అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 3
ప్రకరణము ౩ - తానాషా పూర్వచరిత్ర
ఎవరీ యక్కన్న మాదన్నలు? వీరే సామ్రాజ్యాధినాయకులై కొంతకాలము గోలకొండను పరిపాలించిన సుప్రసిద్ధాంధ్రమంత్రులు అక్కన్నమాదన్నలు.[1] వరంగల్లుఫర్గణాలో పింగళి భానూజీపంతులు ఒకానొక అమీలుక్రింద సుంకాధికారి. ఈయన భార్య భాగ్యమ్మ. ఈదంపతుల భాగ్యముగా వారికి నలువురు కుమారులు జనించిరి. — అక్కన్న, మాదన్న, విశ్వనాథుఁడు, మృత్యంజయుఁడు నని. తండ్రియే కుమారులకు చదువు చెప్పెను. సకాలమున వివాహములంజేసి గృహస్థులనుగా నొనర్చెను. ఉత్సాహవంతులైన పెద్ద కుమారు లిరువురును ఒక శుభముహూర్తమున తండ్రియాజ్ఞనంది తమ పురోహితుని వెంటనిడుకొని రాజకీయోద్యోగములకై గోలకొండకు వచ్చి ముజఫరుఖానుకడ గుమాస్తాలుగా ప్రవేశించిరి.
ఆ మూఁడవనాఁడే దండోరా వినిరి. నాఁడే సుల్తాను దర్శనముసు వసారత్ ఉద్యోగలాభమును. మెల్లమెల్లగా పైకివచ్చి ఎన్నఁడో సుల్తానుదర్శన మగుటకన్న తలవని తలంపుగా నొక్కదెబ్బతో వారికి సుల్తాను దర్శనమైనది. దర్బారువీడి బసకు వచ్చినవెంటనే వారు తమయదృష్టమును తండ్రికి చెప్పి పంపిరి.
అక్కన్నమాదన్నలకు తానాషా వేదాంతవాక్యములు వినినది మొదలు ఆతఁడేల అట్లు మాటలాడెనో, ముజఫరుఖానుఁడు తమపై నేల యసూయవహించెనో కనుఁగొన వలయునని కుతూహలము పొడమినది. వారు అటనట విచారింపఁగా నీక్రింది విషయములు తెలిసినవి.
గోలకొండ సుల్తానులలో అబ్దుల్లాకుతుబుషా ఆఱవవాఁడు. ఈతఁడు తనతండ్రి మరణానంతరము క్రీ. శ. 1626లో పండ్రెండేండ్ల వయసున రాజ్యమునకు వచ్చి నలువదియాఱు సంవత్సరముల కాలము పరిపాలించెను. ఈకాలమం దంతయు నాతఁడు ఇతరుల చేతి కీలుబొమ్మయై యుండెను. నలువది యేండ్లకుపైగా నీతని రాజ్యతంత్రము నంతయు నీతని తల్లి హయత్‌బక్ష్‌బేగమ్ అనునావెు నడపుచువచ్చెను. ఈమె బలవంతురాలు, దర్పముతో నిర్వహించినది. ఈమె చనిపోయిన తర్వాత అబ్దుల్లా తన పెద్దయల్లుఁడైన సయ్యద్ అహమ్మద్ అనువానికి సర్వవిధముల వశవర్తి యైయుండెను. ఈతనియొక్కయు ముజఫరుయొక్కయు రాజనీతిచే గోలకొండ సామ్రాజ్యము మొగలాయీలకు లోజిక్కక దాదాఁపు అర్ధశతాబ్దము తప్పించుకొనెను. కాని రాజ్యవినాశము ఎట్లును తప్పనట్టి పరిస్థితి రాఁదొడఁగినది. అబ్దుల్లా దుర్బలుఁడు; తనజీవితమంతయు సోమరిగా గడపెను. క్రీ. శ. 1656 వ సంవత్సరమున నీతఁడు ఔరంగజేబు చేతఁబడక కొంచెములో తన ప్రాణములను కాపాడుకొనెను. ఇతఁడెప్పుడును ప్రజలకు దర్శనమిచ్చుటగాని దేశాచారముల ననుసరించి ధర్మాధర్మములను విచారించుట గాని లేదు. కోటగోడలను దాఁటి ఇవలికి వచ్చుటకు అధైర్యపడుచుండును. అందుచేత దేశమందు కల్లోలములును అరాచకమును సహజముగా తప్పనివయ్యెను.
రాచనగరునందును పరిస్థితులు ఇంతకన్న చక్కఁగా లేవు. రాజకుటుంబమునందు అంతఃకలహము లేర్పడుచుండినవి. సుల్తాౝ అబ్దుల్లాకు మువ్వురు కుమార్తెలు మాత్రమే, పుత్త్ర సంతానములేదు. మొదటియల్లుఁడు పైన పేర్కొన్న సయ్యద్ అహమ్మద్. రెండవయల్లుఁడు ఢిల్లీ పాదుషాఔరంగజేబు రెండవ కొమారుఁడు. వీరిలో అహమ్మద్ మక్కాకుచెందిన యొక గొప్ప కుటుంబములోజనించి కేవలము తన స్వశక్తిచేతనే రాజ్యమందు సర్వాధికారిగా నుండెను. సుల్తానుయొక్క మూఁడవకొమార్తెకు వివాహము కావలసి యుండెను. ఈమెను అహమ్మదు తన యాశ్రితునికే సయ్యద్‌సుల్తాన్ అను వానికిచ్చి పెండ్లిచేయుట కేర్పాటుచేసెను. ఇంతలో ఈయిరువురకును బెడిసి ద్వేషమేర్పడి నది. ఇది క్రమముగాముదిరి జగడమునకుదిగి, సరిగా సయ్యదు సుల్తాను పెండ్లినాటికి ఆపెండ్లి మాన్పవలసినట్లు వచ్చెను. పెద్దయల్లుని కోపమునకు సుల్తాను భయపడెను. సయ్యద్ సుల్తానుయొక్క పెండ్లివేషమును లాగివేసి రాజ్యమునుండి తఱుమఁగొట్టి ఆతనియింటిని రాజభటులు కొల్ల గొట్టిరి.
తర్వాత జోస్యులుపెట్టిన లగ్నము దాఁటిపోనీయక ఆదినమే సుల్తానుయొక్క మూఁడవకుమార్తెకు వివాహము నెఱవేర్పవలసి యుండెను. రాజమంత్రులు వరాన్వేషణ మొునరింపసాగిరి. బలవంతుఁడును బుద్ధిమంతుఁడు నైనవాఁడు సుల్తానునకు అల్లుఁడైన తనకాపదయని పెద్దయల్లుఁడును అట్లే మంత్రులును తలంచి వ్యర్థుఁడెవఁడైన దొరకునా యని వెదుకసాగిరి. వారికి అబుల్‌హసౝ అనువాఁడు దొరకెను. ఇతఁడు తండ్రి పార్శ్వమున రాజబంధువు. ఆతండ్రి గొప్పవర్తకమును సాగించి మరణించినను తన యవసానకాలమున నేమియు మిగుల్పనందున అబుల్‌హసౝ పేదరిక మనుభవించుచుండెను. వివాహ దినము నాటికి పదునాలుగు సంవత్సరములుగా నీతఁడు సయ్యద్ రాజుకొత్తాల్ అను మహమ్మదీయస్వామికి శిష్యుఁడై వారి సాంగత్యమందే కాలము గడపుచుండెను. తండ్రి చనిపోవునప్పుడు పదునాలుగేండ్లు, ఇప్పుడు ఇరువదియెనిమిది.
ఈ మహమ్మదీయ సన్న్యాసి సంస్కృతాంధ్రములలో కూడ కవి, వేదాంతి, పండితుఁడు. ఈతఁడు తానాషాకాలమున గోలకొండలో మహాతపస్వి యని ప్రసిద్ధినందియుండెను. తపస్సంపన్నులవంశమున జనించినవాఁడు. బందేనవాజ్ హజరత్ అను తపస్వియొకఁడు ఢిల్లీనగరమునుండి బయలుదేరి అల్లాయుద్దీను సుల్తాను కాలమున గుల్బర్గాకువచ్చి అచ్చటనే యుండి సమాధినందెను. ఈతనివంశమువా రందఱును గొప్ప వేదాంతులై స్వాములని ప్రసిద్ధినందిరి. వీరిది సూఫీమతము. తాము మహమ్మదీయులే యైనను తమవారియందు వీరికి పక్షపాతము లేదు. ఏమతమువారైనను సరియే వేదాంతులైన చాలును. ఇతనివంశమున పుట్టినవాఁడే సయ్యద్ రాజుకొత్తాల్, అబుల్‌హసౝ గురువు. ఈమహర్షి పెద్దకొమారుఁడు అక్బరుషా, ‘బడేసాహేబ్’ అని బిరుదమువహించినవాఁడు. తండ్రివలెనే కవిశిఖామణి. ఈతఁడు ఆంధ్రభాషయందు శృంగారమంజరి యను నొక ‘రసమంజరి’వంటి కావ్యమును రచించెను. అది పోయినదిగాని దాని సంస్కృతానువాదము నేటికిని కలదు. ఇతఁడును అబుల్‌హసనునకు గురువే.
నిరంతరము ఈమహాశయులమాటలు వినుచు వేదాంతిగా అబులహసను కాలము గడపుచుండెను. దీనినెల్ల నీచసహవాసముగా భావించి ధనికు లెవ్వరును ఈతనితో చేరరైరి. అబుల్‌హసనునకు ఐహికవాంఛలు జనింపలేదు; వేదాంతము పట్టువడియుండెను. గురువుమీఁద నీతనికి అపారభక్తియు ఇతని యందు గురువునకు చాలవాత్సల్యమును ఏర్పడియుండినవి.
ఒక దినము గురుశిష్యులగోష్ఠిలో సుల్తానుకుమార్తె వివాహప్రస్తావము వచ్చినది. ఆమఱునాఁడే వివాహముహూ ర్తము. రాచనగరులోని గందరగోళము ఊరంతయు తెలిసియుండినది. సంతోషముగా నేవో మాటలాడుకొనుచుండి గురువు తటాలున నేలమీఁదనుండి ఎఱ్ఱని మట్టిముద్దను తీసికొని అబుల్‌హసనుయొక్క కాలివ్రేళ్లకు పాదములకును పారాణివలె నలంకరించెను; పరిహాసముగా నవ్వుచు ‘నేను నిన్ను పెండ్లికొమారునివలె నలంకరించుచున్నాను’ అని పలికెను. ఏలయన వారిలో వివాహానంతరము పెద్దలు పెండ్లికొమారుని ఆశీర్వదించువిధమిది. ఇదేమని చుట్టునుండినవారు ఆశ్చర్యపడిరి. ‘ఏమో! భగవంతుఁడు నాకీబుద్ధిని పుట్టించినాఁడు’ అని ఆమహాత్ముఁడు బదులు చెప్పెను.
ఆమఱునాఁడు రాజాధికారులు అబుల్‌హసనుకొఱకు వెదకుకొనివచ్చి గురుసన్నిధినుండి తోడ్కొనిపోయి, అతనికి, సయ్యదుసుల్తాను శరీరమునుండి లాగివేసిన వివాహమంగళవేష మిచ్చి, ఉజ్జ్వలాలంకృతమైన మహోన్నతాశ్వముపై నెక్కించి, దివిటీలతోను సంగీతాదికములతోను ఉరేగించి రాజుకొమార్తె నిచ్చి వైభవముగా వివాహము గావించిరి. ఇదంతయు నాతఁడేదో స్వప్న మాయగా తలఁచెను. వివాహానంతరము గురువును దర్శించి ఆతనిపాదములలో వ్రాలెను. ‘ఈప్రపంచమే ఇటువంటిది’ అని ఆతనిగురువు బోధించెను. ఈమహానుభావుఁడే, నాటి పెండ్లికొడుకే నేటి తానీషా, ఆంధ్రులకు రామదాసచరిత్రమున చిరపరచితుఁడైన ‘తానీషానవాబు’. నిరంతరము వేదాంత వినోదములలో ప్రొద్దుపుచ్చుచుండినందుచేత నీతనికి తానాషా అనఁగా నిత్యసంతోషి యగురాజు అని ప్రసిద్ధివచ్చినది. మననోట తానీషాయైనది. కాని ఆయనపేరు అబుల్‌హసౝ; కుతుబ్‌షా అనునది గోలకొండసుల్తానుల పరంపర పేరు.
సుల్తానుయొక్క అల్లుఁడైన తర్వాత ఈయన సింహాసనమునకు వచ్చినదొక విచిత్రకథ. క్రీ. శ. 1671, ఏప్రిలు 21వ తారీఖున అబ్దుల్లాసుల్తాను మరణించెను. తత్క్షణమే సింహాసనమునకు తగవులు ప్రారంభమైనవి. సయ్యదు అహమ్మదు, గతించిన అబ్దుల్లా సుల్తానునకు తాను పెద్దయల్లుఁడైన కారణమున సింహాసనము తనదని లేచెను. అతనిభార్య, మాసాహేబు, తనచుట్టునున్న బానిసలను వైదేశసేవికలను, సాయుధలను గావించి అంతఃపురమందు తనహక్కులను కాపాడుకొనుటకు సంసిద్ధురాలుగా నుండెను. కాని ప్రయోజనము లేకపోయినది. సయ్యదు అహమ్మదునకు ఆతనికఠినకర్కశస్వభావముచే శత్రువు లనేకు లేర్పడియుండిరి. పైగా నీతఁడు పరిపాలనయందు సమర్థుఁడగుటచేత ఉద్యోగులు సహింపలేకయుండిరి. అబుల్‌హసను యొక్క వేదాంతవినోదస్వభావము లంచగొండ్లైన రాజకీయులకు చాల అనుకూలముగా నుండెను. అతనిని సుల్తానుగా సింహాసనమెక్కించిన తమకు విశేషలాభముండునని వా రనుకొనసాగిరి. అంతఃపురములోను కోట దర్బారులోను కొంత జగడమైనది. సయ్యద్‌ముజఫర్ అనుసేనాపతియు, మూసాఖాౝ అను మహల్దారును (అంతఃపురరాజగృహాధికారి) మఱికొందఱు ఉద్యోగులును ఏకమై ఆకస్మికముగా సయ్యద్ అహమ్మదును పట్టి చెరసాలయం దుంచిరి. వెంటనే అబుల్‌హసనును సింహాసన మెక్కించి పైయిరువురును మంత్రులైరి. ఇతఁడే సయ్యద్ ముజఫర్, సర్వసేనాపతి, మహామంత్రి, అక్కన్న మాదన్నలను తానాషాదగ్గరకు తెచ్చినవాఁడు. ఈ మంత్రియొక్క అధికార వాంఛయు తలపొగరుతనమును తానాషాకు భరింపరాక యుండెను. తన మంత్రులను దుర్మార్గులను తొలఁగించుట కాతఁడు తరివేచియుండెను. అందులకు తగినసహాయులు దొరకలేదు. అక్కన్న మాదన్నలను చూడఁగానే వీరు తనకీ కార్యమునకు ఉపకరింతురని తానాషా తలంచెను. వారివారి నడుగుటచే అక్కన్నమాదన్నలకు ఇంత పూర్వచరిత్రము తెలిసినది.
- ↑ వీరు కొందఱు తలంచినట్లు మహారాష్ట్రులుకారు. ఆంధ్రనియోగి బ్రాహ్మణులలో వీరవైష్ణవులైనవారు గోలకొండ వ్యాపారులు. వీరి బంధుపరంపర నేటికిని ఆంధ్రదేశములో నున్నారు.