అబద్ధాల వేట - నిజాల బాట/కార్మికోద్యమానికి స్ఫూర్తి వెంకట్రావు
ఆంధ్రలో కార్మికోద్యమ పితామహులలో ఒకడుగా పెమ్మరాజు వెంకట్రావు చరిత్రలో నిలుస్తారు. వి.వి.గిరి, బి. శివరావు వంటివారితో సన్నిహితంగా కృషిచేసిన ఖ్యాతి ఆయనది. 1907లో పుట్టిన పెమ్మరాజు వెంకట్రావు 1929 నాటికే గనుల ఇంజనీరింగ్ శాఖలలో (చీపురుపల్లి, విజయనగర ప్రాంతం) పనిచేసి అనుభవం గడించారు. 1931 నుండి నెల్లిమర్ల జూట్ మిల్స్ కార్మిక సంఘం స్థాపించి 25 సంవత్సరాలు అధ్యక్షులుగా వున్నారు. అప్పుడే వరాహగిరి వెంకటగిరి,బి. శివరావులతో ఉత్తరప్రత్యుత్తరాలు నడపడం, కార్మిక రంగంలో విశేష అనుభవం గడించడం ఆయన ప్రత్యేకత. 1938 సెప్టెంబర్ 1 నుండే కార్మిక పత్రిక అనే వారపత్రిక విజయనగరం నుండి పెమ్మరాజు వెంకట్రావు ప్రపంచ రాజకీయాల్ని అవగహన చేసుకుంటూ ఉద్యమాల్ని సాగించారు. ఆ దశలో వెంకట్రావుకు ఆంధ్ర పర్యటనకు వచ్చిన ఎం.ఎన్.రాయ్ భావాలు దృష్టికి రాగా, ఆకర్షితుడయ్యాడు. ఎం.ఎన్. రాయ్ స్థాపించిన ఇండియన్ లేబర్ ఫెడరేషన్ చేరాడు. అప్పటి నుండి ఎం.ఎన్.రాయ్ 1954లో చనిపోయేవరకూ పెమ్మరాజు వెంకట్రావు రాడికల్ హ్యూమనిస్టు భావాలతో రచనలు చేశారు. ఆయన తరచు కవితలు కూడా రాసేవారు. భారత పునర్వికాసం, బౌద్ధ విప్లవంపై దృష్టి వుండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మిక సంఘం నుండి తన స్థానాన్ని హైదరాబాద్ కు మార్చిన వెంకటరావు, కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ సందర్భంగా ఆవుల గోపాలకృష్ణమూర్తికి రాస్తూ, కమ్యూనిజాన్ని ఎదుర్కోడానికి కాంగ్రెసు ద్వారా కృషి చేస్తానని, రాయ్ భావాలు అమలుచేయడానికి పార్టీలో పనిచేస్తాననీ అన్నాడు. ఆ ప్రకారమే కాంగ్రెస్ పత్రిక పెట్టి రాయ్ భావాలు వ్యాసరూపంలో అందించారు.
నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా పెమ్మరాజు వెంకట్రావును అభిమానించారు. గాంధీభవన్ లో వెంకట్రావు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ముక్కుసూటిగా వున్న వెంకట్రావును కాంగ్రెస్ నాయకులు పైకి మెచ్చుకున్నా ఆయన్ను పైకి రానివ్వలేదు.
రాష్ట్రపతి నామినేషన్ వలన పెమ్మరాజు వెంకట్రావు ఒక టరం శాసనమండలి సభ్యుడుగా పనిచేశారు. అప్పుడు తనవంతు కృషి కనిపించింది. 1958లో గోల్కొండ దినపత్రిక ఆగిపోగా వారపత్రికగా పెమ్మరాజు వెంకట్రావు కొంతకాలం హైదరాబాద్ లో నిర్వహించారు. కాని అదీ ఆట్టేకాలం సాగలేదు.
కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పెమ్మరాజు క్రమేణా కాంగ్రెసు రాజకీయాలకు దూరంగా జరిగారు. ప్రెస్ లు స్థాపించి నష్టపడ్డారు. 1982లో ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కొద్దికాలం వెంకట్రావు సన్నిహితంగా వున్నారు. ఇరువురి భావాలూ పొత్తు కుదరక,వెంకట్రావు రాజకీయాలకు స్వస్తి పలికారు. 1987 సెప్టెంబరులో పెమ్మరాజు వెంకట్రావు హైదరాబాద్ లో చనిపోయాడు. ఆయన కృషి, రచనలు గ్రంథస్తం కావలసివుంది.