అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/సరసవాణి

సరసవాణి

ఈపండిత తనభర్తయగు మండన మిశ్రుఁడు శంకరాచార్యులవారితో వాదముచేసి యోడిపోఁగాఁ దా నాచార్యులతో వాదించెను. ఈమెకుఁగల యసమానపాండిత్యమును సౌందర్యమును గని లోకు లీమెను సరస్వతి యవతారమని తలఁచిరి. అందువలన వా రామెను ఉభయభారతి యని పిలుచు చుండిరి. (ఈమె యాదిశంకరుల వారితో సమకాలీనురాల యినందువలన శంకరులవారి కాలనిర్ణయమే యీమె కాలనిర్ణయమని వేరుగఁ జెప్పనక్కఱలేదు. ఆది శంకరులవారు క్రీ. శ. 7 వ శతాబ్దమునందుండిరని కొందఱును, 8 వ శతాబ్దమునందుండిరని కొందఱును, 9 వ శతాబ్దమునందుండిరని కొందఱును జెప్పుచున్నారు. కాని కొన్ని యాధారములవలన నాదిశంకరులవారు క్రీ. శ. 8 వ శతాబ్దాంతమునను 9 వ శతాబ్దాదిని నుండినట్లు పండితు లనేకులు నిర్ణయించియున్నారు.)

శోణనదితీరమునందుండు విష్ణు శర్మయను బ్రాహ్మణునకు సరసివాణి యొక్కతయె కూఁతురు. అందువలన నతఁడామెను కడుగారాబముతోఁ బెంచుచుండెను. తల్లిదండ్రు లామెకు సకలవిద్యలను నేర్పిరి, సాంఖ్య, పాతంజల, వేశేషిక, న్యాయమీమాంసా, వేదాంతములనెడి యాఱు శాస్త్రములును, వ్యాకరణాది షడ గములును, కావ్యనాటకములును, ఇతర విద్యలన్నియు నామె నేర్చెను. ఇందువలన లోకులామెను గని యద్భుతపడుచుండిరి.

ఇట్లు విద్యారూపగుణ సంపన్నయగు నాచిన్నది వివాహ యోగ్యయయ్యెను. అప్పుడామె గుణవంతుఁడును, సురూపవంతుఁడునునగు విశ్వరూపాపరనామము గలమండనమిశ్రుని ఖ్యాతిని బ్రాహ్మణులవలన వినెను. మండన మిశ్రుఁడును సరసవాణియొక్క సద్గుణములు వినెను. అందువలన వారికి నుభయులకును నొకరి నొకరుచూడ వలయునని యభిలాష జనించెను. కాని వారు తమతండ్రుల కాసంగతిఁ దెలుపుటకు సిగ్గుపడి తమలోఁ దామే కృశింపుచుండిరి.

ఇట్లు కొన్నిదినములు గడచినపిదప తమపిల్ల లిట్లు కృశించుట కేమికారణమోయని వారి జననీజనకులు చింతించి యొక దినమునందు దాని కారణమును చెప్పక తప్పదని వారిని వారి తండ్రులు బలవంతపఱుపఁగా వారు నిజమయిన కారణమును దెల్పినవారైరి.

అందుపై హిమమిత్రుఁడు సరసవాణి తండ్రియొద్దకి కన్యకను విచారింప నిద్దఱు బ్రాహ్మణుల నంపెను. వారికి విష్ణుశర్మ తగినమర్యాదలుచేసి యాగమనకారణ మడుగఁగా వారును తాము వచ్చినసంగతి నతని కెఱిఁగించి పిల్లను మండనున కిమ్మని యడిగిరి. అందున కతఁడు తనభార్య నడిగి నిశ్చయించి చెప్పెదనని వారితోఁజెప్పి యామెనడుగఁగా నాయువతి యిట్లనియె.

"ధనము, కులము, శీలముగల వానికిఁ బిల్ల నియ్యవలెనని శాస్త్రములయందును, వ్యవహారమునందును ప్రసిద్ధియే కదా? ఈపిల్లఁడు దూరముననుండువాఁడు. ఇతని కులశీలములు మనకుఁ దెలియవు. కనుక నిందునగుఱించి యేమి చెప్పఁగలను" అందు కతఁడు మండనమిశ్రుని విద్యాప్రభావమును బొగడి ధనమునకన్నను విద్యయే శ్రేష్ఠమనిచెప్పెను. అంత నాదంపతు లిరువురును కొమార్తెకా సంగతినిఁ దెలిపి యామెమనోభావము నెఱుఁగఁ దలఁచి యామె సన్నిధి కరిగి యాసంగతి నామె కెఱుకపఱచి నీ యభిప్రాయమేమని యడిగిరి. వారావార్త చెప్పినతోడనే యా బాల కపరిమితసంతోషము కలిగి యాసంతోషమున కామె మనసునం దిముడుటకుఁ జోటుచాలక రోమాంచరూపమున బయిటఁ బడెను. దానివలననే నామె యభిప్రాయమును వారెఱిఁగి యావచ్చిన బ్రాహ్మణులకుఁ దోడు తా మొకబ్రాహ్మణుని వరునిఁ జూచుటకును, లగ్ననిశ్చయము చేయుటకును బంపిరి. నాఁటికిఁ బదునాల్గవ దివసంబున దశమినాఁడు శుభచంద్రయుక్తమైన ముహూర్తమని వ్రాసి గణితమునందుఁ బ్రవీణయైన సరసవాణి తమబ్రాహ్మణుని చేతి కిచ్చెను.

అంత నాబ్రాహ్మణులు మువ్వురు కొన్ని దినములకు మండనునిగ్రామముఁ జేరి యతనితండ్రికి శుభ లేఖ నందిచ్చిరి. ఆయన దాని జదివికొని సంతసించి శుభదినమునందు బంధువర్గముతోఁ దరిపోయి కొమారుని వివాహము చేసెను.

కూఁతు రత్తవారింటి కరుగునపుడు సరసవాణి తల్లి దండ్రు లామె కిట్లు బోధించిరి. "ప్రియకుమారీ! నేఁటినుండియు నీకు నపూర్వమైనదశ ప్రాప్తమయినది. ఈసుస్థితికి యోగ్యమైనటుల నీవు ప్రవర్తింపుము. బాల్యమునందలి క్రీడలు విడువుము. ఏలయనఁగా అట్టి నీయాటలు మాకు సంతోష జనకములనటుల నితరులకుఁ గానేరవు. స్త్రీలు వివాహమున కన్నఁబూర్వము తల్లిదండ్రుల యాజ్ఞలో నుండవలయును. తదనంతరము వారికిఁ బతియేగతి. కనుక నీవు పతి యాజ్ఞలోనుండుము. ఇందువలన నీకు నుభయలోకములలోఁ గీర్తి కలుగును. పతికంటెను మొదటలేచి స్నానము చేయుము. అతఁడు భోజనము చేయనిది భోజనము చేయకుము పతి గ్రామాంతరము వెళ్ళినయెడల భూషణాదులను ధరియింపకుము. ఇటుల నరుంధత్యాది పతివ్రతలు నడచినటుల నడచుటయే నీకు భూషణము. పతి కోపగించినయెడల మాఱు మాటాడకుము. ఆయన కోపమునంతను నోర్చుకొనుము. ఇటులఁ జేసిన నతఁడు నీపైఁ గోపమును వదలి ప్రేమింపఁగలఁడు. శాంతితో సాటి యేదియును లేదుసుమా. పతి యింట లేకుండినప్పుడు నతిధులెవరయిన వచ్చినయెడల వారినిఁ దిన్నఁగా సన్మానించి యాదరించి పంపవలయును. అటులఁ జేయనిపక్షమున వారిలో నెవరయిన మహాత్ములుండినయెడలఁ గులదాహమగును. అత్త మామలను తల్లిదండ్రులవలెఁ జూడుము. బావమఱఁదులను నన్నదమ్ములవలెఁజూడుము. వీరికిఁ గోపము వచ్చినయెడల నీకును, నీభర్తకును నెంత యన్యోన్య ప్రేమముండినను మీలో భేదము పుట్టింతురు."

ఇట్లు వారు గూఁతునకు బుద్ధులుగఱపి యామె నత్తవారియింటి కనిపిరి. ఆభార్యాభర్తలు తమనగరమునకు నరిగి గేహస్థాశ్రమమును జక్కఁగా నడుపుచుండిరి. ఇట్లు కొన్ని సంవత్సరములు గడచినపిదప నీదంపతుల విద్యాప్రావీణ్యము లోకమంతటను వెల్లడియైనందున శంకరులవారు వీరితో వాదించి గెలుపొంద నెంచి యాగ్రామమునకు వచ్చి నీళ్లుగొనిపోవుచున్న యువతులను మండనమిశ్రునిగృహ మెచటనని యడుగఁగా వా రిట్లు చెప్పిరి : _

"ఎవని ద్వారమునందుఁ బంజరమున నుంచఁబడిన ఆఁడు చిలుక వేదము స్వత:ప్రమాణమా పరత:ప్రమాణమా యని చర్చించుచుండునో యాగృహమే మండనమిశ్రునిదని దెలిసికొనుము."

"పూర్వాకృత కర్మవలన, మన మిప్పుడు చేయుకార్యమునకు, ఫలము కలుగునా లేక పురుషప్రయత్నము వలన ఫలము కలుగునా యని యేద్వారములోఁ బంజరస్థలయిన శుకయువతులు వాదించుచుండునో యదేగృహము మండన పండితునిది యనుకొనుము."

"జగత్తు నిత్యయా యనిత్యమా యని యాడురామ చిలుక లేగృహముయొక్క సింహద్వారమునఁ బంజరమందు ముచ్చటించుచుండునో యాగృహమే మండనునిది యనుకొనుము."

వారట్లు చెప్పఁగా శంకరులవా రచటి కరిగి మండనునిచే వాదభిక్షగొనిరి. తరువాత సమస్తవిద్యాశారద యయిన సరసవాణిని సభకు నధిపతినిగా నేర్పఱచివారు వాదవివాదమునకు నుద్యుక్తులయిరి.

ఇట్లు కొన్నిదినములు వాదము జరిగినపిదప మండనుఁడు వాదమునందోడుట తటస్థ మయ్యెను. అప్పు డాతని నను గ్రహించి శంకరు లతనికి సన్యాస మియ్యదలఁపఁగా సరసవాణి శంకరులతో నిట్లనియె.

"ఓయతిశ్రేష్ఠ! నీయుద్దేశమునాకుఁదెలిసినది. నీవునాపతిని గెలిచితివిగాన నతనిని నీశిష్యునిగాఁ బరిగ్రహించుట యుక్తమే. కాని నీ వింకను నాతనిని సంపూర్ణముగా నోడించలేదు. ఆతని యర్ధశరీరిణినగు నన్ను గెలిచినగదా మీగెలుపు పూర్ణమగును. మీరు గొప్పపురుషులు లయినప్పటికిని మీతో వాదము చేయవలయునని నాకుచాల నుత్కంఠ యున్నది."

శంకరులు - "వాదవివాదమునం దుత్కంఠఁ గలదని నీవు చెప్పితివి కాని నీతో వాదము కానేరదు. గొప్పవారు స్త్రీలతో వాదము చేయరు."

సరసవాణి - "స్వమతమును స్థాపింపఁ దలఁచువారు తమమతమును ఖండించువారు పురుషులయినను, స్త్రీలయినను వారితో వాదము చేసి వారిని పరాజితులను జేయుట యత్యంతావశ్యకము. ఇందువలననే పూర్వము యాజ్ఞవల్కులవారు గార్గితోను, జనకుఁడు అబలయైన సులభతోను వాదము సల్పిరి. వారు యశోనిధులు కాకపోయిరా!"

ఇట్లు సరసవాణి చెప్పినయుక్తివాదమువలనను, పూర్వోదాహరణములవలనను కుంఠితులయి శంకరులవారుసభ యందు నామెతో వాదము చేయుట కొప్పుకొనిరి.

పరస్పర జయోత్సుకు లయినట్టియు తమబుద్ధిచాతుర్యమువలన రచియించిన శబ్దమనెడి యమృతముచే వినువారిని విస్మయ మొందించునట్టియు నాసరసవాణి శంకరులకు నత్యద్భుతముగా వాదము జరిగెను. ఇ ట్లహోరాత్రములు పదియేడుదినముల వఱకును అసమాన విద్యావంతులగు సరసవాణీ శంకరులకు ఘోరమయిన వాదము జరిగి తుదకు సరసవాణి యడిగినప్రశ్న కుత్తరము చెప్పఁజాలక శంకరు లామెను నాఱునెలల వ్యవధి యడఁగిపోయి మఱికొంతవిద్య నభ్యసించి మరలవచ్చి యామెకు సమాధానము చెప్పెను. అందుపై మండనమిశ్రుఁడు సన్యసింపఁగా సరసవాణి దివి కరిగెను.

ఈసరసవాణి చరితమువలన నామె కాలమునందలి హిందూసుందరులు గొప్పవిద్య నభ్యసింపుచుండి రనియును, వారు గొప్పపండితులతో సహితము వాదవివాదములు చేయుచుండిరనియును దెలియఁబడుచున్నది. ఆకాలమునందు నో రెఱుఁగని పసిపాపలకుఁ దల్లిదండ్రులు తమసమ్మతితో వివాహములు చేయు నాచారములేక కన్యావరులు యుక్తవ యస్కులయినపిదప వారి యనుమతి ననుసరించియే వివాహములు జరుగుచుండె ననియును స్పష్టముగాఁ దెలియుచున్నది. అప్పటి సంఘస్థితినిఁబట్టి చూడఁగా నప్పటిస్త్రీ లత్యంతోచ్చదశయందుండినట్టు తేలుచున్నది. కాని ఆకాలమునం దట్టియుచ్చపదవియం దుండిన హిందూసుందరులు ప్రస్తుత మత్యంత హీనస్థితికి వచ్చి తమదుర్దశనే తెలిసికోఁజాలనంతటి యజ్ఞానిను లగుట మిగుల దు:ఖకరము. పూర్వకాలము నందలి స్త్రీలకును, ఈ కాలపు స్త్రీలకును గలతారతమ్యము సతీహితబోధినీ పత్రికోక్తముగా నిం దుదాహరించి యీ చరితము ముగించెదను.

"ఈభరతఖండమునం దిప్పుడున్న స్త్రీలస్థితికిని పూర్వకాలమునం దుండిన స్త్రీలస్థితికిని మిక్కిలి వ్యత్యాసము గలదు. పూర్వకాలమునందలి సుందరులు విద్యలయందును, కళలయందును, పాండిత్యము కలవారయి పురుషుల కుపదేశము చేయఁదగినంత మంచిదశయందుఁగూడ నుండుచువచ్చిరి. - వేదమునందు వర్ణింపఁబడిన గార్గి, మైత్రేయి మొదలయినవారినే యిందుకు నిదర్శనముగాఁ జెప్పవచ్చును; ఆకాలమునందలి స్త్రీలు వేద వేదార్థము లెఱిఁగినవారని చూపుటకు శకుంతల మొదలయినవారిని దృష్టాంతముగాఁ గొనవచ్చును; యజ్ఞాదులయందును, వివాహాదుల యందును స్త్రీలు పఠింపవలసిన మంత్రము లుండుటయె మనపూర్వులు భాషాపాండిత్యము కలవారయి మంత్రార్థముల నెఱిఁగియుండవలెనని యుద్దేశించి నట్లు స్పష్టమగుచున్నది. ఆకాలమునందు స్త్రీలుపురుషులవలెనే గౌరవింపఁ బడుచుండిరిగాని యిప్పటివలె గదులలో మూసిపెట్టఁ బడుచుండలేదు. వారి కట్టిస్వాతంత్ర్యములు పూర్వకాలమునందుఁ గలిగి యున్నవని చూపుటకు సీత మొదలగు క్షత్రియ స్త్రీలు సహితము భర్తలతో వచ్చి సభలలో సింహాసనములమీఁదఁ గూరుచుండుచు వచ్చిన వార్తను సూచించుటకంటె విశేషమేమియుఁ జెప్పనక్కఱలేదు. ఇవియవి యని వేఱుగఁ జెప్పనేల? ఆకాలమునందలి స్త్రీలకుండవలసిన స్వాతంత్ర్యముల నన్నిటిని వారు గలిగియుండిరనుటకు సందేహము లేదు. వారి కప్పుడున్న విద్యాప్రభావమునుబట్టివా రట్టిగౌరవములకును స్వాతంత్ర్యములకును నర్హు రాండ్రయి యుండిరి. మనపూర్వులు గృహిణిధర్మములను వివరించుచు భర్తకుభార్య మంత్రివలె నాలోచనచెప్పవలెననియు, తల్లివలె నుపచారము చేయవలె రనియు, గురువువలెహితోపదేశము చేయవలెననియు, వైద్యునివలె శరీరారోగ్యమును కాపాడవలయు ననియు చెప్పియున్నారు.

ఇటువంటిపనులను యుక్తముగా నిర్వహింపఁ గలుగుటకు స్త్రీ లెంతటి విద్యావతులుగా నుండవలయునో చెప్పుటకంటె నెవరికి వారూహించుకొనుటయే సులభముగా నుండును. జ్ఞానమూలమయిన విద్యానిక్షేప మేహేతువుచేతనో క్రమక్రమముగా మనదేశపు స్త్రీలనువిడిచిపోయినది. ఆవిద్యాధనముతోనే వారికిఁగల సమస్తలాభములును, సమస్త స్వాతంత్ర్యములును క్రమక్రమముగా నశించుచు వచ్చినవి. కడపటస్త్రీలకు విద్య కావలయునా యని సంశయపడునంత దురవస్థ మనదేశమున కిప్పుడు పట్టినది. స్త్రీలు విద్యాహీనురాండ్రగుటచే మూఢత్వములో మునిఁగియుండి సంసారభారమును చక్కఁగా నిర్వహించుటలో మునుపటివలె పురుషులకు సహాయురాండ్రుకాఁ జాలకున్నారు. అందుచేత పురుషులకు స్త్రీలయందు పూర్వకాలమునందుండెడు గౌరవమంతయు తగ్గిపోయినది. ఏవిషయమునం దయినను స్త్రీల నాలోచన యడుగుటయే యనర్థదాయకమని సామాన్యముగా పురుషు లిప్పుడు భావించుచున్నారు. అందుచేత పురుషు లనేకులు స్త్రీలయొక్క యభిప్రాయమునుగాని అంగీకారమునుగాని పొందకయే వారిని వివాహమను మిషమీఁద నంగహీనులకును, వృద్ధులకునుగూడఁ గట్టిపెట్టుచున్నారు; మానవదేహమున కలంకారమయిన విద్యాభూషణము వారికి లేకుండఁ జేసిలోహపు నగలనుమాత్రము పెట్టి తమవేడుక నిమిత్తమయి వారిని తోలుబొమ్మలవలెఁ జేయుచున్నారు; వారిని గృహ యజమానురాండ్రనుగాఁ జూడక తమయుపచానము నిమిత్తమయి దాసులనుగా చేయుచున్నారు. పురుషులు స్త్రీలవిషయమునఁ జేసిన యిట్టియన్యాయము వలన స్త్రీలను మూఢురా డ్రనుగాఁ జేసి చెడఁగొట్టుటయేకాక తామును వారి తోడిపాటుగా మూఢశిరోమణులయి చెడిపోవుచున్నారు. అందుచేత పురుషులలోఁగూడ నిజమయిన యీశ్వరభక్తియు సద్వర్తనమును బోయి మూఢభక్తియు, నీతిరాహిత్యమును వర్ధిల్లుచున్నవి. దానినిఁబట్టి నిజమయిన సౌఖ్యమును సంతోషమును లేక యనేకులు భూతల స్వర్గముగా నుండవలసిన గృహము మహారణ్యమువలె నుగుచున్నది. ఏయింటఁ జూచినను నైక మత్యమునకు మాఱుగా కలహములును, మనస్తాపములును పెరుగుచున్నవి. ఈస్థితియంతయు పురుషుల లోపమువలనను స్వప్రయోజన పరత్వమువలనను గలుగుచున్నదె కాని స్త్రీలదోషమువలన నణుమాత్రమును గాదు. ఏకాలము నందును ఏదేశమునందును తమస్త్రీలను మంచిదశకు తీసికొనిరాక తాము బాగుపడిన పురుషులులేరు, తాము బాగుపడఁ దలఁచిన పక్షమున ముందుగా తమ స్త్రీలను బాగుచేయవలెను; స్త్రీల బాగే పురుషుల బాగు కాఁబట్టి పురుషులు తమయోగక్షేమాభివృద్ధి నిమిత్తమే మూఢు రాండ్రయినయిప్పటి స్త్రీలను తొంటి యుత్తమదశకు మరలఁ దీసికొనివచ్చుటకై ప్రయత్నింపవలెను. స్త్రీల యభివృద్ధి నిమిత్తమయి యక్కడక్కడ నుత్తమపురుషులు చేయు ప్రయత్నములకు మూఢతాపిశాచావేశముచేత స్త్రీలే ప్రతిబంధకారిణు లగుచున్నారు. ఇంటివద్ద స్త్రీల సహాయ మున్నంగాని కులాచార మతాచార విషయములయందు పూర్వాచారములకు విరుద్ధములైననూతన సదాచారము నెలకొలుపుట పురుషులకు సాధ్యముకాదు. కాఁబట్టి పురుషులు తమస్త్రీలనుమూఢదశయందుంచియే దేశమున కేమో మహోపకారమును చేయుదుమన్న దురహంకారము విడిచి వారితోడ్పాటును బొందియే సత్కార్యములను జేయఁ జూడవలెను. స్త్రీల సహాయ మున్నపుడే పురుషులకు విజయము గలిగిలోకమునకు సత్యమైన యుపకారము కలుగును. సద్విషయములలో స్త్రీల తోడ్పాటును పొందఁ దలఁచిన పక్షమున ముందుగా వారి నాశ్రయించి యున్న మూఢతాపిశాచము తొలఁగునట్లుగా వారిని విద్యావతులను గాను, వివేకు రాండ్రనుగాను జేసిమనకు సరియైన తోడ్పాటు చేయుటకు వారిని శక్తు రాండ్రను జేయవలెను."