షష్ట భాగం

ఇంకో చక్రవర్తి

“సకల ధరాతల ధురంధర భుజాస్కంధా, ఆది వరాహ, చతుస్సముద్ర ముద్రిత మహీమండలాఖండలా!” అని వందిమాగధులు పొగడుతూ ఉండగా హారీతీపుత్ర పులమావి ముసికనగరముందు ఆంధ్రచక్రవర్తిగా రెండవసారి సింహాసనం అధివసించారు.

మొదటిసారి పులమావి ధాన్యకటకస్థుడైన ఆంధ్రచక్రవర్తికి సామంతుడుగా మాత్రం సింహాసనం ఎక్కాడు. యజ్ఞశ్రీ ప్రజ్ఞా, శక్తీగల చక్రవర్తి. ఆయనధాటికి తాళలేక మహా సామంతులూ, సామంతులూ పాదాలకడ శిరస్సులు ఆనించి, తమ భక్తిని వెల్లడించారు. యజ్ఞశ్రీ యశశ్శరీరి కాగానే అనేక సామంతులహృదయాల్లో మళ్ళీ ఆశలుద్భవించాయి. వైజయంతి వారు, ముసికనగరం వారు, మాళవులు, భరుకచ్చులు, అందరూ ఎవరికి వారు చక్రవర్తులు కావాలని ఉవ్విళ్ళూరుతున్నారు.

అప్పటినుండి పులమావి తగిన సన్నాహాలు చేస్తూ సైన్యాలు కూర్చుకుంటున్నాడు. భరుకచ్చం వారికడ తురంగాలు వేయి కొన్నాడు. ఆయుధాలను సమకూర్చ సాగినాడు. తనరాజ్యంలో బంగారం దొరుకుతుంది. దానిలో సగం ధాన్యకటకానికి పంపవలసినది. “ఈసంవత్సరం ఇంతే దొరికిం”దని “ఈ ఏడు వానలవల్ల బంగారుగనులలో పని బాగా జరుగలే”దనీ చక్రవర్తికి పంపవలసిన బంగారం నానాటికి తగ్గించివేశాడు. బంగారంతో అతని ధనాగారాలు నిండి పోతున్నవి. దానిని వెదజల్లడంవల్ల దక్షిణ దేశాలనుండి విరివిగా యుద్ధవీరులు వచ్చి తన సైన్యాలలో చేరుతున్నారు. దక్షిణాటవుల నుండి వేనకువేలు ఏనుగులపట్టి తెప్పించి వానికి శిక్షణ ఇస్తున్నాడు.

ఈ విషయాలన్నీ శాంతిమూలునికి వేగువస్తున్నాయి. బ్రహ్మదత్తునితో తాను ముసికనగరం వెళ్ళినప్పుడు ఆ యువకప్రభువు “మామయ్యగారూ!” అంటూ సంబోధిస్తూ తాను కట్టవలసిన కప్పం యావత్తూ కట్టివేస్తాడు. అట్టి పులమావి చక్రవార్తి కావలెనని ఆలోచిస్తున్నాడా? ఏమి పొగరు అని శాంతిమూలుడు తనలో తాను ఆలోచించుకొంటూ చిరునవ్వు నవ్వుకొన్నాడు.

బ్రహ్మదత్తుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్న శాంతిమూల మహారాజుకు ఆ అడవి ప్రభువు సురక్షితంగా ఓడతో పూంగీప్రోలు వచ్చి చేరాడని వార్త వచ్చింది. ఆయన ఆనందానికి మేరలేదు. దేశం అంతా ఉత్సవాలు చేయవలసిందని తన ఆజ్ఞగా వార్తలు పంపినాడు. బ్రహ్మదత్తుడంటే ఆదేశాలలోని ప్రజలందరికి దగని ప్రేమ, గౌరవమూ. అలాంటి బ్రహ్మదత్త ప్రభువు సముద్రంలో మాయమై పోయాడన్నప్పుడు దేశం అంతా గగ్గోలు పెట్టింది. నేడు ప్రజల సంతోషానికి మేరలేదు.

బ్రహ్మదత్తుని ఓడ రేవుకువచ్చి ఆగగానే రేవులోని నావికులందరూ గుర్తించి జయ జయ ధ్వానాలు చేసిరి, వివిధ నౌకానాయకులు, నావికులు నౌక వైపుకు పరుగులిడినారు. చిన్న చిన్న పడవలలో అనేకులు నౌకచుట్టూ మూగినారు. నౌకపై పూంగీయజెండా, పసుపుపచ్చని కేతనమూ ఎగురుతూ ఉండడంవల్ల శుభము ఊహించి ఒక నావికుడు లేడిలా అతివేగంగా పరుగెత్తుకుంటూ కోటగోపురం కడకు వచ్చి అక్కడి రక్షకులతో శుభవర్తమానము తెచ్చానని చెప్పి, శరవేగంగా రాజభవన మహాకోట్య గోపురం దగ్గరకుపోయి, అక్కడి అంగరక్షకులతో చెప్పి, సభామందిరం ప్రక్కనున్న అంతఃపుర ద్వారంకడ ఆగి మహారాజునకు శుభవర్తమానం తెచ్చినానని తెలిపినాడు.

ఒక ద్వారపాలకుడు ఈ నావికుని వెంటబెట్టుకొని లోనికిగొనిపోయి, ఒక మందిరంలో నిలబెట్టి ఒక ప్రతీహారిచే మహారాజుగారికి శుభవర్తమానం విషయం మనవి చేయమని తెలిపినాడు. పూంగీయ స్కందశ్రీమహా రాజునకు వర్తమాన మందినది. వెంటనే వారు ఈ నావికుడున్న మందిరంలోనికి వచ్చినారు. నావికుడు సాష్టాంగపడి నమస్కరించి మహారాజుచే అనుజ్ఞాతుడై లేచి, “మహాప్రభూ! తప్పిపోయినదనుకున్న తమ నౌక వచ్చింది. ఆ ఓడ పసుపుపచ్చని జెండా ఎగురవేస్తూ వచ్చింది” అని మనవి చేసినాడు.

స్కందశ్రీ మహారాజునకు పట్టరాని సంతోషం వచ్చింది. తన మెళ్లో హారమూ, తన మొలలోని ఛురియా ఆ నావికునకు బహుమానమిస్తూ, అంతఃపుర పాలకుని రప్పించి ఆ నావికునకు వేయిపణాలు ఇప్పించినారు. మహారాజు వెంటనే తన కొమరుడు స్కందసాగరాయనునికీ శుభవార్త పంపినారు. స్కంద సాగరాయనకప్రభువు వెంటనే మహారాజు మందిరానకు రాగా వారిరువురూ చెరి ఒక రథంమీదా బయలుదేరి, మంత్రులు, సేనాపతులు వెంటరాగా తొందర తొందరగా ఓడరేవునకు వచ్చి చేరినారు. బ్రహ్మదత్తప్రభువు అప్పుడే ఓడనుండి దిగి తన విడిదికీ వార్తపంపడంవల్ల అక్కడనుండి వచ్చి పాదాలకెరగిన తన మంత్రిని సేనాపతిని చేతులుపట్టి లేపి తన హృదయానికి గాఢంగా అదుముకొన్నాడు. ఆ సమయంలో పూంగీయస్కందశ్రీ మహారాజూ, యువరాజు స్కందసాగరాయనక ప్రభువూ రావడం చూచినాడు. వెంటనే వేగంగా ముందుకుపోయి తాను స్కందశ్రీ మహారాజుపాదాల కెరిగినాడు. ఆయన బ్రహ్మదత్తుని లేవదీస్తూ,

“ప్రభూ! మీరు మళ్ళీ కనబడతారనుకోలేదు” అంటూ బ్రహ్మదత్తుని హృదయానికి గాఢంగా అదుముకొన్నారు. ఆ వెనుక స్కందసాగర ప్రభువూ స్కందవిశాఖాయనకప్రభువూ గాఢంగా కౌగలించుకొన్నారు.

2

శాతవాహన రథస్వామి అయిన పులమావి తానే చక్రవర్తి అని చెప్పుకొన్నా, పొగడించుకొన్నా శాంతిమూల మహారాజుకు అంతకోపం వచ్చి ఉండేదికాదు. కాని అతడు సార్వభౌమ సింహాసనం ఎక్కాడు అని తెలిసిన మర్నాడు నానాదేశ ప్రభువులకూ కప్పము కట్టవలసినదని శ్రీముఖాలు అందినవి. శ్రీ పులమావి శాతవాహనుడే సార్వభౌముడట. తన తండ్రి తాతలకుటుంబమే సరియైన చక్రవర్తి కుటుంబమట. యజ్ఞశ్రీ తన తండ్రిని మోసంచేసి సింహాసనం ఎక్కినాడట. అందుకని నేడు తాను సరియైన చక్రవర్తి అవడంవల్ల సింహాసనం ఎక్కినాడట. కాబట్టి సామంతులందరు ముసిక నగరం వచ్చి చక్రవర్తి పాదాలకడ సాష్టాంగపడి తమ తమ కప్పాలను అర్పించవలసి ఉంటుందని ఆ శ్రీముఖంలో ఉన్నది.

శాంతిమూలుని కోపం మరీ మిన్ను ముట్టడానికి ఇంకొక కారణం కూడా ఉంది. పులమావి చక్రవర్తి ఒకసారి విజయపురంలో ఇక్ష్వాకు శాంతిమూలుని తనయ శాంతిశ్రీ రాకుమారిని చూచినారట. ఆ బాలిక తమకు తగిన పట్టమహిషి అని సార్వభౌముల దివ్య చిత్తానికి తోచినదట కాబట్టి ఇక్ష్వాకు శాంతిమూల ప్రభువు చక్రవర్తికి మామగారయ్యే అదృష్టాన్ని పొగడుకొంటూ తన కొమరితను కొనివచ్చి చక్రవర్తికి అర్పించవలసినది. ఇది సార్వభౌముల ఆజ్ఞ అని శాంతిమూల మహారాజునకు వచ్చిన శ్రీముఖంలో ఉంది.

శాంతహృదయుడు నిర్వికారుడు, అతిరథశ్రేష్ఠుడు అగు శ్రీ శాంతిమూలునకు రాజలేఖకుడు ఆ శ్రీముఖం చదివి వినిపించడంతో ఒక్కసారి పాలపొంగులా కోపం వచ్చింది. ఇంతలో మహాసభాప్రాంగణంలో శుభ కేతనధారియై పూంగీప్రోలునుండి వార్తాహరుడు వచ్చి దర్శనానికి అనుమతి వేడుకొంటున్నాడు అని ప్రతీహారి మనవి చేసినాడు.

మహారాజుకు కోపమంతా ఒక్కసారి చల్లారిపోయింది. అతి సంతోషంతో వెంటనే కొనిరావలసిందని ఆజ్ఞ యిచ్చినారు. ఆ వార్తాహరుడు వచ్చి మహారాజు అధివసించి ఉన్న సింహాసనం ఎదుట మోకరించి, లేచి, చేతులు జోడించి, “జయము జయము సార్వభౌములకు శ్రీ శ్రీ ధనకమహారాజు మహాసేనాపతి, మహాతలవరి, మహాదండనాయక, అడవిస్కంద విశాఖాయనక బ్రహ్మదత్తప్రభువులు తమకు వారి నమస్కృతులు సమర్పించు కొంటున్నారు. వారు సువర్ణదీవి దర్శించి, అక్కడ మహారాజులకు అతిథియై, ఆ ద్వీపంలోని శ్రీ తధాగత చైత్యాలను దర్శించి, నౌకను సురక్షితంగా నడుపుకొంటూ ఈ ఉదయమే పూంగీప్రోలు చేరినారు. అక్కడ మా ప్రభువులు సురక్షితంగా చేరినందుకు పూంగీయ మహారాజులు స్కందశ్రీ ప్రభువు సలుపదలచిన మూడుదినాల ఉత్సవాలకూ ఆగి, ఆ వెంటనే హుటాహుటి బయలుదేరివచ్చి తమ పాదాల సన్నిధిని ఉందుము” అని మనవి చేయు మన్నారు. జయము! జయము! అని మనవి చేసివాడు. శాంతిమూల మహారాజు ఆ వార్తాహరునకు తమ మెడలోని హారము బహుమతిగా ఇచ్చిరి.

బ్రహ్మదత్తుడు సురక్షితంగా తిరిగివచ్చినందుకు దేశం అంతటా ఉత్సవాలు చేయ రాజాజ్ఞలు వెళ్ళినవి. ప్రజలకు బ్రహ్మదత్తుడంటే అమితానురాగం. ఆ యువక ప్రభువు ప్రజలకై ఎన్నియో మహత్తర కార్యములు చేయించినాడు. చిన్న చిన్న ఏరులకు అడ్డగట్లు వేయించి, పెద్దపెద్ద చెరువులు నిర్మించాడు. గ్రామాదులలో మంచి నూతులు తవ్వించి తీయనిజలాలు సర్వకాలాలు అందరికీ అందునట్లు చేసినాడు. గ్రామగ్రామానికీ చక్కని రాజబాటలు నిర్మించినాడు. అనేక గ్రామాలలో సత్రములు, దారిపొడుగునా చలివేంద్రాలు, వైద్యశాలలు నిర్మించాడు. వైద్యులకు రాజస్వము లేర్పాటుచేసి హిమాలయ ఓషధులు అందునట్లు చూచినాడు. కర్షకులకు మంచివిత్తనాలు అందుబాటు చేయించి, కరవు ఎప్పుడన్నావస్తే ధాన్యాదులు బ్రజలకు విరివిగా పంచిపెట్టేవాడు. బ్రహ్మదత్తుడు తన సామంతరాజ్యంలోనూ, ఇక్ష్వాకు మహారాజ్యంలోనూ ఉన్న వేలకొలది గ్రామాలన్నీ తిరిగి ప్రజల క్షేమాదులు కనుక్కుంటూ ఉండేవారు. దేశం అంతటా విద్యాశ్రమాలు నిండి పోయాయి. ప్రతి గ్రామంలోను చిన్న బిడ్డలకు విద్యగరిపే బడులు ఏర్పాటయ్యాయి. ఏ వార్త వచ్చినా గ్రామభేరీ నివాదవార్తా విధానంవల్ల ఉదయం ప్రారంభిస్తే, సాయంకాలానికి మూలమూలలగ్రామాలకు కూడా ఆ వార్త ప్రాకిపోతుంది. బ్రహ్మదత్త ప్రభువు క్షేమంగా పూంగీప్రోలు చేరారన్న వార్త అంతట అల్లుకోగానే దేశం అంతా సంతోషంతో పొంగిపోయింది. మహారాజు దేశంలోని బాలబాలికలకు పళ్ళూ, బట్టలూ పంచి ఇవ్వవలసిందని మంత్రులకు ఆజ్ఞనిచ్చారు. దేశం అంతా మూడురోజులు మహోత్సవాలు చేసుకున్నారు.

బ్రహ్మదత్తప్రభువు విజయపుర పర్వతగోపురం దగ్గిరకు వస్తున్నాడని ప్రభువునకు వార్తాహరులు చెప్పినారు. ఆ ప్రభువును ఎదుర్కొనేందుకు మహారాజు స్వయంగా యువరాజుతో, మంత్రులతో, సేనాపతులతో బయలు దేరినాడు. అప్పుడు శాంతిశ్రీ రాజకుమారి అంతఃపురంనుంచి తన గురువును ఎదుర్కొనేందుకు తండ్రిగారి అనుమతి వేడెను. మహారాజు సంతోషంతో ఒప్పుకొన్నారు. రాజకుమారి మూర్తి పొందిన సౌందర్యమువలె రథమును అధివసించి, చెలులు కొలువ తండ్రిగారి రాజభవనద్వారమువద్ద కలుసుకొన్నది.

భిక్షువులు, పండితులు, రథికులూ కొలువ మహారాజు శుభవాద్య పురస్కృతుడై తూరుపు గోపురంవద్దకు వెళ్ళినారు. ఆ పర్వతగోపురద్వారం ప్రజలతో నిండిపోయింది. వారందరూ ఆ గోపురద్వారం దాటి ఆ పర్వతరాజ పథము వెంటనే ఒక అర్థగోరుతదూరం ముందుకు సాగిపోయినారు. ఇంతలో ఎట్టఎదుట ఆ మహారాజపథముపై ఒక మహా సైన్యము వస్తూ కనబడినది. శాంతిమూలమహారాజు తన వారిని ఆగుడని కోరగనే ఆ ప్రదేశం అంతా గుట్టలు, లోయలు, చరియలు, ఘనశిలలు, వృక్షాలు ప్రజలతో నిండిపోయాయి.

ఇంతలో బ్రహ్మదత్తుడు, మహారాజు పూంగీయ స్కందశ్రీ ప్రభువు, పూంగీయ యువరాజు స్కందసాగరాయనక ప్రభువుతో రథములపై వస్తూ ఏనుగు నధివసించియున్న శాంతిమూలమహారాజుకు కనిపించినాడు.

3

ఇక్ష్వాకు శాంతిశ్రీరాకుమారి, పూంగీయ శాంతశ్రీ రాకుమారికను, పల్లవ రాణి అయిన హారీతి బ్రహ్మశ్రీ హమ్మశ్రీదేవి కొమరితలు బాపిశ్రీ, షష్ఠశ్రీ రాకుమారికలను, అన్నగారయిన వీరపురుషదత్తుని, పూంగీయ ద్వితీయరాజ్ఞీ కుమార విష్ణుశ్రీ రాజకుమారుని బ్రహ్మదత్తప్రభువు వచ్చిన దినానే విందుకు పిలిచింది. రాజకుమారి ఇంతవరకు తన భవనానికి బంధువులను విందుకు పిలవడం ఎరగనే ఎరగదు. ఆమె పేరిటనే తల్లిదండ్రులే చుట్టాలను విందులకు పిలుస్తూ ఉండడమూ, తాముకూడా ఆ విందులకు రావడమూ జరిగేది. అలా జరిగిన విందు సమయాల్లో ఇక్ష్వాకురాజకుమారి అంటీముట్టనట్లు ఊరకుండేది. ఎవరన్నా పలకరిస్తే ప్రతివచనం ఇచ్చేది లేకపోతే తన విశాలమైన కళ్ళల్లో శైశవ దృక్కులు వికాసిస్తూ ఉండగా చూస్తూ కూర్చుండేది. వచ్చిన చుట్టాలు మహారాజుతో మహారాణితో మాట్లాడి, తమలో తాము వేళాకోళాలాడి, చెలికత్తెల నాట్యాదికాలు, ప్రదర్శనాలు చూచి, తాము ఆనందించి మహారాజుకూ మహారాణికీ నమస్కరించి వెళ్ళిపోయేవారు.

వీణాగానం, నృత్యప్రదర్శనం అయిన తర్వాత అందరూ భోజనాలకు లేచినారు. అందరూ మేనత్త మేనమామ బిడ్డలే. భోజనగృహంలో అందరూ స్వర్ణపీఠికలపై కూర్చున్నారు. బంగారు కంచాలలో, బంగారు గిన్నెలలో అనేక విధాలైన శాకాలు, పచ్చళ్ళు, పప్పులు, పులుసులు, చిత్రాన్నాలు, ఆవూపాలు వడ్డనచేయు బాలికలు వడ్డించినారు.

వీరపురుషదత్తుడు పూంగీయ శాంతశ్రీని ఆ ఉదయం చూచినప్పటి నుండియు తన మనస్సు ఆనందపూర్ణముకాగా మాటలాడలేకపోయినాడు. ఆమె వైపు ప్రణయ పూర్ణములైన చూపులను పరసి, అంతలో మరల్చుకొన్నాడు. పూంగీయశాంతశ్రీ ఏమీ మాటలాడలేదు. దివ్య రేఖాసమన్వితుడు, బంగారుఛాయచే జగత్ప్రసిద్ధ సుందరాకారుడైన, తన ప్రియుని చూచి, అతని చూపులలోని బాధ నర్థము చేసికొన్నది. ఆమె కన్నుల నీరు తిరిగినది. ఇద్దరి హృదయాలూ పూర్ణమై యుండుటచేత ఇద్దరు ఈ సాయంకాలం శాంతిశ్రీ భవనానికి వచ్చినా పలుకరించుకోలేదు. ఇదంతా బాపిశ్రీ అర్థం చేసుకొంది. తన అక్క రాజకుమారుని ఎంత ప్రేమిస్తోందో, తానూ అంతే ప్రేమిస్తోంది. అయినా తానూ శాంతా జీవికాజీవు లవడంచేత ఒకరిమీద ఒకరికి ఓర్వలేనితనంలేదు.

వీరపురుషదత్తుడు బాపిశ్రీని గాఢంగా ప్రేమిస్తున్నాడు. ఆమెలో పూంగీయశాంతను చూస్తాడు. ఇంతలేని బాపిశ్రీ అతనికి కనపడదు. బాపిశ్రీ లేని శాంత అతనికి తోచదు.

ఇక్ష్వాకు రాజకుమారిక ప్రేమ అంటే ఏమిటి అని ప్రశ్నించుకొంటుంది. స్త్రీ పురుషుల కలయిక ఒక యజ్ఞంవంటి ధర్మకార్యమని ఆమె ఉద్దేశం. సంతానం కనడం భూమిలోనుంచి మొక్కలు ఉద్భవించడం వంటిది. గ్రంథాలలో తెలుపు ప్రేమానుభవం ఏలాంటిదో ఆమెకు అర్థం కాలేదు. తన మేనయత్తల కొమరితలు ఇద్దరూ తన అన్నగిరియందు తమకున్న ప్రేమను వర్ణించి చెప్పుకొన్నారు. ఈనాడు తనలో ఏదో వర్ణింపరాని ఉత్సాహం కలిగింది. ఏదో ఒక విచిత్ర సంతోషం కలిగింది. తానే తన ఉత్సాహానికి ఆశ్చర్యం పొందింది. తాను ఎందుకు బ్రహ్మదత్తుని ఎదుర్కొనడానికి వెడతానన్నదో, తానెందుకు పాదచారిణియై బ్రహ్మదత్తుని కడకు నడిచి వెళ్ళిందో? అలా వెళ్ళడంలో ఏదో అనందం అనుభవించింది. ఎందుకు తానా పనులుచేసిందో? ఎందుకు తన వదినగారిని భోజనానికి పిలిచిందో?

అన్నగారు మేనత్త కొమరిత శాంతను వనదేవతగా వరించక పోవడంవల్ల ఆమెకు కోపం వచ్చి పూంగీప్రోలు వెళ్ళిపోయిందనీ, తానీఏటి వసంతోత్సవాలకు పూంగీరాజ కుటుంబాన్ని ఆహ్వానించడానికి పూంగీప్రోలు వెళ్లు తున్నాననీ బ్రహ్మదత్తప్రభువు వెళ్ళిపోతూ తెలపడంవల్ల ఆమె విన్నది. కోపమంటే? ఒక మనుష్యునికి కోపం ఎందుకు? నేడు వీరంతా తన ఇంటికి విందుకు వచ్చినప్పుడు పూర్వస్నేహముతో మెలిగి సంతోషంగా ఉంటారని ఆమె కేలా తోచినదో? జరుపవలసిన తంతులన్నియు అంతఃపుర పాలకురాలు జరుపుతున్నది. భోజనాలయి తాంబూలాలు వేసుకొన్నారు. విష్ణుశ్రీకుమారుడు వెళ్ళిపోయినాడు. అప్పుడు ఇక్ష్వాకు శాంతిశ్రీ కుమారి తన అన్నగారి చేతికి మల్లెపూలదండలు ఇచ్చి “అన్నగారూ! ఇది వదినగారల ముగ్గురితలలలోనూ ముడవండి” అన్నది. ఆమె మోములో, కన్నులలో హాస్య కాంతిలేదు. శాంతికాంతులు మాత్రము వికసిల్లి ఉన్నవి.

4

పులమావి వసంతోత్సవదినాన తన సర్వసైన్యాలను నడుపుకుంటూ వైజయంతిపురం వెళ్ళినాడు. వైజయంతి చూటుకుల శాతకర్ణులు పులమావి సైన్యాలతో వస్తాడని అనుకోలేదు. ప్రస్తుతము పులమావికి లోబడడమే ఉత్తమమనుకొని, చూటుకుల విష్ణుస్కంద మహారాజు, పులమావిని చక్రవర్తిగా ఆహ్వానించి కప్పములుగట్టి, యుద్ధయాత్రకు తనవంతు ఖర్చునిచ్చి, ఆయనకు వీడుకో లిచ్చెను.

పులమావి చక్రవర్తిగా ఆభిషేకించుకొన్నాడని వినగానే విజయశ్రీ శాతవాహన చక్రవర్తికి మిన్నుముట్టిన కోపం వచ్చింది. వెంటనే తన బావగారు ఇక్ష్వాకు శాంతిమూల మహారాజుకు "ఏమిటి కర్తవ్యం?” అని వార్త పంపినాడు. ఆ వెంటనే పులమావి కడనుండి విజయశ్రీ శాతవాహన చక్రవర్తికి శ్రీముఖం వచ్చింది. “నీకు రాజ్యార్హతలేదు. అన్యాయంగా యజ్ఞశ్రీ చక్రవర్తి అయినాడు. అయినా తన చక్రవర్తిత్వము తాను కాపాడుకోగలిగాడు. నువ్వు నీరుసుడవు, త్రాగుబోతువు. నీకు అంతఃపుర స్త్రీలను ఏలుకోవడం తెలుసును. నువ్వు మన్మథ సామ్రాజ్యానికి తగుదువు. దిగు సింహపీఠం! భక్తితోవచ్చి శ్రీశ్రీ హారీతిపుత్ర పులమావి శాతవాహనస్వామి పాదాలబడితే నిన్ను సామంతునిగా ఉండనిస్తారు. లేకపోతే నువ్వు రాజద్రోహివి అవుతావు.” ఈ విధంగా ఉంది ఆ శ్రీముఖం. విజయశ్రీ శాతవాహన చక్రవర్తి భయముచేతా, కోపంచేతా గజగజవణికిపోయినారు. ఆ శ్రీముఖాన్ని ఇత్తడి మందసంలో పెట్టి బంధించి, దానిని శాంతిమూల మహారాజుకు పంపినాడు.

ఇంతలో పులమావి వేయి ఏనుగులతో, ఇరవైవేల ఆశ్వికబలంతో, ఆరువేల రథాలతో, ఒక అక్షౌహిణి (లక్షా ఇరువదివేలు) కాల్బంతో బయలు దేరినాడని వార్త రాగానే విజయశ్రీ శాతవాహన చక్రవర్తికి గుండెల్లో రాయిపడింది. తన సేనాపతులకు సేనలన్నీ సిద్ధంచేయండని అజ్జలిచ్చినాడు. మహాభోజులకు, మహారథులకు, అభీరులకు పులమావిని ఎదుర్కొని బందీ చేయండని ఆజ్ఞలు పంపినాడు. తమ తమ సేనలతో ధాన్య కటకానికి రండని, మాఠరులకు, వాసిష్టులకు సాలంకాయనులకు, బృహత్పాలాయనులకు, ధనకులకు, పూంగీయులకు, బెళుకురాయనకులకు (చాళుక్యులకు), చూటుకులులకు, ఇక్ష్వాకులకు రాజాజ్ఞలు పంపినాడు. ఇంతలో వైజయంతీ శాతకర్ణులను ఓడించి పశ్చిమతీరాన్నే అభీరులపైకి పులమావి వెడుతున్నాడని వార్త వచ్చింది విజయశ్రీ చక్రవర్తికి.

శాతవాహనుల సైన్యాలు తప్ప ఇక ఏ సైన్యాలూ రాలేదు. విజయపురంలో ప్రతిసంవత్సరంకన్న ఈ ఏడు ఎక్కువ వైభవంగా వసంతోత్సవాలు జరుపుతున్నారు. అందుకని ఉత్సవాలు పూర్తికాగానే సైన్యాలతో వస్తున్నానని శాంతిమూలుడు చక్రవర్తికి వినతి పంపినాడు. విజయశ్రీ శాతవాహనునకు కోపం మిన్నుముట్టింది. తన రాజ్యానికి భంగం వచ్చే సమయంలో, తన బావమరదికి వసంతోత్సవాలా? అని కాలుగాలిన పిల్లిలా విజయచక్రవర్తి తిరగడం మొదలు పెట్టినాడు.

భరుకచ్చాధీశులైన అభీరులు రాజనీతిలో అపరచాణుక్యులు. వాళ్ళకు పులమావి భగవత్ప్రసాదితమైన ఆయుధంలా కనబడ్డాడు. విజయశ్రీని నిరసించి, పులమావే నిజమైన చక్రవర్తి అని వారు లోకానికి చాటినారు. అభీరపతి, చక్రవర్తి పులమావిని ఎదుర్కొని లోక సమ్మోహనకరమైన ఉత్సవాలు చేయించి తన సైన్యాలలో అర్ధాక్షౌహిణిని పులమావితో పంపినాడు. అభీర సైన్యాలూ పులమావి సైన్యాలూ కలిసి మాళవదేశం మీదకు దండెత్తి వెళ్ళినవి. మాళవులు కొంచెం బలంగా ఉన్నారు కాబట్టి, పులమావిని ఎదుర్కొనడమా లేకపోతే, సాయం అవలంబించడమా? ఏలా సమకూర్చినాడో సైన్యాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. పులమావితో తుదకు సంధి కంగీకరించినారు.

పులమావి ఉప్పొంగిపోయినాడు. తనకు రాజకుమారి రుద్రభట్టారికను రాణిగా ఈయవలసిందని మాళవరుద్రసేన మహారాజుకు పులమావి రాయబారిని పంపినాడు. రుద్రసేనునకు రుద్రభట్టారికను పులమావికి ఉద్వాహం చేయడం ఇష్టంలేదు. ఈ విషయంలో ఆంధ్రచక్రవర్తికి త్వరలోనే వార్త పంపెదననిన్నీ, రుధ్రభట్టారికాకుమారి వసంతోత్సవాలకు శ్రీపర్వతస్థమైన విజయపురికి వెళ్ళి ఉన్నారనియు ఆమె అచ్చటనుండి రాగానే వివాహ విషయం నిశ్చయం చేసుకోవచ్చుననియు, మాళవపతి పులమావికి బదులు చెప్పి పంపెను.

పులమావి ఉజ్జయినినుండి బయలుదేరేవేళకు చైత్రమాసం మధ్యదినాలు. అప్పుడే వేసవికాలం ఆరంభించింది. రాత్రిళ్ళుమాత్రం కొంచెం చలివేస్తోంది. సాయంకాలాలు మత్తుగా ఉంటున్నాయి. విజయపరంపరచే పులమావిని నిజంగా వీరత్వం పొదివికొన్నది. అతని సైన్యాలు ఉత్తమ శిక్షణపొంది అతివేగంగా సునాయాసంగా ప్రయాణం చేస్తున్నవి. ఉజ్జయిని నుండి ములకదేవానికి పిడుగువలె వచ్చిపడ్డాయి.

ప్రతిష్ఠానగరంలో రాజప్రతినిధి యువరాజు చంద్రశ్రీ శాతవాహన మహారాజు ఇంకా వసంతోత్సవం జరుపుతున్నాడు. వేయిపూవులైనారు వేయి బాలికలు. తాను దివ్యవసంతుడు. ఆ వేయిబాలికలలలో కొంతమందిని ఒకనాడు గజరూపం వహింపుడని తాను వారిపై స్వారి వెడలినాడు. ఒక దినం కొందరు బాలికలు చిలుకరూపం వహిస్తే తాను మన్మథుడుగా ఊరేగినాడు.

5

చంద్రశ్రీ యువరాజు మన్మథుడుగా, మధుమాసాదిదేవుడు వసంతుడుగా ఇలా చిద్విలాసాలలో తేలిపోతూ ఉన్నాడు. ఒకదినం అనేక మనోహర రూపాలు కలిగినవీ, వివిధపుష్పాలంకృతులూ అయిన నదీ నౌకలలో విహారం బయలుదేరినాడు. హంసలవలె, శుకాలవలె, మొసళ్ళవలె మూర్తితాల్చిన ఆ నౌకలలో తన ప్రియాసహస్రంతో విహారం బయలుదేరినాడు. కొందరు బాలలు నాట్యం చేస్తున్నారు. కొందరు గాత్రాలతో పాడుతున్నారు. కొందరు వివిధ వాయిద్యాలు వాయిస్తున్నారు. కొందరు అర్ధనగ్నలై వివిధ విలాస భంగిమాలలో ఉన్నారు. నౌకలు గోదావరిలో సాగిపోతున్నాయి. ఇంతలో గోదావరి ఈవలావల గట్టుమీద వేలకువేలు ఆశ్వికులు పదాతులు తోచినారు. “పడవలు ఆపండి! ఏడీ చంద్రశ్రీ!” అన్న ఉరుములాంటి మాటలు వినబడ్డాయి. బాలికలంతా ఘొల్లుమన్నారు. ఆ సాయంకాలపు చిరు చీకట్లలో అనేకమంది బాలికలు కాగడాలుపట్టి ఉన్నవాళ్ళు “అమ్మయ్యో” అని కేకలు వేసి కాగడాలు నీళ్ళల్లో పారవేశారు. బాలలు కొందరు గజగజలాడుతూ అలా నిలుచుండిపోయినారు. తెడ్లువేసే బాలికలు తెడ్లువేయడం మానివేశారు. పడవలు నడిపే చుక్కాని బాలికలు మూర్చపోయారు. చుక్కానులు వదిలారు. లేదా భయంతో చుక్కానులు తమ ఇష్టం వచ్చినట్లు తిప్పినారు.

పడవలు ఒకదానికొకటి తగులుకున్నాయి. కొందరు బాలికలు పట్టుతప్పి నీళ్ళల్లో పడ్డారు. కొన్ని పడవలు జరిగిపోవడంవల్ల కొందరు బాలలు నీళ్ళుల్లో పడ్డారు. కొందరు ఉరకాలని నదిలో ఉరికినారు. గోలగోల నీళ్ళలోపడ్డవారు ఈదలేనివారు మునుకలు వేస్తున్నారు. వీళ్ళను రక్షించడానికి గట్టుమీదవారు ఏనుగులను దింపినారు. ఏనుగులు అనేకమంది బాలికలను తొండాలతో రక్షించి అందిస్తున్నాయి. ఈత వచ్చిన వీరభటులు, సేనాపతులు నీళ్లలోనికి ఉరికినారు. ఆశ్వికులు తమ అశ్వాల్ని ఉరికించినారు.

ఆ గడబిడ అంతా చల్లారి బాలికలను రక్షించడం, పడవలను ఒడ్డుకు పట్టించడం అంతా అయ్యేసరికి మూడుగడియలు పట్టింది. నలుగురు బాలికలు దొరకలేదు. దొరికినవారిలో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. తక్కిన వారందరూ సురక్షితంగా ఉన్నారు. కాని యువరాజు చంద్రశ్రీ జాడ ఎక్కడా కనుపించలేదు. వెంటనే పులమావి దిట్టరులైన అపసర్పులను, సేనాధికారులను గోదావరి తీరాన్నే పంపినాడు.

తెల్లవారి ఆంధ్రశాతవాహన చక్రవర్తులూ, యువరాజులూ కొలువుతీరే మహాసభలో పులమావి శాతవాహనుడు మహాసింహాసనంపై అధివసించి, తన మంత్రులు, చంద్రశ్రీ మంత్రులు, తన సేనాపతులు, కొందరు చంద్రశ్రీ సేనాపతులు, బౌద్ధభిక్కులు, పండితులు కొలిచి ఉండగా తన మంత్రిని చూచి, “ఏమయ్యాడు చందశ్రీ ?” అని అడిగినాడు.

“అన్నదాతా! మహాచక్రవర్తీ! చంద్రశ్రీ నిన్న సాయంకాలం గడబిడ ప్రారంభించగానే నీటిలోనికి ఉరికి తన అంగరక్షకురాండ్రయిన నలువురు దిట్టలైన స్త్రీలతో చల్లగా ఈదుకుంటూ, వారి నౌకాబలంతో కూడా వచ్చే చిన్న పడవ ఎక్కి తేలుకునిపోయాడట. అలా మూడుగోరుతాలు ప్రయాణంచేసి, గోదావరితీరంలో ఉన్న ఒక గ్రామంలో దిగి ఏనుగులపై ఎక్కి వెళ్ళిపోయాడట” అని మంత్రి మనవి చేసినాడు. .

“అలాగా, చంద్రశ్రీ ఏనుగులమీద ఎక్కడికి పోయినాడో అది కనుక్కోడానికీ, ఆ దారిలో దొరికితే బందీచేసి పట్టుకురావడానికి చారులను పంపలేదా మీరు?” చిరాకు నాట్యంచేసే మోముతో ప్రశ్నించినాడు పులమావి.

“చిత్తం! అన్నదాతా! ఆ ఏనుగు ఎటువైపు వెళ్ళిందో తెలియలేదట. ఇంకా చారులు కొంతమంది వేగంగల ఏనుగుల పైన వెదుకుతున్నారు” సవినయంగా మంత్రి విన్నవించుకొన్నాడు,

చంద్రశ్రీ ధనాగారం పరిశీలిస్తే పూర్వంనుంచీ ఉన్న బంగారు ఆభరణాలు నవరత్నాలుపొదిగిన ఆభరణాలు చాలా ఉన్నాయి. ఫణాలరాసులు చాలా తక్కువ ఉన్నాయి. పులమావి నగలన్నీ తాను తీసుకొని, నాణ్యాల రాసులలో ముప్పాతిక తాను సంగ్రహించి, తక్కినవి రాజ్యావసరంకోసం ధనాగారంలోనే ఉంచినారు. దాసీలలో అందమైనవారిని ఆరువందలమందిని తన అంతఃపురంలోనికి తీసుకున్నాడు. ధైర్యం బలాన్నిస్తుంది. యుద్ధతంత్రం నేర్పుతుంది. బలం ఇంకా బలం చేకూరుస్తుంది.

పులమావి చరిత్ర అంతా వింటున్నకొలదీ విజయశాతకర్ణ చక్రవర్తికి మతిపోయింది. పులమావి తన చుట్టాన్ని ఒకరిని తన రాజప్రతినిధిగా ప్రతిస్థానంలో నిలబెట్టి వెంటనే తన సర్వసైన్యాలు కూర్చుకొని ఆగకుండా అతి వేగంగా మహారాజపథం వెంట ధాన్యకటకాభిముఖుడై బయలుదేరినాడు. పులమావి ఎక్కిన మదపుటేనుగుపై బంగారపు టంబారీ ఒకచిన్నగది అంత ఉన్నది. దాని నిండా హంసతూలికల పరుపులు పరచినారు. మెత్తని ఉపధానాలపై ఆనుకొని, తన వినోదునితో మాటలాడుచు పులమావి ప్రయాణం చేస్తున్నాడు.

“నానాటికి శాంతి పిచ్చి ఎక్కువై పోతున్నది నాకు.”

“దానికి శాంతే విరుగుడు!” వినోదుడు పులమావి చేయి పట్టుకొని నాడి చూసినాడు.

“శాంతి పిచ్చికి శాంతి మందేమిటి నీ మొగం?”

“అలా అనకండి సార్వభౌమా! మీకు వైద్యసూత్రాలు తెలియవు. కామసూత్రాలూ చదువలేదు.”

“వాత్సాయనుడు శాంతి మందు అని తెల్పాడా?”

“ఆ! ఉష్ణం ఉష్ణేన శీతలం అన్న సూత్ర ప్రకారం శాంత్యున్మాదానికి శాంతే మందు అన్నాడు.”

“ఎవడు వాడు?”

“ఈ మహావైద్యుడు తమ వినోదుడు!”

“ఓరి మూర్ఖుడా!”

“ఉండండి. శాంతిదేవికోసం మీకు పిచ్చి, మరి శాంతిదేవిని తమచే సేవింపచేస్తే, ఆ పిచ్చికుదరదా?"

“ఓహో! అదా?”

“ఏమనుకున్నారు ప్రభూ!”

6

విజయపురంలో వసంతోత్సవాలు అద్భుతంగా జరిగినవి. వీరపురుషదత్తుని ఆనందమూ, పూంగీయ శాంతిశ్రీ బాపిశ్రీల ఆనందం వర్ణనాతీతము, పూంగీయ యువరాజు స్కందసాగరుడు వసంతుడయ్యాడు వీరపురుషదత్తుడు మన్మథుడయ్యాడు. వాసిష్టి శాంతిశ్రీ పుత్రిక శాంతశ్రీ రతీదేవి అయింది. స్కందసాగరుడు ఇక్ష్వాకు రాజవంశపు బాలికను వనదేవతగా ఎన్నుకొన్నాడు. ఈ సంవత్సరం ఉత్సవంలో జరిగిన వేడుకలు ఏనాడూ జరగలేదన్నారు. మాళవరుద్రభట్టారిక పారిజాతమయింది. బాపిశ్రీ మందారమయింది. షష్టిశ్రీ కమలపుష్పమయినది. బ్రహ్మదత్తప్రభువు వేడుకలు చూస్తూ సువర్ణద్వీపంనుంచి తాను కొని తెచ్చిన లక్కవస్తువులు, పచ్చలూ, కెంపులూకూర్చిన హారాలూ, చిత్రచిత్ర వస్తువులు బాలికలకు బహుమతులిచ్చినాడు. వీరపురుషదత్తునికి కెంపులు పొదిగిన ఒరతోడి మణులు పొదిగిన సువర్ణద్వీప ఖడ్గమిచ్చినాడు. సువర్ణ ద్వీప మహారాజు ఆంధ్రచక్రవర్తికీ, ఇక్ష్వాకు మహారాజుకూ అనేక బహుమతులు పంపినాడు. శాంతిమూల మహారాజుకు పంపిన బహుమతులు వారి కిచ్చినాడు. ఇతరులకు ఖడ్గములు మొదలయిన ఆయుధములు బహుమతులిచ్చినాడు.

సువర్ణ ద్వీపంలో పనితనం అంతా గాంధర్వ శిల్పమూ, విధ్యాధరశిల్పము, ఆంధ్రశిల్పము విశ్వబ్రహ్మ శిల్పసమ్మిశ్రితము. ఆంధ్రశిల్పము సువర్ణద్వీప గాంధర్వశిల్పంలో రంగరింపయి ఒక నూత్న సౌందర్యం చేకూర్చుకున్న నూత్న సంప్రదాయం ఉద్భవించింది. ఆ శిల్పవస్తువులు వెలకు తెచ్చి పంచినాడు బ్రహ్మదత్తుడు. ఒక పెద్ద గార్ముత్మతోపలం చెక్కి విన్యసించిన పరమసుందరమూర్తి మంతమయిన ధ్యానిబుద్ధ విగ్రహమొకటి ఎనిమిది అంగుష్టముల ఎత్తున్న దానిని బ్రహ్మదత్తుడు ఇక్ష్వాకు రాకుమారి శాంతిశ్రీకి బహుమతి ఇచ్చినాడు. ఆ విగ్రహము చూడడముతోనే శాంతిశ్రీ చైతన్యరహిత అయినది. ఆమె ఆనందం ఆకాశగంగవరకు ఉబికి పోయింది.

“గురువుగారూ! ఈ పవిత్ర విగ్రహాన్ని నాకోసమే సంపాదించినారా?” ఆ బాలిక మాటలు శిశువు మాటలవలె ఉన్నవి.

“అవును రాజకుమారీ! ఈ విగ్రహమును సువర్ణద్వీపవాసియైన సామంతప్రభువు ఒకపెద్ద గారుత్మకం చెక్కించి చేయించినాడు. నేను “పాగాను” మహానగరం వెళ్ళినప్పుడు, ఆ సామంతుని ఇంట అతిథిని. మేము మూడుదినాలు తత్త్వవిచారణ చేశాము. నా మాటలు అతనికి పరమ శ్రమణకుని బోదలా ఉందని ఆయన నా కవిగ్రహం బహుమతి ఇచ్చాడు. ఈ వవిత్రమూర్తిని చూడగానే ఇది భర్భదారికకు అని నేను మనస్సులో నిశ్చయించుకొన్నాను.” బ్రహ్మదత్తుని మాటలలో చిరునవ్వు సౌరభంలా వెల్లివిరిసింది.

“ఓహో! ఈ పరమశిల్పం నాదగ్గర ఉండడానికి నేను తగుదునా గురుదేవా?” ఆమె మాటలు చిన్న మల్లి మొగ్గలులా వికసించాయి.

“నీకన్న దీనికింకెవరు తగుదురు రాజకుమారీ?” బ్రహ్మదత్తుడు గంభీరంగా అన్నాడు.

“అది మీ హృదయంలోని అనుగ్రహం! సువర్ణ ద్వీపంలోని విశేషాలు నాకు తెల్పండి.”

“నీకు జ్ఞానతృష్ణ ఎక్కువ శాంతిశ్రీ కుమారీ!”

“కాని ఆ తృష్ణకు తగిన మెదడు లేదుకాదా అండి” అవనత వదనయై ఆమె పలికింది.

“నీకు మెదడులేదని ఎవరనగలరు రాజకుమారీ! గురువు నైన నేనెరు గనా?” -బ్రహ్మదత్తుడు విషాదపూర్ణమైన చిరునవ్వు నవ్వాడు. “మీరు ఓడమీద విహారంవెళ్ళి మాయిమైపోయారన్నప్పుడు నాకు భయమువేసింది. దినదినమూ నిద్రపట్టేదికాదు” ఆమె అనుద్వేగయై మాట్లాడింది. ఆమెలో శిశుత్వం తొణికిసలాడింది.

బ్రహ్మదత్తు డామెవైపు కొంచెంసేపు తీక్ష్ణపు చూపులు పంపినాడు, “భయం ఎందుకువేయాలి? నిర్వాణాభిముఖులకు భయం కలుగకూడదు” అన్నాడు.

“ఎందుకు భయంకూడదో నాకు తెలియదండి” ఆమె చిరునవ్వు నవ్వింది. చంద్రకాంతోపలంతో విన్యసించిన శిల్పానికి చైతన్యం వచ్చినట్లయింది. ఒకసారి వేయి ఉషస్సులు లోకాలను ఆవరించినట్లయింది. ఎఱ్ఱని ఆమె పెదవులు విడివడిన. స్తనవల్కలావృతాలయి, సుందరశ్రీ విలసితాలయిన వక్షోజఫలాలు ఉబికినవి. ఆమె రూపము జగన్మోహనము. చిరునవ్వు నవ్వినప్పుడామె విశ్వమోహనరూపం వెలిగిపోయింది. ఆమె మూర్తినుండి ఏవోదివ్య సౌరభాలు ప్రసరించినవి. బ్రహ్మదత్తుడు లోలోన వణికిపోయినాడు.

ఈ బాలికలో ఏదో విచిత్ర మహామధుర చైతన్యము ఉదయిస్తున్నది. ఆ బాలిక పర్వతద్వార గోపురప్రాంగణంలో తన పాదాలంటి కళ్ళకద్దుకున్నప్పుడు బ్రహ్మదత్తునకు వివశత్వము కలిగింది. ఆమె స్పర్శ తన్నట్లు వణికించివేయగలదు అనుకోలేదు. ఆమె దివ్యమధుహస్తాలు ఏదో అనన్యానుభూతిలా తన పాదాలను స్పృశించాయి. “ఓ బాలికా! సర్వలోక సౌందర్య మృతకలశీ! నీ స్పర్శే చైతన్యరహితుణ్ణి చేస్తున్నదే, ఇంతకన్న ఇంకను అద్భుతమయిన వరము నాకు సన్నిహితమయితే నా భవిష్యత్తు ఏమయిపో గలదు?” అని అతని ఆత్మ ఎలుగెత్తి విశ్వసించింది. నేడు ఈ బాలిక అప్రతర్కితంగానే తన్ను అమృతకర్తరిలో ఉంచిన పోకను చేస్తున్నదు! బ్రహ్మదత్తునికి భరింపరాని ఆనందం కలిగింది. అతడు వెళ్ళి వచ్చెదనని సెలవు గైకొన్నా డానాడు.

ఆ ఆలోచనలన్నీ తన చిత్తస్థైర్యాన్ని ముక్కలు చేస్తూ ఉండగా బ్రహ్మదత్తుడు వసంతోత్సవాలకు వచ్చినాడు. ఆ ఉత్సవాలలో ఒకనాడు శాంతిశ్రీ రాకుమారి బ్రహ్మదత్తునికడకు చెలికత్తెలు కొలువు విచ్చేసి, “గురుదేవా! నన్ను రతీదేవిగా మీరు క్రిందటి సంవత్సరం ఎన్నుకొన్నారు. నేను ఎందుకో భయపడిపోయినాను. ఆ ఎన్నుకొనడం, భయపడడంలో ఉన్న భావం నాకు తెలియ చెప్పగలరా ప్రభూ?” అని ప్రశ్నించింది.

7

వసంతోత్సవాలు ప్రారంభించిన మూడవదినాన. పులమావి విజయ యాత్ర బయలుదేరిన వార్త విజయపురానికి అందింది. రాచనగళ్ళలో, పట్టణంలో గజిబిజి బయలుదేరినది.

“ఎవరీ పులమావి?”

“తాను వాసిష్టీపుత్ర పులమావిని అనుకున్నాడా?”

“ఏమిటి వీడి ధైర్యం ?”

“ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో?”

“మన చక్రవర్తి అసమర్దుడయితే పులమావి జైత్రయాత్రకు బయలుదేరుతాడు. పుల్లమామిడే గొప్ప పండవుతుంది.” “మన మహారాజు ఏమిచేస్తాడో?”

“పులమావి పులుపు విరుస్తాడు.”

ఈ రకంగా ప్రజలు విడ్డూరాలుగా చెప్పుకొంటున్నారు. విజయశ్రీ శాతవాహన మహారాజు ఒకదాని వెనక ఒకటిగా, మొసలిపట్టిన గజేంద్రుని వలె, ఆక్రందనలు పంపిస్తూ ఉన్నాడు.

శాంతిమూలుని సభలో అడవి స్కందవిశాఖాయనక బ్రహ్మదత్త ప్రభువు పూంగీయ స్కందశ్రీ మహారాజు, హిరణ్యకరాష్ట్ర ప్రభువు, స్కందచాళుక్యరాయనికప్రభువు, హమ్మశ్రీదేవి భర్త పల్లవప్రభువు, కులహాక ప్రభువు, బౌద్ధాచార్యులు, మహాబుషిసత్తములవంటి బ్రాహ్మణులు అందరూ చేరినారు. బ్రహ్మదత్తప్రభువు సభలో పులమావి దండ యాత్రనుగురించి తెలిసిన సంగతులన్నియు, మహారాజుగారి పక్షాన సభికులందరికీ తెలియజేసి, ఇప్పుడు కర్తవ్యమేమిటి అని అడిగినాడు.

పూంగీప్రభువు: మనం సైన్యాలనుకూర్చుకొని వెంటనే వెళ్ళి పులమావినీ, అతని సైన్యాలనూ నాశనం చేయవలసి ఉన్నది.

కులహాకప్రభువు: మహాప్రభూ! నా మనవి ఈ అదను తప్పితే పులమావిని నెగ్గే అవకాశం దొరకదని.

చాళుక్యరాయనిక: మహాప్రభూ! మనం తొందరపడడం మంచిదికాదు. జాగ్రత్తలో పులమావిని ఏలా ఎదుర్కొనాలో నిర్ణయించుకోవాలి.

పల్లవప్రభువు: ఈ విషయంలో మనం ఆలోచించదగినది ఒకటి ఉన్నది. ఈ పులమావికి ఎక్కడనుంచి వచ్చింది ఈ బలం? ఎలా వైజయంతిని లోబరుచుకోగలిగాడు? ఎలా మహావేగంతో భరుకచ్చానికి పోయినాడు? ఇందులో ఏదో రహస్యం ఉంది. అది తెలుసుకుని మనం అతన్ని ఎదుర్కొనాలి.

యువరాజు వీరపురుషదత్తుడు: చిన్న మామయ్యగారూ! మనం నెమ్మదిగా ఆలోచించుకొనే లోపలే పులమావి ధాన్యకటకం మీదకువచ్చి పడిపోడా? కాబట్టి మనం వెళ్ళివాడు భరుకచ్చంనుంచి ప్రతిష్ఠానానికి రాకుండానే ఎదుర్కోవాలి.

బ్రహ్మదత్తుడు: వెనుక ఒకసారి ఈ పులమావి మనపట్టణం వచ్చి వసంతోత్సవంలో పాల్గొన్నాడు. మళ్ళీ పెద్దవర్తకుడుగా ఈ పట్టణం చొచ్చి అంతఃపురాలలో నగలమ్మి నాడట. వాడి ఉద్దేశము చూచాయగా నాకు అర్థం అయింది. ఇంతకూ పులమావి బలం నాశనం చేయాలంటే దానికి వేరే మార్గం ఉంది. అతనికి వచ్చిన బలముకంటె అతని శక్తిసామర్థ్యాల కంటె ఇవతల చక్రవర్తి బలహీనత ఒక కారణం. ఆ బలహీనతవల్ల సామంతులంతా తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈతడు ఆ అదను చేజిక్కించు కొన్నాడు.

చాళ్ళురాయనిక: అయితే మీ ఆలోచన?

బ్రహ్మదత్తుడు ఒక నిమేషం ఆలోచించినాడు. చిరునవ్వు నవ్వు కొన్నాడు. “రాజకుమారి శాంతిశ్రీని అతడు భార్యగా వాంఛిస్తున్నాడు. ఒక్కొక్కప్పుడు మనుష్యులు ఆకాశంపైన చంద్రుణ్ణికూడా కోరుతారు. అతడు తిన్నగా ధాన్యకటకం వెళ్ళడు. సర్వసైన్యాలతో విజయపురంపై విరుచుకుపడతాడు. అప్పటికిగాని అతని సార్వభౌమ కాంక్షకు తృప్తి కలుగదు. అతనికీ తెలుసును. ఆంధ్ర సార్వభౌమునికి ఉన్న బలం అంతా ఇక్ష్వాకు మహారాజు అని. ఇక్ష్వాకులు ఓడిపోయి, వారి రాజకుమారి భార్యగా దక్కితే ఇంక చక్రవర్తి ఏమి లెక్క అని ఆలోచించాడు. అందుకనే చక్రవర్తి ఆయువు పట్టయిన ఇక్ష్వాకులను ఓడించి వారి బాలికను చెట్టబట్టితే మన మహారాజు పులమావికి కోటికోటల బలం అవుతారుగా!” ఆ మాటలని బ్రహ్మదత్తుడు ఇంకొక పర్యాయం సభికుల నందరినీ పరిశీలించి చూచాడు.

“నా ఉద్దేశంలో మనం మన సైన్యాలు కొన్నింటిని తీసుకొని ప్రతిష్ఠానంనుంచి వచ్చే మహారాజపథం వెంటనే ముందుకుపోయి, మహానగరపురానికి ఎగువను ఉన్న కొండలలో వ్యూహం పన్నాలి. తక్కిన సైన్యాలన్నీ మన నగరం కావలికి ఉంచాలి. ఆ ఉంచడంలో నగరానికి అయిదుగోరుతాలు దూరంనుంచీ సైన్యాలు కాపాడుతూ ఉండాలి. తక్కిన సేనలు నగరంలో కావలికాస్తూ అప్రమత్తులయి ఉండాలి.” బ్రహ్మదత్తుడు సభ్యులనందరినీ ఒక్కసారి కలియచూచి మహారాజు వైపు తిరిగి తన చేతులు జోడించి, “మహారాజా! పులమావిని సంపూర్ణంగా ఓడించి ఇక్కడికి బంధించి తీసుకువస్తాము. మాకు సెలవు దయచేయ కోరుతున్నాను” అని ప్రార్థించాడు.

“ధనకప్రభు! మేమో?” మహారాజు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు.

“తాము నగరంలో ఉండాలని ప్రార్ధన మహాప్రభూ! సరియైన జైత్రయత్ర రాబోతున్నది. అప్పుడు తామే నాయకత్వం వహించవలసి ఉన్నది” అని బ్రహ్మదత్తుడు మనవి చేసినాడు. వెంటనే సభ్యులు జయజయధ్వానములు చేసినారు.

ఆ మరునాటినుంచి ఇక్ష్వాకు సైన్యాలు సమకూర్చ ఆజ్ఞలు వెళ్ళినవి. సర్వసైన్యాలకు మహాసేనాపతి స్కందశ్రీ మహారాజు. వారి క్రింద సేనా పతులు చాళుక్యరాయనిక ప్రభువు, బ్రహ్మదత్తప్రభువు, వీరపురుషదత్త యువరాజు, పల్లవప్రభువు, శాంతిమూలమహారాజుకు బాసటగా నగర రక్షక మహాసేనాపతి అయినారు. విజయపురం ఎదుట కృష్ణకీవల ఇక్ష్వాకు సైన్యాలు పూంగీయ సైన్యాలు సమకూడుటకు సన్నాహాలన్నీ బ్రహ్మదత్తప్రభువు స్వయంగా చూచుకొంటూ ఉండెను.

ఇక్ష్వాకు సైన్యాలు పులమావిని ఎదుక్కొనేందుకు సంసిద్ధమౌవనీ శాతవాహన మహారాజు తమ సైన్యాలనన్నీ కులహాక ప్రభువు నాయకత్వము క్రింద పంపించి, తాము పులమావితో యుద్ధము కొంత సాగించిన వెనుక, ప్రక్కనుండి పులమావిని తాకవలసి ఉన్నదనిన్ని విజయశ్రీ చక్రవర్తికీ శాంతిమూలమహారాజు రహస్యవార్తను కులహాక ప్రభువునకిచ్చి పంపినారు.

8

రాజకుమారి శాంతిశ్రీ బ్రహ్మదత్తుని కోటకు ఒకదినాన తన రథముపై ఇరువురు చెలికత్తెలతో అంతఃపుర పాలకురాలితో విచ్చేసింది. ఆ ధనక ప్రభువు కోటయు మహారాజు కోటకు దీటయినదే. నగర గోపుర ద్వారాలు దాటి లోనికిపోగానే విచిత్రపుష్పవనము దర్శనమిస్తుంది. పూలవనం మధ్యగా రధ్య ఉన్నది. పూలవనం దాటగానే అతిథిమందిరాలు రధ్య కీవలావల దూరంగా ఉన్నవి. అవి దాటి వెళ్ళగానే ఫలోద్యానమున్నది. అందు దేశదేశాల వెలయు ఫలవృక్షాలు మాలీలు పెంచుతూ ఉంటారు. ఫలవనం దాటగానే ఒక అందమైన సరోవరము ప్రత్యక్షమవుతుంది. ఆ సరోవరంలో పద్మాలు విలసిల్లుతూ ఉంటాయి. అందు రాజహంసలు సంగీతంలో తేలియాడే తాళాలులా ఈదుతూ ఉంటాయి. రధ్య రెండుపాయలై గుండ్రని ఆ సరోవరానికి ఈవలావలగా పోతుంది. సరోవరానికి ఆవలప్రక్క తెల్లనిపాలరాతితో నిర్మించిన దివ్యమందిర మాలిక ప్రత్యక్షమవుతుంది. ఈ మందిరాలు స్కందవిశాఖాయనక ప్రభువే నిర్మించినాడు. ఈ విచిత్రాలన్నీ చూస్తూ శాంతిశ్రీ మందిరాలవరకూ పోయి అక్కడ రథావరోహణం చేసింది.

రాజకుమారి వస్తున్నదని అంగరక్షకులు చూచి వెంటనే రాజమందిరంలోనికి వార్త అందిచ్చినారు. రాజకుమార్తె కోటకు వెనకవైపున నున్న గోపుర ద్వారంలోనుంచి వచ్చింది. ముఖద్వారం తూర్పుదెస ఉన్నది. రాజకుమారి వచ్చిన ద్వారము పడమటి గోపురము. శాంతిశ్రీ చెలికత్తెలతో రథం దిగగానే బ్రహ్మదత్తప్రభువు తల్లి నాగసిరిదేవి ఎదురువచ్చి శాంతిశ్రీని కౌగలించుకొని, దాసీలు దృష్టితీసే ఎఱ్ఱనీళ్ళు పట్టుకొనిరాగా, తానే స్వయంగా దృష్టితీసివేసి లోనికి నడిపించుకొనిపోయి, తన అంతస్సభా మందిరంలోనికి ప్రవేశపెట్టి ఆమెను బంగారు అసనంపై అధివసింప చేసినది.

"తల్లీ! మీరు మా కోటకు రావడం నా కెంత ఆనందమో నేను చెప్పలేనమ్మా!” అని నాగసిరిదేవి తన ఆనందం వెలిబుచ్చుతూ పలికింది. “మా గురువుగారు పులమావి జైత్రయాత్రను అరికట్టడానికి వెడుతున్నారు. ఆ సంగతి వారితో మాట్లాడాలని వచ్చాను మహారాణీ!” శాంతిశ్రీ ఏదో ఆలోచనాధీనయై ప్రత్యుత్తరమిచ్చింది.

“మనం బ్రాహ్మణులమైనా రాజధర్మం పూనినాముకాదా అమ్మా! ఈనాటిదికాదీవృత్తి మనకు ఈ దేశం అంతా అటవీయమై ఉన్నప్పుడు సాంఖ్యాయననులు ధనకదేశాలనికి రాజులై ఉండేవారు. మా అబ్బాయి పూర్వీకులలో ఒక మహారాజు, శ్రీ శాతకర్ణి శాతవాహన చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం, ఈ అడవిదేశం అంతా జనపదప్రదేశం చేసి ఇక్కడ రాజ్యం స్థాపించారు. అందుకే ఈ నగరానికి విజయపురం అని పేరు వచ్చిందట రాజకుమారీ!”

“ఎంత రాజధర్మం వహించినా బ్రాహ్మణధర్మము పునాది అయి ఉండాలికదా దేవీ! ” శాంతిశ్రీ ప్రశ్న ఎంతో దైన్యపూర్ణమై ఉంది.

“అవును కుమారీ! నీ భావం నాకు అర్థమైంది. నువ్వు అబ్బాయితో మాట్లాడుతావా? ఇప్పుడే అతనికి వార్త పంపుతాను.” ఆమె వెంటనే పరిచారికతో “మహారాజు తనయ శాంతిశ్రీదేవి ప్రభువుగారితో మాట్లాడుతారు గనుక ఇక్కడికి నేను రమ్మన్నానని చెప్పు” అని ఆజ్ఞ ఇచ్చింది.

నాగసిరిది స్ఫురద్రూపము. శాంతముట్టిపడుతుంది ఆమె తేజమున. ఆమె మాటలు జలజలా ప్రవహించిపోయే శైవాలినీ స్వనాలులా ఉంటాయి, విజయపురంలో ఉన్న మహిళాలోకం అంతా నాగసిరిదేవిని ఎప్పుడూ దర్శిస్తూ ఉంటుంది. ఎవరికి కష్టం వచ్చినావారా తల్లి దగ్గరకు వచ్చి తమ హృదయం ఆమెకడ విప్పుతారు. “గురువుగారూ! ఈ యుద్దాలు మానడానికి వీల్లేదా?” అని శాంతిశ్రీ బ్రహ్మదత్త ప్రభువు రాగానే వారిపాదాలకు వంగి నమస్కరించి ఎంతో ఆందోళనతో ప్రశ్నించింది. ప్రత్యూషారుణకాంతులు ఒకదానివెనుక ఒకటి వచ్చినట్లుగా ఆ బాలికలో నానాటికి ప్రత్యక్షమయ్యే ఏదో విచిత్ర చైతన్యోదయాన్ని పరిశీలిస్తూ అక్కజంపడుతున్నాడు బ్రహ్మదత్తుడు.

“యుద్దాలు మనం కోరి తెచ్చుకుంటామా రాకుమారీ!” అతడు చిరునవ్వు నవ్వాడు.

“అది అల్లా ఉంచండి. పరమార్థం విచారిస్తే యుద్ధాలు అయినా ఒకటే, కాకపోయినా ఒకటే అని మీరు అనవచ్చును. అది స్థితప్రజ్ఞుల విషయం. దుఃఖంలోపడి కుళ్ళిపోయే ప్రజానీకానికి ఈ వేదాంతం చాలా భయంకరం కాదా అండి!” ఆమె మోము అద్భుతమైన కాంతితో నిండిపోయింది.

ఆమెను అత్యంత సమ్మోదంతో గమనిస్తూ బ్రహ్మదత్తుడు, “రాజకుమారీ, నువ్వు చెప్పిన విషయాలు సత్యదూరాలు కావు. అయినా ప్రస్తుతము మన ప్రపంచములో ప్రసరించి ఉన్న యుద్ధనీతి విచిత్రగతుల నడచి వచ్చింది. అది సముద్రానికి చేరబోయే నదివంటిది. దానికి సరియైన దారి కల్పించి సముద్రాన్ని చేర్పించాలి. అంతేకాని వెనక్కు నెట్టాలని బ్రహ్మాండమయిన ఆనకట్ట కట్టాలని ప్రయత్నం చేస్తే దేశం అంతా వరదలు నిండుతుంది. అంటే స్త్రీ పురుషులు ఆబాలవృద్దంగా హింసావశులై తమ్ము తామే నాశనం చేసుకుంటారు. మనలో ఉండే హింసాబుద్ధి కీయుద్దాలు నిదర్శనం.” ఆమె తన గురువును ఎంతో భక్తితో చూస్తూ ఆయన మాటలు విన్నది.

“యుద్దాలు పూర్తిగా మానివేసి సంప్రతింపుల మూలంగా ఎందుకు సామరస్యం కుదుర్చుకోకూడదు ప్రభూ?”

"ఒకడు సామరస్యానికి కూడిరాకపోతే రెండవవాడు ఏమి చెయ్యాలి?”

“అందుకని ఉభయులూ నాశనం కావాలా? మనమే గెలుస్తామని నమ్మకమెట్టా? ఎవరు గెలిచినా నష్టం ఉభయత్ర తప్పదుకదా?”

“దేవతలుకూడా రక్షసులతో యుద్ధాలు చేయలేదా? రాజకుమారీ?”

“రాక్షసులు అంటే మనలోని రాక్షసత్వం కాదా అండి?" మానవునిలోని పశుత్వం నాశనం చేయడం కాదా అండి?” “స్వామీ! తాము అశ్వారూఢులై ఎచ్చటికో పోతూ ఉండిరి. ఇంతలో ఏనుగంత సాలిపురుగొకటి వచ్చి, పెద్దపెద్ద మోకులవంటి తంతులతో మిమ్ము బంధించి వేసిందట!”

“చిత్రము !”

“ఆ వెంటనే ఒక మహాజ్వాల ఎక్కడనుండో ఆవతరించి ఆ తంతులను మండించి వేసిందట! నాకు మెలకువ వచ్చింది.”

“కల శుభాంతమే కదా?”

“అయినా మీకు కష్టము వచ్చునుకదా ప్రథమంలో?”

“అది వ్రాసి ఉంటే తప్పించుకోగలమా?”

“మానవయత్నం విధివ్రాతను తప్పింపలేదా?”

“అయినా నా విషయంలో ఇంత ఆతురత ఎందుకు రాజకుమారీ?”

“మీరు నా దేశికులు.”

“నీకు పూర్వం ఈ ఆతురత ఎవరి విషయంలోనూ ఉండేది కాదు గాదా?”

“నాకు ఏవో విచిత్రానుభూతులు స్వప్న ప్రపంచంలోవలె వస్తూంటాయి.”

“ఇదీ ఒక స్వప్నానుభూతా?”

“నాకేమి తెలియును ప్రభు?”

9

ఆంధ్రదేశానికి చక్రవర్తినంటూ బయలుదేరిన పులమావి మహావేగంగా సైన్యాలతో కొఱవి మహాపథానికి ఉత్తరప్రదేశాలవరకూ వచ్చి అక్కడ దండు విడిసి, సేనాపతులతో ధాన్యకటకమునా ముందు ముట్టడించవలసినది, లేక విజయపురమునా? అన్న విషయం తేల్చడానికి సభ చేసినాడు.

మహాసేనాపతి “అన్నదాతా! విజయపురంవారు బలవంతులు, విజయపురం కైలాసంకన్నా బలమైనకోట. దానిని పట్టాలంటే శతవత్సరాలు పడుతుంది” అని వినయంగా మనవి చేసుకొన్నాడు.

“ధాన్యకటకం ముందు ముట్టడించాలని మీ ఉద్దేశమా మహాసేనాపతీ ?” అని పులమావి పృచ్చ చేసినాడు.

“చిత్తం సార్వభౌమా!”

“కారణం?”

“ఒక కారణం అన్నదాతకు మనవిచేసి ఉన్నాను, రెండవ కారణం ధాన్యకటకం పట్టడం సులభమని నా మనవి.”

“సులభమైనవి పట్టడంలో మన గొప్ప ఏముంది? పైగా బలపూర్ణమైన విజయపురం అలాగే ఉంటుంది. అప్పుడు మాత్రం మనకు ఇక్ష్వాకులను నెగ్గడం కష్టసాధ్యమైన పనికాదా?”

“చిత్తం మహాప్రభూ! కాని ధాన్యకటకం మనం ముట్టడించినప్పుడు ఇక్ష్వాకు బలగాలు అక్కడకు వచ్చి తీరుతాయి. వాటిని అక్కడ సులభంగా జయించవచ్చు. విజయపురకోట శ్రీ బోధిసత్వనాగార్జునులచే నిర్మితమయినది. మానవ దుర్భేద్యమంటారు పెద్దలు. అలాంటి వారిని పైకి కొనిరావటమే యుద్ధనీతి అని నా విన్నపం.

“విజయ శాతవాహనునకు బావమరది అవడంవల్ల ధాన్యకటకానికి సహాయంగా వచ్చి తీరుతాడు శాంతిమూలుడని నీ ఊహ. అతడు రాక ఏ బ్రహ్మదత్తునో పంపితే?”

“ధాన్యకటకం కబళించి పూంగీప్రోలు ముట్టడిస్తాముగాక మహాప్రభూ!”

“బాగుంది మీ ఆలోచన మహాసేనాపతీ! శిబిరాలు ఎత్తించి మహావేగంతో ధాన్యకటకం దారి పట్టించండి.”

ఇంతట్లో ఒక సేనాపతి లోనికిరా అనుజ్ఞవేడినాడు. రావచ్చునని పులమావి కంచుకితో చెప్పినాడు. వెంటనే ఆ సేనాపతి లోనికి విచ్చేసి పులమావికీ మహాసేనాపతికి నమస్కరించి “అన్నదాతా! విజయపురం సైన్యాలు మనకు నాలుగు గోరుతాల (గోరుతము ఇప్పటి రెండుమైళ్ళు) దూరంలో ఉన్నాయని అపసర్పులవార్త. ఆ సైన్యాలు మహావేగంగా వస్తున్నాయట” అని కొంచెం వేగంగా మనవిచేశాడు.

పులమావీ, మహాసేనాపతీ ఒకరి మొగము ఒకరు చూసుకున్నారు. పులమావి వెంటనే “మహాసేనాపతీ, మన శిబిరాలు వ్యూహ రూపంగానే తీర్చి ఉన్నవి గనుక వెంటనే అర్థచంద్రవ్యూహం రచించండి. లిప్తలలోపని జరగాలి.” ఆ మాటలంటూ పులమావి కవచాదులు ధరింప లోనిశిబిరాలలోనికి పోయినాడు. మహాసేనాపతి తన శిబిరాలకు పోయి రణభేరీ వేయించి సేనలకు యుద్ధాజ్ఞలు ఆశ్వికవార్తాహరులచే అందింపచేయించెను.

రణభేరీలు, కాహళాలు నినాదాలు సంధానచేస్తున్నవి. సైనికులు, ఆశ్వికులు, రథికులు, గజయుద్ధవీరులు అతి వేగంగా తమతమ కవచాయుధాదుల ధరించి యధాస్థానాలకు పోతున్నారు. సైన్యం అంతా తెల్లవారేసరికి అర్థ చంద్రాకృతిలో సిద్ధమైయున్నది. పులమావి తన మహాగజము అధివసించి అర్ధచంద్ర మధ్యస్థుడైనాడు. మహాసేనాపతి దక్షిణ శృంగాన, ఉపమహా సేనాపతి నామ శృంగాననిలిచిరి. ఎదుట రెండు గోరుతాల దూరంలో త్రిశూల ప్యూహరూపంలో ఇక్ష్వాకుసైన్యాలు నిలిచిఉన్నాయి.

బ్రహ్మదత్త ప్రభువు దక్షిణదళాధిపతిగా తన రథం మీదనిలిచి ఉన్నాడు. యుద్ధ ప్రారంభముహూర్తం ఇంకా రెండు \ఘడియలున్నది. పులమావికియుద్ధ ప్రారంభ ముహూర్తం ఒకఘడియా ఇరువదివిఘడియలు మాత్రమే ఉన్నది. తన మూహూర్తానికి సరీగా పులమావి సైన్యాన్ని ముందుకు సాగించాడు. పులమావి సైన్యాలు నెమ్మదిగా ముందుకు పోతున్నాయి. సైన్యం ఒక ఘడియకు పావుగోరుతము దూరంసాగింది. ఇంకా ముందుకుపోతున్నది. అంతకన్న అంతకన్న వేగం ఎక్కువైంది. ఎదుటసైన్యాన్ని తాకి చుట్టుముట్టవలసిందని పులమావి తన సేనాపతులకు ఆజ్ఞలు పంపినాడు. ఆ వేగం నూరు ధనువుల (ఇప్పటి ఆరడుగుల పొడవు) చొప్పున కొంచెం కొంచెం ఎక్కువవుతున్నది. సైన్యంలో భేరీలు, కాహళాలు తమ తమ ధ్వనులు వేగం వేగం చేస్తున్నవి.

ఇంతలో ఇక్ష్వాకు సైన్యాలు కదిలే శుభముహూర్తం వచ్చింది. ఒక్కసారిగా శుభవాద్యాలు మ్రోగినవి. ఇక్ష్వాకు సైన్యాలు మూడు ధనువులు మాత్రం ముందుకు నడవాలి. అక్కడ సైన్యమంతా ఆగవలెను. ముందు శ్రేణివారు కూర్చుండి బాణాలు ఎక్కుపెట్టాలి. వెనకశ్రేణివారు మోకాళ్ళపై నిలిచి బాణాలు ఎక్కుపెట్టాలి. ఆ వెనకశ్రేణివారు నిలుచుండి బాణాలు ఎక్కుపెట్టి, శత్రువు నూరు ధనువుల దూరాన ఉండగానే, భేరీలుమ్రోత సంకేతంగా బాణాలు వదలాలి. శత్రువు ఏబది ధనువులు వచ్చేవరకు ఈ మూడుశ్రేణుల వారూ బాణాలు వదులుతూనే ఉండాలి.

ఆజ్ఞల ప్రకారమే పులమావి సైన్యాలు నూరు ధనువుల దూరం రాగానే ఇక్ష్వాకు సైన్యాలు ఒక్కసారిగా లక్షలకొలదిబాణాలు శత్రువులపై వదలినవి. ఒకశ్రేణితర్వాత ఒకటి బాణాలపంక్తి సువ్వునవచ్చి వజ్రపాతాలులా శత్రుసైనికుల, ఆశ్వికుల, గజవీరుల తాకినవి. కదలి వస్తున్నందువలన పులమావి సైన్యాల బాణాలనే ఇక్ష్వాకు బలగాలు చెక్కుచెమర్ప వయ్యెను.

పులమావి సైన్యాలవీరులు వేలకొలది కూలిపోసాగినారు. పులమావి సైనికులు ఇన్నాళ్లు యుద్ధాలు చేయకుండా నెగ్గివచ్చినందున యుద్ధం చేయ గల మేటి సేనాపతుల, సేనల ఉధృతం ఇప్పటికే చవిచూడసాగెను వేల కొలది పడిపోతూంటే, పులమావి సైన్యాలను ముందుకు నడుపుతూనే ఉన్నారాతని సేనాపతులు. కాని యుద్ధం వివాహయాత్రగా భావించిన అతని సైనికులు చటుక్కున ఆగిపోయారు. ఇక్ష్వాకుల బాణపాతం గురితప్పని మహావేగంలో వస్తూనే ఉంది. పులమావి సైన్యాలలో చికాకు ఎక్కువైంది. భయం మొలకెత్తింది, అది వృక్షమయింది. పులమావి సైన్యాలు వెనక్కు తిరిగాయి. చిందర వందరయి సైన్యాలు మహావేగంతో తమ శిబిరాలున్న స్థలానికి పరుగులు పెట్టాయి. ఆ గడబిడ, అల్లరి, ఆ త్రొక్కులాటలచే భూకంపం వచ్చిన వెనక ఒక నగరం ఉన్నట్లున్నదా ప్రదేశం. కాని పులమావి సైన్యాలను ఇక్ష్వాకు సైన్యాలు తరుముకుని రావటంలేదు.


★ ★ ★