అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/గణపాంబ

గణపాంబ

ఈమె బేటరాజునకు భార్య; గణపతిదేవునకుఁ గూతురు ఈగణపతిదేవుఁడు క్రీ. శ. 1245 వ సంవత్సరమునుండి 1292 వ సంవత్సరమువఱకును నోరుగంటిరాజ్యముఁ బాలించిన రాజేయైయుండిన చోనీగణపాంబరుద్రమదేవికిఁ గూతురైయుండును. కానియిందునకుఁ బ్రబలనిదర్శనము లేవియుఁగాన రాకున్నవి. గణపాంబయుఁదనపతి మరణానంతరమునందాతని యేలుబడిలోనుండిన యాఱువేలగ్రామములనుమిగుల నేర్పుతోఁబాలించెను. ఆమె మిక్కిలి యౌదార్యవతియై యనేకవిధములైన ధర్మకార్యములను జేసెను. ఈమె ధర్మకృత్యములను జరితమును దెలుపు శిలాశాసనమొకటి కృష్ణా మండలములోఁ జేరియున్న గుంటూరు తాలూకాలోనున్నది. దానిలోని కొన్ని సంగతుల నిందుఁ బొందు పఱచెదను.

"మిగుల ప్రసిద్ధిఁగాంచిన కాకతీయవంశమునందు అనేక ప్రభువులు రాజ్యము చేసినమీదట వైరిభీకరుఁడగు బేటరాజు సింహాసనారూఢుఁడయ్యెను. శివునకుఁ బార్వతివలెను, విష్ణువునకు లక్ష్మివలెను, ఈబేటరాజునకు గణపాంబ ధర్మపత్ని యయ్యెను. ధర్మకటకపురిని మిక్కిలి యోగ్యముగా బాలించి బేటరాజు కీర్తి శేషుఁడయ్యెను. తదనంతరం బాతనిభార్యయగు గణపాంబ సింహాసన మెక్కెను. ఈమె భర్తయొక్క సుగతి నభిలషించి యాయనపేరిట ధన్యకటక పురమునం దొకదేవాలయము నిర్మించెను. ఈ యుద్దేశముతోనే యీరాణి బంగారు శిఖరముగల యింకొకగుడిని గట్టించి దానిలో బేటేశ్వరుఁడను లింగమును బ్రతిష్ఠింపఁజేసెను. ఈగుడికి నైయీదేవి ఫలవంతమగు బీనదీవియనుగ్రామము నొసంగెను. ఈమహనీయురాలు ధన్యకటకపురిలో 12 గురు బ్రాహ్మణోత్తములకు 12 భూపసతులును 12 గృహములును దాన మొసంగెను. ఈమె తనతండ్రియగు గణపతిదేవుని పేర గణపేశ్వరుని (శివుని) యాలయమొకటి కట్టించెను. ఈగుడికై యీరాణిచింతపాడు గ్రామము నొసంగెను. ఈ రాణిహస్తములు సతతము శివుని నర్చించుటయందే వినియోగించెను. శివుని మాహాత్మ్యమును బ్రకటించు శ్లోకములే యామె కానందము నిచ్చుచుండెను. ఈ రాణివేదములయం దధికవిశ్వాసముకలది కావుననే విశాల రాజ్యక్లేశము కలిగియున్నను ఆనందముతో దినములు గడపెను. రెండవపార్వతి యనఁదగిన యీమె మహాత్మ్యము నెవ్వరు తగినట్టుగ వర్ణింపఁగలరు?" ఈ మహనీయురాలిచరితమును గుఱించి యింతకంటె నధిక మేమియుఁ దెలియదు కాన విధిలేక మిగులచింతతో దీనిని ముగించు చున్నదాన.