శ్రీరస్తు

అప్పకవీయము

కాకునూరి అప్పకవి విరచితము

రావు సాహేబు

శ్రీగిడుగు రామమూర్తిపంతులు, బి. ఏ., గారిచేతను

శ్రీమాన్ ఉత్పల వేంకటనరసింహాచార్యులుగారిచేతను

పరిష్కృతము

విద్వాన్ శ్రీ రావూరి దొరసామిశర్మ, (ఎం. ఏ., బి. ఓ, ఎల్.) గారి

సమీక్షతో కూడినది.

వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్

మదరాసు - 1

,

వారిచేఁ బ్రకటితము

All Rights Reserved.

ప్రకాశకవిజ్ఞప్తి

అప్పకవి రచించిన యీగ్రంథముపేరు 'ఆంధ్రశబ్దచింతామణి' అని యవతారికనుబట్టియు, ఆశ్వాసాంతగద్యలనుబట్టియుఁ దెలియుచున్నది. కాని 'అప్పకవీయ'మను నామమే దీనికిఁ బ్రసిద్ధము. కృతికర్త, యిది వ్యాకరణగ్రంథమని చెప్పేకొన్నను, ఇందు ఛందోవిషయములకే ఎక్కువ ప్రాధాన్య మీయఁబడినది. ఛందోగ్రంథముగానే దీనికి ప్రసిద్ధి కల్గినది. ఛందోవిషయపరిజ్ఞానమునకే దీనిని చదువుకుందురు. సాధారణముగా విశ్వవిద్యాలయములవారు తమపరీక్షలకు ఛందస్సునకు సంబంధించిన యిందలి తృతీయ, చతుర్థాశ్వాసములనే పాఠ్యములుగా నిర్ణయించుచుందురు.

అప్పకవీయమును పలువురు ముద్రించిరి. మేమును గతశతాబ్దమునందే తొలిసారి ముద్రించితిమి. పిదప 1910 సం. నుండియును ముద్రించుచునే యున్నాము. ఈ గ్రంథపరిష్కరణమునకు సుప్రసిద్ధవిద్వాంసులు శ్రీ పురాణం సూర్యనారాయణతీర్థులుగారు, శ్రీ ఉత్పల వేంకటనరసింహాచార్యులుగారు, శ్రీగిడుగ. వెంకట రామమూర్తిపంతులుగారు మున్నగువారు మిక్కిలి తోడ్పడిరి. శ్రీగిడుగువా రమూల్యమగు విమర్శనమును కూడ వ్రాసిరి. దానిని కూడ నీగ్రంథముతోఁ జేర్చి ముద్రించుచుంటిమి. 1961 వ సం. ముద్రణమును శ్రీ తిమ్మావజ్ఝల గోదండరామయ్యగారును, శ్రీ కం. అ. కృష్ణమాచార్యులుగారును సరిచూచిరి. దానికి శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు కూర్చిన 'అప్పకవీయ' విశేషప్రస్తావనము కలదు. అందు ఋ-రు ల యతి. ఉ-వు ల యతి మున్నగు విశేషములు, యవ్వనము, సింహ్వము మున్నగు శబ్దముల చర్చ కలదు. 6వ ముద్రణమును 1962 లో శ్రీ రావూరి దొరసామిశర్మగారు పరిష్కరించి విపులమగు సమీక్ష నొకదానిని వ్రాసిరి. శ్రీశర్మగారే 1966-వ సం. రపు ముద్రణములో కొన్ని క్రొత్త సవరణలను చేర్చియున్నారు.

అప్పకవీయము తత్కర్త రచించిన స్థితిలో నిప్పుడున్నట్లు కానరాదు. శ్రీ రేకము రామానుజసూరిగారు స్వతంత్రించి కొన్ని సవరణలు చేసినట్లు శ్రీగిడుగువారు తెలిపియున్నారు. ఇతర సంస్కర్తలును తమకుఁ దోఁచినట్లు సంస్కరించుచున్నట్లు తర్వాతి ముద్రణములనుబట్టి తెలియుచున్నది. లక్షణవిరుద్ధములగు విషయములు పెక్కు లీగ్రంథమునఁ గానవచ్చుట కిది కారణము కావచ్చును. అచ్చటచ్చట సవరణలు అధస్సూచికలో చూపఁబడినవి. ఇప్పటి ముద్రణమునందును అవశ్యకములగు కొన్ని సవరణలు చేయఁబడినవి.

ఈ గ్రంథమును పరిశీలించు విద్వాంసుల దృష్టి ఛందస్సువైపే మొగ్గియున్నట్లు ఇంతవరకు వెలువడియున్న విమర్శనలనుబట్టియు, వ్యాసములనుబట్టియుఁ దోఁచుచున్నది. వ్యాకరణాలంకారవిషయములను గూర్చియు విమర్శన మావశ్యకము. ఈగ్రంథమున 'తత్సమము' అనునది 'దానితో సమానము' అను అర్థమున ఉపయోగింపఁబడినది. (పుటలు 33, 37) పూర్ణార్ధబిందువులు దీర్ఘ, హ్రస్వబిందువులని (పు. 19) చెప్పఁబడినది. పరా, ఆజ్, అపి అను ఉపసర్గలు మూఁడును ఆంధ్రమున చేరవని (పు.146) అప్పకవి భావన. 'అపి' తోపాటు 'పరా, ఆజ్' లను చేర్చుట ఉచితము కాదు, 'సమాసము'నకు బదులు 'సమసనము' వాడఁబడినది. 'మినుపదోసె', 'ఇనుపపెనము', 'పాంసమేతరి' మున్నగువానిలోని 'ప'కారము ఔపవిభక్తిక మనుట (పు 321) వింతగా నున్నది. ఇట్టి వింకను గలవు. కావ్యస్వరూపవివరణమునఁ జెప్పిన విషయములు పెక్కు విరుద్ధముగాఁ గానవచ్చుచున్నవి. ఈ విషయమునసు పరిశీలన మావశ్యకము.

ఈఅష్టమముద్రణమున, వెనుకటిముద్రణములందలి లోపములు సవరింపఁబడినవి. ఇయ్యది లక్షణవేత్తలయొక్కయు, జిజ్ఞాసువులయొక్కయు ఆదరాభిమానములను పొందగలదని విశ్వసించుచున్నాము.

ప్రకాశకులు