అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 20
ప్రకరణము ౨౦ - క్షామము
ఈవిధముగా నెంతపని చేయుచున్నను కోట బురుజులలో కొన్ని ప్రదేశములు పగిలి గోలకొండ సైన్యమునకు రక్షణతగ్గినను మొగలాయీ సైన్యములో కొంత యతృప్తి యేర్పడి చాలమంది తిరుగుబాట్లు చేయునట్లుండిరి. ఇందులకు కారణము జనులకు ఆహారము లేకపోవుటయు జంతువులకు గడ్డి లేకపోవుటయు. దేశమందు క్షామ మేర్పడెను. మహాధనికులుకూడ స్కంధావారమున దిగులుపడసాగిరి. ఆసంవత్సరము వర్షములు చాల తక్కువయైనందున జొన్నలుగాని రాగులుగాని పండలేదు. పైరు లెండిపోయినవి. పేదలు మాడి పోసాగిరి. ఈలోపల తానాషాకు సహయము చేయుటకు వచ్చిన మహారాష్ట్రసైన్యము మొగలాయీవారికి వచ్చుచుండిన సరఫరాలను పూర్తిగా నడ్డగించి వేసెను. మొగలు సైన్యములోనే అంటువ్యాధులు బయలుదేరినవి. అన్నపానములు లేకయు రోగములు వచ్చియు ప్రతిదినము లెక్కలేనివారు చనిపోవుచుండిరి. చాలమంది సిఫాయీలు కడుపుకోసము తానాషాకడకు పోయిరి. మఱికొందఱు తానాషాతో చేరకపోయినను రహస్యముగా తానాషా సైన్యమునకు సాయము చేయుచుండిరి.
నాటిపరిస్థితులను కొందఱు మహమ్మదీయ కవు లిట్లు చిత్రించిరి.-మొగలాయీవారి దాడిచేత దేశమంతయు పాడై పోయెను. పాతిపెట్టిన ధనములవలె ప్రభువులు ఎచ్చటెచ్చటనో దాఁగియుండిరి. దారిద్ర్యము దేశమందు ప్రబలి కవుల కావ్యములలో ప్రజ్ఞాదారిద్ర్యము కనఁబడుచుండెను. సిఫాయీలకు జలధారకు బదులు అసిధారయు ఆహారమునకు బదులు సంహారమును దొరకుచుండినవి. వైద్యులు తమ వైద్యమును మఱచిపోయి ఆహారమే మహౌషధమని బోధించుచుండిరి. జోస్యుఁడు తనశాస్త్రము ఎవరికిని తన అక్కఱలేనందున ఎచ్చట రొట్టె దొరకునాయని వెదకుచు చంద్రునిచూచి చంద్రుఁ డేల రొట్టె కారాదని కోరుచుండెను. పాదుషావారి కరణములకు కరణీయములు లేవాయెను. కాని ప్రధానకరణము మాత్రము సంవత్సరమంతయు రంజానే యని వ్రాసికొనసాగెను. ఖోరానులో ‘భోజనము చేయుము’ అను వాక్యమును చదివి ‘తిండికూడదు-అని యెచ్చటను లేదే’ అని యొకసాయెబు చింతించుచుండెను. దర్జీవాఁడు తన సూదితో సమానమైపోయెను. ఇతరుల నూతనవస్త్రములను కుట్టుటకు బదులు తనమలినవస్త్రమునుపఱచి దానిముందు కూర్చుండి ముష్టి యెత్తసాగెను. సాలెవాఁడు వస్త్రమునకు చాయమార్చుటకు బదులు తానే చాయమాఱిపోయెను. రొట్టెల యంగడివానికే రొట్టె చిక్కుట,లేదు. చిల్లరసామానుల యంగడివాఁడు అంగడి నెత్తివేయుటకు ఆలోచించుచుండెను. వానియంగడిలో తక్కెడయు గుండ్లును తప్ప వేఱులేవు. వడ్రంగి తన ఱంపము ఉలియు చేతఁబెట్టుకొని ఆకాశము చూచుచుండెను. కమ్మరివాఁడు కమ్మనివస్తువేది దొరకునాయని దిక్కులు చూచుచుండెను. మంగలివాని కత్తికి పనిలేదు. వంటవాండ్రందఱకు చాల విశ్రాంతికలిగినది. ప్రొయ్యులలో పిల్లులుకూడ వెచ్చదనము లేమిచే పరుండుటను మానినవి. ఒక యింటినుండి ఏడ్పులు వినవచ్చినవి. పోయి విచారింపఁగా వారి యింటికి బంధువులు భోజనమునకు వచ్చిరని తెలిసినది. ఇంకొకచోట జనులు చాల పరిహాసముచేయుచుండిరి. కారణ మేమనఁగా నొకఁడు రొట్టెను చూచినట్లు కలగనెనట. ఈ దుఃఖము లేవియు తెలియని పిల్లలు మాత్రము సంతోషముతో నాడుకొనుచు, ఆఁకలివేసినప్పుడు ఏడ్చుచు, తాము పస్తుండి తమకు తల్లిదండ్రులుపెట్టగా తినుచునుండిరి.
గోలకొండ చాలగట్టికోట. ముట్టడి ప్రారంభమైనది మొదలు ఆకస్మికముగా వచ్చి కోటను పట్టవలయునని ఫిరోజు జంగు ప్రయత్నించుచుండెను. కోటలోపలను వెలుపలను కావలియుండు సిబ్బంది మూమూలుగా మూఁడుజాముల వఱకు మేలుకొనియుండుటచే నాల్గవజామున త్రాటినిచ్చెనలువేసి ఉచ్చుత్రాళ్లు విసరి వానిని పట్టుకొని మెల్లగా గోడల నెగఁబ్రాకి లోపల ప్రవేశింపఁదలంచెను. ఒకదినము రాత్రి మూఁడుజాము లైనపిదప ఒక జాము మిగిలియుండఁగా కొందఱు మహావీరులతో నాతఁడు కోటగోడను సమీపించెను. తా నచ్చట నొక బండఱాతి వెనుకనిలిచి తన పరివారమును పని ప్రారంభింప నాజ్ఞాపించెను. ఇరువురు సాహసికులు చాల నేర్పుచూపి కోటగోడలమీఁది కెక్కిపోయిరి. కొందఱు ఉచ్చుత్రాళ్లమూలమున సగముదూరము ఎక్కిరి. కాని వారి దురదృష్టవశమున ఆచోట సంచరించుచుండిన యొక పాడు కుక్క, అచట పడియుండిన శవములను తినుచుండినట్టిది, వీరిని చూచి తటాలున మొఱుగసాగినది. వెంటనే కావలివారు మేల్కొని కాగడాలు వెలిగించిరి. ఆశత్రువులను చూచి వారిని వెంటనే క్రిందికి దొర్లించి చంపిరి. ఇతరుల ననేకు లను నిలువున చంపిరి. ఈ విపత్తును చూచి దుఃఖపడి చేయునదిలేక ఫిరోజుజంగు వెనుదిరిగి పోయెను. ఇంతలో పాదుషా గారి సైన్యములు చాల దెబ్బ తిన్నవని స్కంధావారములో పూర్తిగా తెలిసిపోయెను.