అబద్ధాల వేట - నిజాల బాట/విజ్ఞాన సమన్వయం
ఒకప్పుడు తన సామజిక సిద్ధాంతాలతో ప్రపంచాన్ని కలవరపెట్టి, ఉర్రూతలూగించిన ఎడ్వర్డ్ విల్సన్ నేడు కొత్త ఆలోచనలతో మళ్ళీ ప్రకోపింపజేస్తున్నాడు. మనకు విభిన్నంగా, విరుద్ధంగా కనిపించేవాటి మధ్య సమన్వయం సాధ్యమంటున్నాడు. అన్నింటికీ పరిష్కారం జీవశాస్త్రంలో చూడొచ్చు అంటున్నాడు. ఇందుకు ఆయన స్వీకరించిన పరిశోధన చీమలు!
చీమలకు మెదడులో 10 లక్షల కణాలే వున్నాయి. మనిషి మెదడులో వంద బిలియన్ కణాలున్నాయి. చీమల ప్రవర్తన, క్రమబద్ధత సాధ్యమైనప్పుడు మనిషి తన శక్తిని వినియోగిస్తే ఇంకెంతో సాధించగలడని విల్సన్ సిద్ధాంతీకరిస్తున్నాడు.
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేస్తున్న విల్సన్ ప్రస్తుతం 58వ పడిలో వున్నాడు. ఆయన పరిశోధనాలయంలో 538000 చీమల నమూనాలు, వర్గీకరణ నిమిత్తం సారాయిలో పెట్టి వుంచిన మరో 3 లక్షల చీమలు చూచేవారికి ఆశ్చర్యం వేస్తుంది. చిన్నప్పటి నుండే అలబామా రాష్త్రం అడవులలో చీమల్ని సేకరించి, ప్రకృతిని అధ్యయనం చేసిన విల్సన్ పులిట్జర్ బహుమానం అందుకున్న రచయిత.
మన ప్రవర్తన మన తల్లిదండ్రుల జన్యుకణాల నుండి సంక్రమించిందని, వారి శిక్షణ నుండి పిల్లలు పుణికి పుచ్చుకుంటారని సిద్ధాంతీకరిస్తూ "సోషియోబయాలజీ" రాసినప్పుడు చాలామంది గగ్గోలు పెట్టారు. రానురాను విల్సన్ సోషియాలజీని సీరియస్ గా స్వీకరించి పరిశీలిస్తున్నారు.
నేడు జీవకణశాస్త్రం, ప్రకృతిశాస్త్రం, జీవకణశాస్త్రం ఎన్నో సూక్ష్మాలు అందిస్తున్నది. కనుక మెదడు ఆలోచనా స్రవంతి లోతుపాతుల్లోకి పోగలమని విల్సన్ అంటున్నాడు. సిద్ధాంతాలకు, నమ్మకాలకు బానిసలుగా బ్రతకడంకాదు, ఉన్నతస్థాయికి ఎదుగుతూ పోవడం మానవ లక్షణాలలో విశిష్టమైనదని విల్సన్ గట్టిగా చెబుతున్నాడు.
మనకు శాస్త్రాల వలన జ్ఞానం విపరీతంగా వస్తున్నది. దీని ఫలితంగా వివిధ జ్ఞాన శాఖల్ని సమన్వయీకరించి చూచుకోవలసిన అవసరం కలిగిందంటున్నాడు.
హెరాల్డ్ విల్సన్ 7వ ఏట మిలటరీ స్కూలులో చేరి చదివాడు. ఒక దుర్ఘటనలో ఒక కన్ను కనిపించకుండా పోయింది. పుట్టినప్పటి నుండీ చెముడు వచ్చింది. విల్సన్ ఒక్కడే సంతానమైనా తల్లిదండ్రులు విడాకులు యిచ్చుకున్నందున, చిన్నప్పటినుండీ కష్టజీవితానికి అలవాటుపడ్డాడు. హార్వర్డ్ యూనివర్శిటీలో చేరిన తరువాత, జీవశాస్త్రాన్ని యితర రంగాలకు అన్వయించవచ్చని గ్రహించాడు. సమన్వయం అతడి వూపిరిగా మారింది.
శ్రీలంక వరకూ పర్యటించి, చీమల నమూనాలు సేకరించి పరిశోధించిన విల్సన్, వాటిపై ప్రామాణీకరించిన శాస్త్రజ్ఞుడయ్యాడు. అది మూలంగా పెట్టుకొని, ఇతర జీవజాలమంతా పరిశీలించాడు. క్రమేణా మనిషికి కూడా విస్తరించాడు. దీని ఫలితంగా 1978లో "ఆన్ హ్యూమన్ నేచర్" ప్రచురించాడు.
మనిషి పరిణామంలో భాగం. తన జన్యుకణాల ప్రభావంతో అతడు ప్రవర్తిస్తుంటాడు. భవిష్యత్తులోకి తొంగి చూస్తుంటాడు. ఒకప్పుడు మనిషి మాజిక్ ద్వారా తన జ్ఞానాన్ని అదుపులో పెట్టాలనుకున్నాడు. నేడు కళల ద్వారా వివిధ గందరగోళాలను శాస్త్రాలను సమన్వయీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది విల్సన్ సిద్ధాంతం.
క్రైస్తవ మతంలో పుట్టి పెరిగిన విల్సన్ అందులో నుండి మానవవాదిగా ఎదిగాడు. ప్రకృతిలోని వైవిధ్యాన్ని అభినందించసాగాడు. పరిణామం సాగిపోతూ వున్నదన్నాడు. ఇందుకు మానవుడు ఇంకా ప్రయోజనాత్మకంగా దోహదం చేయాలంటే, వివిధ రీతుల్ని బాగా అవగాహన చేసుకోవాలన్నాడు అటు ప్రకృతి, యిటు జన్యు కణాల వలన మానవుడు మసలుకుంటున్నాడు. వీటిని సమన్వయించాలంటున్నాడు. పరిసరాలను ధ్వంసం చేయకుండా జీవనం కొనసాగించడం అవసరమంటాడు.
విల్సన్ భార్య ఐరీన్ (Irene) అతడికి బాగా సహకరిస్తుంది
ప్రస్తుతం విల్సన్ రాసి ప్రచురించిన కొత్త పుస్తకం మళ్ళీ విజ్ఞాన ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్నది. జ్ఞాన సమన్వయీకరణ యీ గ్రంథానికి మూలం (Consilience: The Unity of Knowledge)
ఒకవైపు విజ్ఞానరంగం ఎంతో సాధించగా, మరొక పక్క దీనిని ఖండిస్తూ యీసడిస్తూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అతీంద్రియ శక్తులు, దివ్యత్వం, మహిమల పేరిట కొందరు రంగంలోకి దిగి మోసాలకు పాల్పడుతున్నాడు. మరికొందరు మూర్ఖంగా మతగ్రంథాలలోనే సర్వస్వం వున్నదని నమ్ముతున్నారు. కాని ఇంకా కొందరు తత్వం పేరిట సిద్ధాంతీకరిస్తూ శాస్త్రాన్ని వెక్కిరిస్తున్నారు. పోస్ట్ మోడరనిస్ట్ శాఖ యిందులో ఒకటి. ఇంకా సాంస్కృతిక సాపేక్షత వాదులున్నారు. నియోమార్క్సిస్టులు వీరికి తోడయ్యారు. ఫాయర్ బాండియన్లు, కున్ వాదులున్నారు. అలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని విల్సన్ కొత్త పుస్తకం రాశాడు. విజ్ఞానం సంకుచితం కాదనీ, మానవుడిని పెంచేదేకాని తగ్గించేది కాదని విల్సన్ అన్నాడు. అందుకే వివిధ విజ్ఞాన శాఖల సమన్వయం కోరుతున్నాడు.
వికాసయుగం మానవుడిని స్వేచ్ఛ వైపుకు నడిపించిన విషయం విల్సన్ గుర్తు చేస్తున్నాడు. మానవుడి పురోగతికి అత్యంత శక్తివంతమైన ఆయుధం విజ్ఞానమే.
విజ్ఞానాన్ని సమన్వయీకరించడం అవసరమైన విల్సన్ మూల సిద్ధాంతం ముఖ్యమైనది. ఎవరికి వారు ప్రత్యేక కృషి చేసి, ఆయా రంగాలలో ఎన్నో కనిపెడుతున్నాడు. సాధిస్తున్నారు. కాని బయట ఏం జరుగుతున్నదో గ్రహించడంలేదు. అందువలన మూఢనమ్మకాలు, మూర్ఖత్వాలు వుంటున్నాయి. సమన్వయీకరణ జరిగితే యీ లోపం సవరించవచ్చు. కెమిస్ట్రీలో జరిగేది, జీవశాస్త్రజ్ఞులకు,ఫిజిక్స్ లో పరిశోధనలు, భూగర్భ శాస్త్రజ్ఞులకూ, ఖగోళంలో ఏం జరుగుతున్నదో మానసిక శాస్త్రజ్ఞులకూ తెలియాలంటే, సమన్వయీకరణ జరగాలన్న మాట. ఎవరికివారే మడిగట్టుకొని,తమదే గొప్ప రంగం అనుకొంటూ, మిగిలిన రంగాలను పట్టించుకోపోవడం లోపం. ఇది తొలగాలి.
లోగడ కార్నప్, రైకన్ బాక్, ఎం.ఎన్.రాయ్, వంటివారు యిలాంటి సమన్వయీకరణ ధోరణులు కొంత వరకు చేశారు. అలాంటి కృషి చాలా భారీ ఎత్తున యిప్పుడు జరగాలని విల్సన్ ఉద్దేశం.
విజ్ఞాన రంగంలో ఒక భాగం మరొక విభాగానికి ఎలా ఉపకరిస్తుందో శాస్త్రజ్ఞులు గ్రహిస్తున్నారు. సమన్వయీకరణలో కేవలం విజ్ఞానశాస్త్రాలేగాక, మానవశాస్త్రాలు, సమాజిక శాస్త్రాలు చేర్చడం విల్సన్ విశిష్టత. అక్కడే వివాదం తలెత్తుతున్నది.
పరిణామంలో జన్యుకణాలు, పరిసరాలు రెండూ పరస్పరం ప్రాధాన్యత వహిస్తూ, పోతున్నాయనేది విల్సన్ మూలసిద్ధాంతం. అలాంటి సమన్వయీకరణ సాధ్యం కాదని రిచర్డ్ రోర్టీ (Richard Rorty) వాదిస్తున్నాడు. చాలాకాలం పట్టినాసరే అలాంటి సమన్వయీకరణ వైపు సాగి పోవడం అవసరమనీ, సాధ్యమనీ విల్సన్ అంటాడు.
విజ్ఞానాన్ని నీతికి సైతం అన్వయించవచ్చని విల్సన్ అంటాడు. మొత్తం మీద గొప్ప గ్రంథం రాసి విల్సన్ మళ్ళీ సంచలనం సృష్టించాడు.