అబద్ధాల వేట - నిజాల బాట/పిల్లలకు హక్కులున్నాయి! కానీ...?
ప్రపంచ స్థాయిలో గొప్ప మార్పు వచ్చింది. 21 శతాబ్దానికి అది శుభసూచకం. కాని ఆ మార్పు దేశాలకు, అందులో ప్రజలకూ, ముఖ్యంగా తల్లిదండ్రులకూ చేరాలి. అక్కడే వుంది తిరకాసు.
పదేళ్ళ క్రితం ఐక్యరాజ్యసమితి గొప్ప పనిచేసింది. పిల్లల హక్కులపై ప్రపంచ రాజ్యాల సమావేశం జరిపింది. బాగా పరిశీలించి, చర్చించి పిల్లల హక్కుల పత్రాన్ని రూపొందించారు. 54 ఆర్టికల్స్ తో కూడిన పిల్లల హక్కుల్ని త్వరత్వరగా అన్నిదేశాలు ఆమోదించడం మరీ విశేషం. రెండే రెండు దేశాలు యింకా సరే అనవలసివుంది. ఒకటి సోమాలియా. అక్కడ ఒక ప్రభుత్వం అంటూ లేకుండా భీభత్స పరిస్థితి వుంది గనుక కొంత వేచివుందాల్సిందే. రెండో దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు. అదీ ఆశ్చర్యకరమైన విషయం. అగ్రరాజ్యంగా, పెద్ద ప్రజాస్వామిక స్వేచ్ఛా దేశంగా గర్వించే అమెరికా పిల్లల హక్కుల్ని ఎందుకు ఆమోదించలేదు? పరిశీలించాలి.
పిల్లల హక్కుల్ని 192 దేశాలు ఆమోదించడం, చరిత్ర. ఇక మిగిలింది ఆయా దేశాల పార్లమెంటులు తగిన చట్టాలు చేయడం. తరువాత తల్లిదండ్రులకు త్వరగా యీ హక్కుల విషయం తెలియపరచి అమలుజరిగేటట్లు చూడడం. అక్కడే వుంది కీలకం అంతా.
పిల్లల హక్కులు ఏమి చెబుతున్నాయి?
తల్లిదండ్రులు ప్రధానపాత్ర వహించి పిల్లల హక్కుల్ని కాపాడాలి.
ఏమిటా హక్కులు? పిల్లల్ని హింసకు, దోపిడీకి, చాకిరీలకు, అమ్మకాలకు, అపహరణలకు దూరంగా వుంచాలి.
పిల్లలకు హక్కులున్నాయనే సంగతి తల్లి దండ్రులకు నచ్చజెప్పడంలో గొప్ప యిబ్బంది వుంది. మా పిల్లలు, మా యిష్టం, ఏమైనా చేసుకుంటాం, కొడతాం, తిడతాం, పెడతాం, పనిచేయిస్తాం మా యిష్టం వచ్చినట్లు దండం పెట్టిస్తాం అని తల్లిదండ్రులు అంటారు. మా పిల్లల్ని మా యిష్టం వచ్చినట్లు పెంచుకునే హక్కు లేదా అంటారు.
తల్లిదండ్రులకు నెమ్మదిగా నచ్చజెప్పడంలోనే పిల్లల హక్కుల సమస్య ఎదురౌతుంది.
పుట్టిన దగ్గరనుండి చనిపోయే వరకూ పరోక్షంగా, ప్రత్యక్షంగా అదుపుచేసే మతం వుంది. తల్లిదండ్రులు మతవిశ్వాసంతో పెరిగి, అదే మంచిదనుకొని, తమ పిల్లలకూ తమ నమ్మకాలు, విశ్వాసాలు అంటగడతారు. పేరు పెట్టడం నుండి అనేక క్రతువులు, మతపరంగా సాగిస్తారు. ఇందులో పురోహితులు కీలకపాత్ర వహిస్తారు.
తల్లిదండ్రులు ఏ మతానికి, కులానికి, జాతికి, దేశానికి చెందినా వారైతే, అవే పిల్లలకు వంశపారంపర్య ఆస్తిగా అందిస్తారు. కనుక హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, యూదులు కొనసాగుతున్నారు. అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ, రెడ్డి, కాపు, మాల, మాదిగ కులాలు పిల్లలకు అంటుకుంటున్నాయి. ఇక్కడే పిల్లలకు స్వేచ్ఛ అవసరం, అదే కష్టమైన పని.
కొన్ని విషయాలు పెద్దల పరిధిలోనివి. సెక్స్, రాజకీయం అందుకు ఉదాహరణలు. అందుకే పెళ్ళికి యుక్తవయస్సు రావాలన్నారు. రాజకీయంగా ఓటు హక్కుకు 18 ఏళ్ళు వుండాలన్నారు. అందుకు తల్లిదండ్రులకు అభ్యంతరం లేదు. చిన్న పిల్లలకు ఓటు కావాలని, లైంగిక చర్య కావాలని, పెళ్ళిళ్ళు కావాలని తల్లిదండ్రులు అనడం లేదు. అలాంటిదే మరొక పరిధి వుంది. అదే మతం, భక్తి విశ్వాసాలు పెద్దలకు సంబంధించిన నమ్మకం. పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తరువాత వారిష్టమొచ్చిన మతాన్ని స్వీకరిస్తారు, లేదా నిరాకరిస్తారు. ఈ లోగా వారు తమ చదువులో విషయం తెలుసుకుంటారు. మూఢంగా నమ్మమనడానికీ, బడిలో అడిగి తెలుసుకోడానికి చాలా తేడా వుంది. అడిగి తెలుసుకోవడం, పాఠాలలో శాస్త్రీయంగా మతాన్ని, సెక్సును, రాజకీయాల్ని గ్రహించడానికీ తేడావుంది.
ఈ విషయం చాల దుర్లభమైంది. తల్లిదండ్రుల్ని ఒప్పించడం చాల కష్టం. చిన్నప్పుడే బలవంతంగా ముస్లింలు తమ పిల్లల్ని మసీదులకు తీసుకెళ్ళి నిర్భందంగా కొరాన్ అంతా వల్లెవేయిస్తున్నారు. క్రైస్తవులు దేవాలయాలలో బైబిల్ నూరిపోసి పిల్లలకు సండే స్కూల్స్ ద్వారా మూఢనమ్మకాలు నూరిపోస్తున్నారు. హిందువులు తమ పిల్లల పక్షాన మొక్కుబడులు చేసి, గుండ్లు కొట్టించి, వినాయకుడికి దండాలు పెట్టిస్తున్నారు. ఈ విధంగా అన్ని మతాల వారు చిన్న పిల్లల్ని ఆయా మతాల నమ్మకాలలో ముంచి తేల్చుతున్నారు. పిల్లల స్వేచ్ఛను అరికడుతున్నారు. ప్రశ్నించి తెలుసుకునే స్వభావాన్ని అణిచిపెడుతున్నారు. భక్తి పేరిట భయం ప్రవేశపెడుతున్నారు. పాపం, నరకం, దైవం, దయ్యం అనే బూచి చూపి అన్వేషణ ఆపుతున్నారు. చిన్న పిల్లల్ని వివిధ పనులకు వినియోగించడం మరొక చర్యగా వుంది. బడిలో చదవాల్సిన వయస్సులో పని చేయించి, వారి సంపాదన తల్లిదండ్రులు స్వీకరిస్తున్నారు. చిన్న పిల్లల్ని పరిశ్రమల్లో వినియోగించినప్పుడు, ఆ కర్మాగారాల ఉత్పత్తి స్వీకరించకూడదని కొన్ని ప్రజాస్వామిక దేశాలు ఆంక్షలు పెడుతున్నాయి. ఉదాహరణకు భారతదేశంలో చిన్న పిల్లల్ని తివాచీలు తయారుచేయడంలో, బాణాసంచా మందు సామాగ్రి చేయడంలో, బీడీలు తయారుచేయడంలో వినియోగిస్తున్నారు. పిల్లల్ని తమ పెట్టుబడిగా వాడుకోవడం తల్లిదండ్రుల నేరం, కనడం అదుపులో పెట్టుకోమంటే, దేవుడిచ్చిన సంతానం అని సమాధానం సాకుగా చెబుతారు. అక్కడ కూడా మతాలూ అడ్డొచ్చి, జనాభా అదుపును వ్యతిరేకిస్తూ, దైవం పేరిట, పవిత్ర గ్రంధాలపేరిట ద్రోహం చేస్తున్నాయి. కాలుష్యం పెంచడంలో మతాల పాత్ర చాలా వుంది. ఈ విషయంలోనూ తల్లిదండ్రులకు నచ్చజెప్పాల్సిందెంతో వుంది.
యుద్ధాలలో చిన్నపిల్లల్ని వాడడం మరో ఘోరచర్య. ఆఫ్ఘనిస్తాన్ మొదలు సొమాలియా వరకూ యుద్ధాలలో చిన్నపిల్లల్ని వాడారు. ఇంకా వాడుతున్నారు. మతం, దైవం పేరిట పిల్లలు సైతం దేశం కోసం, నాయకుడి కోసం త్యాగం చేయాలని బోధలు చేసారు. అనేక మంది పిల్లల్ని ఆహుతి చేసారు. ఈ విషయంలో ఏయే దేశాలలో ఎంతమంది పిల్లలు బలి అయిందీ సమితి వివరాలు ప్రచురించింది. అనేక చోట్ల మందుపాతర్లకు వికలాంగులుగావడం, చనిపోవడం కూడా నిరంతరం జరుగుతున్నది. మందు పాతర్లని తొలగించాలని తీర్మానించినా, ఈ ఉద్యమం కుంటుతూనే వుంది.
పిల్లలకు సైతం మతం పేరిట వైద్యం చేయకుండా, కేవలం ప్రార్ధనతో చికిత్స సరిపోతుందనే నేరాలకు కొందరు పాల్పడుతున్నారు. క్రైస్తవ మతశాఖలు కనీసం 15 వరకూ యీ క్రూర చర్యను అమలుపరుస్తున్నాయి. దీనిపై అమెరికా, యూరప్ దేశాలలో వుద్యమాలు సాగుతున్నాయి. మతహక్కు చాటున, పిల్లల రోగాలు వచ్చినట్లు చెప్పకుండా దాచిపెట్టి, చంపేసిన దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రిస్టియన్ సైన్స్, ఫెయిత్ అసెంబ్లీ, జెహోవా విట్నెస్, క్రీస్తు అసెంబ్లీ వంటి క్రైస్తవ శాఖలు యిలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. లోగడ భారతదేశంలో చిన్నపిల్లలకు రోగాలు వస్తే, మొక్కుకోవడం, కాల్చడం వంటి పిచ్చి వైద్యాలు చేసి ఆహుతి యిచ్చినట్లే, యివి కూడా సాగుతున్నాయి. ఇలాంటివి అన్ని మతాలలోను వున్నాయి. మదర్ తెరీసా వంటి వారు చిన్నపిల్లలకు మందులివ్వకుండా ప్రార్ధనలతో సరిపెట్టిన సందర్భాలున్నాయి!
మతం పేరిట ప్రపంచ వ్యాప్తంగా మరో ఘోరం జరుగుతున్నట్లు సమితి ఇటీవల గుర్తించింది. మతం పేరు పెట్టకుండా సాంస్కృతిక దురాచారం అన్నారు. ఆడ పిల్లలకు సుంతీ చేయించడం యిందులో ఒకటి. కొన్ని ముస్లిం దేశాలు, కొన్ని ఆఫ్రికన్ దేశాలు యీ చర్య తప్పనిసరిగా చేస్తున్నాయి. బాలికల మర్మాంగం బుడుపును కోసేస్తారు. దీనివలన వాపులు, సెప్టిక్ అయి చనిపోవడం, సెక్స్ చర్యలో తీవ్ర ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. యునెస్కో వారు, యీ చర్య జరిగినచోట ప్రథమచికిత్స కిట్స్ యిస్తున్నారు. అమెరికాలోని ముస్లింలు సైతం విదేశాలకు వెళ్లి తమ ఆడపిల్లలకు సుంతీ చేయించుకొస్తున్నారు. అమెరికాలో ఆడపిల్లల సుంతీ నిషిద్ధం గనుక అలా చేస్తున్నారు.
ప్రపంచ మతాల సభను సమితి ఏర్పాటు చేసింది. పిల్లల విషయంలో జాగ్రత్త వహిస్తామని ఆయా మత ప్రతినిధులు అన్నారు. కాని మూల పవిత్రగ్రంథాలను ప్రశ్నించకుండా, మత మూల పురుషుల పెత్తనం తొలగించకుండా వున్నంత కాలం, పిల్లలపై అత్యాచారాలు, దూషణలు ఆపడం సాధ్యంకాదు. మతాలే పిల్లల హక్కుల్ని అమలుపరచనివ్వడం లేదు. మత గ్రంధాలలో పిల్లల్ని హింసించడాన్ని ఆమోదించారు. పిల్లల్ని బానిసలుగా చూడడాన్ని బైబిల్ ఆమోదించింది. అలాంటి మతాలు పిల్లల హక్కుల్ని అమలుపరచవు.
పిల్లల్ని ఎవరు ఎన్ని విధాలు చిత్రహింసలకు గురి చేస్తున్నారనేది ఏకరవు పెడితే చాలా పెద్ద జాబితా అవుతుంది. ఏ మతం ఏ విధంగా పిల్లల్ని దారుణంగా అణచివేస్తున్నదీ పెద్ద జాబితాలోకి వస్తుంది. సమితి, యీ విషయం జాగ్రత్తగా గ్రహించి, హక్కుల పత్రం తయారుచేసింది. వీటిని ఆమోదించిన దేశాలు, తమ ప్రాంతంలో మతాల్ని జాగ్రత్తగా అదుపులో పెట్టి, పిల్లల్ని కాపాడాలి.
పుట్టిన పిల్లలందరూ పెరుగుతారు. ఎలా పెరుగుతున్నారనేది సమస్య. అక్కడే వారి హక్కుల ప్రస్తావన వస్తుంది. ఇందుకుగాను తల్లిదండ్రులకు చాలా చెప్పవలసి వుంది. పిల్లలహక్కులు అనేది చాలా మందికి వింతగా, కొత్తగా, ఆశ్చర్యంగా కనిపించవచ్చు. క్రమేణా, లోతుకు పోయే కొద్దీ అందులో శాస్త్రీయ సత్యం వుందని గ్రహిస్తారు. కొట్టి నోరు మూయించడం సులభం, నచ్చజెప్పడం, సందేహాలు తీర్చడం, ఓపెన్ గా జవాబులివ్వడం, విసుక్కోకుండా సమాధానాలివ్వడం దుర్లభం.
ముఖ్యంగా పిల్లలకు అబద్ధాలు చెప్పకూడదు. తల్లిదండ్రులు చాల సందర్భాలలో, క్రమశిక్షణ పేరిట, భయం పుట్టించే విషయాలు చెబుతారు. దేవుడికి దండం పెట్టకపోతే శిక్షలు పడతాయనీ, నరకానికి పోతారనీ, చీకట్లో రాక్షసులు, దయ్యాలు, భూతాలూ వస్తాయనీ యిలాంటి వన్నీ తాత్కాలికంగా తల్లిదండ్రులకు ఉపకరించవచ్చు. కాని పిల్లలకు శాశ్వత హాని చేకూర్చుతాయి. దైవాన్ని గురించి పిల్లలు వేసే ప్రశ్నలకు చాలామంది తల్లిదండ్రులు తెలిసో తెలియాకో ఆగ్రహిస్తారు, కొడతారు. అదే వారు చేస్తున్న పెద్ద తప్పు. అలాగే పిల్లలు తమ పుట్టుక గురించి అడిగినప్పుడు కూడా దేవుడు పుట్టించాడనీ, చనిపోయినప్పుడు దేవుడు దగ్గరకు వెళ్ళారనీ చెప్పి, అన్వేషణ చంపేస్తున్నారు. తల్లి దండ్రులకు యీ విషయమై చాలా చెప్పవలసివుంది. అక్కడే పిల్లల హక్కుల సమస్య వస్తుంది. ఇది ఒక విధంగా చిక్కులతో కూడినదైనా, తప్పనిసరిగా పరిష్కరించాలి.
పిల్లల హక్కులు గమనించనందున అనేక దారుణాలు జరిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం, సమితి అంచనా ప్రకారం ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. ఇందులో కనీసం 24 లక్షల మంది పిల్లల్ని రోగాలనుండి కాపాడడం సాధ్యమైనా, అశ్రద్ధ, అనాగరికత, అజ్ఞానం, అందుబాటులో వైద్యం లేక హతమౌతున్నారు. 40 లక్షల మంది పిల్లలకు శుభ్రమైన నీరు తాగే అవకాశం లేకుండా వెనుకబడిన దేశాలలో పెరుగుతున్నారు. ఆసియా దేశాలలో ఆరున్నర లక్షల మంది పిల్లలు వ్యభిచార వృత్తిలో వున్నట్లు అధికార లెక్కలు చూపుతున్నాయంటే, యీ సమస్య యింకెంత తీవ్రంగా వుందో గ్రహించవచ్చు. పెద్ద వాళ్ళ ఎయిడ్స్ వ్యాధులవలన, సెక్స్ అశ్రద్ధవలన చిన్న పిల్లలకు అవి సోకి హతమారుతున్నారు. 20 లక్షల మంది ఆడపిల్లల్ని సాలీనా "సుంతీ" ఘోరకృత్యానికి గురిచేస్తున్నారు. గత దశాబ్దంలో వివిధ యుద్ధాలలో చిన్నపిల్లల్ని వినియోగించి 20 లక్షల మందిని హతమార్చారు. 50 లక్షల మంది వికలాంగులుగా మారారు. కోటి మంది నిరాశ్రయులయ్యారు. మందుపాతర్ల వలన నిరంతరం పిల్లలు దారుణంగా బాధలకు, చావులకు గురౌతున్నారు.
ఈ విషయాలన్నీ ప్రపంచమతాల సభలు గుర్తించాయి. వీటిని అరికడతామని అంటున్నాయి. 1990లో ప్రిన్స్ టన్ (అమెరికాలో) ప్రపంచ మత ప్రతినిధులు సమావేశమై పిల్లల హక్కుల్ని వెంటనే గుర్తించి అమలుపరచాలన్నారు. 1996లో మళ్ళీ యీ మత సంస్థలు తీర్మానాలు చేశాయి. 1993లో చికాగో నగరంలో 5 వేల మంది మాట ప్రతినిధులు సమావేశమై చిన్నపిల్లల సంరక్షణ తక్షణ అవసరంగా పేర్కొన్నారు. దొంగ స్వయంగా ముందుకొచ్చి, "దొంగ దొంగ" అని అరచి, తప్పించుకున్నట్లుగా, మతాలు ముందుకొచ్చి, చిన్నపిల్లల హక్కుల గురించి మొసలికన్నీరు కారుస్తున్నాయి. మతాలు చేస్తున్న ఘోరకృత్యాలు, మత గ్రంధాలలో పిల్లలకు వ్యతిరేకంగా వున్న దారుణాలు, మతాల పేరిట జరుగుతున్న చిన్న పిల్లల అత్యాచారాలు ఖండించలేకపోతున్నారు.
మానవ హక్కులు కావాలని పోప్ అనడం ఎంత అపహాస్యమో, పిల్లల హక్కుల్ని గురించి మతాలూ మాట్లాడడం అంతే.
పిల్లల హక్కుల గురించి బాగా ప్రచారం జరగాలి. ఇది మతేతరంగా సాగడం అవసరం.
యునిసెఫ్ సంస్థ పిల్లల హక్కుల కోసం చేస్తున్న కృషిని స్వచ్ఛంద సంస్థలు చేపట్టవచ్చు. టి.వి., రేడియో, పత్రికలు, మానవ హక్కుల సంఘాలు ప్రధాన పాత్ర వహించవచ్చు.
ప్రాధమిక పాఠశాల స్థాయి నుండీ పిల్లల హక్కుల గురించిన వివరాలు ఆకర్షణీయంగా రాసి పాఠాలుగా అందించాలి. ఉపాధ్యాయులు యీ హక్కుల పత్రాన్ని బాగా అధ్యయనం చేయాలి. టి.వి.లో చక్కని ప్రదర్శనలు డాక్యుమెంటరీల ద్వారా విపరీత ప్రసారాలు రావాలి.
మానవహక్కులలో భాగంగా పిల్లల హక్కులకు ప్రాధాన్యత వుందని గుర్తించాలి.
పిల్లలకు చెప్పవలసిన విషయాలలో సున్నితమైన పుట్టుక, పెరుగుదల గురించి ప్రామిథిస్ ప్రచురణ సంస్థ అమెరికాలో శాస్త్రీయ రచనలు వెలువరించింది. లైంగికంగా చిన్న పిల్లలు వివిధ చిత్రహింసలకు గురైనప్పుడు వారిని ఎలా జాగ్రత్తగా చూడవలసిందీ పరిశోధన జరుగుతున్నది.
మనదేశంలో యీ విషయమై కప్పిపుచ్చడం చాలా ఎక్కువ. సమాజంలో యీ దురాచారాన్ని అరికట్టకపోతే పిల్లల భవిష్యత్తు బాగా దెబ్బతింటుంది. మనకు చాలా కాలంగా, గురుకులాలలో వున్న సెక్స్ దురాచారాలు, వివిధ రూపాలలో పొంచివుంది. దీనిని కూడా ఎదుర్కోవాలి.
పిల్లల హక్కుల విషయం 21వ శతాబ్దిలో అత్యంత ప్రాధాన్యత వహించేదిగా పరిణమించనున్నది. తల్లిదండ్రులకు యిది షాక్ ట్రీట్ మెంట్. మతాలకు పునాదులు కదిల్చే పరిస్థితి.