అబద్ధాల వేట - నిజాల బాట/అరవిందాశ్రమంలో ఆధ్యాత్మిక వ్యాపారం !?
అరవిందుడు తత్వవేత్తగా గొప్పవాడా, మర్మయోగిగా నిలబడతాడా, రాజకీయాల్లో ఆధ్యాత్మిక అతివాదిగా పేరు తెచ్చుకున్నాడా అనేది ప్రస్తుత సమస్య కాదు. భారతదేశం నుండి పారిపోయి, ఫ్రెంచివారి ఆధీనంలో వున్న పాండిచేరిలో దాక్కున్న అరవిందుడు అక్కడ ఏం చేశాడనేదీ ప్రస్తుతాంశం కాదు. అరవిందుడు భార్యతో కాపురం చేయలేదెందుకని అడిగే హక్కు మనకులేదు. ఫ్రాన్సులో వివాహిత అయి, పిల్లలున్న మరొక ఫ్రెంచి స్త్రీతో కలసి పాండిచేరిలో వున్నాడనటంలో మంచిచెడ్డలు వెతకటం యిప్పుడు సందర్భం అనిపించుకోదు. అదిగాక, ఆధ్యాత్మిక లోకపు విలువలు వేరు గదా! వాటిని మన సామాన్యుల విలువలతో కొలిస్తే మనమే చులకన అవుతాం.
ఫ్రెంచి స్త్రీతో కలసి...
కాగా, అరవిందుడు ఉత్తరోత్తరా 'మాత' గా పిలువబడిన ఫ్రెంచి స్త్రీతో కలసి పాండిచేరిలో ఆశ్రమం పెట్టారు. దేశంలో యెక్కడ ఆశ్రమం పెట్టినా జనం చేరతారు. మరి ఇంగ్లండులో చదువుకొని, అతివాద రాజకీయాలలో కొన్నాళ్ళున్న అరవిందుడు ఆశ్రమం పెట్టాడంటే, దానికి బహుళ ప్రచారం రావటంలో ఆశ్చర్యం లేదు. ఆశ్రమం అంటే సంప్రదాయబద్ధమైన ఆశ్రమం కాదు. పాండిచేరి సముద్రపు ఒడ్డున అధునాతన భవనాల సముదాయమే ఈ ఆశ్రమం. అరవిందుడు చనిపోయాడని ప్రచారంచేసి కొంతకాలం భక్తుల్ని నమ్మించారు. ఆ తరువాత మాతగా ఆశ్రమంపై ఆధ్వర్యం వహించిన ఫ్రెంచి స్త్రీ చనిపోయిందని ప్రచారం చేశారు, భక్తులు అప్పుడూ నమ్మారు, ఇప్పుడూ నమ్మారు. నేను అడిగితే, వారిరువురూ అందరివలె మరణించలేదు. వేరే వున్నత కార్యాలపై మరొక స్థాయిలో వున్నారంటారు. కాదనే వారెవరయినా వుంటే ఎట్లా కాదో నిరూపించండి!
అట్లాంటి అరవిందాశ్రమానికి రెండు పర్యాయాలు వెళ్ళి రెండు వారాల పాటు వుండటం,వివిధ చర్యల్ని తిలకించటం, 'మాత'ను చూడటం, ఇంకా అనేక మందిని కలుసుకొని ఇంటర్వ్యూ చేయటం ఈ రచయిత స్వానుభవం కనుక చూసిందీ, విన్నదీ, తెలుసుకున్నదీ చెప్పాలని ఈ వ్యాసరచన చేస్తున్నాను.
అరవిందుడికి ఎందుకోగాని అంతంత మాత్రపువాళ్ళు భక్తులు కాలేదు. అంటే డబ్బులేనివారు. సామాన్యులు, చదువురానివారు, ఇట్లాంటివారు సాయిబాబాకో, జిల్లెళ్ళమూడి అమ్మకో, తిరుపతి వెంకటేశ్వరుడికో భక్తులయితే కావచ్చుగాని, అరవిందుడికి మాత్రం కాదు. పొరపాటున యెవరైనా అట్లాంటి వారుంటే సహవాసదోషం అయివుండాలి. తెలియక అయివుండాలంతే!
అకడమిక్ అవినీతి:
మేం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అరవిందాశ్రమానికి ఒక ముఠాగా బయలుదేరి వెళ్ళాం. కొందరు ఎం.ఏ. చదువుతున్నవారు, ఫిలాసఫీ శాఖాధిపతి డా॥మధుసూదనరెడ్డి అరవిందుని అనుచరులు. సర్వసాధారణంగా డిపార్ట్ మెంటు హెడ్ ఏ అభిప్రాయాలు కలిగివుంటారో వాటి ప్రభావం ఆ శాఖలో పనిచేసే వారిపైనా, వారి ఆధ్వర్యంలో చదివేవారిపైనా వుంటుంది. శాఖాధిపతి చలవ వుంటే యెందుకైనా మంచిదని గదా! ఇది ఈ ఒక్కశాఖకే పరిమితం కాదు. ఇంచుమించు అన్ని చోట్ల యీ ధోరణి చాలవరకు వుంటుంది. సరే,అదొక కథ. అట్లా వుంచండి. డా॥మధుసూదనరెడ్డిగారి పిల్లలు అరవిందాశ్రమంలో చదువుకుంటున్నారు. ఇంకా వారి బంధువులెందరో అక్కడ వున్నారు. కనుక వారికి యెలాగూ అక్కడికి వెళ్ళీరావటం తప్పదు. వారి ప్రభావంతో మరికొందరు బయలుదేరారు. ఎట్లాగూ వెడుతున్నాం గదా, యేదయినా గిట్టుబాటు వుంటే, యెందుకు సద్వినియోగం చేసుకోగూడదని భావించారు. కనుక దక్షిణ భారత విద్యాసంబంధమైన యాత్ర అని నామకరణం చేశారు. దాని ఫలితంగా యూనివర్శిటీ అనుమతి, రైల్వే కన్సెషన్ లభించింది. మరి పాండిచేరి ఆశ్రమానికి అంటే యీ సౌకర్యాలన్నీ లభించవు గదా? ఎలాగు అయితేనేమి మద్రాసు మీదుగా పాండిచేరి చేరుకున్నాం. ఇదంతా ఎకడమిక్ కరప్షన్ అంటే అనండి.
దర్శనం ఫార్స్:
మేం ఆశ్రమానికి వెళ్ళిన సందర్భంగా, మాతను ఆమె గదిలో, మూడో అంతస్తులో దర్శించటానికి మధుసూదనరెడ్డి గారు యేర్పాట్లు చేశారు. మాత వద్దకు పోబొయే ముందు మాకు కొంత బోధ చేశారు. ఎవరు ఎట్లా నడచుకోవాలి, ఏం చేయాలి అనేదే అందలి సారాంశం. ప్రతివారూ మాతవద్ద మోకరిల్లి, ప్రణమిల్లాలి, మాతను ప్రశ్నలు అడగరాదు. మాత యిచ్చే పుష్పం స్వీకరించాలి. మాత చూసినంతసేపూ ఆమె కళ్ళలోకే చూడాలి. కళ్ళ ద్వారా ఆమె తన శక్తిని ప్రసరింపజేస్తుంది. నిశ్శబ్దంగా వుండాలి ఇత్యాదులన్నీ చెప్పాడు.
దర్శనానికి పెద్ద క్యూ వున్నది. భక్తుల్లో తగిన మానసిక వాతావరణం ఏర్పరచే నిమిత్తం కొన్ని చిట్కాలు ప్రయోగించారు. ఒక్కొక్క గదిలో కొంచెంసేపు ఆపి, కూర్చోబెట్టి, ఎవరో ఒకరు వచ్చి అరవిందులు - మాత ఆయా గదులలో ఎట్లా గడిపారో వివరించేవారు ఇట్లా దర్శనానికి ముందు ఒకగంటసేపు సస్పెన్స్ వాతావరణం సృష్టించారు.
కృత్రిమ వాతావరణం:
తీరా మాత గదిలో ప్రవేశించి చూద్దుంగదా, కురువృద్ధురాలు వణకుతున్నది. మాటలో స్పష్టత లేదు. పక్క ట్రేలో కొన్ని పూలు పెట్టారు. రంగు రంగుల కలాలు వుంచారు. వెళ్ళినవారు ఒకరి తరువాత ఒకరు తొదుగులు ధరించిన ఆమె పాదాలను స్పృశించారు. దండం పెట్టారు. కళ్ళలోకి చూశారు. ఇచ్చిన పుష్పం స్వీకరించారు. కాని మా ముఠాలో ఆమెపైన నమ్మకం లేనివారూ, పాదాలు తాకటం యిష్టంలేనివారు, నటించటం చేతకాని వారూ వున్నారు. ఏమి చేయాలో తోచని సందిగ్ధావస్థలో పడ్డారు వారు. ఇటు చూస్తే శాఖాధిపతి అనుగ్రహం పోతుందేమో! అటు అయిష్టమైన ఆచారాలు, అట్లాంటప్పుడు వారికి ధైర్యం చెప్పి నన్ననుసరించమన్నాను. దగ్గరకు వెళ్ళి పెద్దలకు పెట్టినట్లే నమస్కరించాం. ఆమె ప్రతి నమస్కారం చెయ్యలేదు. కళ్ళలోకి చూసే తతంగం చేయలేదు. నాతో పాటున్న కొందరు అదే విధంగా బ్రతుకు జీవుడా అని బయటపడ్డారు. మాతోపాటు వచ్చిన వారిలో మధుసూధనరెడ్డి గారి అన్న మాత్రం మాత కాళ్ళు పట్టుకుని వలవల ఏడ్చాడు. మాకు నవ్వొచ్చింది. బలవంతంగా ఆపుకున్నాం. మొత్తం మీద కృత్రిమంగానూ అసహ్యంగానూ వున్న ఆ వాతావరణం నుండి బయటపడ్డాం.
పేరుకు అన్నీ అంతర్జాతీయాలే:
ఇక ఆశ్రమం, అందలి విశేషాలు తిలకించటానికి పూనుకున్నాం. ముందుగా అంతర్జాతీయ స్కూలు పేరిట వున్న సంస్థకు వెళ్ళాం. జుగల్ దా అనే ఒకాయన ఉపన్యాసం ఏర్పాటుచేశారు మా కోసం. ఆయన మాట్లాడబోయి యెందుకో వెక్కివెక్కి ఏడ్చాడు. ఎందుకో తెలియదు. మళ్ళీ నవ్వు ఆగలేదు. అందులో కారణం తెలియకుండా మగాళ్ళు ఏడుస్తుంటే నవ్వురాదా మరి! మాత జ్ఞాపకానికి వచ్చింది ఏడ్చానన్నాడాయన! అదొక ఫార్సు అనిపించింది. స్కూలంతా తిరిగి చూశాం. అది సంపన్నుల పిల్లలకే తప్ప మరెవరికి అందుబాటులో లేని స్కూలు. దాన్నెవరూ గుర్తించలేదు. అక్కడ చదువు ముగుసిన తరువాత ఏమి చెయ్యలో వారికే తెలియదు. పైగా చదువులో చెప్పుకోదగిన విశేషాలు, ఇతర చోట్ల లేనివి, అక్కడేమీలేవు. నెలకు విద్యార్థి ఒక్కొక్కరూ రూ.150లు ఫీజు చెల్లించాలి. మొత్తం 700ల మంది విద్యార్థులుంటే అర్హత వున్నా లేకున్నా 200ల మంది ప్రొఫెసర్లున్నారు;
ఆశ్రమంలో నళినీకాంత గుప్త అని మరొకరున్నారు. కొందరు వారికి అతిగౌరవం యిస్తున్నారు. మరికొందరు పాదస్పర్శ చెస్తున్నారు. ఏమిటి విశేషం అని విచారించగా, మాత అనంతరం ఆయనే సీనియర్ అని తెలిసింది. అంటే రంగం సిద్ధం చేసే వుంచారన్నమాట అనుకొన్నాం.
ఆశ్రమంలో అంతా డబ్బుతో కూడిన వ్యవహారమే. అక్కడికి వచ్చిన వారు అక్కడే భోజనం చెయ్యాలన్నారు. మాలో కొందరు ఆ భోజనం చెయ్యలేకపోయారు. మమ్మల్ని అక్కడే భోజనం చేయమన్న మా ప్రొఫెసర్ మాత్రం స్వగృహంలో విందారగించారు. విద్యార్థులు మాత్రం అరువాత ఊళ్ళోకి వెళ్ళి హోటల్లో తినవలసివచ్చింది. కాని అక్కడ మరో విశేషం జరిగింది. వూళ్ళోవాళ్ళు మమ్మల్ని చూచి, వెక్కిరిస్తూ మాట్లాడారు. ఆశ్రమానికి వచ్చారా అని వెటకారంగా అన్నారు. తీరా విచారిస్తే, ఊళ్ళోవారికి ఆశ్రమం అంటే చాలా ఆగ్రహం వున్నదని, ఆశ్రమానికి స్థానికులకు షష్ఠాష్టకం అని తేలింది. మేము వారం రోజులుంటే ఆశ్రమంలో తమిళవాసన ఎక్కడా కనిపించలేదు. బెంగాలీలు, గుజరాతీలు, కొంత ఫ్రెంచి ప్రభావం మాత్రం గోచరించింది.
అంతా వ్యాపారమయం:
అరవిందాశ్రమం కొన్ని వ్యాపారసంస్థల్ని నడుపుతున్నది. వాటిలో కొన్నిటిని సందర్శించాం. అక్కడ పనిచేసేవారిని కలసి మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకొని ఆశ్చర్యపొయాం. భక్తులు ప్రచారం చేసేదానికి, వాస్తవానికీ గల అఖాతం అర్థమైంది.
ఆశ్రమంలో జింక్ షీట్లు తయారుచెసే పరిశ్రమ మొదలు-ప్రింటింగ్ ప్రెస్ వరకూ అనేక వ్యాపారాలున్నవి. వారిలో కొందరు వడ్రంగులను, మెకానిక్ లను, ప్రెస్ కార్మికులను ఇంటర్వ్యూ చేశాం. బయట యిచ్చే వేతనాల కంటె యిక్కడ తక్కువ యిస్తున్నారని తెలిసింది. 1956లోనే ఆశ్రమంలో కార్మికులు సమ్మెచేశారని చెప్పారు. దీన్ని బట్టి ఆధ్యాత్మికత పేరిట ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో అనుభవించినవారు చెబితేగాని అర్థంకాదు. ఈ విధంగా ఆశ్రమంలో పనిచేస్తున్నవారికి అక్కడ జరిగే పనులపై గౌరవం గాని, వ్యక్తులపై అభిమానం గాని లేదంటే ఆశ్రమ పెద్దలలో తీవ్రలోపం వున్నదన్న మాటే. ఇన్ని దశాబ్దాలు గడిచినా స్థానికుల అభిమానం చూరగొనలేదంటే రోజురోజుకూ ఆ లోపం పెరుగుతున్నదన్నమాట. అందుకే హిందీ వ్యతిరేకోద్యమ సందర్భంగానూ, అరవిందుని పేరిట కేంద్ర విశ్వవిద్యాలయం అక్కడ స్థాపించాలన్నపుడూ స్థానికులు వ్యతిరేకించారు. ఆశ్రమంపై దండెత్తారు కూడా.
విద్యార్థినీ విద్యార్థులను కొందరిని కలిసి మాట్లాడాం. వారికి మాత అన్నా ఆశ్రమం అన్నా చాలా చులకనభావం వున్నదని అర్థమైంది. తల్లిదండ్రులు భక్తులు గావటంలో వారు తప్పనిసరిగా అక్కడ వుండాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులేని ఆ విద్యావిధానమంటే వారికి భయందోళనలే మిగిలాయి. క్రమశిక్షణ పేరిట నిత్యమూ అరవిందమాత భజన, ధ్యానం చేయించే విద్యావిధానమది.
జీవితంలో ఎక్కడో అనుకున్నది సాధించలేనివారు, జీవితమంటే విసుగెత్తినవారు, రిటైరైనవారు చాలామంది అక్కడకు వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. అయితే వీరంతా బాగా డబ్బున్నవారే. ఆశ్రమంలో అలగాజనానికి, డబ్బులేనివారికి చోటులేదు. అదొక ఖరిదయిన వింతైన ఆశ్రమం. డబ్బిస్తే యిక్కడ అన్నీ అభిస్తాయి.
డబ్బిస్తే కోతి దిగి వస్తుంది:
కొంత డబ్బు ముట్టజెపితే, పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడం, ఫోటోలపై మాత సంతకం చేయటం, దీవెనలు పంపటం యిత్యాదులెన్నో జరుగుతవి. డబ్బు పంపకుండా దీవెనలు అడిగితే ఉత్తరానికి జవాబురాదు. ఇది స్నేహితుల అనుభవం స్వయంగా చూచినది.
రెండో పర్యాయం వెళ్ళీనప్పుడు మాత ధర్మదర్శనం మేడపై నుండే యిచ్చింది. క్రింద వీధిలో భక్తులు నిలబడ్డారు. పైన ఫోటోలు తీశారు, ఫిలిం తీశారు. ఈ తంతు అయిన తరువాత సముద్రస్నానం చేయాలట. అక్కడ బీచ్ లో కొంచెం దూరం వెళ్ళగా బెస్తవారున్నారు. తమ స్థలాల్ని ఆశ్రమం వారు కాజేసి తమను నిరాశ్రయుల్ని చేసిన ఉదంతాన్ని వారు చెప్పారు. మొత్తంమీద ఊళ్ళో ఎక్కడికెళ్ళినా ఆశ్రమాన్ని గురించి దారుణంగా మాట్లాడారు. ఆశ్రమంలో తమిళేతరులు మాత్రం మాత మరణించిందని ప్రచారం చేశారు. 1973 నవంబరు 17న, 94 ఏళ్ళకు ఆమె మరణించింది. ఎప్పటి పాటే పాడారు. ఆమె చనిపోలేదట. ఇంకా పెద్ద పనులేవో చేయటానికి అరవిందుని సన్నిధికి వెళ్ళినదన్నారు. ఏదైనా ఆశ్రమంలో వస అంతటితో తగ్గింది. కాగా అదొక భారీ పరిశ్రమ గనుక నడుస్తున్నది.
ఈలోగా అంతర్జాతీయ నగరం పేరిట అరోవిల్ అనే సిటీ నిర్మిస్తున్నారు. దాని వలన స్థానికులు చాలామంది నివాసాల్ని కోల్పోతున్నారన్న విషయం అట్లా వుంచండి అది విలాసపురుషుల భోగలాలసత్వానికి పనికొచ్చే ఇంద్రజాల నగరంవలె పథకం వేశారు గాని మరేమీ కాదు. మన సమాజంలో ఇమిడే నగరం కాదది.
భక్తుల ప్రభావం:
అరవిందాశ్రమాన్ని గురించి ప్రచారం చేయటానికి అక్కడక్కడా పలుకుబడిగల, డబ్బున్న భక్తులున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదలుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయం వరకు వీరు వ్యాపించివున్నారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వీరు నిత్యమూ ఆశ్రమ భజన యితరులచే చేయిస్తుంటారు. ఏదో పేరిట డబ్బు వసూలు చేస్తారు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో హ్యూమన్ స్టడీస్ అనే పేరిట నడుస్తున్న వ్యవహారమంతా అరవిందుని భజనే. ఫిలాసఫీ సిలబస్ లో అరవిందుని మయం చేశారు. విద్యార్థుల్ని అట్లా పరోక్షంగా, ఏమీ ఎరగనట్లు వశం చేసుకోవటం ఒక కళ. ఏతా వాతా చెప్పొచ్చేదేమంటే, యీ ఖరీదైన విలాసపు ఆధ్యాత్మికత మన సమాజానికి అక్కరకు రానిదనే. సామాన్యులకు ఏ మాత్రం తోడ్పడని యిలాంటి ఆశ్రమాలు సమాజానికి చీడపురుగుల వంటివి. సమాజపు సంపదను అనుభవిస్తున్న యీ ఆశ్రమాలు కొత్తరకపు స్మగ్లర్స్ మాత్రమే.