అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 25
ప్రకరణము ౨౫ - తానాషా కడపటిమాటలు
తానాషా దౌలతాబాద్ కోటలో ఖైదిగా 1688 సం॥ జనవరినెలలో ప్రవేశించెను. ఆకోటయందే పదునాలుగు సంవత్సరములు ఆమహనీయుఁడు బందిగా గడపి తుదకు అతిసార భేదులచేత క్రీ . శ. 1702 లో ప్రాణములను వదలెను. ఆతఁడు చనిపోయిననాఁ డొక విచిత్రదైవసంఘటన జరిగినది. ఒకనాఁడు తానాషా చాల జబ్బుగా నుండఁగా ఆకోటను కాపాడునట్టి ఖిలేదారునకు స్వప్న మొకటి వచ్చినది. ఎవరో వచ్చి అతనితో ‘అదుగో తానాషా చనిపోయినాఁడు. ఆతని శవమును తీసికొని పోయి అతనిగురువైన సయ్యద్‌రాజు కొత్తాల్‌యొక్క సమాధి ప్రక్కన సమాధిచేయుము” అని చెప్పిన ట్లుండెను.
తెల్లవాఱఁగానే ఖిలేదారు తానాషాను దర్శించెను. తానాషా తనవైపు చూడఁగానే సలాముపెట్టి ‘తమతోనొక విషయము తత్క్షణము మనవి చేయవలయును’ అనెను. వెంటనే తానాషా అందుకొని ‘ఔను. నీకు కలలో వచ్చిన భగవదాజ్ఞ నాకు మెలఁకువలోనే వచ్చినది. భగవదాజ్ఞను నెఱవేర్పుము.’ ఖిలేదారు ఆశ్చర్యపడెను. ఆతర్వాత కొన్ని నిముసముల కంతయు తానాషా మరణించెను. తత్క్షణమే ఖిలేదారు ఢిల్లీపాదుషాకు తెలుపకయే తానాషా శవమును కొనిపోయి ఆతని గురువు సమాధికి ప్రక్కన పాతి సమాధి కట్టించెను. ఇందు చేతనే ఈయన గోరి గోలకొండలో లేదు. గురుశిష్యులు మరల కలసికొనిరి. ఆయన స్థానము భక్తులతోగాని ప్రభువులతో కాదు. తానాషా చనిపోయిన నాటి తారీఖు తెలియదుగాని జీవితకాలము ఏబదియాఱేండ్లు.
తానాషా ఖైదులో పడిన తర్వాత ఆతని కొక కుమారుఁడు పుట్టెను. సుల్తానుగాన ఆతనియంతఃపురముకూడ నాతనితో దౌలతాబాదులోనే యుండెను. ఆపిల్లవానికి బందిసుల్తానని ఇతరులు పేరుపెట్టిరి. అతఁడు పెద్దవాఁ డైనంతట పాదుషా వానికి ఆస్థానమునకు వచ్చుట కనుజ్ఞయొసంగెను. కాని ఆ బాలుఁడు వచ్చుట కారంభించినంతట తానాషా పూర్వభృత్యులకు వానియందు దాక్షిణ్యభక్తులేర్పడి వారందఱును అతనికి సలాము లిడసాగిరి. ఈవిషయము పాదుషాకు తెలియఁగానే వానిని ఆస్థానమునకు రానీయక రహస్యముగా చంపించెను.