అక్కన్న మాదన్నల చరిత్ర/ప్రకరణము 14
ప్రకరణము ౧౪ - మాదన్నమీఁద రెండవకుట్ర
అత్తిమత్తరాయని మొదటిప్రయోగము ఫలింపలేదు. సుల్తానునకు మంత్రులపై నభిమాన ముండువఱకు వారిబలము తగ్గుట కవకాశములేదు. ఈమాఱు మఱియొకవిధమైనప్రయోగము లేవనెత్తెను. మొగలాయీలువచ్చి చెంతనే యున్నారు. దినదినమును ఏదో క్రొత్త ఆశ్చర్యకరమైన విశేష మొకటి జరుగుచునే యుండెను. మీర్‌ఇబ్రహీం మొగలాయీలకడకు పోయినదిమొదలు ఎవఁడో యొకఁడు ప్రతిదినము ఆపనియే చేయుచుండెను. సర్దారులు చాలమంది పాఱిపోయిరి. ఒకదినము సుల్తాను చాలఖిన్నుఁడై యుండెను, షారఫ్ ఉల్-ముల్క్ అను నతఁడు, ఆతని చెల్లెలి భర్తయే, మొగలాయీలకడకు పాఱిపోయెను. ఈసందర్భమున ఆదిత్యమూర్తియు షేక్‌మిౝహాజును కలసి ఒక దొంగజాబును పుట్టించిరి. ఔరంగజేబు స్వయముగా వచ్చినయెడల తాము తానాషాను పట్టియిచ్చి గోలకొండ కోటను ఆతనికి స్వాధీనము చేయుటకు సిద్ధముగా నున్నామని అక్కన్నమాదన్నలు పాదుషాకువ్రాసి దానిని ఒకనిచేతి కీయఁగా వానిని ఎవరో పట్టుకొనివచ్చినట్లు సుల్తానుకడకు తెచ్చిరి. తానాషా ఆజాబు చూచుకొనెను. మాదన్న వ్రాఁతవలెనే అది యుండెను. కాని సుల్తాను మనుష్యుల అంతర వెుఱిఁగినవాఁడు. ఈజాబును పట్టుకొనినవారు మాదన్నకు స్నేహితులు కారు. ఆతనివ్రాఁతకును దీనికి కొంతభేదము నుండెను. వెంటనే అక్కన్న మాదన్నలను సుల్తాను పిలిపించెను. వారును వచ్చిరి. ఆజాబు వారిచేత నిడెను. వారిరువురును దానినిచూచిరి. వారి మొగములయందు ఎప్పటిప్రసన్నత యుండెనేగాని అవి దొంగ మొగములుగా లేవు. తమవ్రాఁతగల మఱియొకకాగితమును చూపి పోల్చుకొమ్మని వారు ప్రభువును కోరిరి. కొన్నియక్షరములలోను భాషలోను భేద ముండెను. ఈజాబు వాస్తవముగా తమదేయని ప్రభువు నమ్మియుండినయెడల తా మెట్టిశిక్షకైన తలయొగ్గియున్నటులు మంత్రులు ప్రమాణ మొనర్చిరి. తానాషా వెంటనే ఆజాబును చింపివేసెను. అంతసేపును అట్టె చూచుచుండి షేక్‌మిౝహాజ్ అత్తిమత్తులు మత్తులవలెనై వెడలిపోయిరి. తానాషా తనకు కష్టకాలము సంప్రాప్తమై యున్నదని తలఁచి తనమంత్రులమీఁది యీప్రయోగములు ఎట్లు పరిణమించునోయని చింతింపసాగెను.
సుల్తాను సెలవునంది ఇంటికి వచ్చుచునే భగవంతునిపై భారమువేసి అక్కన్న మాదన్నలు తమగుమాస్తాలను పిలిపించిరి. కాశీమొదలు రామేశ్వరమువఱకు పుణ్యక్షేత్రములలో లక్షమందిబ్రాహ్మణులకు అన్నదానములకు ఏర్పాటుచేయించిరి. ఇంకను పారలౌకిక కార్యములు చేయుటకు కాలము వచ్చినదని వారు తలంచిరి. తల్లిదండ్రుల కపాయమురానీయక వారిని తమ్ములతో దూరదేశములకు పంపివేసిరిగదా. ఇది మొదలు తమ జీవితమంతయు భగవత్కైంకర్యమున గడుప మొదలిడిరి. శ్రీశైల గర్భాలయమునకు బంగారుపూఁత పూయించిరి. పుష్పగిరి శంకరాచార్యపీఠమునకు భూదానము లిచ్చిరి. గోలకొండకు సమీపమున మహేశ్వర మనుచోట శివాలయమునకు ఒక వారములో నొక మహోన్నతగోపురమును నిర్మించిరి. అచటనే యొకతటాకమును త్రవ్వించి, ఆలయగోపురమునకు కలశాది ప్రతిష్ఠలుచేసి, పూజారులను హెచ్చుగా నేర్పాటుచేయించి ప్రతిదినము రెండువేలమంది బ్రాహ్మణులకు అన్నదానముచేయుటకు ప్రారంభించిరి. ఎన్ని రాచకార్యము లుండినను ప్రతిదినమును ఉదయము పండ్రెండుగంటలకును, రాత్రి పదిగంటలకును అచ్చటికేఁగి స్వయముగ బ్రాహ్మణసమారాధనలో పాల్గొని వచ్చుచుండిరి.
ఇట్లు వీరు కైంకర్యమున నుండఁగా శత్రువులు సుల్తాను సాయములేకయే వీరిని చంపివేసినయెడల చాలబాధలు పోవునని తలంచిరి. అంతఃపుర పూర్వసువాసినులు వీరికి సాయపడు చుండిరి. వీరందఱునుకలసి కుట్ర సాగించిరి. సుల్తానుకడనుండి మంత్రులు ఒంటరిగా వెడలిపోవు సమయము చూచి వారిని చంపివేయవలసినదని తమపరివారములతో సమయము వేచి యుండిరి. అంతఃపురమందలి పనికత్తెలుకూడ ఇందులకు సంసిద్ధలైయుండిరి. కాని ఎట్లో ఈవిషయము మంత్రులకు తెలిసి పోయినది. సుల్తానునకు వారు తెలుపఁదలఁచుకొనలేదు. కారణము ఆధ్యాత్మికదృష్టి యేర్పడిపోయినది. మహాలక్ష్మి త్వరలోనే వెడలిపోయెద నన్నదిగదా! దేశమా, గందరగోళముగా నున్నది; ప్రాణమా, తామరమీఁది నీటివలె అల్లలనాడు చున్నది. శత్రువు వాకిటికి వచ్చియున్నాఁడు. తన యైశ్వర్య మంతయు తనయెదుట కొల్లవోవుచున్నను సుల్తాను దుఃఖ పడకున్నాఁడు. ఆతఁడే వేదాంతిగానుండఁగా మనమేల అట్లుండ రాదు అని ఆసోదరులు భావించిరి. ఈ మూఁడవకుట్ర జరిగిన యనంతరము తమకు అంత్యకాలము చాల దాపైనదని తలంచి మహామంత్రు లిరువురును తమయింటఁగూడ విశేషవస్తువు లుంచుకొనక సర్వస్వము దానముచేసిరి. బంధువులను సత్కరించి దూరస్థలములకు పంపివేసిరి. భార్యలును తామును గుమాస్తాలును పరివారముమాత్ర ముండిరి. మేనల్లుఁడు, వెంకన్న (రూస్తంరావు) గోపన్నతమ్ముఁడు మాత్రము ఉద్యోగధర్మము చేత వదలలేఁడు. అక్కన్నకుమాత్రము మల్లయ్య యని రెండేండ్లకుమారుఁ డుండెనేగాని మాదన్నకు సంతానము లేదు. మల్లయ్యను దాది ఎప్పుడును ఎడఁబాయక కాపాడుచుండెను. ఇంటికడను దానధర్మములు జరుగుచుండినవి. ఇదంతయు సుల్తానెఱుఁగఁడు.