అన్నమాచార్య చరిత్రము/పొత్తపినాడు
అనయము నయము సొంపారు క్రొవ్విరులు
గొనబైన చెంగల్వకొలఁకులు చుట్టి
పొదలు గొజ్జంగపూఁబొదలు క్రిక్కిఱిసి
వదలక వెలుఁగుకైవడి వెలుఁగొందు-
తెరువరుల్ త్రోవ నేతెంచి యేతెంచి
పొరిపొరిఁ గణ్పు గణ్పునఁ బాలుగారు-
రసదాళిచెఱకు తోరపుఁదుంట లంది
మిసిమైన ముంతమామిడిపండ్లు వైవ-
నా రసంబులచేత నచటి రాజనపుఁ
బైరులు ముక్కారుఁ బండు; నెయ్యెడలఁ
బాలనే పెరిగిన పసిఁడిటెంకాయ
పాళెల నెడనీరు పట్టి పెట్టినను
అనఁటిపండులు మేసి యలసి పై దప్పి-
గొనివచ్చి కోవెలల్ గ్రోలు నచ్చటను;
నరిమీఱు నా మేటినాటి నానాఁటి-
సిరు లింక నే మని చెప్పంగవచ్చు.