అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/కృష్ణాకుమారి

కృష్ణాకుమారి

ఈవీరబాల మేవాడ దేశాధిపతి యగు మహారాణా భీమసింహుని కూఁతురు. ఈమె 1792 సంవత్సరమున మేవాడదేశపు రాజధాని యగు ఉదేపూరున జన్మించెను. జాతకర్మాది సంస్కారములు జరిగినపిదప నాబాలకుఁ గృష్ణయని నామకరణము చేసిరి. కృష్ణయం దామెజనని కధికప్రీతి యగుటచే నామె మిక్కిలి గారాబముతోఁ బెరుగుచుండెను. కృష్ణాకుమారి అత్యంత రూపవతిగా నుండెను. ఆమె పెరిగిన కొలఁదిని నామె యందలి యనేక సద్గుణములచే నామె విశేషకీర్తిం గనెను. ఇట్లుండఁగా గొన్ని సంవత్సరముల కాబాల వివాహయోగ్య యయ్యెను. కాన రాణిగారికి గూఁతు వివాహచింత విశేషమయ్యెను. ఆమెయొక్క యసమానరూపమును మృదుమధుర భాషణములును నదివఱకే దేశమంతటను వ్యాపించెను. కాన జనులామెను రాజస్థాన మను కొలనిలో నీమెయపూర్వపద్మమని పొగడుచుండిరి.

ఇట్టి కన్యారత్నము నేవరునకు నియ్యవలయునని భీమరాణా మిగుల విచారసాగరమున మునింగెను. ఆయన కిట్టి చింత గలుగుట కొకకారణము కలదు. ఆ కాలమునందా రజపుతస్థానమునం గల రాజు లందఱిలో ఉదేపురపు రాణాలు శ్రేష్ఠకులీనులుగా నెన్నఁబడుచుండిరి. తమకంటె నుచ్చవంశీకులకుఁ గన్య నిచ్చిన సరి. లేనియెడల రజపూతులలో మిగుల నవమానకరముగా నుండును. కాన రాణాగారు సమానవంశీకుని వెదకుచుండిరి. కాని యట్టి వరునకు విద్యాగుణములు సరిపడవయ్యెను. విద్యాగుణైశ్వర్యములు కలవరుని వెతకినచో వాఁడు కులీనుఁడు గాక పోవుచుండెను. ఇందువలనఁ గన్య నెవ్వరి కిచ్చుటకును కొంతవడి నిశ్చయింపనేరక తుదకు మార్వాడదేశపు రాణాయగు భీమసింహునకుఁ గన్య నియ్య నిశ్చయించెను. కాని ప్రారబ్దవశమున నల్పకాలములోనే మార్వాడ భీమసింహుఁడు స్వర్గస్థుఁ డయ్యెను.

తదనంతరము జయపురాధీశ్వరుఁ డగు రాణాజయసింహుఁడు కృష్ణాకుమారిని తనకిమ్మని యడుగుట కొకదూత నంపెను. ఉదేపూరాధీశ్వరుఁడును అందుకు సమ్మతించి కన్యను జయసింహున కిత్తునని చెప్పెను. ఇంతలో మార్వాడ దేశపు సింహాసనమున నెక్కిన రాణామానసింహుఁడు భీమసింగున కిటు చెప్పి పంపెను. 'ఇదివఱ కీసింహాసనముపై నున్న వానికి కన్య నిచ్చుటకు నిశ్చయించితిరి. విధివశమున నాతఁడు కాల ధర్మము నొందెను. అయినను నీకన్య యీసింహాసనమునకు వాగ్దత్తయయి యున్నది. కాన నాకియ్యవలయును. రాణాభీమసింగుఁడు మార్వాడ రాణాదూతతో మీరాజునకు నాకూఁతు నియ్యనని స్పష్టముగాఁ దెలియఁజెప్పి పంపెను. అందువలన మార్వాడ దేశమునకును మేవాడదేశమునకును వైరము సంప్రాప్తమాయెను. ఆరెండుదేశములయందును సంగ్రామ సన్నాహములు జరుగుచుండెను. ఆసమయమునందు గ్వాలేరురాజగు సిందే జయపురాధీశ్వరునిపై మిగుల వైరము కలవాఁడయి భీమసింగున కిట్లు వర్తమానమంపెను. "కృష్ణాకుమారిని జయపురపు రాణా కిచ్చినయెడల నేను మానసింహునకుఁ దోడుపోయి నీతో యుద్ధముచేయుదును" ఈవార్త విన్నంతమాత్రమున భీమసింహుఁడు తననిశ్చయమును మరల్పకుండెను. తనమాటను ఉదేపూరు రాణా లక్ష్యపెట్టకుండుటఁ గని సిందే మిగులకోపించి యుద్ధసన్నాహముతో బయలుదేరి యుదయపురమును సమీపించెను. సిందే ఉదయపుర ప్రాంతమున విడిసినపిదప కొన్నిదినములకు భీమసింగుఁడును సిందేయును నొక దేవాలయములోఁ గలిసి యేమో యాలోచించి జయసింహునకుఁ నియ్యనని భీమసింగు వర్తమానమంపెను. జయపురాధిపతి తనయాస లన్నియు నిరాశ లగుటవలన మిగుల కోపగించుకొని మానసింహునితో యుద్ధము చేయుటకై సైన్యము సిద్ధపఱుప నాజ్ఞాపించెను. మానసింహుఁడును యుద్ధమునకు కాలుద్రవ్వుచునే యుండెను. అతని శత్రువులు కొందఱు లక్ష యిరువదివేల సైన్యము పోగుచేసి జయసింహునకు సహాయులయిరి. అప్పుడారాజుల కిరువురకును పర్వతశిఖర మనుస్థలమున ఘోరసంగ్రామము జరిగెను. ఆ యుద్ధమునందు మానసింహుని సైనికులనేకులు జయసింహునితోఁ గలియుటవలన మానసింహుఁడు యుద్ధమునుండి పలాయితుఁ డయ్యెను. ఇట్లు పాఱిపోయి యాతఁడు యోధగడయను దుర్గములో దాఁగియుండెను. జయసింహునిసేన యోధగడను ముట్టడించి భేదింపఁ దొడఁగెను. కాని యాదుర్గ మబేద్య మగుటచే వారు దానిని భేదింపనేరక మరలిపోయిరి. ఈయుద్ధమునందు జయసింహుని సైన్యము మిగుల నాశమొందెను. కాన జయపురాధీశ్వరుఁడు తనపురమునకుఁ బాఱిపోయెను. మానసింహుని శత్రుఁడయిన రాజొకఁడు తనసైన్యములోని నవాబు ఆమీర్ ఖానను మ్లేచ్ఛునిచే చంపఁబడెను. ఈవిశ్వాసఘాతకుఁ డగు తురుష్కుఁడే పిదప ననేక యుక్తులచే నుదేపూర్ రాణాకు ముఖ్యస్నేహితుఁడయి అజిత సింహుఁడను నాతనినిఁ గృష్ణాకుమారి తండ్రికడ సేవకునిగా నుంచెను.

ఇంత సంగ్రామమయినను జయసింహ మానసింహుల కింకను యుద్ధమునందలి యిచ్చ తగ్గదయ్యెను. అందువలన వారిరువురును దళములతోడ ఉదేపురమునకు వచ్చుచుండిరి. కాన నాసంగతివిని భీమసింహ రాణా మిగుల చింతతో నాయుభయులను సమాధానపఱుచు నుపాయము విచారింపు చుండెను. ఆయన కేమియుఁ దోచక అమీర్‌ఖాను నేకాంతముగాఁ బిలిచి యాలోచన యడిగెను. అప్పు డాదుష్టుఁడు కృష్ణా కుమారిని మానసింహున కిచ్చుటొండె, చంపటయొండె యుత్తమమని చెప్పెను. ఈరెంటిలో కృష్ణాకుమారిని చంపుటయే యుత్తమమని రాజునకుఁ దోచెను. కాని స్త్రీహత్య జేయుట కాతని సేవకులలో నొకఁడును నొడంబడఁ డయ్యెను. భీమసింగుఁడు దౌలత సింగుఁడను సేవకునిం బిలిచి కొమార్తెను జంప నాజ్ఞాపించెను. అందు కాభృత్యుఁడు ప్రభువును తిరస్కరించి తానట్టిపనిని చేయనని నిశ్చయముగాఁ జెప్పెను. తదనంతరము రాణాగారు యౌవనసింహుఁ డనువానిం బిలిచి యీ ఘోరకర్మ చేయుమని చెప్పెను. ఈయౌవనసింహుఁ డట్టికార్యము చేయుటకుఁ దనకిష్టము లేకున్నను రాజాజ్ఞకు వెఱచి దాని కియ్యకొనెను. అంతనాతఁడు చేత ఖడ్గము ధరియించి యాకన్య నిద్రించు గృహమునకుఁ జనెను. కాని యానిద్రించు సౌం దర్యరాశినిం గనినతోడనే యాతని చేతులాడక ఖడ్గము చేతినుండి క్రిందఁబడ నాతఁ డాకార్యమును మాని మిగుల దు:ఖముతో మరలిపోయెను. తదుపరి అమీర్ ఖాను దుర్మంత్రము వెల్లడికాఁగా రాజసతి దు:ఖమునకుమితము లేదయ్యెను.

రాజభవనమునం దంతటను దు:ఖమయముగా నున్నను కృష్ణాకుమారి ముఖమునం దెంతమాత్రమును మృత్యుభీతి కానరాదయ్యెను. ఆమె యెప్పటివలె సంతోషముగా నాడుచు, పాడుచుఁ జెలులకు నీతులను బోధింపుచుఁ గాలము గడుపుచుండెను. నీకూఁతును విషప్రయోగమువలనఁ జంపుమని రాణాగారికి అమీర్‌ఖా నాలోచన చెప్పెను. అట్టినీచకృత్యము రాణా గారికి సమ్మత మగుటవలన నొకబంగారుగిన్నెలో విషముపోసి దాని నాయనబిడ్డకడ కంపెను. దానిని కృష్ణాకుమారి సన్నిధికిఁ దెచ్చిన సేవకుఁ డీవిషము మీతండ్రి మీకొఱకుఁ బంపెనుగాన దీనినిమీరు స్వీకరింపవలయునని చెప్పఁగా నాబాల తండ్రియాజ్ఞ శిరసావహించి యావిషపాత్ర నాభృత్యుని చేతినుండి తీసికొని పరమేశ్వరునిఁ బ్రార్థించి తండ్రికి ధనాయుష్య సమృద్ధియగుంగాత యని యావిషము నామె త్రాగెను. విషప్రాశనానంతరమునందు సహితమామె మరణభయము నొందక తనయిష్టదైవమునుఁ బ్రార్థింపుచుండెను. ఇంతలో నామెతల్లి శోకించుట విని యాబాల తల్లి కిట్లు సమాధానము చెప్పెను. "అమ్మా! నీవేల శోకించెదవు? దు:ఖమెంత త్వరగాఁ దగ్గిననంత మంచిది. నేను క్షత్రియవీరుని బిడ్డనుగాన మరణమునకు వెఱవను. ఈశరీరము పుట్టినప్పుడే చావు సిద్ధము. ఇఁక నాచావునకై వగచిన నేమిఫలము" ఇట్టివాక్యములచేఁ దల్లికి సమాధానము చెప్పుచు నవ్వుచు నుండునేకాని యాబాల యావిషముచే మృతి చెందదాయె. అంత రెండవభృత్యుఁడు మఱియొకపాత్రలో విషముపోసికొని వచ్చి యామెచే త్రాగించెను. కాని యందువలనను ఆమె మరణ చిహ్నము కానరా దయ్యెను.

తుద కామె చావనందునను సమరసమను నొకభయంకరమయిన విష మామె కిచ్చిరి. దానిని త్రాగిన వెంటనే యాకన్యారత్నముయొక్క పవిత్రచరితము ముగిసెను. కాని కృష్ణాకుమారి ధైర్యము, నిర్భయత్వము, సత్యశీలము, దేశముకొఱకుఁ దండ్రికొఱకుఁ జూపిన యాత్మత్యాగమును మొదలగునవి యీప్రపంచమునం దుండి యామె కీర్తిని నజరామరము చేయునున్నవి.