడసి చనిన తప్పక జయముకలుగును" జయచంద్రుడు కూతుమాటలు విని కొంత తడ వేమియు దోచకుండి పిదప "వోసి స్వేచ్ఛాచారిణీ! ముందుజరుగబోవు ప్రజాక్షేమమున కంతకును నీవేకదా మూలమయినదానవు. పొమ్ము నీ విచటికివచ్చి నాక్రోధమును హెచ్చించితివేగాని వేరులాభములేదు" అని కోపముతో ననెను. అందుపై సంయుక్త మిగులవినయముతో "వోనాయనా! మీరు మీ జన్మభూమివైపించుక దృష్టిసారింపుడు. నిరాశ్రితురాండ్రగు ననేక స్త్రీల మానమును గాపాడుడు. మనమెంత భక్తితో గొలుచు విగ్రహముల నాశమునకు దోడుపడకుడు. మన స్వాతంత్రసుఖమును చెరుప బ్రయత్నించినయెడల పిదప విశేషదు:ఖము కలుగును." అని విన్నవించుకొనెను. ఇంతలో జయచంద్రుడు రోషారుణలోచనుడయి "నోరుమూసికొని వెళ్లు. నావద్ద నీవంటి దుష్టస్త్రీలు మాటలాడదగరు." అని ధిక్కరించెను. "అటులైన నాప్రార్ధన యంతయు వృధవోయనా?" యని యా కాంతాలలామ రౌద్రరూపము వహించి తండ్రివంక జూచి యిట్లనియె. "పూర్వులార్జించిన సత్కీర్తిని నాశముచేసి మీదుష్కీర్తిని శాశ్వత పరుచుటకు బూర్వమే నీ కుమార్తెనయిన నన్ని యుపకీర్తివినకుండ నేల చంపవైతివి? నీవు నాతండ్రివిగాన నేనింతగా జెప్పవచ్చితిని. కాని నీ యభిప్రాయ మెరిగిన పిదప స్వదేశద్రోహి కూతురనిపించుకొని బ్రతుకుటకంటె జావుమేలని తోచుచున్నది."

ఆడుసింగమువలె నెదిరించి మాటాడు కూతునకేమియు జెప్పజాలక జయచంద్రుడు మెల్లగా నావల కరిగి యశ్వము నెక్కి యా మ్లేచ్ఛసైన్యములోని కేగెను. ఇచట సంయుక్త తండ్రి లోపలకు వచ్చునని కొంతసేపెదురు చూచి యాతడు వచ్చు జాడగానక నిరాశతో మరలి తన పతి చెంతకేగెను. ఈ తడవ తమవైపున నల్పసైన్యమును, పగఱ వైపున నమిత సైన్యమును గలదు గాన, తన క పజయమే యగునని పృథ్వీరా జెరిగి యా సంగతి సంయుక్తకు దెలిపెను. ఆ దంపతు లిరువురును ఇసుమంతయు ధైర్యము విడువక నొకరి కొకరు తగు నీతుల నుపదేశింపుచు నుత్సాహయుతులై యుండిరి. వారిరువురి ఆలో చన ప్రకారము యుక్తమని తోచగా నామె డిల్లీకి ప్రయాణమయ్యెను. గమన సమయమునం దామె భర్తకు నమస్కరించి "ప్రాణేశ్వరా! తమరు క్షత్రియులు గాన మీ శస్త్రాస్త్రములను గాపాడుకొని యుద్ధమునకు సిద్ధమగుడు, క్షత్రియులు తమదేశముయొక్కయు, వంశముయొక్కయు ప్రతిష్ఠలకొరకు ప్రాణముల విడిచిన నది మృతి యనంబడదు. మనుజుడు జన్మించినందుకు ఫలముగా సత్కృత్యముల జేసి సత్కీర్తిని బొంది అమరుడు కావలయును. తమకు జయము దొరికిన మరల మనమిరువురము సుఖ మనుభవింతుము. లేనిపక్షమున నేనును తమతో స్వర్గసుఖ మనుభవించుటకు శీఘ్రముగనే వత్తును." అని ధీరోక్తులు పలికెను. అందుకు బృథివీరాజు తన భార్యను గౌగిలించుకొని "సతీమణీ! నా దేహములో బ్రాణము లుండునంతవరకు నేను శత్రువునకు వెన్నియ్యనని దృడముగా నమ్ముము. నా సైనికులును కీర్తికాములే గాన వారెప్పుడును పరాజయము బొంది మరల తమ ముఖము లితరులకు జూప నిశ్చయించరని నేను నమ్మెద"నని చెప్పెను. ఆ వాక్యముల విని సంయుక్త "స్వామీ! డిల్లీలోని స్త్రీలు తమ్ముదాము రక్షించుకొనుటకు నసమర్థురాండ్రు గాన, నేనిపు డచటి కరిగి వారి కందరకును ధైర్యము చెప్పెదను. నే నిచటనే యుండిన నా కాంతలేమియు దోచక యుండెదరు. ఏది యెట్లయినను మిమ్మును గెలిచి యా మ్లేచ్ఛుడు డిల్లీకి వచ్చెనా, వానికి రాజపుత్రస్త్రీ యొకతయయిన జీవముతో దొరకనేరదు." అని యామె డిల్లీకిబోయెను. అచట నామె మిగుల నియమముతో బరమేశ్వరుని తనభర్తకు విజయము నిమ్మని ప్ర్రార్థన జేయుచుండెను. ఆమె యుపదేశము విని యా నగరమునందలి యువతులంద రామె వలెనే డీల్లీశ్వరునకు విజయము కలుగవలయునని పర మేశ్వరు ననేకవిధముల వేడుకొనుచుండిరి.

తుద కొకదినమున నా సైన్యములు రెండును నొండొంటి దాక నా యుభయ సైన్యములలోని వీరులును దమతమ సంగ్రామ కౌశలములు మీర ఘోరంబుగా బోరదొడంగిరి. వారట్లు పోరుటచే నాకాశమంతయు ధూళి గ్రమ్మి, సూర్యుని మరుగుపరచెను. అంత గొంతవడికి నాధూళియడగి రక్తనదులు బారజొచ్చెను. పీనుగులపెంట లనేకములు పడెను. ఇట్టి రణరంగమునందు పృథివీరాజునకు నపజయము కలిగెను. కాని యాతని సైనికులలో శత్రువునకు శరణుజొచ్చినవాడేని, యుద్ధ భూమినుండి పారిపోయినవాడేని కానరాకుండెను. పృథివీరాజు గూడ నా యుద్ధమునందే మడిసెనని కొందరు చెప్పెదరు. గోరీ విజయుడయి పృథివీరాజును చెరబట్టి గ్రుడ్లు తీసివేసి యాతని పాదములకు మిక్కిలి బరువులయిన లోహపు బేడీలను వేసి కారాగృహమునం దుంచెననియు, నీసంగతి యంతయు విని పృథివీరాజు మంత్రియు, నతని చరిత్రలేఖకుడును, మహాకవియునగు చాందభట్టు గోరీయాస్థానమున కరిగి కొన్నిదినము లచట నుండి యాతని కృపకు బాత్రుడై పృథివీరాజును చూచుట కనుజ్ఞవడసెననియు, అట్లు సెలవంది కారాగృహమున కరిగి పృథివీరాజును పలుకరింపగా నాతడు కన్నులు లేకున్నను మాటనుగుర్తించి యా భట్టును కౌగిలించుకొనెననియు, అచట వారిరువురు నొకయుక్తివలన నా తురుష్కుని జంప నిశ్చయించు కొనిరనియు, అందుపై చాందుభట్టు గోరీయొద్దకి వెళ్లి ప్రసంగ రీత్యా పృథివీరాజు యొక్క బాణనైపుణ్యమును వర్ణింపుచు, నాతడిపుడు కన్నులు లేకున్నను శబ్దము జాడపట్టి సూటిగా భాణము వేయునని చెప్పగా, గోరీ యా విచిత్రమును గనుటకై యొక సభజేసి, యాసభకు పృథివీరాజును బిలిపించి యతనికి నతని విల్లు బాణములిచ్చి చమత్కార మేమయిన జూపుమని యాజ్ఞాపించెననియు, ఆమాట సూటినిబట్టి పృథివీరాజాతనిపై బాణమువేయ నాతడు (గోరీ) మృతినొందె ననియు, తదనంతరము చాందుభట్టు పృథివీరాజు లిరువురును దురకల చేబడక యా సభయందే యొకరినొకరు పొడుచుకొని జీవములను విడిచిరనియు, మరికొందరు చెప్పెదరు. పైని జెప్పబడిన శరసంధాన మహోత్సవమంతయు మనదేశముననే జరిగినదని యొకరును, తురకదేశమున జరిగెనని ఇంకొకరును వక్కాణించెదరు. వీనిలో నేది నిజమో మనము చెప్పజాలము.

గోరీకి జయముకలిగి, వాడు డిల్లీకి వచ్చిచున్న వాడనిన వార్త వినగానే, పట్టణములోని స్త్రీలందరితో సంయుక్త అగ్ని ప్రవేశము చేసెను. గోరీ డిల్లీకివచ్చి చూచునప్పటికి గ్రామమంతట భస్మరాసు లవిచ్ఛిన్నముగా గానవచ్చుచుండెను.


________