అన్నమాచార్య చరిత్రము/అన్నమయ్య విద్యలు
నింతయై యంతయై యీడేఱి బుద్ధి-
మంతుఁడై పంచసమంబు లైనంత
నియతిమై గురుఁ డుపనీతుఁ గావించి
నయవేది నధ్యనంబు సేయించె;
నన్నమాచార్యున కహినాయకాద్రి
వెన్నుని వరముచే విద్యలన్నియును
నమితంబులగుచు జిహ్వరంగసీమ
తముఁదామె సొచ్చి నర్తన మాడఁదొడఁగె;-
నా పిన్న ప్రాయంబునందు నా మేటి
యేపారఁ దనమది కిచ్చయైనట్లు
ఆడినమాటెల్ల నమృతకావ్యముగ
పాడిన పాటెల్లఁ బరమగానముగ
తన కవిత్వమునకుఁ దన గానమునకుఁ
గనుఁగొని సకల లోకములుఁ గీర్తింప
వేంకటపతిమీఁద వింతవింతలుగ
సంకీర్తనంబులు సవరించు నిచ్చ
అసమాన నిజరేఖ యాత్మఁ గీలించి
వసుధ నటించు సంవర్తుభావమున.