అక్షరశిల్పులు/ముందు మాట
ఆచార్య షేక్ మస్తాన్ M.A (Tel).M.A.(Lit).Ph.D, అధ్యక్ష్యులు: ఆధునిక భారతీయ భాషల విభాగం అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం అలీఘర్, ఉత్తరప్రదేశ్.
ముందు మాట
తెలుగు సారస్వత రంగానికి ముస్లింల సేవ అమూల్యం. అపురూప గ్రంథాలను అసంఖ్యాకంగా తెలుగు పాఠకులకు అందించారు. తెలుగు సాహిత్య రంగానికి వన్నెతెచ్చిన అవధాన ప్రక్రియను సైతం అలవోకగా నిర్వహిస్తూ, అద్బుతంగా పద్యరచన గావిస్తూ చక్కని విద్వత్తును, గొప్పధారణా శక్తిని ప్రదర్శించి పండితులు-ప్రజల చేత శబాష్ అన్పించుకున్నారు.
తెలుగు సాహిత్య క్షేత్రంలో పండుతున్న అన్నిరకాల సాహిత్య పంటలను పండించడం మాత్రమే కాకుండ సొంత బాణిలో 'రెక్కలు' లాింటి ప్రత్యేక సాహిత్య రచనా ప్రక్రియలకు అంకురార్పణ చేసి తెలుగు సాహిత్యరంగాన్ని సుసంపన్నం చేయడంలో తమదైన ప్రత్యేక భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. తెలుగు 'తల్లిబాష' కానప్పటికి తెలుగు భాష మీద మంచి సాధికారత సాధించి అద్బుతమైన ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభ అతీయంగా ఉన్నా, సృష్టించిన సాహిత్యం అనితర సాధ్యమైనా ముస్లిం కవులు, రచయితలకు తగినంత గుర్తింపు లభించడం లేదన్నది జగమెరిగిన సత్యం. తెలుగు వాఙ్మయ చరిత్రకారులకు, తెలుగు భాషా వైతాళికుల గ్రంథకర్తలకు తెలుగు ముస్లిం కవులు, రచయితల పట్ల చిన్నచూపుంది. తెలుగు సాహిత్య చరిత్రకారులు రూపొందించిన గ్రంథాలను పరిశీలిస్తే ముస్లిం కవులు, రచయితల పట్లగల 'వివక్ష-విస్మరణ' స్పష్టం అవుతుంది. బహుభాషా పండితులు, బహుగ్రంథకర్త, స్వాతంత్య్ర సమరయోధాులు, ఆధ్యాత్మిక గురువులు, ప్రజాప్రతినిధి, అవధాని, మహాకవి డాక్టర్ ఉమర్ అలీషాను పరిచయం చేయడనికి తెలుగు వాఙ్మయ చరిత్రకారులకు తమ గ్రంథాలలో సముచిత స్థానం దొరకలేదు. మౌల్వీ ఉమర్ అలీషా మాత్రమే కాదు తెలుగు సాహిత్య ప్రక్రియలన్నిటిలో తమదైన ప్రతిభను కనపర్చిన కవులు, రచయితలు షేక్ బుడన్ సాహెబ్, తక్కళ్ళపల్లి పాపా సాహెబ్, అచ్చుకట్ల దస్తగిరి, షేక్ అలీ, షేక్ మహమ్మద్ హుస్సేన్, షేక్ దావూద్ సాహెబ్ లాంటి వారు కూడ ఇటువంటి 'వివక్ష-విస్మరణ'కు గురికాకపోలేదు. ఆ కారణంగా తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథాలలో ముస్లిం కవులు, రచయితల పరిచయాలు అత్యల్పంగా కన్పిస్తాయి, అక్కడక్కడా ఒకటీ రెండూ కన్పించినా ఆయా కవులు రచయితల గురించి, వారి రచనల గురించినసమాచారం నామమాత్రమే. భాషాశాస్త్ర నిపుణులు, ఉత్తమ సాహిత్య విమర్శకులు ఆచార్య తూమాటిటి దోణప్ప (నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు) గారి ప్రోత్సాహంతో తెలుగు సాహిత్యానికి ముస్లింలు అందచేసిన సేవల మీద పరిశోధన జరిపే అవకాశం నాకు లభించింది. ఆ అవకాశాన్ని వినియోగించుకుని 'తెలుగు సాహిత్యం ముస్లింల సేవ' సిద్ధాంత వ్యాసాన్ని నాగార్జున విశ్వవిద్యాలయానికి సమర్పించి 'పి.హెచ్‌డి' పట్టాను పొందాను. ఆ పరిశోధన సమయంలో 1984 వరకు ముస్లిం కవులు, రచయితలు తెలుగు సాహిత్యానికి అందించిన సేవలు నా పరిశోధాన పరిధిలోకి వచ్చాయి. నా యీ సిద్ధాంత వ్యాసాన్ని 1991లో ప్రచురించాను.
ఈ గ్రంథం వెలువడ్డాక, అద్బుతమైన తెలుగు సాహిత్యాన్ని సృష్టించిన ముస్లిం కవులు, రచయితల లౌకిక దృక్పథం, జాతీయత, దేశభక్తి తదితర విషయాలు గురించి తెలుగు పాఠకుల ఎరుకలోకి వచ్చాయి. 'ఏకత్వంలో భిన్నత్వం ' అంత:సూత్రంగా సాగుతున్న భారతీయ జన జీవన స్రవంతిలో ముస్లింలు పాలు-తేనెగా కలసిపోయి భిన్నత్వంలో ఏకత్వాన్ని సజీవంగా నిలుపుతున్నతీరుతెన్నులను వెల్లడి చేసింది.
'తెలుగు సాహిత్యం: 'ముస్లింల సేవ' ప్రచురణ తరువాత సాగిన రెండు దశాబ్దాల కాలంలో తెలుగు సాహిత్య రంగంలో ముస్లింల ప్రవేశం, ప్రమేయం అత్యధికమని చెప్పవచ్చు. నా రచన తరువాత ఎందరో ముస్లిం కవులు, రచయితలు తెలుగు సాహిత్య వెలుగును ప్రకాశింప చేశారన్నది సత్యదూరం కాదు . ఒక వైపు తమ తల్లి భాష 'ఉర్దూను ' విస్మరించకుండనే ప్రాంతీయ భాష తెలుగును కూడ వంట బ్టించుకుని, తెలుగు సాహిత్య ప్రక్రియలలో ప్రవేశం సంపాదించి ఉత్తమ సాహిత్యాన్నిసృజియిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే వర్తమానంలో ముస్లిం కవులు, రచయితల సంఖ్య దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చింది. సమకాలీన సమాజంలో పాఠకుల ఆదరణ పొందిన ప్రతి ప్రక్రియలో అద్భతమైన వస్తు పరంగా, భాష పరంగా నైపుణ్యాన్నిసాధించి చక్కని గ్రంథాలను అందిస్తున్నారు. సమాజంలో ప్రచురణ ప్రసార సాధానాల ఉధృతం ఎంతగా ఉన్నా పాఠకుల ఆదరణ అంతకంటె ఎక్కువగా ఉండడంతో సాహిత్య గ్రంథాల వెల్లువ ఏమాత్రం తగ్గలేదు. ముస్లిం కవులు, రచయితలు కూడ వ్యక్తిగతంగా తమ సాహిత్య ప్రక్రియలను పెద్ద సంఖ్యలో వెలువరించడం ఆనందించ దగిన విషయం. కవులు, రచయితలు వ్యక్తిగతంగా కవితా-కథా-వ్యాస సంపుాలను వెలువరించడం మాత్రమే కాకుండ తెలుగులో రాస్తున్న ముస్లిం కవులు, రచయితల ఉత్తమ రచనలు సేకరించి సంకలనాలను కూడ ప్రచురించడం ఆహ్వనించదగిన పరిణామం. ఆ తరువాత ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యల తీవ్రతను బట్టి ఆయా సమస్యలను ప్రదాన వసువుగాస్వీకరించి కవితా సంకలనాలు, కథా సంకలనాలు అధిక సంఖ్యలో వెలువడటం ప్రధాన జీవన స్రవంతిలో భాగంగా సాహిత్య ప్రపంచానికి ముస్లిం సమాజం అందిస్తున్న అత్యంత విలువైన భాగస్వామ్యాన్నివెలుగు చేస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం 'అక్షరశిల్పులు' గ్రంథాన్నివెలువరించిన సయ్యద్ నశీర్ అహమ్మద్ చరిత్రకారులుగా, రచయితగా, బహు గ్రంథకర్తగా ప్రతిష్టులు. ఈయన రచనలు రాసిలోనూ వాసిలోనూ, ప్రసిద్ధివహించాయి. ముస్లిం సమాజ ప్రతిష్ట పున:స్థాపన ప్రధాన లక్ష్యంగా వెలువడిన ఈయన గ్రంథాలు విభిన్న సాంఫిుక సముదాయాలున్న భారతీయ సమాజంలో సద్భావన, సదావగాహన మరింతగా పున:స్థాపన కావడనికి దోహదాపడతాయి. సుస్పష్టమైన అవగాహనతో సాధికారమైన రచనలు చేయడంలో నశీర్ సిద్ధాహస్తులు. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల పాత్రను వెలుగు చేస్తూ ఆయన రాసిన గ్రంథాలు ముస్లింల మీదా అసంకల్పితంగా ఉద్బవించిన సంశయాలను, సందేహాలను, ఉదేశ్య పూరితంగా ప్రచారం చేయబడుతున్న అసత్యాలను, అర్దసత్యాలను పఠాపంచలు చేసి ముస్లింల అస్తిత్వాన్ని ధృడపర్చి, ముస్లింల దేశభక్తికి కాగడా పడుతుంటాయి. 'అక్షరశిల్పులు' రచన సాహిత్య సంబంధమైనది. చారిత్రక రచన ఒక ఎత్తయితే సాహిత్య చరిత్ర రచన మరో ఎత్తు. ఇది చరిత్రకారుడైన నశీర్ గారి భావవై విధ్యానికి నికశోఫలంగా నిర్ధారించవచ్చు. ఈ రచన తెలుగులో రాసిన/రాస్తున్నముస్లిం కవులు, రచయితల రచనలు, వారి జీవిత రేఖలకు దర్పణం లాంటిది. ముస్లిం తెలుగు రచయితలు తెలుగు సాహిత్యాన్నిసుసంపన్నం చేస్తూ సృష్టించిన రచనల వివరాలను, ఆయా కవులు,రచయితల జీవిత విశేషాలను వివరించే కార్యభారాన్ని మోసేందుకు నశీర్ అహమ్మద్ పూనుకోవడం ఆయన చారిత్రక, సాహిత్యాభిలాషకు నిదర్శనం. ఈ కార్యనిర్వహణకు కంకణం కట్టుకుని ఆయన కార్యసాధాకులయ్యారు. ఇదొక క్లిష్టమైన మహత్తర కార్యం. యీ కార్యసాఫల్యానికి కడు వ్యయప్రయాసలకు లోనైఉంటారన్నది నగ్నసత్యం. ఇటువంటి గ్రంథ రచనలకు సంబంధించిన విషయ సేకరణకు ఎంతో ఓపిక, ఓర్పు, సహనం అవసరం. పలు ఒడు దుడుకులను, కష్టనష్టాలను సైతం భరించక తప్పదు. యీలాంటి బృహత్కర కార్యభారాన్ని చేప్టి పట్టువదలని విక్రమార్కుడిలా అహర్నిశలు కృషి చేసి 333 మంది కవులు, రచయితల వివరాలతో 'అక్షరశిల్పులు' వెలువరించడం ముదావహం. యీ గ్రంథం ద్వారా ముస్లిం కవులు, రచయితలు వారి రచనలు మరుగున పడి మటుమాయం కాకుండ నశీర్ నిక్షిప్తం చేశారు. భావి తరాలకు, సాహిత్య చరిత్ర పరిశోధాకులకు అక్షరశిల్పులు ఎంతగానో ఉపకరిస్తుందనటం ఏమాత్రం అతిశయోక్తికాదు. యీ గ్రంథాన్ని ప్రముఖ కవి మౌల్విఉమర్ అలీషాకు అంకితం ఇవ్వడం హర్షదాయకం. ఉత్తమ కవులు, రచయితలు పట్ల నశీర్ గారికి ఉన్నగౌరవభావానికి ఇది నిదర్శనం. ఈ గ్రంథానికి వీలైనంతగా శాశ్వత భద్రత కల్పించాలని, సాహిత్య చరిత్ర పరిశోధకులకు సర్వదా అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో ప్రముఖ గ్రంథాలయాలకు, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు, ప్రచార సాధానాల వ్యవస్థలకు ఉచితంగా అందచేయాలని నిర్ణయించడం మహోన్నతమయింది. అక్షరశిల్పులు ప్రచురణను వాణిజ్య వ్యవహారంగా కాకుండ ముస్లిం సమాజానికి, తెలుగు సాహిత్య ప్రపంచానికి మేలు కలుగచేయడమే ప్రధానమన్న సంకల్పం కలిగిన నశీర్ అహమ్మద్ అభినందనీయులు. ఆర్థిక ఒనరులు పుష్కలంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, సాహిత్య అధ్యయన సంస్థలు, సాహిత్య పీఠాలు మాత్రమే చేయగల పనిని నశీర్ వ్యక్తిగతంగా పూనుకుని అనుకూల-ప్రతికూల పరిస్థితులను కూడ సమానంగా సహనంతో ఆహ్వనించి ఒంటి చేత్తో పూర్తిచేయడం ప్రశంసనీయం. సత్యశోధకులు, సాహిత్యాభిలాషి నశీర్ లాంటి వ్యక్తికి ప్రజలు, ప్రభుత్వాలు, విశ్వ విద్యాలయలూ కించిత్తు తోడ్పాటు అందించినా అద్భుతాలను సృస్టించగలడన్నది నిర్వివాదాంశం. ఈ గ్రంథానికి ముందుమాట రాయడం నాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాను. ప్రజలకు, పాఠకులకు ప్రధానంగా సారస్వత సమాజానికి ఉపయుక్తంకాగల బృహత్తర కార్యభారాన్నిచేపట్టి 'అక్షరశిల్పులు' గ్రంథాన్నిఅందించిన సయ్యద్ నశీర్ అహమ్మద్ మున్ముందు తెలుగు సాహిత్య చరిత్ర రంగాన్నిమరింత సంపన్నం చేయగల గ్రంథాలను ప్రచురిస్తారని ఆశిద్దాం, ఆహ్వానిద్దాం, ఆశీర్వదిద్దాం.