అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/విరాబాయి

విరాబాయి.

                  సంగ్రామే సుభటేంద్రాణాం కవీనాం కవిమండలే
                  దీప్తిర్వా దీప్తిహానిర్వా ముహుర్తాదేవ జాయతే. [1]

విరాబాయి చితూరు సంస్థానాధీశ్వరునిభార్య. ఈమె అక్బరుబాదుషాకాలమునం దుండిన ట్లితిహాసమువలనఁ దెలియుచున్నది. కాని యీమె జన్మమరణ సంవత్సరములును, జననీ జనకుల నామములును దెలియు మార్గ మెందును గానరాదు.

విరాబాయి స్వశౌర్యమువలన అక్బరు నోడించి తనభర్తను విడిపించెను. అక్బరుబాదుషా చితూరిపై రెండుపర్యాయములు దండెత్తినను ఫేరిస్తాయను ఇతిహాసకారుఁడు వ్రాసిన గ్రంథమునం దొకసారి దండువెడలుటయే వర్ణింపఁబడి యున్నది. స్వజాతీయుఁ డగు బాదుషాయొక్క పరాభవము నాతఁ డెట్లు వ్రాయఁ గలఁడు? ఒకానొకరజపూతస్త్రీచే నోడింపఁబడి పలాయితుఁ డైనందున బాదుషాకీర్తికి సంభవించిన కలంక మగుపడకుండుటకయి తురుష్కులైన యితిహాసకారు లెవ్వరును చరిత్రములలో నీసంగతి వ్రాయనేలేదు. కాని యాసమయ మునందు చితూరుదరబారునం దున్న వారప్పటి యుద్ధమును చక్కఁగా వర్ణించియున్నారు.

అక్బరుబాదుషా తనయమితసైన్యముతో చితూరుపై దండు వెడలినప్పు డచటనుదయసింగుఁ డనురాజు రాజ్యముఁ జేయుచుండెను. ఉదయసింగు రాణా యంతటి పిఱికిరాజపుత్రుఁడు మఱియొకఁ డుండఁడు. అక్బరుబాదుషా దండెత్తివచ్చినవార్త విని రాణాగారికి భయమువలన దేహ కంప మెత్తెను. కాన ఆయన విజయు లగుతురుష్కు సేనలతోడఁ బోర సాహసింప లేఁడయ్యె. అందుపై నాతని శూరులగు సరదార్లందఱు కుంభరాణా మొదలగు నాతని పూర్వుల ప్రతాపమునుఁ దెలిపి యుద్ధమునకుఁ బురికొల్పసాగిరి. కాని యతఁడు యుద్ధమునకు వెడలఁ డయ్యెను. రాణా సంగ్రామమునకు వెఱచుటఁ గని యాతని సరదార్లు మిగుల నాగ్రహించి "మీరు శత్రువుల నెదిరించి యుద్ధము చేయకుండినయెడల మిమ్మును రాజ్యభ్రష్టులను జేయుదుము" అనిరి.

ఇట్లందఱు నేకతీరుగాఁ జెప్పినందువలన విధిలేక భయముచే దేహము వడఁక నాయధైర్యశిరోమణి వీరులగు తనసైనికులతో యుద్ధభూమిని సమీపించెను. కానిసాగరమువలె నలుగడల నిండియున్న యవనసైన్యములంగని భీతిచేఁ గొంతవడి నేమియుఁ దోఁచక నిలుచుండెను. తదనంతర మెటులనో యారాజు తనసైన్యములకు యుద్ధమున కనుజ్ఞయిచ్చెను. రజపూత శూరసైనికు లందఱు మిగుల శౌర్యముతోడఁ బెనఁగఁ జొచ్చిరి. వారు జయకాంక్షవలన నెంతపోరినను ముఖ్య నాయకుని యధైర్యమువలనను, పరబలాధిక్యమువలనను వారికి జయము క లుగుమార్గము కాన రాకుండెను. చితూరుకొఱ కాశూరు లెంతశౌర్యము గనఁబఱచినను అదియంతయు నిష్ఫలమై ఉదయసింహునకుఁ బరాభవము కలిగెను. అక్బరుబాదుషా తత్క్షణమే యాపిఱికిరాజును బట్టిచెఱలో నుంచెను. అందుపైఁ జేయునది లేక రజపూతవీరులు గ్రామమునకుఁ దిరిగిపోయిరి. వారిలో కొందఱు తమయిండ్ల కరుగఁగా వారిస్త్రీలు పరాభవము నొందివచ్చినభర్తలను, పుత్రులను సోదరులను లోపలికి రాకుండ తలుపులు మూసి వారిని తిరస్కరింపుచు నిట్లనిరి. "రజపూత కులమునందు మీ రేల జన్మించితిరి? సిగ్గులేక మీ మొగములు మరల మాకుఁ జూపకుఁడు. సంగ్రామమరణముగాని, జయముగాని దొరకిననే మీకు కీర్తియు, యసమును కలుగును."

ఉదయసింహుని తురుష్కులు చెఱఁబెట్టిరని తెలియఁగా రాజభవనమునం దంతట నెటుచూచినను దు:ఖమయముగానే యుండెను. అప్పుడు రజపూతు వీరులందఱు సభచేసి "ఉదయసింహమహారాజుగారి నెటుల విడిపించనగు? శత్రువుల నోడించుటయెట్లు" అని చింతింపసాగిరి. ఇటుల వా రనేక తీరుల విచారించి, తోఁచక చింతాక్రాంతులై కొంతవడి యూఱకుండిరి. ఆసమయమునం దాపట్టణమంతయు మిగుల నుదాసీనముగానుండెను. కాని మరల క్షణకాలములో నొక యువతి వారి నానందసాగరమునం దోలలాడించెను. ఆస్త్రీ ఉదయసింహునిపత్ని యగువిరాబాయియే! నాభర్తను మ్లేచ్ఛులు కైదుచేసిరి. రజపూతు లోడిపోయిరి, చితూరిఁక తురకల యధీనమగును. మనమందఱమా నీచుల స్వాధీనమగుదుమ"ను నట్టివిచారము లనేకము లామె మనంబున నుద్భవింపసాగెను. రాజభవనమునందు నిరుపయోగములై పడియున్న యనేకశస్త్రములామె కంటఁబడఁగా నామెయందు నడఁగియున్న శౌర్యాగ్ని ప్రజ్వలింపసాగెను. అంత నామె నిలువక, యుద్ధమున కనుకూలమగు పురుషవేషముఁ దాల్చి యనేకాస్త్ర శస్త్రములను ధరియించి కాళికాదేవి ప్రత్యక్షమైనది యనినట్టుగా రాజపుత్రుల సభలోకిఁ బ్రవేశించెను.

సుకుమారమగు మేనితోఁబురుష వేషధారిణియు, శస్త్రధారిణియునై వచ్చినవిరాబాయినిఁ గనినతోడనే యచటి రజపూతువీరు లాశ్చర్యమగ్నమానసు లయిరి. స్వాతంత్ర్యేచ్ఛయు, స్వధర్మాభిమానమును హృదయమునం దుండుటవలన నామె కాంతి మిగులప్రజ్వరిల్లెను. ఆమె మిగుల రోషముతో నచటఁ గూడియున్న రాజపుత్రులతోనిట్లనెను, "శూరాగ్రేసరులగు రజపూతులారా! మీరిట్లధోముఖులై చింతిల్లుచు నెవరి కొఱకు నిరీక్షింపుచున్నారు. మాయందలి శౌర్యధైర్యాది క్షత్రియగుణము లెటుపోయెను? చితూరుసంస్థాన మిపుడే పౌరుషహీనమయ్యెనా? అచటి రజపూతవీరులందఱు కేవలము శ్యాసోచ్ఛ్వాసము గలపురుగులై పోయిరా? వీరమాత యగు భారతవర్షము నేఁడే నిస్తేజమై పోయెనా? మీరు శూరులవంశములయందేల జన్మించితిరి? అటుల జన్మించినవారు వైరులకు వెన్నిచ్చి యేల పాఱివచ్చితిరి? ఇప్పు డింద ఱేకీభవించి యేమిచింతించెదరు? చితూరు నలంకరించువాఁడును, మనప్రాణసమానుఁడు నగుమహారాజునుశత్రువులు కారాగృహబద్ధుని జేయఁగా స్త్రీలవలె చేతులకు గాజులు తొడుగుకొని యింట నుండుట కేల సిగ్గుపడకున్నారు? నేనిట్లు బాహాటముగా మి మ్ము నవమాన పఱుపుచుండఁగా మీరు విని యెట్లు సహించెదరు? ఇంతకంటె యుద్ధముచేసి వైరులచేఁ జంపఁ బడుట సర్వోత్తమముకాదా? శూరాగ్రేసరులగు సరదారులారా! మీరిటులనుపేక్షచేయకుఁడు ! మీకుఁ గలిగిన పౌరుషహీనతయను కళంకమును సంపూర్ణముగాఁ గడుగుఁడు. మీకుఁగల శౌర్యధైర్యాదిగుణముల నగుపఱుప నిదియే సమయము. లెండు నడువుఁడు. మఱియొకరిరాకకు నిరీక్షింప నేల ? ఒరలనుండి మీ మీఖడ్గములను తీయుఁడు. "జయహర ! జయమహాదేవ," యను రణఘోష మొనర్పుఁడు. తీవ్రగతినరిగి సంగ్రామరంగమునందు మీమీప్రతాపములను గనుపఱుపుఁడు! నేనిదే యుద్ధమునకుఁ బోవుచున్న దానను."

ఇట్లని యామె యొకగుఱ్ఱము నెక్కెను. అప్పుడు రజపూతులందఱు తమయౌదాసీన్యమును వదలి యుద్ధసన్నద్ధులైరి. మేకలుగానున్న యావీరులు విరాబాయిప్రోత్సాహముచే శార్దూలములుగా మాఱిరి ! అందువలన నాభీమపరాక్రములందఱును నేక వాక్యతగా జయఘోష మొనర్చిరి. అపుడు వాఱందఱు "యుద్ధమునందు శత్రువులను జంపెదము లేక వారిచేఁ జచ్చెదమేకాని పగఱకు వెన్నియ్యమ"ని ప్రమాణములు చేసిరి.

విరాబాయియు వారియావేశమును, దృఢనిశ్చయమును గని విశేష ప్రోత్సాహముగలదియై యుద్ధమునకు వెడలెను. ఆమె తనసైన్యముతో నాకస్మికముగా నాఁకొన్నయాఁడుసింగమువలె శత్రుసైన్యములపై నకస్మాత్తుగాఁబడెను. అందువలన విజయానంద మునం దోలలాడుచుండిన యగ్బరుసైన్య మీ ప్రళయమున కోర్వఁజాలక నలుదిక్కులకుఁ బాఱదొడఁగెను. వారినిఁ బోనియ్యక పట్టుకొని విరాబాయిసైనికులు కాలాంత రుద్రులభంగి యంతము నొందింపసాగిరి వారికి నిరుత్సాహకరముగా విరాబాయి తానును అనేక తురుష్కులను వీరస్వర్గమునకు నంపుచుండెను.

ప్రళయాగ్నినిబోలిన యామె పరాక్రమము గని యగ్బరత్యాశ్చర్యమును బొందెను. ఆయన జడునివలె నేమియుఁ దోఁచక నిశ్చేష్టితుఁడయి నిలువఁబడెను. అప్పు డాక్షత్రియవీరుల యుత్సాహంబు రెట్టింపయవనసైన్యము ననేకరీతుల బాధింపఁ దొడఁగిరి. బాదుషా తనకు జయము కలుగుటమాఱుగా నపజయమగుటఁ గనిచేయునది లేక సంధినిఁ దెలుపుపతాక మెత్తెను. తత్క్షణమే ఉదయసింహుని సహితము బంధవిముక్తునిఁ జేసెను. పరాక్రమవంతురాలయిన విరాబాయివలన మహాబలవంతుఁడైన అక్బరునంతటి తురుష్క ప్రభువుసహితముజయ కాంక్షనుమాని హతశేషులగువారింగొని మరల తనపురి కేగవలసినవాఁ డాయెను. తదనంతర మారజపూత లందఱును విజయానందముతో సింహనాదములు చేయుచు విరాబాయి ననేకవిధములఁ గొనియాడుచు విరాబాయితోడను, ఉదయసింహునితోడను పురప్రవేశముచేసిరి. అంతకుఁ బూర్వము తేజోహీనమైనచితూరుపట్టణము రాణిగారి విజయ వార్తవిని మరల తనదివ్యతేజమునుబొందెను. జనులందఱును పరమానందభరితులయిరి. విరాబాయి జయమునుగాంచి విశేష తేజస్వినియయ్యెను. పురవాసు లంద ఱావీరరజపూతులను, రాణాగారిని, రాణిగారిని, మంగళ వాద్యములతో నెదుర్కొని వారిపై పుష్పవృష్టి చే యుచు రాజభవనములోఁ బ్రవేశ పెట్టిరి! ఇట్లు జన్మమం దెప్పుడునుయుద్ధ మెఱుఁగని దయ్యును ఒకక్షణములో తనశౌర్యముచే విరాబాయి "గొప్పశూర స్త్రీ" యన్న బిరుదునుబొంది, ప్రస్తుతచరిత్రమునకు శిరోలేఖముగా నున్న శ్లోకార్థమునే స్థిర పఱచెను!


  1. యుద్ధమునందు వీరుల శౌర్యాశౌర్యములును, కవి సంఘమునందు కవులయొక్క చాతుర్యా చతుర్యములును ఒకక్షణమాత్రములో వెల్లడి యగును.