అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/తారాబాయి

తారాబాయి

మహారాష్ట్రరాజ్య సంస్థాపకుఁడయిన శివాజీకిఁ బుత్రుఁడగు రాజారామున కీమె జ్యేష్ఠభార్య. తారాబాయి రాజ్యపాలనము నందు బహు నిపుణురాలని ప్రసిద్ధిఁగాంచెను. శివాజీ మరణానంతరము కొన్నిదినము లాతని ప్రధమ పుత్రుఁడగు సంభాజీ రాజ్యముచేసెను. కాని కొన్ని రోజులకు సంభాజీని డిల్లీశ్వరుఁడగు ఔరంగ జేబుపట్టుకొనిపోయి బహుక్రూరముగా వధియించి యాతనిపుత్రునిని భార్యను తనయొద్దనే కైదులో నుంచెను. కాన సంబాజీ తమ్ముఁడగు రాజారాము రాజ్యము పాలింపుచునుండెను. రాజారాము పరిపాలనదినములు ప్రజల కతిసంతోషకరములై యుండెను. కాని క్రీ. శ. 1700 వ సంవత్సరమునం దతఁడు దీర్ఘ వ్యాధిచే మృతుఁ డగుట తటస్థించెను. మరణకాలమునందు రాజారామునకు జ్యేష్ఠభార్యయగు తారాబాయియందుఁ గలిగిన శివాజీయను 10 సంవత్సరముల పుత్రుఁడును, ద్వితీయభార్యయగు రాజసాబాయి యందుద్భవించిన సంభాజీయను 3 సంవత్సరముల సుతుఁడునునుండిరి.

రాజారాముగారి యనంతరమునందు తారాబాయి తనపుత్రునిని సింహాసనమునం దునిచి, తాను రామచంద్రపంతు, శంకరాజీ, నారాయణ, దనాజీ, జాధవ్ మొదలగు ప్రధానుల సహాయమున రాజ్యము చేయుచుండెను. ఆమె యొక్కస్థలముననే కూర్చుండియుండక ప్రతికోటకును దానే స్వయముగాఁబోయి యచట నావశ్యకములయిన వాని నరసి తగిన బందోబస్తు చేయుచుండెను. ఇదిగాకయామె సైన్యముల నంపి మహమ్మదీయ సైన్యములను గెలుచుట కారంభించెను. ఔరంగజే బొకవైపున నీమెకోట నొకదానిని గెలువఁ బ్రయత్నించునంతలో రెండవ వై పాతని స్వాధీనములో నుండిన కోటల నైదాఱింటిని తారాబాయి గెలుచుచునుండెను. రామచంద్ర పంతొకపర్యాయము మహమ్మదీయులకు సహాయము చేయుచున్నాఁడని తోఁచి తారాబాయి కాతనియందు కొంచె మనుమానము కలిగియుండెను. కాని పిదప నాతఁడు పన్హాళ పావనగడ లనుదుర్గములను బహు శౌర్యముతో గెలుచుటఁ గని యామెకు నాతనిపైఁ గలిగిన యనుమానమును వదలి అత్యంత విశ్వాసార్హునిగా నతనినే స్వీకరించి విశేష బహుమానము చేసెను. పిమ్మట నామె పన్హాళ కిల్లాలోని కరిగి యచటనే యుండెను.

ఇట్లు కొన్ని సంవత్సరములు గడచినపిదప ఔరంగజేబు మరణానంతరము సంభాజీ కొమారుఁడగు శాహు విముక్తుఁ డయ్యెను. అతఁడు తన రాజ్యమునకువచ్చి పినతల్లిని తనరాజ్యము తన కిమ్మని యడిగెను. అప్పుడు రాజ్యపాలనదక్షురాలగు తారాబాయి రాజ్యమిచ్చుటకు సమ్మతింపక నీవు నిజమయిన శాహువు కావనియు వేషధారివనియు కొన్ని యాటంకములు చెప్పెను. కాని శాహునకుఁ గొందఱు సరదార్లు స్వాధీనులయినందున తారాబాయికిని, శాహుకును యుద్ధము జరిగెను. అప్పుడు తారాబాయి పాతారాపట్టణమును దన బావకొడుకగు శాహునకు వదలి కోలాపురమున తన కొమా రుఁడగు శివాజీకొఱకు రెండవరాజ్యము స్థాపింపవలసిన దయ్యెను. ఆరాజ్యము నేటివఱకును నడుచుచున్నది.

కోలాపురమున తారాబాయి శివాజీకి రాజ్యముకట్టి రామచంద్రపంతు సంక్రాజీ నారాయణులను మంత్రులు తన పక్షము నవలంబించి తనకు సహాయులయియుండ రాజ్యము నేలసాగెను. కోలాపురమునకు సమీపమునందుండిన రాయగడ కిల్లా మహారాష్ట్రరాజ్యమునకు మూలస్థానమైనందున దానిని గెలువవలయునని శాహు ప్రయత్నింపు చుండెను. ఈ సమయమునం దనఁగా క్రీ. శ. 1712 వ సంవత్సరమునందు మశూచికా జాడ్యమువలన తారాబాయి కొమారుఁ డగు శివాజీ మృతుఁడయ్యెను. ఈ దు:ఖములో నామె యుండఁగా తారాబాయిని రాజ్యమునుండి తీసి యామె సవతి కొమారుఁడగు సంభాజీకి రాజ్యము నిచ్చి రామచంద్రపంతు తానే రాజ్యము నడుపుచుండెను. ఆసమయమున తారాబాయి గర్భిణితో నుండిన తనకోడలిని శత్రుభయముచేత నజ్ఞాతవాసములో నుంచెను. అక్కడనే యామె ప్రసవమై మగశిశువును గనెను. ఆశిశువుగూడ నజ్ఞాతవాసములోనే బెరుగుచుండెను.

క్రీ. శ. 1740 వ సంవత్సరప్రాంతమున శాహు విది కరిగెను. అతనికిఁ బుత్రసంతానము లేనందున నజ్ఞాతవాసములో నుండిన తారాబాయి మనుమఁడగు రామరాజును సాతారాకు రాజునుజేసి తారాబాయి యతని పేరిట తాను రాజ్యము నేలసాగెను. కాని యారాజ్యమునకు వంశపరంపరాగత మంత్రియగు బాలాజీ బాజీరావ్ పేష్వా ప్రబలుఁ డయి రాజుపేరిట తానే రాజ్యము నేల యత్నించెను. ఇందువలనఁ దారాబాయికిని పేష్వాకును ప్రబలవైరము సంభవించెను. అందుపై తారాబాయి సింహ గడయందుండిన తన పతియొక్క సమాధిని దర్శించు మిషతో నచటి కరిగి యచటి యామాత్యుని సహాయమువలన రాజ్యమును తానేల యత్నించెను. అప్పు డాసంగతి నెఱిఁగి బాలాజీ పేష్వా వైరముచే నీమే చిక్కదని తలఁచి మంచిమాటలచే నామెను పూనాకుఁ దీసికొనిపోయి రాజ్యమునందలి యనేకసంగతులు నీ యాజ్ఞప్రకారమే చేసెదనని చెప్పి యామెను సమాధాన పఱచుకొని రాజు నా యాజ్ఞప్రకారము నడువ వలయునని చెప్పెను.

ఈ సమయమునందు రామరాజు (తారాబాయి మనుమనిపేరు) సాగోళేయను గ్రామమునందుండెను. రామరాజునకు రాజ్యవ్యవస్థ తెలియనందువలన తనకుఁ గొంత జహగిరి వదలి రాజ్యమునంతను పేష్వాను చేయుమని యతఁడు వ్రాసి పంపెను. ఆప్రకారమే పేష్వా రాజయ్యెనుగాని యతనికి జహగిరి యియ్యకుండెను. తదనంతరము రామరాజును కొంత సైన్యముతోడ సాతారకంపెను. అచట నతనికిఁ బట్టణమంతయుఁ దిరుగుట కనుజ్ఞమాత్ర మిచ్చెను. అటుపిమ్మట పేష్వా ఔరంగబాదునకుఁ బోవుట తటస్థమయ్యెను. ఆసమయమునఁ దారాబాయి రామరాజు నడిగి యతనికి స్వతంత్రేచ్ఛ లేదని తెలిసికొనియెను. వెంటనే యావృద్ధనారి దామాజీగాయిక్వాడునకు "ఇచట నీకుఁ బ్రతిపక్షులు లేరుగాన మరాఠేల రాజ్యము బ్రాహ్మణుల (పేష్వాల) పాలుగాకుండఁ గాపాడవల యును" అని యుత్తరము వ్రాసియంపి రాజును పట్టణములో నుండి కిల్లాలోనికిఁబిలిపించి యిట్లు తిరస్కారోక్తులం బల్కెను. "ఓరీ! నీవు శివాజీవంశీకుఁడవుకావు. నేను నామనుమనిని హీనులయింట దాఁచితిని. కాని వారు నాపిల్లని నుంచుకొని తమపిల్లని నే నాకిచ్చిరి కాఁబోలును. నేనది విచారింపక నిన్నింతటి పదవికి నెక్కించి మిగుల వ్యసన పడవలసినదాన నయితిని. హీనకులుని శివాజీవంశస్థునిగాఁ జేసిన పాపమున కిఁక నేను కృష్ణాతీరమునకునరిగి ప్రాయశ్చిత్తముచేసికొనవలయును" ఇట్లని యామె రాజును వెంటనే కారాగృహవాసినిఁ జేసెను. పిమ్మట నాయువతికిల్లా యధికారినిఁబిలిచి రాజుసహచరులపైని, గ్రామములోఁగ, కోకణస్థబ్రాహ్మణ (పేష్వా) పక్షపాతులకు వారిగృహములపైని పిరంగిగుండ్లనువేసి నిర్మూలము చేయుమని యాజ్ఞాపించెను. ఈవార్త నాపురమునంగల కొందఱు పేష్వాపక్షము వారు విని ఈముసలమ్మకు మతిచెదిరి యేదియో యనుచుండునని తలఁచిరి. కాని సైన్య సహితుఁడయి గాయికివాడ్ వచ్చుటను విని వారందఱును కొంతసైన్యము సిద్ధపఱచి కృష్ణాతీరమునందుండిన పారోళేయను గ్రామమునందు యుద్ధ సన్నద్ధులై యుండిరి. దమాజీగాయకవాడ్ పదునైదువేలసైన్యముతోఁ బారోళేయను గ్రామమును సమీపించెను. అప్పుడా యుభయసైన్యములకుఁ గొంతకలహము జరిగినపిమ్మట దమాజీ ప్రతిపక్షబలంబుల నోడించి సాతారాలోనికిఁ బ్రవేశించెను. ఈయనపోయి తారాబాయినిం గలిసిన వెంటనే యీమె సాతారాసమీపమునందలి రెండుమూడు దుర్గములను వశపఱచుకొనియెను. ప్రతినిధి తారాబాయి కనుకూలుఁడగుటవిని పేష్వా బహుత్వరగా సాతారాకు రావలసినవాఁ డయ్యెను. పేష్వా సాతారాను సమీపించి దామాజీ గాయికవాఁడను ఓడించి యతనిని బంధించి పూనాకుఁబంపెను. తదనంతరము తారాబాయితనకు వశపడుటకై పేష్వా పెక్కు పాయములను బన్నెను. కాని యా స్వాభిమానముగల వనిత యెంతకును స్వాధీనపడకుండెను. సరదార్లంద ఱామె కనుకూలురై యుండినందున బలాత్కారముగా నామె నీవలకుఁదీయుట యుచితముగాదని పేష్వాకుఁ దెలిసియుండెను. అందువలన నతఁడు మరాఠీ వాని (సాతారాకోలాపురపు) రాజ్యములలోని కనేక పర్యాయములు బందిపోట్ల నంపి గ్రామములు కొల్లగొట్టించి తారాబాయిని, కోలాపురాధిపతియగు సంభాజీని వశపఱచుకొనెను.

పేష్వా గాజీయుద్ధీనుపనికొఱకు ఔరంగబాదున కరుగఁగా నా సమయమున తారాబాయి అయిదువేలసైన్యమును పోగుచేసివాయి, సాతారాలను రెండుపరగణాలను తన స్వాధీనము చేసికొనెను. పిమ్మట బాలాజీ పేష్వాపూనాకువచ్చి కర్ణాటకముపైకి దండువెడలుటకంటెను తారాబాయిచేఁ జిక్కిన కోటలను గెలుచుట యావశ్యకమని తలఁచెను. అంత నతఁడు సాతారాకు విశేషసైన్యములనంపి కిల్లాలోనికి నన్నసామగ్రి పోవకుండ నాపెను. అప్పు డచటి దుర్గాధిపతి యుద్ధము చేసినందున ఫలము లేదనుకొని రాజును తారాబాయియొక్క కిల్లాబైటికిఁ దీసికొనిపోవయత్నించెను. ఈసంగతి యేలాగుననో తారాబాయికిఁ దెలిసి వెంటనే యతనిని మరణదండనకు గురిచేసెను. అంత పేష్వా తారాబాయిని గెలుచుట దుస్తరమని తలఁచి అప్పటి కాసంగతిని విడిచి కర్ణాటకముపై కరిగెను. ఇట్లీశూరవనిత మొదట తనకొమారుని పేరిటను, పిదప మనుమని పేరిటను రాజ్యంబు జేసి ఔరంగజేబువంటి సార్వభౌమునితోడను, పేష్వాలవంటి మహాబలవంతులతోడను సమానముగాఁ బోరాడి స్వాభిమానమునకయి ప్రసిద్ధివడసి యెనుబదియాఱు సంవత్సరములవఱకుఁ బ్రతికి క్రీ. శ. 1761 వ సంవత్సరమునందు మృతిఁజెందెను.


గనోరు సంస్థానపురాణి

ఈశౌర్యశాలినియగు సతీరత్నముచేసిన శౌర్యసాహసములు దక్క విశేషచరిత మేమియుఁ దెలియదు. ఈమెపేరేమియో, జననీజనకుల పేళ్ళేమియో తెలిసికొనుటకుఁ బ్రస్తుత మేమియు సాధనములు కానరానందున నామె స్వల్పచరితము నిందుఁ దెల్పెదను.

మధ్యహిందూస్థానము నందలి బోపాలసమీపమున పూర్వము గనోరుసంస్థానమను నొకహిందూరాజ్య ముండెను. మహమ్మదీయులు హిందూస్థానమునకు వచ్చి స్వదేశపురాజుల పాలనలో నుండిన రాజ్యములను తాము స్వాధీనపఱచుకొను కాలములోని చిన్న సంస్థానము కొంతవఱకు ధైర్య మవలంబించి స్వతంత్రముగా నుండెను. మోగలులు డిల్లీ ప్రవేశించి యచటి తురుష్కులను వెడలఁగొట్టఁగా వారు హిందూస్థానము నలుగడలం జేరి వారివారిశక్త్యనుసారముగా రాజ్యములం గెలిచి జనుల ననేక బాధలకు లోను జేసిరి. ఇట్టివారిలోఁ జేరిన యొక మహమ్మదీయుఁడు మధ్యహిందూస్థానమునకు వచ్చి గనోరు రాజ్యమును గెలిచి యచట తనరాజ్యమును నిలుపవలయునని యత్నించెను. కాని యాసంస్థానమును గెలుచుట యాతఁ డనుకొనిట్లు సులభముగాక మిగుల దుస్తరమాయెను. తురకలు తనరాజ్యముపై యుద్ధమునకు వచ్చుట విని గనోరురాజు మిగుల రోషముతో వారితోడ యుద్ధమునకుఁ జనెను. అందు