దశమ భాగం

వీరాంగనా సైన్యయాత్ర

ఆ మర్నాడు అంగరక్షణీదళం కూర్చుని రథారూఢూరాలై సాలగ్రామం వచ్చింది. శాంతిశ్రీరాకుమారి. ఆమెకు తారానికా యశోదా అతిసన్నిహితులయ్యారు. ఇక్ష్వాకు శాంతిశ్రీతోపాటు పూంగీయశాంతశ్రీయు, బాపిశ్రీ, షష్టిశ్రీరాకుమారి కూడా రథాలధివసించి వచ్చినారు.

తమ చెలిక తైలందరికి రాజకుమారికలు విలువిద్యా, కత్తిసాము, గుఱ్ఱపుస్వారి, రథచోదకత్వమూ నేర్పినారు. వారి గజములకు మాత్రము మావటీండ్రనే వుంచుటకు నిశ్చయించుకొన్నారు. గండరగండనాశనీ బృందము గజసాహిణిలుగా సిద్ధమైనది ఈ రహస్యము పూంగీయశాంతశ్రీ బాపిశ్రీలే ఏర్పాటు చేసినారు. ఇక్ష్వాకు శాంతిశ్రీ రాజ కుమారికి చాలా నెలల వరకు ఏమీ తెలియలేదు. ఆ రాకుమారికలు యిద్దరు శాంతిశ్రీ జీవితంలో సేనానాయకత్వం గుప్తమై ఉన్నదనిన్నీ, పులమావిని నిరుత్తరుణ్ణి చేయడంలో ఆ శక్తే పైకి విజృంభించిందనీ నిశ్చయానికి వచ్చారు. ఇక్ష్వాకు శాంతిశ్రీ కడ దిట్టమైన అంగరక్షణీ బలం ఉంది. ఆ బలం అంతా ఉపయోగించి దానికి సహాయంగా తమ చెలులను, పరిచారికలను దిట్టరులైనవారిని ఏరి సిద్దం చేశారు. అంతా సిద్దం అనుకోగానే ఆ బాలికలిద్దరూ తమ వదినదగ్గరకు వచ్చి ఈమాటా ఆమాటా ప్రారంభించారు. కొంతసేపటికి పూంగీయ శాంతశ్రీ ఇక్ష్వాకు శాంతిశ్రీని చూచి,

“వదినా! నువ్వు ఆ పులమావిని అంతచిత్రంగా ఓడించగలిగావు! యుద్ధనిర్వహణ శక్తి ఎప్పుడు అలవరచుకొన్నావు?” అని ప్రశ్నించింది.

ఇక్ష్వాకు శాంతిశ్రీ: నేను యుద్ధనిర్వహణ నేర్చుకోవడం ఏమిటి నా కేమీ తెలియదు!

పూంగీయ శాంత: ఈ మాటలకేమిలే వదినా.

ఇ. శాంతి: నిజంగా నేను ఏలా చేయగలిగానో? నాకే ఆశ్చర్యం వేస్తుంది తలచుకుంటే!

బాపిశ్రీ: ఏది ఎట్లా అయితే ఏం ! మాకో రూఢివార్త తెలిసింది వదినా. దాని విషయం నీ ఆలోచనకు వచ్చాము.

ఇ. శాంతి: నా ఆలోచన ఏమిటమ్మా?

బాపిశ్రీ: ఆ రాక్షసుడు పులమావి నిన్ను వివాహమాడితీరుతాడట. నువ్వు వప్పుకోనంత వరకూ దేశంలో ఉన్న కన్యలకు ఉపద్రవం కలిగిస్తూ ఉంటాడట. అలా దినానికో బాలికను బలాత్కరిస్తాడట. ఆ విషయమై మామయ్యగారికి గడువు పెట్టి రాయబారం పంపాడట.

ఇ. శాంతి: ఏమిటీ పులమావి ఇంతపనికి తెగిస్తాడా? ఎప్పుడు వచ్చింది గడువు రాయబారం?

పూం. శాంత: నిన్న సాయంకాలం వదినా! అందుకని నీ దగ్గరకు ఆలోచనకు వచ్చాను.

నువ్వు దిట్టమైన అపసర్పులను ఏర్పాటు చేశావు. నీకు ఎప్పటి వార్తలు అప్పటికి తెలుస్తాయి. మామయ్యగారు మాట్లాడక ఊరుకొన్నారని మా నాన్నగారు చెప్పినారు. వాడు నిన్ను పెళ్ళిచేసుకోక వదలడట.

ఇ. శాంతి: నాకు పెళ్ళే అవసరంలేదు వదినా! పైగా ఆనాడు నేను పులమావిమీదకు ఎందుకు వెళ్లానో నా కింతవరకూ ఏమీ అర్థంకాలేదు. నాయనగారికన్న నాకు ధర్మరక్షణ కర్తవ్యాన్ని గూర్చి ఎక్కువ తెలుసునా? నాకు హింస అంటే ఏమీ సరిపడదు. అందులో మనం స్త్రీలం. మనకు మించిన ఈ గొడవ లెందుకు?

పూం. శాంత: వదినా! నువ్వు చెప్పినవన్నీ నిజమే! కాదననుగాని మనం అందరమూ విజయపుర ప్రాంతాలకు విడిదిచేసి....

బాపిశ్రీ: పులమావిపైన యుద్దయాత్ర నడిపేనారివలె బీభత్సం కల్పిద్దాం పులమావి హృదయంలో!

పూం. శాంత: మన సైన్యంతో బయలుదేరామంటే చాలు.

ఇక్ష్వాకు శాంతిశ్రీకి తన మేనత్తల తనయల ఇద్దరి హృదయమూ నిముషంలో అర్థమైంది. వారికి యుద్ధం చేయాలని కుతూహలంగా ఉంది. పులమావి ఎలాగో నాశనం అయితేనేగాని తన జనకుడు శాంతిమూలమహారాజు సార్వభౌమ సింహాసనం అధివసించడానికి ఒప్పుకోరని వీరిద్దరూ నిశ్చయించుకొని పులమావిపై మహాజైత్రయాత్రకు తన్ను ప్రోత్సహిస్తున్నారని గ్రహించింది. ఆమె చిత్తవృత్తి వెలుగునీడలుగా పరిభ్రమిస్తున్నది. ఏమి బుద్ధిపుట్టిందో మేనత్తల కొమరితలు చెప్పింది ఆలోచించింది.

“శాంతిశ్రీవదినా, బాపిశ్రీవదినా, సరే మీదళాలను ఆయత్తం చేయండి. నేను నా దళాలతో వస్తున్నాను. పెద్దత్తయ్యగారు మనకు నాయకురాలయ్యేటట్లు ప్రార్థించుదాము. అందరము కలసి విజయపురం వెళ్ళి పులమావి విషయం అంతా తెలుసుకొని అతనిమీద జైత్రయాత్ర సాగిద్దాము.”

అప్పటినుంచి సిద్దమై తండ్రిగారిని విజయపురం చెళ్ళడానికి అనుమతి అడిగి, మేనత్తను ఒప్పించి వారందరితో బయలుదేరింది. యశోదా తారానికలతో అంగరక్షణిదళాని వెంటబెట్టుకొని పోవాలని సాలగ్రామం చేరింది.

(2)

శాంతిశ్రీ రాకుమారి తన మేనత్త కూతళ్ళతో వచ్చిందని వినగానే యశోదనాగనికా, తారానికి గంతులువేసి కంగారుపడి పరుగెత్తినారు. ఆ వెళ్లడం శాంతిశ్రీ శిబిరంలోకిపోయి ఆమె పాదాలకెరిగినారు. శాంతిశ్రీ ఇద్దరిని ఒకేసారిగా నిలిఢంగా హృదయాని కదుముకొంది. ఆ ఇద్దరిని వెంట తీసుకొని ఆ బాల ఒక పెద్దశిబిరంలో ఆసనాన అధివసించియున్న పూంగీయ శాంతశ్రీ, బాపిశ్రీ, షష్టిశ్రీల కడకు పోయింది. తారానికా యశోదా ఆ మువ్వురు రాజకుమారికలను బాగా ఎరుగుదురు వీరిదనీఖీరూ వారు మువ్వురకు రండప్రణామాలు చేశారు. వాళ్ళు మువ్వురూ ఈ బాలికలను దరికి చేరదీసి తమకడనే కూర్చోబెట్టుకొన్నారు. పూంగీయ శాంతశ్రీ: తారానికా! మేమంతా జైత్రయాత్రకు బయలు దేరాము.

తారానిక, యశోద: (ఆశ్చర్యంతో) జైత్రయాత్రకే?

బాపిశ్రీ: అవునఱ్ఱా! మీరును కవచాదులు ధరించి, సిద్ధంకండి.

యశోద: మా కవచాదులు ఈలిన్యకటకంలో ఉన్నాయి.

ఇక్ష్వాకు శాంతిశ్రీ: మీ కవచాదులు, మీ ఇతర వస్తువులు కూడా పట్టించుకు వచ్చాను. వారిద్దరికీ మరీ అచ్చర్యం కలిగింది.

యశోద: మనము యుద్ధానికి వెళ్ళడం అంటే?

షష్టిశ్రీ: (యవ్వనం అంకురించబోతున్న బాలిక) యశోదా! మన మహిళలమే కత్తిగట్టి యుద్ధానికి వెడుతున్నాము. వెనుక అర్జునునివంటి వీరుణ్ణి ప్రమీల ఓడించింది. మనం ఒక అధర్మపరుణ్ణి, రాక్షసుణ్ణి ఓడించబోతున్నాము.

తారానిక: రాజకుమారిగారు ఈడున చిన్నలయినా సాత్రాజితివలె మాట్లాడారు.

యశోద: ఇక్ష్వాకులకోడలు కైకేయిలానే మాట్లాడారు.

ఇక్ష్వాకు శాంతిశ్రీ: మా శాంతిశ్రీవదిన కౌసల్య, మా బాపిశ్రీ సుమిత్ర కాబోలు. మా అన్నయ్య దశరథుడా?

షష్టిశ్రీ: మనం యుద్ధానికి సిద్దమై ఉన్నాము. మా పెత్తల్లి సేనా నాయకురాలు.

పూంగీయ శాంతశ్రీ: రండి అమ్మగారి దగ్గరకు పోదాము. ఆమెతో ఆలోచించాలి.

యశోద: మన అపసర్పబలం మనతో ఉండాలికదా....

బాపిశ్రీ: అంతమాత్రమే పురుషులు మనతో ఉండడానికి వీలు.

యశోద: అయితే మా అన్నయ్య మనతో రావాలి. ధనకప్రభువుల అనుమతి పొందవలసి ఉంటుంది.

షష్టిశ్రీ: మా అన్నయ్యగారి దగ్గరకువెళ్ళి వారి ఆశీర్వాదమంది మనలను దారిలో వచ్చి కలుసుకోమను.

హెచ్చుతగ్గుగా రెండువేలమంది అశ్వసాహిణులు, మూడువందల మంది గజసాహిణీలు, రెండువందలమంది రధిక రమణీబృందము, వేయి మందిగల వృషభశకట వాహినీదళం, నాల్గువేలమంది పదాతినులతో వీరనారీ సైన్యం బయలుదేరింది. సర్వసేనాపత్ని ఇక్ష్వాకు శాంతిమూలుని చెల్లెలు పూంగీయ మహారాణి వాసిష్టిపుత్రి శ్రీ శాంతిశ్రీదేవి.

ఈ సైన్యం దినానికి మూడుపర్యాయాలు విడుదులు చేయడమూ, గ్రామాలలో స్త్రీలకు బోధించడం, దిట్టరులైన స్త్రీలను తమ దళంలో నేర్చుకోవడము. పురుషులెంతమంది వచ్చి చేరుతామన్నా శాంతిశ్రీదేవి ఒప్పుకోలేదు. ఒక మహారథమెక్కి రఐసైన్యాధ్యక్షరాలై ముందుగా ఆమే వెళుతూ ఉంటే వెనకనే పదాతినీ దళమునకు బాపిశ్రీ నాయకయై వస్తున్నది. ఆ వెనుకనే ఎద్దు బండ్లదళము తారానిక ఆధిపత్యాన నడుస్తున్నది. సేనాధ్యక్షురాలికి కుడివైపున ఇక్ష్వాకు శాంతిశ్రీరాజకుమారి అశ్వసాహిణీదళం నడపుచు ప్రయాణిస్తున్నది. ఆమె వెనుక, యశోదనాగనిక రక్షకత్వాన ధనుర్వీరాంగ నాదళం నడచుచున్నది. పూంగీయ మహారాణి శాంతిశ్రీదేవి ఎడమవైపున ఆమె కొమరిత శాంతశ్రీ రాకుమారి గజయుద్ధాధిపత్నియై హిమాలయంవలె ఉన్న మహాగజం ఎక్కిసాగిపోతున్నది. నాగదత్తుడు, మరికొందరు పడుచువాండ్రు మారువేషాలతో ఎప్పటి సంగతులు అప్పటికి శాంతిశ్రీదేవికి తెలియజేస్తున్నారు. వీరాంగనా సైన్యము పదిదినాలలో పదియోజనాలు నడిచింది. సైన్యం నానాటికి పెరుగుచున్నది. ఎందుకు ఈ సైన్యం బయలు దేరిందో ఎవరికీ తెలియకుండా కుండిన నగరంలో మహాధాతువును పూజించి, వ్యాఘ్రనదీ సంఘారామం చేరి ఆ వెనుక వేణుసంఘారామం దర్శించి రావాలని వార్తలు మాత్రం ప్రబలజేసారు. సైన్యం సంఖ్య పదివేలకు మించి పోయింది. రెండుమూడు దినాలలో కుండినపురం చెంత విడిది చేసినారు.

ఆంధ్ర వీరాంగనలు సౌందర్యవతులు, దిట్టరులు, సకలకళా కోవిదులు, కుండినపురాధినాథుడు - ఇక్ష్వాకుల ఆడపడుచు పూంగీయమహారాణి బుద్ధక్షేత్ర యాత్రా గమనయే స్త్రీ సైన్యంతో వస్తుందని విన్నప్పుడే ఆశ్చర్య మంది పరివారజనంతో ఆమెకు ఎదురేగి ఆహ్వానించినాడు. వారికి ఊరి చివర ఒక గోరుతం దూరంలో విశాలమయిన మామిడి తోపులలో స్థలం చూపించాడు. ఆ మామిడి తోపుల ప్రక్కనే ఎడతెగని నిర్మలజలంతో కూడిన ఏరు సంగీతం పాడుకుంటూ ప్రవహిస్తున్నది. కుండిన నగరం చుట్టూ వివిధ జాతుల తోటలు ఆ ప్రదేశం అంతా సస్యశ్యామలమై ధనధాన్య సమృద్ధమై ఆంధ్రదేశ పురీమణులలో ప్రసిద్ధి కెక్కినది. నగరానికి ఎగువగా ఒక పెద్ద చెరువు నిర్మించారు. నదిలోనుండి ఒక పాయ ఎప్పుడూ చెరువులోనికి ప్రవహిస్తూ ఉంటుంది.

(3)

కుండిననగరం రుక్మిణీదేవి పుట్టింటి వారిది. విదర్భదేశం యావత్తు ఇప్పుడు ఆంధ్రసామ్రాజ్యంలో భాగము... కుండిననగరంలో పూసలహారాలు, గాజులు అద్భుతంగా చేస్తారు. మట్టిపనిలో ఈ నగరాన్ని మించినది లేదు. అచ్చటి అరజానెడు, పావుజానెడు మట్టిబొమ్మలు వ్యాఘ్రసంఘారామ గుహాకుడ్య విరచితచిత్రాలతో సమంగా, ధాన్యకటక పూర్వశైల సంఘారామ శిల్పాలతో సమంగా, జగత్ప్రసిద్ది నందినవి. బుద్ధుడు, బోధిసత్వుడు, మాయాదేవి మొదలయిన విగ్రహాలెన్నో చేస్తూ ఉండేవారా నగరంలో.

స్పటిక శిలలు, గండ్రఇసుక కరగించి అందులో కొన్ని రసాయని కాలు కలపి గాజు తయారు చేసేవారు. ఆ గాజుతో కంకణాలు పాత్రలు, అద్దాలు, పూసలు మొదలయినవి రంగులు కలిపి పోతపోసి వానికి తళుకు ఇస్తారు. ఈ గాజు పరిశ్రమ విదర్భ దేశంలో ఇక్ష్వాకుల కాలంనాటికి రెండు వేల సంవత్సరాలనుంచి ఉన్నది ఈ దేశం కొండలలో ఇనుము, రాగి, సత్తు దొరుకుతుంది. గోదావరీ నదీప్రాంతంలో బ్రహ్మాండమయిన అడువులున్నాయి. ఆ అడవి కలపతో అతివేడి వచ్చే మంటలుచేసి గాజూ లోహజాతులూ కరిగిస్తూ ఉంటారు ఉక్కు పరిశ్రమకు కుండిన నగరం (ఇప్పటి కొండాపురం) గాజు పరిశ్రమకువలెనే ప్రసిద్ధికెక్కింది కత్తులు, ఖడ్గాలు, పరశువులు, భల్లములు, శతఘ్నులు, ఛురికలు, కవచాలు, శిరస్త్రాణములు నిర్మించేవారు. రామాయణ కాలంలో దండకాటవి-పాండవ కాలంలో విదర్భ దేశమై నేడు ఆంధ్రమహా సామ్రాజ్యమున చేరిన కుండిన నగరంలో తన వీరాంగనా సైన్యంకోసం లక్ష సువర్ణ ఫణాలు ఖర్చుపెట్టి ఆయుధాలు, కవచాదులు సేకరించింది. వాసిష్టీపుత్రి పూంగీయ మహారాణి శాంతిశ్రీదేవి. కుండిన నగరంలో నెలదినాలు విడిది చేసింది వీరాంగనా సైన్యం.

కుండిన నగరంలో తన చెల్లెలు, ఆమె కొమరిత, తన చిన్న చెల్లెలు హమ్మిశ్రీదేవి తనయలిద్దరూ, తన ఏక పుత్రికా స్త్రీ సైన్యం నడుపుకుంటూపోయి విడిదిచేసి ఉన్న విషయమూ, ఆ సైన్యం బయలుదేరిన విషయమూ అన్నీ శాంతిమూల మహారాజుకు ఎప్పటికప్పుడే తెలుస్తున్నది. కాని ఆ మహారాజు మాటలాడడు. బ్రహ్మదత్తుడు మహారాజు నిశ్చలతకు ఆశ్చర్యంపడుతూ ఉన్నాడు. బ్రహ్మదత్తప్రభువు మహారాజు ఏమిచేయునో అని కనిపెట్టుకొని చూస్తున్నాడు. పూంగీయ మహా సామంతాదుల ఆశ్చర్యానికి మేరలేదు. పూంగీయ స్కందశ్రీ మహారాజు కడకు ఆతని రాణి వచ్చి స్త్రీ సైన్యసమేతంగా తాను బౌద్ద పుణ్య క్షేత్రాలు చూచి వస్తానని అనుమతి కోరింది. రాజు సరేనన్నాడు.

వాసిష్టి శాంతిశ్రీ జగత్ప్రసిద్ది చెందిన సుందరి. అన్నగారితో సమంగా అన్ని శాస్త్రాలు చదువుకొన్నది. ధీసంపన్న, రాజకీయ పరిజ్ఞానపూర్ణ. స్కందశ్రీ పురుషులలో సుందరుడు, ప్రసిద్ధవీరుడు. శాంతిశ్రీ అతనిని తానే కోరి విహహం చేసుకొన్నది. స్కందశ్రీకి భార్య తెలివితేటలలో మూడవవంతు లేవు. పైగా ఆ జగదేకసుందరి తనకు దేవేరియై శృంగారా నందకలశాంబుధీస్నాతుణ్ణి చేసేది, వారిరువురి అనుకూల దాంపత్యము జగత్ స్తుత్యమై కావ్యవిషయమై గానం చేయబడేది. వ్యవహారదక్షయైన భార్యమాటకు స్కందశ్రీ మహారాజు జవదాటి ఎరుగడు. ఆమె తన్ను విడిచి పుట్టింటికైనా వెళ్ళలేదు, ఇరువురు కలసి వెళ్ళేవారు. ఇరువురు కలసి వచ్చేవారు. రెండుసార్లు పురిటికి వెళ్ళింది. ఆ రెండుసార్లు పూంగీయ రాష్ట్రపతి భార్యతో విజయపురం వెళ్ళినాడు.

అలాంటి శాంతిశ్రీ నేడు తన కొమరితను తీసుకొని బౌద్ధక్షేత్ర యాత్రకు పోవడం ఆ మహారాజుకు ఆశ్చర్యమూ, బాధా, దుఃఖమూ కలిగించినది. కాని ఈ విషయములో ఏదో పరమరహస్యం ఉందని అతడు తలపోసికొన్నాడు. అయినా తమకందరకు నాయకుడు మహాసామంత శ్రేష్ఠుడూ, మహారాజరాజేశ్వరుడు కావలసిన వాడూ అయిన తన బావగారు మాట్లాడక ఊరుకుంటే తానేమి చేయగలడు?

ఆ దినం మహాసామంతులు సభ చేశారు. చక్రవర్తి సింహాసనంపై ఎవ్వరు అధివసించలేరు. కుడివైపు ఆసనంపై శాంతిమూలుడు కూర్చుండి ఉన్నారు. వేంగీపుర సాలంకాయనుడు, ప్రతీసాలపుర బృహత్పాలాయనుడు, కాంచీపుర పల్లవుడు, పిష్టపురపు మాధవుడు, కళింగపుర వాసిష్ఠుడు, సంగమపుర చాళుక్యుడు, ధనకరాష్ట్రపతి బ్రహ్మదత్తుడు, పూంగీయ స్కంద ప్రభువూ సభ తీర్చి ఉన్నారు.

ధనకప్రభువు: శాంతిమూల మహాప్రభూ! మనవారందరూ కుండినపురంలో విడిది చేసి ఉన్నారు.

స్కందశ్రీ: నారీసైన్యం పదిహేను వేలవరకూ వృద్ధిపొందిందట.

శక్తిశ్రీ సాలంకాయన: స్త్రీలు యుద్ధసన్నద్ధలై అలా వెళ్ళడం మన ఆచారంకాదు ఇక్ష్వాకు మహాప్రభూ!

మహాశ్రీ బృహత్పాలాయన: ఇది తాము పంపించినదా?

ధనకప్రభవు: మన వారి ఉద్దేశం మహారాజుకు తెలియదు.

వాసిష్ఠి ఉదయశ్రీ: మా మరదలు శాంతిశ్రీదేవి సేనానాయకురాలై ఆ సైన్యాన్ని నడుపుతున్నదట.

మాఠరగోత్రజుడు ఆనందశ్రీ: మా మనుమరాండ్రందరూ కూడా ఉన్నారని వినికిడి.

(4)

శాంతిమూలప్రభువు: మహాప్రభువులందరికీ నా మనవి ఒక్కటే ఉంది. పూంగీయ మహారాజ్ఞి బౌద్దదర్మాభిరత. ఆమెకు బౌద్ధక్షేత్రాలన్నీ దర్శనం చేయాలని కోరిక పుట్టింది. ఆమె పూంగీయమహారాజు అనుమతి అడిగి తనకడ ఉండే నారీ సైన్యాన్ని వెంటబెట్టుకొని యాత్ర ప్రారంభించింది. ఇందులో మనం భయపడవలసిన పని ఏముంది? ఆమెకూ రాజకుమారికలకూ సైన్యానికీ ఆపత్తు ఏదన్నా వస్తుందంటే వెంటనే మనసైన్యం శరవేగంతో అక్కడకు వెళ్ళి వాళ్ళకు సహాయం చేస్తుంది.

మాఠరిప్రభువు: మహాప్రభూ! ఆపద వచ్చినవెనుక మనకు తెలియడ మెప్పుడు? మన సైన్యాల్ని పంపడమెప్పుడు?

ధనకప్రభువు: మహాప్రభూ! నన్ను వెంటనే సైన్యాలతో వారికి సహాయంగా వెళ్ళుమంటే....

వాసిష్ఠప్రభువు: నేను సిద్దంగా....

సాలంకాయనప్రభువు: నేను వెంట.....

బృహత్పాలాయనప్రభువు: నేనూ అంతే!

శాంతిమూల: మీ కందరికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞత!

పూంగీయ మహారాజు: మహాప్రభూ! మాకందరకూ వెంటనే అనుజ్ఞ ఈయ కోరుతున్నాను.

శాంతిమూలమహారాజు: (చిరునవ్వునవ్వి) నేను మూడుదినాలపాటు ఆలోచించి తమకందరికి మనవి చేస్తాను. నేను మూడు దినాలు వ్యవధి ఎందుకు అడిగానో అదిన్నీ మనవి చేస్తాను.

మహారాజు ఈ మాటలు అనగానే సభ సమాప్తమయింది. మహారాజులందరు దగ్గరిచుట్టాలు. అందరు ఈ విచిత్ర సన్నివేశం ఎప్పుడూ ఎరుగము అనుకున్నారు. శాంతిమూలుడు తిన్నగా పట్టపురాణి మాఠరీ సారసికాదేవి అంతఃపురానికి వెళ్ళినాడు. సారసిక భర్తపాదాలు కడిగి నీళ్లు తలపై జల్లుకుని, పూజించి ఆ పూవులు తలలో పెట్టుకున్నది.

సారసికాదేవి: అవధారు!

శాంతి: దేవీ! అమ్మాయి మేనత్తతోకలిసి వెళ్ళింది. మా చెల్లెలు ఈ ప్రయాణం ఎందుకు తల పెట్టిందో?

సార: ప్రభూ! వదిన హృదయంలో ఉన్నదే మా అందరి హృదయంలో ఉంది.

శాంతి: విన కుతూహలం కలిగినది.

సార: ధర్మం విచ్ఛిన్నం అయిపోతున్నదని అందరి హృదయాలలో భయం ఉద్భవించింది. అతడు కొంత సేపాగి,

శాంతి: ధర్మం విచ్చిన్నం అవడం ఎలా సాధ్యం?

సారసిక చటుక్కున భర్త పాదాలకడ చతికిలబడింది. ఆ అరడుగుల మహోన్నత రూపుడు, శాంతిమూలుడు దేవిని ప్రేమతో లేవదీసి తన ప్రక్క సింహాసనంమీద కూర్చుండబెట్టుకున్నాడు.

దేవి తలవంచి, “ప్రభూ! నాకు ఏమీ కాంక్షలు లేవు. అది మీకు తెలుసును” అన్నది.

“దేవీ! అది నాకు నువ్వు చెప్పాలా? నీ హృదయం ఈనాటి స్త్రీలలో ఎవరికి ఉంది?”

“నేను సామ్రాజ్ఞిని కావాలని ఆశించుటలేదని హృదయేశులే బాగా ఎరుగుదురు.”

శాంతమూలుడు పల్చని బంగారు శలాకవంటి తన మహారాణిని అవబృధ స్నాతమైన సారసికాదేవిని తన హృదయానికి అదుముకొన్నాడు.

“ఎవరైనా నీకు ఇసుమంతైనా కాంక్ష ఉందని అనగలరా, దేవీ?”

“కాని ధర్మరక్షణకోసం తాము చక్రవర్తి సింహాసనం అధివసించి తీరాలి. ధర్మసంస్థలు, బ్రాహ్మణ వంశాలు, ప్రజాకోటి క్షేమంగా ఉండాలంటే, దేశంలో కాటక మహారాక్షసి అవతరించకుండా ఉండాలంటే, తాము చక్రవర్తులు కావాలి. ఈనాడు మన కందరు చుట్టాలు. రేపు వారిలో వారు రాజరాజాధిపత్యం కోసం యుద్ధాలు చేయవచ్చును. మహా ప్రభూ! ఇవన్నీ మేము ఆలోచించాము. మా వదినగారు తాను చేసేపనికి సహాయం చేయమని మాత్రం మమ్ము కోరింది. మా పరిచారికలలో దిట్టమయిన వారి నందరికి తాను వీరాంగనలుగా శిక్షణ ఇచ్చింది. బిడ్డల నందరిని తీసుకువెళ్ళింది. ఆమె అంటే మా కందరికి సంపూర్ణ విశ్వాసం. అంతకన్న నాకు ఏమీ తెలియదు ప్రభూ!” శాంతి మూలుడు విశాలమైన తనపాలాన బొమలు ముడివడ ఆలోచించి ఒకసారిగా చిరునవ్వు నవ్వినాడు.

(5)

వీరాంగనాసైన్యం మహావేగంతో ప్రతిష్టానపురం చేరింది. ఆ మహానగరంలో ఇప్పుడెవ్వరూ చక్రవర్తి ప్రతినిధిగా లేరు. ఒక సేనాపతి గండర గండలయిన వీరులతో కాపలా కాస్తున్నాడు. శాంతిమూల మహారాజు చెల్లెలూ, మేనకోడళ్లూ, ఆయన కొమరితా సైన్యాలతో వ్యాఘ్రానదీ సంఘారామం వెళుతూ వచ్చారని ఆ సేనాపతి - భోజుడయిన కుమారదేవుడు విన్నాడు. ఏమి చెయ్యాలో అతనికి తోచలేదు. ఏ కారణంచేతనో స్వామికడనుండి ఎట్టి వార్త రాలేదు.

తమ్మందరినీ మోసంచేసి ఓడించిన ఇక్ష్వాకు శాంతిశ్రీ రాకుమారి ఈ స్త్రీ సైన్యంలో ఉంది. స్త్రీల సైన్యం రావడమే చాలా కొత్తగా ఉంది కుమార భోజునికి. అలాంటిది ఆ రాక్షసి కూడా 'ఆ స్త్రీలలో వస్తున్నది. తానేదయినా తెలివితక్కువ పనిచేసి ఓడిపోతే ఇంక' ఆడవాళ్ళతో ఓడిపోయాడు కుమార భోజు'డని లోకం అంతా అవహేళన చేస్తుంది. ఒకవేళ నెగ్గినా ఏమివుట్టి మునుగుతుందో? ఏమీచేయకుండా ఊరుకొంటే ఎందుకు ఊరకొన్నావు అని అడగవచ్చు.

పూంగీయ మహారాణి శాంతిశ్రీ కుమారభోజుని గడబిడ నిమిషంలో గ్రహించుకుంది. తన సైన్యాలముందు సప్తవాద్యాలు భోరుకొల్పించి తిన్నగా రాజనగరుకు నడిచింది. పట్టణంలో ఉన్న సైనికులు ప్రజలు ఈ వీరాంగనా సైన్యాన్ని ఆశ్చర్యపూరిత హృదయులయి చూస్తున్నారు. శాంతిశ్రీదేవి, శాంతశ్రీ, ఇక్ష్వాకు శాంతిశ్రీ, బాపిశ్రీ, షష్టిశ్రీ రాజకుమారికలు కూడరా కోటలోనికి ప్రవేశించింది. ఆమెకు కుమారభోజు డెదురయి మోకరించి నమస్కరించినాడు. అక్కడే మదగజాలు దిగి ఆమె ఆ బాలికలతో అంగరక్షణీ జనంతో కుమారభోజుని చూచి “కుమారభోజ సేనాపతీ! మీరు ఇంత వరకు శాతవాహన చక్రవర్తులకు రాజభక్తితో సేవ చేసినారు. ఇప్పుడు వారిని కాదని ఈ మహా దక్షిణాపథాన్ని ముక్కలు ముక్కలు చేసిన వారితో చేరి రాజద్రోహమూ, దేశద్రోహమూ చేస్తారా?” అని ప్రశ్నించింది. కుమార భోజుడు ఆశ్చర్యం పొందినాడు. అతడు ఏమి ప్రత్యుత్తరం ఈయాలో ఆలోచించుకోలేక పోయినాడు.

“కుమారభోజ సేనాపతీ! మాకు భోజులెప్పుడూ స్నేహితులు. వారు ఈ దేశ గౌరవమూ, ధర్మరక్షణా అనేవి మరచిపోయి, ఈ మహారాజ్యాన్ని విచ్ఛిన్నం చేయదలచుకోరు. మీరు మాపక్షం చేరండి. పులమావి ఇచ్చే గౌరవం కన్న మేము ఎక్కువగా మిమ్ము గౌరవిస్తాము. ఇక్ష్వాకుల బాలికలు సౌందర్యవతులు. మా అన్నయ్యగారి నాల్గవదేవి కొమరిత విజ్ఞాశ్రీ రాకుమారిని మీరు వివాహంకండి. మీరు మాలో చేరండి. ఇది నా కోరిక!” అని శాంతిశ్రీదేవి తెలిపినది. కుమారభోజ సేనాపతి యౌవనం మళ్ళీ కౌమారదశ అందుకోబోయే ఇరువది అయిదేళ్ళ ఈడునాడు. యుద్ధజీవనంగా పెట్టుకొని, వివాహం చేసుకోకుండా జీవిస్తున్నాడు. అతని మందిరాలలో విలాసినులు ఇరువురు మువ్వురు ఉన్నారని అందరు ఎరుగరు.

“కుమారభోజ సేనాపతీ! నాకు మీ భావం రెండు ఘడియలలో తెలుపండి. కాదని మాపై కత్తికడతానంటారా మిమ్ము ఇప్పుడే బందీచేస్తాము. ఎదిరిస్తే మీ సైన్యాన్ని నాశనం చేస్తాము” అని గంభీరంగా శాంతిశ్రీ మహారాణి వ్రాక్కుచ్చినది. అ మాటలనడంతోటే ఇరువురు రక్కసులవంటి స్త్రీలు వచ్చి కుమారభోజుని రెండు రెక్కలు పట్టుకున్నారు. మూడవస్తీ వచ్చి ఆయన కత్తిని ఒరనుండి పెరికి శాంతిశ్రీదేవి పాదాలముందు పెట్టింది. సేనాపతి అంగరక్షకులు కన్ను తెరిచి మూసేలోపల ఇరువదిమంది కఱకు స్త్రీలు వారినందరినీ బంధించారు. పూంగీయ శాంతశ్రీ కత్తిపై నెత్తి నిలిచిన వెంటనే వందిమాగధురాండ్రు తమ కత్తులెత్తి “జయజయ సకల దక్షిణాపథపతీ! శ్రీశ్రీ శాంతిమూల సార్వభౌమా జయజయ” అని అరచినారు. ఆ అరపు గుర్తుగా రెండు విఘడియలలో కోటలో ఉన్న సైనికులందరినీ ఆ వీరనారీమణులు బంధించారు. కోట బయటనున్న గజ తురగ పదాతిదళాలు నగరంలో గోదావరితీరంనుండి మెట్టవరకూ సంచరించుచు, అక్కడక్కడ ఉన్న సైన్యాలను బందీచేసి నగరం అంతా ఆక్రమించినవి. శాంతిశ్రీ మహారాణి వెంటనే మహాసభకుపోయి రాజప్రతినిధి సింహాసనం అధివసించింది.

(6)

పూంగీయ మహారాణి శాంతిశ్రీదేవి ప్రతిష్ఠానంలో స్థిరనివాసం పెట్టుకుంది. అక్కడనుండి ఇక్ష్వాకు శాంతిమాలుని పేర రాజ్యపాలన ప్రారంభించింది. ఆ చుట్టుప్రక్కలనున్న పర్వత నగరాలు అనేకం ఆమె పట్టుకొని లోబరచుకొన్నది. కొన్ని సైన్యాలతో ఇక్ష్వాకు శాంతిశ్రీ రాకుమారి నాసిక మహానగరం ఆక్రమించుకొన్నది. ఆమెతో తారానిక యశోదలున్నారు. మరికొన్ని సైన్యాలతో పూంగీయరాకుమారి శాంతిశ్రీయు, బాపిశ్రీయు వాతాపి నగరం పట్టుకొని అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొన్నారు.

ఈ వార్తలు పులమావి వినగానే నిరుత్తరుడయిపోయినాడు. ఇక్ష్వాకు స్త్రీలు మగవీరులా! వీళ్లకు బుద్ది చెప్పకపోతే నగరం తర్వాత నగరం లోబడిపోతున్నది. శాంతిమూలుడు దద్దమ్మయి ఆడవాళ్ళను పంపిస్తున్నాడా? అందుకే కాబోలు వెనక తనమీదకు ఆ పిచ్చిది శాంతిశ్రీ రాకుమారి ఎత్తి వచ్చింది. ఈ ఆలోచనలు మతి పోగొట్టినవి పులమావికి. అతనికి వెఱ్ఱికోపం వచ్చింది. మళ్ళీ జాగ్రత్తగా సిద్ధంచేసిన సైన్యం అంతటిని వెంటనే కదిలించాడు. జయభేరి వేయించి అతివేగంగా వెళ్ళదలచినాడు. ఈ యువతుల నందరిని కలిపి మానభంగం చేయాలనుకున్నాడు. కళ్ళలో ఎరుపుకాంతులు వేసవి సూర్యమండలాలులా వెలుగుతున్నవి. మహాఝరులవల్ల సముద్రకల్లోలాలులా కనుబొమలు ముడులు పడిపోయినాయి.

నూతనాయుధాలు, నూతనయుద్ధవిధానాలు సమకూర్చుకున్నాడు. తానే సర్వసేనాధ్యక్షుడు. మహావేగంతో పులమావి కొండలుగడచి, నదులుదాటి, అడవులు సమంచేసి, మూడులక్షల మహాసైన్యంతో ఉప్పెన పొంగినట్లు, దావానలం విజృంభించినట్లు నాసికపై విరుచుకు పడినాడు. నాసిక వింధ్యపర్వత బాహువైన సహ్యపర్వతాలలో ఉంది. ఆ కొండలోయలన్నిటికడ దిట్టరులైన సైనికుల నుంచాడు. ఆ సైన్యాలన్నీ ఒకలక్ష బలగం, తాను నాసికను ముట్టడించింది ఒకలక్ష సైన్యంతో.

శాంతిశ్రీరాకుమారి పులమావి వస్తున్నాడని వినగానే చిరునవ్వు నవ్వుకొన్నది. ఆమెకు భయం కలుగులేదు. ఆమెలోని శిశుత్వం మాయమయింది. ఏదో ఆనందం పొడమినది. ఒక పౌరుని పిలిచి "స్వామీ! మీరు మా రాయబారిగా పులమావి దగ్గరకు పొండి. అహింస పరమవ్రతం మా కని అతనికి నా మాటగా తెల్పండి. 'హింసనే ఆరాధిస్తూ రాక్షసుడు కాదలచుకున్న తన్ను మా ధర్మమే నాశనం చేస్తుంది అని చెప్పండి” అని పంపినది.

అతడు “ఇదేమి రాయబారమురా' అనుకొనుచు తిన్నగా పులమావి దగ్గరకుపోయి రాయబారమంతా విన్నవించాడు. వెనుక పులమావి ఓడినపుడు ఇటువంటి రాయబారమే. అప్పుడు బ్రహ్మదత్త మహారాజు స్వయంగా వచ్చాడు ఇప్పుడీ శుంఠయెవడో వచ్చినాడు. వీళ్ళను ఆదరించక వెంటనే విషపు పురుగులను నాశనం చేయాలి అని యెంచి "ఓయీ సేనాపతీ! ఈవెఱ్ఱి వానిని స్కంధావారంమధ్య కోటలోని వారికి కనపడేటట్లు ఎత్తైన మంచెపై తలతెగవేయించు. కోటలోని వారికి నా ఆజ్ఞగా ఇట్లు తెల్పు.”

“మీరు ఆడవాండ్రమాటలు వినక, కోటను మాకు ఒక జాములో స్వాధీనం చేయవలసినది. అలా చేయకపోతే ఈ నగరం యావత్తూ గోదావరిలో కలిపి, మగపురుగు లేకుండా హతమార్చి, ఆడవాళ్ళని మా సైనికులకు ఉంపుడు కత్తెలుగా ఇచ్చివేస్తాము. లేదా ఇక్ష్వాకు శాంతిశ్రీ ఒకర్తె మాకు ఈలోపల ఉంపుడుకత్తెగా రావలసినది. ఆమె రానని నిరాకరిస్తే నగరవాసులు ఆమెనుపట్టి పట్టి బందీగా అప్పగించవలసినది” అని ఆదేశించెను. ఈ ఆజ్ఞ కోటలోవారికి వినబడేటట్లు పులమావి మాగధులు వినిపించారు.

ఒక క్షణికం గడిచింది. రెండు క్షణికాలు గడచినవి. పదునైదు విఘటికలు గడచిపోయినవి. కోటగోడలనుండి ఒక తాడు నిచ్చెన క్రిందకి వాలింది. ఆ గోడల పైన ఎవరూ కనపడలేదుగాని ప్రతి లగ్గలపత్రం వెనుకా ధనుస్సు ఎక్కుపెట్టి వీరాంగనలు గరుడుని చూపులతో విరోధుల గమనిస్తూ గాలయినా పీల్చకుండా శిల్పాలులా ఉన్నారు. తాడు నిచ్చెనకడ ఒక యువతి తెల్లని దుస్తులు ధరించి సంపూర్ణభూషణ భూషితురాలై కనపడింది. ఆమె అతివేగంగా నిచ్చెననుండి కందకము వరకు దిగి, నీళ్ళలో ఉరికింది. ఆ నీళ్ళలో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చింది. ఒడ్డుకు రాగానే ఒకసైనికు డామెకుచేయి అందిచ్చి లేవదీయబోయినాడు. వెంటనే ఒక నిశితమైన బాణం సువ్వున వచ్చి చాచిన ఆతని చేతిని దూసుకుపోయింది. ఆ భటుడు కెవ్వున కేక వేసెను కత్తులుదూసి పదిమంది భటులు ముందుకురకబోతే బాణాలు వచ్చి వారివక్షముల నాటుకున్నాయి. అందరూ ఆగిపోయారు. ఆ యువతి తోడనే గట్టెక్కి తడిబట్టలు తన దివ్య సౌందర్యమును ఇనుమడింప జేయగా, నడుమున కట్టుకొన్న మైనపుసంచి ముడి సడలించి అందులోనుండి ఒక శాలువ తీసి కప్పుకుంది.

“మీరంతా మా జాగరూకత చూచినారుకదా! నా జోలికి ఎవ్వరూ రాకండి. నేను చక్రవర్తి శాంతిమూల సార్వభౌముని తనయను. నాతో మాట్లాడి, నన్ను బందిగా పట్టుకు వెళ్ళదలచుకున్న పులమావి దగ్గరకు నాకు దారిచూపండి” అని కత్తి తళుకులవలె మాటలాడింది. మహాశరమును చూచిన వారివలె ఆమెను చూచిన వారు గజగజ లాడిపోయినారు. సేనాపతి ముందు దారి చూపుచుండగా శాంతిశ్రీరాకుమారి అదృష్ట దేవతలా, విధినిలాసములా, మహామంత్రములా, మహర్షి శాపములా అతని వెనుకనే నడిచి పోయింది. పులమావి గుడారములోకి వెళ్ళగానే రక్కసిమూకలా ఆడవాళ్ళు కొందరు ఆమె చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఆమె నడుముచుట్టూ కత్తికట్టారు, బాకు ఉందేమో పరీక్షించినారు. పులమావి ఆమెవైపు రెప్పవాల్చకుండా చూస్తూ నిలుచుండినాడు.

(7)

“దీన్ని నా శయ్యాగృహంలో చేతులూ, కాళ్ళూ కట్టివేసి నోట్లో గుడ్డలు కుక్కి దెసమొలగా ఉంచండి” అంటూ పులమావి పళ్లు బిగించి, కళ్ళ వెంట పైశాచికకాంక్షలు కక్కుతూ ఆజ్ఞ ఇచ్చినాడు. శాంతిశ్రీని ఆ పైశాచికాంగనలు బరబరలోని గుడారములోనికి లాగికొనిపోయారు. ఆమె కన్నులు మూసికొని, వారేమి చేసినా మాట్లాడక ఊరకొన్నది. ఆ బాలిక వస్త్రాలన్నీ ఒలిచివేసినారు. స్వచ్ఛ హిమాలయ శిఖరంపై బంగారు కిరణాలు ప్రసరించినట్లున్న ఆమె దేహంలో చైతన్యమేలేదు. ఆ పైశాచికాంగనలు ఆ బాలికను మంచంపై వెల్లకిలా పరుండబెట్టి చేతులు తలవైపు రెండుకోళ్లకూ, కాళ్లను దిగువవైపు రెండు కోళ్లకూ కట్టివేసిరి.

ఆమె దివ్యసౌందర్యం పందులవంటి ఆ ఆడవాళ్లకు రాక్షసత్వాన్ని ఎక్కువ చేసింది. కొందరు స్త్రీ లామెను కసికొద్దీ గిల్లినారు. ఆ బాలిక కన్నులు మూసుకొనే ఉన్నది. మాటలేదు. ఆమె మోము నిర్మల నీలాకాశంలో పూర్ణ చంద్రబింబంలా ఉన్నది.ఆమె మోము ధవళకాంతి ప్రజ్వలిత హిమాలయశిఖరంలా ఉంది. ఆమెమోము వేదమంత్రంలా ఉన్నది, ఆమె మోము బుద్ధదేవ పవిత్ర హస్తతలంలా ఉన్నది. ఆ స్త్రీలు తమ పని నిర్వర్తించి వెళ్లిపోయారు. ఒకతెపోయి సార్వభౌముని ఆజ్ఞ నిర్వర్తించినామని మనవిచేసింది పులమావితో. పులమావి ద్రాక్షసారాయం సేవిస్తూ అభ్యంతరమందిరంలో తాను సాధించబోయే మహావిజయానికి తగిన బలం చేకూర్చుకొంటున్నాడు. అతని కళ్లు చింతనిప్పులులా ఉన్నాయి. మనుష్యమాంసం తినబోయే రాక్షసుని హృదయంలా అతని కామకాంక్ష వికటతాండవం చేస్తున్నది.

దొరికింది రాక్షసి! ఎక్కడకు పోతుంది? ఎవ్వరు అడ్డంరాగలరు, మహాశక్తిమంతుడైన పులమావిని అవమానించి ఎవరు బ్రతుకగలరు? అతడు ఒంటినిండ సువాసనద్రవ్యాలు పులుముకున్నాడు. దాసీలు అందిచ్చిన సువాసన తాంబూలం నమిలివేశాడు. పైనున్న ఉపవీతం అవతల గిరవాటు వేసినాడు - నడుముననున్న మణులు పొదిగిన పిడిగల బాకును తీసిదూరంగా నిసరివేసినాడు. రొమ్ము విరిచి ముందుకుచూచి, “ఒసే దాసీ! మేము అందంగా లేమటే?” అన్నాడు.

“మీరు లోకాద్భుత సుందరులండీ చక్రవర్తీ!”

“అయితే మమ్ము ఎందుకు ఆ రాక్షసి పెళ్లి చేసుకోనంటుంది?”

“అది వట్టి పిచ్చిదండి సార్వభౌమా!”

“ఛీ దుర్మార్గురాలా! ఇప్పుడు మేము గాంధర్వంగా వరించబోయే పడుచును పిచ్చిదంటావా?”

“శాంతిశ్రీ రాజకుమారి కాదండి పిచ్చిది, నేనండి” అంటూ వణికిపోయింది.

“నువ్వుకాదు మేము పిచ్చివారము. ఈ శాంతిశ్రీ అందంగా ఉంటుందా?”

“చిత్తం సార్వభౌమా!”

ఆ దాసీదాని భుజంమీద చేయివేసి, తూలుతూ “దారి చూపించు మాకు” అన్నాడు. ఆమె జాగ్రత్తగా పులమావిని ఆ నగ్నసుందరిని కట్టి ఉంచిన శిబిరం కడకు తీసుకొని పోయింది. ఆ శిబిరం రెండుగదులుగా విభజింపబడియున్నది. ఆ శిబిరం పులమావి స్వయంగా నిద్రించే డేరా. ఆ డేరా పట్టుతోకుట్టి ముత్యాల అంచులతో, చిత్రములతో అలరారుచున్నది. ఆ డేరాలోనికి పులమామి ప్రవేశించినాడు. తాను నిద్రించే ప్రదేశానికి తెర ఈవల నిలుచున్నాడు.

“నేను వస్తున్నాన్. నీ అందమైన దేహం నా స్పర్శతో ముడుచుకు పోతుందా?” అంటూ తెరలోనికి అడుగిడబోయి “ఆ! బుద్ధప్రభూ” అంటూ కుడిచేయి గుండెమీదవైచి నొక్కుకుంటూ తూలి విరుచుకుపడిపోయినాడు. దాసీది 'సార్వభౌమా! సార్వభౌమా' అంటూ క్రింది రత్నకంబళిమీద పడిపోయిన పులమావి దగ్గర కూర్చున్నది పులమావి కళ్లు తిరిగిపోతున్నాయి. నోట రక్తం వస్తున్నది. 'అయ్యో చక్రవర్తికి జబ్బు చేసిం’ దంటూ పొలికేకలు పెట్టింది. దాసీలెందరోపరుగిడి వచ్చారు. అక్కడేఉన్న ఒక పల్యంకంపై పులమావిని పండుకొనబెట్టిరి. వైద్యుడు పరుగునవచ్చి చూచాడు. పులమావి దేహంలో ప్రాణంలేదు. ఒకదాసి తెర ఒత్తిగించి పడకగది చూచింది. తల్పంపై నగ్నసుందరిలేదు.

8

“ఏమిటి నువ్వు శాంతిశ్రీవా?” అని పులమావి రాణి ఆ బాలికను అడిగింది.

“అవునమ్మా అవును. నన్ను నీ భర్త ఏమీ చేయలేడని సంపూర్ణ నమ్మకం. నన్ను పరమశ్రమణకుడు ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు.”

ఎప్పుడు దాసీలు శాంతిశ్రీని నగ్ననుచేసి పల్యంకానికి కట్టిపోయినారో ఆ వెంటనే పులమావిరాణి ఆ శిబిరంలోకి చక్కావచ్చింది. ఆ బాలిక పాండ్యుల ఆడబడుచు. భర్త దుర్నీతి ఆమెను దహించి వేస్తున్నది. ఇక్ష్వాకు రాజులకు లోబడి రాజ్యం చేసుకోవలసిందని ఆమె భర్తకు వేయివిధాల చెప్పి చూచింది. కాని ఆ దుష్టబుద్ది ఆమె ఆలోచన ఆవగింజంతైనా వినలేదు.

ఆ శ్వేతశ్రీదేవి శాంతిశ్రీ రాకుమారిని చూచి కన్నులనీరు తిరుగ ఆమె కట్లన్నీ విప్పి వేసి ఆమె సౌందర్యానికి తానే ఆశ్చర్యపడుచు తాను తెచ్చిన చీర కట్టి మేలిముసుగువైచి తన శిబిరంలోనికి తీసుకుపోయినది. ఇంతలో 'పులమావి మహావాతంచేసి పడిపోయినాడు' అని ఒక దాసీ పరుగున వచ్చి తెలిపినది.

రాణి “అయ్యో” అంటూ ఆ వెంటనే పరుగుపరుగున పులమావి శయన శిబిరానికి వచ్చి వాలింది. పులమావిపై వాలి అతడు విగతజీవుడైనాడని వెంటనే గ్రహించినది. “ఏమయ్య! ఏమిటిది?” అని వైద్యుని ప్రశ్నించినది. వైద్యుడు తలవాల్చినాడు. ఆమె “పరమశివా” అని విరుచుకు ఆ శవముమీదే పడిపోయింది. శాంతిశ్రీ రాకుమారి కదలక రెప్పవాల్చక అటులనే చూస్తూ నిలబడిపోయింది. అప్పుడు తృణావర్తంలా, సుడిగుండంలా, మండుతున్న కొరివిలా ఒక బాలిక ఆ గదిలోనికి పరుగెత్తుకొని వచ్చింది.

“నా ప్రభువు చనిపోయినాడా? ఈ రాక్షసి, ఈ తాచుబాము, విషపుకుండ నా మహారాజును చంపిందా? ఓసీ! రాక్షసీ నువ్వెందుకు దాపరించావే! మొదటినుండీ నీ కోసం మా చక్రవర్తి, మా జగదేకవీరుడు వెఱ్ఱివాడై పోయినాడు. ఓసి పిశాచీ, ఢాకినీ! నా చక్రవర్తిని పొట్టబెట్టుకున్నావా?” అంటూ మొలనుంచి బాకును సువ్వునలాగి శాంతిశ్రీపై బడింది. శాంతిశ్రీ మాటలాడలేదు. చిరునవ్వుతో అలాగున నిలుచున్నది. ఆ నూత్న బాలిక శాంతిశ్రీపై ఉరకడంతోడనే గర్భగుర్విణి అయిన మహారాణి భర్త శవంపైనుండి చటుక్కునలేచి, 'ఆగు' అని అరచింది. ఆమె కన్నుల నీరు కారిపోతున్నది. ఆమె గజగజ వణికిపోతున్నది.

“ఆగు” అన్న మాటకు ఆ బాలిక ఆగిపోయినది.

“ఎవరు నువ్వు?”

“నేను మహారాజునకు నూత్నరాజ్ఞిని.”

“చెల్లీ! మనకర్మవల్ల సంభవించిన ఈ విపత్తుకు శాంతిపుంజమైన శాంతిశ్రీ రాకుమారి కారణమా? నువ్వు వెళ్ళు రాకుమారీ! మమ్ము మా దుఃఖం దహించి వేయనీ” అని పలికి నెమ్మదిగా లేచి ఆ కొత్తబాలిక దగ్గరకుపోయి “చెల్లీ రా. మనం భక్తితో సహగమనంచేసే సన్నాహాలు చేసుకోవాలి” అన్నది.

శాంతిశ్రీ ఒక్క ఉరుకున మహారాణి కడకువాలి “మహారాణీ! నువ్వు నిండు చూలాలివి. సహగమనచితాగ్ని ఎలా అధివసించగలవు? అది దోషం. నువ్వు శిశుహత్యా దోషానికి పాలుబడతావా?” అని అడిగింది. మహారాణి తెల్లబోయి ఆగిపోయింది. “మహారాణి! నీకు పుట్టుబోయే కుమారుని దుర్విధివిపాకాన కాల్చివేస్తావా? నీ భర్తకూ నీకూ గతులువద్దా?” అంటూ శాంతిశ్రీ నిశ్చల లోచనాంచలాల అశ్రుబిందువులు దొరగగా ప్రశ్నించింది.

వైద్యుడు “మహారాణీ! శాంతిశ్రీ మహారాజకుమారి మనవి పాటించండి. ఈ గర్భస్థ శిశువును నాశనం చేయడానికి మీకు ఏమి అధికారం ఉంది?” అని మనవి చేసినాడు. ఇంతలో గుమ్మం దగ్గరనుండి “మహారాణీ! పులమవి మహారాజు సింహాసనానికి కూడా ధాన్యకటక సింహాసనం గతిపట్టించకు” అని గంభీర వాక్యాలు వినబడేసరికి అందరు సంభ్రమాన గుమ్మంవైపు తలఎత్తి చూచినారు. గుమ్మందగ్గర దివ్యకాంతితో తేజరిల్లుతూ బ్రహ్మదత్తప్రభువు నిలిచి ఉన్నారు. శాంతిశ్రీ “గురుదేవా! మీరెప్పుడు వచ్చినారు” అని అడిగి ఆయన పాదాల వాలినది. బ్రహ్మదత్తుని వెనుకనుండి “మహారాణీ! ధర్మానికి బద్ధురాలవై కుమారుని ధర్మస్వరూపునిగా పెంచటం మీ కర్తవ్యం. రాజధర్మాన్ని ఉల్లంఘించకండి” అని శాంతిమూల మహారాజు ముందుకు వచ్చారు. మహారాణి తలవంచుకొని 'అలాగే' మౌనాంగీకార సూచకంగా శాంతమూలునికి బ్రత్యుత్తర మిచ్చింది.

★ ★ ★