అబలా సచ్చరిత్ర రత్నమాల/మదిన సుభద్రమ్మ
మదిన సుభద్రమ్మ
ఈమె శ్రీ సర్ మహారాజా గోడే నారాయణ గజపతి రాయనింగారి మేనత్త. శతకములు రచియించిన స్త్రీలలో నీమె యగ్రగణ్యురాలని రావుబహదూరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు కవిచరిత్రమునందు వ్రాసియున్నారు. ఈమె తరిగొండ వెంగమాంబకు సమకాలీనురాలు. ఈమె శ్రీరామ దండకము, రఘునాయక శతకము, కేశవ శతకము, కృష్ణ శతకము, రాఘవరామ శతకము రచియించెను. ఈమె కవనధోరణిని దెలుపుటకయి యీమె రచితములని కవిచరిత్రలో వ్రాసిన రెండు పద్యముల నుందుదాహరించెదను.
ఉ. శ్రీరమణీకళత్ర సరసీరుహ నేత్ర జగత్పవిత్ర స
త్సారసబృందమిత్రసురసన్నుతిపాత్ర నరేంద్రపుత్ర శృం
గారసమగ్రగాత్ర జనకర్మవిదారణకృచ్చరిత్ర శ్రీ
నారదమౌనిగీతచరణా రఘునాయక దీనపోషకా.
ఉ. మన్ననదప్పియున్న యెడ మక్కువగల్గినవారి నేనియున్
దిన్నగ మందలించినను దెల్లముగామది నొవ్వకుండునే
యన్నకు ధార్తరాష్ట్రునకు నాదరమొప్ప హితోపదేశమి
ట్లెన్నగ జేసి యావిదురు డేమి ఫలంబును జెందె గేశవా!