అబద్ధాల వేట - నిజాల బాట/అమెరికాలో ఆవుల గోపాలకృష్ణమూర్తికి హెచ్చరిక !
అమెరికాలో పర్యటించినా ఆంధ్రలో వున్నా ఆవుల గోపాలకృష్ణమూర్తి విశిష్ట హ్యూమనిస్టుగానే ప్రవర్తించాడు.
1964లో అమెరికా ప్రభుత్వ ఆహ్వానంపై 3 మాసాలు పర్యటించిన ఆవుల గోపాలకృష్ణమూర్తి (ఎ.జి.కె)కి సంబంధించిన కొత్త విశేషం తెలిసింది.
అప్పట్లో బి.కె.నెహ్రూ భారత రాయబారిగా అమెరికాలో వున్నాడు. ఆయన భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బంధువు కూడా. నెహ్రూ విధానాలు నిశితంగా పరిశీలించిన ఎ.జి.కె.ను అమెరికాలోని భారత రాయబారి హెచ్చరించాడట, ఏమని?
జవహర్ లాల్ నెహ్రూను అమెరికాలో విమర్శిస్తే, ఎ.జి.కె.ను బలవంతంగా ఇండియా పంపివేయాల్సి వస్తుందని!
కాని, ఎ.జి.కె. తన విమర్శలు ఏ మాత్రం సడలించలేదు. హెచ్చరికల్ని ఖాతరు చేయలేదు. తాను హేతుబద్ధం అనుకున్న విమర్శ చేశాడు.
ఆనాడు ఎ.జి.కె.చికాగోలో వడ్లమూడి శ్రీకృష్ణకు అతిధి. శ్రీకృష్ణగారు ప్రస్తుతం వాషింగ్టన్ సమీపంలో మేరీలాండ్ లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయాన తెనాలి తాలూకా మోపర్రు వాసి ఎ.జి.కె.పట్ల భారత రాయబార కార్యాలయం ప్రవర్తన గురించి వడ్లమూడి శ్రీకృష్ణ నాకు యిటీవలే వెల్లడించారు.
అమెరికాకు ఆహ్వానించిన వారిలో ఎ.జి.కె. వంటి వ్యక్తి చాలా అరుదైన వారని అమెరికా ప్రభుత్వం భావించిందట.
ఎ.జి.కె.కుమార్తె జయశ్రీ పెళ్ళి నిశ్చయమైన సందర్భంగా మద్రాసు నుండి బి.ఎస్.ఆర్ కృష్ణ వచ్చి ఆహ్వానం అందజేశారు. అది ఆనాడు హ్యూమనిస్టులకు పెద్ద పండుగ. పెళ్ళిలో ఆవుల సాంబశివరావు ఆధ్వర్యాన కవి సమ్మేళనం జరుగుతుండగా అమెరికాకు ఎ.జి.కె. ఆహ్వానం కూడా ఒక సంబరంగా సాగింది.
ఎ.జి.కె.ఆహ్వానాన్ని భరించలేని వ్యక్తులు కొందరు వివేకానంద పేరిట కొత్త ఎత్తుగడకు పూనారు. సన్మానం పెట్టి అమెరికాలో వివేకానంద గొప్పతనం చెప్పిరమ్మనారు. అలాంటి భట్రాజీయం తాను చేయనని, ఉన్నది ఉన్నట్లు వివేకానంద గురించి చెబుతాననీ, అదీ ప్రస్తావన వస్తేనే మాట్లాడతాననీ ఎ.జి.కె. అన్నారు.
ఇంకేముంది? ఆ మాట పట్టుకొని, ఆనాడు ఆంధ్రప్రభ సంపాదకుడుగా వున్న నీలంరాజు వెంకటశేషయ్య (కంచి శంకరాచార్య పాదపూజ భక్తుడు) ధ్వజమెత్తాడు.ఎ.జి.కె.ను అమెరికా వెళ్ళనివ్వరాదని, వెళ్ళినా వెనక్కు పిలిపించాలని లేఖలు ప్రచురించారు. హైందవం నాలుగు పడగల నాగు అలా ఫాసిజం వెదజల్లింది. కాని అమెరికా ప్రభుత్వం గాని, భారత ప్రభుత్వం గాని, యీ ఫాసిస్టు విమర్శలు పట్టించుకోలేదు. అమెరికా నుండి తిరిగి వచ్చిన ఎ.జి.కె. తన పర్యటనానుభవాలు ప్రజలకు సభాముఖంగా వివరించాడు. పుస్తకం ప్రచురించాడు.
ఎ.జి.కె. వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి హ్యూమనిస్టు ఉద్యమంలో వుండడం, బాగా పునాదులు వేయడానికి తోడ్పడింది.
ఎ.జి.కె.పై సమగ్ర పరిశీలన అవసరం. విపుల గ్రంథం వెలువడితే భవిష్యత్తులో హేతువాదులకూ హ్యూమనిస్టులకూ చాలా మార్గదర్శకంగా వుంటుంది.
స్టడీకాంపులలో ఎ.జి.కె. నిర్భయంగా ఎం.ఎన్.రాయ్ ను కొన్ని సందర్భాలలో ఎదుర్కొన్నారు. ఒకసారి కొరియా విషయమై అలాంటి వివాదంలో తీవ్ర అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఉభయులూ ఒక రోజంతా ముభావంగా, ఎడముఖం పెడముఖంతో వున్నారట. ఇది గమనించిన ప్రముఖ హ్యూమనిస్టులు ఉభయుల్నీ కలిపి వాతావరణం చల్లబరిచారట.
త్రిపురనేని రామస్వామి - ఎం.ఎన్.రాయ్ భేటి తెనాలిలో జరిగినప్పుడు రాయ్ అసంతృప్తితో రామస్వామి ఆర్యసమాజ్ వాసనలు పోగొట్టుకోలేనివాడిగా పేర్కొన్నట్లు ఎ.జి.కె. చెప్పారు.
కాంగ్రెసు అధ్యక్ష పదవికి పోటీచేసిన ఎం.ఎన్.రాయ్ పొరపాటున గెలిచి వుంటే రాడికల్ హ్యూమనిజం ఎటు పొయ్యేదోనని నవ్వుతూ ఎ.జి.కె.వ్యాఖ్యానించేవారు.
ఎంఎన్.రాయ్ ను చివరిదాకా కమ్యూనిస్టు భయం వెంటాడిందనీ, చంపుతారనే అనుమానం వుండేదనీ, రాయ్ ను దగ్గరగా పరిశీలించిన ఎ.జి.కె. అంటుండేవారు.
ఎ.జి.కె.ను గురించి తెలుసుకోవలసిందీ, ఉద్యమానికి ఆయన చేసింది భావితరాలకు చెప్పల్సింది చాలా వుంది.
సుప్రసిద్ధ టీచర్ గా పేరొందిన ఎలవర్తి రోశయ్యగారు ఎ.జి.కె.కు మంచి స్నేహితులు. రోశయ్యగారు గుంటూరు ఎ.సి.కాలేజి, జె.కె.సి.కాలేజి, భీమవరం కాలేజీలలో పనిచేశారు. విశిష్ట లెక్చరర్ గా పేరొందారు. కరడుగట్టిన గ్రాంధికవాది. అలాంటి రోశయ్యగారు విద్యార్థి దశలో పిలక పెంచి, చాదస్తంగా నన్నయగారు, తిక్కనగారు,ఎర్రనగారు అంటూ కవిత్వమంటే చెవికోసుకునేవారు. ఎ.జి.కె.గుంటూరు హాస్టల్ లో ఒకనాడు తెల్లవారుజామున రోశయ్య పిలక కత్తిరించేశాడు. అపచారం అంటూ రోశయ్య వాపోతుండగా పేరుచెప్పకుండా త్రిపురనేని రామస్వామి సూతపురాణంలో ఒక పద్యం చదివి వినిపించాడు. రోశయ్యగారు ఆకర్షితుడై బాగుంది, ఎవరు రాశారు? అని అడిగాడు. ఎ.జి.కె. చెప్పకుండా మరో పద్యం చదివి, అలా రోశయ్యను ఆకర్షించారు. చివరకు పేరు చెప్పగా రోశయ్యగారు ఆశ్చర్యపోయి, ఆ తరువాత రామస్వామి కవితలన్నీ చదివారు. అప్పటినుండే చాదస్తం తగ్గించుకున్నారు. లెక్చరర్ గా రోశయ్యగారు ఎందరో విద్యార్థులకు మానవవాదాన్ని, ఎం.ఎన్.రాయ్ ను పరిచయం చేశారు. ఎ.జి.కె., రోశయ్యలు మంచి సన్నిహిత మిత్రులుగా చివరి వరకూ కొనసాగారు.
ఎ.జి.కె. ఎందరో కవుల్ని, గాయకులను, కళాకారులను ప్రభావితం చేశారు. కొండవీటి వెంకటకవి, అత్తోటరత్న కవి, కొత్త సత్యనారాయణ, వాసిరెడ్డి వెంకట సుబ్బయ్య మొదలైన వారెందరో యీ పట్టికలో వున్నారు.
ఎ.జి.కె. సెక్యులర్ వివాహాలు చేయిస్తూ, ప్రతి వివాహంలో సరికొత్త ఉపన్యాసం చేసి, యువతను ప్రోత్సహించేవారు. నేను విన్న చివరి పెళ్ళి ఉపన్యాసం చీరాలలో,కీ॥శే॥రాజారెడ్డి కుమారుడు భాస్కర్ పెళ్ళి ఉపన్యాసం అద్భుతం. బహుశ అది రికార్డు అయివుంటే భాస్కర్ వద్ద (ఒంగోలు) లభించవచ్చు.
అధికారంలో వున్న వారిని ఎ.జి.కె.ఖాతరు చేసేవారు కాదు. గవర్నర్ గా వున్న చందూలాల్ త్రివేది ముఖ్యమంత్రిగా వున్న నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్యలు ఎ.జి.కె.నిశిత విమర్శలకు గురైనవారే.
అధికారంలో లేనప్పుడు ప్రజానాయకులను గౌరవించడం ఎ.జి.కె.ఆనవాయితీ. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి, ఆచార్యరంగా వంటివారిని అలానే సత్కరించారు.
రాజ్యాంగం 19వ సవరణపై ఎ.జి.కె.బాపట్ల ఉపన్యాసం రాజాజీని ముగ్ధుడిని చేసింది. ఆ విషయమై ఎ.జి.కె.ని శ్లాఘించారు.
నీలం సంజీవరెడ్డికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అక్రమ పద్ధతిలోగౌరవ డాస్టరేట్ ప్రదానం చేయగా, సెనెటర్ గా వున్న ఎన్.విజయరాజకుమార్ దావా వేశాడు. ఆ కేసును ఎ.జి.కె. చేబట్టి నెల్లూరులో వాదించారు. ముఖ్యమంత్రిపై అలా పోరాడిన వ్యక్తి ఎ.జి.కె.
గుండెపోటు వచ్చి మంచంలో వున్న ఎ.జి.కె. కీ॥శే॥ఎ.బి.షా నేనూ కలసి వెళ్ళి ఆరోగ్యం విషయమై అశ్రద్ధ వహించవద్దన్నాం, చికిత్సకు మద్రాసు వెళ్ళమన్నాం, సరేనన్నాడు. కాని మంచంలో వున్నా కేసుల విషయం సంప్రదించడం, విశ్రాంతి లేకుండా చేసిన వాతావరణంలో ఎ.జి.కె. అకాలమరణం చెందాడు. అది హ్యూమనిస్టు ఉద్యమానికి పెద్దలోటు, కోలుకోలేని దెబ్బ తగిలింది!