అబద్ధాల వేట - నిజాల బాట/సగం సంస్కరణ - సగం పునర్వికాసం
దేశంలో పునర్వికాసానికి డిరోజియో నాంది పలికితే,హిందూ పునర్వికాసానికి రాజా రామమోహన్ రాయ్ శ్రీకారం చుట్టాడు. వాస్తవంగా అంచనా వేస్తే రామమోహన్ రాయ్ సంస్కరణవాదానికి దేశంలో పితామహుడంటే సరిగా వుంటుంది. తన ఏకేశ్వరవాదానికి అనుకూలంగా వుండే ఉపనిషత్ రచనలను ఇంగ్లీషులోకి అనువదించి, ఒకే శక్తి వున్నదనే వాదం బలంగా వున్న ప్రమాణరచనల్ని వదిలేయడం గమనార్హం. ప్రమాణ గ్రంథాల్ని అనువాదాలలో యిలా మార్చేయడం సంస్కర్తలందరూ భారతదేశంలో చేసిన పనే!
42 సంవత్సరాలకే బ్రిటిష్ వారి కొలువుచాలించి ప్రజా సేవకు ఉద్యమించిన రామ్ మోహన్ కలకత్తా చేరారు. అంతవరకూ ఆయన జిల్లాలలో వివిధ ఉద్యోగాలు నిర్వహించి,సాహిత్య, మతరంగాలలో కృషిచేశారు. నాడు కలకత్తా భారతదేశ రాజధాని వివిధ మేధో రంగాలలో కలకత్తా అప్పుడే స్పందిస్తున్నది.
చదువుకుంటున్న కొద్దిమంది మధ్యతరగతి, ఉన్నతవర్గ విద్యార్థులలో కొందరు హిందూ ఆచారాలను, మూఢనమ్మకాలను ప్రశ్నించారు. పాశ్చాత్య చింతనాపరుల గ్రంథాలు చదివి ప్రభావితులైన విద్యార్థులు హిందూమతాన్ని ప్రశ్నించారు. క్రైస్తవ మతప్రచారకుల మద్దత్తు కూడా వీరికి లభించింది. ఇందుకు భిన్నంగా హిందూమతాన్ని రక్షించాలని మరికొందరు పూనుకొన్నారు. అలాంటి సమయంలో, 1815లో రామమోహన్ కలకత్తా చేరుకున్నారు. ఆయన వహించిన కీలకపాత్ర దృష్ట్యా కొంత పూర్వాపరం తెలుసుకోవడం అవసరం.
హిందూమతాన్ని సంస్కరించాలనే ఆయన ప్రయత్నం వలన, బెంగాల్ లో హిందువులు క్రైస్తవులుగా మారిపోకుండా పెద్ద అడ్డుకట్ట వేయగలిగాడు. రామమోహన్ తొలుత ఇస్లాం మతప్రభావంలోకి వచ్చాడు. తరువాత క్రైస్తవమత ప్రభావం క్రిందకు వచ్చాడు. అవి రెండూ రంగరించి హిందూమతంలో జొప్పించే సంస్కర్తగా తేలాడు. అలాగే సంస్కృత భాషాధ్యయనం చేసి, పవిత్ర గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. వేదాలు చదివాడు. పర్షియన్,అరబిక్ భాషలు అభ్యసించాడు. ఖురాన్ చదివి ముస్లిం పండితుల సాంగత్యం చేశాడు. వీటన్నిటి వలన రామమోహన్ ఏకేశ్వరవాది అయ్యాడు. హిందూ, క్రైస్తవ, ముస్లిం మతాలలోని ఏకేశ్వరవాద బలంతో తన సంస్కరణోద్యమాన్ని తలపెట్టాడు. రంగపూర్ లో తన ఉద్యమాన్ని ప్రారంభించి స్నేహితులను కూడగట్టి ఏకేశ్వరారాధన ప్రార్థనలు చేసేవాడు. రంగపూర్ లో వుండగానే ఉపనిషత్తుల్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. వేదాంత గ్రంథం,వేదాంతసారం రాశాడు.
మరొక ఆసక్తికర అంశమేమంటే రామమోహన్ తాంత్రిక విద్య అభ్యసించాడు. హరిహరానంద వద్ద యీ విద్య నేర్చాడు. ఒక ముస్లిం స్త్రీతో కలసి తాంత్రికవిద్యను రంగపూర్ లో ఆచరించిన రామమోహన్ క్రమేణా వేదాంతంలో ఆసక్తి కనబరచాడు. 1788 నుండీ పండిత నందకుమార్ విద్యాలంకార్ వద్ద వేదాంతం నెర్చుకున్నాడు. అరబిక్-పర్ష్యన్ భాషలలో రచనలు చేశాడుకూడా. అన్ని రచనలలోనూ ఏకేశ్వరారాధనపట్ల దృష్టిపెట్టాడు. రంగపుర్ లో దివాన్ గా వుంటూ దిగ్ బీ గ్రంథాలను చదివి,ఇంగ్లీషు పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. మార్టిన్ లూథర్ మత సంస్కరణ ఇతడిని ఉత్తేజపరచింది. తాను కూడా హిందూమతంలో విగ్రహారాధన పోగొట్టి, సరైన హిందూమతాన్ని పునరుద్ధరించాలనుకున్నాడు. ఇంగ్లీషులో ఉదారవాదుల రచనలు అధ్యయనం చేశాడు.
హేతువాదం మతానికి పనికిరాదని రామమోహన్ అభిప్రాయం. హేతువు మన సందేహాలను పెంచుతుందే గాని, తీర్చదనే ఉద్దేశాలను వ్యక్తపరిచాడు. కనుక హేతువుకు మతప్రమాణాలను జోడించాలన్నాడు. ఇందుకు ఈశ్వరునిపై ఆధారపడాలన్నాడు. ప్రమాణ గ్రంథాలపై ఆధారపడక తప్పదనడంలోనే రామమోహన్ ప్రప్రథమంగా వెనుకంజ వేశాడు. తన హేతువుకు తృప్తికరంగా వుండే ప్రమాణాలను ఎంపిక చేసుకుంటానన్నాడు.
ఎన్నో విషయాలలో దైవం మనకు వెల్లడించే అంశాలుంటాయని రామమోహన్ నమ్మాడు, వ్రాశాడు. ఆయన అనువదించిన ఉపనిషత్తులకు పీఠికలు వ్రాస్తూ యీ ధోరణి వ్యక్తపరిచాడు. ఇస్లాంలో సూఫీ సన్యాసులవాదం పట్ల తొలుత ఆకర్షితుడైన రామమోహన్, క్రైస్తవంలో మతరీతులను, హిందూమతంలో వివిధస్థాయీ అంశాలను పట్టించుకొని, మత సంస్కర్తగా తేలాడు. కాని, రంగపూర్ లో ఉన్నంతకాలం, రామమోహన్ ఎవరో జనానికి తెలియదు. 1815లో కలకత్తా వచ్చినప్పటి నుండీ ఆయన లోకానికి ప్రముఖుడుగా కనిపించాడు.
రాజధాని కలకత్తా 1815 నాటికి ఎలా వున్నదో గ్రహించిన తరువాత, రామమోహన్ కార్యకలాపాలు పరిశీలిద్దాం. అప్పుడు గాని సామాజిక - తాత్విక - రాజకీయ భూమిక మనకు అవగహన కాదు.
బ్రిటిష్ వారు పరిపాలించిన ప్రాంతాలలో కూడా, ముందుగా బెంగాల్ మేల్కొన్నది. అందులో కలకత్తా రాజధాని కావడంతో పాశ్చాత్యభావాలు త్వరగా వ్యాపించి తమ ప్రభావాన్ని చూపెట్టాయి. అలాంటి దశలో 1815లో రామమోహన్ ఉద్యోగాలకు స్వస్తిపలికి, 42వ ఏటనే ఒక సంఘాన్ని స్థాపించాడు. హిందూమతాన్ని సంస్కరించడానికి, సమాజాన్ని మార్చడానికి ఉద్దేశించిన ఆత్మీయసభ సమావేశాలు తరచు జరిగేవి. ఇక్కడే సతీసహగమనంపై చర్చలు సాగాయి.రామమోహన్ ఆత్మీయసభ ఆధారంగా కొందరు వేరే సభలు స్థాపించారు. అలా ఏర్పడిన వాటిలో ధర్మసభ పేర్కొనదగినది. రామమోహన్ వెల్లడించే సంస్కరణలకు వ్యతిరేకంగా హిందూమతోద్ధారకులు ఏర్పరచిన సభనే ధర్మసభ అన్నారు. అప్పుడే ప్రాథమికవిద్యను ప్రోత్సహించే నిమిత్తం స్కూల్ బుక్ సొసైటీ, స్కూల్ సొసైటి అనే సంఘాలను కూడా ఏర్పరచారు.
కలకత్తాలో సంపన్నులు కొందరు చేతులు కలిపి 1817లో హిందూ కళాశాలను స్థాపించారు. ఇదే కలకత్తా జీవనరంగంలో పెద్ద మలుపుకు దారితీసింది. ఇంగ్లీషులో చదువుకోవాలని, పాశ్చాత్య భావనలు అభ్యసించాలని, సంస్కృతం స్థానే ఇంగ్లీషులో లెక్కలు, భూగోళం, విజ్ఞానశాస్త్రాలు, చరిత్ర అధ్యయనం చేయాలన్నారు. సంస్కృతం కావాలా, ఇంగ్లీషు కావాలా అనే మీమాంసలో రామమోహన్, ఇంగ్లీషు కావాలనడం గొప్ప మార్పుకు నాంది పలికింది. ఇష్టం వున్నా లేకున్నా ఇంగ్లీషు ప్రవేశపెట్టడంతో పాశ్చాత్య భావాలు వచ్చి, చాలామందిని ప్రభావితం చేయడం గమనార్హం. దినితోబాటే, 1818లో భారతీయ భాషలలో పత్రికలకు అంకురార్పణ జరిగింది. ఉత్తరోత్తరా యీ పత్రికలే రాజకీయ,సాంఘీక ఆయుధాలుగా పనిచేశాయి. కరపత్రాలు, చిన్న పుస్తకాలు వెలువడ్డాయి. కలకత్తాలో కార్యకలాపాలు విస్తరించాయి. అవి పునర్వికాసానికి, సంస్కరణకు తోడ్పడినట్లే,సనాతన ఛాందస భావాలను కాపాడుకోటానికీ ఉపయోగించాయి. ఆత్మీయసభ-ధర్మసభ మొహరించి,రెండు ధృవాలుగా నిలిచి పోరాడాయి. భారతీయులకు ప్రకృతితత్వం,రసాయనశాస్త్రం, శారీరకశాస్త్రం, గణితం అవసరమని, అవి నేర్పమని రామమోహన్ బ్రిటీష్ వారిని కోరాడు. ఆ మేరకు ఆయన అభ్యుదయ పాత్రను నిర్వహించాడు. ఆత్మీయసభలో సభ్యుడుగా వున్న వైద్యనాధ్ ముఖర్జీ సనాతనుడు. రామమోహన్ హిందూ సనాతనత్వం పై దాడిచెసినప్పుడు ఆయన సభతో తెగతెంపులు చేసుకున్నాడు. హిందువులను నిర్బంధంలో వుంచుతూ,కట్టుబాట్ల పేరిట పెరగకుండా ఆచారాలు, సంప్రదాయాలు వెనక్కు నడిపిస్తున్నాయని రామమోహన్ పేర్కొన్నాడు. కనుక రాజకీయ, సామాజిక దృష్ట్యా మతసంస్కరణ అవసరమన్నాడు. సతీసహగమనం హిందువులకు మచ్చ అంటూ దీనిని తొలగించాలన్నాడు. సనాతనులు ఇందుకు ఒప్పుకోలేదు.
రామమోహన్ రాయ్ హిందూమతాన్ని వ్యతిరేకించలేదు. కేవలం సంస్కరించాలన్నాడు. అందుకు కూడా సనాతనులు అంగీకరించలేదు. మతాన్ని సంస్కరించడానికి ఎవరికి అర్హతలేదని సనాతనుల వాదన. అందుకే యీ దేశంలో సంస్కరణవాదులు మైనారిటీగా మిగిలిపోయారు. సనాతనవాదులే నెగ్గారు. నాటికీ నేటికీ అదే పరిస్థితి. ప్రమాణగ్రంథాలను ప్రశ్నించ వీల్లేదన్నప్పుడు, అక్కడక్కడా సంస్కరించి, కొంతకాదని మరికొంత ఔనంటే కుదరదు. మొత్తం నిరాకరించాలి. లేదా అంతా ఆమోదించాలి. మధ్యేమార్గం అవలంబించిన రామమోహన్ రాయ్, ఆయన అనుచరులు విఫలమయ్యారు. చివరకు సతి విషయంలోను నెగ్గలేకపోయారు!
రామమోహన్ రాయ్ 'కలకత్తా' చాలా చిన్నది. రాజధానిగా తెల్లవారు తమ అగ్రహారాల్లో ఉండగా, మిగిలినవారు వేరేవుంటూ వచ్చారు. బ్రాహ్మణ, కాయస్త, వైశ్యకులాలకు సమాజంలో అత్యున్నత స్థాయి, ప్రతిష్ఠ వుండేది. భద్రలోక సమాజం ఉన్నత కులాలకు పరిమితమైంది. ఇందులో జమీందార్లు, పరిపాలకులు, వ్యాపారస్తులు వుండేవారు. చిన్న వ్యాపారస్తులు, గుమాస్తాలు గృహస్త భద్రలోక్ తరగతికి చెందినవారు. వీరంతా ఉన్నతవర్గాలను అనుకరించే ప్రయత్నంలో వుండేవారు. మొత్తం చదువుకున్న భారతీయులు ఒకజాతిగా వుండగా, మిగిలినవారిని అలగా జాతిగా చూచేవారన్నమాట. అలగాజలం ఇంగ్లీషు చదివితే తమ ఆసక్తులు దెబ్బతింటాయని భద్రలోక్ వారు భావించారు!
భద్రలోక్ వారు బ్రిటిష్ వారికి విజ్ఞప్తులు చేయడం,అర్జీలు పెట్టడం, పరిమిత ప్రభావాన్ని చూపడం నిత్య కార్యక్రమంగా వుండేది. పత్రికలపై బ్రిటిష్ వారు ఆంక్షలు విధించినప్పుడు 1823లో రామమోహన్ రాయ్, తన స్నేహితులతో కలసి యి ఆంక్షల్ని వ్యతిరెకిస్తూ అర్జీలు పెట్టారు. మొత్తంమీద భద్రలోక్ లో ఉదారవాదులకు రామమోహన్ నాయకత్వం వహించగా, సనాతనులకు గోపీమోహన్ దేవ్, రాధాకాంతదేవ్ అజమాయిషీ చేశారు. రామమోహన్ హిందువులను ఆకట్టుక రావడంలో చివరివరకూ జాగ్రత్త వహించాడు. ఏటా బ్రాహ్మణులకు దానాలు చేసేవాడు. యజ్ఞోపవీతం విడనాడకుండా కాపాడాడు. ఇంగ్లండ్ లో యూరోప్ వారితో పంక్తి భోజనానికి కూర్చున్నా, రామమోహన్ శాకాహారానికే పరిమితమయ్యాడు. చనిపోయిన తరువాత తనను క్రైస్తవుల స్మశానంలో పెట్టవద్దన్నాడు. అలాగయితే తన ఆస్తి కుమారులకు సంక్రమించడంలో పేచీలు వస్తాయన్నాడు.
తన సమావేశాలకు అన్ని కులాలవారిని రామమోహన్ ఆహ్వానించేవాడు. కాని అధికసంఖ్యాకులు కులీన బ్రాహ్మణులే వుండేవారు.
మొత్తం మీద 1815 నుండీ కలకత్తాలో ఆత్మీయసభ ద్వారా రామమోహన్ సంస్కరణ కృషి చేశాడు. ఆధునిక విద్యకు ప్రోదిచేశాడు. పత్రికల స్వేచ్ఛ కోరాడు. సతీసహగమనాన్ని నిషేధించాలన్నాడు. సంస్కరణవాదంపై సనాతనుల దాడిని ఎదుర్కొన్నాడు. మరోవైపు జమీందార్ల ఆసక్తులను కాపాడడంలో యధాశక్తి కృషి కొనసాగించాడు.
1928లో కలకత్తా రామమోహన్ బ్రహ్మసమాజాన్ని స్థాపించారు. విశ్వవ్యాప్తంగా మతవాద ప్రచారం చేయాలని, ఒకే మతం, ఒకే దైవం వుండాలని వీరి ఉద్దేశం. ప్రపంచ ప్రభుత్వం కూడా ఏర్పడాలన్నారు. ఏకేశ్వరారాధన అనేది వేదసంహితలలో వున్నదని రామమోహన్ ఉద్దేశం. బ్రహ్మసమాజ ప్రభావం తక్షణమే అంతగా వున్నట్లు ఆధారాలు లేవు. పైగా యీ సమాజాన్ని స్థాపించిన రెండేళ్ళకే రామమోహన్ ఇంగ్లండ్ వెళ్ళిపోయాడు.
'రాజా' రామమోహన్ రాయ్ కు, బ్రహ్మసమాజ్ కు కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టింది సతీ సహగమన వ్యతిరేకత. సతీసహగమనం నాడు బెంగాల్, బీహారు ప్రాంతాలలో ఉన్నత తరగతులకు పరిమితమై వున్న దురాచారం. సతీసహగమనం నిషేధించరాదని ధర్మసభ సనాతనులు సంతకాలు సేకరించి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన రోజులవి! రామమోహన్ కుటుంబంలో సతీసహగమనం పాటించిన ఆధారాలేవీ లేవు, ఆయన వదిన అలకమంజరి భర్త చితిపై చనిపోయిందనప్పుడు, ఆధారాలు లేని కట్టుకధగానే యిది వ్యాపించింది. 1912లో జరిగినట్లు చెబుతున్న యీ కథనం సందర్భంగా రామమోహన్ అక్కడలేరు. వాస్తవాలు పరిశీలిస్తే 1818లో రామమోహన్ సతీసహగమన వ్యతిరేకత ప్రారంభించారు. అప్పటికే క్రైస్తవ మిషనరీలు, బ్రిటిష్ ప్రభుత్వం 'సతి' ఆచారాన్ని నిషేధించాలన్నాయి. ఇందుకు దేశీయుల మద్దత్తు కావాలని వారు ఆశించారు. ఒకేసారి 'సతి' నిషేధం జరిగితే, ప్రజలు తిరగబడతారని రామమోహన్ అభిప్రాయం వెల్లడించారు. క్రమేణా నిషేధం జరగాల్సిందేనన్నాడు. ఇంగ్లండ్ వెళ్ళినప్పుడు ప్రీవీ కౌన్సిల్ లో సతి నిషేధం పై చర్చలు సాగుతుండగా, రామమోహన్ హాజరుకాలేదు. జమీందార్ల భరణం పెంచాలనే విషయం ఎక్కువగా పట్టించుకున్నాడు. అయితే సతి నిషేధం 1929లో జరిగినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభినందించాడు. పైకి ఎన్ని చెప్పినా రామమోహన్ ఆచరణలో కులాన్ని వదలుకోలేదు. బహు భార్యాత్వం కూడా పాటించి ముగ్గురిని పెళ్ళి చేసుకున్నాడు!
రామమోహన్ స్థాపించిన బ్రహ్మసమాజ్, 1833లో ఆయన ఇంగ్లండ్ లో చనిపోయిన అనంతరం విచ్ఛిన్నదశలో పడింది. దేవేంద్రనాధ్ ఠాగోర్ పూనుకొని పునరుద్ధరించకపోతే బ్రహ్మసమాజ్ ఏమయ్యేదో?
రామమోహన్ ప్రారంభించిన బ్రహ్మసమాజ్ కు దేవేంద్రనాధ్ ఠాగోర్ నీరు పోశాడు. దేవేంద్రనాధ్ ఠాగోర్ యిచ్చిన ఆర్ధిక సౌకర్యాలు అందుకు ఉపకరించాయి. దేవేంద్రనాధ్ 1839లో తత్వబోధిని సభకూడా ప్రారంభించి, బ్రహ్మసమాజ్ కు సోదరసంస్థగా కొనసాగించారు. 1843లో తత్వబోధిని పత్రిక ప్రారంభించారు. ఆ ఏడే ఒక సమావేశం ఏర్పరచి సభ్యత్వం పెంచే చర్చలు సాగించారు. చేరిన సభ్యులకు క్రమశిక్షణ, నియమ నిబంధనలు ఏర్పరచారు. అప్పటినుండి ఆయనతో పాటుగా అక్షయకుమార్ దత్తు, రాజనారాయణ్ బోసు, కేశవచంద్రసేన్ ప్రముఖపాత్ర వహించారు.
బ్రహ్మసమాజ్ లో ప్రముఖ హేతువాది అక్షయకుమార్ దత్తు, తత్వబోధిని పత్రిక సంపదకుడుగా తన భాషాశైలితో ఎందరినో ఆకట్టుకున్నాడు. రామమోహన్ అనుసరించాలనే అక్షయకుమార్ ఆనాటి దేవేంద్రనాథ్ మత ఛాందసాన్ని వ్యతిరేకించాడు.
వేదాలు అపౌరుషేయాలా అనే చర్చ దేవేంద్రనాధ్, అక్షయకుమార్ ల మధ్య సాగింది. వేదాలలో దోషాలు, వైవిధ్యాలు ఉన్నాయి. అలాంటప్పుడు వేదాలను ప్రమాణంగా ఎలా స్వీకరించడం? ఈ విషయాన్ని 1850లో అక్షకుమార్ దత్తు బాహాటంగా ఒక సమావేశంలో ప్రకటించారు. ఆ వాదనను బ్రహ్మసమాజ్ లో సనాతనులు ఒప్పుకోలేకపోయారు. రాజనారాయణ్ ఇందుకు అంగీకరించలేదు. బ్రహ్మసమాజ్ చీలడానికి అది నాంది అయింది. దేవేంద్రనాధ్, రాజనారాయన్ లు క్రైస్తవ వ్యతిరేక ధోరణి వ్యక్తపరచగా, మరోవైపు మధ్యతరగతిలో యువకులు కొందరు క్రైస్తవ మతంలోకి మారిపోయారు. బ్రహ్మసమాజ్ లో దేవేంద్రనాధ్ ఆసక్తిని కొల్పోతున్న సమయంలో అక్షయకుమార్ దత్తు 1854లో ఆత్మీయసభ సమావేశం ఏర్పాటుచేశారు. దేవుడి లక్షణాలు ఎలాంటివో చర్చించి, చేతులెత్తే పద్ధతి ద్వారా, అధికసంఖ్యాకుల నిర్ణయం ప్రకారం వాటిని నిర్ధారించారు. ఆ తరువాత దేవేంద్రనాధ్ హిమాలయాలకు వెళ్ళిపోగా, అక్షయకుమార్ రిటైర్ అయ్యారు.
సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న సందర్భంగా,1857లో కేశవచంద్రసేన్ బ్రహ్మసమాజ్ లో చేరి, మళ్ళీ జీవం పోశారు.
కేశవచంద్రసేన్ యించుమించు బ్రహ్మసమాజానికి ఉగ్రవాదిగా పనిచేశారు. సమాజం ఒక వైపున బహుళ ప్రచారం పొందినా, అతిత్వరలోనే చీలికకు కూడా దారితీసింది. కేశవచంద్ర ప్రేరణతో మహారాష్ట్రలో ప్రార్థనా సమాజం ఆరంభించారు. క్రైస్తవమతం పట్ల విపరీతంగా ఆకర్షితులైన కేశవచంద్ర,హిందువులకు దూరమయ్యాడు. దేశ, విదేశాలలో బ్రహ్మ సమాజాన్ని ప్రచారం చేసిన కేశవచంద్ర అందులో చీలికలకు కూడా దారితీశాడు. 1865లో జంధ్యం ఉండాలా? అక్కరలేదా? అనే విషయమై తీవ్ర చర్చలు జరిగిన అనంతరం, కేశవచంద్ర బ్రహ్మసమాజ్ లో చీలిపోయి భారత బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు. 1878లో అందులోనూ చీలిక ఏర్పడింది. కేశవచంద్ర కుమార్తె మైనర్ గా వుండగా, కూబ్ బీహార్ యువరాజుకు యిచ్చి వివాహం చేసినప్పుడు తీవ్ర విమర్శలకు గురైనాడు. అప్పుడే చీలినవారు సాధారణ బ్రహ్మసమాజ్ ఏర్పరచారు.
పాశ్చాత్య ప్రపంచం నుండి మనం సైన్సు నేర్చుకోవచ్చనీ,వారికి మన ఆధ్యాత్మికత నేర్పవచ్చనీ కేశవచంద్ర ప్రచారం చేశాడు.
బ్రహ్మసమాజ్ శాఖలు దేశవ్యాప్తంగా ఏర్పడినా, వాటి ప్రచారం పరిమితంగానే నిలచింది. విగ్రహారాధన కంటే, ఏకేశ్వరారాధన కొంత మెరుగు అనుకున్నా,అది మతపరంగా ఛాందసుల వాదనల్ని అడ్డుకోలేకపోయింది. సామాజిక రంగంలో కొంత పురోభివృద్ధి సాధించినా మతపరంగా బ్రహ్మసమాజ్ ఆట్టే ముందుకు పోలేకపోయింది.
దేశంలో ప్రప్రధమంగా ఆధునిక యుగంలో సంస్కరణోద్యమం తలపెట్టిన బ్రహ్మసమాజం విఫలమైంది. మతాన్ని మూలంలో కొట్టాలే గాని, కొమ్మలు నరికితే మళ్ళీ చిలవలు వలవలుగా చిగుర్లు వేసి వ్యాపిస్తుందని రుజువైంది.