అబద్ధాల వేట - నిజాల బాట/హిందూ నెపోలియన్‌గా వివేకానంద
వివేకానందను తమ గురువుగా స్వికరిస్తున్నట్లు యిటీవల ఆర్.ఎస్.ఎన్. నాయకులు ప్రకటించారు. అది సరైన నిర్ణయం. వివేకానంద స్థానాన్ని సక్రమంగా గుర్తించారనడానికి యిదొక నిదర్శనం.
హేతువాదులు, మానవవాదులు యిదే విషయాన్ని అనేక సంవత్సరాలుగా చాటి చెబుతున్నారు. అయినా జనం అంతగా పట్టించుకొలేదు. వివేకానంద ఆర్.యస్.యస్. తత్వానికి, ధోరణికి ఆద్యుడు. కనుక వారాయన్ను గురువుగా భావించడం సముచితం. అయితే కమ్యూనిస్టులు సైతం యిటీవల వివేకానంద సూక్తులు పుస్తకాలుగా ప్రచురించారు. ఆయన ఫోటోలు పెట్టి సభలు జరిపారు. వివేకానంద ఆ విధంగా అటు ఆర్.యస్.యస్. వారికీ, యిటు కమ్యూనిస్టులకు గౌరవ ప్రదముడుగావడం, ఆయన వ్యక్తిత్వ విశేషమా? పరిశీలించాలి. హేతువాదులు, మానవవాదులు కోరుతున్న దేమంటే, వివేకానందను చదివి, అర్థం చేసుకొని, తరువాత అంచనా వేయమని! అలా జరగడం లేదు. ఏవో కొన్ని సూక్తులు, యెక్కడో ఒక ఉపన్యాస భాగాన్ని ఉదహరించి, పొగిడేస్తున్నారు. వీరారాధన చేస్తున్నారు. ఆవేశపూరిత వాతావరణం సృష్టిస్తున్నారు. వివేకానందను నిశితంగా పరిశీలించడం, విమర్శించడం మహా తప్పిదంగా, భారత వ్యతిరేకతగా చూస్తున్నారు. అది ఫాసిస్టు లక్షణం.
మానవవాదులపై ఇదేమీ కొత్తగా వచ్చిన అపనింద కాదు. 1920లో యం.యన్.రాయ్ వివేకానందను విమర్శించారు. ఆ తరువాత హ్యూమనిస్టులు వివేకానందపై పరిశోధన, పరిశీలన చేసి, విమర్శించారు. అగేహానంద భారతి ప్రత్యక్షంగా రామకృష్ణ మఠంలో చేరి, లోన ఏం జరుగుతుందో గుట్టు రట్టు చేశాడు.
ఆంధ్రలో హ్యూమనిస్టు ఉద్యమ నాయకుడు ఆవుల గోపాలకృష్ణమూర్తిని అమెరికా ప్రభుత్వం 1964లో ఆహ్వానించినప్పుడు తెనాలిలో వీడ్కోలి సభ జరిగింది. గుంటూరు రాజేశ్వరరావు అనే ఆయన వ్యంగ్యంగా ఆవుల గోపాలకృష్ణమూర్తిపై విమర్శల వర్షం కురిపించారు. వివేకానంద ప్రస్తావన తెచ్చి, ఆయన గొప్పతనం చాటమనీ, ఆయన అడుగుజాడల్లో నడవమని కొందరు సలహా యిచ్చారు. తాను అమెరికా వెళ్ళేది వివేకానంద ప్రచారం కోసం కాదనీ, ఎవరైనా అదిగితే నిక్కచ్చిగా తన అభిప్రాయం చెబుతాననీ, వివేకానంద విషయంలో హ్యూమనిస్టులకు స్పష్టమైన అవగాహన వున్నదనీ అన్నారు. ఆ వార్త ఆంధ్రప్రభలో ప్రచురించారు. నీలంరాజు వెంకటశేషయ్య ఆనాడు ఆంధ్రప్రభకు ఏడిటర్ గా వుంటూ, గోపాలకృష్ణ మూర్తిపై అనేక లేఖల విమర్శలు చేయించారు. ఆయన్ను అమెరికా నుండి వెనక్కు పిలిపించాలన్నారు. ముదిగొండ శివప్రసాద్ వంటి తిరోగమన ఛాందసులు అదే అవకాశంగా తీసుకొని తిట్టారు.
ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో నిరంజనధర్ హ్యూమనిస్టుగా పరిశోధన చేసి, వివేకానందపై విపులంగా రాస్తే, పెద్ద స్పందన వచ్చింది. కాని ఆయన రాసిందాన్లో ఫలానా దోషం వుందని యెవరూ చూపలేకపోయారు.
అగేహానందభారతి చేసిన విమర్శల దృష్ట్యా ఆయన పుస్తకాన్ని (ఆకర్ రోబ్) రామకృష్ణ మిషన్ వారు భారతదేశంలో నిషేధించేటట్లు భారత ప్రభుత్వంపై వత్తిడి తీసుకరాగలిగారు. అది వారి మత సహనానికి గీటురాయి! ముస్లింలు సాల్మన్ రష్దీ గ్రంథాన్ని నిషేధించినట్లే యిదీ జరిగింది. క్రైస్తవులు యెన్నో గ్రంథాలు నిషేధించారు. మతానన్నిటికీ అంతటి సహనంవుంది మరి!
ఉదయం దినపత్రికలో ఎ.బి.కె. ప్రసాద్ ఎడిటర్ గా నా వ్యాసాన్ని ప్రచురించారు. అందులో ఒక ఎడిటోరియల్ నోట్ రాస్తూ "మహాత్ములను కేవలం భజిస్తూ వుండడం మన ధ్యేయం కారాదు, మానవుడే ఒక తప్పొప్పుల పట్టిక, ఇందుకెవరూ మినహాయింపు కాకపోవచ్చు. నిజానిజాల గురించిన అన్వేషణా దృష్టి ఆరోగ్యమనే భావన ఒక్కటే ఇక్కడ ప్రధానమని గమనించ ప్రార్థన" అన్నారు. 1985లో యీ వ్యాసం జనవరి 27 ప్రచురితమైంది. మరునాడే లాఠీలు పట్టుకొని వీరహిందూ యువకులు ఉదయం ఆఫీసుకు వచ్చారు. సమాధానం రాయండి, వేస్తాం అని సంపాదకులు అన్నా, వారు పట్టించుకోలేదు. అలాంటి వ్యాసం ప్రచురించరాదన్నారు. ఆ మరునాడు వివేకానందను ఆకాశానికెత్తుతూ ఎడిటోరియల్ రాయాల్సిన దుస్థితి కల్పించి జర్మనీలో హిట్లర్ రాజ్య లక్షణాలను గుర్తుకు తెచ్చారు. అదీ వివేకానంద భక్తుల విచక్షణా జ్ఞానం.
వివేకానంద గురించి అబద్ధాలు రాయడం లేదు. దుష్టప్రచారం చేయడం లేదు. ఉన్నది ఉన్నట్లు తెలియపరుస్తూ, హేతువాద దృష్టిలో మా పరిశీలనాభిప్రాయాల్ని, భవిష్యత్తు దృష్ట్యా చెబుతున్నాం.
వివేకానందగా మారిన నరేంద్ర
కలకత్తాలో నరేంద్రనాథ్ దత్తా బ్రహ్మ సమాజంలో వుండేవాడు. చదువుకునే రోజులలో ఆయనపై కొంతమేరకు క్రైస్తవ మిషనరీల ప్రభావం పడింది. రామకృష్ణ అప్పటికే దక్షిణేశ్వర్ లో పరమహంసగా ప్రచారం పొందినా, నరేన్ ను ఆకర్షించలేదు. 1863లో పుట్టిన నరేన్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. విద్యార్థిగా సహజ ధోరణిలో ప్రశ్నిస్తుండేవారు. తొలుత రామకృష్ణను చూచినప్పుడు నరేన్ ఆకర్షితుడు కాలేదు. కాని రామకృష్ణ మాత్రం నరేన్ పట్ల విపరీత యిష్టత పెంచుకొని, ఎలాగైనా అతడ్ని తన శిష్యునిగా చేసుకోవాలని పదే పదే కబురు చేస్తుండేవాడు. ఈ విషయం పాఠకులు గ్రహించాలి.
నరేన్ కాలేజీలో చదువుకునే రోజుల్లో పెళ్ళి సంబంధాలు చూచారు. పెళ్ళి కుదరడానికి ఏవో చిన్న పేచీలు అడ్డం రాగా, ఆలశ్యం జరిగింది. పెళ్ళి ప్రయత్నం తెలిసిన రామకృష్ణ, నరేన్ కు నచ్చజెప్పి, పెళ్ళి ప్రయత్నం విరమింపజేయడానికి చాలా కృషి చేశారు. కాని ఫలితం రాలేదు. నరేన్ పెళ్ళికి విముఖత చూపలేదు. ఆ దశలో నరేన్ తండ్రి చనిపోయాడు. ఇంటి యజమాని హఠాత్తుగా లేకుండా పోవడం, నరేన్ పెద్ద కుమారుడుగా బరువు బాధ్యతలు మోయాల్సి వచ్చింది. ఏదైనా ఉద్యోగం చేద్దామని విఫల ప్రయత్నం చేసిన నరేన్, తప్పనిసరిగా దక్షిణేశ్వర్ వెళ్ళాడు. అది పెద్ద మలుపు. ఆకలితో, అప్పులతో, సంసార భారంతో ఏం చేయాలో దిక్కుతోచక, ఉద్యోగం రాక, అలమటిస్తూ రామకృష్ణ దగ్గరకు వెళ్ళిన నరేన్ స్థితి ఊహించుకోవచ్చు. ఆశ్రమంలో చేరితే సంసార బాధ్యతలు ఉండవు. అడిగేవారు లేరు. ఆకలి బాధ వుండదు. నరేన్ వెళ్ళిన స్థితి అలాంటిది రామకృష్ణకు ఎలాగూ నరేన్ కావాలి. అలాంటి శిష్యుని కోసం రామకృష్ణ కొన్నాళ్ళుగా ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నాంగదా. యెవరి అవసరం వారిది. పరస్పర అనుకూల స్థితి ఏర్పడింది. సన్యాసి కావడానికి నరేన్ సిద్ధపడ్డాడు. సన్యాసిగా చేసుకోవడమే గాక ప్రియశిష్యుడిగా స్వీకరించడానికి రామకృష్ణ ఆసక్తి కనబరచాడు. సన్యాసిగా మారిన నరేన్, ఇల్లు వదలి ఆశ్రమానికి మారాడు. సన్యాసి తన ఇంటిని, ఆస్తిపాస్తుల్ని, పూర్వాశ్రమాన్ని పూర్తిగా వదలేయాలి. పేరు మార్చుకోవాలి నరేన్ పేరు వివేకానంద అని మారలేదు. "వివిశానంద" అని మారింది. ఆ తరువాత "సచితానంద" అని 1892 వరకూ వుండేది. ఇది కూడా పాఠకులు గుర్తుపెట్టుకోవాలి. సన్యాసి మనస్తత్వం గురించి చాలా విపులంగా, నిశితంగా, అన్ని కోణాల నుంచి యం.యన్.రాయ్ వివరించి, 1936లోనే ప్రచురించారు. పాఠకులు అది చదవాలి. నరేన్ సన్యాసి అయి, వివేకానందగా మారిన తరువాత, తిండికీ, బట్టకూ, నివాసానికి గతుల్ని ఒక్కసారి ఆయన మరచిపొలేకపోయాడు, అందుకు తోడు, అతని తల్లి అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చి కష్టనిష్ఠూరాలు చెప్పుకునేది. వివేకానంద కూడా తరచు ఇంటికివెళ్ళి కుటుంబ కలహాలు పట్టించుకుంటుండేవాడు.
నరేన్ సన్యాసి అయిన తరువాత, 5 సంవత్సరాలకే, 1886లో రామకృష్ణ పరమహంస కేన్సర్ తో చనిపోయారు. రామకృష్ణకు ప్రియశిష్యుడిగా నరేన్ బాగా సన్నిహితుదయ్యాడు.
రామకృష్ణ పరమహంస అద్వైత వేదాంతాన్ని చెప్పేవాడని కాసేపు గుర్తుంచుకోవాలి. ఆయన శిష్యుడుగా చేరిన నరేన్ వేదాంతాన్ని, మాయావాదాన్ని తృణీకరించలేదు, పైగా ప్రచారం చేయడానికి పూనుకున్నాడు. రామకృష్ణ చివరి దశలో మాత్రమే నరేన్ సన్నిహితంగా మెలగగలిగాడు. అయినపుడు యోగాభ్యాసం యెవరి వద్ద నేర్చుకున్నాడని పరిశీలిస్తే "పౌజార్జీ" వద్ద అనేది గమనార్హం. ఉత్తరోత్తరా నరేన్ రాజయోగంగా ప్రచారం చేసిన యోగాభ్యాసం అదేనన్నమాట. రామకృష్ణను అవతారంగా వివేకానంద గుర్తించలేదు. ఆశ్రమనాసుల నిమిత్తం ఆయన ఒక కరపత్రం వ్రాసి, రామకృష్ణను ఎవరు ఎలాగైనా భావించవచ్చని స్పష్తంగా రాశాడు. రామకృష్ణ మరణానంతరం ఆశ్రమాన్ని పోషించాల్సిన శిష్యులు, భిక్షాటన చేద్దామని తలపెట్టారు. వివేకానంద ఆ విధంగా దేశమంతా తిరగవలసి వచ్చింది. ఎవరు డబ్బిచ్చినా ఆయన స్వీకరించేవారు కాదని, పచ్చి అబద్దాలు యింకా రాస్తూనే వున్నారు. (చూడు: స్వామి లోకేశ్వరానంద, స్టేట్స్ మన్ సెప్టెంబరు 16, 1993) అసలు బయలుదేరిందే డబ్బు కోసం.
వివేకానందపై బ్రహ్మసమాజ్, కొంత మేరకు క్రైస్తవ మిషనరీల సేవల ప్రభావం చూపెట్టాయని ఉదహరించాం. తన గురువు రామకృష్ణ చెప్పిన వేదాంతానికీ, సమాజంలో పేదరికానికి పొత్తు కుదరకపోవడం వివేకానంద గమనించక పోలేదు. హిందూ ఆశ్రమ ధర్మానుసారం ఎవరికి వారు వ్యక్తిగతంగా మోక్షసాధన కోసం కృషి చెయాల్సిందే. వ్యక్తి బాధలు, పేదరికం అలాంటివన్నీ కర్మ ప్రకారం వచ్చినవే. కనుక ఒకరు మరొకరికి సహాయపడేదేమీ లేదు. అందుకే సేవాధర్మం హిందూ సంప్రదాయం కాదు. ఇందుకు భిన్నంగా వివేకానంద సేవాధర్మాన్ని ప్రవేశపెట్టాడు. ఒక వైపు రామకృష్ణ ఆశ్రమం వారే వివేకానంద ప్రయత్నాన్ని వ్యతిరేకించారు. అయినా వినకుండా సేవాధర్మాన్ని ఆయన ప్రచారం చేశారు. అది వివేకానంద విశిష్టత. గోసంరక్షకులు వచ్చి చందాలు అడిగితే, ముందు మలమలమాడే పేదల సంగతి చూడండి అని చెప్పడం వివేకానంద గొప్పతనం. ఈనాడు వివేకానందుని శ్లాఘించే వారిలో చాలా మంది గోసంరక్షకులే వుండడం కూడా గమనార్హం. వివేకానందను వాడుకోవాలనుకునే వారే యీ మత ఛాందసులనే సంగతి గుర్తుచేయడానికే యీ ఉదాహరణ తెచ్చాను. మాటలెన్ని చెప్పినా, వాదనలు ఎలా మలచినా, చివరకు అద్వైత వేదాంతాన్నే వివేకానంద ధ్యేయం అని కూడా మరో ప్రక్క మరచిపోరాదు! సన్యాసిగా పర్యటించిన వివేకానంద దేశమంతటా స్వదేశీ సంస్థానాలలోనూ, జమీందార్ల వద్దకూ వెళ్ళాడు. వాళ్ళ అతిథిగా వున్నాడు. డబ్బు వసూళ్లకు వెళ్ళాడు గనుక వారి ఆతిథ్యం స్వీకరించాడు. రామకృష్ణ ఆశ్రమం గుక్కతిప్పుకొని నిలవడానికి వివేకానంద ఆదుకోవడమే ఆదిలో తోడ్పడింది. పనిలో పనిగా తన కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేసుకోవడానికి వివేకానంద భిక్షాటన తోడ్పడింది. కష్టాల్లో వున్న తన కుటుంబానికి నెలకు వంద రూపాయల చొప్పున యిప్పించడంలో వివేకానందుడు కృతకృత్యుడయ్యాడు. ఖెత్రి మహరాజా అందుకు ఒప్పుకొని, ప్రతి నెలా వివేకానంద తల్లికి, సోదరులకు వంద రూపాయలు పంపేవాడు. 1890 ప్రాంతంలో 100 రూపాయలంటే ఇప్పుడు లక్షరూపాయల విలువ! తన తల్లికి సొంత యిల్లు కట్టించి పెట్టాలని సన్యాసిగా వివేకానంద ప్రయత్నించి విఫలుడయ్యాడు. బేలూరు మఠం నుండి 3 వేల రూపాయలు రుణంగా తీసుకున్నాడు. మహారాజాలను అడిగినా ఎందుకోగాని డబ్బు రాలేదు. చివరకు గృహనిర్మాణ తలంపు విరమించాడు. తన పేరిట మఠం స్థలాన్ని కొనుగోలు చేస్తే అది కోర్టు కేసుగా మారింది. తన పేరిట స్థలం కొనమని అమెరికా నుండి కూడా రామకృష్ణానందకు ఉత్తరం రాశాడు వివేకానంద! కుటుంబాన్ని మరచిపోని సన్యాసిగా వివేకానంద చివరి వరకూ ఆస్తిపాస్తులకోసం ప్రయత్నించడం ఆయన కుటుంబ ప్రేమను సూచిస్తుంది. రాజయోగం పై రాసిన పుస్తకానికి డబ్బురాగా, అది బాంక్ లో వేసి, తన తదనంతరం తన తల్లికి యివ్వమన్నాడు. ఇదంతా వివరంగా ఎందుకు వ్రాయవలసి వచ్చిందంటే, సన్యాసిగా అవసరార్ధం మారిన వివేకానంద, సన్యాసి ధర్మాన్ని పాటించలేకపోయాడని చూపడానికే. అమెరికాలో సైతం తన అభిమాని సెవియర్ ఇచ్చిన సొమ్మును కుటుంబానికే పంపిన వివేకానంద, ఇంటికి అలాగే పంపించమని కూడా ఆమెను కోరాడు.
రామకృష్ణ చనిపోయిన తరువాత, మఠాన్ని పోషించడానికి బ్రతికించడానికి జమిందార్లు పూనుకున్నారు. ఇందుకు నాంది పలికినవాడు మధుర మోహన్ అనే జమిందారు. ఆయన రామకృష్ణను బాగా వాడుకున్న జమిందారు. యాత్రల పేరిట రామకృష్ణ వెంట వెళ్ళి, కాశీలో జమిందార్లతో తన అవసరాల గురించి పట్టించుకున్న మధురమోహన్ చాలా తెలివైనవాడు. జమిందారుగా మధురమోహన్ నరరూప ఫాసిస్టు. అతిక్రూరుడు. ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేసి విలాసంగా బ్రతికిన జమిందారు. రైతుల్లో తీవ్ర అసంతృప్తి, ఆందోళన వున్నచోటుకు రామకృష్ణ పరమహంసను తీసుకెళ్ళి, భక్తిని ప్రదర్శించేవాడు. రైతులు ఏమీ చేయలేకపోయేవారు. ఆకలితో, అప్పులతో వున్న రైతులకు భక్తిని చూపడం మన దేశ సాంప్రదాయం. అది మధురమోహన్ బాగా గ్రహించాడు. రామకృష్ణ అందుకు కొరముట్టుగా ఉపకరించాడు. అలాగే మరికొందరు జమిందార్లు కూడా రామకృష్ణ అనంతరం ఆశ్రమం పట్ల ఆసక్తి కనబరచారు. డబ్బివ్వడానికి సంసిద్ధులయ్యారు. వివేకానంద తన గురువువలె జమిందార్ల దారుణ పాలనకు తోడ్పడ్డాడు. ఇదంతా వేదాంత భక్తి పేరిట, ప్రాక్టికల్ వేదాంతం అనే నినాదంతో సాగిపోయింది. ఆ సందర్భంగా వివేకానంద జాతీయ వాదోపన్యాసాలు కూడా చేశాడు. అవి జాతీయవాదుల్ని ఆకర్షించాయి. కాంగ్రెసులోని అతివాదులు కూడా వివేకానంద ప్రవచనాలకు ప్రేరితులయ్యారు. ఇది వివేకానంద వ్యక్తిత్వానికి మరో వైపు కనబడిన తీరు.
రామకృష్ణ ఆశ్రమాన్ని పోషిస్తున్న బెంగాల్ జమిందార్లు కష్టాల్లో పడ్డారు. ఆశ్రమాన్ని ఆదుకోలేని దుస్థితిలో వున్నారు కనుక బెంగాల్ వెలుపల జమిందార్లను ఆశ్రయించాల్సిన పరిస్థితిలో వివేకానంద పర్యటనకు బయలుదేరాడు.
వివేకానంద 1891లో ప్రారంభించి ఎక్కడ పర్యటించారో గమనించాం. జైపూర్, ఖెత్రి, అహమ్మదాబాద్, అళ్వార్, కథియవాడ్, జునాగఢ్, పోర్ బందర్, ద్వారకా, పైలితానా, బరోడా, ఖండ్వా, పూన, బొంబాయి, బెల్గాం, బెంగళూరు, మలబార్ తీరం, కొచ్చిన్, తిరువాస్కూరు, త్రివేండ్రం, మధురై, రాంనాడ్, ఆమేశ్వరం, కన్యాకుమారి. వివేకానంద పర్యటనలో రాజులు, దివానుల వద్ద అతిథిగా రాచమర్యాదలతో వుంటూ, మరో చోటకు వెళ్ళేముందు పరిచయపత్రాన్ని యువరాజు, దివాన్ ల దగ్గర తీసుకెళ్ళేవారు. రామకృష్ణ మఠానికి తగిన నిధుల్ని వివేకానంద సమకూర్చగలిగారు. ఈ పర్యటనలో వివేకానందకు అనేకమంది శిష్యులు, భక్తులు, అభిమానులు సమకూడారు. జాతీయోద్యమంలో నాయకుడు తిలక్ కూడా ఆయన్ను కలసిన వారిలో వున్నారు.
వివేకానంద స్వయంగా భక్తిగీతాలాపన చేసేవాడు. సంగీతం నేర్చిన వ్యక్తిగా ఆయన పర్యటనలో అది చాలా ఆకర్షించింది. ఉద్వేగ పూరితంగా పేదరికం గురించీ, స్త్రీల పట్ల విచక్షణ గురించి వివేకానంద మాట్లాడేవాడు. గీత చదివే బదులు ఫుట్ బాల్ ఆడడం మంచిదని ఉపన్యాసాల ధోరణి వుండేది. ఇదంతా జనాన్ని ఆకర్షించగా జాతీయ ఉద్యమకారుల్ని ఉత్తేజపరచింది. దేశవ్యాప్తంగా మధ్యతరగతిలో వివేకానందకు ప్రచారం లభించగా ఉన్నత వర్గాలవారు ఆయన్ను పోషించారు. ఆ విధంగా దేశ పర్యటన ముగించుకున్న సందర్భంలో, ప్రపంచ మత సమావేశం షికాగాలో జరగబోతున్నట్లు ఇండియాకు వార్త వచ్చింది. అది మరొక పెద్ద మలుపు. స్వదేశీ సంస్థానాదిపతులు తమ ఘోరకృత్యాలు, ప్రజాపీడన కప్పిపుచ్చుకోడానికి వివేకానందని అడ్డం పెట్టుకున్నారు. బ్రిటిష్ పాలనకంటె దేశీయ ప్రభువుల పాలన మెచ్చుకుంటూ వివేకానంద వారికి వత్తాసు పలికారు. ఉభయులూ చెట్టాపట్టాలు వేసుకొని, సామాన్య ప్రజల్ని పట్టించుకోలేదు. వివేకానంద పేదవారిపట్ల సానుభూతి చెబుతూ చేసిన ప్రసంగాలు, రాసిన రాతలు ఒక ఎత్తుకాగా, అందుకు విరుద్ధంగా పేదల్ని రైతుల్ని దారుణంగా అణచివేసిన స్వదేశీ సంస్థానాధిపతుల్ని పల్లెత్తు మాట అనకపోగా, వారిని ఆకాశానికెత్తారు. కనీసం సంస్థానాలలో సామాన్యులు ఎలా వున్నారని కూడా విచారించలేదు. ఫ్యూడల్ పాలనకు మతపరమైన మద్దత్తు లభించడంతో, జమిందార్లు వివేకానందకు డబ్బు గుప్పించారు. అంతటితో ఆగక ఆయన్ను ప్రపంచ మత మహాసభకు పంపడానికి సిద్ధపడ్డారు. వివేకానంద కూడా అదొక సదవకాశంగా భావించారు.
అమెరికా పోవడానికి ముందు ఖెత్రి మహారాజా బహిరంగ దర్బారు నిర్వహించి, "వివేకానంద" అని కొత్త సన్యాసి పేరు పెట్టారు. 1893 వేసవి నుండే వివేకానంద పేరు ప్రచారంలోకి వచ్చింది. అదీ వివేకానంద పేరుకు మూలం. వివేకానంద వెంట జగ్ మోహన్ లాల్(ఖెత్రి మహారాజా దివాన్) రాగా బొంబాయి వెళ్ళి అమెరికా ప్రయాణానికి సన్నద్ధమయ్యారు. స్వామీజీకి కావలసినవన్నీ సమకూర్చిపెట్టి, స్టీమర్ లో మొదటి తరగతి టిక్కెట్ కొనిచ్చారు. ప్రయాణపు ఖర్చుల నిమిత్తం కొంత సొమ్ము యిచ్చారు. అంతేకాదు వివేకానందకు ఒక సిల్కు తలపాగా తయారుచెసి తొలుత యిచ్చింది కూడా ఖెత్రి మహారాజానే. అదే వివేకానందకు చిహ్నంగా మారింది. అప్పటికి రామకృష్ణ భార్య శారదామణి బ్రతికేవుంది. ఆమె ఆశీర్వచనం పొంది, 1893 మే 31న బొంబాయిలో పెనిన్సులా అనే స్టీమర్ లో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణంచేసి జులై 25న కెనడాలోని వాంకోవర్ చేరుకున్నారు. బొంబాయిలోనే స్వామీజీకి జమిందార్లిచ్చిన ధనాన్ని సర్క్యులర్ నోట్లుగా మార్చి ఇచ్చారు. అమెరికా చేరుకునేనాటికి వివేకానంద ఆ నోట్లు పోగొట్టుకోగా, ఆ విషయం తెలిసి, తామస్ కుక్ అండ్ సన్స్ ద్వారా మహారాజా మళ్ళీ డబ్బు సమకూర్చారు. ఈలోగా వాంకోవర్ నుండి రైల్లో షికాగో జులై 30న చేరారు. సెప్టెంబరులో గాని మత మహాసభ జరగదు. అందువలన షికాగో నుండి బోస్టన్ వెడుతుండగా మిస్ కేట్ శాన్ బార్న్ అనే వృద్ధురాలు తటస్తపడి, ఆదరించింది. వివేకానందను తన అతిథిగా అట్టిపెట్టి, గుర్రపు బుగ్గీపై తిప్పి జనానికి ప్రదర్శించింది. హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జాన్ హెన్రీరైట్ కు పరిచయం చేసింది. అతడు వివేకానందకు మత మహాసభ ప్రతినిధిగా వెళ్ళమని మళ్ళీ షికాగో పంపాడు. ఆయన యిచ్చిన అడ్రసు పారేసుకున్న వివేకానందకు జార్జీ హేల్ అనే స్త్రీ తటస్తపడి, ఆదరించి, మత మహాసభ ప్రతినిధిగా వెళ్ళే ఏర్పాట్లు చేసింది.
వివేకానందపై అమెరికాలో అనేక దుష్టప్రచారాలు ప్రచారంలోకి రాగా ఇండియా నుండి ఖెత్రి, జునాగడ్ మహారాజాలు ఆయనకు ఉత్తరాలిచ్చి పరువు నిలబెట్టారు.
షికాగోలో ప్రపంచ మత మహాసభలు 1893 సెప్టెంబరు 11న ప్రారంభమై సెప్టెంబరు 27న ముగిసాయి. వివేకానంద తొలిరోజున సంక్షిప్త ప్రసంగం చేశారు. మళ్ళీ సెప్టెంబరు 15న మాట్లాడారు. సెప్టెంబరు 19న వివేకానంద హిందూమతంపై వ్యాసం చదివారు. సమావేశం చివరినాడుకూడా వివేకానంద క్లుప్తంగా మాట్లాడారు. మొత్తం 10 మతాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కొలంబస్ ఆర్ట్ పాలెస్ లో జరిగిన యీ సమావేశాలలో 7 వేల మంది వరకూ హాజరయ్యారు. షికాగో సమావేశాలు వివేకానందకు పేరు తెచ్చిపెట్టాయి. భారత జమిందార్లు తాము చేసిన ఖర్చు వృధా కాలేదని సంతోషించారు.
షికాగో మత సమావేశం వలన వివేకానందకు ఇండియాలో విపరీత ప్రచారం లభించింది. వివేకానంద ఉపన్యాసాలు మత సమావేశంలో ఆకర్షణీయమైనాయి. ఆయన వాగ్దోరణి కొందరికి బాగా నచ్చింది. షికాగో ఉపన్యాసాలు మతపరంగా అమెరికావారు గ్రహిస్తే, జాతీయ హైందవవాదంగా భారతీయులు స్వీకరించారు. షికాగోలో చేరినవారంతా మతపరమైన విశ్వాసులే. ఎవరి మతం వారికి గొప్ప. అలాగే చాటుకున్నారు. వివేకానంద హిందూ మత ఔన్నత్యాన్ని చాటడమే గాక, పాశ్చాత్యం భౌతికవాదమయమనీ, భారతదేశం ఆధ్యాత్మికమనీ, కనుక ప్రపంచానికి హైందవాన్ని ఎగుమతి చేయాలనే ధోరణి కనబరచాడు. ఇదే భారతీయులలో మతవాదుల్ని ఆకట్టుకున్నది.
ముస్లింలు ఇస్లాంను, క్రైస్తవులు బైబిల్ ఆధారంగా క్రైస్తవాన్ని ప్రపంచ మతాలుగా చాటి, తమకు తిరుగులేదని ఎవరికి వారు చెప్పుకుంటూ, ఇతరుల పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తుండగా వివేకానంద అడ్డుతగిలాడు. ఉగ్ర హైందవవాదిగా మాట్లాడాడు. ఇది వీరి హిందువులకు నచ్చింది. వివేకానంద షికాగో విజయం పట్ల అసూయపడిన కొన్ని మతవర్గాలు ఆయనపై విషప్రచారాలు చేయకపోలేదు. అవి తట్టుకొని, ఎదురీది, అమెరికాలో పర్యటించి డబ్బు వసూలు చేశాడు. అమెరికా పర్యటనలో వివేకానంద హిందూ ప్రవక్తగా ప్రవచనాలు పలికాడు. అద్వైత వేదాంతాన్ని ఆచరణలోకి తేవాలని కొత్త పదాలతో భాష్యాలు చెప్పాడు.
క్రైస్తవ మత ప్రచారం, మిషనరీల సేవలు కూడా హిందూమతం అవలంబించేటట్లు వివేకానంద కృషిచేశాడు. అమెరికాలో అనేకమంది డబ్బు గుప్పించేశారు. మేరీ బర్క్ వంటివారు శిష్యులయ్యారు.
మనిషిలోని దైవశక్తిని గుర్తించాలని వివేకానంద నినదించాడు. మనిషి ఆశక్తిపై ఆధారపడాలన్నాడు. జతీయవాదులకు యిది కూడా చాలా ఆకర్షణీయంగా పరిణమించింది. సేవాభావాన్ని వివేకానంద భారతీయులకు బోధించాడు. ఇది క్రైస్తవం నుండి స్వీకరించి, వేదాంతానికి జోడించడం వివేకానంద గొప్పతనం. అమెరికాలో క్రైస్తవ మిషనరీలు, యూనిటేరియన్ శాఖతో బాగా పరిచయం చేసుకున్నాడు. షికాగో మతసభలో కొన్ని వ్యాసాలు కూడా ఆయనపై ప్రభావం చూపెట్టాయి. బోస్టన్ లో క్రైస్తవ క్లబ్ లో వివేకానంద ప్రసంగించారు. ఎపిస్కోపల్ చర్చ్ వారితో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. బాపిస్టు చర్చివారితో సన్నిహితత్వం పెంపొందించుకున్నాడు. ఇదంతా ప్రాక్టికల్ వేదాంత భావానికి, రామకృష్ణ మిషన్ స్థాపనకు దారి తీసింది. భారతదేశంలో హిందూమతం బాగా బ్రతకడానికి వేదాంత సోషలిజం పేరిట జనాన్ని ఆకట్టుకోదలచాడు. ప్రతి మనిషీ దేవుడే గనుక, మనిషిని ప్రేమిస్తే దైవాన్ని ప్రేమించినట్లే అని చెప్పాడు. మనిషికి సేవచేస్తే దైవసేవ చేసినట్లే అన్నాడు. భారతదేశం ఆధ్యాత్మికమనీ, పాశ్చాత్యలోకం భౌతికమనీ, కనుక వారందరికీ భారతదేశమే ఆధ్యాత్మికత చెప్పగలదనీ అన్నాడు. ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా జయించాలనే వివేకానంద హిందూ నెపోలియన్ అయ్యాడు. పాశ్చాత్య పదార్ధవాద వ్యామోహం కూడదన్నాడు. ఇది కూడా జాతీయవాదులకు మరింత ఉత్తేజాన్నిచ్చింది.
వివేకానంద భారత ఆధ్యాత్మికవాదాన్ని ఎం.యన్.రాయ్ ఉత్తరోత్తరా ఖండించారు. సోదాహరణగా, భారతదేశం కూడా పాశ్చాత్యలోకానికి ఏ మాత్రం తీసిపోని పదార్థ భౌతికవాదంతో వున్నదని చూపారు. డిరోజియా, రాం మోహన్ రాయ్ లు ఆరంభించిన పునర్వికాసోద్యమానికీ వివేకానంద అడ్డుకట్ట వేశాడు. పాశ్చాత్య లోకం నుండి సైంటిఫిక్ స్పిరిట్ నేర్చుకోవాలనే ధోరణికి వివేకానంద ప్రతిభందకమయ్యాడు. దేశాన్ని వెనక్కు నడిపించాడు. ఆయన ఆదర్శాలతో సాగిన జాతీయోద్యమం మానసికంగా, సామాజికంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయలేకపోయింది. కేవలం ఉద్రేకం మాత్రమే గాక, నమ్మకాన్ని జోడించి వివేకానంద వివేచనను చంపేశారు? చిత్తవృత్తి నిరోధం యోగానికి మూలం. అదే చిట్కాగా వివేకానంద స్వీకరించి, ఆకర్షణీయ కరపత్రాలు వ్రాసి ప్రచారం చేశారు. రాజయోగం పేరిట ఆయన రాసిన చిట్కాలు బాగా అమ్ముడుపోయాయి. డబ్బు వచ్చింది. గురువు లేకుండా యోగం అభ్యసించరాదంటూనే, అదొక చిట్కామార్గంగా రాజయోగం అనే పేరిట ప్రచారం చేయడం విశేషం. వివేకానంద యోగి ప్రచారాన్ని అగేహానంద భారతి విమర్శించారు. ఆత్మ పరమాత్మల సంలీనాన్ని సూచించే లయ యోగానికి వివేకానంద రాజయోగం అనే ఆకర్షణీయ పదం వాడాడన్నారు. గురువు లేకుండా యోగం అభ్యసిస్తే ప్రమాదకరమని హెచ్చరించిన వివేకానంద, అలాంటి ప్రమాదాన్నే చిట్కా కరపత్రాలలో ప్రచారం చేశాడన్నారు. వైద్యం చేసేవారు నాలుగు రకాల డాక్టర్లన్నట్లు, యోగాన్ని 4 రకాలుగా వర్గీకరించి వివేకానంద ప్రచారం చేయడాన్ని భారతి పెద్ద దోషంగా పేర్కొన్నారు. రాజ, కర్మ, జ్ఞాన, భక్తి యోగాల పేరిట వివేకానంద చేసిన ప్రచారం ఆధారంగా చాలామంది పాశ్చాత్యలోకం, అదే పరమసత్యం అనే భ్రమలో వున్నట్లు భారతి చూపారు. పతంజలి యోగాన్ని వక్రీకరించిన వివేకానందను, కొందరు స్వాములు బాగా వాడుకుంటున్నారన్నారు.
వివేకానంద పుస్తకం చదివి యోగాభ్యాసం చేసి పిచ్చెక్కిన వాళ్ళున్నారని భారతి చెప్పారు. హిందూమతం సహనంతో కూడిందనే వివేకానంద వాదం కూడా పూర్తిగా దోషపూరితమనీ, మూలసూత్రాలలో హిందూమతం యితర మతాలతో అంగీకరించదని, తీవ్రస్థాయిలో వాదిస్తుందనీ ఆయన చెప్పారు.
మత సమావేశాల అనంతరం అమెరికాలో వివిధ ప్రాంతాలు పర్యటించిన వివేకానంద విలాసవంతమైన స్టార్ హోటళ్ళలో వుంటూ డబ్బుకు కొదవలేని స్థితిలో, ప్రచారాన్ని చేసి, వివిధ పరిచయాలతో కొంతకాలం గడిపారు.
తిరిగి వస్తూ ఇంగ్లండ్ లో ఆగిన వివేకానంద ఎడ్వర్డ్ స్టర్డీకి అతిథిగా వున్నారు. కాని వివేకానంద విలాసజీవితం చూచిన తరువాత అతిత్వరలోనే ఎడ్వర్డ్ తన సంబంధాన్ని తెంచుకున్నాడు. అమెరికాలొ లియో లాండ్స్ బర్గ్ కూడా వివేకానందతో సంబంధాలు తెంచుకోడానికి విలాస జీవితమే కారణం.
అమెరికా నుండి ఇంగ్లండు వచ్చిన వివేకానంద మతపరమైన మార్గరెట్ నోబుల్ అనే యువతిని తన శిష్యురాలిగా లోకానికి పరిచయం చేశారు. ఆమె నివేదిత వివేకానంద చనిపోయిన తరువాత ఆమె స్కూలు పెట్టి, సొంతంగా సామాజిక సేవ చెసింది వివేకానంద ప్రభావం ఆమెపై తాత్కాలికమే అయింది.
ఇండియాకు విజయవంతంగా తిరిగి వచ్చిన వివేకానందకు జమిందార్లు అపూర్వ స్వాగతం పలికారు. వారి డబ్బుతో అమెరికా వెళ్ళిన విషయం వివేకానంద విస్మరించలేదు. దేశంలో అడుగుపెట్టగానే రామనాథపురం రాజా ఘనస్వాగతం ఏర్పాటుచేసి, తొలుత అడుగిడిన చోట వివేకానంద విగ్రహస్థాపన చేయించాడు. ఆచరణాత్మక వేదాంతాన్ని చూపడానికి వీలుగా పేదలకు రాజావారు అన్నదానం చేసి, ప్రాక్టికల్ వేదాంతానికి ప్రారంభోత్సవం చేశారు.
వివేకానంద అశ్వంథాన్ని స్వయంగా రాజా కూడా కాసేపు లాగి తన వేదాంత భక్తిని ప్రదర్శించారు. అప్పుడు జరిగిన సభలో రామనాధపురం రాజాకు రాజర్షి బిరుదును వివేకానంద ప్రసాదించారు.
ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేయడంలో రామనాధ్ రాజా పెట్టింది పేరు. కరువు కాటకాలతో జనం విలపిస్తుంటే, విలాసజీవితం గడిపిన రామనాడ్ రాజా తెలివిగా తన ఆధ్యాత్మికతను, వివేకానందను అడ్డం పెట్టుకొని జనానికి చూపాడు. ఆధ్యాత్మికం అనగానే నోరు మూసుకొనే అమాయకుల్ని ఆకట్టుకోవడం రాజాలకు బాగా తెలుసు. ఆ తరువాత రాజాలందరూ మద్రాసులో వివేకానందకు ఘన స్వాగత సభ జరిపారు. గైక్వాడ్ మహారాజా స్వయంగా అధ్యక్షత వహించారు.
బెంగాల్ రాష్ట్రానికి వచ్చిన వివేకానందకు మళ్ళీ జమిందార్ల స్వాగతమే లభించింది. ఉత్తర పర రాజా (పియరి మోహన్ ముఖోపాధ్యాయ), సోవా బజార్ మహారాజా (బినాయ్ కృష్ణ దేవ్ బహుదూర్) దర్భంగా మహరాజా, మహరాజా నరేంద్ర కృష్ణ బహదూర్, మహరాజా గోవిందలాల్ రాయ్ బహదూర్ లు ఆహ్వానసంఘంగా ఏర్పడి స్వాగతం పలికారు. గ్వాలియర్ మహారాజా వచ్చి చేరారు.
డార్జిలింగ్ లో బర్ ద్వాన్ మహారాజా తన అంతఃపురాన్ని వివేకానంద సేవలకు యిచ్చారు. కాశ్మీర్ మహారాజా వివేకానంద గృహనిర్మాణానికి ఒక స్థలం కేటాయించారు. కలకత్తాలో జమిందార్లు విందులిచ్చారు. స్వదేశీ సంస్థానాలలో జమిందార్లు చూపిన ఆదరణ వివేకానంద కృతజ్ఞతలతో స్వీకరించారు.
1897లో రామకృష్ణ మఠం ఏర్పరచారు. జమిందార్ల డబ్బు పుష్కలంగా వచ్చి పడింది. వివేకానంద విలాస జీవితం, జమిందార్లతో స్నేహం రామకృష్ణ ఆశ్రమ సన్యాసులకు నచ్చలేదు. నిరసన తెలిపారు. బేలూరు మఠంతో సంబంధాలు తెంచుకొని పేదల రామకృష్ణ సభ ఏర్పరుచుకున్నారు. గిరీంద్ర, హరధకాలు యిందుకు ఆధ్వర్యం వహించారు. సంపన్నుల మఠానికి వివేకానంద ఆధిపత్యం వహించారన్నమాట. జమిందార్లు యీ చీలిక చూసి కలవరపడ్డారు. రామకృష్ణ జయంతి కూడా ఎవరికి వారే జరుపుకున్నారు. ఇదంతా వివేకానంద మూలంగానే జరిగిందని వేరే చెప్పనక్కరలేదు. పేదల కోసం ఎన్నో మాటలు చెప్పిన వివేకానంద, అప్పుడూ జమిందార్ల పక్షం వహించడమే యిందుకు మూలం అని గ్రహించాలి.
మతాన్ని రాజకీయాల్లోకి తెచ్చిన వ్యక్తి వివేకానందుడే. జాతీయోద్యమకారులకు, బెంగాల్ విప్లవకారులకు ఆయన ఉత్తేజాన్నిచ్చాడు. బెంగాల్ లో ప్రారంభమైన సెక్యులర్, పాజిటివిస్ట్, హేతువాద ఉద్యమాలు కూడా వివేకానంద ఉద్రేక నినాదాలతో ఆగిపోయాయి. ఇండియా ఆధ్యాత్మికంగా గొప్పది గనుక పాశ్చాత్యుల నుండి నేర్చుకోవల్సిందేమీ లేదనే ధోరణికి ఆద్యుడు వివేకానందుడే. సైన్స్ వ్యాపించకపోడానికి, వివేచనతో ఆలోచించకపోడానికి, వివేకానందుడు ఆజ్యం పోశాడు. నిరంజన్ ధర్ తన వేదాంత అండ్ బెంగాల్ రినైజన్స్ లో వివేకానంద గురించి హేతు దృక్పధంతో పరిశోధన చేశారు. అగేహానంద భారతి స్వయంగా రామకృష్ణ మిషన్ లో పనిచేసి, 8వ సంపుటాన్ని పరిష్కరించడంలో తోడ్పడిన వ్యక్తి. ఆయన తన రచనలలో వివేకానంద గురించి నిశిత పరిశీలన చేశారు. అవన్నీ ఈ రచనకు ఆధారాలు కూడా.
దేశం వెనక్కు నడుస్తున్నది. ఈ ప్రయాణం వివేకానంద వేదాంతంతో ఆరంభమై యిప్పుడు వేగం పుంజుకున్నది. యువత ఇది గ్రహించి తిరోగమనాన్ని ఆపి, శాస్త్రీయ పద్ధతి వైపు మళ్ళితేనే పురోగమనం, పునర్వికాసం సాధ్యం. వివేకానందను చరిత్రలో భాగంగా పరిగణిస్తేనే యిది సాధ్యం. మధ్య తరగతివారు వివేకానందను చదవకుండానే, ఏవో కొన్ని సూక్తులు ముక్కున పెట్టుకొని ఆరాధిస్తున్నారు. వివేకానంద రచనలు చదివితే, విచక్షణకు వివేచనకు నిలబడవని రుజువు కాగలదు.