అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 22



ప్రకరణము ౨౨ - అబ్దుల్‌రజాక్‌లారీ కడపటియుద్ధము

ఈలోపల తానాషాయెుక్క సర్దారులలో చాలమంది ఔరంగజేబుయొక్క స్కంధావారమును ప్రవేశించి పాదుషా కడ మర్యాదలను పదవులను సంపాదించుకొనసాగిరి. ఇట్లుండఁగా తానాషాకోటలో నొక కింవదంతి పుట్టెను. గోలకొండసర్దారులు ప్రధానులగువారు మువ్వురలో నొకఁడైన షేక్‌మిౝహాజ్ అనువాఁడు లోలోపల పాదుషాకు సహయముచేయుట కొడంబడి యున్నాఁడని తానాషాతో కొందఱు ఆప్తులు చెప్ప సాగిరి. తానాషా ఆమాటలను నమ్మి షేక్‌మిౝహాజును చెఱఁ బెట్టించెను. ఇప్పడు తానాషాసర్దారులలో నమ్మకమైనవారు ఇరువురే మిగిలిరి. ఒకఁడు అబ్దుల్‌రజాక్‌లారీ, రెండవవాఁడు అబ్దుల్లాఖాౝపానీ. ఈయిరువురును తమశక్తినంతయు వినియోగించి తమ సుల్తానుకొఱకు పాటుపడుచుండిరి.

పాదుషా అబ్దుల్ రజాక్‌లారీకడకు దూతను పంపెను. ఆఱువేల సైన్యమునకు ఆధిపత్యమును పెక్కు గౌరవములను ఇచ్చున ట్లొకఫర్మానా వ్రాసెసు. రజాకునకు చాలకోపము వచ్చెను. రాజభక్తినుండి ఎంతమాత్రము ఆతఁడు చలింపక పాదుషాదూతను తిరుగఁగొట్టెను. తనప్రాణములకు సైతము లక్ష్యము చేయక ఆ ఫర్మానాను కొనిపోయి, కోటగోడమీఁద నిలిచి, పాదుషాసైన్యమునకు చూపుచు దానిపై నుమ్మివేసెను. నానావిధములుగా వెక్కిరించి తుదకు చింపి పాఱవేసెను. పాదు

8 షాకు ఇట్లుచెప్పి పంపెను. “ఈమహాయుద్ధమునకు పోల్పఁదగినది కర్బలాయుద్ధము తప్ప వేఱుకానరాదు. హజరత్ ఇమాంహుసేనుగారితో చేరియుండి తుదకు ద్రోహులై అతని మీఁదనే కత్తినెత్తిన పాపులతో అబ్దుల్‌రజాక్‌లారీ ప్రాణముండఁగా ఎంతమాత్రము చేరఁడు. ఆడెబ్బదిఇరువురు వీరులలో నొకనివలె ఇహపరములలో కీర్తిప్రతిష్ఠలు నాకు రాగలవు. తమ నాయకునికిని తమకును ప్రాణముండు వఱకును పోరాడి నశించినవారిలో నొకఁడను కాఁగలను.” ఈవాక్యములు పాదుషాకు పోయి చెప్పిరి. ఆతఁ డాశ్చర్యపడెను. రజాక్‌మీఁద చాలగౌరవ మేర్పడెను. కాని ప్రత్యక్షముగ మాత్రము ‘చీ! ఎంత దురదృష్టవంతుఁడు’ అనెను.

మరల మొగలాయీలు ముట్టడి ప్రారంభించిరి. రుహుల్లా ఖాననువాఁడు కోటను పట్టుటకు తన సామర్థ్యము నంతయు వినియోగింప నారంభించెను. తుదకాతని ప్రయత్నములకు కొంత ఫలము కనఁబడెను. కోట తలుపులు తెఱచు నుపాయము కనఁబడెను. అబ్దుల్‌రజాక్‌లారీ ఎదురు తిరుగఁగా అబ్దుల్‌ఖాౝపాని లొంగిపోయెను. ఈతఁడు తానాషాకు మిగిలిన యిద్దరు ప్రధానులలో నొకఁడు. ప్రధానమైన ఖిర్కిదర్వాజా యీతని స్వాధీనమందుండెను. ఎట్టి యాలస్యమును లేక కోటనుపట్టు మార్గమును చెప్పవలసినదని యాతనిని మొగలాయీలు ప్రార్థించిరి. వారు చూపిన యాశలకు లొంగి, కోటగోడలలో ఫిరంగిదెబ్బలకు చెడిపోయిన ప్రదేశములను చెప్పి మొగలాయీ వారి సైన్యమురాఁగానే తాను తలుపు తెఱచున ట్లాతఁడు రహస్యముగా నొప్పుకొనెను. ఈవిషయము తానాషాకును రజాకునకును తెలియదు.

ఒకనాఁడు రాత్రి మూఁడుజాము లైనతర్వాత మొగలాయీ సర్దారులు రుహుల్లాఖాను, ముఖ్‌తర్‌ఖాను, రణమస్తఖాను, సాఫ్‌షికౝఖాను మొదలైనవారు అబ్దుల్లాఖాను చెప్పిన మార్గములలో కోటగోడలమీఁదికి వచ్చిరి. మహమ్మద్ ఆజంషా, పాదుషాకుమారుఁడు, సైన్యముతో కోటదర్వాజా కడకువచ్చి నిలిచెను. వెంటనే అబ్దుల్లాఖాౝపాని తలుపులు తెఱచివేసెను. మొగలాయీలు లోపల ప్రవేశింప నారంభించిరి.

ఈయార్భాటములు వినరాఁగానే అబ్దుల్‌రజాక్ తానాషాయందలి భక్త్యనురాగములు ఒక్కమాఱుగా ఉబికిరాఁగా తటాలున యుద్ధసన్నద్ధుఁ డాయెను. తాను పూర్తిగా కవచాదులు ధరించుటకుగాని గుఱ్ఱమునకు జీనువేయుటకుగాని అవ కాశము లేదు. ఒక కత్తి చేతఁగొని కనఁబడిన యొక గుఱ్ఱముయొక్క వట్టి వీపుమీఁదికి దుమికి రెండవచేత డాలు మాత్రముగొని యుద్ధమునకు ఉఱికెను. అతని వెంటనుండిన పండ్రెండుగురును అట్లే దుమికిరి. ఆ యావేశములో ఎవరు ఎచట నుండిరో వారెరుఁగరు. ఊహాతీతమైన పరాక్రమమును రజాక్ చూపసాగెను. అఱువదియేండ్లవాఁడు కాళ్లతోను చేతులతోను పోరాడెను. ప్రాణమునకే తెగించెను. ‘శరీరములో ప్రాణముండు వఱకు పోరాడవలసినదే’ యని ఆతఁ డఱచుచు కొట్టుచుండెను. అడుగడుగునకును తనమీఁదికి కత్తులును ఈఁటెలును వచ్చుచుండఁగా వానిని కొట్టుచు త్రోయుచు నాతఁడు పోవుచునేయుండెను. నఖశిఖపర్యంత మాతనికి కత్తిదెబ్బలును ఈఁటె పోటులును. దర్వాజావఱకును పోయి తలుపులు వేయ వలయునని ఆతని యుద్దేశము కాఁబోలు. లెక్కలేని గాయములకుతోడు ఆతనికి మొగమున పండ్రెండు గాయములు తగిలినవి. ఒకదెబ్బకు కన్నొకటి పోయినది. ఆతని గుఱ్ఱమునకు చాల గాయములు తగిలి అది అతని బరువునకు వణకుచుండెను. ఇంతవఱకు వచ్చినంతట ఆతఁడు గుఱ్ఱముయొక్క కళ్లెములను వదలి దానిని మాత్రము తనకాళ్లసందున గట్టిగా పట్టుకొనెను. ఆ గుఱ్ఱము తత్క్షణమే గుంపు నుండి తప్పించుకొని రజాక్‌ను కొనిపోయి ఒక చెట్టుక్రింద త్రోసి చూచుచు నిలిచియుండెను. ఇంతలో తెల్లవాఱెను. ఎవఁడో ఆతని గుర్తించి దయదాల్చి తనయింటికి వెూయించుకొని పోయెను.