అబద్ధాల వేట - నిజాల బాట/రాయిస్టు ఆలోచనలకు పాదువేసిన ఎం.వి.శాస్త్రి

రాయిస్టు ఆలోచనలకు పాదు వేసిన
ఎం.వి.శాస్త్రి

తెలుగునాట పత్రికారంగానికి చెందిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఇతర రంగాలతో సంబంధం ఉన్నా పత్రికా రంగానికి సేవలు అందించిన అరుదయిన పాత్రికేయులు కూడా ఉన్నారు. పాత్రికేయులుగా ఉంటూనే విభిన్న రంగాల్లో రాణించినవారు కూడా ఉన్నారు. వారిగురించి ఈ తరానికి పరిచయం చేసే ప్రయత్నమిది. అందులో భాగంగా అందిస్తున్న తొలివ్యాసమిది.

జర్నలిస్ట్ గా ఆరంభించి, తలవని తలంపుగా ఆంధ్రలో పునర్వికాసోద్యమానికి నాంది పలికిన ములుకుట్ల వెంకటశాస్త్రి(ఎం.వి.శాస్త్రి) పాత్ర గమనార్హం.

కుందూరి ఈశ్వరదత్తు స్వాతంత్రోద్యమ రోజులలో పీపుల్స్ వాయిస్ అనే పేరిట మద్రాసు నుండి ఇంగ్లీషు పత్రిక నడిపారు. 1936లో ఫైజ్ పూర్ లో (మహారాష్ట్రాలో ఒక గ్రామం) కాంగ్రెసు పార్టీ మహాసభ డిసెంబరులో జరిగింది. ఆ సభా విశేషాలు రాసే నిమిత్తం ఎం.వి.శాస్త్రిని పీపుల్స్ వాయిస్ పక్షాన పంపారు. కాకినాడలో చదువు ముగించిన ఎం.వి.శాస్త్రి ఉత్సాహంగా వెళ్ళారు. అక్కడ జైలు నుండి విడుదలై వచ్చి, రాజకీయాలలో హేతుబద్ధంగా,అంతర్జాతీయ వ్యవహారాలు అవలీలగా మాట్లాడిన ఎం.ఎన్.రాయ్ మాటలు ఎం.వి.శాస్త్రిని ఆకట్టుకున్నాయి. గాంధీ మత, మిత ధోరణిని వ్యతిరేకిస్తూ మాట్లాడిన రాయ్ ను ఆంధ్రకు ఆహ్వానించి వచ్చారు శాస్త్రి.

1937 జులై చివరలో ఓ మద్రాసులో యువజనసభలో పాల్గొన్న ఎం.ఎన్.రాయ్ ఆగస్టు 1న తొలిసారి ఆంధ్రలో అడుగుపెట్టారు. నెల్లూరులో వెన్నెల కంటి రాఘవయ్య ఆధ్వర్యాన జరిగిన వ్యవసాయ కార్మికుల మహాసభకు ఎం.ఎన్. రాయ్ ప్రధాన వక్తగా వచ్చారు. అక్కడ జబ్బుపడ్డారు. కాకినాడ నుండి ఎంవి.శాస్త్రి వెంటనే వచ్చి ఎం.ఎన్.రాయ్ ను తమ వూరికి తీసుకెళ్ళారు. అక్కడ శాస్త్రిగారి వద్ద రాయ్ కోలుకుంటున్నప్పుడే, విశాఖపట్టణం నుండి అబ్బూరి రామకృష్ణారావు (యూనివర్శిటీలో లైబ్రేరియన్, థియేటర్ నిపుణులు) వచ్చారు. ఆవిధంగా ఎంఎన్.రాయ్ ను వారిరువురూ ఆంధ్రకు పరిచయం చేశారు. వారి జీవితాల్లో అదొక పెద్ద మలుపు అయింది. ఎం.వి.శాస్త్రి అప్పటి నుండీ రాయ్ అనుచరుడుగా పనిచేశారు. రాడికల్ డెమొక్రటిక్ పార్టీలో ప్రధానపాత్ర వహించారు. 1942లో ఆంధ్ర రాడికల్ డెమొక్రటిక్ పార్టీ మహాసభల్ని కాకినాడలో నిర్వహించారు. బెంగాల్ నుండి కె.కె.సింహ ప్రారంభోపన్యాసకులుగా వచ్చారు.

ఆంధ్రలో ఎప్పుడు పర్యటనకు వచ్చినా శాస్త్రి దగ్గరకు వచ్చేవారు రాయ్ దంపతులు. రాడికల్ హ్యూమనిస్ట్ పత్రికలో శాస్త్రి అనేక వ్యాసాలు రాశారు. ఇంగ్లీషులో వ్యాసాలు రాయడంలో శాస్త్రి గారు దిట్ట. చాలా హేతుబద్ధంగా, మంచి శైలిలో, హాస్యం తొణికిస్తూ రాసేవారు. రాయ్ 1954లో చనిపోయిన అనంతరం, అడ్వొకేట్ గా ప్రాక్టీసు చేసిన శాస్త్రిగారు రాజగోపాలాచారి వాదనల పట్ల, ఉదారవాద, స్వేచ్ఛాభావాల పట్ల ఆకర్షితులయ్యారు.

1959లో రాజాజీ స్వతంత్ర పార్టీ స్థాపకులుగా ఆంధ్ర పర్యటించినప్పుడు కాకినాడలో శాస్త్రిగారింట్లో జరిగిన విందులో నేను పాల్గొన్నాను. ఆనాడు గొప్ప సభ జరిగింది. రాజాజీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నించిన ఉషశ్రీ విఫలమయ్యారు. చివరకు శాస్త్రిగారి సలహాపై గౌతులచ్చన్న అనువదించి, మెప్పించారు. శాస్త్రి స్వరాజ్య పత్రికలో అనేక వ్యాసాలు రాశారు. కె.సంతానం సంపాదకుడుగా మద్రాసు నుండి నడిచిన ఆ పత్రిక మేధావులను ఆకర్షించింది. ముఖ్యంగా హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని అడ్డుకున్నది.

ఎం.వి.శాస్త్రి ఆంధ్రలోని రాడికల్ హ్యూమనిస్టులలొ ఆవుల గోపాలకృష్ణ మూర్తికి సన్నిహితులుగా వుండేవారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎం.వి.శాస్త్రి నిలిచారు. ములుకుట్ల వెంకటశాస్త్రికి ఓటు వేయమంటూ ఆయన ఒక ఆకర్షణీయ విజ్ఞప్తి ఓటర్లకు పంపారు. శాస్త్రిగారు నెగ్గి, ఎం.ఎల్.సి.గా ఒక టరం పనిచేశారు.

శాసనమండలిలో పరిమితంగా మాట్లాడినా,చాలా లోతైన భావోపన్యాసాలు చేశారు. హుందాగా ప్రవర్తించారు. 1962 నుండి ఆయన ఎంఎల్.సి.గా హైదరాబాద్ లో వుంటూ వచ్చారు. అప్పుడే స్వతంత్ర పార్టీ సమావేశాల్లోనూ పాల్గొన్నారు.

రాజగోపాలాచారి ముఖ్యంగా ఎం.వి.శాస్త్రి తీర్మాన పాఠాన్ని మెచ్చుకునేవారు. శాస్త్రిగారు రాస్తే రాజాజీ యథాతథంగా అక్షరం మార్చకుండా ఆమోదించేవారు. ఆయన ఇంగ్లీషు అంత బాగా వుండేది. శాస్త్రి గారికి అందరూ అమ్మాయిల సంతానమే. పెళ్ళిళ్ళరీత్యా వారిలో కొందరు అమెరికా వెళ్ళారు. శాస్త్రి గారు అనేక పర్యాయాలు అమెరికా పర్యటించారు. హైదరాబాదులో వుండగా దంటు భాస్కరరావుతో కలిసి శాస్తిగారు వినోద, సాహిత్య కార్యకలాపాలు ఆనందించేవారు. శాస్త్రిగారి వ్యాసాలు,శాసనమండలి ఉపన్యాసాలు గ్రంథస్తం కావలసివుంది. 1990లో శాస్త్రిగారు మరణించారు.

- వార్త, 7 అక్టోబరు,2001