అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/మహారాణీ త్రిపురసుందరి

మహారాణీ త్రిపురసుందరి.

ఈమె నేపాలాధీశ్వరుఁడగు రాణాబహుదురుని పెద్దభార్య. ఈరాజు 1795 వ సంవత్సరమున సింహాసనారూఢుఁ డయ్యెను. ఈయనకు నిద్దఱుభార్య లుండిరి. వారిలోఁ బెద్దదియు, మహారాణి బిరుదుఁ జెందినదియునైన త్రిపురసుందరి గుల్మీరాజుబిడ్డ. ఈమె యత్యంత సద్గుణవతియు, నమితయౌదార్యవతియునై యుండెనని చరిత్రకారులు వ్రాసియున్నారు. కాని యీమెకు సంతానము లేనందువలన రా జీమెను నొల్లకయుండెను. అయినను నాసాధ్వి పతిభక్తిపరాయణయై యుండెను.

1800 వ సంవత్సరమునందు రాజుకు మతిభ్రమ కలిగి రాజ్యమంతయు రెండవ భార్యకుమారున కిచ్చి, రెండవభార్యను నాచిన్న వానికి, బాలనకర్త్రిగా నేర్పఱచి కాశీవాసముఁ జేయఁబోయెను. పతివ్రతాతిలకమగు త్రిపురసుందరియుఁ బతివెంట నతనిసేవకయి కాశికిఁబోయెను. కాని యారా జీమెను మిగుల బాధపెట్టి, యిల్లు వెడలఁగొట్టి మరల పాళమునకుఁ దిరిగి పోవలసినదానినిగాఁ జేసెను.

ఇటు నేపాళమునకు వచ్చునప్పుడు ఆమెకుఁ దనకు హక్కుగల బాలరాజుయొక్క పాలన కర్తృత్వము వహించవలయుననిన యిచ్ఛ కలిగెను. బాలరాజుకుఁ బాలనకర్త్రిగా నుండవలసిన హక్కు పట్టపురాణి (రాజుయొక్క పెద్దభార్య)ది కాని యితరులదికాదు. కాన తనకా యధికారము రావలయునని త్రిపురసుందరియిచ్ఛ న్యాయమయినదియేకాని యన్యాయమయినది కాదు. కాన నిందునుగుఱించి యామెను నిందించుటకు వీలులేదు. రాణిగారు తనయధికారమును సంపాదించుకొనుటకయి సైన్యములను పోగుచేసి నేపాళదేశము సరిహద్దు సమీపమునకు వచ్చెను. ప్రజలంద ఱీమె కేయనుకూలు రయినందున నప్పుడు రాజ్యము చేయుచుండిన రెండవరాణికి మిగుల చింతకలిగెను.

1802 వ సంవత్సరము నవంబరునెలలో మహారాణి త్రిపురసుందరి, పొలిమేరదాఁటి నేపాళదేశములోనికిఁ జొరఁబడెను. కాని త్రోవలోనే యామె సైన్యమును రెండవరాణి యొక్క సైన్యము కొల్లఁగొట్టెను. కాని యీపరాభవమువలన ధైర్యమువిడువక మహారాణి మరల సైన్యమును జతపఱుచుకొని 1803 వ సంవత్సరము ఫిబ్రవరినెలలో నేపాళమునకు వచ్చెను. చిన్న రాణిగారి సైన్యములు వచ్చి యామెను నెదిరించెను; కాని యీమె సైన్యములచే నవి యోడింపఁబడి మహారాణి మహావైభవముతో ఖటమండూ యను నిజరాజధానిఁ బ్రవేశించెను. అచ్చటనున్న చిన్నరాణి బాలరాజును వెంటఁ దీసికొని పాఱిపోయెను. కాని మహారాణిగా రారాజపుత్రుని మరలఁ దెప్పించిరాజ్యముపైఁ గూర్చుండఁ బెట్టి తాను పాలన కర్త్రిగానుండెను. మహారాణిగారు న్యాయప్రవర్తన గలదియై నందున నోడిపోయిన చిన్నరాణి నేమి, యామె పక్షమువారి నేమి, యెంతమాత్రమును బాధపెట్టక వారి యపరాధముల నన్నిఁటిని క్షమించెను. ఆహా! ఈమె క్షమాగుణం బందఱికిని ననుకరణీయముగదా? రక్తపాతము లేక ప్రభుత్వములలో నిట్టిమార్పులు గలిగిన యుదాహరణ మిది యొక్కటియేయని చెప్పెదరు. ఈమెయచ్చటనున్న యింగ్లీషువారి రాయబారితో విశేష స్నేహముగా లేనందున నాతఁ డాదేశమునందలి యింగ్లీషువారి యిలాకకుఁ బోవలసినవాఁ డాయెను. [1]

ఈ మహారాణి బహుఖ్యాతిగాను, ఘనతగాను రాజకార్యముల నన్నిఁటిని నిర్వహించుచుండెను. జనులందఱును పర రాజులును మిగులఁ గొనియాడ నీమె బహుదీర్ఘ కాలమువఱకు రాజ్యముఁ జేసెను. బుద్ధిసామర్థ్యము విషయముననే గాకుండ సద్గుణములనుగుఱించియు నీమె విఖ్యాతిఁ జెందెనని చరిత్రకారులు వ్రాసియున్నారు. మతిభ్రమబాగయిన పిదప నీమె పెనిమిటివచ్చి మరలఁ గొన్నిరోజులు రాజ్యము చేసెను. అప్పుడును నీమె భర్తసేవయందుఁ దత్పరురాలయి యుండెను. ఈమె పెనిమిటి 1805 వ సంవత్సరములోఁ గాలముచేసెను. తదనంతర మీమె భీమసేనుఁ డనువానిని మంత్రిగా నేర్పఱచుకొని మిక్కిలి చాతుర్యముతోఁ జక్కఁగా రాజ్యపరిపాలనము చేసెను. ఈమె 1832 వ సంవత్సరములో మృతిఁ జెందెను. పతిచేఁ దిరస్కరింపఁబడియు, సవతులచే నవమానింపఁబడియు, పాతివ్రత్యము, క్షాత్రగుణము మొదలయిన సద్గుణములను వదలక ధైర్యముతోనుండి యోగ్యమైన తనహక్కులను శౌర్యముచే సంపాదించుకొని, శత్రులనుగూడ దయార్ద్రదృష్టితోఁ జూచుచు జనులు గొనియాడ రాజ్యపరిపాలనము చేసిన యీసతీమణిని నెవరు గొనియాడక యుందురు?

  1. హిందూదేశములోని ప్రాంతముల నొక్క నేపాళదేశము స్వతంత్రతగలదియై యున్నదనినమాట చదువరులకుఁ దెలిసియేయుండును. ప్రస్తుత మింగ్లీషువారును, నేపాళమువారును నన్యోన్యస్నేహభావముతో నుండుట యెంతయు శ్లాఘనీయము గదా!