అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/పద్మిని

పద్మిని.

                  పత్యనుకూలా చతురాప్రియంవదా యాసురూపసంపూర్ణా
                  సహజస్నేహరసాలా కులవనితా కేనతుల్యాస్యాత్. [1]

ఈపతివ్రతాతిలకము పండ్రెండవ శతాబ్దారంభమునందు జన్మించెను. ఈమెతండ్రి సింహళద్వీపవాసి యగు హమీరసింహచవ్హాణుఁడు. ఈసతీరత్న మసమానరూపవతి యగుటచే జననీజనకు లామెకు పద్మిని యని పేరిడిరి. పద్మిని వివాహయోగ్య యైనపిదప రజపుతస్థానములోనిదైన మేవాడ్ అనుసంస్థానమున కధీశ్వరుఁడగు భీమసింహరాణాగారికి నామె నిచ్చి వివాహముఁ జేసిరి. వివాహానంతరము పద్మిని తన రూపమునకుఁ దోడు సుగుణములు సహాయపడఁగా భర్తకుఁ బ్రాణతుల్యురా లాయెను.

ఆకాలమునం దారాజ్యము రాణాలక్ష్మణసింహుఁ డను బాలరాజు పరిపాలనలో నుండెను. కాని ఆతఁడు బాలుఁ డగుట వలన నాతని పినతండ్రి యగు భీమసింహుఁడే రాజ్యతంత్రములను నడుపుచుండెను. భీమసింహుఁడు మిగుల శూరుఁడును, చతురుఁడును నగుటవలన నాతనిరాజ్యమున కంతగా శత్రుల భయములేక ప్రజలు సుఖముగానుండిరి. కాని వారి దురదృష్ట మువలన స్వల్పకాలములోనే డిల్లీ బాదుషాయగు అల్లాఉద్దీను మేవాడ రాజధానియగు చితూరుపై దండు వెడలెను. ఈబాదుషా పద్మినియొక్క యసమాన సౌందర్యమువిని యామెయం దధికాభిలాషి యయ్యెను. అసహాయశూరులగు రజపూతులతోఁ బోరి గెలుచుట దుస్తరమని తలఁచి యాబాదుషా పద్మినిని వశపఱుచుకొనఁ జూచెను. కాన ప్రధమమునం దాయన తనసైనికులతోఁ జితూరుసంస్థాన ప్రాంతభూమిని వసియించి గుప్తముగా ననేక దాసీజనులకు ద్రవ్యాశఁ జూపి వారు తనరూపము, ఐశ్వర్యము మొదలగునవి పద్మినికిఁ దెలిపి యామె తనకు వశవర్తినియగుట కనేకయుక్తులను బన్నునటులఁ జేసెను. కాని సతీమణియగు పద్మినియొద్ద ఇట్టినీచప్రభువుయొక్క తుచ్ఛయుక్తు లెంతమాత్రమునుఁ బనికిరాక నిష్ఫలములయ్యెను. అందుకు బాదుషా మిగుల చింతించి తనకు పద్మినిపైనిఁ గలిగిన దురుద్దేశ్యమును మరల్చుకొనఁ జాలక రజపూతులతో యుద్ధము చేసి పద్మినిని జెఱఁ బట్ట నిశ్చయించెను. అల్లాఉద్దీను ఆసమయము నందు "పద్మినిని చేకొనుట యొండె ఈరాజపుతస్థానమునందే యుద్ధముచేసి ప్రాణములు విడుచుటయొండె" అని ప్రతిన పట్టెను. తదనంతరమాతఁడు తనసైన్యములతో నారాజధానిని ముట్టడించెను.

అల్లా ఉద్దీను తమనగరమును ముట్టడించుట విని యసమానశౌర్యధుర్యులగు రజపూతులు యుద్ధసన్నద్ధు లయిరి. అంత వారందఱు భీమసింహుని యాజ్ఞప్రకారము బైలువెడలి ప్రతిపక్షులతో ఘోరముగాఁ బోరఁ దొడఁగిరి. ఇట్లా యుభయ సైన్యములం గలవీరులు కొన్నిమాసములవరకును యుద్ధము చేసిరి. కాని యారెండు తెగలవారిలో నెవ్వరును వెనుకఁ దీయరైరి. రజపూతు సరదార్ల నేకులు రణరంగమునందు హతులయిరి. రజపూతు లెంత దృఢనిశ్చయముతోఁ బోరినను తురక సైన్యములు బీరువోవ కుండుటయు, నానాటికి రజపూతు సైన్యములు పలుచపడుటయుఁ గని భీమసింహుఁడు మిగుల చింతాక్రాంతుఁ డయ్యెను. తుద కాతఁడు ప్రజాక్షయమున కోర్వఁజాలక డిల్లీశ్వరునితో సంధి సేయనెంచి యందు కయి కొందఱు మంత్రుల నంపెను. కాని యది పొసఁగినదికాదు. సంధి దెల్పవచ్చినవారితో అల్లాఉద్ధీను తనకుపద్మిని దొరకినంగానిరణ మాగదని స్పష్టముగాఁ దెలిపెను. ఈవార్త వినఁగానే శూరరజపూతు లందఱు పడగఁ ద్రొక్కిన సర్పములభంగి అదరిపడి తమయందఱి ప్రాణములు పోవువఱకును యుద్ధముఁ జేసెదమని విజృంభించిరి. అందుపై నా యిరువాగుసైన్యంబులుందలఁపడి యుద్ధము చేయుచుండిరి.

ఇట్లు పదునెనిమిది మాసములు యుద్ధము జరుగుచుండెను. కాని శూరులగు రజపూతులు బాదుషాసైనికులను బట్టణములోనికిఁ బోవనియ్యకుండిరి. అల్లా ఉద్దీను వారి నిశ్చయము గని రజపూతుల యుద్ధమునం దోడించి పద్మినిని బట్టు ప్రయత్నము మానుకొనవలసినవాఁ డాయెను. యుద్ధము మానుకొన్నను పద్మినియం దతనికిఁగల వ్యామోహ మతని నాపొలిమేర దాఁటి పోనియ్యకుండెను. అందువలన నతఁడు భీమసింహున కిట్లు వర్తమాన మంపెను. "నాకు పద్మిని దొరకునన్న యాస లేదు. కాని యామె రూప మొకసారియయినను మీరు నా కగుపఱచినయెడల నేను సైన్యసహితముగా డిల్లికి మరలి వె ళ్లుదును." ఈవర్త మానము విని కొంతరోషము కలిగిననుపోరునకు విసుగు కలిగిన రజపూతు లందున కొప్పుకొనిరి. తదనంతరమా సంగతి భీమసింహుఁడు పద్మినికిఁ దెలుపఁగా నామె తాను ప్రత్యక్షముగా నాపరునికంటఁ బడనని స్పష్టముగాఁ దెల్పెను. అందుపయి భీమసింహుఁడామెకు నామె డిల్లీశ్వరునకుఁ గనిపించని పక్షమున రజపూతులకుఁ గలుగు బాధల నెఱిఁగింపఁగా నామె యద్దమునందుఁ దనప్రతిబింబమును బాదుషాకుఁ జూప నొప్పుకొనెను. అప్పడు "పద్మిని నీకగుపడఁజాలదు; గాన నామె ప్రతిబింబమును జూపెద" మని చితూరునుండి అల్లా ఉద్దీనుకుఁ జెప్పి పంపిరి.

అందుపయి యుద్ధము నాపి నియమితదివసంబున నొక రిద్దఱు సేవకులతో అల్లాఉద్దీను పద్మినిని జూచుటకయి చితూరు కోటలోనికి వచ్చెను. అచట భీమసింహుగా రాయనకుఁ దగు మర్యాదలు చేసి యాతనికి దర్పణంబున పద్మినిరూపమును జూపెను. తాను విన్నదానికంటెను పద్మిని విశేషరూపవతి యగుటఁ గనినందున బాదుషాయొక్క చిత్త చాంచల్య మినుమడించెను. దానిని మనమునం దడఁచుకొని యాతడు మరలిపోవునపుడు తనకృత్యమునకుఁ బశ్చాత్తాపపరుఁ డయి నటుల భీమసింహునితో నిట్టు లనియె. "భీమసింగుగారూ! నేను చేసిన నేరమును మన్నించవలయును. నేఁడాదిగా చితూరు సంస్థానీకులతో నేను సఖ్యము చేయఁ దలఁచితిని. ఇంతవఱకు మియోగ్యత తెలియకపోవుటవలన నేవైరము తలపెట్టితిని. కాని నేఁడు మీయోగ్యత నాకన్నులార చూడఁగా మీవంటి మిత్రులు దొరకుట నాకు మిగుల శ్రేయస్కర మని తోఁచు చున్నది. కాన నీప్రథమదివసంబుననే తమరు నావిడిదికి దయచేసి నేచేయుపూజల నంగీకరింతురని నమ్ముచున్నాను. ఈ నాచిన్న విన్నపము మీరంగీకరింపకతప్పదు." బాదుషాయొక్క నమ్రత్వమును గని యాతనిమాటలను నమ్మి భీమసింహుఁడు మితపరివారముతో నాతని శిబిరంబునకుఁ బ్రయాణ మయ్యెను.

అల్లా ఉద్దీను మిగుల దుర్మార్గుఁ డగుటవలన రాజుగారిని నమ్మించి తనతోఁ దోడుకొనివచ్చి తనశిబిరసమీపమునం దాయనను సైన్యము ముట్టడించి కైదుచేయునట్లు చేసెను. రాజు పట్టుపడుటవలన మిగుల నుప్పొంగి యల్లాఉద్దిన్ చితూరున కిట్లు వర్తమాన మంపెను. "పద్మిని నావద్దకు రానియెడల భీమసింహుని ప్రాణములఁగొని మరల రజపూతులను సంహరించెదను." ఈసంగతి విని రజపూతులందఱు నేమి చేయుటకును దోఁచక మిగుల విచారముగా నుండిరి. రాజగు లక్ష్మసింహుఁడు బాలుఁడగుటవలనను, భీమసింహునిపుత్రులు పండ్రెండుగురును అల్పవయస్కు లగుటవలనను ఇట్టిసమయమునం దగినయుపాయము యోచించువారు కానరారయిరి. కాని పద్మినిమాత్ర మప్పుడితర స్త్రీలవలె దు:ఖింపుచుఁ గూర్చుండక మిగుల ధైర్యము వహించి భర్తనువిడిపించు నుపాయము యోచింపుచుండెను. ఆసమయమునం దేదోపనిమీఁద నామె సోదరుఁడగు గోరాసింహుఁడును, నాతనిపుత్రుఁడగు బాదలుఁడను వీరుఁడును అచటికివచ్చిరి. ఆమె వారితో యోచించి మిగుల చిత్రమగుయుక్తినిఁ బన్నెను. పద్మిని అల్లా ఉద్దీనున కిట్లు వర్తమానము చేసెను. "మీరు భీమసింహునివిడిచి డిల్లీకిఁ బయలుదేఱినయెడల నేను తగుదాసీలతోడంగూడి యచటికి వచ్చెదను. కాని నాదాసీల పరువునకును రాణివాసమునకును మీసైనికులు భంగము సేయకుండునటుల కట్టుదిట్టములు చేయవలయును" పద్మిని తెలిపినవార్త విని అల్లా ఉద్దీను పరమానంద భరితుఁడయ్యెను. అంత నాతఁడామె యన్నప్రకార మొప్పుకొని యామెకుఁ ద్వరతో రమ్మని కబురుపంపెను. బాదుషా యొద్దినుండి తనపలుకుల కంగీకారము వచ్చుట విని పద్మిని తాను ప్రయాణమాయెను. ఆమెతోడ వచ్చుటకు నేడువందల మేనాలను సిద్ధపరచెను. ఒక్కొకమేనాలో ముగ్గు రేసిశూరులు ఆయుధహస్తులయి కూర్చుండిరి. ప్రతిమేనాకును నాఱు గురు వంతున గుప్తాయుధు లగువీరు లాయందలములను మోయుచుండిరి. పద్మిని తనసైన్యమునకును తనకును దోడుగా గోరాసింహునిని, నాతనిపుత్రుఁడగు బాదలుని సహితము తనతోఁ దీసికొనిపోయెను. ఇట్లువీరందఱు తురకలశిబిరమును సమీపించి బాదుషాయాజ్ఞవలన నామేనాల నన్నిటిని శిబిరములోనికి నిరాతంకముగాఁ గొనిపోయిరి. తదనంతరము పద్మిని భీమసింహుని నొకసారి చూచెదనని బాదుషాకుఁ దెలిపి భీమసింహుని కైదుచేసినస్థలమునకుఁ దనమేనాను బట్టించుకొనిచనెను. అంత స్త్రీవలెనున్న యాగుప్త సైన్యమంతయు తమనిజస్వరూపమును గనఁబఱచి శత్రుసైన్యముల దైన్యము నొందిపసాగెను. భీమసింహుఁడదియంతయు నేమని యడుగుచుండగా పద్మిని యాతనిని త్వరపెట్టి సిద్ధపఱచితెచ్చిన అశ్వములపై తానును భర్తయునెక్కి యాసంగ్రామపు సందడిలోనుండి తప్పించుకొని క్షణములో చితూరు ప్రవేశించెను. ఇచట గోరాసింహుఁడు సైన్యాధిపత్యము స్వీకరించి యాతురకల నోడించెను. కాని యర్జున తుల్యుఁడగు గోరాసింహుఁడును, నాతని పుత్రుఁడగు బాదలుఁడును ఆయుద్ధమునందు మృతులగుటవలన రజపూతులకు విజయానందమంతగా రుచింపదయ్యెను. అల్లా ఉద్దీను పరాజయమునకు బిసిమిల్లాయనుచుఁ దనసైనికులతో డిల్లీమార్గమునం దరలిపోయెను.

ఆయుద్ధానంతరము మఱికొంతకాలమునకు డిల్లీపతి విశేషసైన్యముతో మరల చితూరుపై దండు వెడలెను. ఈతడవ చితూరునందు శూరులు లేనందున రజపూతులకు విజయాశ యంతగా లేకయుండెను. కాని యావీరు లంతటితో నిరాశ నొంది యుండక ప్రాణములకుఁ దెగించి శత్రువులతోఁ బోరాడఁ దొడఁగిరి. అట్టిసమయమునం దొకకారణమువలన నారజపూతులకు జయము దొరకదని నిశ్చయముగాఁ దోఁచెను. అదియేది యనఁగా నాయుద్ధము జరుగునపు డొకదినమురాత్రి గ్రామదేవత భీమసింహుని స్వప్నమునం దగుపడి "నాకతి దాహముగా నున్నది. ఈదాహము పండ్రెండు గురురాజులరక్తము త్రాగినఁగాని తీరద"ని చెప్పెనఁట. అదేప్రకారము భీమసింహునిపుత్రులు పదునొకండుగురు శత్రువులతోడం బోరి హతులయిరి. అంతటితోనైనను రజపూతులు ధైర్యమును విడువక పురమునంగల పురుషులందఱును వైరులతోడంబోరి స్వర్గసుఖ మంద నిశ్చయించిరి. అంత వారందఱు సిసోదియావంశము నాశ మొందుటకు వగచి భీమసింహుని కనిష్ఠపుత్రుని నొక దాదిచేతి కిచ్చి సమీపారణ్యమునకుఁ బంపిరి. పిదప వారందఱు రాజవంశమున కంకురముగలదని నిశ్చయించుకొని సమర రంగమున కరిగిరి. ఆదిన మారజపూతుల శౌర్యాగ్ని మఱింత ప్రజ్వలింప వారు శత్రువులకు మిగుల దుస్సాధ్యులని తోఁచిరి. కాని విస్తీర్ణమగు యవనసైన్యముముం దల్పమగు రజపూత సైన్యమున కెట్లు జయముదొరకును? ఆసాయంకాలమువఱకు క్షత్రియ వీరులందఱు వీరస్వర్గమున కరుగఁగా జయలక్ష్మి అల్లా ఉద్దీనునే పొందెను.

భీమసింహునితోడ సకల రాజపుత్రులును యుద్ధమున మడియుట నగరమునందుండిన స్త్రీలకుఁ దెలియఁగా పద్మినియు సకల రజపూతుల భార్యలును పాతివ్రత్య రక్షణమునకై అగ్నిప్రవేశముచేయ నిశ్చయించుకొనిరి. ఇట్లు వారు కృతనిశ్చయురాండ్రై యొకగొప్పచితిఁబేర్చి దాని కగ్నిముట్టించిరి. అందుపై పద్మిని తాను ముందాయగ్ని యందు దుముకఁగా నందఱు స్త్రీలును దుమికిరి (ఈయగ్నిప్రవేశమునే రజపూతులు జోహారు, లేక జహరవ్రత మనియెదరు). బాదుషా విజయానందముతో పురప్రవేశము చేయఁగా నాగ్రామమంతయు చితామయమయి యుండెను. అందు తానింత ప్రయత్నముఁ జేసి చేకొనఁదలఁచిన పద్మినిదేహము భస్మమయి యుండఁగాఁ జూచి అల్లాఉద్దీను మిగుల వగచెను. యుద్ధమునకుఁ బ్రయాణమైనపుడు భీమసింహుఁడే స్త్రీలనందఱ నొకగుహలోనికిఁ దోలి యాగుహను మూసి గుహద్వారమున కగ్ని యంటించెనని కొంద`రు చరిత్రకారులు వ్రాసియున్నారు.


  1. పతికి ననుకూల యైనట్టియు, ప్రియభాషిణియు సురూపవతియు నైన కులవనితతో నెవ్వరును సమానులు కారు.