అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/రాణి ఔస్కువరు

రాణి ఔస్కువరు

ఈమె పంజాబుదేశములోని పటియాల సంస్థానమును 18 వ శతాబ్దాంతమునను 19 వ శతాబ్దారంభమునను నేలుచుండిన రాజాసాహెబు సింహునిభార్య. ఈమె తనపతి రాజ్యపాలన కర్హుఁడు కానందువలనఁ గొన్నిదినములును, అతని పిదపఁ గొమారుఁ డల్పవయస్కు డయినందువలనఁ గొన్ని దినములును పటియాల సంస్థానమును జక్కఁగా బాలించి కీర్తిఁ గాంచెను! రా జీమె సొంతవ్యయమునకై యీమెకుఁ గొంత భూమినిచ్చెను. గొప్ప రాజ్యభారమును వహింప సమర్థతగు నామె యా యల్పభూభాగముతోఁ దృప్తినొందియుండక మనమున రాజ్యమునంతను దానేల నిచ్చ గలిగియుండెను. రాజు విచారశూన్యుఁడును, రాజ్యపాలన యందసమర్థుఁడును, దుస్సాంగత్యము గలవాఁడుగాను నుండినందున సంస్థానము మిగుల హీనస్థితికివచ్చెను. రైతులు రాజును లెక్కింపక పన్నుల నెగఁగొట్టుచుండిరి. ఉద్యోగస్థులందఱు తమతమ యర్హకార్యములఁజేయక, తమపైవారిని ధిక్కరింపఁదొడఁగిరి! రాజ్య మిట్లధికదుర్దశకు వచ్చుటనెఱిఁగి రాజు తాను దానిఁ జక్కఁబఱుపలేనని తెలిసికొని తనసవతి తల్లియగు ఖేమ్‌కువరు తనకై రాజ్యముచేయునట్లు నియమింపఁ దలఁచెను. కానియామె సవతితల్లి యగుటవలన, నామె హితమును రాజుహితమును నొక్కటి కాదనియును, ఆమెచేతికి రాజ్యతంత్రము నిచ్చినచో రాజునకు ను, నతనిపుత్రునకును సహితము జరుగుట యసంభవ నీయ మనియును, నూహించి సామంతరాజులును, భ్రిటీషు (ఇంగ్లీషు) వారును రాజ్యము నాతని పత్నియగు నౌస్కువరు కియ్య నిశ్చయించిరి. బ్రిటీషువారి యేజంటు సమయము తటస్థించినచోఁ దాను రాణికి రాజ్యమిచ్చునటుల దొరతనమువారు వారి యనుజ్ఞ వడసియుండెను. ఇది యంతయు విని రాజు సహచరులగు దుష్టులందఱు రాణిరాజ్యము నేలినచోఁ దమదుశ్చేష్ట లేమియు సాగవుగదా యని చింతించి రాణిపై ననేక నేరములు నిర్మించి రాజునకుఁ జెప్పి యతని కామెపై ద్వేషము గలుగఁ జేసిరి. కాని యేజం టొకప్పుడు పటియాలకువచ్చి సంస్థానమునకుఁ గలుగు నష్టము లనేకములఁగని రాజునకుఁ బోధించి రాజ్యము రాణి స్వాధీనము చేసెను. ఈమె రాజ్యమునకు వచ్చినవెంటనే రాజ్యమునందంతటను మిగుల స్వస్థతగానిపించె. ఆమె సత్యవంతుఁడగు నొక బుద్ధిమంతుని మంత్రిగా నేర్పఱచి, యతని సహాయమువలనను, తనబుద్ధిబలమువలనను రాజ్యము నేలుచుండెను. అదివఱ కనేకవత్సరములనుండి పన్నులురాని గ్రామములనుండి వెనుకటి యరినంతను రాఁబట్టెను. సామంతు లియ్యవలసిన ధనమును సైన్యమును మంచి తనముననే చేకొనియెను. ఇందువలన నదివఱ కప్పులలో నుండిన సంస్థానమప్పుడు అప్పుల నన్నిఁటిని దీర్చి బొక్కసములో లక్షధనము కలిగియుండెను. రాజు పాలనదినములలో నూఱుగురుసైనికులను పోగుచేయుట దుస్తరము నుండెను. కాని రాణి రాజ్యమునకువచ్చిన సంవత్సరమునకే రెండువేలగుఱ్ఱపురౌతులను రెండువేల పదాతి సంఘమును నొడఁగూర్చెను. ఈమె పాలనమునకుఁ గాపులు ను, ప్రజలును మిగుల సంతసించిరి. ఉద్యోగస్థు లందఱు తమఁతమ నియమితకార్యములఁ దప్పక చేయుచు రాజభక్తి కలిగియుండిరి. ఇ ట్లీమె మిగుల దక్షతతో రాజ్యము నేలుటఁ గని రాజు సంతసించెను. కాని దుష్టులగు నతని చెలికాండ్ర కీమెరాజ్యముమిగుల దు:ఖకరముగాఁదోఁచి, వారిలో ముఖ్యులగుఆల్బల్ సింగు గుర్జరసింగులనువారురాజుతో రాణినిన్ను విషమిడిచంప యత్నింపుచున్నది యని మనసునకునాఁట దెలిపిరి. వారికిరాణితోనింతవైరమేల కలిగెననఁగానిందు ప్రధముఁడగు ఆల్బల్‌సింగు కొంతభూమి కౌలుకుఁగొని దానిసంవత్సరమున కేడువేల రూపాయలను కొంత సైన్యమునురాజున కిచ్చునట్లేర్పాటు చేసికొనియెను. ఆభూమికి 14 వేలరూపాయ లిమ్మని రాణి యతని నడుగఁగా నతఁ డియ్యక యాభూమిని విడుదలచేసెను. ఆమె యాభూమిపై సాలు 1 టికి 14 వేల రూపాయలను రాఁబట్టెను. రెండవవాఁడగు గుర్జరసింగుఁడును నిట్లేకొంతభూమిని కౌలుకుఁ దీసికొని 7 వందలరూప్యములను రాజునకు నిచ్చుచుండెను. వానినిసహితము 14 వేలరూపాయ లిమ్మని రాణి యడుగఁగా వాఁ డియ్యకుండెను. అందుపై నామె యా పుడమి నింకొకని కిచ్చి 14 వేల రూపాయలను గొనియెను.

రాజు కొంచెము మతిభ్రమ కలవాఁ డయినందున వారిమాటలు విని మిగుల నాగ్రహించి రాణిని, యువరాజగు నామె కొమరుని, సత్యరతుఁడగు నామె మంత్రిని కారాగృహమునం దుంచెను. కాని యతఁడు ధైర్యహీనుఁడైనందున తాఁ జేసినకార్యమువలన నేమి యుపద్రవము సంభవించునో యని భయపడఁ దొడఁగెను. రాణిని కారాగృహమునం దుంచినతో డనే రాజ్యము మరల దుస్థ్సితికి రాసాగెను. సైనికులందఱుఁ జెదరిపోయిరి. అందుకు రాజు మిగుల చింతించి రాణిని యామెపుత్రుని, మంత్రిని చెఱవిడిపించి రాజ్యమును మరలఁ జక్కఁజేయుమని భార్యను వేడఁదొడఁగెను. అప్పు డామె తనను మరల చెఱసాలలోఁ బెట్టకుండఁ గట్టుదిట్టములు చేయుఁడనియుఁ దేపతేప తను నిట్లే కారాగృహమునం దుంచినచో జనులు తన్ను మన్నింపరనియుఁ జెప్పి యందుకు జామీ నెవ్వరినైననుంచుమనియెను. ఆమె యంతటితో నూరకుండక యేజంటును బిలిపించెను. ఏజంటు రాకడఁ గనినతోడనే రాజు మరల కోపించెను. ఎట్ట కేల కాయేజంటు రాణికిఁ బట్టముకట్టి చనియెను. ఈతడవ రాణి రాజ్యమనిపేరేకాని దానియం దామె యధికార మెంతమాత్రము జరగకుండెను. రాణిప్రాణములకే గొప్పయాపద వచ్చునట్టుండెను. రాజ్యమునందలి దుష్టులందఱు రాణికి వైరులయిరి. రాజు కొంతసైన్యము పోగుచేసి రాణినిఁ జంప యత్నించెను. ఆమె పేరోలగమున కెవ్వరును రాకయుండిరి. దీని నంతను రాణి యేజంటునకుఁ దెలుపఁగా నతఁడు కొంతసేనతో వచ్చి మహాప్రయత్నముమీఁద సర్వాధికారము రాణిగారికి నిచ్చిరాజుచేతినుండు గురుముఖి రాజముద్రయును నామెకిప్పించెను. రాజునకుఁగొంచెముభూమియు నెల వేతనమును నేర్పఱచెను. రాణి సర్వాధికారిణి యయినను ఆమె తన భర్త యనుమతి వడయనిది యేకార్యము చేసెడిదికాదు. ఆమె రాజ్యమువలన రాజునకు స్వతంత్రత స్థిరముగానే యుండెను. కాని యాభ్రమిష్టున కీస్వతంత్రత కలుగుటవలన నష్టమే కలిగెను. అతఁడు నాతదనంతరము నాపుత్రున కేమియు లేకుండఁ జేసెద నని ధనమును విచ్చలవిడిగా వెచ్చింపఁ దొడఁగెను. అందువలన నాతని సొంతధనము సహితము సంస్థానపు బొక్కసములో భద్రపఱచవలసి వచ్చెను. 1813 వ సంవత్సరము రాజు కాలముచేసెను. తదనంతర మతనిపుత్రుఁడగు కర్‌మసింహుఁడు రాజ్యారూఢుఁ డయ్యెను. కర్‌మసింహుఁడు బాలుడని యాతని పేర రాణి కొన్నిదినములు రాజ్యము నేలెను. కాని కొమారుఁడు పెద్దవాఁడయినపిదప నతఁడు రాజ్యమును తన్నేలనిమ్మనఁగా రాణియందుకు సమ్మతింపక పుత్రునితోఁ గలహించెను. అంత నామెపుత్రుఁడామెకుఁ గొంతధన మిచ్చి సమాధానపఱచి యామెను వేఱొకచోటి కనిచి తానురాజ్యము నేలుచుండెను. ఇంతటితో నీమె రాజ్యపాలనచరిత్రము ముగిసెను. ఈరాణికొంచెము మహత్త్వకాంక్ష గలదియైనను నది సమర్దులకు సహజగుణము గాన నొకదోషముకాదు. ఇదిగాక నీమెయందు వసియించు ధర్మనీతి సత్యములును, స్వాభిమానమును, పరహితేచ్ఛయు, రాజ్యపాలనసామర్థ్యము మొదలగు సద్గుణములు మిగుల శ్లఘనీయములు.

ఈచరిత్రమువలనను, నిదివఱకు వ్రాయఁబడిన రాజ్య పరిపాలనమునం దధికనిపుణురాండ్రయిన రాణుల చరిత్రము వలనను, నిఁక ముందువచ్చునట్టి చరితములవలనను స్త్రీలురాజ్య పాలనమునం దధికసమర్థురాండ్రనియు, వా రనేకపర్యాయములు పురుషులు తమబుద్ధిహీనతవలనఁ జెడఁగొట్టిన కొన్ని సంస్థానములను బాగుపఱచి రనియును దెల్లముగాఁ దెలియుచున్నది. ఇందును గుఱించి యీశతాబ్దమునం దుండి పోయిన యింగ్లండులోని యొకతత్త్వవేత్త యిట్లు నుడివెను : _ "ఇందునగుఱించి యేషియాఖండమునందును, యూరోపుఖండమునందును, విచారించినచో రాజ్యపాలన మధిక దక్షతతోఁజేసిన స్త్రీలసంఖ్యయే లెక్క కెక్కువై యున్నది. హిందూస్థానమునం దొకానొక సంస్థానమునందు రాజ్యమతి వ్యవస్థగాను, మితవ్యయముగాను, నియమితముగాను, కలుగుచుండి రైతుకు నన్యాయముజరుగక, సంస్థానమునకు నానాఁటికి నాదాయము హెచ్చుచుఁబ్రజలు సుఖులైయుండిరనినచో నిట్టి సంస్థానములలో నాలుగింటిలో మూడుసంస్థానములు స్త్రీలపాలనలో నున్నవని నిశ్చయముగాఁ దెలిసికొనవచ్చును. ఈసంగతి పూర్వము నా కనుభవసిద్ధము కాకున్నను, హిందూస్థానమునందలి ప్రధాన రాజ్యవ్యవస్థ సమాజముతో నాకుఁ గలిగిన సంబంధమువలన హిందూస్థానమునందలి యనేక రాజ్యములలోని కాగితపత్రములు నాకుదొరకెను; వానివలన నేనీమాటను స్థాపించఁ గలిగితిని. ఇట్టి యుదాహరణము లనేకములు దొరకును. హిందువుల యాచార ప్రకారమును. వారి మతప్రకారమును స్త్రీలకు రాజ్యార్హతలేదు. అట్లయినను రాజ్యమునకు వారసుఁడగువాఁ డజ్ఞానదశయం దుండుటయు, వారి తల్లులు వారిపేర ననేక పర్యాయములు రాజ్యము నేలుటయుఁ దటస్థింపుచుండును. అదేలయన, రాజు లనేకులు సోమరులుగాను, విషయాసక్తులుగాను నుండుటవలన వారల్పవయసుననే మృతులగుదురు. ఈరాణులు లేక రాజపుత్రికలు ప్రజలయెదుటి కెన్నఁడునురారు, వారు తమకుటుంబమునందలి పురుషులతోఁదప్ప నన్యపురుషులతో సంభాషింపనైనను సంభాషింపరు. భాషించినను దెరలోనుండి భాషించెదరు. వా రికివిద్య యేరాదు. వచ్చినను రాజ్యపాలనవిషయములుగలపుస్తకమువారిభాషలో నొకటి యైననులేదు. ఈయిబ్బందులన్నియు విచారించిన యెడల నీయుదాహరణములవలన స్త్రీలయందు రాజ్యపాలనమునకుఁ దగినగుణములు స్వాభావికముగానై యుండునని చక్కఁగా మనసునకు నాఁటును." [1]


రాణీసాహేబ్‌ కువరు

ఈమె పంజాబుదేశములోని పటియాలాసంస్థా నాధీశ్వరుఁడగు రాజా సాహేబ్ సింహుని సహోదరి. బారీదు వాబులోని నధికభాగము కధీశ్వరుఁ డగుసరదార్ జయమల్ సింహునిపత్ని. ఈమె తనసహోదరుని రాజ్యమును చక్కఁగా నేలి రెండుమూడుసార్లు యుద్ధములలో జయముఁ గాంచి మిగుల శూర యనియును రాజకార్యనిపుణ యనియును బేర్కొనంబడియె.

1793 వ సంవత్సరము మంత్రులును, ఉద్యోగస్థులును దనకు వైరు లైనందున రాజ్యముఁ దాను జక్కఁబఱుపఁజాలనని రాజాసాహెబు సింహుఁడు దెలిసికొనియెను. అంత నతఁడు తనయనుజను దనవద్దకిఁ బిలిపించుకొని యామెకు ముఖ్యప్రధానిత్వమునిచ్చెను. తదనంతరమామె కొందఱువిశ్వాసార్హులులగు నుద్యోగస్థుల సహాయమువలన రాజ్యమునం దంతటను గలుగుచున్న యన్యాయముల నుడిపి న్యాయముగాఁ బాలింపుచుఁ బ్రజలకు మిగుల హితురా లాయెను. అంతలో నామెభర్తపై నతని పాలివాఁడగు ఫతేసింహుఁడు వైరముఁ బూని యతనిని జాల తొందర పెట్టుచున్నట్టు లామెకుఁ దెలిసెను. అప్పు డామె తనసహోదరున కామాట నెఱిగించి యచటినుండి కొంత సైన్యమును దీసికొని దాని యాధిపత్యమును దానే స్వీకరించి ఫత్తేపురమున కరిగెను. అచట నీమెకును ఫతేసింహునకు

  1. జాన్‌స్టూ అర్టుమిల్ కృతమైన సబ్జక్షన్ ఆఫ్ విమెన్ నాబరఁగు గ్రంథరాజముయొక్క భాషాంతరంబైన 'స్త్రియాంచీపరవశతా' 'స్త్రీలపరవశత' యను మహారాష్ట్రగ్రంథమునుండి యిది తెనుఁగు చేయఁబడినది.