అబద్ధాల వేట - నిజాల బాట/దివ్యశక్తులు వుంటే హేతువాదులకు అభ్యంతరమేమిటి ?

దివ్యశక్తులు వుంటే
హేతువాదులకు అభ్యంతరమేమిటి?

మన యోగులు తపస్సు చేసి దివ్యదృష్టిని సాధించినట్లు, శక్తులు పొందినట్లు చెబుతారు. వారు ఏమిచేశారో ఎలా సాధించారో వివరాలు తెలియవు. శరీరాన్ని శుష్కింపజేసి కఠోరదీక్ష చేసినట్లు చదివాం. ఇప్పటికీ అలా చేస్తే గొప్ప సాధన సాధ్యమని భావిస్తున్నారు. ఇదంతా ఆధునిక సమాజంలో గందరగోళానికి దారి తీస్తున్నది. నేడు సాధువులున్నారు. వారు సమాజానికి సంబంధం లేకుండా బ్రతుకుతున్నారు. జనంలో వారిపట్ల నమ్మకాలు, భయాలు వున్నాయి. సాధువులు తమ శక్తులు ప్రదర్శించి జనాన్ని హడలెత్తించి కాలం గడుపుతున్న వారున్నారు. రాజకీయ నాయకులు సైతం సాధువుల్ని ఆశ్రయించి ప్రయోజనాలు ఆశిస్తున్నారు. జనం ఎవరి పనుల్లో వారుంటూ, ఎప్పుడైనా ఒకసారి తీర్థయాత్రలకు వెడుతూ సాధువుల్ని కలుసుకోవడం మహాత్యాలు చూచి, నమ్మి మొక్కడం సహజం. ఈ మహాత్యాల వెనుక ఏముంది, ఎలా జరుగుతున్నాయి అని తెలుసుకోడానికి ప్రయత్నించరు. చిన్నప్పటి నుండే నమ్మకాలతో పెరగడంవలన, సాధువుల చర్యలు దివ్యశక్తులుగా కనిపిస్తాయి.

చదువుకున్నవారు సైతం మొక్కుతున్నారు. కాళ్ళమీద పడుతున్నారు, వాళ్ళకంటే మీరు గొప్పా అని అడిగే వారున్నారు. చదువుకున్నవారూ చదువుకోనివారూ అనే తేడా నమ్మకాల విషయంలో పనిచేయదు. ఒక విషయం బాగా చదువుకొని, డిగ్రీ తెచ్చుకొని, పెద్ద ఉద్యోగంలో వున్నంత మాత్రాన మిగిలిన విషయాలన్నీ తెలియాలనేమీ లేదు. ఇతర రంగాలలో కూడా శాస్త్రీయంగా తెలుసుకుంటున్నారనేది చదువుకున్నవారు అట్టే పట్టించుకోరు. కనుక చిన్నప్పటినుండీ తల్లిదండ్రులు, బడిలో ఎన్ని నేర్చుకున్నా నమ్మకాల నుండి చదువుకున్నవారు సైతం ఒక పట్టాన బయటపడలేరు. పదవుల్లో వున్నవారికి భయాలు ఎక్కువ. కనుక ఎందుకైనా మంచిదని మొక్కుబడులు చేస్తూ, అవి చెల్లిస్తూ వుంటారు. వీటిల్లో స్నేహితుల చెప్పుడుమాటలు బాగా పనిచేస్తాయి. ఆపదలో వున్నప్పుడు జబ్బు చేసినప్పుడు యివి మరీ నమ్మకాల్ని పెంచుతాయి. అంజనం, తాయెత్తు, పూజలు, వ్రతాలు, నోములు, మొక్కుబడులు,స్వాముల దర్శనం, జోస్యం మొదలైనవన్నీ యిలా వ్యాపిస్తూ వస్తున్నాయి.

అందరూ చూడలేని 'దివ్యదృష్టి' సాధువులకు ఎలా కలుగుతుంది? చిరకాలంగా ప్రచారంలో వున్న యీ విషయాన్ని అవగహన చేసుకోవాలి.

మనిషి ప్రాణవాయువు పీల్చడం అతిముఖ్యాంశం. అది లేకుంటే బ్రతకడం, పీల్చిన ప్రాణవాయువు వూపిరితిత్తులలోకి, రక్తంలోకి, మెదడులోకి పోతుంది. మళ్ళీ వదిలేది బొగ్గుపులుసు వాయువు. యోగులు, సాధువులు, రుషులు వూపిరి బిగబడతారు. ఇది ఒక అలవాటుగా క్రమేణా అభ్యాసం చేస్తారు. యోగంలో ఇదొక భాగం. ప్రాణాయామం అనే యీ చర్య మోక్ష సాధనలో మెట్టుగా పేర్కొన్నారు. బొగ్గుపులుసు వాయువు ఎక్కువసేపు వూపిరితిత్తులలో, రక్తంలో అట్టిపెడితే, మెదడుకు చాలినంత ప్రాణవాయువు అందదు. మెదడు సాధారణంగా పనిచేయాలన్నా ముఖ్యంగా ఆలోచించాలన్నా ప్రాణవాయువు సహజంగా అందాలి. కృత్రిమంగా మెదడుకు ప్రాణవాయువు తగ్గిస్తే ఆలోచన కూడా తగ్గుతుంది. తొలిదశలో రకరకాల పగటి కలలు, దృశ్యాలు, అర్థంపర్థంలేని ఏవో దృష్టులు గోచరిస్తాయి. అదొక లోకం. కళ్ళు మూసుకొని ప్రాణాయామం ఆచరించేవారికి రంగు దృశ్యాలు, తనకు తెలియని దృష్టులు కనిపిస్తాయి.

ఇది కేవలం ప్రాణాయామం చేసేవారికే పరిమితం కాదు. మతం, దైవం పేరిట ప్రార్థనలు, భజనలు, కీర్తనలు, ఆరాధనలు, సంగీతాలు చేసేవారికీ దృశ్యాలు కనిపిస్తాయి. ఇలా చేసేవారందరూ వూపిరి తక్కువగా పిలుస్తూ, ఎక్కువగా బొగ్గుపులుసు వాయువు అట్టిపెడుతూ, గాలి ఎక్కువగా వదులుతుంటారు. అందుకే బాబాలు భక్తులచే గీతాలాపనలు చేయిస్తుంటారు. చెప్పిందే చెప్పేటట్లు పునరుశ్చరణ (రాం-రాం-సీతారాం వంటివి) గంటలకొద్దీ పాడిస్తారు. అలసట వచ్చేటంతగా యీ పనిచేసేసరికి, గుంపులో వున్నవారు ఆలోచించలేరు. ఇదొక సామూహిక మనస్తత్వం. వారికి ఇష్టదైవం కనిపిస్తున్నట్లు ఏవో దృశ్యాలు చూస్తున్నట్లు అనిపిస్తుంది. దీనినే మధురానుభూతిగా చిత్రిస్తారు. రజనీష్ ఆశ్రమంలో యిలా సామూహిక భజనలు, ప్రార్థనలు, నృత్యాలు జరపడం తెలిసిందే. కొలువులో పూనకాలు రావడం, అరుపులు కేకలతో ఎగరడం ఇలాంటి చర్యే. ఈ విధంగా జరిగినప్పుడు దృశ్యాలు చూచేవారికి తాత్కాలిక "మధురానుభూతులు" కలిగినా, క్రమంగా సాధారణ స్థితికి వస్తారు. అంటే వూపిరి మామూలుగా పీల్చుకుంటారన్నమాట. చెవిలో మంత్రం చెప్పి,అదేపనిగా పునరుశ్చరణ చెయమనడంలో కూడా యీ సూత్రమే అమలు జరుగుతుంది. ఒంటరిగా కూర్చొని మంత్రాన్ని కొన్నివందల వేలసార్లు వుచ్ఛరించేవారికి ఆలోచన మరేదీ వుండదు. మెదడు మామూలుగా పనిచేయదు. "హరి ఓం" అని గాని, మరోవిధంగా గాని, చెప్పినమాటే నిరంతరంగా చెబుతున్నవారు గాలి తక్కువ పీల్చి, ఎక్కువ వదులుతారు. భక్తిగీతాలు పాడేవారూ అంతే.

పూర్వం తపస్సు పేరిట దేహాన్ని శుష్కింపజేసిన వారిలో బి విటమిన్,సి విటమిన్ బాగా తక్కువగా వుండేది. పోషకాహారం లోపం వలన కూడా మెదడు సరిగా పనిచేయదు. వారు కూడా దృశ్యాలను చూడడం, అవి దివ్యదృశ్యాలని మధురానుభూతులని, భ్రమించడం కద్దు. దేవుడు ప్రత్యక్షమైనట్లు, వరాలిచ్చినట్లు వీరు అనుభూతి పొందుతారు. మామూలు స్థితికి వచ్చిన తరువాత చుట్టుపట్ల వున్నవారికి వారి అనుభూతులు, దృశ్యాలు వర్ణిస్తే, జనం అది విని వారిని "ద్రష్టలు" గా దైవాంశసంభూతులుగా, దైవజ్ఞులుగా, రాజర్షులు, మహర్షులు యిత్యాది పేర్లతో పిలిచి, కొలిచేవారు.

సాధారణ జనం ఎక్కువరోజులు తినకుండా తాగకుండా వుండలేరు. వారు కష్టించి పనిచేస్తేగాని గడవదు. అలాంటివారిని వారానికో పర్యాయం ఉపవాసం వుండమని నియమం పెట్టారు. మతపరంగా సంవత్సరంలో కొన్నాళ్ళు వరుసగా ఉపవాసాలు చేయిస్తున్న సంగతి అన్ని మతాలవారికీ తెలిసిందే. పరిమిత దృశ్యాలు, అనుభూతులకు వారు లోనుకావచ్చు. ఇలాంటివారిలో ఆధ్యాత్మిక రచయితలుంటే, వారు చూచిన, విన్న అనుభూతుల్ని గేయాలు, కథలు, రచనలుగా మార్చి అందిస్తారు.

శరీరాన్ని కష్టపెట్టడం తప్పుకాదని, పాపిష్టి శరీరం, ఎంత బాధలకు లోనైనా, ఆత్మకు ముక్తివస్తే చాలునని అన్ని మతాలు చెప్పాయి. మొహరంలో ముస్లింలు, కొలువుల్లో హిందువులు శరీరాన్ని బాదుకుంటారు. అలాంటప్పుడు ఎడ్రినలిన్, హొస్టామైన్ అనేవి విడుదల అవుతాయి. పుండ్లు పడడం, గాయాలు ఏర్పడడం సహజంగా జరుగుతుంటుంది. ప్రోటీన్లు దెబ్బతిని, టాక్సిక్ పదార్థాలు రక్తంలోకి పోతాయి. హిస్టామైన్ విడుదల అయి మెదడుకు షాక్ తగులుతుంది. ఆడ్రినలిన్ ఎక్కువగా విడుదల అయితే మెదడుపై ప్రభావం చూపెట్టి, భ్రమలు కలుగుతాయి. మెదడు సక్రమంగా పనిచేయడానికి ఎంజైములు కావాలి. శరీరాన్ని బాదుకున్నందువలన ఏర్పడే గాయాల నుండి స్రవించే టాక్సిక్ పదార్థాలు మెదడును సరిగా పనిచేయనియ్యవు. అప్పుడు కలిగే అనుభూతుల్ని మార్మికులు గొప్పగా చిత్రించి దివ్యమైనవిగా ప్రచారం చేశారు. మరికొందరు నిద్రను తగ్గించుకొని యోగాసనాల పేరిట శరీరాన్ని బాధపెట్టుకుంటారు. వీరికి క్రమేణా నిద్రపట్టని జబ్బువస్తుంది. ఆ దశలో ప్రార్థనలు చేస్తుంటారు. వీరికి మధురానుభూతులు వస్తాయి. 'సమాధి' దశవరకూ పోతుంటారు కూడా. మనం పీల్చే ప్రాణవాయువులొ 20 శాతం మెదడుకు కావాలి. గుండె కొట్టుకుంటూ శరీరంలో ప్రసరింపజెసే రక్తంలో 5వ వంతు మెదడుకు అవసరం. ఇందులో ఏదీ తగ్గినా మెదడు మామూలుగా పనిచేయదు. మతపరంగా ఆధ్యాత్మికం పేరిట చేసే ఉపవాసాలు, శరీరాన్ని శుష్కింపజేయడమ్, పోషకాహారం తినకపోవడం, శరీరాన్ని బాదుకోవడం, వూపిరి తగినంతగా పీల్చుకోకపోవడం, పీల్చినా ఎక్కువసేపు బలవంతంగా అట్టిపెట్టి బొగ్గుపులుసు వాయువును పెంచడం యివన్నీ ఉన్మాద చెష్టలే.ఇందులో తరతమ భేదాలున్నాయి. కాని మతం పేరిట చలామణి అవుతున్నాయి గనుక వాటిని ఖండించడానికి వెనుకాడతాం.

ఆల్డన్ హక్స్ లీ ప్రయోగాలు

మధురానుభూతుల్ని మరోవిధంగా సృష్టించవచ్చు. ఆల్దన్ హక్స్ లి యీ పరిశోధన చేసి మెస్కలిన్ అనే మత్తుపదార్థాని స్వీకరించాడు. తద్వారా కలిగిన అనుభూతుల్ని, అనుభవాన్ని రికార్డు చేయించాడు. మెస్కలిన్ లో వ్యసనంగా అలవాటుపడే లక్షణాలు లేవు. కనుక పరిశోధనకు అనుకూలంగా వుంది. అనుభూతులు, దివ్యదృష్టి సహజంగా రావాలి గాని, మందులు మింగి తెప్పిస్తే అది కృత్రిమం అని విమర్శించారు. ఇంతవరకు చర్చించిన అంశాల్ని బట్టి శరీరాన్ని కృత్రిమంగా హింసించిన ఫలితంగానే అనుభూతులు వస్తాయని నిర్ధారణ అయిందిగదా. పైగా శరీరం రసాయనిక, భౌతిక, విద్యుత్ పద్ధతులలో పనిచెస్తున్నది. కనుక మెస్కలిన్ ప్రయోగం తప్పు లేదు.

మెస్కలిన్ అనేది ఎడారులలో లభించే జెముడునుంచి తయారుచేస్తారు. మన వూళ్ళల్లో నాగజెముడు, బ్రహ్మజెముడు అనే కోవలోనికే యిది చెందుతుంది. ప్రస్తుతం శస్త్ర చికిత్సలలో మెస్కలిన్ వాడుతున్నారు. కండరాలు సడలటానికి, మధురానుభుతులకు యిది ప్రసిద్ధి. ఇది అలవాటుకాని మత్తుపదార్ధం. స్వీకరించిన అనంతరం, దీని ప్రభావం తగ్గిపోయిన తరువాత మరే అవలక్షణాలు కనిపించడంలేదు. అందువలన ఆల్డస్ హక్స్ లీ తనమీద మెస్కలిన్ ప్రయోగం చేసుకున్నాడు. ఒక గ్రాములో నాలుగోవంతును అరగ్లాసు నీళ్ళలో కలిపి తాగాడు.

మనం ఇతరులను ఎలా చూస్తున్నాం? అలాగే మనల్ని ఇతరులు ఎలా గమనిస్తున్నారు? వారు చెబితే తప్ప తెలియదు పూర్తిగా చెప్పరు కూడా.

సాధారణ మానవుడిగావున్న నేను పిచ్చివాడిగా ఎలా ప్రవర్తిస్తాను? అది నాకు నేనుగా తెలుసుకోగలగడం అరుదు, విడేషం. మెస్కలిన్ వేసుకొని ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకునే ప్రయత్నం అల్డస్ హెక్స్ లీ చేశాడు. ఎవరి పిచ్చివారికి ఆనందం అంటామే గాని, పరిశోధన చేసి చూడం. రుషులు, యోగులు, బాబాలు యీ పనిచేశారు. అదే పని ఆల్డస్ హక్స్ లీ చేశాడు.

మెస్కలిన్ ప్రభావం కొన్ని గంటలపాటు వుంటుంది. అర్ధగంట తరువాత యీ ప్రభావ లక్షణాలు మొదలౌతాయి. ఉదయం 11 గంటలకు మెస్కలిన్ స్వీకరించిన ఆల్డస్ హక్స్ లీకి గంటన్నర తరువాత వింత దృశ్యాలు కనిపించసాగాయి. అందరూ మామూలుగా చూచే బాహ్య ప్రపంచం "మరో విధంగా" కనిపించసాగింది. అప్పుడు హక్స్ లీ పక్కనే వున్న పరిశీలకుడు అతడి మాటలన్నీ రికార్డు చేశాడు. మధ్యమధ్యలో హక్స్ లీని ప్రశ్నిస్తూ పోయాడు. కాలం, ప్రదేశాలకు ప్రాధాన్యత లేకుండా పోయిందని హక్స్ లీ ప్రవర్తన సూచిస్తుంది. సూటిగా ఆలోచించడం,జ్ఞాపకం పెట్టుకోవడం అంతగా వుండదు. చిన్నపిల్లవాడివలె బాహ్య ప్రపంచాన్ని చూస్తాడు. తన చర్యలకు కారణమేమిటో గ్రహించలేడు. ఇచ్ఛ దెబ్బతింటుంది. మంచి చెడ్డల విచక్షణ పాటించడు. కాలేయం (లివర్) ఆరోగ్యంగా పనిచేస్తున్నవారు మెస్కలిన్ పుచ్చుకుంటే, బాహ్య ప్రపంచం, అంతర లోకం కలిసిపోయి కనిపిస్తాయి.

మెదడుకు తగినంత గ్లూకోజ్ అందనప్పుడు, బలహీనతలు బయటపదతాయి. మెస్కలిన్ పరిశోధన అదే నిరూపిస్తుంది. అతీంద్రియ శక్తులు, దూరదృష్టి, దూరశ్రవణం,దివ్యదృష్టి, దూరశ్రవణం, దివ్యదృష్టి అని పేర్లు పెట్టేవన్నీ ఇలాంటివే. అయోమయంగా ప్రపంచాన్ని తననూ చూచుకుంటే, వారిని మార్మికులంటాం (మిస్టిక్స్). అందమైన దృశ్యాలు చూచి కవిత్వం అల్లేవారూ, చిత్రాలు గీచేవారూ, శిల్పాలు చెక్కేవారూ వున్నారు. దేవుళ్ళ బొమ్మలు, శిల్పాలు చాలావరకూ ఆయా వ్యక్తుల మనోగతాలే. భారతమాత, ఆంధ్రమాత పేరిట చెక్కిన విగ్రహాలు,గీసిన బొమ్మలు యీ కోవకు చెందినవే.

మెస్కలిన్ ప్రభావంలో రంగుల్ని లోతుపాతులతో సున్నితంగా గ్రహించే లక్షణం కూడా వుంది. ఇది మార్మికులలో బాగా కనిపిస్తుంది. ఆల్దస్ హాక్స్ లీ కూడా ఇలాంటి అనుభూతుల్ని పొంది, రికార్డు చేశాడు. యోగం పేరిట ధ్యానం అనే అనుభవం వంటిదే మెస్కలిస్ పేరిట హక్స్ లీ పొందాడు. అందుకే పతంజలి యోగంలో చిత్తవృత్తి నిరోధం ప్రధానం. అంటే మెదడు మామూలుగా ఆలోచించే ధోరణి ఆపేయాలి. మోక్షానికి అది దగ్గర మార్గం అన్నారు. బడుల్లో కూడా పిల్లలకు కాసేపు ధ్యానం నేర్పాలంటారే, అదంతా తెలిసీ తెలియక అనేమాటలే. సాధారణ వ్యక్తులెవరూ ఆలోచన ఆపలేరు. మెదడు మామూలుగా పనిచేయకపోతేనే యిది సాధ్యం. మధుమేహం (డయాబిటిస్) వున్నవారికి అప్పుడప్పుడు అశ్రద్ధవలన మత్తురావడం, స్పృహ తప్పడం కద్దు. ఉబ్బసం (ఆస్త్మా) వున్నవారికి తరచు ఎడ్రినలిన్ వలన రకరకాల వింత దృశ్యాలు కనిపించడం కద్దు. రామకృష్ణ పరమహంసకు మూర్ఛ వ్యాధి వుండేది. ఫిట్స్ వచ్చి పడిపోయేవాడు. తనను ఉన్మాదిగా చేయమని అరచేవాడు. ఇదంతా మహాత్ముని లక్షణంగా భక్తులు భావించారు. కాని అంతటి మహాత్ముడికి కేన్సర్ వస్తే దివ్య లక్షణాలు ఆదుకోలేదు. జబ్బుల్ని దైవలక్షణాలుగా చూచే గుణం వీరారాధనలో భాగమే. ఇది అన్ని మతాలలోనూ వుంది. ఏ మహర్షికి కేన్సర్ వచ్చినా ఇదే స్థితి! విదేశీయులు కొందరు పొగుడుతూ పుస్తకాలు రాస్తే మనవాళ్ళు అవి వుదహరించి, గొప్పతనానికి సర్టిఫికెట్లుగా భావిస్తున్నారు. తెల్లవాళ్ళంటే మనకున్న ఆరాధన, మనల్ని తక్కువగా చూచుకునే లక్షణమే యిదంతా. మెస్కలిన్ అనేది శరీరానికి హానిచేయదు గనుక, పరిశోధనకు స్వీకరించారు. అదే మేరియానా (Marijuana),ఎల్.ఎస్.డి., గంజాయి అయితే అవి అలవాటుగా మారే ప్రమాదం వుంది. కొన్నాళ్లు తీసుకొని మానేస్తే దేహంలో ఉపసంహరణానంతర లక్షణాలు వచ్చి బాధపెడతాయి. దీనికి వేరే చికిత్స అవసరమౌతున్నది. సాధారణ మానవులు పండగల సందర్భంగా ఉత్తరాదిలో భంగు తాగుతారు. గంజాయిఆకు పాలల్లో వెసి, మసాలా సుగంధ ద్రవ్యాలతో పాయసంవలె చేసి సేవిస్తారు. కాని సాధువులు గంజాయిని హుక్కాగా పీల్చుతారు. దీనికి అలవాటు పడతారు. తాంత్రికవిద్యను పాటించేవారు 'విజయ' పేరిట మత్తుపానీయం సేవిస్తారు. బెంగాల్ ప్రాంతంలో దీనినే 'సిద్ధి' అంటారు.

మతం పేరిట ఆధ్యాత్మిక చింతనలో సమాధి, కైవల్యం, ముక్తి, నిర్వాణం యిత్యాదులన్నీ పొందడానికి అనేక మార్గాలు చెప్పారు. అవన్నీ కృత్రిమాలే, సాధారణ జీవనం సాగించేవారికి కుదిరేవికావు. అలాగే మెస్కలిన్ పరిశోధన కూడా.

ఆరోగ్యవంతులు మెస్కలిన్ వేసుకొని పరిశోధన చేస్తే మధురానుభూతులు వస్తాయన్నాం. అనారోగ్యంగా వున్నవారు స్వీకరిస్తే నరకం, యమయాతన, సైతాన్ బాధలు, మురికికూపాలు మొదలైనవి అనుభవిస్తారు. లివర్ లో మెస్కలిన్ చేరి ఇలాంటి చేదు అనుభవాలకు దారితీస్తుంది. సాధువులు, యోగులు అనారోగ్యంగా వున్నప్పుడు అనుభూతుల్ని పొంది, నరకం ఏమిటో వివరించారు.

హక్స్ లీ చేసిన మెస్కలిన్ పరిశోధనపై మతవాదులు విరుచుకుపడ్డారు. జహ్నర్ (R.C. Zaehner) వంటివారు పెద్ద పుస్తకాలే రాశారు. కాని సమాధానం చెప్పలేకపోయారు. హక్స్ లీ అనుభూతి బౌద్ధులు చెప్పే శూన్యదశ వంటిదని అగేహానంద భారతి పేర్కొన్నారు. యోగం చెప్పేది కూడా యిలాంటి చిత్తవృత్తి నిరోధ శూన్యావస్తే. "నేనే బ్రహ్మను" అని సాధువు అంటే, మహానుభావుడు అంటాం, మామూలు వ్యక్తి మెస్కలిన్ తీసుకొని అలాగంటే, పిచ్చివాడంటాం. ఆల్డస్ హక్స్ లీ చేసిన ప్రయోగాలవంటివి, ఉత్తరోత్తరా ఆగేహానంద భారతి చేశారు. ఇంకా కొందరు చెసినా, ఆగేహానంద స్వానుభవం గుర్తించి గమనించదగింది.

అగేహానంద భారతి ప్రయోగాలు

1958లోనే ఆగేహానంద భారతి అమెరికాలో కొత్తగా వచ్చిన ఎల్.ఎస్.డి-25(లాసెర్జిక్ యాసిడ్ డైథైలామైడ్) పుచ్చుకున్నారు. రాత్రి 8 గంటలకు స్వీకరిస్తే తెల్లవారుజామున 4 గంటలవరకూ ప్రభావం వున్నది. ఎల్.ఎస్.డి తీసుకునేవాళ్ళు ఆనందమయ వాతావరణంలో అంగీకార మిత్రుల సాన్నిహిత్యంలో గడపాలని భారతి సూచించారు. భంగు(గంజాయి రసం) కూడా యిలాగే తీసుకోవాలంటారు. అగేహానంద ఎల్.ఎస్.డి. పుచ్చుకున్నప్పుడు మాత్సుకో అనే అందమైన బౌద్ధస్త్రీ చెంతవున్నది. బ్రహ్మానంద సమయంగానూ, శూన్యావస్తను పొందిన క్షణాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. (ది లైట్ ఎట్ ది సెంటర్, పేజి 43) అహం బ్రహ్మాస్మి అనే స్థితికి చేరుకుని, ప్రపంచమే నేను, నేనే ప్రపంచం అనే దశను అనుభవించామన్నారు. ఒక అరగంట వున్న ఈ స్థితి ఎల్.ఎస్.డి వల్లా, మాత్సుకో అనే స్త్రీ సాంగత్యంలో లభించిందన్నారు. బౌద్ధులు చెప్పే శూన్యదశ, హిందువులు చెప్పే సమాధి, తురియావస్థ, బ్రహ్మలో ఏకం కావడం యిత్యాదులన్నీ యివేనని భారతి అనుభవపూర్వకంగా చెప్పారు.

1952-53 ప్రాంతాలలో అస్సాంలో వుండగా తాంత్రిక యోగ సాధనలో కూడా శూన్యస్థితికి చెరుకున్నట్లు ఆగేహానంద భారతి పేర్కొన్నారు. తాంత్రిక విద్యలో పూర్వార్థం, ఉత్తరార్థం అని రెండు దశలున్నాయి. ఉత్తరార్థంలో మద్యం సేవిస్తూ, మాంసం, మత్స్యం ఆరగిస్తూ, స్త్రీ సన్నిధిలో ముద్రవేసి, మైధునం జరపాలి. సంభోగంలో రేతస్సును స్థంభింపజేయాలని కొందరు తాంత్రికులంటారు. ఊపిరిని, శుక్లాన్ని, ఆలోచనను స్థంభింపజేస్తే శూన్యదశ చేరుకుంటారని వారి నమ్మకం. బౌద్ధ తాంత్రికులు, హిందువులలో కొందరు యీ పద్ధతిని నమ్ముతారు. ద్వైతం పోయి ఏకత్వం సిద్ధిస్తుందని వారి విశ్వాసం. తాంత్రిక ఆశ్రమాలను భారత ప్రభుత్వం నిషేధించిన దృష్ట్యా ప్రస్తుతం తాంత్రిక యోగసాధన యీ పద్ధతిలో సాగడంలేదు.

1950 ప్రాంతంలో ఆగేహానంద భారతి సన్యాసిగా పాదయాత్ర చెస్తూ నాగపూర్ సమీపంలో దారితప్పారు. అప్పట్లో సౌదర్యలహరి ఆలాపిస్తూ సంచరిస్తున్నారు. అందులో అందమైన దేవీస్తుతి ఆయనకు హత్తుకుపోయింది. ఆకలితో అలసటతో వుండడం, అప్పుడే పాడుబడిన విఠలేశ్వర దేవాలయానికి చేరుకున్నాడు. అక్కడ దేవీ విగ్రహం కనిపించగా, అప్పుడే పూజచేసి ఎవరో దండవేసి వెళ్ళిన దృశ్యం కూడా చూచాడు. నమస్కరించి, వెళ్ళిపోయాడు. కొన్ని మైళ్ళ దూరాన వున్న గ్రామస్తులు మజ్జిగ యిస్తే తాగి, దేవీ విగ్రహానికి పూజలు చేస్తున్న పూజారి ఎవరు అని అడిగాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి చుట్టుపట్ల దేవీ విగ్రహం ఏదీ లేదని చెప్పారు. చూపిస్తాను రమ్మంటే, ఒక అబ్బాయిని యిచ్చి పంపారు. వెళ్ళి చూస్తే పాడుబడ్డ దేవాలయమేగాని, దేవీవిగ్రహం లేదు. తన మానసిక ధోరణి, మనస్సుపై సౌదర్యలహరి స్తుతి ప్రభావం వలన, ఆకలిపై వున్న ఆగేహానందకు దేవీ విగ్రహం కనిపించినట్లయింది. మనస్సులో వున్నదే బయట చూచినట్లయింది.

ఒకసారి హౌరా స్టేషన్ లో వుండగా ఆగేహానంద భారతి దగ్గరకు ఒక సాధువు వచ్చి, నేనే భగవంతుడ్ని అన్నాదట. భారతి సమాధానమిస్తూ అది అసంభవం అన్నాడు. ఎందుకని? అని సాధువు ప్రశ్నిస్తే, నేనే భగవంతుడ్ని గనక అని భారతి సమాధానం చెప్పాడు. వెంటనే ఆ సాధువు భారతి కాళ్ళపై సాష్టాంగపడి, మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అలా గట్టిగా అరమరికలు లేకుండా జంకూగొంకూ లేకుండా చెబితే నమ్మేవారున్నారు. వివేకానంద ఇలాగే రామకృష్ణ పరమహంస మాటలు నమ్మాడు. నీవు దేవుణ్ణి చూశావా అని నరేంద్రనాధ్ (వివేకానంద కాక పూర్వం) అడిగితే, చూశాను , నీవూ చూడొచ్చు అని రామకృష్ణ పరమహంస చెప్పేసరికి, మళ్ళీ ప్రశ్నించకుండా లొంగిపోయి శిష్యుడయ్యాడు. సూచన(Suggestion) అలా పనిచేస్తుంది సందేహవాదులమీద అరవిందుడు ఇంగ్లండ్ లో చదువుకున్నాడు. ఇంగ్లీషులో కవిత్వం రాశాడు. ఇండియాకు వచ్చిన తరువాత జైలులో ఆయనకు 'దివ్యశక్తులు' కనిపించాయి. పాండిచేరిలో స్థిరపడి, భార్యను యించుమించు వదిలివేసి, పెళ్ళి అయి పిల్లలున్న ఫ్రెంచి వనితను ఆధ్యాత్మికంగా ఆకర్షించాడు. పాండిచేరిలో యోగిగా మారిన అరవిందుడు ఆధ్యాత్మిక చింతన ప్రభావంతో రాసిన లైఫ్ డివైన్, సావిత్రి గ్రంథాలలో పులుముడు ధోరణి మార్మిక లక్షణాలు బాగా కనిపిస్తాయి. లైఫ్ డివైన్ ఉద్గ్రంథాన్ని మూడో వంతుకు కుదించవచ్చని అగేహానంద భారతి వ్యాఖ్యానించాడు. ఆయన భక్తులు అరవిందుడు చనిపోయినప్పుడు, దేహం శుష్కించదనీ, శాశ్వతంగా వుంటుందనీ నమ్మి, ప్రచారం చేశారు. యోగశక్తులు అంతదూరం పోలేదని రుజువైంది!

ప్రపంచానికి గురువు, మరో అవతారం అని జిడ్డు కృష్ణమూర్తిని గురించి అనిబిసెంట్ దివ్యజ్ఞానం పేరిట ప్రచారం చేసింది. ఇదంతా శుద్ధ అబద్ధం అని గ్రహించిన కృష్ణమూర్తి జాగ్రత్తపడి, దూరంగా వున్నాడు.

గాంధీమహాత్ముడు తన ఆత్మశక్తి చెబుతున్నదంటూ, 1921లో దేశానికి స్వరాజ్యం లభిస్తుందని బాహాటంగా ప్రకటించి, పప్పులో కాలేశాడు. హిమాలయాలంత తప్పుచేశానని తరువాత ఒప్పుకోవలసి వచ్చింది.

ఇంతకూ యోగశక్తులు, దివ్యశక్తులు, అతీంద్రియశక్తులు వున్నాయా, లేవా? ఈ చర్చ వలన, సాధారణ మానవులకు యిలాంటివి లేవని తేలిందిగదా. పోతే కృత్రిమంగా శరీరాన్ని శుష్కింపజేసినందువలన, మెదడుకు తగిన పోషక పదార్థాలు అందకుండా చేసినందువలన, మందులవలన కొన్ని విలక్షణాలు కనిపిస్తాయి. వాటికి ముద్దుముద్దుగా దైవం పేరిట రకరకాల పేర్లు పెడుతున్నారు. ఇదే అలవాటుగా మారితే, జబ్బు క్రిందకు తేలుతుందన్నమాట. ఈ జబ్బు శారీరకమైనదే. మెదడు కూడా శరీరంలో ప్రధానమైన భాగమే, మరి మనోరోగం, మనోశక్తి మాటేమిటి?

ఏది మనస్సంటే?

మనస్సు (మైండ్) అనేది, మనం సృష్టించిన తియ్యటి పదం. మనస్సు అనేది ఆత్మ, దైవంలాంటిదే, మానసిక రోగాలు ఆ కోవకు చెందినవే. మానసిక శక్తులు అనేది ఎంత నిజమో, మనస్సుకు పట్టే రోగాలు అంతే నిజం. వీటికి ఆధారం, రుజువు లేదు. అయినా మానసిక రోగాన్ని ఉజువు చెస్తామంటూ మానసిక వైద్యులు బయలుదేరారు. ఇలాంటివారి గుట్టును థామస్ సాజ్ (Thomas Szasz) బట్టబయలు చేశాడు. టి.వి.లో కార్యక్రమాలు బాగా లేకపోతే, టి.వి.ని రిపేర్ కు తీసుకెడితే ఏం ప్రయోజనం? కాని మానసికవైద్యులు అదే చేస్తున్నారు. శరీరంలోనో, మెదడులోనో వచ్చేవాటికి మానసిక జబ్బులని పేరుపెట్టి చికిత్స పేరిట వ్యాపారం చెస్తున్నాడు. అమెరికాలో సుప్రసిద్ధ హ్యూమనిస్టు థామస్ సాజ్ చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేక తిట్లకు లంకించుకున్నారు. మన సమాజంలో "పిచ్చి" వాళ్ళను మానసిక రోగులుగా చూడడం ప్రమాదకరం. 'పిచ్చి' అనేది శారీరక, మెదడుకు చెందిన జబ్బుగా గుర్తిస్తే గొడవలేదు. వైద్యం కూడా స్పష్టపడుతుంది. మానసిక లక్షణం అనేసరికి, రోగితో వైద్యుడు ఆడుకుంటున్నాడు. ఏదీ రుజువుకు నిలబడదు. అందుకని ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం, మత్తుమందు ఇవ్వడం, గ్రామాలలో కొట్టడం సాధారణమైపోయింది. థామస్ సాజ్ దీనంతటినీ దారుణ మోసంగా ఎదుర్కొంటున్నాడు. ఎదురీదుతున్నాడు? మన సామాజంలో మతం పేరిట దివ్యశక్తులు ఎలా ప్రాబల్యంలోకి వచ్చాయో పాశ్చాత్య లోకంలో పిచ్చిపేరిట సైకియాట్రి అలా తిష్టవేసుకున్నది. ఇప్పుడిప్పుడే అవి మనకూ అంటుకుంటున్నయి.

మతం పేరిట జనాన్ని సర్వకాలాల్లో మోసం చేయవచ్చు అనేది బలపడుతున్నది. కొందరికి ఆధ్యాత్మిక వ్యాపారం గిట్టుబాటుగా వుంది. కనుక ఏదో ఒక రూపేణా అది వదలకుండా పట్టుకొస్తున్నారు.

అయితే ఏం చెయ్యాలి? అనే ప్రశ్న రావచ్చు. పిల్లలకు హైస్కూలు స్థాయిలోనే శరీరాన్ని గురించి శాస్త్రీయంగా చెప్పడం మొదలెట్టాలని థామస్ సాజ్ సూచించారు. శరీరాన్ని, మెదడును అవగహన చేసుకుంటుంటే, చాలా భ్రమలు తొలుగుతాయి. మనస్సు పేరిట (మైండ్) సృష్టించిన మతకల్పనలు, భ్రమలు,దౌజన్యాల నిజానిజాలు తెలుస్తాయి. సృజనాత్మక శక్తియుక్తుల గురించి పరిశోధన కూడా జరపాలని, వీటిగురించి సమన్వయీకరణ వుండాలని ఆల్డస్ హక్స్ లీ సూచించారు. చదువుకున్న అమెరికావంటి చోట దివ్యశక్తులు,భక్తి, ప్రార్థనలతో చికిత్సలు, అద్భుతాల బండారాన్ని జేమ్స్ రాండీ బయటపెట్టారు. అయినా మతవాదులు బ్రతుకుదెరువుకు, సమాజంపై పట్టుకు రకరకాల ఎత్తుగడలు, వ్యూహాలు పన్నుతూనే వుంటారు. బాబాల అవతారాలు బలహీనుల్ని బాధిస్తూనే వుంటాయి. హేతువాదులు నిత్యం జాగరూకులై ఎదురీదాల్సిందే.

- హేతువాది,జూన్ - జూలై 1991