అధ్యాయము - ౬
భాగవతము - ప్రధమ స్కంధము | |||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
వ.
ఇట్లు నారదు జన్మకర్మంబులు విని క్రమ్మఱ వ్యాసుం డిట్లనియ 111
మ.
విను మా భిక్షులు నీకు నిట్లు కరుణ విజ్ఞానముం జెప్పి పో
యిన బాల్యంబున వృద్ధభావమున నీ కీరీతి సంచారముల్
చనె నీకిప్పుడు పూర్వకల్పమతి యే జాడం బ్రదీపించెఁ ద
త్తనువుం బాసిన చంద మెట్లు చెపుమా దాసీసుతత్త్వంబుతోన్. 112
వ.
అని యిట్లు వ్యాసుండడిగిన నారదుం డిట్లనియె. దాసీపుత్రుండ
నైన యేను భిక్షుల వలన హరివిజ్ఞానంబు గలిగియున్నంత. 113
సీ.
మమ్మునేలిన వారి మందిరంబునఁగల పనులెల్లఁ గ్రమమున భక్తిఁ జేసి
తన పరాధీనతఁ దలఁపదు సొలసితి నలసితి నాకొంటి ననుచు వచ్చు
మాపును రేపును మాతల్లి మోహంబు సొంపర ముద్దాడు చుంచుదువ్వు
దేహంబు నివురు మోదించుఁ గౌఁగిటఁజేర్చు నర్మిలితో నిట్లు నన్ను మనుప
ఆ.
నేను విడిచిపోక యింట నుండితినయ్య మోహిఁగాక యెఱుక మోసపోక
మాఱుచింతలేక మౌనినై యేనేండ్ల వాఁడనగుచుఁ గొన్ని వాసరములు. 114
వ.
అంత 115
క.
సదనము వెలువడి తెరువునఁ
జెదరక మాతల్లి రాత్రిఁ జీఁకటి వేళన్
మొదవుం బిదుకఁగ నొకఫణి
పదభాగముఁ గఱచెఁ ద్రొక్కఁబడి మునినాథా! 116
క.
నీలాయుత భోగఫణా
వ్యాళానల విషమహోగ్ర వహ్నిజ్వాలా
మాలావినిపాతితయై
వ్రాలెన్ ననుఁగన్నతల్లి వసుమతిమీఁదన్. 117
ఉ.
తల్లి ధరిత్రిపై నొఱిగి తల్లడ పాటునుజెంది చిత్తమున్
బల్లటిలంగఁ బ్రాణములు వాసినఁ జూచి కలంగ కేను నా
యుల్లములోన మోహరుచినొందక సంగము వాసె మేలు రా
జిల్లె నటంచు విష్ణుపదచింత యొనర్పఁగ బుద్ధిసేయుచున్. 118
వ.
ఉత్తరాభిముఖుండనై యేను వెడలి, జనపదంబులును పురంబులును బట్టణంబులను
గ్రామంబులను పల్లెలును మందలును మహోద్యానంబులును కిరాత పుళింద నివాసంబులును
చిత్రధాతు విచిత్రితంబులైన పర్వతంబులును సమద కరికరవిదళిత శాఖలుగల
శాఖులును, నివారిత పథికజన శ్రమాతిరేకంబులైన తటాకంబులును, బహువిధ విహంగ
నినద మనోహరంబులై వికచారవింద మకరంద పాన పరవశ పరిభ్రమ ద్భ్మృమర
సుందరంబులైన సరోవరంబులును, దాఁటి చనుచు క్షుత్పిపాసా సమేతుండనై నదీహ్రదంబునఁ
క్రుంకులిడి శుచినై నీరుద్రావి గతశ్రముండనై. 119
క.
సాలావృక కపి భల్లుక
కోలేభ లులాయ శల్య ఘూక శరభ శా
ర్దూల శశ గవయ ఖడ్గ
వ్యాళాజగరాది భయద వనమధ్యమునన్. 120
వ.
దుస్తరంబైన నల వేణు కీచక గుల్మ లతా గహ్వరంబుల పొంత నొక్క రావి
మ్రాను దగ్గఱఁ గూర్చుండి యే విన్నచందంబున నాహృదయగతుం బరమాత్మ
స్వరూపు హరిం జింతించితి. 121
శా.
ఆనందాశ్రులు గన్నుల న్వెడల రోమాంచంబుతోఁ దత్పద
ధ్యానారూఢుఁడ నైన నాతలఁపులో నద్దేవుఁడుం దోఁచె నే
నానందాబ్ధి గతుండనై యెఱుఁగలే నైతిన్ నను న్నీశ్వరున్
నానా శోకహమైన యత్తనువు గాన నేరకట్లంతటన్. 122
వ.
లేచి నిలుచుండి క్రమ్మఱ నద్దేవుని దివ్యాకారంబుఁ జూడ నిచ్ఛించుచు హృదయంబున
నిలుపుకొని యాతురుంబోలె చూచియుం గానక, నిర్మనుష్యంబైన
వనంబునం జరియించుచున్న నను నుద్దేశించి వాగగోచరుండైన హరి గంభీర
మధురంబులైన వచనంబుల శోకంబుపశమింపం జేయు చందంబున నిట్లనియె. 123
ఉ.
యేల కుమార! శోషిలఁగ నీ జననంబున నన్నుఁ గానఁగాఁ
జాలవు నీవు కామముఖ షట్కము నిర్దళితంబుసేసి ని
ర్మూలిత కర్ములైన మునిముఖ్యులు గాని కుయోగి గానఁగాఁ
జాలఁడు నీదుకోర్కి కొనసాగుటకై నిజమూర్తిఁ జూపితిన్. 124
క.
నావలని కోర్కి యూరక
పోవదు విడిపించు దోషపుంజములను మ
త్సేవం బుట్టను వైళమ
భావింపఁగ నాదుభక్తి బాలక! వింటే. 125
క.
నాయందుఁ గలుగు నీ మది
వాయదు జన్మాంతరముల బాలక! నీ వీ
కాయంబు విడిచి మీఁదట
మా యనుమతిఁ బుట్టఁగలవు మద్భక్తుఁడవై. 126
మ.
విను మీ సృష్టి లయంబు నొంది యుగముల్ వెయ్యైన కాలంబు యా
మినియై పోయెడిఁ బోవఁగాఁ గలుగుఁ జూమీఁదం బునః సృష్టి యం
దు నిరూఢ స్మృతితోడఁ బుట్టెదవు నిర్దోషుండవై నాకృపన్
ఘనతంజెందెదు శుద్ధసాత్వికులలో గణ్యండవై యర్భకా! 127
వ.
అని యి ట్లాకాశంబు మూర్తియు, ఋగ్వేదాదికంబు నిశ్వాసంబునుగా నొప్పి
సర్వ నియామకంబైన మహాభూతంబు వలికి యూరకున్న, నేనును మస్తకంబు
వంచి మ్రొక్కి, తత్కరుణకు సంతసించి, మదము దిగనాడి, మత్సరంబు విడిచి,
కామంబు జయించి, క్రోధంబు వర్జించి, లోభమోహంబులు వెడలనడచి, సిగ్గు
విడిచి, యనంతనామంబులు పఠియింపుచుఁ బరమభద్రంబులైన తచ్చరిత్రంబులఁ
జింతింపుచు, నిరంతర సంతుష్టుండనై (కృష్ణునిం బుద్ధి నిలిపి నిర్మలాంతఃకరణంబు
తోడ విషయ విరక్తుండనై) కాలమున కెదురుచూచుచు భూమిం దిరుగుచునుండ
నంతఁ గొంతకాలంబునకు మెఱము మెఱసిన తెఱంగున, మృత్యువు దోఁచినం
బంచభూతమయంబై గర్మస్వరూపంబైన పూర్వదేహంబు విడిచి, హరికృపా వశంబున
శుద్ధసత్త్వమయంబైన భాగవత దేహంబు సొచ్చితిని. అంతం ద్రైలోక్యంబు
సంహరించి ప్రళయకాల పయోరాశి మధ్యంబున శయనించు నారాయణమూర్తియందు
నిదురవోవ నిచ్చగించు బ్రహ్మ నిశ్వాసంబు వెంట నతని లోపలం బ్రవేశించితిని.
అంత సహస్రయుగ పరిమితంబైన కాలంబు చనిన లేచి లోకంబులు సృజియింప
నుద్యోగించు బ్రహ్మ ప్రాణంబులవలన మరీచి ముఖ్యులగు మునులు, నేనును జనియించితిమి.
అందు నఖండిత బ్రహ్మచరుండనై యేను మూఁడులోకంబుల బహిరంతరంబులందు
మహావిష్ణుని యనుగ్రహంబున నడ్డంబులేక యీశ్వరదత్తయై బ్రహ్మాభివ్యంజకంబులైన
సప్తస్వరంబులు దనయంతన మ్రోయుచున్న యీ వీణాలాపరతింజేసి నారాయణ కథాగానంబు
సేయుచుఁ జరియింపుచుండుదు. 128
ఆ.
తీర్థపాదుఁడైన దేవుండు విష్ణుండు
దనచరిత్ర మేను దవిలి పాడఁ
జీరఁబడ్డవాని చెలువున నేతెంచి
ఘనుఁడు నా మనమునఁ గానవచ్చు. 129
క.
విను మీ సంసారంబను
వననిధిలో మునిఁగి కర్మ వాంఛలచే వే
దనఁ బొందెడువానికి వి
ష్ణుని గుణ వర్ణనము తెప్పసుమ్ము మునీంద్రా! 130
చ.
యమ నియమాది యోగముల నాత్మ నియంత్రిత మయ్యుఁ గామరో
షములఁ బ్రచోదితంబ యగు శాంతి వహింపదు విష్ణుసేవచేఁ
గ్రమమున శాంతిఁ గైకొనినకైవడి నాదుశరీర జన్మక
ర్మముల రహస్యమెల్ల మునిమండన! చెప్పితి నీవు గోరినన్. 131
వ.
అని యిట్లు భగవంతుండగు నారదుండు వ్యాసమునీంద్రుని వీడ్కొని వీణ వాయింపుచు
యదృచ్ఛా మార్గంబునం జనియె నని సూతుండిట్లనియె. 132
క.
వాయించు వీణ నెప్పుడు
మ్రోయించు ముకుంద గీతములు జగములకున్
జేయించుఁ జెవులపండువు
మాయించు నఘాళి నిట్టి మతి మఱి గలఁడే! 133