అబద్ధాల వేట - నిజాల బాట/వెంకటేశ్వర సుప్రభాతం తెలుగులో పాడరెందుకు?

వెంకటేశ్వర సుప్రభాతం తెలుగులో పాడరెందుకు?

వెంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలో వుంది. రోజూ రేడియోలలో, టి.వి.లలో, మైకులు పెట్టి దేవాలయాలలో, ఇండ్లలోకేసట్లు వాడుతూ పారాయణం చేస్తున్నారు. సంస్కృతం తెలిసిన భక్తులు అతి స్వల్పం. కాని అలవాటుగా మిగిలిన భక్తులు అది విని తరించినట్లు భావిస్తున్నారు. వెంకటేశ్వర సుప్రభాత మహాత్మ్యం పై పత్రికలలో రాయించారు.

పిల్లల చేత కూడా యీ సుప్రభాతాన్ని పాడిస్తున్నారు. అర్థం లేని చదువు వ్యర్థం అంటారు గదా! పిల్లలకు అర్థం చెప్పకుండా వల్లే వేయించరాదు. కనుక అర్థం చెప్పరు. అర్థం తెలిసిన తరువాత పిల్లలకు వెంకటేశ్వర సుప్రభాతం చెప్పవచ్చునా లేదా అనేది స్పష్టపడుతుంది.

సుప్రభాతంలో 1వ శ్లోకం:

కమలాకుచ చూచుక కుంకమతో

నియతారుణి తాతుల నీలతనో

కమలాయతలోచన లోకపతే

విజయీభవ వేంకట శైలపతే

దీని అర్థం తెలుగులో యిది. లక్ష్మీదేవి చనుమొనలయందున్న కుంకుమపూ రంగువల్ల అంతటా ఎర్రగా చేయబడ్డ సాటిలేని నల్లని శరీరం కలవాడా తామర రేకులవంటి విశాలమైన కన్నులు కలవాడా జగన్నాయకుడా, వెంకటాచలపతీ, జయించే స్వభావం కలవాడవు కమ్ము.
సుప్రభాతంలో 3వ శ్లోకం:

మాతస్పమస్త జగతాం మధుకైటభారే

వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తి

శ్రీ స్వామిని శ్రితజనప్రియ దానశీలి

శ్రీ వెంకటేశదయితె తవసుప్రభాతమ్

తెలుగులో అర్థం : అన్ని లోకాలకు తల్లివి. ఎప్పుడు విష్ణుమూర్తి రొమ్ముల పై వుండేదానివి. మనోహరమైన ఆకారం గలదానవు. ఆశ్రయించినవారి కోర్కెలను తీర్చేదానవు. వేంకటేశ్వరుని ప్రియురాలివైన శ్రీ లక్ష్మీదేవి నీకు శుభోదయం అగుగాక.

13వ శ్లోకం:

శ్రీమన్నభీష్ట వరదాభిల లోకబంధో

శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో

శ్రీ దేవతా వృషభుతాంతర దివ్యమూర్తి

శ్రీ వెంకటాచలపతీ తవసుప్రభాతమ్

తెలుగులో అర్థం : లక్ష్మీదేవితో కూడిన వాడా, కోరిన వరాలిచ్చేవాడా, సమస్తలోకాలకు బంధువైనవాడా, పూజ్యురాలైన లక్ష్మీదేవికి నివాసమైనవాడా. ప్రపంచానికంతటికీ ఒక్కడివే విశాలమైన దయగలవాడవు. లక్ష్మీదేవి రెండు చేతుల మధ్య గట్టిగా ఇరుక్కున్నవాడా. మనస్సు హరించే అందమైన ఆకారం గలవాడా. వెంకటేశ్వరుడా,నీకు సుప్రభాతమగుగాక.

23వ శ్లోకం:

కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తి

కాంతాకు చాంబురుహ కుట్మలలోల దృష్టే

కళ్యాణ నిర్మలగుణాకర దివ్యకీర్తి

శ్రీ వెంకటాచలపతీ తవసుప్రభాతం

తెలుగులో అర్థం : మన్మధుడి గర్వాన్ని హరించగల అందమైన ఆకారం గలవాడా. ప్రియురాలి తామర మొగ్గుల వంటి చన్నుల మీద ఆసక్తితో చూపులు పెట్టినవాడా. శుభాన్ని కలిగించే మంచి గుణాలకు నిలయమైనవాడా. గొప్ప కీర్తి కలవాడా. వెంకటాచలపతీ నీకు సుప్రభాతముగుగాక.

ఇందులో శ్లోకాలకు తెలుగు అర్థాన్ని ఇంకో విధంగా భక్తులు రాస్తారేమో తెలియదు. ఇక్కడ చెప్పిన తెలుగు అర్థాన్ని కీ॥శే॥ వెనిగళ్ళ సుబ్బారావు రచన "శ్రీ వెంకటేశ సుప్రభాత శృంగారం" నుండి స్వీకరించాను. (1982 కనమత వెంకట రామరెడ్డి, ప్రగడవరం, రేపల్లె, మెయిన్ రోడ్) నేను అమెరికాలో పై విషయాలను ఇంటర్నెట్ లో తెలుగు వారితో చర్చించినప్పుడు, కొందరు భక్తులు ఆగ్రహించారు. అదే వారి సమాధానం. మరికొందరు ఒస్! ఇంతే గదా! సంస్కృతంలో ఇలాంటి శృంగారం మాకు అలవాటే అన్నారు. ఇంకొందరు ఎంతో శృంగారం వుందనుకున్నాం, యీ మాత్రానికే దెప్పిపొడవాలా అన్నారు. చర్చ అలా సాగింది. భక్తుల నుండి అంతకు మించి ఆశించలేని నైతిక విప్లవం కావాలనే వారేమంటారో చూడాలి. ఏమైనా పిల్లల్ని వీటికి దూరంగా వుంచడం అవసరం.

- హేతువాది, ఫిబ్రవరి 2001