అబలా సచ్చరిత్ర రత్నమాల/కృష్ణాకుమారి

కృష్ణాకుమారి

ఈ వీరబాల మేవాడదేశాధిపతి యగు మహారాణా భీమసింహుని కూతురు. ఈమె 1792 వ సంవత్సరమున మేవాడదేశపు రాజధాని యగు ఉదేపూరున జన్మించెను. జాత కర్మాదిసంస్కారములు జరిగినపిదప నాబాలకు గృష్ణయని నామకరణము చేసిరి. కృష్ణయం దామెజనని కధికప్రీతి యగుటచే నామెమిక్కిలి గారాబముతో బెరుగుచుండెను. కృష్ణాకుమారి అత్యంత రూపవతిగా నుండెను. ఆమె పెరిగినకొలదిని నామెయందలి యనేక సద్గుణములచే నామె విశేషకీర్తింగనెను. ఇట్లుండగా కొన్ని సంవత్సరముల కాబాల వివాహ యోగ్య యయ్యెను. కాన రాణిగారికి గూతు వివాహచింత విశేషమయ్యెను. ఆమెయొక్క యసమాన రూపమును మృదుమధుర భాషణములును నదివరకే దేశమంతటను వ్యాపించెను. కాన జనులామెను రాజస్థానమను కొలనిలో నీమె యపూర్వ పద్మమని పొగడచుండిరి.

ఇట్టి కన్యారత్నము నే వరునకు నియ్యవలయునని భీమ రాణా మిగుల విచార సాగరమున మునింగెను. ఆయన కిట్టి చింతగలుగుట కొక కారణముకలదు. ఆకాలమునం దా రజపుత స్థానమునంగల రాజు లందరిలో ఉదేపురపు రాణాలు శ్రేష్ట కులీనులుగ నెన్నబడుచుండిరి. తమకంటె నుచ్చవంశీకులకు గన్యనిచ్చిన సరి లేనియెడల రజపూతులతో మిగుల నవమాన కరముగా నుండును. కాన రాణాగారు సమానవంశీకుని వెదకుచుండిరి. కానియట్టి వరునకు విద్యాగుణములు సరిపడవయ్యెను. విద్యాగుణైశ్వర్యములు కలవరుని వెతకినచో వాడు కులీనుడు గాక పోవుచుండెను. ఇందువలన గన్య నెవ్వరి కిచ్చుటకును కొంతవడి నిశ్చయింపనేరక తుదకు మార్వాడదేశపు రాణాయగు భీమసింహునకు గన్య నియ్యనిశ్చయించెను. కాని ప్రారబ్ధవశమున నల్పకాలములోనే మార్వాడ భీమసింహుడు స్వర్గస్తుడయ్యెను.

తదనంతరము జయపురాధీశ్వరుడగు రాణాజయసింహుడు కృష్ణాకుమారిని తనకిమ్మని యడుగుట కొకదూత నంపెను. ఉదేపురాధీశ్వరుడును అందుకు సమ్మతించి కన్యను జయసింహున కిత్తునని చెప్పెను. ఇంతలో మార్వాడదేశపు సింహాసనము నెక్కిన రాణామానసింహుడు భీమసింగున కిట్లు చెప్పి పంపెను. "ఇదివర కీసింహాసనమున నున్నవానికి కన్యనిచ్చుటకు నిశ్చయించితిరి, విధివశమున నాతడు కాలధర్మము నొందెను. అయినను నీకన్య యీ సింహాసనమునకు వాగ్దత్తయయియున్నది. కాన నాకియ్యవలయును" రాణాభీమసింగుడు మార్వాడ రాణాదూతతో మీరాజునకు నాకూతు నియ్యనని స్పష్టముగా దెలియజెప్పి పంపెను. అందువలన మార్వాడ దేశమునకును మేవాడదేశమునకును వైరము సంప్రాప్తమాయెను. ఆ రెండుదేశముల యందు సంగ్రామ సన్నాహములు జరుగుచుండెను. ఆ సమయమునందు గ్వాలేరురాజగు సిందేజయపురాధీశ్వరునిపై మిగుల వైరము కలవాడయి భీమసింగున కిట్లు వర్తమానమంపెను. "కృష్ణాకుమారిని జయపురపురాణా కిచ్చిన యెడల నేను మానసింహునకు దోడుపోయి నీతో యుద్ధము చేయుదును" ఈ వార్తవిన్నంతమాత్రమున భీమసింహుడు తన నిశ్చయమును మరల్పకుండెను. తనమాటను ఉదేపూరు రాణా లక్ష్యపెట్టకుండుట గని సిందే మిగులకోపించి యుద్ధసన్నాహముతో బయలుదేరి యుదయపురమును సమీపించెను. సిందే ఉదయపుర ప్రాంతమున విడిసినపిదప కొన్నిదినములకు భీమసింగుడును సిందేయును నొక దేవాలయములో గలిసి యేమో యాలోచించి జయసింహునకు గన్యనియ్యనని భీమసింగు వర్తమానమంపెను. జయపురాధిపతి తనయాసలన్నియు నిరాశల లగుటవలన మిగుల కోపగించి మానసింహునితో యుద్ధము చేయుటకై సైన్యము సిద్ధపరుప నాజ్ఞాపించెను. మానసింహుడును యుద్ధమునకు కాలుద్రువ్వుచునే యుండెను. అతని శత్రువులు కొందరు లక్షయిరువదివేల సైన్యము పోగుచేసి జయసింహునకు సహాయులయిరి. అప్పుడారాజుల కిరువురకును పర్వతశిఖర మనుస్థలమున ఘోరసంగ్రామము జరిగెను. ఆ యుద్ధమునందు మానసింహుని సైనికులనేకులు జయసింహునితో గలియుటవలన మానసింహుడు యుద్ధమునుండి పలాయితు డయ్యెను. ఇట్లు పారిపోయి యాతడు యోధగడయను దుర్గములో దాగియుండెను. జయసింహునిసేన యోధగడను ముట్టడించి భేదింప దొడగెను. కాని యాదుర్గ మభేద్య మగుటచే వారు దానిని భేధింప నేరక మరలిపోయిరి. ఈయుద్ధము నందు జయసింహుని సైన్యము మిగుల నాశమొందెను. కాన జయపురాధీశ్వరుడు తనపురమునకు బారిపోయెను. మానసింహుని శత్రుడయిన రాజొకడు తనసైన్యములోని నవాబూమీర్ ఖానను మ్లేచ్ఛునిచే చంపబడెను. ఈవిశ్వాసఘాతకుడగు తురుష్కుడే పిదప ననేక యుక్తులచే నుదేపూరు రాణాకుముఖ్య స్నేహితు డయి అజితసింహుడను నాతనిని గృష్ణాకుమారి తండ్రికడ సేవకునిగా నుంచెను.

ఇంత సంగ్రామమయినను జయసింహ మానసింహుల కింకను యుద్ధమునందలి యిచ్ఛ తగ్గదయ్యెను. అందువలన వా రిరువురును దళములతోడ ఉదేపురమునకు వచ్చుచుండిరి. కాన నాసంగతివిని భీమసింహ రాణా మిగుల చింతతో నా యుభయులను సమాధాన పరచు నుపాయము విచారింపు చుండెను. ఆయన కేమియు దోచక అమీర్ ఖాను నేకాంతముగా బిలిచి యాలోచనయడిగెను. అప్పుడా దుష్టుడు కృష్ణాకుమారిని మానసింహున కిచ్చుటొండె, చంపుటయొండె యుత్తమమని చెప్పెను. అంతలో కృష్ణాకుమారిని చంపుటయే యుత్తమమని రాజునకు దోచెను. కాని యాపని చేయుట కాతని సేవకులలో నొకడును నొడంబడడయ్యెను. భీమసింగుడు ఒక సేవకునిం బిలిచి కొమార్తెను జంప నాజ్ఞాపించెను. అందు కాభృత్యుడు ప్రభువును తిరస్కరించి తానట్టిపనిని చేయనని నిశ్చయముగా జెప్పెను. తదనంతరము రాణాగారు యౌవనసింహుండను వానింబిలిచి యీ ఘోరకర్మ చేయుమని చెప్పెను. ఈ యౌవనసింహుం డట్టి కార్యము చయుటకు దనకిష్టము లేకున్నను రాజాజ్ఞకు వెరచి దాని కియ్యకొనెను. అంత నాతడు చేత ఖడ్గము ధరియించి యాకన్య నిద్రించు గృహమునకు జనెను. కాని యా నిద్రించు సౌందర్యరాశినిం గనినతోడనే యాతని చేతులాడక ఖడ్గము చేతినుండి జారి క్రిందబడ నాతడా కార్యమును మాని మిగుల దు:ఖముతో మరలిపోయెను. తదుపరి అమీర్‌ఖాను దుర్మంత్రము వెల్లడి కాగా రాజసతి దు:ఖమునకు మితము లేదయ్యెను.

రాజభవనమునం దంతటను దు:ఖమయముగా నున్నను కృష్ణాకుమారి ముఖమునం దెంతమాత్రమును మృత్యుభీతి కానరాదయ్యెను. ఆమె యెప్పటివలె సంతోషముగా నాడుచు పాడుచు జెలులకు నీతులను బోధింపుచు గాలము గడుపు చుండెను. నీ కూతురు విషప్రయోగమువలన జంపుమని రాణాగారికి అమీర్‌ఖా నాలోచన చెప్పెను. అట్టి నీచకృత్యము రాణాగారికి సమ్మతమగుటవలన నొక బంగారు గిన్నెలో విషముపోసి దాని నాయన బిడ్డకడకంపెను. దానిని కృష్ణాకుమారి సన్నిధికి దెచ్చిన సేవకుడి విషము మీ తండ్రి మీకొరకు బంపెను గాన దీనిని మీరు స్వీకరింపవలయునని చెప్పగా నాబాల తండ్రియాజ్ఞ శిరసావహించి యా విషపాత్ర నాభృత్యుని చేతినుండి తీసికొని పరమేశ్వరుని బ్రార్థించి తండ్రికి ధనాయుష్య సమృద్ధియగుంగాత యనియా విషము నామె త్రాగెను. విషప్రాశనానంతరమునందు సహిత మామె మరణభయము నొందక తన యిష్టదైవమును ప్రార్థింపుచుండెను. ఇంతలో నామెతల్లి శోకించుట విని యాబాల తల్లికిట్లు సమాధానము చెప్పెను. "అమ్మా! నీవేల శోకించెదవు? దు:ఖమెంత త్వరగా దగ్గిన నంత మంచిది. నేను క్షత్రియవీరుని బిడ్డనుగాన మరణమునకు వెఱవను. ఈ శరీరము పుట్టినప్పుడే చావు సిద్ధము. ఇక నా చావునకై వగచిన నేమి ఫలము." ఇట్టి వాక్యములచే దల్లికి సమాధానము చెప్పుచు నవ్వుచు నుండెనేకాని యాబాల యా విషముచే మృతిజెందదయ్యె. అంత రెండవభృత్యుడు మరియొకపాత్రలో విషము పోసికొనివచ్చి యామెచే త్రాగించెను. కాని యందు వలనను ఆమె మరణచిహ్నము కానరాదయ్యెను.

దాన నామె చావనందుకు సమరసమను నొక భయంకరమయిన విషమంపెను. దానిని త్రాగినవెంటనే యా కన్యారత్నముయొక్క పవిత్రచరితము ముగిసెను. కృష్ణకుమారి ధైర్యము, నిర్భయత్వము, సత్యశీలతయు, దేశముకొరకు దండ్రి కొరకు జూపిన యాత్మత్యాగమును మొదలగునవి యీ ప్రపంచమునందుండి యా నారిని నజరామరము చేయుచున్నవి.


_______