అబద్ధాల వేట - నిజాల బాట/ఎం.ఎన్.రాయ్ ఇలా చేశాడా !
ఎం.ఎన్.రాయ్ (1887-1955) జీవితంలో ఒక ఘట్టం ఇన్నేళ్ళుగా మర్మంగా వున్నది. ఆయన తొలి భార్య ఎవిలిన్ 9 ఏళ్ళ కాపురం తరువాత హఠాత్తుగా విడిపోవడం ఎందుకో తెలియలేదు. ఎవిలిన్ ట్రెంట్(1892-1970) శాంతిదేవి అనే పేరిట కమ్యూనిస్టు అంతర్జాతీయ ఉద్యమంలో పనిచేసి, రాసింది. ఆ కాలంలో తన జీవిత విశేషాలు గ్రంధస్తం చేసిన మానవేంద్రనాధ్ రాయ్ (తొలిపేరు నరేంద్రనాధ్ భట్టాచార్య) ఎవిలిన్ ప్రస్తావనే తీసుకురాలేదు. విడిపోయిన తరువాత ఉభయులూ పరస్పరం మౌనం దార్చాలని ఏదైనా అంగీకారానికి వచ్చారేమో అనుకున్నాం. శిబ్ నారాయణ్ రే, వి.బి. కర్నిక్, హెయిత్ కాక్స్ మొదలైన వారి పరిశోధనలలో కూడా ఎవిలిన్ విడిపోవడంపట్ల వివరణ లేదు.
ఇప్పుడు లభించిన పత్రాలవలన ఎవిలిన్ కొన్ని విషయాలు వెల్లడించినట్లు ఆధారాలు తెలిశాయి. రాయ్ దంపతులకు సన్నిహిత మిత్రుడు, ఇండోనేషియాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీలచే హతమార్చబడిన స్నీవ్ లైట్ పత్రాలలో ఎవిలిన్, రాయ్ ఉత్తరాలు వున్నాయి. స్నీవ్ లైట్ డచ్ వాసి. అతని పత్రాలు నేడు ఆంస్టర్డాంలోని అంతర్జాతీయ సాంఘిక చరిత్ర సంస్థలో భద్రపరిచారు. వాటి ఆధారంగా కొన్ని సంగతులు తెలుస్తున్నాయి.
1917లో అమెరికాలోని న్యూయార్క్ లో పెళ్ళాడిన ఎం.ఎన్.రాయ్, ఎవిలిన్ లు 9 సంవత్సరాలు కలిసిమెలసి వున్నారు. మెక్సికో, రష్యా, యూరప్ దేశాలలో అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీలో కృషి సాగించారు. లెనిన్, స్టాలిన్, ట్రాటస్కీ, బరోడిన్ లతో పనిచేశారు. భారత కమ్యూనిస్టు పార్టీని 1920 అక్టోబరులోనే తాష్కెంట్ లో స్థాపించి, పెంచి పోషించారు. పత్రికలు నడిపారు. భారత కమ్యూనిస్టులకు డబ్బు, సలహాలు,పత్రికలు, సాహిత్యం పంపారు.
కనుక ఎవిలిన్-రాయ్ దాంపత్యం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ఎవిలిన్ 1925 జులై 30న అమెరికా వెళ్లిపోయింది. ఆంస్టర్ డాంలో జరిగిన కమ్యూనిస్టు వలస రాజ్యాల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆమె హఠాత్తుగా స్వదేశం వెళ్ళింది. అంతకుముందు స్విట్జర్లాండ్ లో రాయ్ దంపతులు "రెండవ ప్రేమయాత్ర" వంటిది అనుభవించారు. అక్కడే ఎవిలిన్ ను వెళ్ళిపొమ్మని రాయ్, పిడుగువంటి ఉత్తరవులు యిచ్చాడు. ఎందుకో చెప్పమని ఎవిలిన్ అడిగింది. ఉంటానని బ్రతిమాలింది. రాయ్ తన నిర్ణయం మార్చుకోలేదు. కారణాలు ఏవీ చెప్పలేదు.
ఎవిలిన్ తన వ్యక్తిత్వం చంపుకోకుండా వుండదలచినప్పుడు, రాయ్ అలాంటి నిర్ణయానికి వచ్చినట్లు అభిప్రాయపడింది. అనేక సందర్భాలలో ఘర్షణలు వచ్చినా, తాను వ్యక్తిత్వం అణచుకొని, భార్యగా అణకువతో వున్నందున 9 ఏళ్ళు వుండగలిగానని, సింహావలోకనంలో ఎవిలిన్ తెలిపింది. 1921లోనే రాయ్ అలా ప్రవర్తించినప్పటికీ, తనపట్ల అలాంటి అభిప్రాయం వెల్లడించి వుంటే, అప్పుడే వెళ్ళిపోయే దానినని పేర్కొన్నది. రాయ్ తో కేవలం భార్యగానే గాక, అతని ఉద్యమ కృషిలో భాగం పంచుకున్న ఎవిలిన్ కు, విడిపోవాలనే రాయ్ నిర్ణయం షాక్ నిచ్చింది.
రాయ్ తనను ఒక విలాస వస్తువుగా వాడుకున్నట్లు వెనక్కు తిరిగి చూచుకున్నప్పుడు, అవగాహనకు వచ్చింది ఎవిలిన్. బహుభార్యాత్వ విధానంలో తాను ఒకత్తెగా వున్నాననే అభిప్రాయం కూడా ఎవిలిన్ వెల్లడించింది. నిష్కర్షగా చర్చచేయకుండా, దాచిపెట్టి, గుంభనగా విషయాలు వుంచడం బహుశ తూర్పు దేశాల సంస్కృతి కావచ్చునని ఎవిలిన్ నిర్ధారణకు వచ్చింది. ఏ ఘట్టంలోనైనా తాను పొరపాటు చేసినట్లు 9 సంవత్సరాలలో రాయ్ ఎన్నడూ దెప్పిపొడవ లేదు. అలాంటప్పుడు యీ హఠాత్తు నిర్ణయం ఎలా చేస్తాడని ఎవిలిన్ ఆశ్చర్యపోయింది.
1925 ఆగష్టు నుండీ అమెరికాలో వున్న ఎవిలిన్ అనేక ఉత్తరాలు రాసినా రాయ్ నుండి సమాధానం రాలేదు. ఉభయులకూ కుటుంబ, ఉద్యమ మిత్రుడుగా వున్న స్నీవ్ లైట్ కు విషయాలు రాసింది. కారణాలు కనుక్కోమన్నది. ఒకవేళ రాయ్ తిరిగి రమ్మన్నా, పూర్వంవలె వుండడం కుదరదని భావించింది. అయినా రమ్మంటాడేమో కనుక్కోమనికోరింది. వెళ్ళిపొమ్మనడానికి కారణాలు కావాలని తరచి అడిగింది. భారతదేశంలో పనిచేయాలని తూర్పుదేశాల ఉద్యమాలలో పాల్గొనాలని ఆశించిన ఎవిలిన్, మళ్ళీ కమ్యూనిస్టు పార్టీ కోరితేనో, రాయ్ పిలిస్తేనో రాగలననుకున్నది.
మాతృదేశం అయిన అమెరికాలో అడుగు పెట్టిన ఎవిలిన్, నోరు విప్పినా, అక్కడ కమ్యూనిస్టు పార్టీలో పనిచేసినా దేశం నుండి పంపించేవారే. అప్పటికే 1926లో చికాగోలో జరిగిన అమెరికా కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో పాల్గొన్నది. కాని ముఠా తగాదాలు, నీచంగా వదంతులు వ్యాపించడం, రాయ్ ను వదిలేసి వచ్చిందని తనపై నీలాపనిందలు, గూఢచారి అని, డబ్బు కాజేసిందని, మరెన్నోనిందలు విని విసుగుచెంది వారందరికీ దూరంగా వుండాలని నిర్ణయించుకున్నది. ఎట్టకేలకు తన ఉత్తరాలకు రాయ్ సమాధానం యిస్తూ, అమెరికాలోనే వుండిపొమ్మని, తన దగ్గరకు రానక్కరలేదని తెలియజేశాడు.
క్రమేణా షాక్ నుండి తేరుకొని, జర్నలిస్ట్ గా అమెరికాలో ఎవిలిన్ స్థిరపడింది. 1930లో ఇండియా తిరిగి వచ్చిన రాయ్ ను బ్రిటిష్ పోలీస్ అరెస్టు చేయగా ఎవిలిన్ ఖండిస్తూ వ్యాసం రాసింది.
రాయ్ తన స్మృతులను రాడికల్ హ్యూమనిస్ట్ లో ప్రతివారం రాస్తున్నప్పుడు తన పేరు ప్రస్తావిస్తాడేమోనని ఎదురు చూచింది. డెహ్రాడూన్ లో చివరిదశలో రెండవ భార్య ఎలెన్ కు చెప్పి రాయించిన రాయ్ ఏకోశానా ఎవిలిన్ గురించి నిజం చెప్పలేదు.
రాయ్ చనిపోయిన అనంతరం ఎలెన్ ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి ఎవిలిన్ తో సంబంధం పెట్టుకున్నది. కొందరు స్వదేశీ విదేశీ రాజకీయ పరిశోధకుల్ని ప్రోత్సహించి ఎవిలిన్ దగ్గరకు పంపించింది. రాయ్ ను గురించి చెడుగా రాసిన వారిని ఎవిలిన్ ఖండించింది. రాబర్ట్ నార్త్ అనే రాజకీయ శాస్త్రజ్ఞుడికి రాయ్ గురించి అనేక విషయాలు ఎవిలిన్ చెప్పింది. చివరి వరకూ రాయ్ పట్ల ఎవిలిన్ ఉదాత్తంగా ప్రవర్తించింది. కమ్యూనిస్టుగా ఎం.ఎన్.రాయ్ మాత్రం ఎవిలిన్ పట్ల మానవ ధర్మంతో వ్యవహరించలేదు.
ఎవిలిన్-రాయ్ మధ్య సయోధ్యకై స్నీవ్ లైట్ ప్రయత్నించకపోలేదు. ఎవిలిన్ అమెరికా వెళ్ళిన అనంతరం ఎం.ఎన్.రాయ్ స్నీవ్ లైట్ యింట్లో కొన్నాళ్ళునాడు. అప్పుడు ఎంత చెప్పి చూచినా,రాయ్ రాజీకి ఒప్పుకున్నట్లు లేదు. ఈలోగా రాయ్ ని తొందరపడి ఏమీ అనవద్దని,మళ్ళీ తూర్పుదేశాలలో ఉభయులూ కలిసే అవకాశం వుందనీ స్నీవ్ లైట్ రాశాడు. బహుశ అప్పుడు విషయాలన్నీ రాయ్ విడమరచి, మనస్సు విప్పి చెప్పవచ్చునని కూడా ఎవిలిన్ ను ఓదార్చాడు. కాని అలాంటిదేమీ జరగలేదు. ఎవిలిన్ యూరోప్ నుండి వెళ్ళిపోయిన సంవత్సరంన్నరకు గాని రాయ్ చైనా వెళ్ళలేదు. ఈలోగా ఆయనకు లూసీగీస్లర్ అనే స్విస్ కమ్యూనిస్టు యువతితో సన్నిహిత పరిచయం ఏర్పడింది. ఆమెను అంతరంగిక కార్యదర్శిగా చైనా తీసుకువెళ్ళాడు. ఎవిలిన్-రాయ్ 9 ఏళ్ళ దాంపత్యం అలా ముగిసింది.
ఎం.ఎన్.రాయ్ మానవవాదిగా మారక ముందు, ఆ మాటకొస్తే కమ్యూనిస్టుగా పరిణమించక పూర్వం, అమెరికాలో అడుగుపెట్టాడు. అప్పటికి ఆయన ఎం.ఎన్.రాయ్ కూడా కాదు. తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య మాత్రమే. అమెరికాలో ఎం.ఎన్. రాయ్ ఏం చేశాడు, ఎలా ఆవిర్భవించాడనే విషయం పరిశోధించి యిక్కడ చారిత్రక ఆధారాలతో పొందుపరుస్తున్నాను. లోగడ వెలికిరాని సంగతులు గనుక ఆసక్తికరంగా వుండగలవు. పదవులు లేకుండా ప్రపంచ రాజకీయాలలో ప్రజల దృష్టిని ఆకర్షించిన రాయ్ జీవితంలో వెల్లడికాని సత్యాలలో కొన్నిటినైనా పూరించడమే యీ పరిశోధన ఉద్దేశం.
రాయ్ తన స్వీయ గాథలలో తన అమెరికా జీవితాన్ని గురించి స్తూలంగా ప్రస్తావించాడు. కొన్ని వదలివేశాడు. మరికొన్ని జ్ఞాపకం వుండకపోవచ్చు. కావాలని చెప్పకుండా దాటేసిన అంశాలు వున్నాయి. ఇప్పుడు అవన్నీ చరిత్రలో భాగం గనుక, పరిశోధనాత్మకంగా వెల్లడిస్తున్నాను.
అమెరికాలో ఎం.ఎన్.రాయ్ జీవితం పెద్ద మలుపు. పేరు మార్చుకున్నాడు. పెళ్ళి చేసుకున్నాడు. జాతీయ ఉగ్రవాదం సడలించి, సంవత్సరం పాటు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, రెండున్నర సంవత్సరాలు మెక్సికోలో వున్న రాయ్ పూర్తిగా మారిపోయాడు.
జర్మనీ సహాయంతో బ్రిటిష్ వారిని భారతదేశం నుండి వెళ్ళగొట్టాలని ఎం.ఎన్.రాయ్ ఆనాడు భావించాడు. అలాంటి ఆలోచన సుభాష్ చంద్రబోసు 25 ఏళ్ళ తరువాత చేశాడు. ఇండియా నుండి జావా వెళ్ళిన రాయ్, తిరిగి వెనక్కు వెళ్ళజాలక, చైనా, జపాన్ ల మీదుగా అమెరికా బయలుదేరాడు. నిప్పన్ మారో అనే ఓడలో ఓక్లహోమా నుండి అమెరికా పశ్చిమ తీరమైన శాన్ ఫ్రాన్ సిస్కోకు జూన్ 16(1916)న చేరుకున్నాడు.
నిప్పన్ మారో అనే ఓడ జూన్ 15(1916) రేవుకు వస్తున్నట్లు స్థానిక పత్రిక ప్రకటించింది. (డైలీ కమర్షియల్ న్యూస్ 1916 జూన్ 15) ఇలాంటి వార్తను ముందు రోజు కూడా ఆ పత్రిక ప్రచురించింది. బహుశ ఓడరాక ఒక రోజు ఆలశ్యమై వుంటుంది. ఆ ఓడలో ఎం.ఎన్.రాయ్ ప్రయాణం చేశాడు. ఓడలో విదేశీ ప్రయాణీకుల సమాచారం ప్రకారం రాయ్ పేరు మార్టిన్ చార్లెస్ అలెస్, వయస్సు 28 సంవత్సరాలు. క్రైస్తవ మతస్తుడు. ఫ్రెంచి జాతీయుడు. శాశ్వత చిరునామా, దేవాలయం. పాండిచేరి, ఇండియా, చేరదలచిన స్థలం పారిస్. స్నేహితులు, బంధువులు ఎవరూ లేరు. 6 అడుగుల ఎత్తు. నలుపు రంగు. గడ్డం వుంది. పుట్టిన స్థలం హైతి. నగరం అయోనియా. అలాంటి మారువేషంలో మారు పేరులో, బ్రిటిష్ పోలీస్ ను తప్పించుకుంటూ రాయ్ తొలి ప్రపంచ యుద్ధకాలంలో అమెరికాలో అడుగుపెట్టాడు. మే 28న ఓక్లహోమాలో బయలుదేరిన ఓడ ఫసిఫిక్ మహాసముద్రంలో 18 రోజులు ప్రయాణం చేసి శాన్ ఫ్రాన్ సిస్కో చేరిందన్న మాట.
ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు రాయ్ మౌనం వహించక, అమెరికాలో నీగ్రోలు అక్కడి పాలకులపై తిరగబడి తమ హక్కుల కోసం పోరాడాలని ప్రయాణికులతో చెప్పాడట. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ రికార్డులలో యీ విషయం ప్రస్తావించారు.
శాన్ ఫ్రాన్ సిస్కోలో బెల్ వ్యూ అనే హోటల్ లో రాయ్ బస చేశాడు. శాన్ ఫ్రాన్ సిస్కో క్రానికల్ పత్రిక యీ విషయం లోపల పేజీలలో చాలా అప్రధానంగా, చిన్న అక్షరాలలో 'హోటల్ కబుర్లు' అనే శీర్షిక కింద ప్రకటించింది. "చాలాకాలంగా ఇండియాలో గడిపిన రోమన్ కాథలిక్ మత గురువు సి.ఎ.మార్టిన్ పారిస్ వెడుతూ ఇక్కడ బెల్ వ్యూలో మకాం పెట్టాడు. పారిస్ లో ఆయన మత అధ్యయనం చేయనున్నారు. గత రెండేళ్ళుగా ఆయన చైనా, జపానుల్లో వున్నారు" (శాన్ ఫ్రాన్ సిస్కో క్రానికల్ జూన్ 16,1916).
మరో స్థానిక దినపత్రిక శాన్ ఫ్రాన్ సిస్కో ఎగ్జామినర్ కూడా రాయ్ విషయం లోపల పేజీలలో అతిసాధారణ అంశంగా ప్రచురించింది. "రెవరెండ్ సి.ఎ. మార్టిన్, ఇండియాలో పాండిచేరివాసి, ప్రస్తుతం బెల్ వ్యూలో వున్నారు. ఆయన రోమన్ కాథలిక్. రెండేళ్ళుగా చైనాలో మత ప్రచారకుడుగా, విద్యార్థిగా వున్నారు. పారిస్ వెడుతున్నారు, చైనాలో పరిస్థితులు విపరీత గందరగోళంగా వున్నట్లు ఆయన వర్ణించారు". (జూన్ 16,1916)
ఎం.ఎన్.రాయ్ ను పత్రికా ప్రతినిధులు కలిసి వుంటారు. ఆయన చెప్పిన కథనాన్ని వారు చిన్న వార్తగా ప్రచురించారు.
మొదటి ప్రపంచ యుద్ధం మధ్యలో వున్న సమయంలో, బ్రిటిష్ పోలీసుల సమాచారం యింకా అమెరికాకు చేరక ముందు, రాయ్ ఒక మతగురువు వేషంలో గడ్డం పెంచి అలా అమెరికాలో అడుగుపెట్టాడు. ఇండియాలో ఉగ్రజాతీయవాదిగా బ్రిటిష్ వారితో పోరాడుతున్నప్పుడు రాయ్ సహచరుడుగా జదుగోపాల్ ముఖర్జీ వుండేవాడు. అతడి సోదరుడు ధనగోపాల్ ముఖర్జి అంతకు ముందు కొన్నాళ్ళుగా అమెరికాలో వుంటున్నాడు. రాయ్ హోటల్ ఖాళీచేసి పాలో ఆల్టో అనే ప్రదేశంలో వున్న స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రాంగణంలో ప్రవేశించాడు. అక్కడ ధనగోపాల్ ముఖర్జీని కలిశాడు.
ధనగోపాల్ ముఖర్జీ 1906 నాటికే అమెరికా వచ్చాడు. అతడు బెంగాలీ పురోహితుడి కుమారుడు. ధన్ గోపాల్ స్టాన్ ఫర్డ్ లో చేరి 1914లో గ్రాడ్యుయేట్ అయ్యాడు. రాయ్ వచ్చే సరికి అదీ పరిస్థితి. ధన్ గోపాల్ రచయిత, కవి. జనీస్, ఫ్రెంచి భాషలు మాట్లాడగల ప్రతిభాశాలి. అతడు ఎధెల్ రేడ్యూగన్ అనే అమెరికన్ ఐరిష్ యువతిని ప్రేమించాడు. ఆమె కూడా స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో 1915లో గ్రాడ్యుయేట్ అయింది. రాయ్ వచ్చేసరికి ధన్ గోపాల్, ఎథెల్ డేటింగ్(ప్రేమ సంసారం) చేస్తున్నారు. వారికి అతిథిగా వచ్చిన రాయ్ కు అక్కడే ఎవిలిన్ ట్రెంట్ పరిచయమైంది. ఎవిలిన్ కూడా రాయ్ వచ్చేనాటికి స్టాన్ ఫర్డ్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, ఉద్యోగాన్వేషణలో వున్నది. ఎవిలిన్, ఎథెల్ సన్నిహిత స్నేహితురాళ్ళుగా వున్నారు. ఆ విధంగా రాయ్-ఎవిలిన్ లు కలుసుకున్నారు. అది రాయ్ జీవితంలో పెద్ద మలుపు. ఎవిలిన్ జీవితంలో గొప్పమార్పు.
నరేంద్రనాథ్ భట్టాచార్య ఎలియాస్ చార్లెస్ మార్టిన్ స్టాన్ ఫర్డ్ లో మానవేంద్రనాధ్ రాయ్ గా మారాడు. అవిలిన్, రాయ్ లు ప్రేమించుకున్నారు. డేటింగ్ ప్రారంభించారు. అమెరికాలో పెళ్ళికాక ముందు పరస్పరం అవగహన చేసుకోడానికి, భవిష్యత్తులో సుఖంగా గడపడానికి వీలుగా యిరువురూ కలసి వుంటారు. ఆ సమయంలో అభిరుచులు, అభిప్రాయాలు గ్రహించి, అంగీకరిస్తే పెళ్ళి చేసుకుంటారు. లేకుంటే, ఎవరి దారి వారిది. ఈ పద్ధతిని డేటింగ్ అంటారు. ఇది తల్లిదండ్రులు సమాజం అంగీకరించిన విధానం. రాయ్, ఎవిలిన్ లు అదే పద్ధతి అనుసరించారు. ఇంచుమించు ఒక ఏడాది కలసివున్న తరువాత, పెళ్ళి చేసుకున్నారు. ఎవిలిన్ విషయం రాయ్ తన స్మృతులలో ప్రస్తావించలేదు. ఎవిలిన్ కూడా పుస్తక రూపేణా రాయ్ ను గురించి ఏదీ రాయలేదు. అందువలన పరిశీలన శ్రమతో కూడిన పరిశోధనగా మారింది.
రాయ్ జీవితంలో ప్రవేశించి, రాయ్ లో మార్పులకు ప్రధాన వ్యక్తిగా వున్న ఎ విలిన్ గురించి లోగడ అతిస్వల్పంగా మాత్రమే సమాచారం తెలిసింది. 1992లో ప్రారంభించి, 1994లో కొనసాగింది, ఎవిలిన్ గురించి చాలావరకు పరిశోధన పూర్తి చేయగలిగాను. అమెరికాలో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, లైబ్రరీలు పురావస్తు మ్యూజియంలు ఇందుకు తోడ్పడ్డాయి. వ్యక్తులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొంత ఉపయోగించాయి. మొత్తం మీద ఎవిలిన్ గురించి చాలా వరకు సమాచారం అందించగలుగుతున్నందుకు పరిశోధకుడుగా తృప్తి చెందుతున్నాను.
మొదటి భర్తకు మొదటి భార్యగానే ఎవిలిన్ వున్నట్లయితే ఎం.ఎన్.రాయ్ అమెరికా జీవితం, ఎవిలిన్ పరిశోధన అనవసరం అనిపించేదే కాని, వారిరువురూ అంతర్జాతీయ రాజకీయాలలో ఎంతో ప్రధానపాత్ర వహించారు. ఇతరులపై చాలా ప్రభావం చూపెట్టారు. ఎవిలిన్ గురించి సమరేన్ రాయ్ ఒక్కరే కొంత పరిశీలించి, చాలా పరిమితంగా సమాచారం సేకరించగలిగారు. ఆయనను సంప్రదించాను కూడా. శిబ్ నారాయణ్ రే కొన్ని అడ్రసులు ఇచ్చినప్పటికీ అవి అంతగా తోడ్పడలేదు. చివరకు స్వయంశక్తిపై ఆధారపడి, తిప్పలుపడి కొన్ని మార్గాలు కనుక్కోగలిగాను.
ఎవిలిన్ గురించి, ఆమె కుటుంబాన్ని గురించి క్లుప్తంగా ప్రస్తావించి, ఎం.ఎన్.రాయ్ తో పరిచయం అయ్యే నాటికి ఆమెపట్ల అవగాహన ఏర్పరచడానికి ప్రయత్నిస్తాను.
ఎవిలిన్ లియోనార్ట్ ట్రెంట్ ఆమె పూర్తి పేరు. ట్రెంట్ ఇంటిపేరు. లియోనార్డ్ అని స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో చదివేటంత వరకూ వాడుకలో వున్నా, ఆ తరువాత కేవలం ఎవిలిన్ ట్రెంట్ అనే రాసుకున్నది. ఎవిలిన్ తల్లి అమెరికా స్త్రీ అయినా, తండ్రి బ్రిటిష్ పౌరుడు. ఎడ్విన్, ఆగస్టాలకు 1848 డిసెంబరు 13న లమార్టిన్ కనైనాక్ ట్రెంట్ పుట్టాడు. 12 సంవత్సరాల నాటికే ఓడలో అమెరికా చేరుకున్నాడు. మూడేళ్ళ పాటు సముద్రాల మీద ఓడల్లో పనిచేస్తూ తరువాత అమెరికా సివిల్ వార్ లో పాల్గొని రెండుసార్లు గాయపడ్డాడు. బాగా కష్టపడి, గనుల ఇంజనీర్ అయ్యాడు.
లమార్టిన్ కు గొప్ప పేరు ప్రఖ్యాతులు రాగా, జపాన్, ఆస్ట్రేలియా, టాస్మానియా ప్రభుత్వాలు ఆయన్ను పిలిపించి, సలహాలు స్వీకరించాయి. కలరెడొ రాష్ట్రంలో బౌల్డర్ ప్ర్రాంతంలో మేరిడిలోంమెక్లాయిడ్ అనే ఫ్లారిడా రాష్ట్ర యువతిని 1888 జూన్ 5న పెళ్ళి చేసుకున్నాడు. ఆ దంపతులకు 1892లో ఎవిలిన్ పుట్టింది. అప్పటికి గనుల ఇంజనీరుగా ఉటా రాష్టంలోని లేక్ వ్యూ సిటీలో లామార్టిన్ వున్నాడు. ఎవిలిన్ తరువాత పుట్టినవారు చనిపోగా, ఆమె ముద్దులబిడ్డగా పెరిగింది. ఇంట్లో ఆమె చిన్నపిల్ల. మిగిలినవారు ఇనజ్, లేలాదిలోం, హెలెన్, వాల్టర్ ఎడ్విన్, ఫ్లారెన్స్ లు, ఇంజనీరింగ్ కంపెనీ తన పేరిట స్థాపించి, బాగా ఆర్జించిన లామార్టిన్, పిల్లలకు మంచి విద్య చెప్పించాడు. కొన్నాళ్ళ పాటు కంపెనీ అమ్మేసి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తిరిగివచ్చి కాలిఫోర్నియా రాష్ట్రంలో కుదురుకున్నాడు. అందువలన ఎవిలిన్ తల్లిదండ్రులతో బాటు తిరుగుతూ ప్రాథమిక విద్య భిన్న ప్రాంతాల స్కూళ్ళలో పూర్తిచేసింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఆబర్న్ లో స్కూలు విద్య అయిన తరువాత, లాస్ ఏంజలస్ లోని స్త్రీల పాలిటెక్నిక్ లో 1908 లో చేరి హైస్కూలు విద్య నేర్పింది. అంతవరకూ ఎవిలిన్ జీవితం సాధారణంగా గడిచింది.
స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయం అప్పటికి యిప్పటికి అమెరికాలో ప్రతిష్టాత్మక సంస్థే. ఎవిలిన్ అందులో 1911లో ప్రవేశించింది. ఇంకా స్త్రీలకు ఓటుహక్కులేని రోజులివి. పైగా స్త్రీలను సమానంగా కూడా చూడడానికి అంతగా అలవాటు పడని విద్యాసంస్థల వాతావరణంలో ఎవిలిన్ ప్రవేశించింది. ఆమె కంటె ఆమె అన్న ఎడ్విన్ స్టాన్ ఫర్డ్ లో ముందే చేరి చదివాడు. అక్కడ చదవడం పెద్ద గౌరవం.
ఎవిలిన్ స్టాన్ ఫర్డ్ లో ఇంగ్లీషు సాహిత్యం ప్రధాన కోర్సుగానూ,ఫిలాసఫి ఫ్రెంచి అనుబంధ విషయంగానూ స్వీకరించింది. ఎవిలిన్ రెండో సంవత్సరంలోనే తన ప్రతిభను కనబరుస్తూ స్టేజిపై ఇంగ్లీషు నాటకాలలో పాల్గొన్నది. 1913 ఆగస్టు 28న స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ థియేటర్ లో థామస్ ఆగస్టన్ రాసిన ఆన్ ది క్వయట్ అనే హాస్య నాటకంలో ఎథెల్ పాత్ర నిర్వహించింది. ఈ నాటకానికి ముందే బాగా ప్రచారం యిచ్చారు. ఎవిలిన్ తన పాత్రను ఎంతో చక్కగా పోషించినట్లు పత్రికలు రాశాయి. ఈ నాటకం మూడు అంకాలతో కూడిన హాస్యప్రధానం. 20వ శతాబ్దం తొలి దశాబ్దంలో అమెరికా అత్యుత్తమ నాటికలో ఒకటిగా శ్లాఘించిన "ఆన్ ది క్వయట్" న్యూయార్క్ బ్రాడ్వే ధియేటర్లలో ఒక దశాబ్దం తరచు ప్రదర్శించారు. ఎవిలిన్ ఉచ్ఛారణ, ఉదాత్త అనుదాత్త స్వరం, పాత్ర పోషణ బాగా గుర్తింపు పొందాయి. అలా తన ప్రతిభను చూపిన ఎవిలిన్ 1913-14 లో యూనివర్శిటీ పత్రిక "క్వాడ్"లో సహసంపాదకురాలుగా వున్నది. ముఖ్యంగా ఆటల్లో టెన్నిస్, ఫెన్సింగ్ లో పాల్గొన్నది. స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతుండగా ఎవిలిన్ తరచు తల్లికి ఉత్తరాలు రాస్తుండేది. వాటిని బట్టి కొంత సమాచారం లభిస్తున్నది. యూనివర్శిటీలో కొందరు బెంగాల్ వారుండేవారు. వారితో రవీంద్రనాథ్ ఠాగోర్ సాహిత్యం చర్చ చేసినట్లు ఎవిలిన్ పేర్కొన్నది. అలాగే మెక్సికన్ల సమావేశాల వలన వారి అలవాట్లు ఆచారాలు తెలుసుకున్నది. ఉత్తరోత్తర రాయ్ తో బాటుగా మెక్సికో వెళ్ళినప్పుడు అవి తోడ్పడ్డాయి.
యూనివర్శిటీ విద్యార్థినిగా ఎవిలిన్ కు ధనగోపాల్ ముఖర్జీ పరిచయం వున్నప్పటికీ, సన్నిహిత స్నేహితులు ఎథెల్ రేడ్యుగన్ మాత్రమే. ఎథెల్, ధనగోపాల్ ప్రేమ వలన ఎవిలిన్ యిరువుతికీ సన్నిహిత స్నేహితురాలైంది.
ఎథెల్ రేడ్యుగన్ అమెరికన్ ఐరిష్ యువతి. ఆమె కూడా 1915లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ధనగోపాల్ 1914లోనే చరిత్ర ప్రధానాంశంగా గ్రాడ్యుయేట్ అయ్యాడు.
స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయ అధ్యక్షుడు డేవిడ్ జోర్డన్ స్టార్ వుండేవారు. ఆయన 1931లో ఛాన్సలర్ గా రిటైర్ అయితే,శాశ్వత గౌరవ ఛాన్సలర్ పదవి యిచ్చారు. జోర్డన్ శాంతి కాముకుడు, సైంటిస్టు. అమెరికాలోని ప్రత్యేక జీవరాశిని ఏరి, అధ్యయనం చేసి రాశారు. ఆయన రచనలు, ఉత్తరాలు, డైరీలు భద్రపరిచారు. ఆయన భార్య చనిపోయిన తరువాత మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. రెండో భార్య ఆయనకు మేధా సహచారిణిగా వుండేది. (జెస్సిలూసినైట్) ఆమెను అప్పుడప్పుడు ఎవిలిన్, ఎథెల్ కలుసుకుంటుండేవారు. అలాంటి సందర్భాలలో డేవిడ్ జోర్డన్ స్టార్ ను కూడా కలిశారు. అల్ఫాఫి సొరొరిటి విభాగానికి చెందిన ఎవిలిన్ మేధావిగా రాణించింది.
గ్రాడ్యుయేషన్ ముగించుకొన్న ఎవిలిన్ 1916లో ఉద్యోగాన్వేషణ ప్రారంభించింది. పేదవారి సమస్యలపై వ్యాసాలు రాయాలని, జర్నలిజంలో స్థిరపడాలని ఆమె తలపోసింది. అలాంటి దశలో ఎం.ఎన్.రాయ్ తటస్తపడ్డాడన్నమాట.
రాయ్ తో బాటుగా నిప్పన్ మారో ఓడలో భగవాన్ సింగ్ అనే జాతీయ ఉగ్రవాది ప్రయాణం చేసినట్లు అమెరికా ఎఫ్.బి.ఐ రికార్డు చెబుతుంది.
శాన్ ఫ్రాన్సిస్కో నుండి జూన్ 17 లేదా 28 తేదీలలో (1916) రాయ్ బయలుదేరి, హోటల్ గదీ ఖాళీచేసి, స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రాంగణంలో ధనగోపాల్ ముఖర్జీని కలసి వుంటారు. బహుశ కొద్ది రోజులలోనే ఎవిలిన్ తో కూడా పరిచయం అయి వుంటుంది. ఈ ఘట్టాలకు సంబంధించిన తేదీలు, పాత్రలు ఏవీ లేవు. ధనగోపాల్ ముఖర్జీకి సంబంధించిన పత్రాలు పెన్సిల్వేనియా యూనివర్శిటీ, సిరక్యూస్ యూనివర్శిటీలలో వున్నా, రాయ్ ప్రస్తావన ఏదీ లేదు. అతడి రచనలలో కూడా ఎక్కడా రాయ్ సందర్భం రాలేదు. ఎథెల్ రేడ్యుగన్ ఎక్కడైనా ప్రస్తావించినట్లు దాఖలాలు లభించలేదు. అసలు వ్యక్తులు రాయ్-ఎవిలిన్ లు యీ విషయాలు రాయలేదు.
ఎం.ఎన్.రాయ్ ఎవిలిన్ దంపతులు
స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీ పాలో ఆల్టో అనే చిన్న ప్రాంతంగా వున్నది. ధనగోపాల్ ముఖర్జీ 1916లో అక్కడే నివసిస్తుండేవాడు. (861 రమోనా, పాలో ఆల్టో, కాలిఫోర్నియా) రాయ్ కూడా దగ్గరలోనే ఒక యింట్లో వుంటుండేవాడు. (245 రమోనావీధి,పాలో ఆల్టో). అయితే రాయ్ వుంటున్న యిల్లు పాలో ఆల్టో పోలీస్ అధిపతి తల్లి నివాసం. ఆ విషయం రాయ్ కు తెలిసి వుండదు. ఆమె పేరు ఎ.ఎఫ్.నోబెల్. రాయ్ ఫలానా వ్యక్తి అని తెలిసిన తరువాత నోబెల్ ను కనుక్కుంటే, రాయ్ కు చాలా ఉత్తరాలు వస్తుండేవనీ, ఇంగ్లండ్ నుండి ఎక్కువగా పోస్టు వచ్చేదని ఆమె చెప్పింది. కొన్నాళ్ళు రాయ్ తో బాటు ఎస్.పి.సర్కార్ అనే జాతీయవాది వున్నాడు కూడా పాలో ఆల్టో ప్రాంతంలోఫ్ క్లీనీంగ్ అండ్ ప్రెస్సింగ్ సంస్థతో రాయ్ సంబంధం పెట్టుకున్నట్లు అమెరికా గూఢాచారి సంస్థ కనుగొన్నది. అది జపాన్ వారి వ్యాపార కేంద్రం. రాయ్ తన పట్టుదల కొనసాగిస్తూ జర్మనీ నుండి ధనసహాయ ప్రయత్నాలు చేశాడు,అది రావడం ఆలశ్యమౌతూనే వుంది.
ఎవిలిన్-రాయ్ లు ప్రేమించుకొని,పెళ్ళి చెసుకుందామనుకున్న తరువాత,ఎవిలిన్ తల్లిదండ్రులను కలిశారు. వారప్పుడు లాస్ ఏంజలస్ నగరంలో వుంటున్నారు. ఎవిలిన్ సోదరి పోవెల్ కూడా అక్కడే వుంటున్నది. ఉద్యోగాన్వేషణ విరమించి, ఎవిలిన్ యూరప్ పాస్ పోర్టు కోసం దరఖాస్తు పెట్టుకున్నది. అవి ప్రపంచయుద్ధం జరుగుతున్న రోజులు. ఒక పట్టాన పాస్ పోర్టు రాదు.కనుక స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ డేవిడ్ జోర్డన్ స్టార్ ను రికమండేషన్ కోరుతూ ఎవిలిన్ జూలై 31(1916)న లాస్ ఏంజలస్ నుండి కోరింది. ఆయన భార్యతో తన పరిచయాన్ని, ఎథెల్ తానూ కలిసి ఆయన యింటికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసింది.
జోర్డన్ వెంటనే స్టేట్ డిపార్ట్ మెంట్ కు సిఫారసు లేఖ పంపాడు. ఆ లేఖ చేరక ముందే ఎవిలిన్ పాస్ పోర్టు దరఖాస్తు పంపివేసింది. అయితే జోర్డన్ కు ధన్యవాదాలు జాబు ఆగస్టు 15న (1916) లాస్ ఏంజలస్ నుండే రాసింది.
ఎం.ఎన్.రాయ్,ఎవిలిన్ లు జర్మనీకి యు-53 జలాంతర్గామిలో పోదామనుకున్నారు. కాని ఎవిలిన్ కుటుంబం అందుకు అభ్యంతరపెట్టగా ఆ ప్రయత్నం విరమించారు. ధనగోపాల్ యీ విషయం ఒక సందర్భంలో సి.సి. ఆంథోనికి చెప్పాడు.
ఎవిలిన్ అన్న వాల్టర్ ఎట్యిన్ న్యూయార్క్ లో వ్యాపారం చేస్తున్నాడు. అతడిని కలిసి సహకారం పొందాలని ఎవిలిన్ తలపెట్టి నిస్పృహ చెందింది. ఎవిలిన్ కుటుంబంలో కొందరు ఎం.ఎన్.రాయ్ ను యిష్టపడగా మరికొందరు జాతి,రంగు ద్వేషం తొలగించుకోలేక, వారి పెళ్ళికి విముఖత చూపారు. స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆర్నెల్లు వున్న తరువాత రాయ్-ఎవిలిన్ లు న్యూయార్క్ చేరుకున్నారు. 1917 జనవరి నుండే తమ కార్యకలాపాలు న్యూయార్క్ లో సాగించారు. ఈలోగా బ్రిటిష్ పోలీస్ వత్తిడిపై అమెరికా గూఢాచారులు రాయ్ వెంట,భారత జాతీయవాదుల వెంటబడ్డారు. న్యూయార్క్ లో రాయ్ తరచు నివాసాలు మార్చవలసి వచ్చింది. కొన్నాళ్ళు 136ఇ, 19వ వీథి,న్యూయార్క్ కు మారాడు. ఇంకొన్నాళ్ళు 2116,డాలె ఎవెన్యూ,న్యూయార్క్ లో వున్నాడు. పోలీసులు కనుగొనేలోపు యిలా యిళ్ళు మార్చవలసి వచ్చింది.
మరోవైపు భారత జాతీయ అతివాదులు కొందరు రాయ్ నుండి ఆర్థిక సహాయం ఆశించారు. అలాంటివారిలో శైలేన్ ఘోష్ ఒకరు. సమయానికి జర్మనీ నిధులు అందక, రాయ్ మాట నిలబెట్టుకోలేక యిబ్బందుల పాలయ్యాడు. శైలేన్ ఘోష్ స్టాన్ ఫర్డ్ నుండి నిష్టూరంగా టెలిగ్రాంలు యిస్తుండేవాడు. కొంచెం ఓపిక పట్టమని రాయ్ కోరుతుండేవాడు.
ఆర్థిక యిబ్బందులు తట్టుకోడానికి ఎవిలిన్ రకరకాల ఉద్యోగాలు చేసింది. న్యూయార్క్ లోని అమెరికన్ సొసైటి,131ఇ, 23వ వీథిలో రాయ్ కొన్నాళ్ళు, 6728వ ఎవెన్యూలోని సిలోన్ రెస్టరెంట్ అడ్రస్ సహచరులకు యిచ్చాడు.
న్యూయార్క్ లో మూడు మాసాల పాటు లజపతి రాయ్ తో ఎం.ఎన్.రాయ్ గడపగలిగాడు. ఎవిలిన్ ఆయన వద్ద పని చేయగా కొంత ఆర్థిక సహాయం చేయగలిగాడు. భారతీయ ఉగ్ర జాతీయవాదులలో కల్లా ఎం.ఎన్.రాయ్, ఎవిలిన్ లలో ఆయన శీలం,ప్రతిభ చూచి మెచ్చుకున్నాడు. అయితే అభిప్రాయ భేదాలు వున్నాయి.
చంద్రకాంత చక్రవర్తి మొదలు అనేక మంది భారతీయ జాతీయవాదులు రాయ్, ఎవిలిన్ ల పట్ల ఈర్ష్య అసూయా ద్వేషాలు చూపారు. దుష్ప్రచారాలు చేశారు. ఈ లోగా రాయ్ ను అమెరికన్ పొలీసులు వెంటాడి పట్టుకోగా అటార్ని ఆయన్ను ప్రశ్నించాడు. సాక్ష్యాధారాలు సరిగా దొరకలేదు. అరెస్టు అయిన రాయ్ వెంటనే ఎవిలిన్ ను పెళ్ళి చేసుకొన్నాడు. జైలులో వారు పెళ్ళి చేసుకోలేదని చంద్రకాంత్ చక్రవర్తి చేసిన ప్రచారాన్ని ఎవిలిన్ ఖండించింది. (రిచర్డ్ పార్క్ అనే పరిశోధకుడికి రాసిన లేఖ) డేనియల్ జేకబ్ అనే రాజకీయ శాస్త్రజ్ఞుడు కూడా జైలులోనే పెళ్ళి జరిగిందని రాశాడు. (బరోడిన్, స్టాలిన్స్ మేన్ చూడు, 1981 ప్రచురణ-హార్వర్ట్ యూనివర్శిటీ ప్రచురణ) రాయ్-ఎవిలిన్ పెళ్ళి జరిగినట్లు ఆ తరువాత ఎవిలిన్ తన దగ్గర పనిచేసినట్లు లజపతి రాయ్ రాశాడు. ఈ లోగా 1917 జూన్ లో అమెరికాలో దేశద్రోహ నేరం కింద భారతీయ ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. రాయ్ అలా అరెస్ట్ కాదలచుకోలేదు.
స్నేహితుల ద్వారా పుట్టినతేది,సర్టిఫికెట్,పాస్ పోర్టు మరొకరిది తెప్పించుకున్నాడు. రైల్లో ఇరువురూ ప్రయాణం చేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని లారెడో మీదగా జోస్,ఎలెన్ పేరుతో అమెరికా నుండి సరిహద్దులు దాటి మెక్సికో చేరుకున్నారు. ఆ తరువాత రాయ్ పాస్ పోర్టును,సర్టిఫికెట్ ను తిప్పి స్నేహితుడికి పంపేశాడు. (భిల్స్ కు ఎలెన్ లేఖ 1920 మే3న అఫ్.బి.ఐ. 9771-బి.41.
రాయ్ మెక్సికో పారిపోయాడని తెలియక న్యూయార్క్ లో పోలీసులు గాలించారు. సాటర్ డే పోస్టు పత్రిక విలేఖరిగా ఒక గూఢచారి శ్రీమతి బ్లాక్ షార్డ్ కు ఫోనుచేసి రాయ్ ను గురించి,ఆరాతీస్తూ, రాయ్ ఒక కథ ప్రచురణ నిమిత్తం పంపాడనీ కొన్ని సందేహాలుండి ఫోను చేస్తున్నాననీ చెప్పాడు. రాయ్ తన దగ్గర వుండడం లేదని ఆమె చెప్పింది.
అరెస్టు అయిన వారితోబాటు భారతీయ ఉగ్రవాదులపై ఫిర్యాదులు విచారించి, శాన్ ఫ్రాన్సిస్కోలో శిక్షలు విధించారు. పరోక్షంలో రాయ్ ను శిక్షించామన్నారు. లజపతిరాయ్ కూడా జులై7 (1917) న ఎం.ఎన్.రాయ్ కు శిక్ష విధించినట్లు పేర్కొన్నాడు. ఎటొచ్చీ శిక్ష అనుభవించాల్సిన రాయ్ మెక్సికోలో సురక్షితంగా వున్నాడు! ఆయనతో బాటు ఎవిలిన్ కూడా వున్నది.
మెక్సికోలో ఎం.ఎన్.రాయ్-ఎవిలిన్
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒక ఏడాదిపాటు ఉగ్ర జాతీయవాద భారత రాజకీయాలు కొనసాగించిన ఎం.ఎన్.రాయ్ కొంత మారాడు. విశాల ప్రపంచం చూడడం, వివిధ వ్యక్తులను కలియడం కారణం కాగా, ఎవిలిన్ ను పెళ్ళిచేసుకోవడం ప్రధాన కారణం. జర్మనీ నుండి డబ్బు, ఆయుధాలు సేకరించి బ్రిటిష్ వారి పాలన అంతం చేయాలనే అలోచన యింకా వుంది. జూన్ 15 (1917)నాటికి సరిహద్దులు దాటి మెక్సికో పారిపోయిన ఎం.ఎన్.రాయ్ కు వూపిరి పీల్చుకున్నట్లయింది. అక్కడ రాయ్ గురించి ఆరాతిసిన బ్రిటిష్ రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు అమెరికాకు సమాచారాన్ని అందించింది. మెక్సికోలో రాయ్ ను అరెస్టు చేసి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తీసుకురావాలనే ప్రయత్నం విఫలమైంది.
మెక్సికో రాజధాని మెక్సికో నగరంలో రాయ్ సంపతులు కాలెడికోర్డిబా, 33డి, సిడాడ్ డి మెక్సికోలో వున్నారు. కొన్నాళ్ళపాటు మాన్యుల్ మాండెజ్ అనే పేరుతో రాయ్ ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించాడు.
ఎవిలిన్ ఒక పరిచయ లేఖతో మెక్సికోలోని యుకటిన్ రాష్ట్ర గవర్నర్ అల్వరాడొ సాల్వొడార్ ను కలసి, కొన్ని విద్యాపథకాలకు ప్రతిపాదనలు యిచ్చింది. రాయ్ తో పాటు హీరేంద్రనాథ్ సేన్, శైలేన్ ఘోష్ లు కొన్నాళ్ళు మెక్సికోలో వుండి పనిచేశాడు.
చిరకాలంగా జర్మనీ సహాయం కోసం ఎదురు చూడగా, జావాలో అందవలసిన డబ్బు, ఆయుధాలు అందకుండాపోగా, చివరకు మెక్సికోలో డబ్బు మాత్రం రాయ్ కు అందింది. 1917 ఆగస్టు నాటికి ధనసహాయం లభించగా ఎవిలిన్ పేరిట బాంక్ అకౌంట్ తెరిచాడు. 6750 డాలర్లు 15 వేల మెక్సికో పెసోస్ వుండేవి.
ఎం.ఎన్.రాయ్ మెక్సికోలో తొలుత భారత జాతీయోద్యమ ప్రచారం చేబట్టాదు. స్పానిష్ భాషనేర్చి, అందులో కరపత్రాలు, చిన్న పుస్తకాలు ప్రచురించాడు. భారత స్నేహితులు అనే సంఘం స్థాపించి,అందులో ఎం.ఎన్.రాయ్.ఎవిలిన్ డైరెక్టర్లుగా స్వాతంత్ర్యావశ్యకత వివరిస్తూ,బ్రిటిష్-అమెరికా ధోరణి ఖండిస్తూ రచనలు,ఉపన్యాసాలు సాగించారు.
మెక్సికోలో వుండగా రాయ్ తన ఫోటోలు తీయనిచ్చేవాడు కాదని ఆయన స్నేహితులు అనేవారట. చంద్రకాంత చక్రవర్తి, లాలాలజపతిరాయ్ లు మెక్సికోలో వున్న ఎం.ఎన్.రాయ్ తో సంబంధాలు పెట్టుకున్నారు. కొన్నాళ్ళ పాటు రాయ్ ఉత్తరాలు, వ్యాసాలు యంగ్ ఇండియా పత్రికలో ప్రచురణార్ధం లజపతిరాయ్ కు పంపాడు. మెక్సికోలో పర్యటించి భారత అనుకూల ప్రచార ప్రసంగాలు చేసినట్లు ఎవిలిన్ తన తల్లికి రాసిన ఉత్తరాలవలన తెలుస్తున్నది. ఎవిలిన్ కూడా యీ ప్రచారంలో పాల్గొన్నది. ఇండియా చూడాలని ఎవిలిన్ ఉవ్విళ్ళూరింది. రాయ్ ఉపన్యాసాల పట్ల మెక్సికోలో సానుభూతి కనబరచారని ఎవిలిన్ పేర్కొన్నది. ఇండియాలో పునర్జన్మ నమ్ముతారనీ,ఆ విషయం తెలుసుకోవాలనీ అనుకున్నది.
ఎం.ఎన్.రాయ్ మెక్సికో నుండి లజపతిరాయ్ తో సంబంధాలు కొన్నాళ్ళు అట్టిపెట్టి 1918 మార్చి 27న కూడా ఒక వ్యాసం పంపాడు. ది యంగ్ ఇండియాలో ప్రచురణార్థం పంపిన ఆ వ్యాసంలో విప్లవ పార్టీ ప్రతినిధిగా తాను రాస్తున్నననీ, ఇండియాకు పూర్తి స్వేచ్ఛ కావాలే గాని, బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా స్వాతంత్ర్యం అక్కరలేదనీ స్పష్టీకరించాడు. భారత స్వాతంత్ర్యంలో అనిబిసెంట్ లాంటివారు ఏనాడు నాయకులుగా చలామణి కాజాలరన్నాడు.
భారతదేశం స్వతంత్రరాజ్యంగా మనజాలదనే లజపతిరాయ్ అభిప్రాయంతో రాయ్ విభేదించి, అది తప్పుడు భావన అన్నాడు. ఇంగ్లండ్ కు కావలసింది భారతదేశంపై ఆర్థిక గుత్తాధిపత్యం గనుక, హోంరూల్ ఇవ్వడంగాని, ఆర్థిక స్వేచ్ఛ ప్రసాదించడంగాని జరగదని రాయ్ రాశాడు. ఇంగ్లండ్ ను ప్రాధేయపడడం మానేసి,దేశపూర్ణస్వరాజ్యానికి నిలబడమని లజపతిరాయ్ ను కోరాడు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోయాలనేవారు జర్మన్ కుట్రదారులని ఎలా భావించారని లజపతిరాయ్ ని ప్రశ్నించాడు. ఇండియాలోని 31 కోట్ల జనాభా మనుషులేనంటూ, వారికి హోంరూలుగాని, స్వతంత్రంగాని, మరే పరాయిరాజ్యంగాని అవసరం లేదని ఎం.ఎన్.రాయ్ రాశాడు. విప్లవం మాత్రమే భారతదేశాన్ని విమోచన వైపుకు నడిపించగలదన్నాడు.
లజపతిరాయ్ కు ఉత్తరం జతచేస్తూ, ఆయన అభిప్రాయాలు యంగ్ ఇండియాలో ప్రచురించడానికి అభ్యంతరం వుండదని భావిస్తున్నాడు. అన్ని రకాల అభిప్రాయాలకు యంగ్ ఇండియా చోటివ్వాలన్నాడు.
బరోడిన్ మెక్సికో వచ్చేవరకూ ఎం.ఎన్.రాయ్ ఉగ్రవాదిగానే వున్నట్లు తెలుస్తున్నది. అయితే అమెరికా నుండి వచ్చిన రాడికల్ సోషలిస్టులు, మెక్సికోలోని సోషలిస్టుల సాంగత్యంలో రాయ్ కొంత మారుతూ పోయాడు.
ఎవిలిన్ మెక్సికో నుండి అప్పుడప్పుడూ తన తల్లికి ఉత్తరాలు రాస్తూ విశేషాలు వివరించేది. ఎవిలిన్ మెక్సికోలో వుండగా ఆమె తల్లిదండ్రులు వాషింగ్టన్ ప్రాంతానికి మారారు. ఎవిలిన్ అనేక మారుపేర్లతో వ్యవహరించింది. మార్టిన్, రాయ్ ఎలెన్,ట్రెంట్ యిలా పేర్లు పెట్టుకుంటూ వుండేది. ఎం.ఎన్.రాయ్,ఎవిలిన్ లు జర్మనీ డబ్బువచ్చిన తరువాత పెద్ద బంగళా అద్దెకు తీసుకున్నారు.
బరోడిన్ మెక్సికో వచ్చిన తరువాత ఎం.ఎన్.రాయ్, ఎవిలిన్ లు పూర్తిగా కమ్యూనిస్టులుగా మారిపోయారు. బరోడిన్ ఆర్థిక యిబ్బందులను రాయ్ తీర్చాడు. జర్మనీ వారిచ్చిన ధనం ఆ విధంగా ఉపయోగపడింది. మెక్సికోలో రాయ్ దంపతులు ఆతిథ్యం స్వీకరించడానికి కమ్యూనిస్టు, సోషలిస్టు ప్రముఖులు అప్పుడప్పుడు ఆయన బంగళాకు వెళ్ళేవారు.
మెక్సికోలో రాయ్ దంపతుల చరిత్రాత్మక పాత్ర చాలా వరకు గ్రంథస్థమైంది.వారి ఖ్యాతి లెనిన్ వరకూ చేరడం, మాస్కో ఆహ్వానంపై రాయ్ దంపతులు 1920 జనవరిలో క్యూబా నుండి బయలుదేరి యూరోప్ దేశాల మీదుగా రష్యా చేరడం చరిత్ర కథనంగా వెలువడింది.ఎవెన్ జోస్ అనే పేరుతో రాయ్ ప్రయాణం చేశాడు.
రష్యాలో వుండగా ఎవిలిన్ తన కుటుంబంతో సంబంధాలు పెట్టుకునే వున్నది. ఉత్తరాలు రాసింది. పెట్రోగ్రాడ్, తాష్కెంట్, మాస్కో నుండి రాస్తూ ఎం.ఎన్.రాయ్ కార్యకలాపాలు, పెట్రోగ్రాడ్ లో ఒక ర్యాలీలో పాల్గొన్న ఫోటో, విశేషాలు రాసింది. రష్యా సాంఘిక పరిస్థితులు వివరించింది.
1920 అక్టోబరులో తాష్కెంటులో స్థాపించిన భారత కమ్యూనిస్టు పార్టీలో ఎవిలిన్ సభ్యురాలుగా వుంది. 1921లో మాస్కోలో స్టాలిన్, రాయ్ స్థాపించిన కమ్యూనిస్టు విశ్వవిద్యాలయంలో ఎవిలిన్ సిద్ధాంతాలు బోధించింది. 1938లో ఈ యూనివర్శిటీ మూసేశారు. ఎం.ఎన్.రాయ్ సోవియట్ యూనియన్ లో వుండగా అక్కడ నుండి మెక్సికో వెళ్ళిన ప్రముఖ చిత్ర నిర్మాత, డైరెక్టర్ సర్ గై అయిసెన్ స్ట్రెన్ మెక్సికోపై ఒక చిత్రం నిర్మించాడు. దాని పేరు క్యూ వివామెక్సికో. అంటే మెక్సికో వర్ధిల్లాలి అని అర్థం. ఆ చిత్రంలో మెక్సికో సమాజాభివృద్ధి నిర్మాతలలో ఒకరుగా ఎం.ఎన్.రాయ్ ను చూపారు. 1930 నాటికి చిత్రం పూర్తయింది. కాని విడుదల కాలేదు. చిత్రం పట్ల స్టాలిన్ అనాసక్తి అందుకు కారణం కావచ్చు. చిత్ర నిర్మాతకు ఉత్తరోత్తరా లెనిన్ అవార్డు లభించింది. 1949లో ఆయన చనిపోయాడు. ఆ తరువాత చిత్రం విడుదల కాగా అనేక అవార్డులు పొందింది. రాయ్ కు అలాంటి గుర్తింపు మెక్సికోలో వచ్చిందని చెప్పడానికి యీ ప్రస్తావన తెచ్చాను. న్యూయార్క్ మోడరన్ ఆర్ట్ మ్యూజియంలో యీ ఫిలిం వుంది.
సోవియట్ యూనియన్ లో యూరోప్ చైనాలో ఎం.ఎన్.రాయ్ పాత్ర గురించి చాలా గ్రంథాలు వెలువడ్డాయి. అయినా ఇంకెంతో బయటకు రావలసింది వుంది. నేటి పరిస్థితుల దృష్ట్యా మాస్కోలో పరిశోధిస్తే అనేక సంగతులు తెలుస్తాయి. అలాంటి పరిశోధన జరగవచ్చు. 1920-30 మధ్య రాయ్ గురించిన అనేక విషయాలు మాస్కో కె.జి.బి.రికార్డులలో వున్నాయని,చాలా వరకు రష్యన్ భాషలో వున్నాయని తెలుస్తుంది.
ఎవిలిన్ ఇంగ్లండ్ ఎందుకు వెళ్ళింది?
భారత కమ్యూనిస్టు పార్టీని 1920 అక్టోబరులొ స్థాపించిన అనంతరం తాష్కెంట్ నుండి తిరిగి మాస్కోకు వచ్చిన ఎం.ఎన్.రాయ్, ఎవిలిన్ లు విపరీత కృషిలో నిమగ్నులయ్యారు. 1921 మేలో ఎవిలిన్ ఇంగ్లండ్ వెళ్ళింది. రెవల్(టాలిక్) నుండి ఆమె ఇంగ్లండ్ లోని డోవర్ చేరుకున్నది. 1921 మే 21న అలా రహస్యంగా, ఎలెన్ అనే మారుపేరుతో ఇంగ్లండ్ రాగానే పొలీసులు పట్టుకున్నారు. లోగడ ఎవిలిన్ మెక్సికో నుండి రష్యా వెళ్ళినప్పుడు, మెక్సికో పాస్ పోర్టు వున్న దృష్ట్యా మెక్సికో రాయబార కార్యాలయం వారు ఆమెను మెక్సికోవాసిగా గుర్తించారు. ఇంగ్లండ్ నుండి 1921 జూన్ 11న ఎవిలిన్ ను ప్లిమత్ రేవు నుండి బలవంతంగా వేరాక్రుజ్(పనామా)కు పంపేశారు. ఇంగ్లండ్ లో కేవలం 18 రోజులు మాత్రం ఎవిలిన్ వున్నది.
ఎవిలిన్ ఆరోగ్యం బాగాలేదనీ కనుక ఆమెను జాగ్రత్తగా చూచుకోవలసిందిగా ఎస్తోనియన్ కమ్యూనిస్టు డబ్లు ఇకాస్టరె టెలిగ్రాంలు పంపాడు. అందులో ఒకటి ఎవిలిన్ సోదరి హెలెన్ కు తెలియపరుస్తూ,బాంక్ ఎక్కౌంట్ న్యూయార్క్ కు మారుస్తున్నామని, మెక్సికోలో ఆమెతో సంబంధం పెట్టుకోమని కోరాడు. మెక్సికో వాలోడెజ్ కి మరో టెలిగ్రాం యిచ్చాడు. మాంట్రియల్ లో మెన్ బ్రోసన్ కు టెలిగ్రాం యిస్తూ ఎవిలిన్ కు సహాయపడమన్నాడు. ఎవిలిన్ ఆరోగ్యం గురించి టెలిగ్రాంలో ప్రస్తావించినదంతా కేవలం నమ్మించడానికి చెప్పిన అబద్ధమని పోలీసులు గ్రహించారు.
క్యూబా నుండి అమెరికాకు రావడానికి ఎవిలిన్ ప్రయత్నిస్తే అరెస్టు చేయాలని అమెరికా పోలీస్ సిద్ధపడ్డారు. కాని అట్లా రాకుండానే ఎవిలిన్ మాస్కో వెళ్ళిపోయింది. ఇంతకూ ఎవిలిన్ ఇంగ్లండ్ కు ఎందుకు వచ్చిందో, ఎవరిని కలిసిందో, ఏం చేసిందో, తెలియదు. జులై 22(1921) వరకూ క్యూబాలో వుంది,తరువాత రష్యా వెళ్ళింది. మొత్తం మీద ఎవిలిన్ 1921లో తన తాత-తండ్రి స్వదేశాన్ని సందర్శించగలిగింది. భవిష్యత్తులో పరిశోధన చేయాల్సిన అంశంగా యిది మిగిలిపోయింది. తిరిగి రష్యా వెళ్ళిన ఎవిలిన్ కమ్యూనిస్టు ఉద్యమంలో నిమగ్నమైంది. రష్యా నుండి తల్లిదండ్రులకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతుండేది. అట్లాంటా సిటిలో ఒక మధ్యవర్తి ద్వారా ఒకసారి తల్లిదండ్రులకు జాబు చేరవేసింది.
ఎవిలిన్ అన్ని విషయాలలో ఎం.ఎన్.రాయ్ కు చేదోడువాదోడుగా రష్యాలో యూరోప్ లో నిలచింది. మాస్కోలోని టాయిలర్స్ ఆఫ్ ది యీస్ట్ యూనివర్శిటీలో బోధిస్తూనే, యూరోప్ లోని వివిధ ప్రాంతాల నుండి సాహిత్యాన్ని, పత్రికలను, డబ్బును భారత కమ్యూనిస్టులకు పంపేవారు. ఇంప్రెకార్, వాన్ గార్డ్, అడ్వాన్స్ వాన్ గార్డ్, ది మాసెస్ ఆఫ్ ఇండియా పత్రికలలో "శాంతిదేవి" అనే పేరుతో ఎవిలిన్ వ్యాసాలు రాస్తుండేది. అందులో లెనిన్ పై,గాంధీపై వ్రాసినవి, భారతదేశంలో బొంబాయి మిల్లు వస్త్రాల కార్మికుల సమ్మె రచన ప్రసిద్ధమైనది. అలా యూరోపియన్ దేశాలు వెంటబడుతుండగా, స్థలాలు మార్చేసి, పత్రికలు ఆపకుండా నిర్వహించడంలో ఎవిలిన్ కృషి చాలా వుంది. బెర్లిన్, స్విట్జర్లాండ్, పారిస్ మొదలైన చోట్ల వీరి కేంద్రాలుండేవి.
"వాన్ గార్డ్" పత్రికను అమెరికాలో 127 మందికి,చైనాలో 11 మందికి,వర్ష్యాలో ఒకరికి పంపేవారు. అమెరికాలో భగవాన్ సింగ్,చంద్రకాంత చక్రవర్తి, కొలంబియా యూనివర్శిటీలో ఇద్దరు ప్రొఫెసర్లు,న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ మొదలైన చోట్లకు పంపేవారు. 1924 వరకూ యిలా సంబంధాలు పెట్టుకున్నారు. ఇండియాకు విపరీతంగా ప్రచార పత్రికలు, సాహిత్యం గుప్పించారు. పారిస్ లో ప్రొ ఇండియా కమిటి పేరిట రాయ్ దంపతులు సాగించిన కార్యకలాపాలకు రాయ్ దేశ బహిష్కరణకు గురైనాడు. ఎవిలిన్ ఆ పని సాగించింది. ప్రవాస భారతీయ కమ్యూనిస్టుల స్థితిగతుల గురించి రాసింది. హెన్రిబార్బుసా తోడ్పాటు కూడా యిందులో వున్నది. 1925 జులై 11,12 తేదీలలో ఆంస్టర్డాంలో కలోనియల్ సభలలో ఎవిలిన్ ప్రముఖ పాత్ర వహించింది. యూరప్ లో ఆమె చివరి కార్యకలాపాలు అవే. పారిస్ లో జోషిని కలిసిన ఎవిలిన్, తాను చమన్ లాల్ ను కలుసుకోగోరుతున్నానని చెప్పింది. అతడు షక్లావత్, స్నేహితుడు. ఎవిలిన్ కు వ్యతిరేకంగా షక్లావత్ వున్నందున చమన్ లాల్ కూడా ఎవిలిన్ ను కలవదలచలేదు. ఈ విషయం లోతుగా పరిశీలించాలని ఎవిలిన్ తలపెట్టింది.
భారతదేశ కమ్యూనిస్టులకు సాహిత్యాన్ని ఓడలలో నావికుల ద్వారా పంపే ఏర్పాట్లు చేయాలని ఎవిలిన్ వ్యూహం చెప్పింది. బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక వ్యూహంలో బలంగా ఒక సంఘాన్ని ఏర్పరచాలని కూడా ఆమె సూచించింది. అందులో భారత సానుభూతిపరులను ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఇతర చోట్ల నుండి చేర్చుకోవాలని చెప్పింది. ఇంగ్లండ్ లోని భారతీయులకు సాహిత్యాన్ని చేరవేసేటందుకు వెళ్ళమని ఆర్.డబ్ల్యు రాబ్బన్ ను కోరింది.
ఎవిలిన్ రాయ్ ఎడబాటు
ఎవిలిన్ 1925 జులై 30న పారిస్ నుండి అమెరికా బయలుదేరింది. అంటే ఆంస్టర్ డాం కలోనియల్ సభల అనంతరం, ప్రొఇండియా కమిటి నిషేధానికి గురి అయిన తరువాత స్వదేశానికి వెళ్ళిందన్నమాట. తన తల్లిని చూడాలనే కోరిక వెలిబుచ్చినట్లు చెబుతారు.
అమెరికాలో ఎవిలిన్ ప్రవేశించినట్లు తెలుసుకున్న పోలీసులు ఆమెను పట్టుకొని, వెనక్కు పంపాలని అనుకున్నారు. ఆమె ఎలా దేశంలో ప్రవేశించిందో ఆరాతీసారు. ఎవిలిన్ తన సోదరి మేరిడిత్ వద్ద శాక్రమెంటో (కాలిఫోర్నియా)లో వున్నట్లు కనుగొన్నారు. కాని ఆమెను దేశం నుండి పంపించివేసే ప్రయత్నాలు నిరసించారు. ఎవిలిన్ శాక్రమెంటో శాన్ హోక్విన్ లోయ ప్రాంతాల్లో పర్యటించి,ఇండియన్ల మధ్య ఆందోళన కొనసాగించింది.
స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డేవిడ్ జోర్డన్ స్టార్ తో ఎవిలిన్ ఉత్తర ప్రత్యుత్తరాలు మళ్ళీ ప్రారంభించింది. ఎవిలిన్ ప్రతిభను గుర్తించిన జోర్డన్, తన పుస్తకం "ది హయ్యర్ పూలిష్ నెస్" రివ్యూ చెయ్యమని ఆమెకు పంపాడు. అయితే అప్పటికే శాన్ ఫ్రాన్ సిస్కో క్రానికల్ ఎడిటర్ టఫ్ ట్స్ మరొకరికి ఆ పని పురమాయించినందున ఎవిలిన్ చేయలేకపోయింది. డచ్ అమెరికన్ ఆర్టిస్టు పీటర్ వాన్ వాలీస్ బర్గ్ ను జోర్డన్ కు పరిచయం చేసిన ఎవిలిన్ అతడి చిత్రపటిమను శ్లాఘించింది. ఆ తరువాత జోర్డన్ ఆరోగ్యం క్షీణించడం పట్ల ఆందోళన వెలిబుచ్చి, ఆయన త్వరగా కోలుకోవాలని ఆశించింది. 1931లో జోర్డన్ చనిపోయాడు.
న్యూయార్క్ హెరాల్ట్ ట్రిబ్యున్ పత్రికలో ఎవిలిన్ వ్యాసాలు రాసింది. శాన్ ఫ్రాన్ సిస్కోలో ప్రపంచ విషయాలపై అనేక ఫీచర్స్ నడిపింది. 1935 వరకూ అలా రాస్తూనే పోయింది. 1928 అక్టోబరు నుండి శాన్ ఫ్రాన్ సిస్కో కె.పి.ఓ. రేడియో నుండి ప్రతివారం ప్రపంచ విషయాలపై ప్రసారాలు, చర్చలు సాగించిన ఎవిలిన్ కార్యక్రమాలు బాగా ఆకర్షించాయి. న్యూయార్క్ లో మక్లూర్ న్యూస్ పేపర్ సిండికేట్ వారి నవలలకు ఎవిలిన్ సంపాదకురాలుగా పనిచేసింది. పాశ్చాత్య నృత్యంలో తొలి ప్రావీణ్యత పొందిన యాగ్నిస్ బూన్ అనే ఆమెను గురించి స్టాన్ ఫర్డ్ ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ఎవిలిన్ మంచి వ్యాసం వ్రాసింది. ఎవిలిన్ అన్న వాల్టర్ ఎడ్విన్ న్యూయార్కులో వ్యాపారం చేస్తూ, రాయ్-ఎవిలిన్ తొలిపరిచయ రోజుల్లో విముఖంగా వున్నాడు. ఎవిలిన్ తిరిగి వచ్చిన తరువాత ఆయనలో మళ్ళీ సోదర సుహృద్భావంతో ఉత్తరాలు రాసి సత్సంబంధాలు నెలకొల్పింది.
ఎవిలిన్ తల్లిదండ్రులు వృద్ధులు కాగా విరామం విశ్రాంతి కోసం ఆబర్న్ (శాన్ ఫ్రాన్ సిస్కో దగ్గర) స్థిరపడ్డారు. ఎవిలిన్ వారితో అప్పుడప్పుడూ గడిపి శుశ్రూషలు చేసింది. న్యూయార్క్ లో స్థిరపడింది. సీరియస్ పనిచేబట్టాలని అవిలిన్ ఉద్దేశించింది. అందుకు పూనుకునే లోపే 1931 జులైలో ఎవిలిన్ తల్లి చనిపోయింది. అప్పటి నుండి తండ్రికి ఆసరాగా ఎవిలిన్ ఆబర్న్ లో వుండిపోయింది. అదే నెలలో ఎం.ఎన్.రాయ్ ను ఇండియాలో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఎవిలిన్ వెంటనే అరెస్టును ఖండిస్తూ, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని తెగనాడుతూ రివల్యూషనరీ ఏజ్ పత్రిక (న్యూయార్క్)లో వ్యాసం రాసింది. 1931 అక్టోబరులో యీ వ్యాసం అచ్చయింది. దీనిని బట్టి అంతర్జాతీయ విషయాలలో బాగా శ్రద్ధ వహించిన ఎవిలిన్, రాయ్ పట్ల అభిమానంతో వున్నదని గ్రహించవచ్చు. అయితే ఎవిలిన్-రాయ్ ల మధ్య 1925 చివర నుండే ఉత్తర ప్రత్యుత్తరాలుగానీ, మరే విధమైన సంబంధాలుగానీ వున్నట్లు ఆధారాలు లభించలేదు. ఉభయులూ తమ విషయాలు ఎక్కడా ప్రస్తావించలేదు.
ఎం.ఎన్.రాయ్ పట్ల అమెరికాలో స్పందన
అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నత స్థాయికి చేరుకున్న ఎం.ఎన్.రాయ్ 1923 నుండీ స్టాలిన్ కు దూరమౌతువచ్చాడు. చైనాలో తన వైఫల్యాలకు స్టాలిన్ ఇతరులను కొరముట్లు చేసే ప్రయత్నం యిందుకు కారణం. ఇండియాలో అప్పటికే రాయ్ పరోక్షంలో ఆయనపై కుట్రకేసులు విచారణ చేసి,దొరికితే శిక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం సిద్ధంగా వుంది. అలాంటి తరుణంలో కె.సి.బెనర్జి అనే సి.ఐ.డి.ని కమ్యూనిస్టు విప్లవకారుడుగా నటించమని, అతడిని జైలులో పెట్టారు. తోటి విప్లవఖైదీల నుండి అతడు సమాచారం సేకరించాడు. అతడు పత్రికా విలేఖరులకు విడుదల చేసిన సమాచారం డిటెక్టివ్ కథవలె వుంది. దానికి విపరీత ప్రచారం లభించింది. వాస్తవాలు అబద్ధాలు కలిపి చేసిన కథనం పత్రికలకు మంచి ఆకర్షణీయంగా మారింది. మానవేంద్రనాధ్ రాయ్ ప్రాచ్యబ్యూరో డైరెక్టర్ గా, అంతర్జాతీయ కమ్యూనిస్టు అధినేతగా భారత కమ్యూనిస్టుల్ని నడిపిస్తున్నాడని బెనర్జి పేర్కొన్నాడు.
రాయ్ శిష్యుడుగా కె.సి.బెనర్జి విచారణ సాగించి కల్పించిన కట్టుకథ, రాయ్ ను గురించి ఏం చెప్పిందీ చూద్దాం.
రాయ్ అసలు పేరు భట్టాచార్య. అతడు పుట్టింది 1885లో బర్మాలో. 10 ఏళ్ళ వయస్సులో అతడిని కెనడా మీదుగా కలకత్తా తీసుకువచ్చారు. 1920లో మెక్సికో నుండి రాయ్ ఇండియా వచ్చాడు. 1922లో భారత సమాఖ్య ఏర్పాటుపై నివేదిక సమర్పించాడు. గయ కాంగ్రెసు సమావేశంలో అది ప్రస్తావనకు వచ్చింది.
ఈజిప్టులో జనరల్ సర్ లీస్టాకిను హత్యచేయమని రాయ్ ఆదేశించాడట. అతడు వలస రాజ్యాలలో సైనికాధిపతి అట.
రాయ్ లేఖ తనకు లభించినదనీ, 15 వందల మాటలు గల యీ లేఖ వలన పై విషయాలు తెలిసినట్లు కె.సి. బెనర్జి చెప్పాడు. రాయ్ డైరీ కూడా దొరికినట్లు వెల్లడించాడు. అన్ని అబద్ధాలు ఒక గూఢాచారి ద్వారా పత్రికలకు చెప్పే పథకం వేశారు.
ఇలాంటి కథను పై అధికారులకు చెప్పకుండానే కె.సి.బెనర్జీ బయటపెట్టాడని కూడా రాశారు. భారతదేశంలో వెల్లడించిన యీ విషయాలకు అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక (1928 సెప్టెంబరు 16న (పేజి 7 కాలమ్ 7 సెక్షన్ మూడు) ప్రచురించడం ఆశ్చర్యకరం. రాయ్ కు వ్యతిరేకంగానూ, కమ్యూనిజానికి విరుద్ధంగానూ వున్న కథలకు అమెరికా అలాంటి ప్రాధాన్యత యిచ్చింది.
రాయ్ అరెస్ట్-అమెరికా రియాక్షన్
1931 జులైలో ఎం.ఎన్.రాయ్ ను,ఆయనకు ఆసరా యిచ్చినందుకుగాను మరో యిరువురు విప్లవకారులను బొంబాయిలో అరెస్టు చేసినట్లు బెర్లిన్ నుండి ఇంప్రెకార్ కేబుల్ పంపింది. ఈ వార్తను అమెరికా కమ్యూనిస్టు వారపత్రిక రివల్యూషన్ ఏజ్ మొదటి పేజీలో ప్రచురించింది. దీనితో పాటు రాయ్ ఇండియాలో ఉగ్రజాతీయవాదిగా జీవితం ప్రారంభించి, కమ్యూనిస్టుగా చేబట్టిన విషయాలు కూడా పాఠకులకు అందించారు.
అమెరికాలో అత్యధిక సంఖ్యాక కమ్యూనిస్టు పక్షం న్యూయార్క్ నుండి నడిపిన రివల్యూషనరీ ఏజ్ పత్రిక రాయ్ అరెస్టు మొదలు శిక్షపడే వరకూ చాలా వార్తలు ప్రకటించింది. రాయ్ విడుదలకు తీవ్ర ఆందోళన సాగించింది. రాయ్ డిటెన్షన్ నుండి పంపిన వ్యాసం కూడా ప్రచురించింది.
జె లవ్ స్టోన్ సంపాదకుడిగా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రికగా వెలువడుతుండేది రివల్యూషనరీ ఏజ్.బి.ది.పుల్ఫ్ దీనికి సహసంపాదకుడు. భారత కమ్యూనిస్టు పార్టీ రాయ్ అరెస్టు పట్ల మౌనం వహించడం సిగ్గుచేటు అని ఆగస్టు 29(1931)న యీ పత్రిక ప్రధాన శీర్షికలో విమర్శించింది. జర్మనీ, స్వీడన్ దేశాలలో అనేక సంస్థలు రాయ్ ను విడుదల చేయమని తీర్మానాలు చేశాయి. భారత కమ్యూనిస్టులు "నూరు శాతం కమ్యూనిస్టులు" రాయ్ ను రెనగేడ్ గా చిత్రించి, అతడిని ఎదుర్కోవాలని, లజ్జాకరమైన విమర్శలు చేసినట్లు యీ పత్రిక వ్యాఖ్యానించింది. జర్మనీ ఫాసిస్టులకు సైతం తోడ్పడిన అంతర్జాతీయ రెడ్ ఎయిడ్ సంస్థ, రాయ్ పట్ల విద్రోహకరంగా ప్రవర్తించి, అతడిని జైలులో కుమిలి పోనిమ్మని ప్రకటించింది.
జర్మనీ కమ్యూనిస్టు పార్టీ రాయ్ విడుదల కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. హాంబర్గ్ లో బ్రిటిష్ కాన్సల్ కు యీ మేరకు ఒక లేఖ అందజేశారు. రైష్ స్టాగ్ కమ్యూనిస్టు ప్రతినిధి జడాష్ తీర్మానం ప్రవేశపెట్టగా హర్షధ్వానాల మధ్య ఆమోదించారు.
రాయ్ విడుదల కోరుతూ జర్మనీ, స్వీడన్ లోనే గాక, అల్సాస్, చకోస్లోవేకియా కమ్యూనిస్టు పార్టీల నుండి కూడా తీర్మానాలు వచ్చాయి. సోషలిస్ట్ డెమొక్రటిక్ పత్రికలు రాయ్ అరెస్టు పట్ల మౌనం వహించడాన్ని యీ పత్రిక దుయ్యబట్టింది. రాయ్ ను బ్రిటిష్ సామ్రాజ్యవాద కబంధహస్తాల నుండి విడుదల చేయించడానికి కార్మికసంఘాలు,వలసదేశాలలో అణిచివేతకు గురైనవారు ముందుకు రావాలని యీ పత్రిక కోరింది. వర్గ ఆసక్తి రీత్యా పెట్టుబడిదారీ పత్రికలు మౌనం వహించడంలో ఆశ్చర్యం లేదని వ్రాసింది.(సెప్టెంబరు 12,1931).
ఎం.ఎన్.రాయ్ విడుదలకై ఐన్ స్టీన్ ప్రకటన
ప్రపంచ ప్రసిద్ధ భౌతిక శాస్త్రజ్ఞుడు ఆల్బర్ట్ ఐన్ స్టీన్ జర్మన్ లో క్లుప్తమైన ప్రకటన చేస్తూ, మానవేంద్రనాథ్ రాయ్ ను బ్రిటిష్ ప్రభుత్వం విడుదలచేయాలని కోరారు. ఈ విషయాన్ని రివల్యూషనరీ ఏజ్ పత్రిక సెప్టెంబరు 26,1931న ప్రకటించింది.
ఐన్ స్టీన్ ప్రకటన మూలప్రతి నేడు జెరూసలేంలోని హిబ్రూ యూనివర్శిటి ఐన్ స్టీన్ పత్రాలలో వుంది. దీని మైక్రోఫిలిం ప్రతి అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్శిటి ఐన్ స్టీన్ పత్రాలలో వుంచారు.
ఐన్ స్టీన్ వలె యింకా అనేక మంది రాయ్ విడుదల కోరుతూ ప్రకటనలు చేశారు. ఫ్రెంచి కమ్యూనిస్టు నాయకుడు హెన్రి బార్బూన్ అలాంటి వత్తిడి చేశాడు. జర్మనీలో అనేక సంస్థలు రాయ్ ను విడుదల చేయమని తీర్మానించాయి. కెమికల్ వర్కర్స్ యూనియన్, పబ్లిక్ హైస్కూలు టింజ్, గెలిల్స్ బర్గ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, షోనింగన్ కేంద్ర కార్మిక సంఘం, జెనానేజర్ ఫ్రెండ్స్, ఫాసిస్టు వ్యతిరేక లీగ్ యిందులో పేర్కొనదగినవని రివల్యూషనరీ ఏజ్ ప్రకటించింది. (1931 సెప్టెంబరు 26 న్యూయార్క్) బ్రిటిష్ జైలు నుండి రాయ్ ప్రపంచ కార్మికులకు,రైతులకు,మేధావులకు ఒక విజ్ఞప్తి చేశాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై పోరాడమని కోరాడు. తాను ఇండియాకు ఎందుకు తిరిగి వచ్చిందీ వివరించాడు. యీ ప్రకటన కూడా రివల్యూషనరీ ఏజ్ అక్టోబరు 10(1931)న ప్రకటించింది. రాయ్ ప్రకటన పూర్తిపాఠాన్ని అక్టోబరు 17(1931),అక్టోబరు 24న ఆ పత్రిక రెండు భాగాలుగా ప్రకటించింది. కాన్పూరు జైలు నుండి రాయ్ ఈ విజ్ఞప్తిని ఆగస్టు 23న (1931) బయటకు పంపగలిగాడు.
కెనడా కార్మిక సంఘంలో కూడా రాయ్ అరెస్ట్ గురించి చర్చించారు. ఫ్రెడరిక్ డగ్లస్ ఇంటర్ రేషియల్ క్లబ్బు న్యూయార్క్, బరొపార్క్, కార్మిక యువత క్లబ్బు న్యూయార్క్ కూడా రాయ్ విడుదలకై తీర్మానం చేసాయి. ఇండియాలో అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాయ్ విడుదల కోరడాన్ని రివల్యూషనరీ ఎజ్ అక్టోబరు 24,1931న ప్రకటించింది. ప్రధాన కార్యదర్శి ముకుందలాల్ యిచ్చిన టెలిగ్రాంను ప్రకటించారు.
రాయ్ పక్షాన జోక్యానికై మహాత్మాగాంధీకి విజ్ఞప్తి
గాంధీజీ లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటున్నప్పుడు మెజారిటి గ్రూపు కమ్యూనిస్టు పార్టీ ఒక కేబుల్ ద్వారా రాయ్ విడుదలకై ఆయన జోక్యం చేసుకోవాలని కోరింది. గాంధీజీ ఒక ప్రకటన చేయాలని అడిగితే, ఆయన నిరాకరించారు. ఈ విషయాన్ని మర్యాద మాటలతో అంతర్జాతీయ కార్మిక సంఘ కౌన్సిల్ కు తెలియపరిచినట్లు రివల్యూషరీ ఏజ్ నవంబరు 14,1931న ప్రకటించింది. రాయ్ సేవల్ని గుర్తుచేస్తూ వలస ప్రజల కోసం ఆయన పోరాటాన్ని పేర్కొని, ఆయన విడుదలకై కమ్యూనిస్టు పార్టీ మెజారిటీ గ్రూపు అమెరికా నుండి విజ్ఞప్తిని పంపింది.
రాజకీయ ఖైదీల అంతర్జాతీయ సంఘం కూడా రాయ్ పక్షాన ఒక ప్రకటన చేసింది. లండన్ లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ కు యీ ప్రకటన పంపారు. దీనిపై సంతకాలు చేసినవారు గమనించదగిన ప్రముఖులు ఏల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జెరోం డేవిస్,ప్రముఖ నీగ్రోనాయకుడు డా॥డబ్లు.ఇ.బి. డ్యుబాయ్, ప్రముఖ రచయిత వాల్డొ ఫ్రాంక్, ప్రముఖ న్యాయవాది గార్ ఫీల్డ్ హేస్, మతవాది జాన్ హేన్స్ హోమ్స్, చికాగో యూనివర్శిటి ప్రొఫెసర్ రాబర్ట్ మోర్న్ లవెట్, బ్రూక్ వుడ్ లేబర్ కాలేజి నుండి ఎ.జె.ముస్తే,ఫెడరల్ చిల్డ్రన్స్ బ్యూరో అధిపతి(మాజీ) జూతియా వెత్రాప్,ఇండస్ట్రియల్ డెమోక్రసీ లీగ్ డైరెక్టర్ నార్మన్ థామస్, నేషన్ పత్రిక ఎడిటర్ ఆస్వాల్డ్ గారి సన్ రోజర్ ఇబాల్డ్విన్(సంఘాధ్యక్షుడు).
జైల్లో రాయ్ ను అవమానకరంగా చూస్తున్న తీరును ప్రపంచానికి తెలియపరిచి అభ్యంతరపెడుతూ రివల్యూషనరీ ఏజ్ 1932 జనవరి 2 ప్రకటన చేసింది. అప్పటికి పత్రిక పేరు వర్కర్స్ ఏజ్ గా మారింది. రాయ్ డిఫెన్స్ సంఘాధ్యక్షుడు బి.సింగ్ యిచ్చిన జైలు వివరాలు ప్రకటించారు. రాయ్ కు పుస్తకాలు ఏవీ యివ్వడం లేదనీ,పత్రికలు అందజేయడం లేదనీ,గాలి వెలుతురులేని గర్భగుడివంటి గదిలో పెట్టారని, వేడినీళ్ళ సరఫరా చేయడం లేదని బి.సింగ్ తెలియపరిచారు. ఎం.ఎన్.రాయ్ కు 12 సంవత్సరాల జైలుశిక్ష విధించడాన్నివర్కర్స్ ఏజ్ జనవరి 23-1932 పతాక శీర్షిక ప్రచురించింది. ఆటవిక పాశవిక శిక్షగా చిత్రించి, విమోచనోద్యమానికి యిది దెబ్బ అని పేర్కొన్నది. రాయ్ విడుదలకుద్యమించాలని విజ్ఞప్తి చేసింది.
రాయ్ పోరాటాలను యీ పత్రిక మరోసారి ప్రకటించి, రాయ్ విడుదలకు కృషి చేయాల్సిన అవశ్యకతను వివరించింది. రాయ్ పక్షాన వాదిస్తున్న ఎక్బాల్ కృష్ణ కపూర్ కేసును అలహాబాద్ కోర్టులో చేబట్టనున్నట్లు తెలిపారు. గాంధీని అరెస్టు చేసి గౌరవంగా చూడడాన్ని, భారత కార్మికులకై పోరాడిన రాయ్ ను అవమానకరంగా జైల్లో చూడడాన్ని పోల్చి, యీ పత్రిక విమర్శించింది. (జూన్ 4,1932 వర్కర్స్ ఏజ్,న్యూయార్క్)
కాన్పూరు జైలు నుండి అర్థరాత్రి రాయ్ ను తరలించి తీసుకుపోగా, లక్నోలో యీ వార్త తెలిసిన రైల్వే కార్మికులు 5 వేల మంది స్టేషన్ లో రైలు రాగానే బ్రిటిష్ సామ్రాజ్యం నశించాలి, రాయ్ వర్ధిల్లాలి అంటూ నినాదాలు యిచ్చారు. అయితే రాయ్ రైలులో లేడని కనుగొన్నారు. అయినా నినాదాలు కొనసాగించారు.
రాయ్ ను బెరెల్లీ జైలులో పెట్టారు. అక్కడ స్థితిగతులు దారుణంగా వున్నాయి. భారతదేశం నుండి ఒక విలేఖరి పంపిన సమాచారాన్ని వర్కర్స్ ఏజ్ పత్రిక ప్రకటించింది.(ఏప్రిల్ 9,1932)
రాయ్ విచారణ వివరాలను అజయ్ కుమార్ ఘోష్ వివరంగా రాయగా 1932 జనవరి 30న(శనివారం) వర్కర్స్ ఏజ్ పూర్తి వ్యాసరూపంలో ప్రచురించింది. రాయ్ ను నిర్బంధించిన జైలు ముందు 50 వేల మంది నిరసన ప్రదర్శన చేశారు. అప్పుడు కాన్పూరుకు తరలించారు. దేశవ్యాప్తంగా నిరసన వెల్లువలు వచ్చాయి. మాజిస్ట్రేట్ జైలు గదిలో రాయ్ ను విచారించాడు. బయటవారిని చూడడానికి రాయ్ కు అనుమతి యివ్వలేదు. స్థానిక బార్ అసోసియేషన్ కు విజ్ఞప్తి చేయనిస్తే, అప్పుడు కొందరు న్యాయవాదులు రాయ్ పక్షాన నిలిచి పోరాడారు. రాయ్ పక్షాన ప్రదర్శనలు చేసినవారిపై పోలీస్ దారుణంగా ప్రవర్తించారు. (ఫిబ్రవరి 6,1932 వర్కర్స్ ఏజ్)
రాయ్ పక్షాన పోరాడిన వివిధ సంఘాల గురించి ఇండిపెండెంట్ ఇండియా ప్రచురించగా రివల్యూషనరీ ఏజ్ ఆ వార్తల్ని ప్రచురించింది.(డిశంబరు 26,1931)
రాయ్ రక్షణ సంఘంలో వున్నవారు:జవహర్ లాల్ నెహ్రూ, పండిట్ నారాయణ ప్రసాద్, అరోరా మౌలానా, హజ్రత్ మోహాని, అజిత్ కుమార్ ఘోష్, గోపీనాధ్ సింగ్. రాయ్ పక్షాన వాదించడానికి జర్మనీ నుండి హర్ ఫెల్డ్ ను రమ్మని కోరారు. అతడు సుప్రసిద్ధ న్యాయవాది. కాశీలో నవజవాన్ భారతసభ రాయ్ పక్షాన ఆందోళన చేబట్టింది. పొరబాటున రాయ్ అనుకొని పృధ్విరాజ్ గంజ్ రాజాను పోలీస్ అరెస్టు కూడా చేశారు. బెంగాల్ లో రాయ్ రక్షణ సమితి ఏర్పడింది. సుభాష్ చంద్రబోసు, ఆర్.ఎస్.రూయికర్, ఎస్.ముకుందలాల్, సత్యవతిదేవి, అసఫాలి, బ్రజేష్ సింగ్, కమలాదేవి చటోపాధ్యాయ వున్నారు.
బొంబాయిలో రాయ్ పక్షాన పోరాట సమితిలో జి.వై.ఛట్నీస్, గడ్కారి, మణిబెన్ కారా, వి.బి.కర్నిక్, జి.ఎల్.ఖండాల్కర్, ఉషా బాయిడాంగే, లాల్ జి పాండే,జుల్సారాం ఛౌదరి, ఎల్.డి.పాఠక్, పురుషోత్తమదాస్ త్రికందాస్, జయశంకర్ భట్, లోట్వాలా, ఎం.ఆర్.షెట్టి వున్నారు.
అదే సందర్భంలో ఎవిలిన్ వ్యాసం కూడా రివల్యూషనరీ ఏజ్ ప్రచురించింది. అయితే ఇ.ఆర్. అని మాత్రమే ఆమె రాసింది.తిరిగి అమెరికా వచ్చిన తరువాత ఎవిలిన్ ట్రెంట్ అని మాత్రమే ఆమె పత్రికలలో రాసుకున్నది.
రాయ్ పక్షాన ఇంగ్లండ్ పార్లమెంట్ లో
ఫెన్నర్ బ్రాక్ వే,ఇండిపెండెంట్ లేబర్ పార్టీ నాయకుడుగా హౌస్ ఆఫ్ కామన్స్ లో రాయ్ అరెస్టును ప్రస్తావించాడు. అప్పీలుకు సిద్ధమౌతున్న అంశం కూడా పేర్కొన్నాడు. రాయ్ పక్షాన పోరాడునున్నట్లు చెప్పాడు.
రాయ్ పక్షాన పోరాటం తీవ్రతరం చేస్తున్న దృష్ట్యా డబ్బు సహాయం చేసేవారు. పుస్తకాలు యివ్వదలచినవారు వర్కర్స్ ఏజ్ పత్రికకు అందజేయమని ఫిబ్రరి 27న 1932న విజ్ఞప్తి చేశారు.
రాయ్ కేసును హైకోర్టులో అప్పీలు చేసిన వార్తల్ని, ధనసహాయాన్ని యీ పత్రిక ప్రచురించింది. 20 పౌండ్ల బరువు కోల్పోయిన రాయ్, ఇన్ ఫ్లూయంజాతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.
రాయ్ పక్షాన అమెరికన్లు డబ్బు పంపగా రాయ్ స్వీకరించడానికి అంగీకరించలేదని పోస్టల్ శాఖవారు త్రిప్పి పంపారు. కాని యీ విషయం రాయ్ కు తెలియదు. అమెరికా కమ్యూనిస్టు పార్టీ రాయ్ నిమిత్తం వసూలు చేసిన డబ్బు అలా వృధా అయింది.
ఎవిలిన్ మళ్ళీ వివాహం
రాయ్ తో విడిపోయి అమెరికా 1925 చివరిలోవచ్చిన ఎవిలిన్ తన పత్రికా వ్యాసంగాలలో మిస్ అని వ్రాసుకున్నది. రాయ్ ను అరెస్టు చేసినప్పుడే ఇ.ఆర్.అని పాడి అక్షరాలు పెట్టడం మినహాయింపు. 1931లో తల్లి చనిపోయిన తరువాత ఆబ్నర్ లో తండ్రికి శుశ్రూష చేస్తూ వుండిపోయింది.
1935 మార్చి 9న ఎవిలిన్ తండ్రి లామార్టిన్ ఆబర్న్ లో 86వ ఏట చనిపోయాడు. స్థానిక పత్రికలు ఆయన గొప్పతనాన్ని శ్లాఘిస్తూ రాశాయి. ఆయనకు 7 గురు సంతానం,15 మంది మనుమలు అప్పటికి వున్నారు. ఎవిలిన్ కు సంతానం లేదు. తండ్రి మరణానంతరం ఎవిలిన్ తిరిగి తన రచనలు ప్రారంభించింది. శాన్ ఫ్రాన్ సిస్కో క్రానికల్ లో 1935 నవంబరు 3న కార్మికుల ఇళ్ళ సమస్యలు రాసింది.
ఎం.ఎన్ రాయ్ ఇండియాలో జైలు నుండి విడుదల సంవత్సరంలోనే అమెరికాలో ఎవిలిన్ రెండవ వివాహం చేసుకున్నది. 1936 అక్టోబరు 10న డెవిట్ జోన్స్, ఎవిలిన్ ల పెళ్ళి జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో రిచ్ మండ్ కు చెందిన డెవిట్ పెళ్ళి తరువాత ఓక్లాండ్ కు మారాడు. ఎవిలిన్ స్థానిక పత్రికలకు వ్యాసాలు రాస్తూ వివాహజీవితం ఆనందంగా గడిపింది. డెవిట్ జోన్స్ కూడా వ్యాపారాలు చేస్తూ పత్రికారచనలు సాగించాడు.
1938,39లో స్టేట్ ఎమర్జన్సీ రిలీఫ్ అడ్మినిస్ట్రేషన్ వారి బులిటెన్ కు ఎవిలిన్ రచనలు చేసింది. ఆ సంస్థ చరిత్రను డెవిట్ అజమాయిషీ చేసి రాయించాడు. కొన్నాళ్ళు శాక్రమెంటోలో దంపతులు నివశించగా, ఎవిలిన్ స్థానిక పత్రికలో రాసింది. ఆ ప్రాంతం ఆమెకు చిరపరిచితం కూడా.
ఆ విధంగా 15 సంవత్సరాలు ఎవిలిన్-డెవిట్ దంపతులు జీవించిన అనంతరం 1949 ఫిబ్రవరి 20న డెవిట్ చనిపోయాడు. మళ్ళీ ఎవిలిన్ ఆబర్న్ కు వచ్చి, అక్కడ స్థిరపడింది. 1949 ఏప్రిల్ 29న ఐన్ స్టీన్ ఆమెకు ఒక ధన్యవాదాల జాబు రాశాడు.
జైలునుండి విడుదల అయిన రాయ్ 1938లో, అంటే ఎవిలిన్ పెళ్ళి చేసుకొన్న రెండేళ్ళకు ఇండియాలో ఎలెన్ ను పెళ్ళిచేసుకున్నాడు. ఇండియాలో రాయ్ అరెస్టు అయినప్పుడు పట్టించుకోని అమెరికా పత్రికలు, విడుదల అయిన తరువాత రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి తోడ్పడాలని రాయ్ ప్రకటించినప్పుడు అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ ప్రకటించింది. హిట్లరిజాన్ని ఎదుర్కోడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి తోడ్పడాలని రాయ్ చెప్పినట్లు ప్రకటించాయి.(1939 సెప్టెంబరు 9)
రాయ్ రాడికల్ డెమొక్రటిక్ పార్టీ స్థాపించినప్పుడు మళ్ళీ న్యూయార్క్ టైమ్స్ ఆ వార్తను ప్రచురించింది.
అదేమిటో గాని న్యూయార్క్ టైమ్స్ లో మొదటి నుండీ రాయ్ చనిపోయేవరకూ ముకేంద్రనాధ్ అనీ, మహేంద్రనాధ్ అనీ రాశారు. అమెరికాలో గూఢచారి సంస్థలు తొలుత అలాగే రాసినా,ఉత్తరోత్తరా దిద్దుకున్నారు. ఎం.ఎన్.రాయ్ చనిపోయిన వార్తను న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.
ఎవిలిన్ ట్రెంట్ చినరి దశ
ఎం.ఎన్.రాయ్ చనిపోయిన అనంతరం భారతదేశంలో, అమెరికాలో కొందరి దృష్టి ఎవిలిన్ పై మళ్ళింది. ఎవిలిన్ చివరిలో తన రెండవ భర్త పేరు రాస్తుండేది. ఆమెకు రెండవ భర్తతో కూడా సంతానం లేదు. ఆమె అక్క మెరిడిత్ కుమారుడు డివెన్, అతడి యిరువులు సోదరీమణులు ఎవిలిన్ కు సన్నిహితంగా వుండేవారు.
ఎం.ఎన్.రాయ్ చనిపోకముందు చివరిదశలో ఆయన తన జీవితగాధాస్మృతులను చెబుతుంటే ఎలెన్ వ్రాసుకున్నది. అవి రాడికల్ హ్యూమనిస్టు వారపత్రికలో వరుసగా వచ్చేవి. అందులో ఎవిలిన్ ట్రెంట్ గురించి రాయ్ ఎక్కడా ప్రసావించలేదు. ఎవిలిన్ ఆ ప్రచురణ పట్ల ఆసక్తి కనబరచింది.
ఆబర్న్ లో సొంత ఆస్తిపాస్తులు చూచుకుంటూ, స్థానికంగా చిన్న ఉద్యోగాలు చేస్తూ ఎవిలిన్ కాలం గడిపింది. ఎం.ఎన్.రాయ్ చైనా పాత్ర గురించి సమగ్రంగా పరిశోధించిన రాబర్ట్ సి.నార్త్ తొలుత ఎవిలిన్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపి,ఆమె ఇంటికి వెళ్ళి మాట్లాడాడు. తన పుస్తకం ఆమెకు పంపించి, పరిశీలించమన్నాడు అచ్చుకాక ముందే, ఇంచుమించు అదే సమయంలో రిచర్డ్ సి.పార్క్ రచనల్లో ఎం.ఎన్.రాయ్ పట్ల దొర్లిన దోషాలను ఆమె ఎత్తిచూపింది. నార్త్ రచనల్లో తన పేరు తొలిగించమని ఎవిలిన్ కోరింది. ఇతరులు తనను గురించి అడిగినప్పుడు, విచక్షణ ఉపయోగించమని కోరింది. ఇండియా నుండి ముజఫర్ అహమ్మద్ ఉత్తరం రాయగా, నార్త్ ఆ లేఖను ఎవిలిన్ కు పంపాడు.
ఎలెన్ కూడా ఎవిలిన్ కు ఉత్తరాలు రాసి,శిబ్ నారాయణ్ రే వస్తున్నట్లు, కలుసుకొని మాట్లాడతాడని తెలిపింది. శిబ్ నారాయణ్ రే కూడా ఎవిలిన్ ను స్మృతులు రాయమని కోరాడు. నాథనైల్ వైల్ కూడా మెక్సికో కమ్యూనిస్టు పార్టీలో వీరి పాత్ర గురించి అడిగాడు.
ఎం.ఎన్.రాయ్ కమ్యూనిస్టు ఉద్యమంలో, ఇండియాలో నిర్వహించిన పాత్రను అభినందించాలని ఎవిలిన్ తన వ్యాఖ్యానాలలో రిచర్డ్ పార్క్ కు రాసింది. పార్క్ దోషాలను ఎత్తి చూపింది. అలాగే యితరులు కమ్యూనిస్టు ఉద్యమంలో రాయ్ పాత్రను,లెనిన్ సిద్ధాంతానికి అనుబంధంగా వలస విధానంపై రాయ్ సమర్పించిన సిద్ధాంతం పట్ల అవగాహన లోపాలను దోషాలను చూపింది. ఛటోపాధ్యాయతో రాయ్ సంబంధాల విషయమై అవగాహన లోపాలను దోషాలను చూపింది. భారత విప్లవోద్యమానికి రాయ్ సమకూర్చిన మేధాసంపన్నతను అర్థం చేసుకోవాలన్నది. తాత్విక పునాదులు తొలుత కల్పించింది రాయ్ మాత్రమే. అందుకు తగిన సాహిత్యాన్ని సమకూర్చిందీ రాయ్ ఒక్కడే.
ఆ విషయం భారతదేశంలో గుర్తింపు పొందినట్లు ఎవిలిన్ చెప్పింది. ఇలాంటి ఘనతకు నిందించడంగాక, రాయ్ ను అభినందించాలని ఎవిలిన్ కోరింది. రాయ్ తన పరిణామ దశలో ఎన్నో మార్పులకు లోనయ్యాడని, అయితే అతనికి నేర్చుకునే శక్తి సామర్థ్యాలున్నాయని ఎవిలిన్ రాసింది. బ్రిటిష్ పోలీసులు రాసింది తు.చ.తప్పకుండా ఆమోదించే ధోరణి, ముఖ్యంగా లెప్టినెంట్ కాయ్ వంటివారు నిష్పాక్షికంగా వుండలేనివారు రాసింది అట్టే నమ్మరాదని, రాయ్ ను గురించి పార్క్ కు రాసింది.
భారత విప్లవోద్యమంలో రాయ్ నిర్వహించిన పాత్ర, అతడి చిత్తశిద్ధికి అన్యాయం చేయవద్దని పార్క్ ను ఎవిలిన్ కోరింది. రాయ్ పట్ల కొన్ని వ్యాఖ్యలు ఆయన అభిమానుల్ని దిగ్ర్భాంతి చేసేవిగా వున్నాయని ఎవిలిన్ హెచ్చరించింది.
చంద్రకాంత చక్రవర్తి దోషాల్ని ప్రస్తావించి, రాయ్ భార్య కలోనియల్ కమిషన్ లో లేదని అతడు రాయడం, జైలులో మా పెళ్ళి జరగలేదనడం, స్టాన్ ఫర్డ్ లో మేం కలుసుకోలేదని, న్యూయార్క్ కలిసి వెళ్ళలేదని అనడం కేవలం అతడి వూహలు,భ్రమలు మాత్రమేనని ఎవిలిన్ తన వ్యాఖ్యలలో పార్క్ కు రాసింది. 1956 జూన్ 8న అబర్న్ నుండి రిచర్డ్ పార్క్ కు ఎవిలిన్ యీ విషయాలు రాసింది.
భారత కమ్యూనిజాన్ని గురించి పెద్ద గ్రంథం రాసిన విండ్ మిల్లర్ ఉపన్యాసం స్వయంగా ఒక చోట విన్న ఎవిలిన్ అతడిని పరిచయం చేసుకోవడం మంచిదని రాబర్ట్ నార్త్ కు రాసింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో కమ్యూనిస్టు పార్టీపై పరిశోధన చేసిన పి.సి.జోషి కూడా 1969లో ఎవిలిన్ ను కలుసుకోవడానికి ఉత్తరాల ద్వారా ప్రయత్నించాడు. ఆమె జవాబు రాసినట్లు లేదు.
1966లో నార్త్ కు రాసిన లేఖ ప్రకారం ఎవిలిన్ యింట్లో 1963లో అగ్నిప్రమాదం సంభవించి, రికార్డులు తగులబడిపోయాయి. అందులో ముఖ్యమైన కాగితాలు వుండి వుండవచ్చు. 1970 నవంబరు 21న ఎవిలిన్ ఆబర్న్ లో చనిపోయింది. స్థానిక పత్రికలు అప్పుడు కూడా రాయ్ ప్రస్తావన తీసుకరాలేదు.
ఆమె మరణానంతరం, ఎవిలిన్ అక్క కుమారుడు డివెన్ మెరిడిత్ మిగిలిన కొన్ని కాగితాలు,ఉత్తరాలను, ఫోటోలను కాలిఫోర్నియా స్టేట్ లోని స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో వున్న హూవర్ వార్, పీస్ రివల్యూషన్ అనే సంస్థకు యిచ్చాడు. ఆ కాగితాలలో నార్త్, పార్క్ శిబ్ రే, ఎలెన్ ఉత్తరాలు తప్ప, పాత రికార్డు ఏదీ లేదు.
రాయ్ ఫోటోలు కొన్ని వున్నాయి. ఒక ఫోటో క్రింద 'నన్ను ఆరాధించే నా యిష్టదేవతకు' అని ఎం.ఎన్.రాయ్ రాసినట్లున్నది.