అడవి శాంతిశ్రీ/అష్టమ భాగం
అష్టమ భాగం
అస్తమయం
సూర్యదేవుడు ఎఱ్ఱబారి, వృద్దుడై, నెమ్మదిగా అపరాంబోధిలోనికి జారిపోయినాడు. అతనివెంట అరుణకాంతులు చేరిచేరి ముద్దకట్టి పశ్చిమ సముద్రతరంగాలతో కలిసి క్రిందికి దిగిపోయినవి.
“క్రుంకినది సూర్యకాంతీ
కోటివెలుగుల దివ్యకాంతీ
క్రుంకినది సూర్యకాంతీ
దినమంత వెలిగింది
జగమంత బ్రతికింది
నూత్న సృష్టులచేసి
నూత్న జీవుల నిచ్చి
క్రుంకినది సూర్యకాంతీ
కోటివెలుగుల దివ్యశాంతీ
తూర్పు పడమటి అలల
తోచినది ఒక వెలుగు
హిమనగ శ్వేతాగ్ర
మమృతబిందుల కురిసి
క్రుంకినది సూర్యకాంతీ కోటివెలుగుల దివ్యకాంతీ”
క్రుంకినది సూర్యకాంతీ అన్నపాట దెసదెసలు ప్రసరించినది. పులమావి పట్టుబడ్డాడు. బందీగా ధాన్యకటకనగరానికి తీసుకువస్తున్నారు. కోల కొలది పణాల బంగారురాసులు చక్రవర్తి కోశాగారానికి వస్తున్నవి అన్న వార్త వినగానే చక్రవర్తి అతి సంతోషాన లేచి అతిత్వరితగమనాన అంతఃపురం వీడి సభాభవనానికి వస్తూ మధ్యమందిరంలో ఒక బౌద్ధధర్మకలశ శిల్పవిన్యాస స్తంభం ఎదుట హృదయస్పందన మాగిపోయి ఇంద్రహస్త వినిర్ముక్త వజ్రాఘాతంవల్ల కూలిన మహాపర్వతంలా కూలిపోయినాడు. సేవకులు, వందులు, పారిపార్శ్వకులు, అంగరక్షకులు హాహాకారాలతో శ్రీశ్రీ విజయ శాతవాహన చక్రవర్తి కడకు ఉరికినారు.
చక్రవర్తి నోటరక్తంనురుగులు వస్తున్నాయి. వైద్యుడు అని కేకవేసినా డొక కంచుకి. సేవకులు పరుగెత్తి ముందుమందిరంలోఉన్న రాజవైద్యుని కొనివచ్చారు. చక్రవర్తి ఈ లోకము వీడిపోయినాడు. దేహాన సమస్త నాడులు ఆగిపోయాయి. రాజవైద్యుడు అమృతాదులు ఉపయోగించినాడు. చక్రవర్తి చనిపోయినది నిశ్చయము. అంతఃపురాన హాహాకారాలు మిన్ను ముట్టినవి. ధాన్యకటకనగరం దుఃఖసముద్రంలో మునిగిపోయినది. శ్రీముఖ శాతవాహన చక్రవర్తి సకల భారతవర్షానికీ చక్రవర్తి అయిన ఆంధ్ర మహారాజు. అప్పటికి అనేక శతాబ్దాల నాటినుంచీ ఆంధ్రదేశం యావత్తూ పాలిస్తున్న ఈ శాలివాహనమహారాజు వంశపరంపరలో విజయ శాతవాహన మహారాజు తనువు చాలించాడు. విజయం పొందిన్నీ భరింపలేక పోయినాడు మహారాజు.
పులమావిని బందీచేసి ధాన్యకటకానికి కొనివచ్చినారు వీరపురుషదత్తాదులు. శాంతిశ్రీ విజయపురం వెళ్ళిపోయింది. పులమావి సైన్యాలు చెల్లాచెదరై దళాలు దళాలుగా విడిపోయి వెనక్కు వెళ్ళిపోయినాయి. కొన్నిదళాలు ఇక్ష్వాకుసైన్యంలో చేరిపోయినాయి. విజయశాతవాహన చక్రవర్తి నిర్యాణమందినాడు అన్న వార్త చేరగానే ఇక్ష్వాకుశాంతిమూల మహారాజు దేవిరులతో కుమార్తెతో పరివారంతో ధాన్యకటకనగరం హుటాహుటి విచ్చేసినాడు.
విజయశాతవాహన మహారాజు తనయుడు చంద్రశ్రీ పితృయజ్ఞ మొనర్చి సింహాసనం అధివసించాడు. రాజ్యం కొద్దికాలమే ఉన్నా విజయశాతకర్ణి అంతా ఇక్ష్వాకు శాంతిమూలుని సహాయంవల్ల పోయిన సామంత రాజ్యాలన్నీ తిరిగి సముపార్జించు కొన్నాడు. చంద్రశ్రీయే చక్రవర్తి అని శాంతిమూలుడు సర్వరాష్ట్రాలలోనూ ధర్మాజ్ఞప్రచురం చేయించాడు. విజయశాతకర్ణికన్న చంద్రశ్రీ రాజ్యం మరింత క్లిష్టపరిస్థితులను ఎదుర్కోవలసి ఉన్నది. చంద్రశ్రీ చుట్టూ ఎప్పుడూ శుష్క దేహసౌందర్యాల గాజుపూసలవలె వెలిగే వేయిమంది యువతులుంటారు. ఆంధ్రదేశాల ప్రసిద్ధివహించిన మందిరాలు స్వర్ణ రజత స్ఫటిక శిలాకలశాల ధళధళలాడుతూ ఆ మందిరాలన్నిటిలో ప్రత్యక్షమౌతూ ఉంటవి. రాజ్యపాలనా? అవసరం లేదు. ప్రజాపాలనా అవసరంలేదు. చక్రవర్తిత్వం రావడం తన భోగలాలసత్వానికి మెరుగుపట్టి నట్లవుతుందనే అతని ఉద్దేశం.
చంద్రశ్రీ మూర్తిలో బలంలేదు. అతని పురుషత్వం ఆడవారిని నగ్నంగా చూచి వారినగ్నతను స్పృశించి ఫలసిద్ధి పొందుతూ ఉంటుంది.
వాళ్ళతోపాటు తానూ నగ్నతలో నాట్యం చేస్తాడు. వినరాని ఊహించరాని విధానాల వాళ్ళ నగ్నత్వం దర్శిస్తాడు. మహత్తరమైన శాతవాహన వశాంభోధిలో జన్మించి పూర్ణచంద్రులైన మహారాజుల కాంతుల నీడంతా కూడి ఈ నీచ శాతవాహనునిలో మూర్తించింది అని ప్రజలు చెప్పుకొనేవారు.
2
శాంతిమూల మహారాజు ధనువుపైన నాలుగు అంశాల (ఆరడుగుల నాలుగంగుళాలు) పొడవుగల పురుషుడు. స్ఫురద్రూపి. సాహసంలో శార్దూలం, విక్రమంలో సింహం, వితరణలో గంగిగోవు. జ్ఞానమూర్తీ రాజ్యనీతి విశారదుడూ అయిన ఆ మహాసామంత వృషభుడు, తన ద్వితీయ భార్య మేనల్లుని సుస్థిరంగా సింహాసనారూఢుని చేయ నిశ్చయం చేసుకొన్నాడు. పూంగీప్రోలు ప్రభువొకనాడు శాంతిమూలుని దర్శనానికి వచ్చాడు, “బావగారూ! ఈ మహదాంధ్ర సామ్రాజ్యానికి శిరోభూషణంగా గాజుపూస ఉండాలని మీ ధృఢసంకల్పమా ?” అని గంభీరముద్రవహించి సగౌరవంగా ప్రశ్నించాడు. “గాజుపూస అన్న నిశ్చయమేముంది బావగారూ?”
“రత్న పరీక్షకులు ఉన్నారు కారా?”
“ఎవరా పరీక్షకులు?”
“తామే!"
“నేనెప్పుడు పరీక్షించాను బావగారూ?”
“ఆ గులకరాయి పుట్టినప్పటినుంచీ తాము పరీక్షిస్తూనే ఉన్నారు.”
“రత్నాలగనిలో గులకరాయి ఏలా పుడుతుంది?”
“నాకు కారణం తెలియదుకాని ఏలాగో పుట్టింది అన్న విషయం తథ్యం.”
“గాజుపూసనే శిరోరత్నాన్ని చేయవలసిన ధర్మం ఆసన్నమైనప్పుడు, ఆ గాజుపూసనే మెరుగుపెట్టి వెనకాల తళుకుపెట్టి పొదగవలసి ఉన్నది.”
“అది ధర్మం అని నిర్ణయించిన వారెవరు?”
“నా హృదయం!”
ఆ మాటలో శాంతిమూలుని మహోత్తమ పవిత్ర హృదయమంతా పుంజీభవించి దుర్నిరీక్షకాంతితో ప్రజ్వలించింది. పూంగీయ స్కందశ్రీ మహారాజు మారుమాట అనలేక పోయినాడు. బావగారిని చూస్తున్న ఆయన కన్నులలో అకుంఠితభక్తి తాండవించింది. ఆయన బావగారికి తలవంచి నమస్కరించి వెళ్ళిపోయినాడు.
ఇందులో తనకు మాత్రం తర్కించవలసిన అవసరం ఏమీలేదు. స్వామి కార్వ పరాయణత్వం సామంతుల ధర్మం అనుకొన్నాడు శాంతిమూలుడు. ఆంధ్రదేశాన్ని శాతవాహనులు తప్ప ఎవరు శాసించగలరు? విశ్వామిత్ర సంతతివారగు ఆంధ్రు లేనాడో ఇక్కడకువచ్చి రాజ్యం స్థాపించారనికదా పూర్వగ్రంథాలు చెప్పింది. నిశుంభాసురుని సంహరించిన ఆంధ్ర విష్ణువు శాతకర్ణులకు పూర్వీకుడు. ఈ దినాన కాకపోతే రేపయినా ఎవరో అటువంటి ఉత్తమ పురుషుడు, గౌతమీపుత్రశాతకర్ణివంటి మహాచక్రవర్తి ఉద్భవించి తీరుతాడీ వంశంలో అనుకొన్నాడు శాంతిమూలుడు.
శాంతిమూలుడు పీఠం అధివసించి ఉండిన్నీ ముందుకువంగి ఉపధానంపై మోచేయి ఆనించి, చేతిలో నుదురునుంచి పదినిమేషాలు ఏదో ఆలోచనల పాలయిపోయినాడు. తాను విజయపురం వెళ్ళడానికి వీలులేదు. ఒక్కలిప్త మాత్రం ఏమరుపాటయినా చంద్రశ్రీ ఏలాగో తనపుట్టి తానేముంచి వేసుకు తీరగలడు. ప్రమత్తత ఏ మాత్రమూ పనికిరాదని శాంతిమూలుడు నిశ్చయించుకొన్నాడు. తలఎత్తి నిట్టూర్పువిడిచి, మళ్ళీ సమభంగా కృతియై ఎవరో ఆ మందిర కవాటందగ్గిరకు వచ్చినట్లు గ్రహించి, “ఎవరక్కడ, ఆ వచ్చిన వారిని రానీ!” అని కేక వేసినాడు. లిప్తలో ఒక ప్రొడాంగన లోనికి అడుగిడింది. ఆమె పూంగీయ శాంతిశ్రీదేవి. పూంగీప్రోలు మహారాణి శాంతిమూలుని చెల్లెలు శాంతిశ్రీ! శాంతిమూల మహారాజు "ఏమమ్మా ఈలా వచ్చావు?” అని నవ్వుతూ ప్రశ్నించినాడు. “అన్నయ్యగారూ! నమస్కారం.. ఆమె పాదాభివందన మాచరించింది. శాంతిమూల మహారాజు పెద్దచెల్లెల్ని ఆశీర్వదించాడు.
“అన్నయ్యగారూ! దేశం అరాజకం అవుతుందని నేను భయపడుతున్నాను.” “అదేమిటమ్మా! భయానికి కారణమేముంది?”
“అన్నయ్యగారూ! యజ్ఞశ్రీ శాతకర్ణి చక్రవర్తి నిర్యాణమందినప్పటినుంచీ దేశంలో శాంతి ఉందా? రాచరికం ఉందా?”
“రాక్షసుల పరిపాలనమంటావా ఇది!” అన్నాడు శాంతిమూలుడు.
“నీరసుడయిన పురుషుడు, రాక్షసునికన్న హీనం. రాక్షసుడు రాజ్యం చేస్తే రాజ్యం ఉంటుంది, ధర్మం ఉండకపోవచ్చుగాక. నీరసుడు రాజ్యం చేస్తే అరాజకమే, ప్రజా నాశనమేకాదా ప్రభూ?”
“అరాజకాన్ని మనం రానిస్తామా పూంగీయరాణీ” శాంతిమూలుని మాట గంభీరత తాల్చింది
“చక్రవర్తి ధర్మ మేమవుతుంది?”
శాంతిమూలుడు క్షణం మౌనం తాల్చి “చక్రవర్తి సేవకులు సామంతులు అందరిదీ అధర్మం” అంటున్న శాంతిమూలుని మోమున మందహాసోషస్సులు నర్తించినాయి.
(3)
బ్రహ్మదత్తుడనుకొన్నాడు: రాజకుమారి అంత శక్తిస్వరూపిణి అయినదేమి? ఎక్కడనుంచి వచ్చిందీమెకు ఈ విచిత్ర సాహసము? జన్మచే యోగినియు, జడీభూతయు అయిన ఈ పడుచు ఇలా రౌద్రమూర్తియై పులమావి మీద విరుచుకుపడి ఇక్ష్వాకు విజయానికి మూలకారణ మయింది. దీనికంతకూ తానే నిజమైన హేతువనుకున్నాడు. ధర్మమార్గాన్ని ఎరుగనివారు ఆరుదుగా ఉంటారు. మానవ జీవితం తమస్సునుండి వెలుతురుకు హింసనుండి అహింసకు వెళ్ళడానికి సర్వకాలాల ప్రయత్నంచేస్తూ ఉండాలి. ఏమరుపాటుతనం తామసిక పథాలకు తిరిగి నెట్టి వేస్తుంది. మనుష్యుని ఉత్తమసిద్ది కోసము తామసిక పదముపనికిరాదు.
పులమావి ఏలాటి చక్రవర్తి? సార్వభౌమత్వం భూపతులను ఓడించి సామంతులుగా చేసుకోవడంలేదు. ఎవడయితే ధర్మం నాలుగు పాదాలా నడిపించగలదో వాడే చక్రవర్తి. దేహబలాన్నే నమ్మినవాడు భూపతికాడు, వాడు రాక్షసుడు. ప్రభువు సగం దేవుడు. పులమావి ధర్మం మూడుపాదాలయినా నడిపించగలిగిన రాజుకు విష్ణుత్వం వస్తుంది. పులమావి అయినది మొదలు చక్రవర్తి ధర్మాన్ని ఒక్క పాదమయినా నడపదలచుకోలేదు.
బ్రహ్మదత్తుడు చూస్తూ చూస్తూ ఏలా ధర్మచ్యుతి కానివ్వగలడు? రాయబారిగా వెళ్ళి పులమావి హృదయం మార్చి వెనుకకు మరలించాలని నిర్ణయించుకొన్నాడు. వలదని సేనానాయకులు పెక్కుమంది చెప్పినా బ్రహ్మదత్తుడు చిరునవ్వునవ్వి ఊరుకొన్నాడు. శుభముహూర్తము చూచి పులమావి శిబిరానికి బ్రహ్మదత్తుడు బయలుదేరినాడు. పులమావి ఆ ధనక ప్రభవుని గౌరవంగా ఎదుర్కొన తన మంత్రుల పంపి, లోనికిరా, ఆసనం చూపి, కుశలప్రశ్నచేసి 'వచ్చిన పని ఏమి' అని పృచ్చ చేసినాడు. -
“మహారాజా! తాము శాతవాహనులయ్యూ చక్రవర్తిమీదకు దండెత్తి రావడం అనుచితము. కఱ్ఱకొట్టటానికి ఉపయోగించే గొడ్డలిని రాజ్యనాశనానికి ఉపయోగిస్తారా? ఇందరు యుకులు, వీరులు, మీ కాంక్షలకు ఆహుతై పోవలసిందేనా?” “జగత్కళ్యాణమే మేము కోరుతున్నాము. దీనిలో కొంత నష్టమున్న మాట నిజం. అంతా భగవంతుని ఇచ్చచొప్పునే జరుగుతుంది.”
“ఇక్ష్వాకులబలం మహోన్నతము వారు ఎవ్వరికీ భయపడరు. అయినా ధర్మానికి కట్టుబడి ఉన్నారు వారు.”
“అది ధర్మంకాదు. వట్టి నీరసత్వం! నీరసుడయిన సార్వభౌముని సింహాసనం ఎక్కించడంకన్న నీచధర్మం ఏముందీ?”
"యజ్ఞశ్రీ శాతకర్ణి కుమారుడు సింహాసనం ఎక్కడం తప్పా మహారాజా!"
“తప్పుగనుకనే మేము సార్వభౌమ సింహాసనం అధిష్టించాము విజయశాతకర్ణిని ఏమని సింహాసనం ఎక్కించినాడు శాంతిమూలమహారాజు? నీరసుని సింహాసనం ఎక్కించి తామే రాజ్యంచేయాలనీ, వీలయితే సార్వభౌముని తుదముట్టించి తామే చక్రవర్తి కావచ్చునని కాదూ?”
బ్రహ్మదత్తుడు చాలా బాధపడినాడు. ఎంత విషం ఉన్నది పులమావిలో! బ్రహ్మదత్తుని మోమున పరిహాసరేఖలు ప్రసరించినవి. “పులమావి మహారాజా! ఇక్ష్వాకులు మిమ్ము చక్రవర్తిగా ఒప్పుకొనరు. మీరు విజయ శాతకర్ణి సార్వభౌమునిపైకి ఎత్తి వెళ్ళకుండా ఇక్కడే ఎదుర్కొన్నారు. శ్రీశాంతిమూల మహారాజు వీరవిక్రమమూర్తి యుద్ధంలో నేడు ఆయనను ఎదుర్కొనే మేటి భారతవర్షంలో ఎవ్వరూలేరు. కాని వారు ఉత్తమ ధర్మమూర్తులు. జననష్టానికి వారు ఎంతో బాధపడతారు. కాబట్టి చక్రవర్తిత్వం పరిత్యాగం చేసి మీరాష్ట్రానికి మీరు వెళ్ళిపొండి.”
“ఏమిటీ!”
“మీరు కోపపడకండి. అహింస లోకంలో పరమధర్మము. ప్రతి మానవుడూ పరబ్రహ్మే! ఎవరి మోక్షము వారు పొందే అవకాశము ఎవ్వరూ అడ్డు పెట్టడానికి వీలులేదు. ఏమనుష్యుడూ ధర్మచ్యుతుడు కాకూడదు. ఒక మనుష్యుడు ధర్మచ్యుతుడు అవుతోంటే అలా కాకుండాచూసే ధర్మం పక్కనున్న మనుష్యులందరిపైనా ఉన్నది. ప్రభూ! నామాట వినండి. వెనక్కు వెళ్ళండి. లేకపోతే సముద్రతరంగం ఒడ్డున విరిగినట్టు మీ అదృష్టం ఈ పొలికలనులో విరిగిపోతుంది!”
బ్రహ్మదత్తునిమాట వినగానే పులమావి మండిపోయాడు. “బ్రహ్మదత్తప్రభూ! తమ్ము బందీచేసి ధర్మాన్ని ఇంకా నాశనం చేస్తున్నాను. ఏమవుతుందో చూడండి!” అంటూ “ఎవరక్కడ?” అని కేక వేసినాడు. “చిత్తం!” అంగరక్షక సేనాపతి అక్కడకు వచ్చినాడు. “బ్రహ్మదత్త ప్రభువును బందీ చేసినాము; వారికి విడిది ఏర్పాటుచేయమని నా ఆజ్ఞ సేనాపతికి చెప్పు.” ఇదంతా జ్ఞాపకం వచ్చింది, ధాన్యకటకనగరంలో బ్రహ్మదత్తుడు తన విలాసమందిరంలో ఒంటగా కూర్చుండి ఆలోచించుకొంటూ ఉన్న సమయంలో.
శాంతిశ్రీ ఎంత విచిత్రంగా సంచరించింది. ఆమె కీశక్తిరూపం ఎలా వచ్చింది! ఇందుకు కారణం గురుభక్తి మాత్రంకాదు. తనపై ఆమెకు పరమాద్భుతంగా ప్రేమ మొలకెత్తింది. ఆ రహస్యం ఆమెకే ఇంకా తెలియలేదు. ఆకాశానికి అంటే పాలరాతికొండలు పగిలి అమృతసరస్సు వారలు కట్టి ప్రవహింపసాగింది. అందమై శుష్కమైన జీమూతాలు చల్లబడి మహావర్షం కురియ నారంభించింది. శాంతిశ్రీ హృదయాన్ని దివ్యదీపమై వెలిగించింది ఏదో పవిత్రానుభూతి. శాంతిమూల మహారాజు దీక్ష తీగెలు సాగింది. ఫలసిద్దినందబోతున్నది. తన తపస్సు సిద్ధినందే శుభముహూర్తము ఏతెంచినది. శాతవాహన సామ్రాజ్య సూర్యుడు అస్తమించే భయంకర మూహూర్తము, స్కందవిశాఖుని హృదయసామ్రాజ్యంలో పూర్ణచంద్రులు ఉదయించే దివ్యమూహూర్త మాసన్న మవుతున్నదా?
ఆయన మోమున వెలుగునీడలు తారాడసాగినవి. ఆ ప్రభువు హృదయం ప్రేమతో నిండిపోయినదని ఆయనకే వ్యక్తమయింది. అమృత ప్రవాహం హృదయాన నిండడం ప్రారంభించింది. చిరువాకలు కట్టింది. పరవళ్ళెత్తుతున్నది. శాంతిశ్రీ తన పురుషార్ధసిద్ధి. ఆ బాలిక జగదేక సుందరి. పరమాద్భుత చరిత్ర! ఆమె గడ్డకట్టిపోయిన అమృతము. నేడు తన అదృష్టంకొలదీ అమృతం తరిగి వరదలై వచ్చింది. కృష్ణవేణ్ణలా పొంగివచ్చింది. ఆకాశంలో వెన్నెలే వర్షాలు కురిసింది.
“నీవు బధిరవాదేవి? ఈ నిర్మల ప్ర
శాంత వాసంతయామినీ సమయమందు
గాఢరాగరాగాలాప కంఠుడైన
నన్ను వినవు ? గాంధర్వప్రసన్నుడగుచు
కరిగి, చిరినరాల పులకరాల తేలు
అమృతకిరణుండు, పారవశ్యానకలగి
లాస్యయుతలైరి ఆశాశుభాస్యలు - చెలి!
ఏల కరుగదు నీయెద? ఇంచుకంత
కరగ దెచ్చటిదీ నిర్వికార జడత?
“ఏనాడు తపసు సలిపానో
నాదేవి
ఈనాడు నను చేరినావె!
ఇది ఒక్క స్వప్నమో
మదికోరు మోక్షమో
సర్వసిద్ధులు కూడి
సారూప్యమైతోచే
ఏనాడు....
సౌందర్య శిఖరితము
సఖియ నీ సుమమూర్తి
ఆనందమున కవధి
అతివ నీ మధుమూర్తి
ఏనాడు....
నీలోన చేరెనే
పాలసంద్రపు సుడులు
నిన్ను వెలిగించెనే
నింగి తారకలెల్ల
ఏనాడు....”
బ్రహ్మదత్తుడు ఉప్పొంగిపోయాడు. వయసువాడు సన్యాసికావడం పతనానికి సులభమైన దారి అన్నారు. బ్రహ్మచర్యంనుంచి సన్యాసాని కెగిరే ముందు గార్హస్థ్యసౌధ మెక్కాలి. గృహస్థధర్మం లేకుంటే సృష్టి కొనసాగదు. కనుకనే సృష్టిధర్మం నెరవేర్చని మనుష్యుడు పున్నేమనరకంపాలగు నన్నారు. బౌద్ధమతం ఈ పవిత్రాశయాన్ని నాశనంచేసి, అందరు భిక్కులవాలనడంవల్లనే అనర్థహేతువై తానే నాశనమయింది.
ఇప్పుడుకదా శాంతిమూలమహారాజు తన్ను రాజకుమారికి గురువుగా నియోగించిన పరమార్ధము గోచరించింది. శిష్యురాలు పుత్రిక అనే ధర్మం కొన్ని సందర్భాలలోనే వర్తిస్తుంది. ఉదయనప్రభువు దేశికుడై వసంత నేనను వరించిన ఉత్కృష్టచరిత్ర నెరిగియే మహారాజు తన్నీ గురుత్వమున నియోగించెను.
ప్రపంచంలో సౌందర్యానికి మనుష్యుడు ముగ్ధుడవుతాడు. అమృతత్వం కోరే మనుష్యునికి సౌందర్యోపాసనే సులభమార్గం.
“లోకంలో వెన్నెల అంతా
ఏ కారణమో కానీ
నా హృదయంలో రాసికట్టె
నా జీవితమంతా వెలిగె
ఎవరో ఈ సుందరబాలిక
ఏలనో నన్ను వరించెను.
నా జన్మార్థము ఈనాడే
నా కవగతమై తోచిందీ!”
అతడొక నిట్టూర్పు విడిచి ఇదంతా విరహమా, ఆనందమా అనుకున్నాడు. మనస్సు మనస్సు, అగ్నీ నీళ్ళులా ఎదుర్కోనువచ్చును. అమృతమూ సోమరసమూలా పరస్పరం లీనమైపోనూ వచ్చును. దేహాలు వేరు అన్నది ఈ విచిత్ర సాంగత్యానికి ఏమి అడ్డు?
“వెన్నెలలు కాసేను
వీచె మలయానిలుడు
దివ్యామృతమ్మేదొ
నవ్యమై హృదినిండె
వెన్నెలల మర్మమ్ము
వీచు గాలుల మర్మ
మే విచిత్రార్థమ్మొ
ఈ జంటలో ఉంది."
శాంతిమూల మహారాజు విజయపురం కుమారునికి అప్పగించి తాను సకుటుంబంగా ధాన్యకటక మహాపట్టణం విచ్చేసి అక్కడ తన నగరు ప్రవేశించినారు. ధాన్యకటకం, ధనకటకం, వైభవకటకం, సర్వసంపద్రత్కఖని. ధాన్యకటకం రెండు యోజనాల పొడవు అర్ధయోజనం వెడల్పూగల పట్టణం. ధాన్యకటకం దక్షిణాపథానికి హృదయమే. ధాన్యకటకం చుట్టూ ఉన్న ప్రదేశాలలో పండని పంటలేదు. దొరకని ఖనిజం లేదు. రత్నం లేదు. ధాన్యకటకం విజయశాతవాహనునికి పూర్వం వేయిసంవత్సరాలనుండీ ప్రసిద్ధికెక్కినది.
సింధునది తీరవాసులైన అసురులు హిమాలయాది పర్వతాల లోయలలో నివసించే శుద్ధసత్త్వులైన ఆర్యులధాటికి నిలువలేక సముద్రయానాన పడమటితీరం వెంబడినే ప్రయాణమై నర్మద, తపతి, శబర్మతి నదీముఖాల, తీరాల వలస రాజ్యాలేర్పరచుకొంటూ, తృణజలకాష్ట సమృద్ధిగల తీరద్వీపాలలో నివాసాలు ఏర్పాటు చేసుకొంటూ, కన్యాకుమారి ఆగ్రందాటి తూర్పు తీరానకు కొందరూ సింహళద్వీపం కొందరూ పోయిరి. సింహళద్వీప నదీ తీరాలయందు, కావేరి, వేగై, వేణ్ణాది నదీముఖాలందూ, కృష్ణవేణ్ణా గోదావరీ మహానదీ ముఖాలలోనూ రాజ్యాలేర్పరుచుకొన్నారు.
ఆ అసురులు మహాశైవులు, వృషభేశ్వర సంప్రదాయంవారు. వారు శ్రీకాకుళము మొదలైన పట్టణాలు నిర్మించి ఉత్తమ నాగరికతను వృద్ధిచేసారు. సింధునదీతీరమున నివసించిన ఈ సుమేరులే హిమాలయానికి ఉత్తరంగా ఉన్న మహామేరు (పామేరు) పాదనదీ కంఠాల ఉత్పన్నమైన ప్రథమ ఆర్యజాతివారు. అందుకనే వారికి పూర్వదేవతలు అని పేరు వచ్చింది. తదుపరి ఆర్యఋషులు రామాయణకాలంలో దక్షిణాపథానికి వచ్చి ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇదివరకే రాజ్యాలు స్థాపించు కొన్న అసురుల కది ఇష్టంలేకపోయింది.
దక్షిణాపథానికి అసురులుకాని ఆర్యులుకాని రాకపూర్వం అనాది జాతుల మనుష్యులు నరమాంసం, జంతువుల పచ్చిమాంసమూ తింటూ గుహల్లో, చెట్లలో, పొదల్లో నివాసంచేస్తూ ఉండేవారు. వాళ్ళల్లో పిశాచులు, పొలసు దిండ్లు నక్తంచరులూ మొదలైనవారు వివిధజాతులవారు-తుట్ట పెదవులు, సొట్టముక్కులు, తారునల్లటి శరీరాలు, ఉంగరాలజుట్టు గలవారు - ఉండేవారు.
అసురులూ, ఆర్యులూ రాకపూర్వం తూర్పుసముద్ర ఉత్తర ఈశాన్య దిశలనుండి, సముద్రతీరం వెంబడి నడుస్తూనో, చిన్న చిన్న నావలమీద ప్రయాణం చేస్తూనో గంధర్వ, గరుడ, నాగ, యక్షాదులు - పసుపు, ఎరుపు రంగుల జాతులవారు - తండాలు తండాలుగా వచ్చి తూర్పుతీరం పొడుగునా, గంగా బ్రహ్మపుత్రా మహానదీతీరాలలోనూ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. గంధర్వుల ఆదిమనివాసం హిమాలయాల ఉత్తరాన. శాంతిమూలుని కాలంనాటికి అక్కడ ఉన్నవారి పేరు చీనావారు. అక్కడ గంధర్వనాగరికత బహుముఖమై ప్రశస్తి పొందింది.
భరతదేశానికి వలస వచ్చినవారిలో గంధర్వులు హిమాలయ పాదనదీ తీరాలలోను వంగదేశంలోనూ ఎక్కువమంది నివాసాలు రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. తూర్పు హిమాలయాలలోని విద్యాధరులు, మధ్య హిమాలయాలలోని సిద్ధులు సాధ్యులుకూడ దక్షిణానికి వలస వచ్చినారు. వీరందరూ నాగరికత గలవారు. గరుడులు, కిన్నరులు, కింపురుషులు మధ్యరకం నాగరికత కలవారు.
నాగగరుడాది గంధర్వజాతులవారికీ రాక్షసాది నరమాంసాశన జాతివారికీ యుద్ధాలు జరిగినంతట దండకారణ్య మధ్యప్రదేశాలకు రాక్షసులను గంధర్వజాతులవారు . తరిమివేశారు. ఈ నాగాదిజాతులకు గోండులు, నాగులు, వానరులు, కోదులు, శబరులు, చెంచులు, కోయలు, భిల్లులు, థోంబీలు, సంతాలులు, వేప్చాలు, ఘార్కులు, భూతాలు అనే పేర్లు అనేకం వచ్చాయి.
అసురులు బాగా నాగరికత కలవారు. వారు నదీముఖాల వలసలేర్పరచుకుంటోంటే, వారికీ ఈ గంధర్వజాతులవారికీ ఘోరయుద్ధాలు జరిగి అసురులు గంధర్వ జాతులను అడవులలోకి తరిమివేశారు. వారంతా శాంతిమూలుని కాలంనాటికి దండకాటవి సరిహద్దులలో నివసిస్తున్నారు.
అసురాంధ్రుల ముఖ్యపట్టణాలు శ్రీకాకుళం, పాదగయ, శంబరదీవి, మహాబలిపురం మొదలైనవి ఆర్యులు శ్రీకాకుళం పట్టుకొని ప్రతిపాలపురం మొదలైనవి జయించిరి. రానురాను ఆంధ్రవిష్ణువు వంశస్థులైన శాతవాహనులు అటు నాగులనూ, అడవులలోని రానురాను ఆంధ్రవిష్ణువు వంశస్థులైన శాతవాహనులు అటు నాగులనూ, అడవులలోని రాక్షసజాతులనూ, అసురజాతులనూ ఏకంచేసి ఆంధ్రసామ్రాజ్యం మహాభివృద్ధి కావించారు. అప్పుడే శ్రీకాకుళం నుంచి కృష్ణవేణ్ణకు ముప్పఅయిదు గోరుతాలు ఎగువకుపోయి అక్కడ ధాన్య కటకం నిర్మించారు. గోదావరి తీరంలో పశ్చిమాన అసురులు నిర్మించిన ప్రతిష్ఠానపురం పట్టుకొన్నారు. ముసికనగరం వైజయంతి మొదలైన ముప్పది మహానగరాలు నిర్మించారు.
శాంతిమూల మహారాజు ధాన్యకటకం ప్రవేశించి తాత్కాలిక నివాసం ఏర్పరచుకొన్న కారణం - మేనల్లుని చక్రవర్తిత్వం సురక్షితం చేయడానికీ. శాంతిమూలుని మహాభవనం కోటకి ఎగువను ఆర్ధగోరుతం దూరంలో ఉన్నది. చక్రవర్తి చంద్రశ్రీ మేనత్తభర్త శాంతిమూలుని బలవంతం వల్ల అప్పుడప్పుడు మహాసలికు వస్తూ ఉండినా, మధువుల మత్తువల్ల. సభలో ఏమి జరుగుతున్నదో ఆయనకు తెలియదు. సభాకార్యక్రమం నడిపించేదంతా మహామంత్రి..
శాంతిమూలుడు చంద్రశ్రీ సార్వభౌముని సన్మార్గంలోనికి దింపాలని ప్రయత్నం చేసెను. ఏమి లాభం లేకపోయింది. హీనమతులైన అంతఃపుర వనితలను శాంతిమూలుడు వెలుపలికి పంపించివేసెను. అంతఃపురవాసం వదిలించేందుకు - వేటకనీ, దేశం చూడడానికనీ, తీర్థాలలో క్రుంకులిడడానికనీ - చంద్రశ్రీని శాంతిమూలుడు దేశం నలుమూలలా త్రిప్పుతూ ఉండేవాడు. కాని చంద్రశ్రీ పురుషకారహీనుడై మరల ధాన్యకటకం చేరుతూ ఉండేవాడు.
శాంతిమూలుడు బ్రహ్మదత్తుని చంద్రశ్రీ చక్రవర్తికి గురువుగా నియమించి “ఏలాగయినా సార్వభౌముని మనుష్యునిగా చెయ్యాలి ధనకప్రభూ!” అని కోరినాడు. “మొక్క చచ్చిపోయిన వెనుక అమృతం పోసినా తిరిగి బ్రతుకుతుందా మహాప్రభూ!” అన్నాడు బ్రహ్మదత్తుడు. “మీ దగ్గర అమృత సంజీవినీ విద్య ఉన్నది నాకు తెలుసును” అన్నాడు శాంతిమూలుడు గంభీరంగా.
4
ఆనాటినుంచి బ్రహ్మదత్తప్రభువు చక్రవర్తికి గురువయ్యెను.
“మహాప్రభూ! ఈ విశ్వం అంతా పాలసముద్రం నిండి ఉంది.”
“పాలసముద్రం ఏమిటయ్యా! మన చుట్టుపక్కల ఎక్కడ పాలు లేందే!”
“పాలసముద్రం అంటే పాలు కాదండి.”
“పాలంటే నీరా లేకపోతే నూనా?”
“పాలసముద్రం అంటే వెలుగుసముద్రం అన్నమాట మహాప్రభూ!”
“పాలంటే వెలుగా! వెలుగంటే ఏమిటి? మరి రాత్రిళ్ళు వెలుగు లేదే?”
“తక్కువ వెలుగూ, ఎక్కువ వెలుగూ ఉంటవి. చీకటి అంటే తక్కువ వెలుగు. ఎక్కువ వెలుగు లేకపోవడం; చీకటి కణాలు ఒక్కటే. తక్కువశక్తిగలవి చీకటి కణాలు అవుతాయి.”
“కణాలేమిటి? భోజనకణాలు అన్నమాట ఎరుగుదుము. అగ్నికణాలు ఎరుగుదుము. వెలుగుకణాలు ఏమిటయ్యా వెఱ్ఱివాడా?”
“చిత్తము. సృష్టిలో మన చూపు కెదురుగా ఉన్న వస్తువులన్నీ పాంచభౌతికాలు! అవి మనం చూపుతో, స్పర్శతో, రుచితో, వాసనతో, వినికిడితో తెలుసుకోకలిగినవి. అవి నిజంగా మన ఎదుట ఉండనక్కర లేదు.”
“మన ఎదుట కాకపోతే మనవెనకాల ఉండవచ్చునన్నమాట! అదాభౌతికం ? అయితే మొన్న మేము లాక్కొచ్చిన అమ్మాయి భౌతికమే! ఊఁ. తర్వాత....”
“మహాప్రభూ! ఈ భౌతిక వస్తువుల్ని విభజించగా ఇంక భాగించ లేనంత భాగం వస్తే దాన్ని అణువంటారు.”
“ఎవరంటారు?”
“మనుష్యులు.”
“ఎవరు భాగిస్తారు?”
“మనుష్యులే!”
“అలా భాగించపోతే?”
“నిజంగా భాగించనక్కరలేదు. భాగించారనుకోవాలి ప్రభూ!”
“ఊరికే అనుకొంటే భాగాలయిపోతాయా ధనకరాజా?”
“అలా చేస్తే వాటిని అణువులంటాము.”
ఈలా సాగింది చక్రవర్తిగారి చదువు. ఆ రాత్రి చంద్రశ్రీ శాతవాహన సార్వభౌముడు, తనప్రియురాలగు మాళవసుందరిని ఒళ్ళోకూర్చో పెట్టుకొని, ముద్దులిస్తూ తన విద్యా కృషినిగూర్చి మాటలు సాగించినారు. “బ్రహ్మదత్తప్రభువు ఏమిటో చెబుతాడు. అణువంటే ఎవరి క్కావాలి. కణమంటే ఎవరిక్కావాలి? ఏమంటావు అందాలదానా?”
“నిజమే మనోహరా! అయితే బ్రహ్మదత్తప్రభువు చాలా తెలివయినవాడా?”
“బాగా చదువుకున్న వారంటారు. ఏం లాభం? ప్రేమ అంటే ఏమిటో తెలియని వాడూ; మధుపానం రుచి ఎరుగనివాడూ, చదువుకున్నా చదువుకోనివాడే!”
“బాగా చెప్పినారు సుందరాకారులైన మీరు,”
“నేను నిజంగా సుందరుణ్ణేనా రతీదేవీ?”
“మీరు నా మన్మథులు.”
“ఏదీ ఒక......”
“ఒకటికాదు పది.”
“నేను మన్మథుణ్ణంత అందంగా ఉంటానా?”
“కాదన్నవారి మొగం మీద పసుపునీళ్ళు చల్లనా? అయితే ప్రాణేశ్వరా! బ్రహ్మదత్తుడు అందమైనవాడంటారు.”
“ఎవరంటారు?”
“అంతఃపురంలోని స్త్రీలంతానూ.”
“ఏమిటీ! ఆ దుర్మార్గుడు నా అంతఃపురానికి వచ్చాడా? త్వరగా చెప్పు.”
“అదేమిటి దివ్యసుందరాకారులైన చక్రవర్తీ! అంతఃపుర స్త్రీలంటే దాసీజనం. వాళ్ళుతప్ప బ్రహ్మదత్తుణ్ణి చూచే వాళ్ళెవరుంటారు?”
“అయితే దాసీలకుమాత్రం బ్రహ్మదత్తుని మాట రావలసిన అవసరం ఏమి వచ్చిందీ?”
“ఏదో మాటమీద మాట వచ్చి శాంతిమూల మహారాజు కొమార్తె శాంతిశ్రీ దేవిని గురించి సంభాషణ వచ్చింది. ఆ బాలికకూ బ్రహ్మదత్త ప్రభువేకదా గురువులు?”
“ఏమిటీ! మాకు తెలియదే! శాంతిశ్రీ సౌందర్యం ఈ లోకాల్లో ఇంకోచోట లేదట!”
“అవునులెండి ప్రభూ! ప్రపంచంలో అందరూ మీకు సౌందర్యవతులే.”
“అంటే నా ఉద్దేశం ఎంత శాంతిశ్రీ అయినా నీముందు తీసికట్టు అనే.”
“ఈ బ్రహ్మదత్త ప్రభువు శాంతిశ్రీని, శాంతిశ్రీ ఈ ప్రభువును ఒకరినొకరు ప్రేమించుకొంటున్నారట!”
“ఏమిటీ? చక్రవర్తి గర్జించినంత పని చేశాడు. ఆ మాళవిక చటుక్కున ముతి ఆడిస్తూ ఘల్ ఘల్ మని చక్రవర్తి ఒడిలోనుంచి లేచింది.
మాళవిక ఉజ్జయినీపురంలో ఉన్న ఒక క్షుద్ర క్షత్రియ స్త్రీ కొమరిత. ఆ బాలిక అందం ఆనాడు ఆర్యావర్తంలో ఎక్కడా లేదని ప్రతీతి. ఆమెను వరిస్తూ వేలకు వేలు మహారాజులు, సామంతులు, సేనాపతులు మొదలగు వారు వచ్చారు. చంద్రశ్రీ చక్రవర్తిని కాగానే ధాన్యకటక నివాసియైన ఒక వర్తకుడు చక్రవర్తి మెప్పించి వేంగీనగరంలో ఉన్న ఒక స్వర్ణగిరిని స్వర్ణం తవ్వడానికి గుత్తకు పుచ్చుకొనడానికి నిశ్చయించుకొన్నాడు. మాళవికను మహారాజులు, సామంతులు ఉంపుడుకత్తెగా, ఏ ఖడ్గ వివాహానికో కోరినారు. కాని ఆంధ్రవర్తకుడు సముద్రశ్రీ కోటి పణాలిచ్చి ఆ బాలికను కొనివచ్చి చక్రవర్తికి రెండవ భార్యగా పెండ్లి చేసినాడు. మాళవిక అందం నడివేసవికాలంనాటి మల్లెపువ్వుల అందం. మేఘాలలో మెరుపు అందం. సముద్రగర్భంలో పగడాల అందం. ఆ బాలిక వచ్చినప్పటి నుంచీ ఆరునెలలపాటు చంద్రశ్రీ తక్కిన అన్ని విషయాలూ మరచిపోయినాడు. మాళవిక అందాన్ని చక్రవర్తి అనేక విధాలుగా వర్ణించాడు.
“మల్లె పువ్వులప్రోవు మందారములప్రోవు
మావి ఫలముల రసము పైడి గిన్నెలపోత
మాళవిక నారాణి మాదేశ సామ్రాజ్జి
మాళవిక నాదేవి భువనైక సుందరీ!"
అని చంద్రశ్రీ చక్రవర్తి పాడినాడు.
ఆ బాలిక ఉప్పొంగిపోయి చక్రవర్తి ఒళ్ళోవాలి “నేను సామ్రాజ్ఞినా?” అని దీనంగా అడిగింది.
“అవును నువ్వు సామ్రాజ్జివి. రేపు చక్రవర్తి సింహాసనం అధివసించేటప్పుడు నువ్వు పట్టమహిషిగా కాకపోయినా రెండవరాణిగా నా సింహాసనం మీద కూర్చుండ వలసిందే! లేకపోతే నేను సింహాసనం ఎక్కనే ఎక్కను.”
మాళవిక చక్రవర్తి ఒడిలో ఒదిగిపోయింది. ఇంతలో ఆ బాలిక లేచి దాపున బంగారుపళ్ళెంలో ఉన్న చేమంతిపూలు దోయిలించి,
“జయము జయము చక్రవర్తి
జయము ఆంధ్ర సామ్రాట్టుకు
జయము జయము వీరమూర్తి
జయము దేవ జయము జయము"
అని పాడుతూ ఆ పూవు లా ఆంధ్రసార్వభౌమునిపై చల్లింది.
5
బ్రహ్మదత్తప్రభువు ఉదయం తన నగరిలో స్నానసంధ్యానుష్ఠానాలు తీర్చి భగవద్గీత శిష్యులకు బోధించే సమయంలో, ఇక్ష్వాకు శాంతిశ్రీరాకుమారి అక్కడకు విచ్చేసి, ఆ మందిరంలో ఒక యవనికాభ్యంతరాన అధివసించి దేశికుడుపదేశించు పాఠం వింటూ కూర్చుంది.
బ్రహ్మదత్తు డావిషయం గ్రహించనేలేదు. విద్యార్థులకు కర్మయోగ ముపదేశిస్తూ “మనుష్యుడు తానే పరమేశ్వరుడు అన్న విషయం గ్రహించాలి. గ్రహించడం అంటే ఆ మాటల అర్థం తెలుసుకోవడం కాదు, చేతలలో, నిద్రలో, మెలకువలో ఆ అనుభవంతో సంచరించినప్పుడే అహం బ్రహ్మజ్ఞానం కలిగిందన్నమాట. ఫలాపేక్షరహితమైన ఆ ధర్మపూర్ణ సంచరణే కర్మయోగం.” “గురుదేవా! ధర్మనిర్ణయం ఎట్లా?” అని యవనికాభ్యంతరం నుండి మధురమైన వాక్కులతో ఒక ప్రశ్న వినబడింది. శిష్యులందరూ చకితులయి ఆ తెరవైపు చూచారు. బ్రహ్మదత్తుడు చిరునవ్వు నవ్వుతూ ముఖం వికసించి కాంతులీనగా “రాకుమారీ! నీ ప్రశ్న ఉత్తమమయినది” అని ప్రతివచనమిచ్చి శిష్యులవైపు తిరిగి “ఏమయ్యా! ఒక నూతన స్వరం వినేసరికి మీరంతా ఆశ్చర్యంతో చూసినారు. అది మీ కర్మయోగంలో లోటు తెలియజేస్తుంది” అని రాకుమారివైపు తిరిగి....
“ధర్మం అంతే స్వధర్మం. పరధర్మం భయావహమయినది. స్వభావ విలసితమైన స్వధర్మం నిర్ణయించేది తాను. దేశకాల పాత్రముల కనుగుణంగా ధర్మాన్ని మలచికొని, నిష్కామంగా ధర్మాచరణం చేయాలి” అని తెలిపినాడు.
“సత్యమనగా ఏది ప్రభూ!”
“సత్యం ఏది అని నిర్ణయించే ముందు, సత్యం అనేది ఏలా మనుష్యులలో ప్రతిఫలించిందో, ఆ ప్రతిఫలం ఏ కార్యరూపంగా పరిణమించిందో గ్రహించి ఆ విధంగా కర్మ ఆచరించవలసి ఉన్నది.”
“ఆ కర్మలు ఏవి గురువుగారూ?”
బ్రహ్మదత్తప్రభువు చిరునవ్వుతో “రాజకుమారీ! అహింసావ్రతము సత్యకర్మ. మాటలలో అసత్యము చెప్పకుండుట, మానవ సేవ సత్యకర్మ!”
“ప్రభూ! యుద్ధము అహింస అవుతుందా ?”
“కాదు.”
“కాకపోతే అర్జునునికి శ్రీకృష్ణభగవానుడు యుద్ధం చేయవలసింది అని ఏలా బోధించారు?”
“చక్కని ప్రశ్న రాకుమారీ! యుద్ధము అహింసకాదు. హింస కాబట్టి అది అసత్యం. కాని ఎవరయితే స్థితప్రజ్ఞుడయి తాను యుద్ధం చేయడం సంపూర్ణంగా స్వధర్మ నిర్వహణం అని యెంచి చేస్తాడో ఆనాడతను అహింసావ్రతం ఆచరిస్తున్నాడన్నమాటే!”
"స్థితప్రజ్ఞత్వం ఏలాగు, అది ఏమిటి?”
"స్థితప్రజ్ఞునికి అరిషడ్వర్గములు నాశనమయి పోవాలి. దేహము వేరు, తాను వేరు అన్న సంపూర్ణజ్ఞానం రావాలి.”
“అంటే భగవంతుడూ తానూ ఒకటే అని తెలిసినవాడన్న మాట?”
“అవునమ్మా. అంటే యుద్ధం అహింసాబుద్ధిచే ఆవరించేవాడు స్థితప్రజ్ఞుడు. శ్రీకృష్ణభగవానులు తదితరులకు యుద్ధం నిషిద్ధమన్నారు. స్వధర్మ నిర్వహణార్థంకాని హింసాస్వరూపమయిన యుద్ధం మనుష్యుని పతితుణ్ణి చేస్తుంది. ఆహారనిద్రాదులలో మనుష్యుడు పశుసమానుడు.... ఆహారనిద్ర భయములలో భయమే యుద్ధస్వరూపము పొందుతుంది” అని బ్రహ్మదత్తుడు కన్నులరమూసినాడు. శాంతిశ్రీ ప్రశ్నకు అతడు పొందిన సంతోషం శారదా పూర్ణిమలా విరిసిపోయినది.
“రాజకుమారీ! శ్రీకృష్ణభగవానుని గీతోపదేశమందలి అహింసా పరమార్థం బుద్ధభగవానుడు బాగా అర్థం చేసుకొన్నాడు కాని ప్రతి మనుష్యుడూ ప్రతిస్త్రీ సన్యాసం పుచ్చుకోవాలనడమే ఆ తథాగతుడు చేసిన తప్పు.” “తథాగతుడే తప్పుచేయునా గురుదేవా?”
“తప్పు అంటే సర్వకాలాలకు సమన్వయించని విధానమని నా ఉద్దేశం.”
“సంసారంలో ఉండి నిర్వాణం ఏలా పొందగలరు?”
“సంసారంలో లేకపోయినా, మారజయం పొందనివారు నిర్వాణం ఎలా పొందగలరు?”
“మారవిజయం అందరికీ సాధ్యం కాదంటారు.”
“అవును. జంతుధర్మాలు ఆహారనిద్రాభయాదులు. ఆహారం బ్రతకటానికి, నిద్ర శ్రమ తీర్చుకోడానికి, భయం జాతినీ వ్యక్తినీ రక్షించడానికీ, నాల్గవది జాతిని వృద్ధి చేయడానికి. ఈ జంతుధర్మాలు ఎవ్వరూ మానలేరు. ఏదో ఉగ్రమైన తపస్సుచేసేవారే మానగలుగుతారు. నిష్కామకర్మ అంటే ఈ నాలుగు ధర్మాలు నిష్కామంగా ఆచరించగలగడమే.”
“ఈ జంతుధర్మాలు నెరవేరుస్తూ వాని ఫలం ఎలా వదులుకోగలడు మానవుడు?”
“ఆత్మజ్ఞానం సంపాదించుకొని కర్మఫలాన్ని దహించుతూ మనుష్యుడు జీవితమార్గం నడవాలి.”
“ఆకలివేస్తే అన్నం తింటాడు.”
“అవును.”
“అన్నం తినగానే తృప్తి పొందుతాడు.”
“అవును.”
“ఆ తృప్తి మనస్సుకు. ఆ మనస్సుకే లోబడినవాడు ఇది నాకు కాదు అని ఏలా అనుకోగలడు గరుదేవా?”
“ఈ మనస్సు, దేహం నేను కాను అనే విచారణవల్ల.” ,
ఆమె మౌనం వహించింది. ఆమె తెర ఈవలకు వచ్చి తనదేశికునకు పాదాభివందన మాచరించి వెడలిపోయినది. శిష్యులందరూ లేచి వెళ్ళిపోయినారు.
బ్రహ్మదత్తుడు చిరునవ్వు నవ్వుకొంటూ.... విచిత్రమే! ఇంత బోధిస్తూ ప్రతిక్షణము ఈ బాలికను తాను ప్రేమించడంలేదా? ఆమె దేహాన్ని, మనస్సును, హృదయాన్ని, జ్ఞానాన్ని, ఆమె అహంకారాన్ని, ఆత్మను సర్వస్వమూ తాను ప్రేమిస్తున్నాడు. ఇంకోవంక తత్త్వజ్ఞానాన్ని బోధిస్తున్నాడు. జ్ఞాన నిశితత్వంవల్ల మేధకు తార్కికంగా ప్రతివిషయమూ గోచరిస్తోంది.
కాని అసలు సత్యమేదో, తనకు అనుభవానికి వచ్చిందో, లేదో అతనికి తెలియదు. ఆ దారివెంట తన ఆత్మేశ్వరి అయిన ఈ బాలిక తన్ను నడిపించుకొని పోగలదా?
6
శాంతిశ్రీ వెళ్ళిపోయింది. కాని ఆమె సర్వస్వమూ బ్రహ్మదత్తుని పాదాల కడనె ఉంచిపోయినది.
“ఒక మొయిలు వాలింది
ఉత్తుంగ నగముపై
ఒకని పాదము మ్రోల
వ్రాలి తన్నర్పించి
ఒక నికుంజము పూలు
సర్వమ్ము వర్షించే
లలిత చంద్రోఫలము
నిలువునా కరిగింది
పూర్ణచంద్రుని వెలుగు
పూతమై ప్రసరింప”
ఆ బాలిక ఈ పాట పాడుకొంటూ తాను రచించే చిత్రఫలకస్తమూర్తికి ఎదురుగా నిలుచుండి పోయినది. అప్పుడామె రూపుతాల్చిన సౌందర్య సర్వస్వం అంత అందాలు కూరిచికొన్న ఆమె తనూరేఖలు ఇదివరకు ఆ అందాలకు మధురత్వ మీయలేకపోయినాయి.
“నే నెవరినో తెలియదాయె
ఓ గురూ!
నీ వెవ్వరో ఎరుగనైతి
ఎన్నేళ్ళుగా నిద్ర
నిన్ను తెలియగలేక
ఈ బ్రతుకు గడిపానొ
నేనెవరినో తెలియదాయె
ఓ గురూ!
నీవెవ్వరో ఎరుగనయ్యా !
కటిక చీకటిగాగ
కలలేని రాత్రయ్యే
ఈనాటికేగదా
ఇందుబింబముతోచే
నే నెవరినో తెలియదయ్యా |
ఓ గురూ!
నీ వెవరవో ఎరుగనయ్యా !
పరిమళమ్మే లేని
పసరు మొగ్గను నేను
నీదు కిరణస్పర్శ
నిలువుగా వికసిస్తి
నేనెవరినో తెలియదయ్యా
ఓ గురూ!
నీవెవరవో ఎరుగనయ్యా!
నితము తెలియని నాకు
మతికలదంతేగాని
ఓ ప్రభూ నీ చేయి
నా బ్రతుకు నడదివ్వె
నే నెవరినో తెలియదయ్యా
ఓ గురూ!
నీ వెవరవో ఎరుగనయ్యా !
చిన్ననాటినుంచీ శాంతిశ్రీకి సర్వవిద్యలూ ప్రతిభాయుక్తంగా వచ్చేవి. కాని లలితకళలలో సృష్టి ఆమె ఎరగదు. గురువు ఒక చిత్రము చూపి ఈ విధమైన చిత్రము లిఖించు అంటే అయిదు క్షణికాలలో ఆమె ఆ చిత్రం పూర్తిచేసి చూపించేది. ఈ విషయాన్ని గూర్చి ఒక పాట ఈ రీతిగా వ్రాయి అంటే ఆ బాలిక రెండు క్షణికాలలో రచించేది. ఆ పాటలో జీవములేకపోయి గురువు చెప్పిన భావాలన్నీ అందమైన భాషలో గీతికా రూపంలో కూర్చబడి ఉండేది. ఈ రాగిణీ, ఈ రాగము, ఈ తాళము, ఈ మూర్చన, ఈ గ్రామము, వీనితో ఈ రాగంలో, ఈ తాళంతో, ఈ విధంగా పాడాలి అని చూపిస్తే ఆమె అదే విధంగా చేయగలిగేది. చిన్న బిడ్డలచే రామాయణము బుద్ధచరిత్ర కంఠోపాఠము చేయిస్తారు. వాని అర్థము బిడ్డలకేమి తెలుసును? కాని వారు పెద్దవారై రసజ్ఞులు అయిననాడు వాని అందాలు తెలిసికొన్నట్టులు ఇక్ష్వాకు శాంతిశ్రీ ఈ మధ్యనే తాను ప్రజ్ఞతో నేర్చుకున్న సర్వలలితకళలలో ఉండిన దివ్యత్వాన్ని అర్ధం చేసుకోగలిగింది. ఆనాటి నుంచీ ఆమె రచించే గీతికలు, విన్యసించే చిత్రాలు పరమసౌందర్య వికసితాలై ప్రజ్వలించిపోతున్నవి.
ఒక పురుషుని సన్నిధిని ఒక స్త్రీ సర్వకాలము నివసింపగోరడం ప్రేమ అని ఆ బాలిక అర్థంచేసుకొన్నది. తాను బ్రహ్మదత్తుని సాన్నిధ్యము సర్వకాలాల వాంఛిస్తున్నది. ఓహో! తానీనాటికికదా ఇంత ఉత్కృష్ణానుభవ నిధిని పొందగలింది అని ఆమె ఉప్పొంగిపోయింది.
“తారానికా!” ఆమె పిలుపు తెలతెలవారే పులుగు కువకువ అయినది. వెంటనే తారానిక ఆ రాజకుమారికడకు పరుగిడి వచ్చింది. “తారానికా! నీకు ప్రేమ అంటే ఏమో తెలుసును కాదూ?” రాజకుమారి అడిగిన ప్రశ్నకు తారానిక సిగ్గుపడి మోము కెంపువార తలవంచేసింది. రాజకుమారి మోములో నిశ్చలతతో రంగరించిన ఏదో ఒక ఆవేదన ఉన్నది. “తలవంచుకొంటావు, వాత్సాయన మత ప్రకారం అది త్రప అంటారుకాదూ! తారానిక ఇంకా ఆశ్చర్యంపడి పోయినది. ఏమిటీ భర్తృదారికమాటలు!
7
పులమావికి సార్వభౌమత్వము పోయింది. బందీగా ఒక పెద్దభవనంలో బోనులోని సింహంలా తిరుగుతున్నాడు. ఆ భవనంచుట్టూ, యమునికైనా వెఱవని కఱకువీరులు కాపలాకాస్తున్నారు. కాని పులమావి నిస్పృహ చెందలేదు. శాంతిమూలుని హృదయమూ, చక్రవర్తి చంద్రశ్రీ శాతవాహనుని నికృష్టతా అన్నీ పూర్తిగా పులమావికి తెలుసును. పులమావి చూట్టాలైన ప్రభువులు చాలా మంది ధాన్యకటకంలో ఉన్నారు. పైగా ముసిక నగరంనుంచి అనేకమంది అపసర్పులు మారువేషాలతో నిండిపోయారు. ఏలా వచ్చిందో పులమావికి ఆ బంధనలోనుంచి పారిపోయే విధానం! అయిదు దినాలలో సొరంగం ఒకటి మారుమూల మందిరాలలో నుంచి బంధనాగారానికి చొచ్చుకువచ్చింది. ఆరవదినాన ఉదయమే ఇక్ష్వాకు చారులకు ఆ మహామందిరంలో పులమావి కనబడలేదు.
పులమావి మాయమైనాడన్న సంగతి శాంతిమూల మహారాజుకు చారులు పరుగెత్తుకుని వెళ్ళి నివేదించుకున్నారు. ఇక్ష్వాకుల అపసర్ప నాయకుడు విచారణ చేసి పులమావి రాత్రికి రాత్రే సొరంగము దారిని మాయమై పోయాడనీ, పులమావి బందుగులూ, అపసర్పులూ ఈ ఏర్పాటంతా కావించారనీ మనవి చేసుకున్నాడు. శాంతిమూల మహారాజు ఒక చిరునవు మాత్రం నవ్వి ఊరకున్నారు. అపసర్ప నాయకుని విషాదమంతా మాయమై ఆశ్చర్యము అతనిని ముంచివేసింది.
“ఓయి రాహులశ్రీ! చంద్రశ్రీ చక్రవర్తి విరోధులు దేశమంతటా ఉద్భవించారు. ఆలాంటప్పుడు పులమావి పారిపోవడంలో ఆశ్చర్యమే ముంది? మనం అతనిని బందీగానూ ఉంచలేము, ఇంకోవిధంగా శిక్షించడానికి వీల్లేదు. పారిపోయి మళ్ళీ సేనలను సమకూర్చుకుంటాడు. యుద్ధం కాకతప్పదు, అందులో అతడు నాశనం కాక తప్పదు. మీ చారుల్ని ముసికనగరం పంపించి పులమావి కార్యక్రమం యావత్తూ మా కెప్పటికప్పుడు తెలియచేస్తూ ఉండవలసింది అది ఒకటి. రెండవది - ఈ ఊళ్ళో పులమావి పక్షం వాళ్ళెవరున్నారో వారి జాడ యావత్తూ గ్రహిస్తూ మా కెప్పటివార్తలప్పుడు అందజేస్తూ ఉండండి. ఇవి వెంటనే జరగవలసిన పనులు.” శాంతిమూలుని ఆజ్ఞ శిరసావహించి నమస్కరించి రాహులశ్రీ అపసర్పనాయకుడు పని విన్నాడు. శాంతిమూలుడు తన రెండవరాణి, చక్రవర్తి మేనత్త కుసుమలతాదేవికడకు వెళ్ళినాడు.
కుసుమలతాదేవికి ఇప్పుడు ముప్పది సంపత్సరాలుంటాయి. అందంలో కుసుమలతే! రాణులందరితో తలలో నాలుకలా ఉండి శాంతిమూలునికి తగిన రాణి అనిపించుకున్నది. యజ్ఞశ్రీ శాతకర్ణి చక్రవర్తి తెలివితేటలన్నీ పుత్రునికి రాక కొమరిత అయిన కుసుమలతకు అబ్బినవంటారు. భర్తకు నిజమైన మంత్రి ఈ దేవేరి. చక్రవర్తి కొమరితనని గర్వంలేక ఆమె పట్టపురాణి మాఠరిగోత్రజ అయిన సారసికాదేవిని భక్తితో పూజిస్తూ ఉంటుంది. సారసికాదేవికన్న కుసుమలతాదేవే రాజకుమారి శాంతిశ్రీని పెంచింది. ఒకసారి గర్భంపోయి సారసికాదేవికి ప్రాణంమీదకు వచ్చినంత జబ్బు చేసినప్పుడు కుసుమలతాదేవి స్వయంగా పెంచిన పాలదాదికన్న ఎక్కువ ప్రేమతో సవతికి పరిచర్య చేసింది. కుసుమలతాదేవి పరిచర్యే సారసికాదేవి ప్రాణం రక్షించింది.
పట్టపురాణి కుసుమలతాదేవిని కన్న చెల్లెకన్న అధికంగా ప్రేమిస్తుంది. ఆడబిడ్డలయిన వాసిష్టి శాంతిశ్రీదేవి వాసిష్టి హమ్మశ్రీదేవులు పెద్దవదిన గారంటే భక్తిగా, ప్రేమగా ఉంటారు. చిన్నవదినగారంటే ఆపేక్ష, స్నేహమూ, ప్రేమా మూడూ రంగరిస్తారు. ఏవరెవరికి ఎప్పుడు ఆలోచన కావలసినా రాజ కుటుంబాల స్త్రీలు కుసుమలతాదేవి కడకు రావలసిందే! యజ్ఞశ్రీ సార్వభౌముడే కుసుమలతను ఆలోచన అడిగేవాడు.
నేడు శాంతిమూలుడు కుసుమలతాదేవి నగరికి తాను వస్తున్నట్లు వార్త పంపి రథమెక్కి ఆమె నగరుకు చేరినాడు. పట్టపురాణి అంతఃపుర నగరున్నూ, రెండవరాణి కుసుమలతాదేవి నగరున్నూ మహారాజు హర్మ్యాలతో కలిసే ఉన్నాయి. మహారాజు మహాహర్మ్య పంక్తికి వెనుక భాగంలో ఏడు పెద్దహర్మ్యాలున్నాయి. అన్నీ కలిసి ఉన్నాయికాని దేని అందం దానిదే. ఈ హర్మ్యాలలో తక్కిన రాణులు నివసిస్తూ ఉంటారు. కులహాకుల శివనాగశ్రీదేవి, వాసిష్టుల రంతుశ్రీదేవి, గౌతమగోత్రజ అయిన ఆయన శ్రీదేవి, పల్లవుల ఆడబడుచు నదీశ్రీదేవి, చాళుక్యుల ఆడబడుచులు పండిత శ్రీదేవి, శివనాగశ్రీదేవి, బాపిశ్రీదేవి ఉంటారు. చక్రవర్తి తండ్రి పురుషశ్రీ మహారాజు భార్యలు సునీతిశ్రీదేవి, స్కందశ్రీదేవి, వింధ్యాటవీశ్రీదేవి, మిశ్రశ్రీదేవి, సమశ్రీదేవులు అందరూ విజయపురంలో వేరు వేరు హర్మ్యాలలో ఉంటారు.
శాంతిమూలునికి సవతిచెల్లెండ్రు పదహారుగురు ఉన్నారు. శాంతిమూలుని తల్లి వాసిష్ట సునీతీదేవి. ఆమెకు శాంతిమూలునితోపాటు శాంతిశ్రీ, హమ్మశ్రీలు జన్మించారు. ఆ మహాప్రభువునకు సవతిచెల్లెళ్ళు నాగవసుశ్రీ, నాగశ్రీ, స్కందశ్రీ, స్కందకోటిశ్రీ, మహాశారసిశ్రీ, రతుమతిశ్రీ, మూలశ్రీ, అంతకోటిశ్రీ, మాదునిశ్రీ, నాగశ్రీ, రామశ్రీ, గోలశ్రీ, దేవిశ్రీ, బుద్దిశ్రీ, స్కందశ్రీ, సతీశ్రీ, ప్రజాపతిశ్రీ దేవులు. ఈ చెల్లెళ్ళందరిని, మాళవ, ముసిక, ప్రతిష్ఠాన, నాగపర్వత నగరాది మహాసామంతులకు ఇక్ష్వాకు శ్రీపురుష మహారాజు వివాహం కావించారు.
శాంతిమూలుడు కుసుమలతాదేవి వచ్చి నమస్కారం చేయగానే ఆశీర్వదిస్తూ, భార్యను లేవనెత్తి బిగియార హృదయానకు చేర్చినాడు. వారిరువురూ పోయి ఆ అభ్యంతర మందిరంలోని ఆసనం అధివసించారు.
“దేవీ! పులమావి పారిపోయాడు.”
“అవును ప్రభూ! నాకు ఈ ఉదయమే వార్త వచ్చింది. అతడు పారి పోవడం ప్రస్తుత స్థితిలో చాలా ఉత్తమమని నా ఉద్దేశం.”
“రహస్యంగా ఉన్న విరోధికన్న ఎదుటనున్న విరోధి ఉత్తముడు!”
“ఈతడేమి చేయగలడని ప్రాణేశ్వరుల ఆలోచన?”
“మళ్ళీ సైన్యాలు పోగుచేస్తాడు?”
“అప్పుడు?"
“ఎదురుగుండాపోయి హతమార్చవచ్చును.”
“నా ఉద్దేశం అతడు పారిపోలేదనీ, ఈ పట్టణంలో ఎక్కడో దాగుకొని ఉన్నాడనీ.”
“అదేమిటి దేవీ! నీవు ఆ విధంగా ఎట్లా ఆలోచించగలవు?”
“ఇక్కడనుండి ఒక్కసారిగా పారిపోతే అతడు దొరకటానికి ఎన్నో వీళ్లున్నాయి.”
శాంతిమూలుడు ఆలోచనాపరుడయ్యాడు.
8
కుసుమలతాదేవి చెప్పినట్లు పులమావి ధాన్యకటక నగరంలో ఒక రహస్యస్థలంలో దాగిఉన్నాడు. అతని వేషమూ మారిపోయింది. ముసిక నగరంనుంచి ఆయన సామంతులు, మంత్రులు, సేనాపతులు అపసర్పనాయికులు, చారులు అనేకులు వచ్చారు. స్వర్ణరాసులు కొనితెచ్చారు. ఆ రహస్యమందిరంలో పులమావి ఇరువురు చారులు, నాయకులతో మాట్లాడుచున్నాడు. వారిరువురు పులమావికి సాష్టాంగ నమస్కారంచేసి వెళ్ళిపోయారు.
ఆ రాత్రి పులమావి మారువేషంతో కొందరు అనుచరుల గూడి శ్రీకాకుళం వర్తకానికి పోయేవానిలా ప్రయాణం సాగించినాడు. ధాన్యకటక నగరం వెలుపల ఒక అర్ధగోరుతదూరంలో పులమావి జట్టును కొందరు రాజభటులు ఆపివేసినారు. “మీరు ఎవరు” అని రాజభటనాయకుడు వారిని ప్రశ్నించినాడు. పులమావి చారులలో ఒకడు వర్తకనాయక వేషంవేసి ఉండెను. పులమావిమాత్రం సేవకుని వేషంలో ఉన్నాడు. వణిక్కుల నాయకుడు “అయ్యా మా ఓడ ఒకటి యవద్వీపం వెడుతున్నది. దానిని సాగనంపడానికై నేను శ్రీకాకుళం వెడుతున్నాను” అన్నాడు.
“మీ ఓడ పేరు?”
“ఆనంద శ్రీ!”
“అలాగేకాని, మీరు ధాన్యకటకంలో ఎన్నాళ్ళనుండి ఉంటున్నారు? జన్మస్థల మెక్కడ?”
“మాది కాండూరునగరం. మేము ఇప్పటికి ఎనిమిది సంవత్సరాల నుంచీ ధాన్యకటకంలో వర్తకం చేసుకుంటున్నాము.”
“ఈ విషయాలన్నీ తెలుసుకునేవరకూ మీరు ధనకరాష్ట్ర ముఖ్యనగరం గురుదత్తపురంలో ఉండవలసివస్తుంది. ఇంక మీతో ఉండేవారి చరిత్రలు ఒక్కొక్కరివే తెలియ జేయండి.” ఇదివరకే చుట్టుప్రక్కల గ్రామాలలోను ధాన్యకటకనగరంలోనూ నివసిస్తూ వచ్చిన వారందరి చరిత్రలు ఆ వర్తక నాయకుడు మనవిచేసుకున్నాడు. పులమావి దగ్గరకు వచ్చి ఈతడు తనకుటుంబ సేవకుడైన ధర్మిలుని తనయుడైన నగధరుడనే పేరుకలవాడనిన్ని ఇంతప్పటినుంచీ తన యింటిలోనే పెరిగి తన పిల్ల లతోపాటు చదువుకొన్న బాలుడనిన్నీ తెలిపినాడు. ఇప్పుడీ బాలుని తండ్రి వృద్దుడవడంచేత తనకు సేవకుడయ్యాడనీ మనవి చేసినాడు.
ఆ దినాలలో నిజం తెలుసుకునే విధానాలు కొన్ని ఉన్నాయి. రాజభట దళాధిపతి తెలివైన అపసర్పనాయకుడు. ఎదుటున్న మాయవణిక్కునితో ఏవేవో ఈమాటా ఆమాటా మాట్లాడుతూతూ చటుక్కున "నగధరా!” అని పిలిచాడు. కాని పులమావి అదృష్టవంతుడు గనుక వెంటనే “చిత్తం!” అని ఆ రక్షకభట దళనాయకుని కడకు వచ్చాడు. పులమావి అదృష్టం పండింది. రక్షకభటుడు మీరు గురుదత్తపురం వెళ్ళవచ్చును అని వెళ్ళపోయాడు.
పులమావి గురుదత్తపురం వెళ్ళి అక్కడ అతిజాగ్రత్తగా ఉండవలసి వచ్చింది. సాహసం కలవాడినే లక్ష్మి వరిస్తుంది అని అతని మతం. ఉత్తమ కార్యాలకే ఆ సాహసాన్ని వినియోగిస్తే ఈ పులమావి మహారాజ్యం విస్తరించి తన పేరు శాశ్వతంగా నిలుపుకొని ఉండును. అతడు చక్రవర్తిపదవి ఆశించడం తప్పుకాదు. కాని ఆ పదవికి పోయేమార్గం రాక్షసత్వంతో నిర్మించుకోజూచాడు.
పులమావి ఆలోచనలు గాటమైపోయాయి. వానిలో సుడిగుండాలు ఉద్భవించాయి. ప్రళయ ఝంఝలు వీచసాగాయి. గురుదత్తపురంనుండి మారువేషాలు వేసుకొని అందరూ మాయమయ్యారు. వీరు మారువేషాలు వేసుకుని మాయమైనారని అపసర్పనాయకుడు శ్రీ రాహులునకు తెలియును. అయినా మహారాజు శాంతిమూలుని ఆజ్ఞచొప్పున ఏమీ ఎరుగని వానిలా ఊరుకొన్నాడు.
పులమావి మాయమైపోయాడు. కొన్నినాళ్ళకు పులమావి తన రాజధాని నగరం ముసికలో ప్రత్యక్షమై సింహాసనం అధివసించాడు. నెలదినాలు తన ధనాగారం నింపుకొన్నాడు. సైనికులను ప్రోగుచేసుకొన్నాడు. నెలదినాలు ముసికలో వైభవోపేతమైన ఉత్సవాలు జరిగాయి.
పులమావి మాత్రం కనుబొమలు ముడిచి తన పరాభవ దావానలాన్ని ప్రతీకార వాంఛచే ప్రజ్వలింపజేస్తున్నాడు. తన దురవస్థకు శాంతిశ్రీ మూలకారణం. అంత ప్రేమించి, ఆమెను సామ్రాజ్ఞిచేయ ప్రతిజ్ఞపూని, మహాపురుషుడైన తాను ఆమెకోసం జైత్రయాత్రను కూడా ప్రారంభించాడు. అలాంటి సందర్భంలో ఆ వగలమారి, సైంధవునివలె తన అదృష్టానికి అడ్డుపడి, పులమావి అభీష్టాన్ని భగ్నముచేసింది. అతని హృదయంలో ఒక్కటే ఆలోచన. ధాన్యకటకం నాశనం చేయడం, ఇక్ష్వాకువంశాన్ని నిర్మూలనంచేయడం, ఇక్ష్వాకు శాంతిశ్రీని పట్టికొనిరావడం. అతని మోములో నవ్వులే - అతని హృదయంలో శాంతిలేదు. అతని పళ్ళు ఎప్పుడూ బిగుసుకొనే ఉన్నాయి. అతని ముక్కుపుటాలు ఎప్పుడూ విస్తరించే ఉన్నాయి. అతని కళ్ళలో కెంపులు తళతళమంటున్నాయి.
“ధర్మంరీత్యా పులమావే చక్రవర్తి!” “మధుపాన మత్తతలో ఒడలు తెలియక పొర్లే మనుష్యుడు చక్రవర్తి కాజాలడు!” “ఇక్ష్వాకులు చక్రవర్తి వంశీకులు కారు. వారు తెరమీద బొమ్మలునడిపే ఆటగాళ్ళు. దీనిని ఏ సామంతుడు అంగీకరించలేడు.” “స్త్రీలోలురైన రాజులను బలవంతులైనవారు వధించి ధర్మరాజ్యం స్థాపించి తీరాలి”-ఈ విధంగా స్నేహముఖాలు ప్రతిసామంతునకూ పులమావి పంపించినాడు.
ఎక్కడోఉన్న ధాన్యకటకప్రభువు సకల దక్షిణాపథానికి సార్వభౌముడుకావడం మహారాజ్యాలైన వైజయంతికి, సౌరాష్ట్రానికీ, మాళవానికీ, శాతవాహనరట్టుకు, ములకదేశానికి, కళింగాలు రెండింటికీ, పూంగీయ రాజ్యాలకు, వేంగీరాజ్యానకూ, క్రముక రాష్ట్రానికి తలవంపులు అని పులమావి పంపిన దిట్టరులైన పండితులు రాయబారులుగా దేశదేశాలకు పోయి బోధిస్తూ ఉండిరి.
పులమావి నాశిక, సహ్యమలయ, వ్యాఘ్రనది, ప్రతిష్టాన, వైజయంతి, నాగపర్వతాది సంఘారామాలవారికి ఉత్తరాది సంఘారామాలవారికీ రహస్యంగా రాయబారాలను పంపి శ్రీ విజయసార్వభౌముడు, శ్రీ చంద్రశ్రీ సార్వభౌముడూ, శాంతమూలుడూ బౌద్దధర్మనాశన కారకులనిన్నీ బౌద్ధధర్మ ప్రతిష్టాపన తిరిగి చెయ్యడమే తన సంపూర్ణోద్దేశమనీ, తన నగరంలో సువర్ణగిరి సంఘారామంలో ప్రియదర్శి అశోకచక్రవర్తి లిఖించిన దివ్య శిలాశాసనంలోని పవిత్రదేశాలు పునరుద్ధరించడమే తన ఆశయమనీ వారికి మనవి చేసుకుంటూ వారి సంపూర్ణ సహాయం అర్థించాడు.
చంద్రశ్రీశాతవాహన సార్వభౌముడు బ్రహ్మదత్తునిచెంతచదువునేర్చుకుంటున్నాడు. ఆంధ్రప్రాకృతం చదువనూ వ్రాయనూ నేర్చెను. చిన్న చిన్న గ్రంథాలు చదువుతున్నాడు. మాళవిక ఆయనతోబాటు బ్రహ్మదత్తుని శిష్యురాలై చదువు ప్రారంభించింది. ఆ సమయంలో శాంతిమూల మహారాజు విజయపురంలో అగ్నిష్టోమం సంకల్పించారు. ఇక్ష్వాకులు హారితసగోత్రజు లైన ఉత్తమ బ్రాహ్మణక్షత్రియులు. ఆ దినాల్లో ఆంధ్రవేశం అంతా బ్రాహ్మణులూ, శూద్రులూ - రెండే జాతులు. శూద్రులలో ఉప్పరులు, చాకళ్ళు మొదలైన వారుండేవారు. ఆనాడు ఆంధ్రదేశంలో క్షత్రియులులేరు. బ్రాహ్మణులలో రాజ్యాలు పాలించేవారు బ్రాహ్మణ క్షత్రియులు (వీరు తరువాత వచ్చిన నియోగులకు పూర్వీకులయ్యారు - కొందరుసచ్ఛూద్ర క్షత్రియులయ్యారు. సచ్ఛూద్ర క్షత్రియులు అయిపోవడానికి కారణం బౌద్దమతానికి తర్వాత వచ్చిన జైనమతమే.)
శాంతమూలుడు విజయపురంలో అగ్నిష్టోమం చేయగానే, ధాన్యకటకంలో చక్రవర్తి చేత అఖండోత్సవం ఒకటి చేయించ సంకల్పించాడు. శాంతిమూలమహారాజు నిత్యాగ్ని హోత్రి. అగ్నిష్ఠోమానికి అన్ని ప్రయత్నాలు జరుపుటకు బ్రహ్మదత్తప్రభువు తన పరివారంతో విజయపురం వెళ్ళినాడు. బ్రహ్మదత్తుడు వెళ్ళిన నాలుగురోజులకు శాంతిమూల మహారాజు భార్యలతో పరివారజనంతో బయలుదేరి చంద్రశ్రీ సార్వభౌముని బయలుదేర దీసినాడు. చక్రవర్తి అఖండసైన్యంతో దాసీజనంతో, మహారాణులతో విజయపురం వేంచేసినాడు. ఆయన అధివసించవలసిన మదగజంపైన చంద్రశ్రీ ప్రయాణం చేయలేదు. అదివరకే శాంతమూలుడు ఏనుగుపైన ఒక అంగరక్షక ప్రభువు వేషంతో ప్రయాణం చేసినారు. చక్రవర్తి గజరాజుపై ప్రయాణం చేసింది ఒక బాలవీరుడు, అతని ప్రియురాలు.. ఆ బాలవీరునికి చంద్రశ్రీ పోలిక ఉన్నది. అతనితో ఉన్న యువతి మేలిముసుగులో ఉన్నది. మూడుదినాలు ప్రయాణాలు సలిపి చక్రవర్తి సైన్యమూ, పరివారమూ విజయపురం చేరినారు.
చక్రవర్తి విడిది చేసింది శాంతిమూల మహారాజు అభ్యంతర ప్రాసాదములో. చక్రవర్తి బ్రహ్మదత్తుని శిష్యుడై నప్పటినుంచీ కొంచెం తెలివిని సముపార్జించడం ప్రారంభించాడు. జీవితం అంటే భయం, కొంచెం భక్తి ప్రారంభమైనవి. రాజ్యవ్యవహారాలు తెలిసికొనడం రాజు, మంత్రి, ధర్మము, ప్రజలు, ముఖ్య నగరము, దుర్గము, సమితులు, సైన్యమూ, సంధి, విగ్రహము, మిత్రలాభం, రాయబారము, ధర్మవిచారణ, యాత్ర, రాజపథములు నదులు, కాల్వలు, చెరువులు, సముద్రము, వర్తకము, వైద్యము, ఖనిజములు, ఏనుగులు, రథములు, అశ్వములు, పశువులు, రహస్యచారులు మొదలగు ఎన్నియో విషయాలు బ్రహ్మదత్తుడు చంద్రశ్రీ చక్రవర్తికి ఉపదేశింప ప్రారంభించినాడు. చక్రవర్తికి ఒక అంగరక్షకుని వేషం వేసి నాగదత్తుని జత చేసి, తాను అప్రమత్తుడై బ్రహ్మదత్తప్రభువు విజయపురం అంతా తిప్పుతూ రాజ్యనిర్వహణ విధానం నేర్పసాగినాడు. చంద్రశ్రీకి ఒక్కొక్కప్పుడు కోపం వచ్చేది. ఒకసారి విసుగు జనించేది. అయినా ఓపికతో బ్రహ్మదత్తుని దేశికత్వాన అన్నీ నేర్చుకుంటున్నాడు. రాత్రి ఒంటిగా మాళవికతో కూడి ఉన్నప్పుడు “దేవీ! మమ్ము ఈ శాంతిమూలుడు, బ్రహ్మదత్తుడూ వేపుకొని తింటున్నారు. నాకీ చక్రవర్తిత్వ మెందుకు, సుఖభోగాలు దూరమయినపుడు? శుష్కమైన జ్ఞానం నాకు నూరిపోస్తే ఏమి లాభం?” అని విచారవదనముతో పలికినాడు.
“మహాప్రభూ! మీరు చక్రవర్తులు. మీకు అన్నీ తెలియకపోతే ఏలాగ?”
“తెలియకపోతే ఇబ్బంది ఏమి? మంత్రులు చూసుకోరూ?”
“అందువల్ల మీరు పేరుకు మాత్రమే చక్రవర్తి అనిపించుకొంటారు.”
“కావలసిందే పేరేకదా?”
“బ్రహ్మదత్త ప్రభువు ఈ జాగర్తలన్నీ ఎందుకు పడుతున్నాడను కొన్నారు?”
“ఛాందసుడు!”
“కాదు మహాప్రభూ! ఆయన తమ ప్రాణంకోసం ఈ జాగ్రత్తలన్నీ చేస్తున్నారు.”
“ఏమి జాగ్రత్తలో! మాతండ్రిగారు బతికి ఉన్నప్పుడు మాతాతగారి కాలంలోనూ నేను ధాన్యకటకం అంతా నిర్భయంగా తిరిగేవాడిని.”
“యువమహారాజత్వం వేరు - చక్రవర్తిత్వం వేరు మహాప్రభూ!”
“చక్రవర్తిత్వం అంటే ఈ బాధలేనన్నమాట ?”
“చక్రవర్తిత్వం అంటే మీ ఇష్టం వచ్చిన స్త్రీలతో మీ ఇష్టం వచ్చిన అమృతాలు సేవిస్తూ ఉండడము కాదు.”
“దేవీ! నువ్వు కూడా నీతిబోధ మొదలు పెట్టుచున్నావు”
“మహాప్రభూ! తమ ధర్మం తమకు....”
చంద్రశ్రీకి కోపం మిన్నుముట్టిపోయింది.
(9)
“అవును మహాప్రభూ! ఏకారణంచేత నైతే నేమి నేను తమ జీవితంలో భాగస్వామిని అయ్యాను. జీవితమంటే వివిధరత్నాలంకరణ, అనేకమంది దాసీలచేత సేవచేయించు కోవడమూ అద్భుతమైనందుకూ వస్త్రాలు లిప్తలిప్తకూ మార్చుకోవడమూ, వలచిన పురుషుని చేతుల్లో సవిలాసంగా తేలిపోవడమూ అనుకున్నాను. ఒక చక్రవర్తి పరిపాలనంవల్ల దేశం శాంతితో సుభిక్షమై ఆనందమనుభవిస్తుందని బ్రహ్మదత్తప్రభువు సెలవిచ్చారు. శాంతికీ, ధర్మాచరణకూ చక్రవర్తి భరతవర్షంలో ఏకైక చిహ్నమన్నాడు. బ్రహ్మదత్తప్రభువు ముక్కలు వింటూంటే మనం చేస్తున్న దేమిటి దైవమా అని దిగులు పట్టుకుంది.”
అందమైన మాళవికచేతులు నమస్కారముద్రలో ఉన్నాయి. ఆమె కన్నులనీరు తిరుగుతున్నది. తలవంచుకని ఆ బాలిక నెమ్మదిగా నడుస్తూలోని అంతఃపురంలోకి పెళ్ళిపోతూంటే చంద్రశ్రీ శాతవాహన సార్వభౌముడు రెండంగల్లో ముందుకురికి, ఆ బాలికను తన కౌగిలిలో పొదివిపట్టుకుని, చటుక్కున ఆమె ఎదుట మోకరించి "దేవీ, దేవీ, క్షమించు. చక్రవర్తిత్వ మంటే ఇంత భయంకరమైనదని తెలిస్తే, నన్ను చక్రవర్తిగా చేయకండయ్యా అని శాంతిమూల మహారాజును ఒప్పించి ఉందును” అని ప్రాధేయ పూర్వకంగా అన్నాడు. “అయినా నేను సార్వభౌమ సింహాసనం ఎక్కడానికి ముఖ్యకారణం నువ్వు!” అని తలవాల్చుకున్నాడు. మాళవిక భర్త రెండు చేతులు పుచ్చుకుని లేవదీసి, “క్షమించండి మహాప్రభూ! మనం ఇద్దరం భగవంతుని చేతిలో ఆటబొమ్మలు” అన్నది.
మాళవికకు ఏదో భయం ఎక్కువైనది. చక్రవర్తి భోజనమును పరీక్షకుడు పరీక్షించిన వెనుక తానుగూడ పరీక్షించడం సాగించింది. రాత్రిళ్ళు కోడికునుకుపోతూ భర్తను పదిసార్లు కనిపెడుతూ ఉంది. ఆంతఃపురందాటి భర్తను ఎక్కడికీ వెళ్ళవద్దంటుంది. సాయుధుడైన బ్రహ్మదత్తునితో తక్క చక్రవర్తిని ఎక్కడికీ వెళ్ళనీయదు. ఇతర రాణులెవరన్నా అనుమానమే. తారానిక యశోదనాగనికలు ఆమెకు కుడిచేయి, ఎడమచేయి అయినారు. నాగదత్తుడు, అతని మిత్రులు నలుగురు ఆ మందిరములకు దారి ఇచ్చే బాహ్యమందిరములో ఇరువురి తరువాత ఇరువురుగా సర్వకాలముల కావలికాస్తూ ఉండవలసిందే. శాతవాహ నాంతఃపురాలలో ఇటువంటి జాగ్రత్త లెప్పుడూ ఎవరూ పడవలసిన అవసరం లేకపోయింది. మహాపద్మనంద, మౌర్యకాణ్వాయనాదుల అంతఃపురాలలో ఇంతకు పదిరెట్లు జాగ్రత్తలు పడేవారట. రాణులందరకు మాళవిక మీద కోపం ఎక్కువై పోయింది. వాసిష్టియను పెద్దరాణి, తక్కిన రాణులు శాంతిమూలమహారాజుకడకు తమ ఆంతరంగిక పరిచారికలను రాయబారం పంపారు.
“చక్రవర్తి కడకు ఏ రాణి వేళ్ళడానికి వీల్లేకుండా ఉన్నది. ప్రాణనాథుని ప్రాణాలు కాపాడే బాధ్యత ఒక్క మాళవికదేనా? మాకులేదా? ఈ దుర్భర స్థితి ఎంతకాలం భరిస్తాము? మహారాజా! మీరు మాకు ఏడుగడ. చక్రవర్తికి హానిచేసి మా ఒడిలో ఐశ్వర్యాలు మూటకట్టుకోము. తమకు మేమంతా విశ్వాస్యలము తమ నిర్ణయానికి మేమంతా బద్దురాండ్రము” అని రాయబారం శాంతిమూల మహారాజు కడకు చేరింది.
శాంతిమూల మహారాజు ఆ వృద్దపరిచారికలను చూచి “చవ్రర్తికి తక్కిన మహారాణులతో అవసరంలేదట, మాళవికాదేవి తమకు సన్నిహితయట. ఈ విషయం అంతా చక్రవర్తితో మాట్లాడి మాహారాణులకు మళ్ళీవార్త పంపుతానని మనవి చేయండి. ఇంక వెళ్లవచ్చును” అని తెలిపినారు. అంతఃపురంలోనే చక్రవర్తి కత్తిసాము మున్నగునవి నేర్చుకుంటున్నారు బ్రహ్మదత్తునితో.
ఒకదినం చక్రవర్తి తన మందిరాలకడనున్న వనంలో బ్రహ్మదత్తుని శుశ్రూషలో విలువిద్య నేర్చుకుంటున్నారు.
చక్రవర్తి: ప్రభూ! మీకు రాని విద్య ఉన్నదా?
బ్రహ్మ: నిజానికి నాకే విద్య రాదు మహాప్రభూ!
“అన్ని విద్యలూ మీకు అద్భుతంగా వచ్చును.”
“విద్యయొక్క అవధి భగవంతుడు. మనశక్తి ఈలోకాన్ని దాటి వెళ్ళలేదు. అలాంటిది విద్యలు వచ్చినవి అనుకోవడం వట్టి మూర్ఖత మహాప్రభూ!”
“అయితే విద్య నేర్చుకోవడమే మానెయ్యాలి. ఏ విద్యా పూర్తి కాకపోతే ఎందుకు చెప్పండి?” “విద్యలు పూర్తిచేయాలని ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నంలో కొంతవరకయినా వెళ్లగలం.... ఆ తర్వాతి విద్య ఆపైజీవితంలో, ఈలా విద్య పూర్తి అయ్యేవరకూ జన్మలు ఎత్తుతూ ఉంటాము.”
“మనకు క్రిందటి జన్మము జ్ఞాపకం ఉండదే. ఇంక ఏ విద్య క్రిందటి జన్మలో ఎంతవరకూ వదిలివేశామో ఎలా జ్ఞాపకం ఉంటుంది స్వామీ ?”
“ఒక నెలదినాల క్రిందట తాము జేసిన పనులు తాము అనుభవించిన అనుభవాలు మనకు జ్ఞాపకం ఉంటాయా మహాప్రభూ!”
“ఆ! నేనో క్రొత్తమధువు త్రాగితేచాలు, అన్నీ జ్ఞాపకమే!”
“తక్కిన వేళల్లో?”
“ససేమిరా, మా మెదడుకు ఏవీ అంటవు; మా మెదడు అటువంటిది. ఒక్కముకైనా జ్ఞాపకం ఉండదు.”
“కొందరు పూర్వజ్ఞానపరులకు క్రిందటి జన్మ బాగా జ్ఞాపకం ఉంటుంది. మనకు జ్ఞప్తి ఉన్నా లేకపోయినా వెనుకటి కర్మ సంబంధం దానిపని అదే చూచుకుంటుంది. నిన్నటి భోజనంలో ఎక్కువతక్కువలు మనకు జ్ఞప్తి లేకున్నా దాని ఫలితం అనుభవానికి వస్తూనే ఉంటుంది.”
“నిన్న మంచి మధుసేవించకపోతే ఈ దినం గొంతుకంతా ఎండి పోయినట్లు ఉంటుంది, ఆమోస్తరంటారు.”
“చిత్తం.”
“అయితే బ్రహ్మదత్తప్రభూ! మేము వెళ్ళి మహాఋషీ నాగార్జునాచార్యులవారిని దర్శనం చేసుకురావాలని ఉంది.”
“చిత్తం! నేను ఏర్పాటు చేస్తాను.”
“ఆయన మూడువందల సంవత్సరాలనుంచీ బ్రతికి ఉన్నాడంటారు నిజమా ప్రభూ?”
“చిత్తం! మాతాతగారెరుగుదురు వారిని. మా ముత్తాతగారు వారూ కలిసి చదువుకున్నారట.”
“ఎవరు చెప్పారు ఆ విషయం?”
“మా తాతగారే!
“మీ తాతగారు ఇప్పుడు బ్రతికి ఉన్నారా?”
“పోయి అయిదేళ్ళు మాత్రం అయింది ప్రభూ!”
“అయితే మీ నాయనగారు వెళ్ళి శ్రీశైలంలో తపస్సు చేస్తున్నారట, ఎందుకని?”
“తపస్సు ఆత్మజ్ఞానంకొరకే”
“అదిగో మళ్ళీ ఆత్మజ్ఞానమని కొత్తగా అంటున్నారు. మీ బోటి వాండ్ల దగ్గర నేర్చుకోవడం ఎందుకొరకయ్యా?”
“జ్ఞానం రెండువిధాలు - ఒకటి లౌకికం, రెండోది పారలౌకికం.”
“మీకీ రెండూ తెలుసునా?” “మొదటిది ఏ కొంచెమో తెలుసు.”
“తాను వలచిన యువతిని ప్రేమించటంకూడా జ్ఞానమేనా?”
“వలపు మొదలైన చిత్తవికారాలన్నీ జ్ఞానసాధనలే.”
“అయితే మాళవికకూడా నాకు గురువే.”
“ఒక్కమాళవికాదేవియేకాదు. సమస్తలోకము గురువే అవుతుంది తెలియనేరిస్తే.”
“ఆ నేర్పు ఎటువంటిదో ?”
“మనం ఏ పనిజేస్తున్నా, దాని స్వరూపాన్ని, అది యిచ్చే ఫలితాన్ని విచారిస్తూ చేయాలి.”
“మాళవిక వల్ల మాకు సుఖం కలుగుతున్నది.”
“చిత్తం. ఆ సుఖస్వరూపాన్ని ఇంకా తరచాలి మహాప్రభూ.”
(10)
ఆవల శాంతమూలుడు అగ్నిష్టోమం ప్రారంభించాడు. ఈ యాగము వసంతకాలంలో ప్రారంభమయింది. వసంతకాలంలో అయిదుదినాల జరిగే యాగమిది. దేశదేశాలనుండి ఋత్విజులు వచ్చినారు. దేశదేశాలనుండీ బ్రాహ్మణ్యము వచ్చిపడింది. విజయపురానికి రెండుయోజనాల దిగువనున్న సత్రశాల అను పవిత్రయాగస్థలంలో శాంతమూలుడీ కత్రువును ఆరంభించాడు. ఆ యాగశాల ప్రదేశమంతా మహాపట్టణమైపోయింది. చతుశ్శాలలు, శాలలు, వందల కొలది వీధులు, వేలకొలది ఇళ్ళు, పందిళ్లు, పాకలు నిర్మించాడు. వైద్యశాలలు 'మంచినీళ్ళశాలలు' భోజనశాలలు నిర్మాణమైనవి. అనేక విధములైన అంగళ్ళు వచ్చినవి. ఎక్కడ చూచినా జనమే. రధ్యలను పల్లవభోగ పలకరాతితో నిర్మాణం చేసినారు. దేశదేశాలనుండి కూరగాయలు, పప్పుదినుసులు, పాలు, పెరుగులు, నేతులు దినదినమూ దిగుమతి అయిపోతున్నాయి. యాగమైన తరువాత శాంతిమూల మహారాజు బ్రాహ్మణులకు భూరిసంభావనలు ఇచ్చినాడు. మహా పండితులకు, ఋత్విజులకు, ఋషులకు లక్షలకొలది సువర్ణరాసులుపోసి తన మేనల్లుడగు చక్రవర్తిచే దానాలు ఇప్పించినాడు.
ఆరవదినమందు చక్రవర్తి దానాలు రాత్రిపడిన మూడుఘటికలవరకు ఇచ్చి నిర్ణీత కాలానికి ఆపి, తన విడిదికి వెళ్ళడానికి బయలుదేరినాడు. రథమువెంట మెరికలవంటి అంగరక్షకులున్నారు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చారో ఆ మహారాజరథపథము వెంట అయిదారువందలమంది బ్రాహ్మణులు తమ శాలువలు క్రిందకు జారవిడిచి సంపూర్ణ కవచధారులై ప్రత్యక్షమైనారు. కత్తులదూసి చక్రవర్తి రథంమీదకురికినారు. అంగరక్షకులు అప్రమత్తులయ్యే ఉన్నారు. వాళ్ళు విరోధుల మొదటి ఉరుకునకు వెనుకకేగినా మరునిమీషంలో ఫలకాలతో ఆపుకుంటూ కత్తులు దూసి తలపడినారు. ఆ చుట్టుప్రక్కల శాలలలోనుంచి ఇంకా అయిదారువందలమంది ఈ సంకుల సమరంలోకి “జయ పులమావి చక్రవర్తీ జయీభవ” అంటూ దుముకినారు. అంతా అల్లకల్లోలమైపోయింది. మహారాజ రథసారథిగానున్న నాగదత్తుడు రథం ఆపి తన స్నేహితులైన అంగరక్షకులకు గురుతుగా శంఖం మూడుసారులు ఊది హెచ్చరికచేసి ఎడమచేత ఫలకము పుచ్చుకొని, కుడిచేత పొడుగాటి భల్లం తీసి, రథముకడకు వచ్చే విరోధినెల్ల ఒక్కొక్కపోటుకు కూలుస్తున్నాడు. తోటి అంగరక్షకులు రథంమీదికురికి చక్రవర్తిని రక్షించుకొంటున్నారు.
కాని శత్రువుల దండు దొంగచాటుగా మీదపడి తాకిందిగనుక మహారాజ రక్షకులు కొంతదారి ఈయవలసి వచ్చింది. అందుకనే ముప్పదిమంది శత్రువీరులు రథంమీదకు రాగలిగారు. అంగరక్షకులు నూరుగురే ఉన్నారు. అయినా వారిలో ఒక్కొక్కడు పదిమంది మహావీరులను హతమార్చగల మేటి. కాబట్టి నాగదత్తుడు, అతనితోబాటు ఇంకో అయిదుగురూ శుత్రువులలో పదిమందిని హతమార్చారు. రథంమీద ఉన్న ఈ అయిదుగురు అంగరక్షకులకు చంద్రశ్రీ శాతవాహన చక్రవర్తి కత్తితీసి తోడయినాడు. అన్ని వైపులా జాగ్రత్తగా చూస్తూలోనికి ఎక్కబోయే వీరుణ్ణి తల నరుకు తున్నాడు. లోపలికి వేగంతో వచ్చే బాణాలకు ఫలకం అడ్డుపెట్టుతున్నాడు. గుఱ్ఱాలను పేరుపెట్టి పిలుస్తూ అదలిస్తున్నాడు. ఇంతలో బ్రహ్మదత్తుని సైన్యం శంఖాలు పూరిస్తూ ఆ సంకుల సమరభూమికి నలుముఖాల నుండీ వచ్చి క్రమ్మినది.
యుద్ధం చటుక్కున ఆగిపోయింది. కాని ఎక్కడనుండి వచ్చినదో ఒకబాణం చక్రవర్తి కంఠత్రాణమును చీల్చి కంఠములోకి దూసుకుపోయింది. చక్రవర్తి “అయిపోయినది మాపని” అని కేకవేస్తూ నిలువునా ఆ రథం మీదనే కూలిపడిపోయినాడు. ఆ వెంటనే బ్రహ్మదత్తుడు గుఱ్ఱముమీద నుంచి రణరంగాన ఉరికినాడు. యుద్ధం గడబిడలో కాగడాలన్నీ ఆరిపోయినవి. ఉన్న పదికాగడాలూ రథం దగ్గరకు వచ్చాయి. చక్రవర్తి నిర్జీవియై రథంమీద పడిపోయి ఉన్నాడు.
విరోధులలో మూడువందలు మృతినందినారు. ఏబదిమందికి దిట్టంగా గాయాయి తగిలినవి. చక్రవర్తి అంగరక్షకులలో ఎనుబదిమంది ప్రాణాలు కోల్పోయినారు. తక్కిన వారిలో పదిమందికి గట్టిగాయాలు తగిలినాయి నాగదత్తుడు రక్తసిక్తాంగుడై ఉన్నాడు. అతడు ఒక్కడూ ఏబదిమందిని హతమార్చినాడు. అతనితో పాటు ఇరువురుమాత్రం సజీవులై ఉన్నారు.
బ్రహ్మదత్తుని సైన్యాలు ఎన్నో దివిటీలను వెలిగించెను. బ్రహ్మదత్తుని వైద్యులు ఆ యజ్ఞనగర మధ్యంలో పడిపోయిన శత్రుపక్షం వీరులకు తమ వారికీ గూడ వైద్యం చేయసాగించిరి.
(11)
చక్రవర్తి మరణించాడని తెలియగానే శాంతిమూలుడు విహ్వల చిత్తంతో పామరునివలె నచ్చటికి పరుగిడినాడు. వైద్యశాలలో తల్పగతమై యున్న చక్రవర్తి శరీరాన్ని తన హృదయానికి పొదివికొని కన్నుల నీరు కారిపోవగా శాంతమూలుడు "మహాప్రభూ! సకలభారతానికీ చక్రవర్తి! ఆస్తమించినావా?” అంటూ వాపోయినాడు. ఆ దుఃఖము శాంతిమూలుని నిలువున కదల్చివేసింది. బ్రహ్మదత్తుడు ఆ తల్పందాపునే మోకరించి ఉన్నాడు. శాంతమూలుని దుఃఖం గమనించి బ్రహ్మదత్తుడు లేచినాడు. “మహప్రభూ! అవబృధస్నాతులై పవిత్రులైన మీరు పామరునిలా దుఃఖించడం ఉచితం కాదు.” శాంతిమూలుడు కన్నీరు తుడుచుకొని విషాదవదనంతో బ్రహ్మదత్తుని చూచి “దుఃఖంకాక ఏముంది ధనక ప్రభూ! మాతండ్రి తాతలు శాతవాహన వంశాన్ని తరతరాలుగా సేవచేస్తూ ఉండిరి. మా మూల పురుషుడు కోసల దేశం పద్మనందులపాలి బడినప్పుడు దక్షిణకోసలం చేరుకున్నాడు. అక్కడ నుండి శ్రీకాకుళంచేరి అచట శాతవాహనుల కొలువులో చేరాడు. ఆనాటి నుంచి శాతవాహనులు మాకు గురుతుల్యులయ్యారు. వారి కొలువులో రాజ్యాలు స్థాపించాము. ఆంధ్రసామ్రాజ్యం విస్తరింప చేశాము. శ్రీముఖ సార్యభౌముని సైన్యాధ్యక్షుడై మా పూర్వీకుడొకడు నందుల పాటలీపుత్రాన్ని విచ్ఛిన్నంచేసి, శ్రీ ముఖునికి కుడిచేయి అయి ఆయన్ను సకల భారతానికీ చక్రవర్తిని చేసెను. ఈనాటితో ధారావాహికంగా వచ్చిన శాతవాహన మహావంశము అస్తమించి పోయినది. మా చిరబాంధవ్యం నేటితో తీరిపోయింది. ఇందరం ఉండి చక్రవర్తిని రక్షించుకోలేకపోయాము. శాతవాహనులకు వజ్రకవచమైన ఇక్ష్వాకు వంశం నా మూలాన అసమర్ధమై పోయింది” అని అస్పష్టవాక్కులతో అన్నాడు.
ఈ మాటలన్నీ వింటూ ఆ ధనకప్రభువు శాంతిమూలునికి నమస్కరిస్తూ, “మహాప్రభూ! ఈ యపరాధం మా అందరిదీని. విధివిలాసం ఇలా ఉంది. గతాన్ని విస్మరించండి. ముందు చేయవలసినది ఆలోచించండి. ఇది పులమావి పన్నినమాయ. వెంటనే అతనిని శిక్షించవలసి ఉంది” అని తెలిపినాడు.
“శిక్షిస్తే లాభం ఉందా ధనకప్రభూ! అంతరించిన శాతవాహన వంశాన్ని ఏలా పునరుద్దరించగలం..... చివరకు పులమావినే మనం చక్రవర్తిగా అంగీకరించుదామా అని ఊహ కలుగుతూంది.”
“హంతకుడైన పులమావిని చక్రవర్తిగా ఎట్లా చేయగలము?”
“అవును ధనక ప్రభూ! మరి శాతవాహన వంశాన్ని పునరుద్దరించే మార్గమో?”
ఇంతలో ఆస్థానవైద్యుడు అక్కడకు వచ్చి శాంతిమూలునికి నమస్కరించి “మహాప్రభూ! నాగదత్తునికి మెలకువ వచ్చింది మహాప్రభువుల దర్శనము, ధనక ప్రభువుల దర్శనము కోరుతున్నాడు” అని మనవిచేసినాడు. మహారాజును, బ్రహ్మదత్తప్రభువులేచి నాగదత్తుని పరుండబెట్టిన గదిలోనికి పోయినారు. నాగదత్తుడు యుద్ధం ఆగిపోగానే, ఒంటినిండా తగిలిన గాయాలచే, రథంమీదనే విరుచుకుపడిపోయినాడు.
అంధకివైద్యులు జగత్ప్రసిద్ధి నందినవారు. వారి చికిత్సాపద్దతి ఆశ్చర్య కరమైనది. శల్యవైద్యమున వారు సిద్దహస్తులు. శాంతమూలుడు సత్రశాలలో నెలకొల్పిన వైద్యశాలలన్నీ ఈ రాజవైద్యుని అధికారంలో నడచుచుండెను. ఆయన వైద్యమువల్ల నాగదత్తుడు రెండుఘటికలలో తేరుకున్నాడు.
నాగదత్తుడు నీరసంగా ఉన్నాడు. అతని ఒంటినిండా కట్టుకట్టి ఉన్నాయి. శాంతిమూల మహారాజుకూ బ్రహ్మదత్తునికీ నమస్కారం చేసినాడు నాగదత్తుడు.
శాంతి : ఏమి నాగదత్తా! ఏలా ఉన్నది?
నాగ : మహాప్రభూ! చక్రవర్తిని రక్షింపలేని వాని క్షేమంతో ఏమి పని?
శాంతి: ఎవరు ఏమి చేయగలరు? నీవు నీ ధర్మము మహాభక్తితో నిర్వహించావు. నీలోటు ఏమీలేదు. నాగ: మహారాజా! చక్రవర్తిని రథం దిగవలదని ఎంతో బ్రతిమాలినాను. కాని ఆ మహాప్రభువు డాలూ కత్తీ తీసుకుని సలిపినయద్ధ మప్రతిమానం. వారు ఇరువదిమందిని హతమార్చినారు. ఆ యుద్ధంలో వారు పడిపోలేదు మహాప్రభూ! ఎక్కడనుంచో వచ్చిన దొంగపోటు వారి ప్రాణం చూరకొన్నది.
బ్రహ్మ: ఆ బాణము రాగితో చేయబడింది, చిన్నది. ఒక చిన్న ధనస్సుతో దగ్గిరనుండి అతిజాగ్రత్తగా ఆలోచించి వేసిన బాణమది. ఆ దుర్మార్గుని పట్టుకొన్నాము. కోపవివశుడనై, వాణ్ణి నూరుఖండాలుగా నరికి వేసినాను మహారాజా! ఈ తొందరపాటుకు క్షంతవ్యుడను.
నాగ: మహాప్రభూ! సార్వభౌములు పడిపోగానే నేను వారికడకు ఉరికి వారి తలను నాతొడపై పెట్టుకొన్నాను. వారు కళ్లుతెరిచి చిరునవ్వుతో నన్ను చూచి “ఏమయ్యా నాగదత్తా! ఇప్పటికి నేను మనుష్యుణ్ణి. నాజన్మ తరించింది...... ఈ పుణ్యయజ్ఞవాటిలో నా ప్రాణం ఆహుతియ్యగలుగు తున్నాను. మా వంశం నాతోసరి. పాపం మాళవిక దుఃఖం ఎవ్వరు తీరుస్తారు? మా మామయ్యగారిని ఈ సామ్రాజ్యానికి మేము మా తరువాత చక్రవర్తిగా నిర్ణయిస్తున్నాము. ఇది మా ఆజ్ఞ అని చెప్పినారు మహాప్రభూ! చిరునవ్వు నవ్వుతూనే మామయ్యగారికి నమస్కారాలు, మా గురువులకు నమస్కరాలు అని చెప్పు అని ప్రాణాలు వదిలినారు మహాప్రభూ!” శాంతిమూలునికి మళ్ళీ కళ్ళనీరు తిరిగినది. ఆయన తలవాల్చుకొని తూలుతూ గదివీడి వెళ్ళిపోయినాడు.
(12)
"అస్తమించెను శాతవాహన పవిత్ర
రాజవంశము, ధాన్యపుర మహదాంధ్ర
వైభవము కృష్ణవేణ్ణా ప్రవాహమందు
మునిగిపోయె, భరతలక్ష్మి మోముమాసె
అనే విషాదగీతము ఆ వైద్యశాలా ప్రాంగణంలో భట్టొకడు పాడినాడు.
మాళవికాదేవి చక్రవర్తి కళేబరముచెంత ఒళ్ళు తెలియని మూర్ఛలో పడి ఉంది. లేచినా జ్ఞానములేనిచూపు ఆమె మనస్తూ ఆత్మా ఈ లోకంలో లేవు. భోజనానికి లేవదు. స్నానం చేయదు, మాటలేదు. శాంతిమూల మహారాజు నడుముకట్టుకొని సార్వభౌముని కళేబరమున్న మహాశాలా ద్వారంలో కావలి ఉన్నారు. వారికి మూడుదినాలనుండి భోజనంలేదు. చక్రవర్తి శరీరాన్ని మహావైద్యులు ఓషధీయుక్త తైలాలతో తడిపి సార్వభౌమాలంకారాలతో ఉంచినారు. మూడుదినాలు మహాసామంతుడు, సామంతులు, రాష్ట్రపతులు, మహాసేనాపతులు, సేనాపతులు, మహామంత్రులు, సచివులు, చూట్టాలు, వర్తకచక్రవర్తులు, పండితోత్తములు, అర్హతులు, ఆచార్యులు, భిక్కులు వేలకొలదిమంది వచ్చి చూచిపోతున్నారు. వందులుతలలు వంచి ఆ మహాశాల కెదురుగా ముప్పొద్ధులా విషాదగాధలు పాడుతున్నారు. “ఎచట నిదురించితివి సార్వభౌమా
ఎచట మేల్కొందువోయీ
కన్నాకువై భూమి
కన్నాళ్ళు ప్రోచితివి
ఏదేశమేగెదవొ
ఈ రీతి మమువిడిచి
ఎచట.......”
వేరొక వంది :
“సదసుల హృదయుడు
మృదుమధుర జీవి
పూత చరిత్రుండు
పుణ్యుడు దివ్యుడు
బాసెనయా ఈనాడూ
మాసె ధరిణివల్ల కాడూ!”
అని కంటినీటితో పాడినాడు.
నాల్గవదినాన చక్రవర్తిని నాలుగులక్షల ప్రజలు దుఃఖాశ్రులు విడుస్తూ ఉండగా బ్రాహ్మణులు అగ్ని సంస్కారంకోసం లేవనెత్తినారు. సార్వభౌముని దేహం కదలబోతుండగా “మహాప్రభూ! వెళ్ళిపోతావా? నన్ను వదలి ఎలా వెళ్ళగలవు?” అని కేకవేసి మాళవిక నిర్జీవయై నేలమీద నొరగిపోయింది. ఆ పుణ్యాంగనకు భర్తృసహగమనం లభించింది. వెంటనే అందరు ధాన్యకటకం చేరినారు. శాంతిమూలమహారాజు పవిత్ర కృష్ణవేణ్ణా తీరమందు సార్వభౌమునికి ఉత్తమలోక ప్రాప్తికై గోభూహిరణ్యగజ దానాదులు చేసి పితృయజ్ఞం నిర్వర్తించెను.
ఆంధ్రదేశ వాసులయిన ప్రజలు, రైతులు గ్రామగ్రామాన దుఃఖంతో నిండిపోయారు. ఈ వంశం భూమి పుట్టినప్పటినుంచి రాజ్యంచేస్తూ ఉన్న దనే వారు నమ్మినారు. పులమావి ఇంతటి దుష్కర్మపాలయి ఏమీ బావుకుందామనుకున్నాడు అన్నారు. పులమావిని సింహాసన మెలా ఎక్కిస్తా మని రౌద్రహృదయులయ్యారు. “ఇదయ్యా దేశంలో అరాజకత్వం. చక్రవర్తి లేకపోతే భూమిలో ధర్మం నశిస్తుంది అవి వేద ప్రామాణ్యము” అని బ్రాహ్మణోత్తములు ధర్మవాక్యాలు పలికినారు. ఏదో మహాఝంఝ పుట్టే ముందువలె దేశమంతా నిమ్మకు నీరుపోసినట్లుగా ఉంది.
శాతవాహనవంశం అంతరించింది. ఆంధ్రవిష్ణువునుండి ఉద్భవ మందిన ఈ వంశం, విక్రమార్కుని ఎదిరించి నాశనం చేసిన ఈ వంశం, సకలభారతానికీ సార్వభౌమ సింహాసన మెక్కిన ఈ వంశం, ద్వీపద్వీపాల ధర్మప్రచారం చేయించి వన్నె కెక్కిన ఈ వంశం, లోకం అంతా సర్వకళలచే దీపింపచేసిన ఈ వంశం అస్తమించింది.
★ ★ ★