అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/జోధపురపు రాణి

జోధపురపు రాణి

ఈరాణి ఔరంగజేబుబాదుషా రాజ్యారంభమునందు ననఁగాఁ బదు నేడవశతాబ్దమధ్యమున నుండెను. శహజహన్ బాదుషా రాజ్యదినములలో మార్వాడదేశమునందలి జోధపుర రాజ్యమును జసవంతసింగుఁడను రాఠోడవంశీయుఁ డగురాజు పాలింపుచుండెను. ఈయన పత్నియొక్క ధైర్యస్థైర్యములును స్వాభిమానమును మిగుల శ్లాఘనీయములు ఆమెపే రెచటను కానరాదు. కానియామె చేసినకార్యము లనేక దిక్కుల వర్ణింపఁబడినవి.

ఈజసవంతసింగు డిల్లీపతియగు శహజహానునకు సామంతుఁడయి యుండెను. జసవంతసింగు మిగుల పరాక్రమ వంతుఁడయి ఔరంగజేబును ఉత్తరమునకు రానియ్యక మాళ్వా ప్రాంతముననే బహుదినములవఱకు సంగ్రామము చేయుచు నాపెను. అప్పుడాయవరంగ జేబు తండ్రియగు శహజహనుని పదచ్యుతినిఁ జేయు తలంపుతో సహోదరసహితుఁ డయి డిల్లీకిఁ జనుచుండెను. త్రోవలో నుజ్జయనీయం దాతనిని జసవంతసింగు డాపఁదలఁపఁగా నాయిరువురకును ఘోరయుద్ధము జరిగెను. ఆయుద్ధమునందు సైనికులందఱు సమయుట వలన జయము కలుగునని ఆశలేక జసవంతసింగు మరలి తన నగరమునకు వచ్చుచుండెను. గ్రామమును సమీపించినకొలఁదిని ఆతని కొకవిధమయిన భీతి జనించెను. ఏలయనఁగా తాను పరా జయము నొంది పలాయితుఁ డయి వచ్చినవార్తవిని రాణి తన నేమనునో ముఖమయినను జూచునో లేదో యని స్వభార్యయొక్కక్షాత్రతేజము నెఱిఁగినవాఁడుగాన నాతనికి శంక కలిగెను. అదేప్రకార మాయన గ్రామమును సమీపించినతోడనే రాణి పట్టణపు సింహద్వారములు మూయించి యాతనిని పట్టణములోనికి రానియ్యక పోయెను.

నగరద్వారములను మూయించి యామెభర్త కిట్లు వర్తమాన మంపెను : _ "జోధపురాధీశ్వరుఁ డపజయమునుబొంది తనదీనముఖము నగరవాసులకుఁ గనుపఱుపకుండిన నే మంచిది. ఇట్టిపిఱికివానికి భార్యనైతినని నాకే మిగుల సిగ్గుగా నున్నది. జోధపురాధిపతియై మేవాడరాణాకు అల్లుఁడును నగువాఁడాజిని పరాజయమును బొందిపాఱివచ్చుటకంటె హీనత యే మున్నది?" ఇట్లని యామె యంతటితో నూఱకుండక సేవకులతో "చీతిఁ బేర్చుఁడు. జోధపురాధిపతి పరాజయమునుబొంది తిరిగి వచ్చుట సంభవింపదు. ఆయన యిదివఱకే శత్రువులచేఁ జంపఁబడియుండును. నేనుత్వరగా నాభర్తను గలియఁ బరలోకమున కేఁగెదను" అని చెప్పెను.

ఈప్రకారము వారముదినములు గడచినపిదప నీసంగతి నంతను విని యామె తల్లి జోదపురమునకు వచ్చెను. ఆమె వచ్చి కొమార్తె కనేకవిధముల బోధించి యిప్పు డపజయము పొంది వచ్చినను జసవంతసింగు మరల సైన్యసహితుఁ డయి పోయి శత్రువులతో సంగ్రామ మొనరించునని చెప్పెను. ఇట్లు తల్లిచేఁ బ్రబోధిత యయి యారాణి నగరద్వారములు తీయుట కాజ్ఞ యిచ్చెను. జసవంతసింగు డింటికి వచ్చినపిదప నాతని పత్ని భర్తకుఁ దగిలిన దెబ్బలను, గాయములను గని మిగుల విచారపడి వానికిఁ దగు నౌషధము రాచి మాన్పు ప్రయత్నములు చేసెను.

ఔరంగజేబు డిల్లీకరిగి తండ్రినికారాగృహమునం దుంచి సహోదరుల నంతమునొందించి, రాజ్యము నపహరించిన పిదప జసవంతసింగుని వైపు దృష్టి సారించెను. జసవంతసింగు నొకని నంతము నొందించిన తనరాజ్యము నిష్కంటక మగునని యాతఁ డనుకొనుచుండెను. కాన నాతని నుపాయాంతరముతోఁ జంప నెంచి యాసమయమున కాబూలుదేశమున జరుగుచుండిన ప్రజాయుద్ధము నాపుటకయి జసవంతసింగునికి సైన్యాధిపత్య మొసఁగి యాతని నచ్చటికిఁ బంపెను. కాని కపట మెఱుఁగని జసవంతసింగు తన కంతటి సైన్యాధిపత్యము దొరకినందున కెంతయు నుప్పొంగుచు రా జాజ్ఞ శిరసావహించి యాతఁడు దండయాత్రకు బయలు వెడలెను. అప్పు డాతని శూరపత్నియు నాతనితోడఁ గాబూలుదేశమునకు యుద్ధార్థమయి వెడలెను. ఆదంపతు లిరువురును దమ కిదివఱకుఁ బరాజయమువలనఁ గలిగిన యపకీర్తి నణఁచి శాశ్వతకీర్తిని సంపాదింపఁ గృతనిశ్చయు లయి పృధివిసింగుఁ డను పుత్రునకు రాజ్యము నిచ్చి సైన్యసహితు లయి వెడలిరి.

ఆసమయమునందు రాణిగారు పురుషవేషమును ధరియించి యొకానొకశూరుని పగిది భర్తతోడన యుండి యాతనికి సహాయురాలయి యనేకపర్వత ప్రదేశములను మిగుల కష్టముతో గడచి కొన్ని దినములకు కాబూలుపట్టణమును సమీపించిరి. వారచటికి వెళ్లునప్పటి కాదేశమంతయు రాజద్రో హులచే వ్యాపింపఁబడి యుండెను. కాన నాదంపతుల కచటి కరిగినపిదప విశ్రాంతి యన్నమాటయె తెలియదు. ఇట్లు జసవంతసింగు తనసైనికుల సహాయముచే నారాజద్రోహులను శాసింపఁ బ్రయత్నింపుచుండెను. ఆకష్టములలో వారికెటు చూచినను శత్రువుల భయము దప్ప మఱియేమియుం గానరాకుండెను. అచటి పర్వతజలమును, వాయువును వారిశరీరములకు సరిపడకపోవుటవలన వారికి మిగుల ప్రయాసమయ్యెను. ఇట్టిభయంకర సంగ్రామదివసంబులలో నాపతిభక్తిపరాయణ యగు రాణి గర్భవతిగా నుండియు భర్తను ఛాయవలె ననుసరించియుండి శూరపురుషునివలె నాతనికి సర్వవిధములఁ దోడుపడుచుండెను. ఆమెశౌర్యధైర్యములు గని రజపూతవీరులు మిగుల నాశ్చర్యపడుచుండిరి.

ఇన్ని కష్టములు పడినను రాణిగారికి సుఖప్రాప్తి లేదయ్యెను. కుటిలుఁడగు అవరంగజేబు జసవంతసింగు కాబూలులోనున్న కాలముననే విషప్రయోగము చేయించి యాతనిని చంపించెను. అదేప్రకారము పృథివీసింగును జోదపురమునుండి డిల్లీకి రప్పించి విషమిడి చంపించెను. జసవంతసింగుని వంశము మూలముతో నాశ మొందెనని ఔరంగజేబు సంతసింపు చుండెను. కాని యొకచిన్న యంకురము గలదని యెఱుంగఁ డయ్యె.

జసవంతసింగుని మరణానంతరము పరదేశము నందుండిన రాణి కష్టము లిట్టివని చెప్ప నెవ్వరివశము ? పతి మృతుఁ డయినతోడనే సహగమనము చేయుట యాకాలమునం దుత్తమముగా నెన్నఁబడుచుండెను. ఈరాణియు నట్లే చేసియుండు ను. కాని గర్భవతియగుటచే యనుగమనమును మానవలసిన దాయెను. అట్టియసహ్యదు:ఖకాలమునం దామె బొత్తుగా ధైర్యమువదలక నిండుగర్భవతియైనను తానే రజపూత సేనాధ్యక్షతను వహించి హిందూస్థానమునకు మరలెను. కాని యింతలో కాబూలుదేశములో నే యామె ప్రసవమయి యొకపుత్రరత్నముంగ నెను. ఈశిశుసింహుండే తనతండ్రిని సహోదరునిఁ జంపిన ఔరంగజేబు పగతీర్చుకొన సమర్థుఁడయ్యెను! ప్రసూత్యనంతరము కొంచెముశక్తి రాఁగానే రాణిగారు మరల ప్రయాణముచేసిరి. వారు పేశావరీనగరమునకు వచ్చువఱకు శత్రువులచే మిగుల నడ్డగింపఁబడు చుండిరి. కాని యాగ్రామమునకు రాగానే జోధపురమునుండి వారికి సహాయార్థము బయలు దేఱిన రజపూత సైన్యము వారినిఁ గలసెను. కాన నచటి నుండి వారికిఁ బగరచే నంతగా బాధగలుగకుండెను. వారందఱు డిల్లీని సమీపించఁగానే మరల పెక్కుచిక్కులు ప్రాప్తించెను. జసవంతసింహునిభార్య అజితసింగ కుమారునితో సుఖముగ డిల్లివఱకు వచ్చుటవిని బాదుషామిగుల క్రోధించి నీకొమారుని నాకడ కంపుమని రాణికి వర్తమానమంపెను. ఈ సంగతివిని రాణిగారు తనకొమారుని నంపుటకు సమ్మతించక తనసైన్యబలముచేఁ బోరాడితన్నును, తనబాలకుని సంరక్షించు కొన నిశ్చయించెను. అంత నామె తనశిశువు నొక........ పెట్టెలోనుంచి యాపెట్టె నొకవిశ్వాసపాత్రుఁడగు తురు......... కిచ్చి దానినొక సురక్షితమగు చోటికిఁ గొనిపొమ్మని చెప్పెను. వాఁడును అదేప్రకార మాబుటనుగొని పండ్లు కొ....మిష చెప్పి నియమితస్థలమునకుఁ గొని చనెను. రాణిగారు డిల్లీపట్టణమునుండి బయలుదేరుట మిగుల దుర్ఘటముగా నుండెను. అయినను శూరవనితయగు రాణియు నామె సైనికులును మిగుల శౌర్యముతోఁ బాదుషాసైన్యముల నోడించి మేవాడదేశపు మార్గమునంబడిరి. ఆసమయమునం దారాణియనేక వీరబటులశిరములు తన చేతి ఖడ్గముతో డొ-- నేసిన నవి డిల్లీయంతట వెదచల్ల బడియెనఁట. ఇట్లు వారందఱు మేవాడ మార్గమున నడుచుచు రాజపుత్రుఁడగు అజిత సింహుఁ డున్నస్థలమునకు వచ్చిరి. తనపుత్రుని కెంతమాత్రము ప్రాణభయములేక సురక్షితుఁడయు యుండుటఁగని రాణిపరమానందభరిత యయ్యెను. అంత నామెపుత్రసహితయయి మేవాడయందున్న తనసహోదరునికడ కేఁగెను. తనకొమారుఁడు పెద్దవాఁడగునంతవఱకు విద్యాబుద్ధులు చెప్పి సంరక్షించు నటులఁ దనతోఁబుట్టువుచే నొప్పించుకొని యాశిశువు నాతని స్వాధీనము చేసెను.

అజితసింగు పెద్దవాఁడయినపిదప తనశౌర్యముచే మహమ్మదీయుల ననేకపర్యాయము లోడించిపంపెను. రాణియుఁ దనపుత్రుని సంగ్రామకేళి కెంతయు సంతోషించికన్న ఋణము తీఱెనని చెప్పుచుండెను. ఈరాణి వృద్ధయై కాలధర్మము నొందెను.


విమల

ఈ పతివ్రత ఘూర్జరాధిపతియగు జయశిఖరునికి సహోదరి. ఈజయశిఖరుఁడు క్రీ. శ. 695 వ సంవత్సరప్రాంతమున పంచాసర మనుపట్టణము రాజధానిగా ఘూర్జరదేశము పాలించినట్టు తెలియుచున్నది. ఆసమయమున ఘూర్జరదేశము మిగుల నున్నతదశయం దుండెను. విమల మిగుల రూపవతి యగుటయే గాక, సద్గుణవతియై యుండెను. సకల దేశముల రాజపుత్రులును తమ్మే యామె వరియింపవలెనని కోరుచుండిరి. కాని విమల యైశ్వర్యభోగములయం దిచ్ఛ లేనిదియై గుణవంతుఁడగు శౌర్యనిధిని వరియింప నిచ్ఛగలిగియుండెను.

ఇట్లుండఁగాఁ గొన్ని దినములకు ముల్తానను పట్టణము నందు రాజు భార్యాపుత్ర సహితుఁడయి ప్రభాసక్షేత్రము దర్శించుటకుఁ బోవుచుఁ ద్రోవలో నుండినందున పంచాసరమునకు వచ్చెను. అప్పుడు జయశిఖరుఁడు వారినితనకోటలోనికిఁ గొనిపోయి తగిన మర్యాదలుచేసి కొన్నిదినములు వారి నచట నుంచుకొనియెను. వారచటనుండిన దినములలో నా రాజునకుఁ బుత్రుఁడగు సురపాలునితో జయశిఖరుఁడు క్రీడాయుద్ధము చేయుచుండెను. నంత:పురకాంత లందఱును చూచుచుండిరి. అప్పుడు సురపాలుని శౌర్యసద్గుణములు విమలకుఁ దెలిసెను. అంత నొకదిన మా రాజపుత్రులు సింహమువేట కరుగుచు దానిఁ జూచుటకై విమలతోఁగూడ నంత:పురకాంతల నందఱ నరణ్య