అబద్ధాల వేట - నిజాల బాట/పిల్లలకూ హక్కులున్నాయి! అమలుపరిచేది ఎవరు?

పిల్లలకూ హక్కులున్నాయి!
అమలుపరిచేది ఎవరు?

పిల్లలకు ఓటుహక్కులేదు.

ఎందుకని?

సమాజం, ప్రతినిధులు, పరిపాలన, రాజకీయం ప్రాతినిధ్యం తెలుసుకోడానికి యుక్తవయస్సు రావాలి. ఈలోగా అవన్నీ బడిలో, బయటా తెలుసుకోవచ్చు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అంగీకరించిన విషయం.

పిల్లలు పెళ్ళిచేసుకోరాదు.

ఎందుకు?

సంసారం, దాంపత్యం, సెక్స్, సంతానం మొదలైన విషయాలు అవగహన కావడానికి తగిన తరుణం కావాలి. వీటిని పాఠాల్లో, పెద్దల ద్వారా గ్రహించవచ్చు. కనుక పిల్లల పెళ్ళిళ్ళు నిషేధించారు. ఇంకా చెదురుమదురుగా వున్నా, మొత్తం మీద బాల్యవివాహాలు కూడదని అందరూ ఒప్పుకుంటున్నారు.

పైవాటికి చెందిన మరో అంశం వుంది. పిల్లలకు మూఢనమ్మకాలు, అలౌకిక విశ్వాసాలు అవగాహనకు రావు. అవి పెద్దల పరిధిలోనివి. కనుక వాటిని పిల్లలపై తెలిసో తెలియకో రుద్దకూడదు.

పిల్లలకు హక్కులున్నాయంటే చాలాకాలం నవ్వారు. "నాలుగు వడ్డించి చెప్పి చేయించాలి గాని పిల్లలకు స్వేచ్ఛ, హక్కులు ఏమిటి?" అన్నారు.

రానురాను ప్రపంచంలో అన్ని దేశాల వారు పిల్లల సంగతులు పట్టించుకున్నారు. దీని ఫలితంగా 1989లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ పిల్లల హక్కుల పత్రం ఆమోదించింది. ఆ విషయాలను వివిధ దేశాల తమ చట్టాలతో అమలుపరచాలి.

కాని ఇంతవరకు అలాంటి ప్రపంచ చట్టం వున్నదని ఎక్కువ మందికి తెలియదు. బడుల్లో జాతీయగీతం వలె, పిల్లలహక్కుల పత్రాన్ని పాఠ్యాంశంగా చెప్పడం మొదలుపెట్టాలి.

పిల్లల హక్కుల్ని ఒప్పుకోవడం ఒక పట్టాన తల్లిదండ్రులకు యిష్టమైన అంశం కాదు. విషయం తెలియకనే అలా ప్రవర్తిస్తారు.

మా పిల్లలు,మేం కొడతాం తిడతాం. కాదనడానికి మీరెవరు? అనే ధోరణి అత్యధిక సంఖ్యాక తల్లిదండ్రులలో వుంటుంది.

పిల్లలు కూడా వ్యక్తిత్వం గలవారనీ, వారి మానసిక పరిణతికి స్వేచ్ఛగా నేర్చుకునే వాతావరణం, ప్రశ్నించే అవకాశం వుండాలనేది వైజ్ఞానిక దృక్పథం. ప్రశ్నవేస్తే, అలా అడగకూడదు, కళ్ళు పోతాయి అనే తల్లిదండ్రులు పిల్లల పట్ల ద్రోహం చేస్తున్నారనేది సారాంశం. కొన్ని ప్రశ్నలు యిబ్బంది పెడతాయి. సమాధానాలు తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. కనుక పిల్లల నోరుమూయించడం భయపెట్టడం కొట్టడం మార్గాంతరం కాదు.

చిన్నప్పుడు అలా జిజ్ఞాసను అణచివేస్తే పెద్ద అయిన తరువాత, సైంటిస్ట్ కు సైతం మనోవికాసం వుండదు.

హక్కులు పిల్లలకు వున్నాయని ఇన్నాళ్ళు తెలియకపోవడం తప్పుకాదు. తెలిసిన తరువాత అమలు చేయకపోవడం పిల్లలపట్ల అపచారం.

పాఠాల్లో పిల్లల హక్కుల ప్రచురించి ప్రచారంలోకి తేవడం కనీస కర్తవ్యం. తదనుగుణంగా మీడియా ప్రసారాలు స్పందించడం అవసరం. ఇందుకు పిల్లల పట్ల పెద్దలకు గల మానసిక గూడు తొలగించాలన్న మాట.

- జనబలం, 7 జూలై, 2002