నీరాజనము


తారానికకు నాగదత్తునికి విజయపురిలో వైభవంగా వివాహం జరిగింది. ఇక్ష్వాకుస్వామి శాంతిమూల చక్రవర్తియు, బ్రహ్మదత్తప్రభువు, ఆడవి శాంతిశ్రీయు వివాహాన్ని ఉభయపక్షాల ఉండి వైభవంగా నడిపించినారు. చక్రవర్తి నాగదత్తుని చళుక రాష్ట్రాధిపతి చళుకరాయనిక మహాప్రభువునకు బాసటగా ఉండి పనిచేయవలసిందని ముదల యిచ్చినాడు.

వీరి వివాహమైన కొలది దినాలకు యశోదనాగనిక వివాహమైనది. ఆ వివాహము సాలగ్రామంలోనే జరిగింది. ఆ వివాహానికి సార్వ భౌముడు, మహాప్రభువులు, మహామంత్రి, మహాసేనాపతి, బ్రహ్మదత్తుడు, మహాతలవరులు, దండనాయకులు మొదలగువారెందరో వెడలినారు. విజయపురము విజయపురమంతా అచ్చటనే ఉన్నది. గ్రామం చుట్టూ మహాప్రభువులంతా శిబిరాలు తీర్చినారు. చుట్టుప్రక్కల గ్రామాలవారు వేలకొలది వివాహానికి వచ్చినారు. యశోదనాగనికభర్తను శతగ్రామాధికారిని చేసినాడు చక్రవర్తి. వివాహము ముగిసినది. అడవి శాంతిశ్రీ ధనకమహారాణి భర్తనుచేరి “ప్రభూ! మీరు వెంటనే బయలుదేరండి. మనమిద్దరము కలిసి తీర్థయాత్రలు చేసి వద్దాము” అని ప్రార్థించినది.

“ఏయే తీర్థాలు దేవీ?”

“మనం సప్తదీవులు తిరిగిరావాలని నేను కోరటంలేదు. మనదేశంలోని దివ్యక్షేత్రాలన్నీ తిరిగి వద్దాము.”

ఆమె అతని ఒడిలో ఒరిగిపోయింది. భర్త మెడచుట్టూ తన చేతులు బిగించింది. అతని కళ్ళలోనికి జగన్మోహనాలైన తన చూపులు పరపింద. అతడు వివశుడై,

"ప్రాణేశ్వరీ! నువ్వు బౌద్ధధర్మాభిరతవు. నేను ఆర్షధర్మాచరణ ప్రతుడను. అందుచేత మన యాత్ర చాలా పెద్దదవుతుంది కాదూ?”

“అవును మనం ఇద్దరమే, హిమాలయాలలో, లోయలలో, చరియలలో తెల్లని మంచు వెన్నలా పడేచోటులలో, గడ్డలా పేరుకుపోయే సీమలలో, నదులు, సెలయేళ్ళు, నదీకంఠాలు గలగలలాడగా సుందరశ్రీ చెలువారు ప్రదేశాలలో దేవతలు చరించు దివ్యభూములలో తిరిగివద్దాము రండి.”

“మధురాతి మధురాలైన నీ మాటలు వింటూ ఉంటే....”

“నేను వట్టి స్వప్న బాలికలా ఉన్నానా?”

“నువ్వు నా దివ్యస్వప్నానివి. నువ్వు నా కోటితపస్సుల ఫలం.”

“ఇదా మీ వేదాంత పరమార్థం!”

“నీ ముందు, నీ త్రిజగన్మోహన సౌందర్యం ముందు నా వేదాంతాలు మంచులా కరిగిపోతాయి.”

“నా సౌందర్యం అతితీక్షణమైనా ఎండ వంటిదా?”

“నీ సౌందర్యం అతిసురభిళమైన పూర్ణిమా సుషమ.” “అందుకే కాబోలు నన్ను 'వెన్నెలా' అని పిలువసాగినారు.”

“నిన్ను ఏ పేరు పెట్టి పిలిచినా తనివి తీరదు.”

“నన్ను మించిపోతుంది నా పేరనా?”

“నీ పేరునే నీవు ఎప్పుడూ మించిపోతున్నావు.”

“చూడండీ! ఇంతవరకూ నన్ను పొగడిపొగడి వదిలారు. అది అలా ఉంచండి. కాని ఒక విషయంలో మీరు అసత్యదోషం సలుపుతూ ఉండడంవల్ల మీ వర్ణన కూడా నమ్మకూడదేమో అనిపిస్తుంది ప్రాణప్రియా!”

“నేనా అసత్యదోషం చేసేది?”

“అవును!”

“ఏలాగు?”

“మిమ్ములనుగూర్చి మీరు చెప్పుకోనే చెప్పుకోరు.”

“ఏమని?”

“బుద్ధిలో అమితాభబుద్ధునివంటివారని, నా హృదయం ఆత్మ నిండిపోయి ఉన్నారని"

“నీకే ఇదంతా తెలిసినప్పుడు నేను చెప్పకపోతే అసత్య దోషం ఎట్టా అవుతుంది? నువ్వు ఎలాంటిదానవో నాకు చెప్పాలా?”

“మీ సౌందర్యం అతిలోకం.”

“దివ్యజ్యోత్సకాంతులు ప్రసరించే నీ చూపులు నా చూపులలో వాలుతూ ఉంటే వర్ణనాతీతాలై, స్విన్నాలై అమృతప్రవాహాలై, జపాకుట్మలా లైన నీ పెదవులు మాటలాడుతూ కదులుతూ ఉంటే శాంతీ! నాలో ఉన్న ధైర్యం పటాపంచలై పోతున్నది నిన్ను నా హృదయంలో దాచుకుని, నాలో లయించుకోలేక పోతున్నానుదేవి!”

“నేను మీలో అణువును ప్రభూ! మీరు నన్ను శివునిలా అర్ధదేహ మాత్రం ధరించినా, విష్ణునిలా హృదయంలో ధరించినా, బ్రహ్మలా నాలుకపై ధరించినా నాకు తృప్తితీరదు. నన్ను మీ ప్రతి అణువునా లయించి పోనివ్వండి ప్రభూ! దినానికి ఏవోకొన్ని క్షణికాలైనా విడిచి ఉండవలసి వస్తూ ఉంటే ఆ క్షణికాలు పదీ నాకు యుగాలై పోతున్నాయి ప్రభూ!”

“శాంతీ! ఇప్పటికీ - “నువ్వు ధనకకుటుంబానికి కోడలుగా వచ్చావనే నమ్మకం చాలక, వట్టి స్వప్నమేమో' అని భయపడుతూ ఉంటాను."

అతడామెను తన దృఢబాహువులతో కర్కశంగా కౌగలించుకొన్నాడు.ఇద్దరు ఆనందంతో ఉప్పొంగిపోయినారు. ఒకరి కౌగిలో ఒకరు లయమై పోయినారు.

ఓం అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతం గమయ
బుద్ధం వరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి.


             సమాప్తం