అబద్ధాల వేట - నిజాల బాట/మేధావుల చిత్రణ
ఒకసారి మనదేశం నుండి ఒకాయన "ఎడ్వర్డ్ షిల్స్,సోషల్ సైంటిస్ట్,ఇంగ్లండ్" అని ఉత్తరం,రాస్తే అది చేరింది! ఇది బ్రిటిష్ పోస్టల్ విధానపు గొప్పతనం చాటుతుండగా, ఎడ్వర్డ్ షెల్స్ ఖ్యాతిని కూడా చూపుతున్నది.
సోషియాలజు అంటే కొద్దోగొప్పీ తెలిసిన ప్రతివారికీ ఎడ్వర్డ్ షిల్స్ పరిచయమే. ప్రపంచ మేధావుల గురించి రాసిన షిల్స్, తానూ ఆ కోవలోని వాడే. అతని పుస్తకం ఈ సంవత్సరం వెలువడింది. (PORTRAITS by Edward Shils Introduction,edited Joseph Epstein, The University of Chicago Press, London & Chicago 1977,PP 255, 1/8 Demmy Size Paper book)
10 మంది మేధావుల గురించి ఎడ్వర్డ్ షిల్స్ రాసిన వ్యాసాలను ఎంపిక చేసి,ఆయన పరణానంతరం ప్రచురించారు. 1995 జనవరి 23న షిల్స్ 84వ ఏట కాన్సర్ తో చికాగోలో మరణించారు. అమెరికన్ స్కాలర్ అనే మేధావుల పత్రిక సంపాదకుడు జోసెఫ్ ఎప్ స్తైన్ షిల్స్ గురించి సుదీర్ఘ పీఠిక రాసి, ఆసక్తికరంగా అందించారు.
మనదేశం నుండి నిరాద్ చౌదరి మాత్రమే యిందులో వుండగా, మిగిలిన వారు రేమండ్ ఆరన్, సిడ్నీ హుక్, రాబర్ట్ మేనార్క్ హచిన్స్, లె పోల్డ్ లబెజ్, హరాల్డ్ లా స్కీ,కార్ల్ మన్ హం, అర్నాల్డొ డాంటెమొమిగ్లి యానో, జాన్ యు. నెఫ్, లియోజి లార్డ్ వున్నారు. షిల్స్ రాసిన మేధావుల పీఠిక కూడా వుంది.
ఎడ్వర్డ్ షిల్స్ మన దేశ మేధావులకు సుపరిచితుడు. 1956 నుండి 57 వరకు ఇండియాలో గడిపిన షిల్స్, ఆ తరువాత యేటా ఒకసారి వచ్చి వెడుతుండేవాడు 1967 వరకూ,అప్పుడే ఒకసారి బొంబాయిలో 1964లో ఎ.బి.షాతో ఆయన్ను కలిశాను. మినర్వా అనే పత్రిక నిర్వహించిన షిల్స్ అనేక రచనలు చేశారు. ఎన్ కౌంటర్ పత్రికలో రాశారు. The Bulletin of the Atomic Scientists అనేది కూడా లియోజి లార్డ్ తో కలసి నిర్వహించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్,క్రేంబ్రిడ్జి, చికాగో యూనివర్శిటీలలో ప్రొఫెసర్ గా పనిచేసిన ఎడ్వర్డ్ షిల్స్ కు సమకాలీన ప్రపంచ మేధావులతో సన్నిహిత పరిచయం వుంది. భారత మేధావుల గురించి ఒక పెద్ద వ్యాసం రాశారు, అలాగే యూరోప్ మేధావుల గురించి కూడా.
అర్నాల్డొ మొమిగ్లియానో(Arnaldo Momigliano)ను తన గురువుగా షిల్స్ భావించాడు. ఆయన మెచ్చుకున్న మేధావులలో ఎ.ఎస్.నయపాల్, ఫిలిప్ లార్కిన్, పీటర్ బ్రౌన్, అలెగ్జాండర్ సోల్జినిట్సిన్, బార్చగాహి ఇ.హెచ్.గోంబ్రిక్, ఎలికెడోరి వున్నారు.
రేడియో,టి.వి. సైతం వాడకుండా, న్యూయార్క్ టైమ్స్ కే పరిమితమైన ఎడ్వర్డ్ షిల్స్, సాహిత్యం ద్వారా సోషియాలజిలోకి వచ్చిన మేధావి. ఆయన రచనలు ప్రామాణికంగా ఉన్నత స్థాయిలో వుండేవి.
చికాగో విశ్వవిద్యాలయంలో ఒకప్పుడు ఎంత వున్నతస్థాయి పరిశోధన, పరిశీలన, బోధన కొనసాగిందో షిల్స్ పీఠికలో అవగహన అవుతుంది. హెరాల్డ్ లాస్ వెల్, టాల్కాట్ పార్సన్స్, రాబర్ట్ పార్క్, ఫ్రాంక్ నైట్ వంటి వారు ఉద్దండులుగా వున్న యూనివర్శిటీలో షిల్స్ రాటు తేలాడు. వారి సహచర్యం, బోధనా పటిమలు స్ఫురణకు తెచ్చుకొని, ప్రస్తుతించాడు. కాని ఎక్కడా అతిశయోక్తి భట్రాజీయం కనిపించదు. షిల్స్ అంచనాలు మాత్రం ఆకర్షణీయంగా వున్నాయి. లూయిస్ విర్త్ (Louis Wirth) తనపై చూపిన ప్రభావాన్ని షిల్స్ వివరించారు.
జాన్ నెఫ్ నాడు చికాగో విశ్వవిద్యాలయంలో పేరొందిన ఆర్ధిక శాస్త్రవేత్త, అతని లెక్చర్స్ కూడా షిల్స్ విన్నాడు. అప్పటికే మాక్స్ వెబర్, ఎమిలిడర్క్, హైగల సోషియాలజీతో ప్రభావితుడైన షిల్స్ చికాగో వాతావరణంలో పై స్థాయికి ఎదిగాడు. ఆపరిస్థితులు నేడు మారి పోయాయని, ఫెడరల్ ప్రభుత్వ యిష్టాయిష్టాల పై వుండడం, నిధులకోసం ట్రస్టీల పై ఆధారపడడం, గిరిగీసుకొని గూడుకట్టుకొని ముడుచుక పోవడం నేడు స్పష్టంగా వున్నదనీ షిల్స్ విచారం వ్యక్త పరిచారు. నేటికీ చికాగోలో ఉన్నతస్థాయి విద్యావాతావరణం వున్నదని వారితో షిల్స్ అంగీకరించలేకపోయాడు. తరాల అంతరం కనిపిస్తున్నదన్నాడు. షిల్స్ పీఠిక కాగానే, ఒక్కొక్క వ్యక్తినీ కూలంకషంగా పరిశీలించిన వ్యాసాలు వున్నాయి.
రేమండ్ ఆరన్:ఫ్రాన్స్ లో 1983 అక్టోబరు 17న అస్తమించిన సుప్రసిద్ధ సామాజిక శాస్త్రజ్ఞుడు రేమండ్ ఆరన్ (RAYMOND ARON) ప్రపంచంలో కీన్స్ (Keynes) తరువాత, అంతగా ఆకర్షించిన సోషల్ సైంటిస్టు. ఆయన మాటను యూరోప్, అమెరికా ప్రముఖులు పట్టించుకునేవారు. హెన్రీకి సింజర్,రాబర్ట్ మక్ నమారా వంటి వరు చెవిన పెట్టేవారు. కాని ఫ్రాన్స్ లో ఆయనను ఏకాకిని చేసి రియాక్షనరీ అని, ఫాసిస్టు అని వామపక్షాలవారు పేర్లు పెట్టారు.ఆండ్రి మాల్రా (Andre Malrawx) వంటివారి అభిమానాన్ని పొందిన ఆరన్ చివరి రోజులలో ఫ్రాన్స్ దృష్టిని ఆకర్షించారు. మార్క్సిజం పట్ల నిశిత పరిశీలన చేసిన ఆరన్, ఆచరణకూ సిద్ధాంతానికీ మార్క్సిజం చూపిన అఖాతమే దాని పట్ల ఫ్రాన్స్ వైముఖ్యతకు కారణమన్నారు.
విద్యారంగంలో సామాజిక వేత్తగా, ప్రభుత్వరంగంలో ప్రచారవేత్తగా రచనలు చేసిన ఆరన్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఖ్యాతిని తెచ్చుకున్నాడు. ప్రజాసమస్యల పట్ల స్పందించిన ఆరన్, బృహత్తర రచన చేయలేక పోయారని చివరిలో బాధపడ్డాడు.
ఆదర్శాలు (utopias) ఆరన్ ను ఎన్నడూ ఆకట్టుకోలేదు. ఏ సమాజమూ సంపూర్ణంకాదనీ, ప్రతిదీ విమర్శకు గురిచేయాలనీ, మార్గాంతరాలతో బేరీజు వేయాలనీ, ఆరన్ ఉద్దేశం. వివేచన యధేచ్ఛగా వినియోగించాలన్నాడు. ఆరన్ తో తన 40 సంవత్సరాల పరిచయాన్ని షిల్స్ చక్కగా కుదించి వివరించారు. జాన్ పాల్ సాత్రె ఒకవైపున ఆరన్ ను విపరీతంగా ఖండించినా, ఆరన్ అతడి పట్ల ఓర్పుగా వ్యవహరించిన తీరును పేర్కొన్నారు. మానవసమాజాలను తాత్వికంగా పరిశీలించిన ఆరన్ ఎన్నో ఒడిదుడుకులకు, విమర్శలకూ, ఖండన మండనలకూ తట్టుకున్నాడన్నారు. మానవ మస్తిష్కంనుండి హేతువును మట్టుబెట్టడం దుస్సాధ్యమని ఆరన్ దృఢ విశ్వాసం. వివేచన పట్ల అచంచల విశ్వాసంతోనే ఆరన్ రచనలు సాగించాడు. నిగ్రహంగా వ్యవహరిస్తూ, ఇతరుల పట్ల జాగ్రత్త వహిస్తూ, మేధావిగా సమాజాన్ని ప్రబావితం చేసిన వ్యక్తిగా ఆరన్ ను షిల్స్ పేర్కొని, జోహార్లు అర్పించారు.
22 పుటలలో ఆరన్ గురించి ఎంతో నిగూఢంగా షిల్స్ చూపగలిగారు. ఆయన వెలుగు నీడల్ని అందంగా పేర్కొన్నారు. వ్యక్తిత్వం అంచనా వేసిన తీరు చూచి మనం ఎంతోనేర్చుకోవచ్చు. రేమండ్ ఆరన్ గురించి మనలో చాలామంది చదివినా, షిల్స్ చెప్పిన తీరు హుందాగా, వివేచనాత్మకంగా, నిష్పాక్షింగా వుంది. వ్యక్తి చిత్రణ అలావుండాలి. సన్నిహిత పరిచయంగల మేధావిని గురించి ముఖస్తుతి చేయకుండా,లోకానికి అద్దం పట్టిచూపడం షిల్స్ వంటి సామాజిక శాస్త్రజ్ఞుడికే తగును.
నిరాద్ సి. ఛౌదరి: షిల్స్ చిత్రణలో ఒక భారతీయ మేధావి ఛౌదరి చోటు చేసుకున్నాడు. ఆ విధంగా ప్రపంచ మేధావుల కోవలో నిరాద్ ఛౌదరి నిలబడ్డాడు. షిల్స్ కు బాగా పరిచితుడు, యిష్టుడైన మరొక భారతీయ నవలాకారుడు ఆర్.కె.నారాయణ.
1921లో కలకత్తా యూనివర్శిటీలో డిగ్రీ పొందలేక, వదిలేసిన నిరాద్ ఛౌదరి ఆలిండియా రేడియోలో వుద్యోగంచేస్తూ పదవీ విరమణానంతరం ఇంగ్లాండ్ ప్రవాసం వెళ్ళాడు. రచయితగా భారతదేశంలో పేరున్నా బ్రతకడానికి తగిన ఆధారవృత్తి కాలేదు. అందుకని భార్య ప్రోత్సాహంతో దేశాంతరం తరలి, పెద్ద పేరు పొందాడు. కాని దేశాన్ని ప్రేమించడం మానలేదు. ఆయన నిశితపరిశీలన,విమర్శ చాలామందికి నచ్చక పోయినా, అలాగే చెప్ప దలచింది నిర్మోహమాటంగా రాశాడు. గాంధీజీ పట్ల తీవ్ర విమర్శ చేస్తూ, దేశాన్ని వెనక్కు నడిపించే ఆయన ధోరణిని దుయ్యబట్టాడు. ఆయన రచనలలో ది ఆటోబయాగ్రఫీ ఆఫ్ ఏన్ అన్ నోన్ ఇండియన్, ది హేండ్ గ్రేట్ అనార్క్ అనే రెండూగొప్పవని షిల్స్ పేర్కొన్నారు. భారత సమాజం, పాశ్చాత్య భావాలతో సంబంధం అనేవి ఛౌదరి. ది ఇండియన్ ఇంటలెక్చువల్, హిందూయిజం కాంటినెంట్ ఆఫ్ సర్సి, క్లైవ్, మాక్స్ ముల్లర్ గురించి రాశారు.
భారతీయుడుగా, బెంగాలీగా, యూరోప్ వాసిగా, ఇంగ్లీష్ మన్ గా స్పందించిన ఛౌదరి, విశిష్ట రచయితగానే నిలిచాడు. ప్రపంచ పౌరుడుగాపరిణమించాడు. పొట్టిగా,బక్కపలచగా వుండే ఛౌదరి, ఎంతో ఆత్మ విశ్వాసంతో, నిబ్బరంగా రచన సాగింది తన జ్ఞాన పరిధిని విస్తరించి, ప్రతిభచూపాడని షిల్స్ రాశారు. ఇంగ్లండ్ లో స్థిరపడినా ఇండియాను వదలని రచయిత ఛౌదరి, భారతదేశ విభజన పట్ల కూడా ఆయన బాధతో రచన చేసి Thy Handలో చూపారు.
1955 లో తొలుత యూరోప్ వెళ్ళిన ఛౌదరి అట్టే ప్రయాణం చేయని రచయిత. అంతవరకూ కలకత్తా లోనే గడిపిన ఛౌదరి, ప్రపంచాన్ని ఎంతో సన్నిహితంగా చూచాడని షిల్స్ అన్నారు. బ్రహ్మసమాజ ప్రభావితుడైన ఛౌదరి, ఉదారవాది.
ఛౌదరి ఇంగ్లీషులో రాయడం మొదలు పెట్టిన తరువాత,ఇంగ్లండులో గుర్తింపు లభించింది. క్రమంగా ప్రపంచం గుర్తించింది. భారతదేశంలో ఆయనకు అవమానాలు నిరాదరణ వున్నా, తట్టుకొని నెగ్గుకొచ్చాడు. తలవంచని రచయితగా నిరాద్ ఛౌదరి తన అభిప్రాయాలను చాటాడు. చాలా లోతుగా అధ్యయనం చేసిన అనంతరమే రచనకు ఉపక్రమించే వాడు.
ఎడ్వర్డ్ షిల్స్ తన అభిప్రాయాన్ని వెల్లడించి ఛౌదరికి న్యాయం చేకూర్చాడు.
సిడ్నీహుక్: రాజకీయం పలికినా, తత్వం మాట్లాడినా సిడ్నీహుక్ హేతుబద్ధంగా రాసేవాడు. ఆయన ప్రభావం సమకాలీన సామాజిక శాస్త్రాలపై చాలా కనబడుతుంది. బెర్ట్రాండ్ రస్సెల్, జాన్ డ్యూయీ, మెరిస్ కోహెన్ ల శిష్యరికం చేసిన సిడ్నీహుక్ మార్క్సిజం బాగా అధ్యయనం చేశాడు. సత్యాన్వేషణ అత్యున్నతమైనదని ఆయన సిద్ధాంతం. సోషలిస్టు భావాలు వున్నా, ప్రజాస్వామ్యాన్ని, వ్యక్తి స్వేచ్ఛను తప్పనిసరిగా ఆదరించాలన్నాడు.
రాజకీయాలు వాదించేటప్పుడు చాలా పట్టుదల చూపెట్టిన సిడ్నీ హుక్ వివేచన మాత్రం ఎన్నడూ సడలించలేదు. 1920 ప్రాంతాలలో సోవియట్ యూనియన్ పట్ల అమెరికాలో కమ్యూనిస్టు పార్టీ పట్ల కొంత సానుభూతి చూపినా, మిగిలిన వామపక్షమేధావుల వలె ప్రవాహానికి కొట్టుక పోలేదు. గుడ్డిగా కమ్యూనిస్టులను వ్యతిరేకించే వారి పట్ల సిడ్నిహుక్ తన అయిష్టత చూపాడు.
ట్రాట్ స్కీరక్షణ సంఘంలో పాల్గొన్న హుక్, మాస్కోలో మారణ కాండపై విచారణలో ఆసక్తి చూపి, సాంస్కృతిక స్వేచ్ఛ కావాలనే సంఘాల స్థాపనలో చేరాడు. ప్రజా జీవిత సమస్యలతో స్పందించిన హుక్, రేమాండ్ ఆరన్ వలె చాలా సందర్భాలలో పాల్గొని, వివాదాస్పద చర్యలకు దిగాడు. చాలా ప్రతిభావంతుడైన యూదుగా హుక్ తన జీవితంలో అత్యధిక కాలం న్యూయార్క్ లోనే గడిపాడు.
హెరాల్డ్ లాస్కీ: లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో 3 దశాబ్దాలు పనిచేసిన లాస్కీ పుస్తకాలు నేడు ఆ సంస్థలోనే చదవడం లేదు. కాని ఆయన సమకాలీనులు రాజకీయాల్లో లాస్కీ వద్ద వ్యాకరణం నేర్చారు. ప్రపంచ వ్యాప్తంగా లాస్కీ ప్రభావం వుండగా, వామ పక్షాలపై యీ ప్రభావం వీరారాధనకు పోయింది. 1993ఓ లాస్కీ శతజయంతి కూడా జరిపారు.
మాంచెస్టర్ లో సంపన్న యూదుకుటుంబంలో పుట్టిన హెరాల్డ్ లాస్కీ,హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో బోధించి గొప్ప పేరు పొందాడు. తరువాతే లండన్ లో స్థిరపడి 1950లో చనిపోయే వరకూ ఉపాధ్యాయుడుగా వున్నాడు. ఆయన రచయితే గాక, గొప్ప వక్త కూడా ఇంగ్లండ్ రేషనలిస్ట్ సంఘాధ్యక్షుడుగా కొంతకాలం వున్న లాస్కీ, లేబర్ పార్టీ సోషలిస్టుగా వున్నాడు. అయితే ఒకసారి నమ్మిన వాటిని మళ్ళి మళ్ళీ రాస్తూ, కాలానుగుణంగా వస్తున్న మార్పుల్ని సరిగా గమనించక పోవడం ఆయన లోపం.
ఫేబియన్ సోషలిస్ట్ గా పరిణమించిన లాస్కీ, బలీయ కేంద్ర ప్రభుత్వం పట్ల విశ్వాసం ప్రకటించాడు. కొన్నాళ్ళు సిడ్నీ బీట్రిస్ వెబ్ సిద్ధాంతాల ప్రభావం కింద లాస్కీ వున్నాడు. సోవియట్ యూనియన్ ను సమర్ధించి, అమెరికా సామ్రాజ్యవాదాన్ని లాస్కీ ఖండించాడు. లెఫ్ట్ బుక్ క్లబ్ స్థాపించిన లాస్కీ అటు ఉపాధ్యాయుడుగానూ యిటు ప్రపంచ వ్యవహారాలలోనూ ఆసక్తితో పాల్గొన్నాడు.
లియో జిలార్డ్: అణ్వాయుధాలు సొవియట్ యూనియన్,అమెరికాల మధ్య ప్రచ్ఛన్న పోరాటసమస్యలలో కీలక పాత్ర వహించిన మేధావి లియోజిలార్డ్ (Leo Szilard) అతడు సామాజిక,రాజకీయ, ఆర్ధిక విషయాలలో ప్రతిభాశాలి. శాస్త్రీయ పరిశోధనకు అగ్రతాంబూలం యిచ్చాడు. 1932లోనే హిట్లర్ అధికారానికి రాబోతునాడని గ్రహించి యితరులను హెచ్చరించిన యింగిత జ్ఞాని. 1937లో అతడు యూరోప్ నుండి అమెరికా వలన వెళ్ళి ప్రధాన పాత్ర వహించాడు. అణుశాస్త్ర పరిశోధనలు బయట పెట్టవద్దని జర్మనీ పాలకుడైన హిట్లర్ కు అవి తెలిస్తే ప్రమాదం అని హెచ్చరించాడు.
బాంబు ప్రయోగాన్ని గురించి అమెరికా అధ్యక్షుడికి నచ్చ చెప్పడానికి ఐన్ స్టీన్ న్ని కూడా రంగంలో దింపాలని జిలార్డ్ ప్రయత్నించాడు. ది వాయిస్ ఆఫ్ ది డాల్ఫిన్స్ అనే రచన చేసిన జిలార్డ్, తరచు ఆటమిక్ సైంటిస్టుల బులిటన్ లో వ్యాసాలు రాసేవాడు. "ఏటెమ్స్ పర్ పీస్" బహుమానం పొందిన జిలార్డ్ చివరి దాకా ఆస్థి పాస్తులు లేకుండా బ్రతికిన మేధావి. తన అభిప్రాయాలు అటు కృశ్చేవ్ కూ,యిటు కెనడీకి తెలియపరచిన జిలార్డ్, కాన్సర్ వ్యాధితో మరణించాడు. ఆయన మేధస్సుకు ఎడ్వర్డ్ షిల్స్ చాలా గొప్పగా హారతులిచ్చాడు.
జాన్ యునెఫ్: చికాగో విశ్వవిద్యాలయ స్థాపకులలో ఒకరైన నెఫ్ గొప్ప మేధావి. ఆయన బొగ్గును గురించి రాసినా,అందరితో కథవలె చదివించగల సత్తా వున్న ప్రతిభావంతుడు. వాస్తవానికి బొగ్గుపరిశ్రమపై ఆయన చేసిన పరిశోధన గొప్పది. 30 సంవత్సరాల పాటు చికాగో విశ్వవిద్యాలయంలో పనిచేసిన నెఫ్ సోషల్ థాట్ పై ఒక సంఘాన్ని ఏర్పరచాడు.
నెఫ్ లెక్చరర్ గా చాలా క్రమబద్ధమైన వాడని షిల్స్ అన్నాడు. బ్రిటీష్ బొగ్గు పరిశ్రమ గురించి విద్యార్ధులను ఆకట్టుకునే లెక్చర్ యివ్వడం నెఫ్ కే చెల్లిందన్నాడు. ఆర్ధిక రంగంలో కవిత్వాన్ని జొప్పించి, టి.ఎస్.ఇలియట్ ను ప్రస్తావించగల సమర్ధత నెఫ్ కు వున్నది. తన పరిశోధనా ఫలితాలను బేరీజు వేసి క్లాస్ లో చెప్పడం ఆయన అద్భుత ప్రతిభగా షిల్స్ చెప్పారు. ప్రతి తరగతిలో కొత్త విశేషాలను చెబుతూ, జర్మనీలోని విద్యారంగ లక్షణాలు అమెరికాలో ప్రవేశపెట్టిన ఖ్యాతి నెఫ్ కు దక్కాలని షిల్స్ అంటారు.
కార్ల్ మన్ హైం: షిల్స్ రాసిన మేధావులలో కార్ల్ మన్ హైం సుప్రసిద్ధ సామాజిక శాస్త్రజ్ఞుడు. మేధావులకు సంబంధించిన ఆయన దృక్పధం షిల్స్ ను ఆకట్టుకున్నది. కాంట్ వలె తానూ ఆకర్షించాలని మన్ హైం భావించినా,అది సఫలం కాలేదు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో ఆయనకు తగిన ఆదరణ లభించ లేదు.
అమెరికాలో తన రచనలు గురించి ఏమనుకుంటున్నారో అనే విషయమై అతడు శ్రద్ధగాపట్టించుకునే వాడు.
కార్ల్ పాపర్ రాసిన పావర్టి ఆఫ్ హిస్టారిసిజం విమర్శ ప్రధానంగా మన్ హైంను దృష్టిలో పెట్టుకున్నదే. హైక్ (Hayey) రాసిన రోడ్ టు సెర్భడం కూడా మన్ హైంపై విమర్శతోకూడిందే. సోషియాలజీ ప్రొఫెసర్ మారిస్ గింజ్ బర్గ్ కూడా మన్ హైంపై ధ్వజమెత్తి విమర్శలు చేశాడు. మన్ హైం చనిపోయినప్పుడు ఎడ్వర్డ్ షిల్స్ వెళ్ళగా, గింజ్ బర్గ్ తన భర్తను చంపేసినట్లు (విమర్శలతో!) ఆయన భార్య విలపిస్తూ అన్నది.
గలీలియో సొసైటీలో సభ్యులుగా మైకెల్ పొలాని, మన్ హైంలు సన్నిహితులు. కాని అభిప్రాయాలలో విరుద్ధంగా వుండేవారు. టి.యస్.ఇలియట్ యితడిమేధస్సును శ్లాఘించాడు. అయినా ఇంగ్లండులో ప్రవాసిగా మన్ హైం యిమడలేక పోయాడు.
అర్నాల్డ్ డాంట్ మొమిగ్లి యోనో: మేధావులకు, పరిశోధకులకు తెలిసిన మొమిగ్లియానో,బహుళ ప్రచారం లేని గొప్ప వ్యక్తి. అతని రచనలన్నీ 750 వరకూ వున్నవి. ఇతడు 1908లో పుట్టాడు. యూదు, ఆక్స్ ఫర్డ్ లో కృషి చేశాడు. ఇటలోలో రాని రాణింపు అక్కడ వచ్చింది. చికాగోలో విజటింట్ ప్రొఫెసర్ గా వుండేవాడు. గిబ్బన్ గొప్పవాడని, మైకల్ రోస్టో విజఫ్ (Mikhail Rostovzeff) ప్రాచీన చరిత్ర పండితులలో గొప్ప వాడని మొమిగ్లోయానో అనేవాడు. కేంబ్రిడ్జి ప్రాచీన చరిత్రలో యితడి ప్రతిభ కనిపిస్తుంది. చివరి దశలో బాగుగా గుర్తింపు, రాణింపు, ప్రచారం లభించగా తృప్తి చెందిన మేధావి. మతనమ్మకాలు ఉపరితల విషయాలుగా భావించరాదని, యీ విషయమై మార్క్సిస్టు దృక్పధం సరైనది కాదని ఆయన భావించాడు. రాబార్ట్ మెనార్డ్ హచిన్స్, లియోపోల్డ్, లబెజ్ గురించి విశిష్టంగా షిల్స్ జోహార్లు అర్పించాడు.
మేధావులను గుర్తించడం వారి ప్రతిభకు జోహార్లు అర్పించడం, అందులో అతిశయోక్తులు లేకుండా అంచనా వేయడం షిల్స్ పుస్తక విశేషం. దీన్నుండి మన రచయితలు నేర్చుకోదగింది వుంది.