అంశుమతి
అంకితం
నా గృహలక్ష్మి
చిరంజీవి సౌభాగ్యవతి సుభద్రకు
అంశుమతి
• చారిత్రాత్మక నవల •
శ్రీఆంధ్ర సామ్రాట్టు వేంగీమహానగర స్వామి, మహారాజు మంచన భట్టారకదేవుని ఏకైక పుత్రిక అంశుమతీ కుమారి గోవూరు గోపాదక్షేత్రమునందు స్నానము చేయుచున్నది. ఆ బాలికతో పాటుగ నామె చెలి మాధవీలతా కుమారియు నదియందు గ్రుంకులిడుచున్నది. రాజ పురోహితుడు 'అఖండ గౌతమీస్నానమహం కరిష్యే' అని ప్రారంభించి, 'దశాపరేషాం దశపూర్వేషాం' అను మంత్రములతో రాజకుమారికను గోదావరీ స్నానము పూర్తి చేయించెను.
గట్టుపైన తనకై నిర్మించిన శిబిరములోనికి బోయి, యాబాలిక యుచితవేషము ధరించి, చెలులు కొలుచుచుండ నీవలికివచ్చి, అక్కడచేరిన భూదేవు లందరకు సంభావనలు సమర్పించినది. ఆ వెనుక స్యందనమెక్కి విడిది చేసియున్న మహాభవనమున బ్రవేశించినది.
పదునెనిమిది వత్సరముల ఎలప్రాయమున నున్న ఆ బాలిక లోకోత్తరసుందరి యని ప్రసిద్ధిగాంచినది. ఆనాటి రాజకుమారు లెందరో ఆమెను వివాహమాడ వాంఛించి శ్రీ మంచన భట్టారకమహారాజు కడకు రాయబారములంపు చుండిరి. కాని యా బాలిక ఏ కారణముననో యా రాయబారములలో నొక్కటినైనను అంగీకరించలేదు.
అంశుమతీ కుమారి జాతకమున నేదియో గ్రహ దోషము వచ్చినదని రాజ జ్యోతిష్కుడు నారసింహభట్టు పండితులు సెలవిచ్చినారు. అందులకు, గోవూరు గోపాద క్షేత్రమున గోదావరీ స్నానము చేయుచు, నుత్తమ బ్రాహ్మణులచే గ్రహజపము లొనరింప జేయుచు, దానాదు లర్పింపవలయునని నారసింహభట్టు నిర్ణయించినారు.
'ఆ దోషము గ్రహచారమువలన కలిగినది. తమ రాజ్యమునకే ముప్పు తెచ్చును. గ్రహశాంతి చేయించినచో నా యుపద్రవము తీరిపోవును' అని రాజగురువు వచించినాడు.
'అటుల దోషము తీరిపోయిన అమ్మాయి జాతక మెట్లుండు నందురు గురుదేవా?'
'రాజకుమారి జాతక ముత్కృష్టమైనది. ఆమెకు మహారాజు భర్తగా లభించును. ఆమె గర్భమున కులదీపకుడైన సుపుత్రు డుద్భవించి , సామ్రాజ్యాధిపతి యగును.'
రాజగురువే గోవూరునందు రాజకుమారికచే గోదావరీ స్నాన వ్రతము చేయింప నేర్పాటయ్యెను. వ్రతము నలుబది దినము లొనరింపవలసి యున్నది.
సాగరు లపవిత్రము సలిపిన భూమిని పవిత్రను సేయుటకు భగీరధుడు హిమవ న్నగమున దప మాచరించి, ఆకాశగంగను మెప్పించెను. ఆమె భూమి నవతరించుట కనుగ్రహించినను, ఆమె దిగివచ్చు నురవడి నాపగల వారెవ్వరు? కావున భగీరధుడు మరల నుగ్రతప మొనర్చెను. ఆ తపమునకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యెను. ఆ మహేశ్వరుడు తన జటాజూటము విప్పి భూమికి మహావేగమున వ్రాలి వచ్చు మందాకినీ నదిని తన జడలలోనికి గ్రహించినాడు. ఆ దివ్యనదిలో నొక పాయను మాత్రము పరమేశ్వరుడు భూమిని పూతమొనరించుటకై వదలినాడట. అప్పటినుండియు గంగను జటాజూటమున ధరించి శివుడు గంగాధరుడైనాడుజ భగీరధుడు గంగను భూమి నవతరింపజేయుటచే నా దివిజనది భాగీరధియైనది.
ఉత్తర భారతదేశమునందు ఈ మహోత్తమసంఘటన జరిగిన కొన్ని యుగములకు, పరమశివుని యవతార మొక్కటి వింధ్యపర్వతము దాటి దక్షిణాపథమునకు వచ్చి, పశ్చిమాద్రియందు ప్రత్యక్షమయ్యెను. అచ్చట నా శంభు దేవుడు త్య్రంబకేశ్వరుడై వెలసెను. ఆ దినములందే దండకారణ్యమున నేటి గోవూరు ప్రాంతమున గౌతమమహర్షి తన యాశ్రమము నిర్మించుకొని తపం బాచరించుకొనుచుండెనట. ఆ ప్రదేశమున మాత్రము వర్ష మెల్లప్పుడు కురియుచుండెనట. ఆ వానలే పంటల కాధారములట. కావున ఆ సీమ నాదిమ నివాసులగు ఆంధ్రు లుపాయమును బన్ని గౌతమమహర్షి యాశ్రమములోనికి గోవు నొకదానిని తోలిరట. ఏనాటి కానాడు పండు వరి చేను నాగోవు మేసిపోవుచుండ గౌతముడు దాని తరిమివేయ నొక దర్భపుల్లను విసరినంత మహర్షి తపోబలంబున నాయావు మరణించి నేలఁగూలినది.
గోహత్యా మహాపాతకము గౌతముని జేరవచ్చినది. ఆ పాపమును నాశనము జేసికొనుటకు నా ఋషిసత్తముడు దీక్షతో తపమ్ముసలుప బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. త్య్రంబకేశ్వరమునకు జని యచ్చటవెలసిన పరమశివుని జటలో నున్న గంగను గొనిరా బ్రహ్మ ఆతని నియమించెనట. గౌతము డా త్రినేత్రుని వేడి యభ్రగంగలో వేఱొక పాయను గొని వచ్చెను. గోహత్యాపాతకము నాశనము జేసినది గావున గోదావరి యనియు, గౌతముడు కొనివచ్చెనుగాన గౌతమి యనియు నా దివ్యనదికి బ్రసిద్ధనామములు వచ్చినవి. గోవు చనిపోయిన ప్రదేశము గోపాదక్షేత్రము. అచ్చట వెలసిన మునిపల్లె గోవూ రయినది.
రాజకుమారి గోదావరీస్నాన వ్రతము నిర్విఘ్నముగ సాగుచున్నది. ఆ సాయంకాలమున నొంటిగా భవనోద్యానమున నాభాల విహరించుచు నూత్న పరీమళమూర్తియై అప్పుడే యా వనవాటికను బ్రవేశించిన వసంతదేవుని నవ్యవిలాసముల గమనించి “మాధవీ! యిటు ర” మ్మని చెలిని బిలచెను. ఆమె మాటలోని తొందరపాటును యిష్టసఖి, “ఏమి రాజకుమారీ! ఏదియో వింత గనినట్లుంటి” వనుచు బరుగిడి దఱిచేరెను.
“మాధవీ! ఈ మల్లెపొద మొగ్గలు దొడిగినది. ఆ గున్న మామిడి లేబూత నలంకరించుకొనుచున్నది. వాయు దేవుడు గంధవహు డగుచున్నాడు చూచితివా.”
“రాకుమారీ! ఏ సంవత్సరమున కా సంవంత్సరము వచ్చు వసంతదేవు డొకడా లేక యనేకు లందువా?”
“ఓసి వెఱ్ఱిదాన! వసంతుడు నిత్యయౌవనుడు నిత్య లీలావిలాసుడు. ప్రాతఃకాలమున నుదయించి ముప్పది గడియలు నభోమండలమున బరిభ్రమించి సాయంకాల మస్తాద్రిని జేరు సూర్యభగవాను డొక్కడందువా వేవు రందువా?” “ఒక్కడే అందును.”
“ఈ నవ్యత్వ మాలోచించియే దివ్యకవులైన కాళిదాసాదులు తమ గీతామృత ధారల మాధవదేవుని పలుగతుల కీర్తించిరి.”
ఈ వనీకన్యను వరించి యీ మాధవదేవుడు వచ్చినాడు. మా రాజకుమారిని...”
“ఛీ! మూర్ఖురాలా! నోరుమూయుము.”
“క్షంతవ్యను. మాధవదేవుని రాకచేగదా ఈ నికుంజములు పుష్పభరితము లాయె ననుకొనుచు తొందరలో నటులంటిని.
ఆమాటలకా రాచకన్నియ కోపము నటించి చెలిపై అవతంస కుసుమము విసరినది. మాధవి కిలకిల నవ్వుచు నా పుష్పవాటికి నెందో మరుగై పోయినది.
2
ఒక యుత్త మాజానేయము నధిరోహించి పడుచువాడొకడు మహావేగముతో వేంగీనగరమునకు బశ్చిమముగా నిరువది యోజనముల దూరమున 'మధ్యదుర్గ' మను గ్రామమును దాటి వచ్చుచుండెను. ఉత్తమలక్షణ సమన్వితమైన యా ధవళ పారశీకాశ్వ మెట్టి రౌతునైనను సరకు గొననిది. అట్టిదయ్యు నా యాజానేయము తన కధిక ప్రియము గూర్చు నా యువకుని మనస్సు గ్రహించి, యనువర్తించుచుండెను. గడియ కైదుయోజనముల వేగముతో నా యాశ్వికుడు మధ్యదుర్గమునకు బదిగోరుతముల దూరము ప్రయాణము చేసివచ్చెను. కొండలు, లోయలు, నదీకంఠములు, కొండ దొనలు, కొలకులతో నిండిన యా ప్రదేశము గంభీరారణ్య మధ్యదేశము.
బాలకుడైన యా యాశ్వికు డాగిన మహారాజ పథము ప్రక్క సువిశాల గిరిపాద ప్రదేశమున్నది. అందు శిబిరము లేర్పరచుకొని మహాసైన్య మొకటి దండు విడిసి యున్నది. ఆ బాలకు డచటికివచ్చి, యాగునప్పటి కిరువురు సైనికులు పరుగిడి వచ్చి, చేతులు జోడించి వంగి అతనికి నమస్కరించిరి. ఒకడు గుఱ్ఱము కళ్ళెము పట్టుకొనెను. వేరొకడు కత్తిదూసి సగౌరవముగా విగ్రహమువలె నిలుచుండిపోయెను. ఆతడు గుఱ్ఱముపైనుండి ఛంగున భూమికురికి యా శిబిరములోనికి విసవిస నడిచి పోసాగెను. చక్కని మార్గములు తీర్చియున్న-స్కంధావారములోనికి వేగమున బోవు నాబాలకుని దారిపొడుగునను యోధవీరు లందరు బొమ్మలవలె నిలబడి వీరనమస్కారము లర్పించుచుండిరి.
ఇంతలో నా స్కంధావారాధిపతియైన సేనాధిపతి వేగమున నెదురై వీరనమస్కార మర్పించినాడు. ఏదియో యాలోచించుకొనుచు, నా బాలకుడు స్కంధావారమధ్యమున బంగరు గుడారమువైపునకు నడక సాగించినాడు అతని వెనుక సేనాపతియు నా బాలకునిపై భక్తియుతములైన చిరు నవ్వుల బరపుచు ననుసరించినాడు. బాలకు డా గుడారము చేరబోవుసరికి నచ్చట బారులుదీరి మాగధులు వందులును “జయ! జయ! ఉత్తమ చాళుక్యా! జయ! జయ! కదంబమహారాజ గర్వాపహరణ! జయ! జయ! బిరుదాంక భీమ! జయ! జయ! రాష్ట్రకూట గోవిందరాజ గర్వాపహరణ! జయ! జయ! త్రిమహారాష్ట్రక ప్రభూ! జయ! జయ! విషమసిద్ధి దివ్యబిరుదాంకా! జయ! జయ! విష్ణువర్ధన మహారాజా!” అని జయ ధ్వానములు సలిపిరి. ఇట్లు విష్ణువర్థన మహారాజును పట్టవర్ధన వంశతిలకుడగు కాలకంపనుడను సేనాపతియు నా గుడారములోనికి బోయినారు. విష్ణువర్థన మహారాజు సువర్ణాసన మధివసించి, “కాలకంపన ప్రభూ! ఆసన మధివసింపు" డని గౌరవముట్టిపడు మాటలతో సేనాధిపతికి పీఠము జూపినాడు.
విష్ణువర్థనుడు రాజపరమేశ్వర, సర్వసిద్ధి బిరుదాంక, సత్యాశ్రయ శ్రీపృధ్వీవల్లభ వాతాపినగర చక్రవర్తికి జిన్నితమ్ముడు. అన్నగారి కన్న నెనిమిదేండ్లు చిన్నవాడై నేటి కిరువదెనిమిది సంవత్సరముల ప్రాయమువాడై యున్నను, రూపమున బాలకునివలె నుండెను. ఆతడు నాలు గడుగుల పదనొకం డంగుళముల పొడవువాడు. వాతాపినగర చాళుక్య చక్రవర్తు లందరును నారడుగుల పొడవువారు. చాళుక్య రాజపుత్రులలో నిట్టి పొట్టివా డెన్నడును బుట్టలేదని ప్రజలనుకొను చుందురు. ఆ పొడవునకు సరితూగు నంగములు కలిగి చారుశరీరి యగుటచే విష్ణువర్థన నామములు గలవారున్నారు. వాతాపి చక్రవర్తుల మూలపురుషుడే విష్ణువర్థనుడు. అందుచే గాబో లీతనిని గుబ్జ విష్ణువరథనుండని పిలుచు కొందురు.
పచ్చని బంగారుచాయ, పదునారేండ్ల వయసు మిసిమిచే వెలుగు నాతనిమోమున నూనూగుమీసలు గాంచినవారాతని బాలకు డనియే యనుకొందురు. అయినను విష్ణువర్థనుని శరీరాంగకము లుక్కుతో నిర్మించినవి. ఇనుప గుదియనైన నాత డుంగరమువలె వంచివేయునట. పొడగరులై రాక్షసులవంటి దిట్టరులు విష్ణువర్థను నవలీలగ నోడించవచ్చునని యాతనితో ముష్టి మల్లయుద్ధముల దలపడి మూడు నిమేషములలో ప్రాణములు కడబట్టి, బ్రతుకుజీవుడా! యనిదాసోహ మందురట.
ఆతని బాణప్రయోగములు, ఆతని కత్తివ్రేటులు విద్యుద్వేగములు. శార్ణకోదండ వినిర్ముక్త బాణములవలె తీవ్రములు.విష్ణువర్థనుడు భయమన్న నెఱుంగడు. తానోడి పోదునన్న సంశయ మెన్నడును నాతనికి బొడమలేదు. సైన్యము నడుపుటలో, వ్యూహమును బన్నుటలో, నెదిరి బలములను దాకుటలో కుబ్జవిష్ణువర్థనుడు ప్రజ్ఞావంతుడగు సేనాపతి. తన బలముకన్న శత్రువులసైన్య మెంత యధికమైనను యుద్ద నిర్వహణమునందు బగతురు తన కెప్పుడును తక్కువ వారను నమ్మక ముండుటచేతనే విష్ణువర్ధనుడు మేకలమందపైబడు సింహమువలె బ్రళయ ప్రభంజనమై వైరులపై విరుచుకొని పడును.
కాలకంపనుడు:మహాప్రభూ! సార్వభౌములు తమ చిన్నన్నగారైన సత్యాశ్రయ శ్రీ జయసింహ మహారాజును సురాష్ట్ర, కుకుర్త, అనుప - అపరాంత దేశములకు మహారాజుగా జేసి పట్టము గట్టినారు. తాము కుంతల దేశమును జయించినారు. అశ్మక నడంచినారు. రాష్ట్రకూటులను బాదాక్రాంతులుగ జేసినారు. వనవాసి దేశమునకు దాము ప్రతినిధులై యుండిరి. మరి, అడుగడుగునకును నడ్డుతగులు నీ పూర్వ సముద్రతీర రాజ్యములకు బుద్ధి చెప్పుడని ఇప్పుడేల వారు పంపిరో నా కవగత మగుటలేదు మహాప్రభూ!
విష్ణువర్థనుడు:సేనాధిపతీ! అన్నగారు దివ్య ప్రతిభావంతులు.వారి హృదయము అవగతముసేసికొనుటకు బృహస్పతులైనజాలరు.రాజ్యములు సుస్థిరములై ప్రజలు రామరాజ్యము లనుభవింపవలెనని ఎప్పుడును వారు గోరుచుందురు. కాల: మహాప్రభూ! నాకు సార్వభౌములు హృదయమిప్పుడు దిజౌత్ర మవగతమైనది. చిన్న చిన్న రాజ్యములు దురాశచేతను, గర్వముచేతను సంతతమును దమలోదాము యుద్ధములు సలుపుచుండును. అందువలన ప్రజలకు నష్టములు కలుగును. సార్వభౌముల కది యిష్టము లేదు. ఈ తూర్పుతీర ప్రదేశములందు శాంతి యడుగంటిపోయిందని చక్రవర్తులై దేండ్ల క్రిందటనే జైత్రయాత్ర సలిపిరి గదా!
విష్ణు: ఎవరి రాజ్యములు వారు సుఖముగ బరిపాలన చేసుకొనిచుండినచో నీ యశాంతి దుస్స్వప్నము వలే దేశము నావరించి యుండెడిది కాదు.
కాల: చిత్తము.
విష్ణు: అన్నగారు పిష్టపురమునకు బోయి తిరిగి యా నగర మాక్రమింపుమనిరి.
కాల: మహాప్రభూ! తమకొక మనవి చేయవలెనని యుండియు ధైర్యము చాలక యూరకుంటిని. మనము మధ్య దుర్గము కడనే గోదావరీనదీ మధ్యస్థ పట్టిస ద్వీపమునకు బోవు రాజపథము ననుసరింప వలసియుండినది కదా!
విష్ణు: సేనాధిపతీ! తాము కొంచెమోపిక పట్టియుండుడు. నాకాజ్ఞ యిచ్చునప్పటికి పిష్టపురము ననేయున్న మన రాజప్రతినిధి పృధ్వీధృవ రాజేంద్రవర్మ పల్లవసైన్యములతో దలపడుటకు గృష్ణాతీరమునందలి ధనకటక నగరమున కేగెనని, మధ్యదుర్గముకడనే వేగు వచ్చినది కదా!
కాల: అగును మహాప్రభూ! ఏ యుద్ధమునందైనను దాము దీర్ఘమాలోచించియే యుద్ద విధానము నిర్ణయింతురు.
విష్ణు: కాలకంపన ప్రభూ! నా చిన్నతనమునుండియు దామే గురువులై. సంగ్రామ విద్య నాకు నేర్పినారు. కంటికి రెప్పవలె నన్ను గాపాడినారు. మా జనకులు శ్రీ సత్యాశ్రయ కీర్తివర్మ వల్లభ చక్రవర్తులు మహేశ్వర సన్నిధానము జేరుకొని నప్పటికి మే మన్నదమ్ములము చిన్నవారమగుటచే మా పినతండ్రి శ్రీ మంగలేశ చక్రవర్తి మాపై బ్రయోగించిన కుట్రలనుండి మమ్ము రక్షించి తండ్రివలె గాపాడినారు!
విష్ణువర్ధనుని మాటలు వినుచున్న కాలకంపన ప్రభువు కన్నులు చెమరించినవి.
(3)
అంశుమతీకుమారి శుక్రవారమునాడు దోషాపహరణ స్నాన మాచరించిన పిదప శుభ్రవస్త్రధారిణియై, సర్వభూషణాలంకృతయై యిష్టసఖులు గొలిచిరా నంగరక్షక వీరాంగనలు, వీరులు కావలిగాయ దాను విడిదిసేయు భవనము నండియున్నట్టియు, గోదావరీతీరమున కనతిదూరమున నున్నట్టియు గోమాతృ దేవాలయమునకు వోయి షోడశోపచార యుక్తమైన యష్టోత్తరశతనామ గోమాతృదేవీ సమార్చన సలుపుచుండెను.
విష్ణుకుండినులకు గోదేవి కులదైవము. మహారాజులు మహారాణులు రాజకుమారులు రాజకుమారికలును సమస్త విష్ణుకుండిన వంశజులును గోవూరు పుణ్యక్షేత్రమున గోమాతృ దేవాలయమునఁబూజలు సలుపవలయును. ప్రథమ విష్ణుకుండిన చక్రవర్తియగు మాధవవర్మ మహారాజుచే నటులా గోదివ్యాలయము ప్రతిష్టింపబడినది. ఆతడా దివ్యాలయమును బ్రతిష్ఠించుటకొక ప్రబలకారణము సంఘటిల్లినది. మాధవవర్మ చక్రవర్తి దిగ్విజయమొసర్చి, పల్లవుల జయించి, కృష్ణాతీరమున నుత్తమక్షేత్రముల నొకటియగు విజయవాటిక యందు సర్వమల్లికేశ్వరుని అర్చించుటకై సకుటుంబముగా విడిదిచేసి యుండెను. మహారాజున్న నెలదినములును నా నగరవాసులును పరిసర గ్రామప్రజలును మహోత్సవము లొనరించుకొనుచుండిరి.
ఎచ్చట జూచినను వీధినాటకములు, తోలుబొమ్మలు, పుణ్యకథా కాలక్షేపములును జరిగినవి. మహారాజు నగరవాసులకు బరిసర ప్రాంతవాసులకును గూడ పంచభక్ష్య పరమాన్నములు పెట్టించుచుండెను. ఇంటింట దోరణములు, వీధివీధుల నూరేగింపులును, దేవాలయముల, జైనాలయముల, బౌద్ధ సంఘారామముల దేవతల పూజలు, భిక్కుల యర్చనలు వైభవముగ జరుగుచుండెను. పానశాలలయందు వివిధ పరీమళయుక్తములు రుచ్యములునగు పానీయములను వివిధ మద్యములను సేనాధికారులు, నర్తకీబృంద నృత్య వినోదములయందును, మధుర సంగీత సమారోహముల యందును గాలము నానందమయ మొనర్చుకొనుచుండిరి.
యువరాజు బ్రహ్మణ్యుడును, ఉత్తమవ్రతుడే అయినను వీధినిర్ణీతమై కాబోలు, దేవాలయముల జరుగు బూజల బాల్గొనక, విలాస లాలసుడై పానగృహముల నుండి అనేకవర్ణములచే ధళధళలాడుననియు, వివిధ పరిమళములచే ఘుమఘుమలాడు చున్నవియు, జక్కని రుచులచే నోరూరించుననియు, మధురమత్తతచే నానందమును గల్గించుననియునగు నామద్యములందన భవనమూనకు దెప్పించుకొని యిష్టిజనముల గలసి యవి సేవించుచుండెను. రాజకుల మర్యాదలను మీఱి యాతడు భ్రష్టబుద్ది యయ్యెను.
ఒకనాడు యువరాజు దేవవర్మ తీక్షణమైన మద్యమును సేవించి యతిమత్తతతో లోకమును మరచి, రెండుత్తమాశ్వముల బూన్చిన తన విహార రథ మెక్కి సూతుని వెనుక నుండుమని తానే రథము నడుపుచు విహారాయత్త చిత్తుడై కన్నుమిన్నులు గానని మహావేగమున విజయవాటికా వీధుల బోసాగినాడు. అంగరక్షకులు లేరు. త్రోవలందు జన సమర్ధమును సర్దు నాశ్వికులు ముందులేరు. సూతుడు వెనుక నుండి “భద్రము మహాప్రభూ! భద్రము మహాప్రభూ!” యని యరచినను దేవవర్మ చెవి కెక్కుటలేదు.
దేవవర్మ యట్టహాసము చేయుచు, ప్రజలు భీతచిత్తులై హాహాకారములు సేయుచు భారిపోవుచుండ, మత్తుతో మఱియు నుప్పొంగి, కశిచే జురుక్కుమని యశ్వములకు రెండాఘాతము లంటించెను. ఆ యుత్తమాశ్వము లదలించుటయేని సహింపనివి. ఆ కులీనములు క్రోధముచే గట్టుతప్పి మహావేగముగ బరుగిడ జొచ్చెను. ఆ వేగమున కింకను బొంగి, “ఇంకను వేగ మింకను వేగ” మని ఆ యువరాజ జరవ జొచ్చెను.
రాజకుమారుని రథము పోవు వీధిలో పూంగీ రాష్ట్ర సంజాతయైన పెద్దజాతి యావు తనవత్సమును గలసి ఆలమందలతో గూడి నగర భావ్యా దేశమున బచ్చికబీళ్ళ మేసి, తిరిగి యజమాని యింటికి బోవుచుండెను. అందమైన యా కోడెదూడ తెల్లని కాంతులీనుచు గాళ్ళకు గట్టిన గజ్జెలు, మెడ నలంకరించిన చిఱుమువ్వలు మ్రోగుచుండ, గంతులిడుచు తల్లి కాళులసందున దూరుచు, జెంగున ముందు కురుకుచు బ్రక్కకురుకుచు దన చిన్న గంగడో లాలిపోవ దల్లితో నడుచుచుండెను. కామధేను వంశమున బుట్టిన యా గోమాత మృదులమైన తన తేనెకన్నుల బ్రేమకాంతులు వెలిగిపోవ, ముట్టెతో దన వత్సమును బుణుకుచు, మందగమనమున నడచుచుండెను. ఇంతలో మహా ప్రళయమువలె రాజకుమారుని రథ మావీధి బడినది. ప్రజల గగ్గోలు, పరుగులు, కొందరు పడి దొరలి ప్రాణములు దక్కించుకొనుట, ఇట్లా వీధియంతయు నల్లకల్లోలమై పోవుచుండెను.
వేయి పిడుగుల పాటువలె ఘర్ఘరావములతో నా రథమువచ్చి మాయమైపోయెను. “అంబా” యని ఆ కోడెదూడ యరచుచు నేల పడియున్నది. దాని యొడలంతయు రక్తము చిమ్ముకొని వచ్చుచుండెను. వీపును బొట్టయు దెగి మాంసపుగండలు వెలువడియుండెను. “అంభా” యని యా వరచుచు గన్నుల నీరుగార నా దూడచుట్టు దిరుగ దొడగినది. ఆ గోమాత తన శిశువు గాయములనుండి స్రవించు, రక్తస్రావము నాప యత్నించును. తన బిడ్డను ముట్టెతో బైకెత్తి యధాపూర్వముగ నడిపింపజూచును. “అంభా” యని యరచును. తలయెత్తి రథము పోయిన దిక్కుజూచును. తన చుట్టును, పడిపోయిన తన దూడ చుట్టును జేరిన జన సమూహము వైపు దీనదృష్ణుల బరపును. ఆ నోరులేని సాధు జంతువు హృదయమున నేమోప్రళయము వచ్చిపడినది. “నా బిడ్డయిట్లు పడిపోయినదేమి? నా బిడ్డను లేవనెత్తి మఱల నడిపించువారు లేరా” యన్నట్లు “అంభా అంబాయని అరుచుచునేయున్నది.
ఆ దూడ యఱపు నంతకన్న నంతకన్న సన్నగిల జొచ్చినది. విలవిల కాళ్ళు తన్నుకొని, యాలేగ ప్రాణములు విడిచినది. గర్భనిర్భేద్యమగు మహారావము సలుపుచు నా గోపురంధ్రి యా లేగ ప్రక్కనే కూలబడిపోయినది.
(4)
ఆనాటి సమారాధన లన్నియు నిర్వర్తించి. తానును భోజనాదికము గావించుకొని, యొక ముహూర్తము విశ్రమించి, తృతీయ యామాంతమున దాను నివసించుచున్న సామంతుని కోటలోని సభాభవనమున శ్రీవిష్ణుకుండిన మాధవవర్మసార్వభౌముడు గొలువు దీరినాడు. సామంతులు నితర రాష్ట్రముల రాయబారులు పరివేష్టించి యున్నారు, వేద పారాయణ, ధర్మార్థ నిర్వచన, పురాణపఠన, కవిప్రశంసలయిన పిదప గాయకులు పాడిరి. ఆటకత్తెలాడిరి. మహామంత్రి యేవియో రాజకీయ విషయములు సార్వభౌమునితో మనవి చేయుచుండిరి.
ఆ సమయమున సభాప్రాంగణ మంటపమునందు ధర్మఘంటిక “ఖంగు” “ఖంగు” మని మ్రోగనారంభించెను. ఆ ధర్మ ఘంటికకుఁ గట్టిన రజ్జువు ధర్మస్తంభము మీదనుండి, ప్రాకార కుడ్యము మీదనుండి, సభాభవన గోపురము ప్రక్కగ వ్రేలాడుచుండును. రాజోద్యోగు లెవరైన నన్యాయము చేసినచో, ధర్మమునకు గానీ వాటిల్లినపుడు తనకు ధర్మము దయచేయింపవలసినదని యెవరైనను ప్రభువునకు ఆ ఘంటారావముచే విన్నవించు కొనవచ్చును.
ఆ విన్నపమునకు గాలనియమము లేదు. రాత్రియైన బగలైన బ్రభువు కొలువుదీరి యున్నను లేకపోయినను నా రాష్ట్ర ప్రభువులైనను, ఆతడు లేనిచో ఆ రాష్ట్ర రాజ ప్రతినిధి అయినను వెంటనే యావిన్నప మందికొనుటకుగాను మాధవవర్మ మహారాజు ధర్మ ఘంటిక నిట్లు మ్రోగించుట కేర్పాటు చేసినాఁడు. తన సామంతులందరును దన వలెనే యా విధాన మవలంబింప వలయును. తాను ధర్మపాలనమున నప్రమతుడు. ఈ రీతినీ బూర్వ ప్రభువు లనేకులు ధర్మపాలన చేయుచుండిరట.
నే డా ఘంటానినాద మొక్కసారిగ సభయంతట మారుమ్రోగగనే, సభాభవనము చిటుక్కున నిశ్శబ్దత వహించినది. ఘంటమ్రోగుచునేయున్నది. మాధవవర్మ మహారాజు సింహాసనమునుండి లేచినాడు. సభయంతయు లేచినది. సింహాసన వితర్దికా సోపానముల నుండి దిగి, మహారాజు విసవిస నడచుచు సభా సింహద్వారము దాటి, ధర్మఘంటికా మంటపముకడ నిల్చినాడు. “ధర్మమును నిలబెట్టు”మన్నట్లా ఘంట మ్రోగుచుండెను ఎత్తిన తల దించి, మాధవవర్మ మహాప్రభువు గోపురము దిక్కునకు నడచినాడు ప్రభువువెంట మహామంత్రి, అతని ననుసరించి సేనాపతులు, వారివెనుక రాయబారులు, మహారాజున కీవల నావల బండితులు, వారికిటునటు నంగరక్షకులు, అందరివెనుక తక్కువగల సభయంతయు నిలబడినది.
మహారాజు గోపురము దాటి భవన ముఖస్థలమునకు వచ్చెను. ఆ విశాల ప్రదేశమున వేలకువేలు ప్రజలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, శిశువులు, కన్నులనీరు నించుచు జేతులు జోడించి నిలచియున్నారు. ధర్మఘంటికా రజ్జువును బాగులు నుత్తమకులజయైన గోవొకటి నిలచియున్నది. ఆ గోవువెనుక రక్తసిక్తాంగమైన కోడెదూడ శవమును మోయుచున్న ఒక గృహస్థు నిలచియున్నాడు. మహాప్రభు వట్లునిలుచుండి, “ఏమిది గోమాతయే, త్రాటిని లాగుచుండుట! ఆ తల్లికేమి ధర్మహాని సంఘటిల్లినది? ఈ త్రాడులాగ నా గోమాత కెవ్వరు నేర్పిరి?” అని ప్రశ్నపరంపరల బ్రజలనుద్దేశించి పలికినాడు.
అప్పుడొక పెద్ద ముందుకు వచ్చి, “ఆ త్రాటిని లాగ నీ గోమాత కెవరును నేర్పలేదు మహాప్రభూ. ఈ యావు ఇచ్చటకు వచ్చుననియేని మే మనుకొనలేదు. ఈదూడ రథము క్రింద బడి ప్రాణము కోల్పోయినది. ఈ యావు పడిన బాధ వర్ణనాతీతము. ఇంతలో నాగోవు యజమాని వచ్చినాడు. ఈయా వుత్తమజాతిదని రోధించినాడు. తన కోడెదూడ యుత్తమలక్షణ సమన్వితమట. దానిని దమకుటుంబము వారందరు అల్లారు ముద్దుగ బెంచుకొనుచుండిరట. ఆ యజమాని పడువేదనను మేము చూడలేకపోతిమి. ఆతడా దూడకళేబరము నెత్తికొని తనయింటికి దీసికొపోవుచు 'దల్లీ! నందినీ! రా, అమ్మా! అని పిలిచినాడు. కాని యాలోచనాధీనవలె కదలినదికా దీయావు. ఇంతలో నీ గోమాత కోట కభిముఖియై రాసాగినది.
“ముందు నీ యావు. వెనక నా దూడ శవమును మోయుచు నా యజమాని, అచ్చట జరిగిన దుస్సంఘటన జూడం జేరిన మేము, ఇటుల నాయావు దిరిగిన దిక్కునకు నడచుచు వెంట వచ్చితిమి. కోటగుమ్మము దాటి. అంతర్ద్వారము దాటి, యీ గోపురమునొద్ద నున్న ధర్మరజ్జువుకడ కీ తల్లి వచ్చి దానిని గ్రహించి లాగ నారంభించినది. జరిగిన వృత్తాంతమిది మహాప్రభూ!” యని విన్నవించినాడు. మహారా జాశ్చర్యమును సంభ్రమమును నందినాడు. ఇంతలో నాతని మోము గంభీరత దాల్చేను. “ఇదియే ధర్మసభ! ఇచ్చట ధర్మము సంస్థాపింపం బడుగాక” యని మహారాజనెను.
“ధర్మమేవ జయతు, ధర్మమేవ జయతు” అని ప్రక్కనున్న పండితులు, దీప్తకంఠములతో పలికినారు. “ధర్మసంస్థాపనాదీక్షిత శ్రీవిష్ణుకుండిన మాధవవర్మ సార్వభౌమా! జయతు జయతు!” అని సభ్యులందరు జయవాక్యములు నినదించిరి. ప్రాడ్వివాకులు ముందునకు వచ్చి సాక్ష్యవిచారణ ప్రారంభించిరి. ఒక యర్థ ఘటికలో విచారణ పూర్తి యయినది.
యువరాజు దేవవర్మ,"దోషి” యని నిర్ధారింపబడినది. మహాప్రభువు ధర్మజ్ఞులయిన పండితులవైవు చూచినాడు.
“యువరాజు దేవవర్మ యొనరించిన యా తప్పిదమునకు మరణమే దండనము. ఈ గోమాత డెక్కలకు వాడి యంచులుగల యుక్కుడెక్కలను తగిలించి శ్రీ యువరాజుల వారిని బరుండబెట్టి, భూమిని బాతిన మేకులకు గట్టి, ఈ గోమాతచే దొక్కించి మరణము నర్పించుటయే వానికి శిక్ష!” యని, పండితులు కరుణముగ మనవి చేసి, 'తాము దయార్ద్రహృదయులు!” యువరాజొనరించిన ఇది మొదటి తప్పిదము. వారికి మహాప్రభువు వేరొకశిక్ష విధించి, ఈ యజమానికి దగు పరిహార మిప్పించుట రాజధర్మమును మించిన పరమధర్మమని మనవి చేయుచున్నాము” అని పండితులు మౌనము వహించిరి.
“మహారాజా! యువ మహారాజును క్షమించుటే పరమ ధర్మమని మేమందరమును దమకు మనవి చేయుచున్నా” మని అక్కడ జేరిన ప్రజ లందరు నేకకంఠమున నరచిరి.
సార్వభౌముడు చలించలేదు. “రేపు ఉదయము విష్ణుకుండిన వంశజుడు, దేవవర్మకు మరణశిక్ష పురబాహ్య స్థలమున విధింపబడును. ఇది మా ఆజ్ఞ! మహాదండ నాయకులు మా విధించిన ఈ శిక్ష దేవవర్మ తల్లిదండ్రుల సమక్షమున నిర్వహింప మేము ఆనతి నిచ్చుచున్నాము” అని గంభీర ధ్వనుల పలికి తలవంచుకొని, వెనుకకు తిరిగి, తిన్నగ నభ్యంతర మందిరములలోనికి వెడలిపోయెను.
విజయవాటికా నగరమంతయు నా వార్త ప్రాకిపోయెను. ప్రజలట్టుడికిపోయిరి.
(5)
దేవవర్మ నడుపుకొని పోయిన యా రథమట్లు వాయువేగమున పరుగిడుచుండ, యువరాజుకు పూర్ణముగ మత్తెక్కి ఆ రథముపైన పడిపోయినాడు. సూతుడశ్వహృదయము నెరిగిన ప్రజ్ఞావంతుడగుటచే, యువరాజొరిగిపోవగనె, ముందున కురికి, యువరాజు చేతులనుండి జారిపోయిన పగ్గముల నందుకొని, తీయని మాటల జెప్పుచు, గుఱ్ఱముల ననునయించుచు, అశ్వశాంతి మంత్రము పఠించి. వాని వీపులపైన దక్షిణ హస్త తలముచే నిమిరినాడు. నురుగులుగ్రక్కుచున్న యాతురగములు రెండును భయముతీరి వేగము తగ్గించి, నెమ్మదించి చివర కాగిపోయినవి.
సూతుడు వానిని పూర్తిగ సేదదీర్చి, వెనుకకు త్రిప్పి రథము కోటలోనికి గొనిపోయెను. రాజకుమారుడు విడిదిచేసిన హర్మ్యము మ్రోల నా రథమాగగానె సర్వసేనాధిపతియు, మహాదండనాయకుడును ఇరువురు రక్షక భటులతో వచ్చి, రాజకుమారుని రథము నుండి దింపి లోనికి గొనిపోయిరి. మహా దండనాయకుడు, మహా సేనాపతియు గత్తులు దూసియే యుండిరి.
ఆ రాత్రి వారిరువురు యువరాజును ఆయన భవనముననే బంధించి రాజాజ్ఞను బరిపాలించువారై యప్రమత్తత గావలి కాచిరి.
రాజవైద్యుడు వచ్చి యువరాజునకు వైద్యోపచారయులు చేసినాడు. ఆ యుపచారములచే యువరాజునకు మత్తువీడి పూర్తిగ మెలకువ వచ్చినది. తాను బరుండిన పల్యంకముపై లేచి, కూర్చుండి, ఆ దాపున గత్తులు దూసి నిలుచుండిన మహాదండ నాయకుని మహాసేనాధిపతిని నాశ్చర్యమున దిలకించుచు “ఏ, ఏ, ఏమి జరిగినది... జరిగినది... జరిగినది! మహాసేనాధిపతీ! వైద్యులవారు వచ్చిరెందుకు?” అని చేతులును, బెదవులును వడంక ప్రశ్నించినాడు.
రాజకుమారునికి మత్తు వదలిపోయినను, మధుపాన జనిత నిస్సారము వీడలేదు. మరల వైద్యుడు నీరసము వదలుటకు దోనెలో నొక కుప్పె నరగదీసి అది తమలపాకున కెత్తి మహారాజ కుమారునకు సేవింపనిచ్చెను. మందు కంఠము దిగిన రాజకుమారునకు గొంచెము సత్తువ వచ్చినట్లయినది. తాను దన యభ్యంతర పానశాలయందు మధువు సేవించిన విషయము స్ఫుటాస్ఫుటముగ గోచరించినది.
రాజకుమారుడు:ఏమి జరిగినది మహాసేనాపతీ!
మహాసేనా:తాము రథము నెక్కి వీధుల వెంట స్వారీచేయ నారంభించినారు.
రాజవైద్యుడు:తామే స్వయముగ గుఱ్ఱముల దోలినారు.
రాజకుమారుడు:అది నా కేమియును దెలియదు.
మహాసేనా:గుఱ్ఱము లవశములై పరుగిడసాగెను.
రాజకుమారుడు:అయ్యయ్యో! ఎంత తెలివితక్కువ పని! మహారాజు పరమ శివారాధన సేయుచుండ నాబుద్ధి పెడదారినిబట్టి మధువు సేవించితిని. జైత్రోత్సవముల దప్ప నెన్నడును నట్టిపని చేసి యెరుగను. మహాసేనాపతీ! నా మూర్ఖత వలన నెవరికయిన బ్రమాదము వాటిల్లలేదుగదా?
మహాసేనా: ప్రమాదమే సంభవించినది ప్రభూ!
రాజకు: ఆ! ఏమిటా ప్రమాదము|| ఎలాటిదా ప్రమాదము!
మహాదండ:ఒక యావుదూడ తమ రథము క్రిందబడి మరణించినది.
రాజకు:అయ్యయ్యో! ఎంతదోష మెంతదోషము!
రాజవై:ప్రభువులు కొంచెము శాంతింతురు గాక. తాము ధర్మనిర్వహణము సేయు సమయ మాసన్నమైనది.
రాజకు:నేనేమి ప్రాయశ్చిత్తము చేసికొన్న, ఆ దోషము శాంతించును? నేను పశువుకన్న నీచుడనైతిని. క్రూరమృగము లాహారమునకై ఇతర జంతువుల దినును. నేను రాక్షసుడనై నిష్కారణముగ గోవధ చేసినాను. మహాసేనా:ప్రభు! ఎన్నడు జరుగని వింతయే మన నాగోవు స్వయముగ వచ్చి ధర్మరజ్జువును లాగినది.
రాజకుమారుడు చఱ్ఱున మంచమునుండి లేచెను. “నేనెట్టి దండమునకైనను బాత్రుడను. నన్ను మహారాజు కడకు గొనిపొండు. మహాప్రభువును ధర్మవిచారణ సేయుడని కోరవలసియున్నది.
మహదండ:ప్రభూ! ధర్మవిచారణ జరిగినది. తమకు.....
రాజకు:ఆ! జరిగినదా! శుభము. శిక్షనందుకొనుటకు త్వరపడుచున్నాను.
రాజవై:శాంతింపుడు ప్రభూ! తమకు నిర్ణయింపబడిన శిక్ష యుదయమే నిర్వహింపబడును. సర్వప్రజాసమక్షమున, తన సుతుని గోల్పోయిన యా గోవే తమకు శిక్ష విధించును.
మహాదం: గోసమక్షమున దాము నేర మొనరించుటచే మహారాజు, మహారాణులవారి సమక్షమున, నాగోవు తమకు దండన నిర్వహించును.
రాజకు:అయ్యయ్యో! నే జేసిన తప్పునకు నాయన గారును, నమ్మగారును గూడ బాధ నొందవలసి వచ్చినదే! దీనికి నివృత్తిలేదు. ఈ పాపమునకు మరణమే దండనము.
మహాసే:మహాప్రభూ! తమకు... తమకు... ఆ..., ఆ దండనమే విధించినారు.
రాజకు:ధన్యోస్మి! ధన్యోస్మి!
ఆ మఱునా డుదయము నగర బాహ్యస్థలమున నగర వాసులును పరిసర గ్రామవాసులును వేన - వేలు చేరిరి. అనేకులు రాజభటులు విచ్చుగత్తులతో గావలి కాయుచుండిరి. ఇంతలో రాజకుమారుని దోడ్కొని రథముపై మహాసేనాపతియు, మహా దండనాయకుడును, ధర్మాధికారులును వచ్చినారు. ఒకవైపున గోవును, యజమానియు, సాక్ష్యములిచ్చిన వారును గలరు. కింకరులు గొందఱు గోవు డెక్కలకు బదునుగల యంచులున్న యుక్కుడెక్కల దొడుగుచుండిరి. మహారాజు విష్ణుకుండిన మాధవవర్మయు, మహారాణియు రథ మెక్కివచ్చిరి.
మహారాణి వదనమున నెత్తురుచుక్కలేదు. ఆమె కన్నుల నీరు కారిపోవుచుండెను. చక్రవర్తి తన దేవేరిని జేయిపట్టి నడిపించుకొనుచు వధ్యస్థలమునకు జేరినాడు. మహారాణిని జూచి ప్రజల కనుల శోకాశ్రువులు వరదలు కట్టసాగెను. రాజకుమారుడు కనకదుర్గాంబ గుడి మొగమై చేతులు జోడించి “సర్వమంగళ మాంగళ్యే! శివే! సర్వార్థ సాధకే! శరణ్యే! త్య్రంబకే! దేవీ! నారాయణి! నమోస్తుతే!” అని ప్రార్థించుకొన్నాడు.
ఆ గోమాత బెదురుచూపులు చూచుచు దన డెక్కలకు నుక్కుడెక్కల దొడిగించు కొనినది. వేలకొలది జనులక్కడ జేరినను, గాఢనిశబ్దత యా జన సమూహము నావరించినది. రాజకుమారుడు వధ్యస్థలమున బండుకొనినాడు. తలవరులు మహారాజ కుమారుని ద్రాళ్ళతో గట్టిగ గట్టి పెట్టిరి. మాధవవర్మ విష్ణుకుండిన మహారాజు మోముగైలాస శిఖరమువలె స్వచ్చమై, ధర్మకాంతులు ప్రసరించుచుండెను. ఒక్కసారి మహారాజు చేయి నెత్తగానే కొమ్ము లూది, వీరాంగములు మ్రోగించినారు. భటులా ధేనువును రాజకుమారుని పైకి దోలినారు. త్వరితగతి నాయావు రాజకుమారుని కడకు నడచి వచ్చినది. ఒక్కక్షణము మోరనెత్తి చూచినది. మఱు క్షణము రాజకుమారుని జూచి తలవాల్చినది. “అంభా” యని యరచుచు నాయావు గదలక అట్లే నిలచిపోయినది.
ఆ గోవును రాజభటులు ముందుకు నెట్టినారు. అదలించుచు దోలినారు. ఆ గంగిగోవిసుమంతయేని గదలలేదు. మఱల “నంబా” యని యరచినది. రాజకుమారు నొడలంతయు ముట్టెతో నా ఘ్రాణించినది. ఆ గోమాత కన్నుల గిఱ్ఱున నీరు దిరిగినది. కంటి నీటితో గోమాత నాలుక చాచి రాకొమరుని చేతులు, మోమును నాక జొచ్చినది. రాజభటులు గోవును మఱల గట్టిగ గ్రోసినారు. ఆవు వెనకకు దిరిగి కోపపుజూపు చూచి, మెల్లగ దన యజమానుని యొద్దకు బోయినది. ప్రజలందరు హర్ష నినాదములు, జయ ధ్వానములు సేయుచు “మహాప్రభూ ధర్మసంస్థాపనమైనది. గోమాత దానిని బాలించినది. ధర్మమేవ జయతు! ధర్మమేవ జయతు!” యని యరచుట సాగించినారు.
గంభీరానన నిశ్చలుడై నిలుచున్న మహారాజు కన్నుల నీరు దిరిగినది. కదలక నిశ్చేష్టయై చేతలు మాని నిలుచున్న మహారాణి, “తల్లీ! కనకదుర్గా! నీవే నమ్మా! గోమాతవు!” అనుచు గుప్పగ గూలిపోయినది. పరిచారిక లామె కడకు బరుగిడివచ్చి మోమున నీరు చల్లి, పరిచర్య లొనరించుచుండిరి. గోవు యజమానియు గొందరు సాక్ష్యమిచ్చిన వారును రాజకుమారు నొద్దకు బరుగిడి వచ్చి కట్లు విప్పి వేసిరి.
అప్పుడు పరమేశ్వరుడు బంగారు వర్షము గురిపించినాడని ప్రజలు చెప్పుకొనిరి.
ఆ గోవును మాధవవర్మ విష్ణుకుండిన మహారాజు లక్ష ఫణము లిచ్చి కొనెను. ఆ గోమాతను తమ కులదైవముగ నెంచికొని వేంగీపురమునకు గొంపోయిరి.
ఆ గోదేవి పదునైదు వర్షములు జీవించి పరమపదించిన వెనుక మాధవవర్మ మహారాజు గోపాదక్షేత్ర గోదావరీతీరమున, దాని కగ్నిసంస్కార మొనర్చి, ధాన్యకటకపు బాలరాతితో నుత్తమశిల్పిచే గో విగ్రహము నొకదానిని విన్యసింప జేసినారు.
చక్కని దేవాలయ మొక్కటి గోపాద క్షేత్రమున నిర్మించినారు. అందా విగ్రహమును బ్రతిష్ఠించినారు. రాజకుటుంబపు స్త్రీ పురుషులందరు ప్రతివర్షమున నా గోమాతకు మహోత్సవములతో పూజ లర్పించుచుందురు. ఆ గోమాతకు బుట్టిన వత్సములన్నియు నా వంశమువారికి బూజనీయములు.
(6)
విష్ణుకుండిన మహారాజకుమారి అంశుమతీబాల ఒకనాటి సాయంకాలము కోటిలింగాల క్షేత్రమునుండి తన నౌకపై నెక్కి గోపాదక్షేత్రమునకు వచ్చుచున్నది. రాజనౌక రాజహంస స్వరూపమున విన్యసింపబడినది. పడవ వాండ్రు తెరచాపలను విప్పుటచే నా నౌక రెక్కలను జాచి మానస సరోవరమునందు విప్పుకొన్న రాజహంసవలె నిర్మల నీలప్రవాహయగు గౌతమీ కూలంకషపై తేలికొనుచు వేగమున గోవూరు వైపునకు వచ్చునుండెను. సూర్యదేవుడు నిరవద్య (నిడదవోలు) పురమువైపున దిగి పశ్చిమాశాతలమున మాయమై పోయినాడు. కాశ్మీర కుంకుమ వర్ణదీధితు లాకాశ మెల్లెడను గ్రమ్ముకొన్నవి. “నీలవర్ణముగాని, రజనీ గర్భాంతరిత కాలవర్ణముగాని, సంధ్యారుణరోచిస్సుగాని, ఏది యీ యాకాశమునకు సహజవర్ణము! శతసహస్ర శంఖ ప్రమాణ దూరములుగల యీ నిరవధికాంబరమున నెచటెచట నే వర్ణములు పొదివి కొని యుండునో ఎవరు నిర్ణయింపగలరు! ఎంత విచిత్ర మీ వర్ణముల మార్పు! మానగరదైవము చిత్రరథస్వామీ విరాలంబ మార్గానువర్తియై, తాను సృష్టించిన కాలములోనే, సర్వదా యానము చేయుచుండవలయును. సూర్యాస్తమయము, మఱల సూర్యోదయము. నిత్యుడై కదలక యేక ప్రదేశస్థుడైన సూర్యుడు కదలుచున్నట్లు గనబడుట ఎంత విచిత్రము!”
“ఉత్తమ బ్రాహ్మణ క్షత్రియవంశము విష్ణుకుండిన వంశము. అయ్యది తనతో సమాప్తమైనది. దూరస్తులైన జ్ఞాతులెవ్వరో యుండిరట. చిన్న చిన్న సామంతులై వారిని వీరిని గొల్చుచుండిన విష్ణుకుండిన నగరవాసులైన యా జ్ఞాతు లేమాత్రమును బ్రజ్ఞ లేనివారట.” ఈవిధమున నాలోచించుకొనుచున్న అంశుమతిని “ఏమమ్మా! భర్తృదారికా! ఏ మాలోచించుచుంటి” వని మాధవీలత రాజకుమారిని బ్రశ్నించెను.
“ఏమని చెప్పుదు మాధవీ! ఒక దానికొకటి పోల్చరాని రూపములు! ఒక ఘటిక నొక ఘటిక తరుముకొని వచ్చినట్లు, కాలప్రవాహమువంటి యాలోచన లసంబద్ధములై నా హృదయమును జొచ్చి వచ్చుచున్నవి.”
“ఆలోచనా మధ్యస్థుడై ఎవరో యొక యువకమూర్తి నీకు గోచరించుటలేదా?!”
“ఓసి వెఱ్ఱిదాన! ఎవరే ఆ యువకమూర్తి? లోకమూర్తి సూర్యుడే నవ్యుడును వృద్దుడును! ఈ యనంతాకాశమున పూర్వమేది? పశ్చిమమేది?”
“నారసింహదేశికుల శుశ్రూష వేదాంతమార్గమున బట్టించుచున్నదా నిన్ను?”
“వెఱ్ఱిదానా! ఈ దేశ కాలములందు బద్ధులగువారికి వేదాంతముకూడనా?”
“ఏమో! నీమాట లెప్పుడును నన్ను ముంచుకొని పోవునేగాని కాలు నిలువద్రొక్కు కొననీయవు".
“గోదావరిలో మునిగి కొట్టుకొనిపోవుచున్నట్లుందును గాబోలు నేమి?”
రాజకుమారి నావను వెంబడించి, పరివారమును రక్షక భటులును ఉన్న పడవ లెన్నియో వచ్చుచుండెను. పరిచారి కాజన మున్నపడవ రాజకుమారి నౌకను వెన్నంటియుండెను. ఆ నావనుండి జవ్వని ఒకతె మృదుమధుర కంఠమెత్తి పాడుచుండెను.
“గోదావరీ మాత
కొండలెన్నో గడచి
ఆ దారు లారేవు
లావనములను నడచి,
ఈక్షేత్రముల మధ్య
ఈ నీరముల రథ్య
సాక్షాత్కరించినది
సర్వమంగళ రీతి,
పాడవే గౌతమికి
ప్రణతు లొసగిన పాట,
గాఢరాగమ్ములో
కాకలీ స్వరముతో
పాడవే గౌతమికి
ప్రణతు లొసగిన పాట!
ఏ పర్వతోద్భవమొ
ఈ వాహినీ మాత
ఏ జడల విడివడెనొ
ఏ సీమ పుణ్యమున
పాడవే గౌతమికి ప్రణతు లొసగే పాట!
ఏ చెలియ గూర్చుకొని
ఏ చెలిమి దలచుకొని
వడినడల చిరునడల
పయనించు కడలికై
పాడవే గౌతమికి
ప్రణతు లొసగే పాట!”
ఆ పాట నానందముతో వినుచున్న రాజకుమారి హృదయము హర్షముచే పులకరించినది. ఏవేవో దూరములు, ఏవేవో భావములు, నపారములై యస్పష్టములై, యా బాలికను దేల్చుకొని పోయినవి. గోదావరిలో స్నానములు, జపములును నాచరించు వారికి గోదావరీమాత రహస్యము లుపదేశించునేమో? కొండ పుట్టిల్లెన నది, కొండలను గూడ ఛేదించుకొని, యెన్నిసీమలు, దేశములు గడచి, రండురఁ' డని సర్వకాలమును నాహ్వానముచేయు సముద్రునిలో లీనమైపోవుచున్నది. “భర్తృదారికా ఈ సాయంతన మంతయు మీ యాలోచనలే మీకు. కాని నేను బ్రక్క నుంటినను మాట మరచిపోవు చున్నారా” యని రాజకుమారిని మాధవి ప్రశ్నించినది. ఆ మాటలకు అంశుమతీ కుమారిని మాధవి ప్రశ్నించినది. ఆ మాటలకు అంశుమతీ కుమారి పక పక నవ్వినది.
చీకట్లు క్రమ్ముకొని వచ్చుచున్నవి. గోవూ రింకను క్రోశపాద మాత్రము దూరమున్నది. గాలి మందగించుటచే నావికులు తెరచాపలను దింపివేసి తెడ్లను వేయ నారంభించిరి, అనుసరించియున్న సైనికుల నౌకలలో బడవ పాటలు ప్రారంభమై గోదావరిపై నెగురు జలపక్షుల కల కలారావములతో సమ్మిశ్రితము లగుచుండెను. ఇంతలో నెట నుండి తారసిల్లినవో పది పదునైదు పడవలు, రాజకుమారి పడవల కెదురై చుట్టి క్రమ్ముకొని వచ్చినవి. ఒక్కసారిగా బిడుగులు పడ్డట్లు రణగుణ ధ్వని ప్రారంభమైనది. “కొట్టుడు! పొడువు” డను కేకలు, పడవను బడవతాకిన చప్పుడు, పరిచారికల యాక్రందనములు, గోదావరీగర్బము గగ్గోలైపోయినది.
రాజకుమారిక నావను నాలుగు పడవ లొక్కసారి చుట్టుముట్టినవి. ఎవరో ముష్కరులు పదిమంది యా నౌకపై కురికిరి. “ఏమిది! ఏమిది!” యని రాజకుమారి విభ్రమము చెందుచుండగనే యా దుండగీండ్రు అంశుమతీ కుమారిని, మాధవిని నెత్తుకొని, ప్రక్కనున్న యొక పడవలోనికి ఢాకినులవంటి యాడువాండ్ర చేతుల కందిచ్చిరి, రాజకుమారీ మాధవీలతల నోళ్ళకు నాఢాకినులు గుడ్డలు గ్రుక్కి కాలుసేతులు గట్టివైచి, నౌకాంతర్భాగములోనికి గొంపోయిరి. ఆ పడవ తన్ను మఱి మూడు పడవ లనుసరింప మహావేగముతో ధవళగిరి క్షేత్రము దెసకు బోదొడంగెను.
(7)
శ్రీశైల పవిత్రప్రదేశంబులకు దక్షిణమునున్న చళుక రాష్ట్రము నేలు ప్రభువులు చాళుక్యులు. సాతవాహనులకు సామంతులై సాతవాహన మహారాజ్య మంతరించిన వెనుక చళుకరాష్ట్ర ప్రభువు లిక్ష్వాకులకు సామంతులైరి. ఇక్ష్వాకులతో వారు సంబంధ బాంధవ్యముల నెఱపుచుండిరి. పల్లవుల తోడను, కండరూరు (గుంటూరు) ప్రభువులైన యానందులతోడను, ధాన్యకటక ప్రభువులైన ధనకులతోడను, విష్ణుకుండిన నగరస్వాములైన విష్ణుకుండినులతోడను, వేంగీ రాష్ట్రధిపతులైన సాలంకాయనులతోడను, క్రముక రాష్ట్ర ప్రభులైన బృహత్పలాయనులతోడను, పూంగీరాష్ట్రాధిపతులైన పూంగీయుల తోడను, ఇక్ష్వాకులకు సామంతులై చాళుక్యులు వృద్ధిపొందుచుండిరి.
ఇక్ష్వాకుల రాజ్య మంతరించగనే పల్లవులు విజృంభించిరి. సామంతు లందఱును స్వతంత్రులైరి. చాళుక్యులను తమ స్వాతంత్య్రమును బ్రకటించుకొని మహారాజ చిహ్నమగు 'భట్టారక' శబ్దమును వహించిరి. వారికిని పల్ల వులకును యుద్ధములు సాగినవి. చివరకు త్రినయన పల్లవమహారాజును చాళుక్యమహారాజు ఓడించెను. కాని యాతడు యుద్ధరంగమున వీరమరణము నందెను. చాళుక్య మహారాజ్ఞి వనవాసి కదంబుల యాడుపడుచు. ఆమె యప్పుడు నిండు చూలాలు. విష్ణుశర్మయను రాజపురోహితు, డామహారాణి, సహగమనము సేయ నుద్యమింప దత్ప్ర యత్నమును మాన్పించి, రహస్యముగ నామెను గొనిపోయి వాతాపినగరమున దన బందుగుల యింట దాచెను. ఆమెకు చాళుక్య విష్ణువర్ధనుడుద్భవించినాడు.
బాల్యమునుండియు విష్ణువర్ధనుఁడు వీర విక్రమ విహారుడై, విష్ణుశర్మ గుప్తముగా గొనితెచ్చిన రత్నభూషలను మార్చి ధనము సేకరించుకొని, యా కుంతల దేశమున వాతాపినగరము దనకు ముఖ్యనగరముగ నొనర్చుకొని, సైన్యముల సమకూర్చుకొని, నెమ్మది నెమ్మదిగా రాష్ట్రకూటుల రాజ్యమునుండి జయించిన యా భూభాగమున చాళుక్య రాజ్యము నిర్మించినాడు. చాళుక్య విష్ణువర్ధనుడు పరమ బ్రహ్మణ్యుడై, విష్ణుభక్తుడై, వరాహ లాంఛనమును గ్రహించినాడు. తన రాజ్యమును తూర్పు పడమరలకును, దక్షిణోత్తరములకును విస్తరింప జేయసాగెను. వాతాపి నగరమే యాయనకు రాజధాని యాయెను. పల్లవ సామ్రాజ్యములోని భాగము లన్నింటిని నాతని వంశీయులు చాళుక్య రాజ్యములో గలుపుకొనసాగిరి.
చాళుక్యరాజ్య మంతకంతకు విస్తరించి ప్రథమ పులకేశి కాలమున, బాట, సౌరాష్ట్ర, అవంతి, అశ్మిక, అపరాంత, కుంతల, ములకరాష్ట్రములు మొదలైననన్నిటిని దనలో విలీనము గావించుకొని, మహాసామ్రాజ్యమైనది. రాష్ట్రకూటులు, వైదర్భులు, ఆంధ్రచోళులు, ఆంధ్రభోజులు పులకేశి చక్రవర్తి పాదముల దమకిరీటముల సమర్పించినారు.
ప్రథమ పులకేశి దివంగతుడైన వెనుక చాళుక్య సామ్రాజ్యమున గొన్నివిపత్తులు సంభవించినను, సామ్రాజ్య బలమిసుమంతయు హీనము కాలేదు.
ప్రథమ పులకేశి మహారాజునకు మనుమడైన ద్వితీయ పులకేశి మహారాజును నాతనితమ్ము లిరువురును బాలకులై యున్న దినములలో, మంగళేశ మహాప్రభువు రాజప్రతినిధియై రాజ్య మేలినప్పుడు చాళుక్య సామ్రాజ్యమున నెన్నియో కుట్రలు తలలెత్తినవి. మంగళేశుని యనంతరము ద్వితీయపులకేశి వాతాపినగర సామ్రాజ్య సింహాసన మధిరోహించి, చాళుక్య సామ్రాజ్య రాష్ట్రములన్నియు తిరిగి జయించి, తన రాజ్యముపై దండెత్తివచ్చిన యార్యావర్త చక్రవర్తియైన హర్ష సామ్రాట్టును వింధ్యారణ్య ప్రదేశములలో నోడించి, వెనుకకు దరిమివైచెను, తన విజయమునకై బుద్ధభగవాను నర్చించుచు వ్యాఘ్రనదీ గుహా సంఘారామములో (అజంతాలో) నొక నూతన గుహను నిర్మించి, సంఘారామ భిక్కులకు దానమిచ్చెను. తానర్పించిన గుహలో దన విజయమును బ్రజ్ఞాపూర్ణులయిన చిత్రకారులచే విన్యసింప జేసెను. ఆ చిత్రమున బారసీక రాయబారులు వచ్చి మహారాజును సందర్శింపుచున్నట్లుగూడ విన్యసింపబడెను.
తూర్పు తీరమున చిన్న చిన్న రాజ్యములు బ్రబలి యంతఃకలహములు మెండైనవి. కళింగ నగరాంధ్రగాంగులు, వేంగీనగర విష్ణుకుండినులు, కాంచీపుర పల్లవులు, దక్షిణ కోసలులు నొకరి పైనొకరు తలపడని సంవత్సరమే లేదు. ద్వితీయ పులకేశి యీ యరాజకము నడచుటకు కళింగముపై దండు విడిసినాడు. పిష్టపురమున కళింగుల సామంతుల నోడించి, యా నగరమును స్వాధీనము చేసికొనెను.
అంతటితో నూరుకొనక పులకేశి గాంగరాజధాని దంతనగరము వఱకు బోయి గాంగులను దాసోహమ్మనిపించి, వారిచే గప్పములు గొని, బ్రాహ్మణు లనేకులకు భూరిదానము లిచ్చి దానశాసనములు వేయించెను.
ఆ వెనుక పులకేశి మహాప్రభువు వేంగీపురము జొచ్చి, విష్ణుకుండిన మాధవవర్మ కొమరుడు మంచన భట్టారకునికడ వేంగీనగరమున కప్పముగొని తన సర్వసేనాపతులలో నుత్తముడగు పృధ్వీధృవ రాజేంద్రవర్మను ప్రతినిధిగా నుంచెను. పులకేశి పృధ్వీవల్ల చక్రవర్తి చోళ, పాండ్య, గంగవాటి గాంగుల, వనవాసి కదంబుల నోడించి సామంత సుంకములుగా ధనరాసులు గొనుచు వాతాపిచేరి అశ్వమేధ మొనరించెను. ఆ అశ్వముతో చిన్న తమ్ముడు విష్ణువర్ధన మహారాజు వెడలినాడు.
విష్ణువర్థనుడు వనవాసినగరమున రాజప్రతినిధియై ప్రజలన్ని సౌఖ్యము లనుభవించుచు నానందించుచుండ జల్లని పాలనము సల్పి రాజ్యమేలుచుండెను. ఇంతలో తన ప్రియానుజుడు విషమసిద్ది - విష్ణువర్ధన ప్రభువును రాజధానీ నగరమునకు రావలయునని చక్రవర్తి యాహ్వానమంపినాడు. విష్ణువర్థనుడు హుటాహుటిప్రయాణమై సర్వకాలముల తన్ను అనుసరించియుండు కాలకంపనుని వెంటబెట్టుకొని వాతాపి నగరము వచ్చి చేరినాడు.
8
“నీవు దక్కమాతృభూమియైన యాంధ్రదేశమున శాంతిని నెలకొల్పు వారింకొకరు లేరు తమ్ముడా!” యని విష్ణువర్ధనుని భుజముపై తన దక్షిణహస్తమునుంచి పులకేశి బల్కినాడు. తమ్ముని చూడగనే చక్రవర్తికి గన్ను లానందమున జిగురించును. తన పుత్రులకన్న జిన్న తమ్ముని నెక్కువ ప్రేమతో బెంచుకొన్నాడు చాళుక్య సమ్రాట్టు. అన్నగారి యడుగు జాడలనే పూజించు విష్ణువర్ధనుడు తన కిరువదివేల బలగముండిన జాలునని కాలకంపనుని వెంటబెట్టుకొని విజయయాత్రకై వెడలుచుండును.
“విష్ణువర్ధనా! పిష్టపురదుర్గము కొండపై నిర్మింపబడకపోయినను నభేద్యమగుగోట కావున నానగరమునే నీవు రాజధానీనగరము సేసికోని యాంధ్ర సామ్రాజ్య మొకటి పునర్నిర్మాణము సేయుమని నిన్నాశీర్వదించుచున్నాను.”
“మహాప్రభూ! పరమమాహేశ్వరులైన మీ ఆజ్ఞయే నాకు శ్రీరామరక్షయు, మంత్రప్రసాదమును.”
“తమ్ముడా! నీవు రూపమున జిన్నవాడవయినను విక్రమమున, విజ్ఞానమున బెద్దవాడవు. నాయనా! నీ వేల నింతవఱకు వివాహము చేసికొన నిరాకరించినాడవో నా కేమాత్రమును రహస్యము గోచరింపలేదు. రాజన్యులు సురూపలై యుత్తమగుణాన్వితలైన తమ బాలికల నీకర్పింప నాకు బంపు రాయబారములు లెక్కింప నలవిగాదు గదా! నీ వన్నింటికి బెడమొగము బెట్టితివి. నీ యిష్టానిష్టము లన్నియు హృదయమునకు సంబంధించినవి. అందు నేనేమి జోక్యము గలుగ జేసికొనగలను!”
“అన్నయ్యగారూ! అస్పష్టమైనను దమయిచ్చను గ్రహించి, తదనుగుణవర్తినై ధన్యుడ నగుట నా పవిత్ర వ్రతము. వివాహము చేసికోనని నాకు ప్రతిజ్ఞ లేదు. హృదయమునందు దాగియున్న యొకానొక కారణముచే నా వివాహ మింతవరకును పొసగుటకు వీలులేకపోయినది. హృదయగతమగు ఆ వ్రత మేనాటికి సఫలమగునో ఆనాడు నా పాణిగ్రహణ మహోత్సవము తామే పెద్దలై జరిపింప సంభవింప గలదు. అంతవఱకును నన్ను క్షమింపుడని మాత్రము వేడుకొనుచున్నాను.”
పాదముల కెఱగిన తమ్ముని సార్వభౌముఁడు భుజముల బట్టి లేవనెత్తి గాటముగ గవుగలించుకొనెను.
“సత్వరమున విజయుడవై నాకు వార్త పంపుము విష్ణువర్థనా!” అని పులకేశి తమ్ముని కన్నులలోనికి దీక్ష్ణమైన చూపులు బరపి, మందహాసవదనుఁడై యాశీర్వదించెను.
విష్ణువర్ధనుడు సైన్యముల నడుపుకొనుచు బూర్వదిశాభిముఖుడై యాత్ర సాగించినాడు.
మధ్యదుర్గ గ్రామము నీడి, యాంధ్రమహాదేశము పలు తావులనుండి వేగుల రప్పించుకొనుచు, నచ్చటచ్చట స్కంధావారముల నిర్మింపించి, సైన్యముల నిలుపుచు బ్రయాణమున వేగము తగ్గింపకయు, సైన్యముల నలసట నొందింపకయు, నాతడు జైత్రయాత్ర సాగించుచుండెను. వేంగీరాష్ట్ర పశ్చిమారణ్యములజొచ్చి విష్ణువర్ధనుడు తన సైన్యము నుత్తరదిక్కునకు మరలించినాడు. పిష్టపురమును దిరిగి యాక్రమించుకొనిన గాంగులు విష్ణువర్ధనుడు వేంగీనగరముపై పోవుచున్నాడని నమ్మిరి. వా రట్లు నమ్ముటకే యా యువప్రభువు కాలకంపను నాలోచన పెడచెవిని బెట్టి, వేంగీనగరమునకే తన సైన్యముల నడిపించుకొని పోవుచున్నట్లే నటించినాడు. చాళుక్య సైన్యములు ప్రథమముననే వేంగీనగరమును ముట్టడించినచో శాంతచిత్తుడును దుర్భలుడును నగు విష్ణుకుండిన మహారాజు త్వరలో లోబడునని పిష్టపురమున నుండిన గాంగులును, గాంచీపురమున నుండిన పల్లవులును అనుకొనిరి, వేంగీపురమున విష్ణువర్థనుడు నిలిచి యున్నచో వారందరు ముట్టడింతురేమో యన్నభయము కాలకంపనునికి గలిగినది. ఆభావమా యువరాజు గ్రహింపకపోలేదు. కాని యాతడు తన రహస్యాలోచనల నేరికిని దెలియనీయడు. కాలకంపనుడును సర్వసైన్యములును గూడ విష్ణువర్థనుడు వేంగీపురాభిముఖుం డయ్యెననియే తలంచిరి. ఇప్పుడు చటుక్కున నా మహారాజు తన సైన్యముల నుత్తరపు దిక్కునకు ద్రిప్పి కీకారణ్యములమధ్య నడిపించుకొని పోవునప్పుడు కాలకంపనునికి విష్ణువర్ధనుని హృదయ మర్థమైనది.
ఉన్నట్లుండి యొకరాత్రి చాళుక్య సైన్యములు పట్టిసమున కెదురుగనున్న తాళగ్రామము చేరుకొన్నవి. ఆ యుదయమే నిశితబుద్దిగల చాళుక్యచరులు గొందఱు గోదావరీతీరమున నున్న కొన్ని గ్రామములలో నొకరికితెలియకుండ మరొకరికడ పడవలను తెప్పలను మాటలాడి యుంచినారు. ఆ నడిరేయి పడవలు దెప్పలును దాళగ్రామమువైపు జేరినవి. అప్పుడే యచటికి విచ్చేసిన చాళుక్య సైన్యములు నిశ్శబ్దముగ నావలియొడ్డునకు జేరినవి.
ఆవలి రేవు చేరుటేమి చాళుక్యసైన్యములు సువేగమున దమ ప్రయాణములు సాగించినవి. గాంగుల సైన్యము లన్నియు పిష్టపురమున లేవు. గోదావరీతీరము పొడవునను నా సైన్యములు కావలికాయుచుండెను. విష్ణువర్ధనుడు వేంగీపురమును బట్టుకొనిన వెనుక గోదావరిని దాటి, కళింగమును జేరకుండ జేయుటయే వారి తలంపు. విష్ణువర్థనుడు ప్రయాణమాపక, పోయిపోయి షిష్టపురమును ముట్టడించెను.
9
పిష్టపుర నగరము చుట్టును మూడు మహాకుడ్య శ్రేణులున్నవి. ఉత్తుంగములైన నలుబదిరెండు గవను (బురుజు)లున్నవి. నగరము చుట్టును త్రవ్వని అగడ్తయై హేలనది ప్రవహించును. వర్ష కాలమునందు దప్ప ఇతర సమయములందీ నదిలో నీరుండక పోవుటచే బిష్టపుర ప్రాచీన మహారాజులైన మాఠరులును, వారివెనుక సాలంకాయనులకు, విష్ణుకుండిసులకును సామంతులైన రామకాశ్యపులును హేలానదికి (నేటి యేలేరు) ఆనకట్టలు గట్టి, పండ్రెండు నెలలును లోతుగా నీరుండునట్లు చేసిరి. ఈ నది కుపశాఖలు నగరము నందు బ్రవహించుచు నొక్కొక శ్రేణికి నగడ్తలుగా నేర్పడినవి. బాహ్య కుడ్యశ్రేణీకన్న నెత్తైన మధ్యకుడ్యశ్రేణియు, నంతకన్నను నెత్తైయున్న యంతర్భిత్తికా శ్రేణియు నొకదాని కొకటి కాపుగాయు చుండును. బాహ్యకుడ్య శ్రేణికి నలుబది రెండు గవనులు, మధ్యకుడ్య శ్రేణికి ముప్పదియారు గవనలును, లోని కోటగోడకు బదునారు గవనులు గలవు. ఒక్కొక్క గవ నొక్కొక్క కోటవలె నిర్మింపబడినది. ప్రతికుడ్యోపరిదేశమున నేనుగులు, రథములు గూడ బోగల మార్గములున్నవి. గవనులలో గోటగోడలపైన బృహత్పాషాణ పాతన యరత్రములు, (పెద్ద రాతిబండలను విసరు యంత్రములు) ప్రచండాగ్ని బాణముల విసరు యంత్రములునున్నవి.
కుబ్జ విష్ణువర్ధన మహారాజు సైన్యములతో బిష్టపురమును ముట్టడించునప్పటికి గోటగోడలపై లక్షలకొలది ధనుర్ధారులైన వీరులు కిటకిటలాడుచుండిరి. మొదటిగోడపై విలు కాండ్రును, కాగిన నూనె పోయువారును, సూరేకారము గంధకముతో సిద్ధముచేసిన యగ్ని బాణముల నుపయోగించు వారును అప్రమత్తులై యుండిరి. రెండవ గోడపైన శతఘ్నులును, నూరు వాడిగల కత్తులు పొదిగిన పెద్దదూలము నుపయోగించు సైనికులు, సేనాధిపతి యాజ్ఞకై వేచియుండిరి. మూడవదియగు లోనిగోడపైన భయంకరమైన పాషాణ పాతనయంత్రములు, చిన్న చిన్న కొండలంత రాళ్ళనైనను క్రోశము రెండు క్రోశముల దూరము విసరివైచుటకు నాయత్తముగ నున్నవి.
విష్ణువర్ధనుడు తన రెండులక్షల పదాతులను, పదివేల యాశ్వికులను, రెండువేల రథికులను అయిదువందల యేనుగులను గోటకు యోజన దూరమున జుట్టును వ్యూహము లేర్పరచి, యింత దుర్భేద్యమగు కోటను సులభముగబట్టు మార్గ మాలోచించుచు, నెక్కిన గుఱ్ఱమును దిగక, కాలకంపన మహారాజుతోడను, ఆయన కొమరుడగు జయనంది తోడను, పిట్టపిడుగగు బుద్దవర్మతోడను పిష్టపురదుర్గమునకు చక్రబంధమల్లి నస్కంథా వారముచుట్టును తిరుగుచుండెను.
ఎట్టి దుర్గమదుర్గమునైనను విష్ణువర్ధను డవలీలగ బట్టగలుగువాడు. నున్న విప్రపాతములు గలిగి, యనేక కుడ్య సంరక్షితములై మహోన్నతములైన పర్వతము లందలి కోటలనైన నా చాళుక్యుడు సుఖముగ బట్టుకొన గలుగుటచే 'విషమసిద్ది'యను బిరుదమును సముపార్జించెను. విషమ సిద్ది చాళుక్యు నెరిగిన వారెవ్వరును దిట్టములైన కోటలు తమ కున్నవనియు నా కోటలలో దలదాచుకొని, తమ్మురక్షించుకొనవచ్చుననియు విసుమంతయేని ధైర్యము వహించియుండెడివారు కారు.
పులకేశివల్లభు డెబ్బదివేల యేనుగులను నిరువదివేల శతఘ్నియంత్రములను, నొక లక్ష యగ్ని బాణ యంత్రములను బ్రయోగించి పిష్టపుర దుర్గమును బట్టుకొనఁ గలిగెనట. ఆ పులకేశి వాతాపినగరము చేరినప్పటి నుండియు దానార్ణవ గాంగ యువరాజు, చాళుక్య సైన్యములు దక్షిణమునకు బోవగనే, పిష్టపురము తిరిగి పట్టుకొనెను. కోటి కర్షక పణములు వెచ్చించి మరల నాకోటను బాగుచేయించెను. పృధ్వీ మహారాజునకు “భట్టారక నామము సమర్పించి, తన తోటి మహారాజని యాతని వేయి విధముల బొగడి, కళింగరాజ్యములోని కొన్ని విషయములను (భూభాగములు) గూడ నాతనికి ధారాదత్త మొనర్చి పృధ్వీమహారాజు కొమరునకు దన చెల్లెలు జాహ్నవీకుమారి నిచ్చి, వివాహముచేసి రామకాశ్యపులకును గాంగులకును గల సంబంధముల నెక్కువ చేసెను. తన సైన్యములనేకముల బృధ్వీ మహారాజు సైన్యములతో గలిపి, పిష్టపురదుర్గమును మరియు దుర్గమము చేసెను.
కావున బృధ్వీమహారాజు తన కోటను ముట్టడించిన కుబ్జ విష్ణువర్ధనుని సైన్యమును జూచి, పకపక నవ్వుకొనెను. అంతటి మహాసైన్యములతో వచ్చిన పులకేశి చాళుక్యుడు పదునైదు దినములకుగాని పిష్టపురమును పట్టలేకపోయినాడు. “ఈ మట్టగిడస పొట్టివాడు ఈ యీఁగ సైన్యముల దెచ్చి, యుక్కుగుండును తినదలచినాడు కాబోలు” నని తనకడనున్న దానార్ణవ సేనాపతి కుంభకకర్ణుని వంటి కుంభమిత్రునితో నవ్వుచు బలికెను.
పృధ్వీ: కుంభమిత్రా! కుబ్జ విష్ణువర్ధనుడు సూదులను బాణములుగ వేయునటకాదా!
కుంభ: మహాప్రభూ! సూదులనెట్టు బాణములుగ వేయిదురు
పృధ్వీ: నీవు ధనువున్నర పొడుగు వాడవు. పొడగరులమైన మేము నీకడ పొట్టి వారముగ గన్పింతుము. నీ ఉపయూగించు గద ఒక ముప్పాతిక ధనువు పొడవు గలది. నేనుపయోగించు గద నీ దానికన్న చిన్నది. నీ జానెడంత మనిషి యెంత గద నుపయోగించును?
కుంభ: ఆలాగునా అండీ! వేలెడంత గద నుపయోగింపవచ్చును.
పృధ్వీ: కావుననే కుబ్జ విష్ణువర్ధనుడు సూదులను బాణములుగ నుపయోగించునని వింటివి.
కుంభ: ఆ సూదు లెంతదూరము పోవునో మహా ప్రభూ!
పృధ్వీ: మూరెడు దూరముపోవును.
కుంభ: అయినచో ఆ మహారాజు వాని నుపయోగింపనేల?
పృధ్వీ: అతడు పిల్లవాడు గావున ఆటకై యవి యుపయోగించునఁట.
కుంభ: అంత చిన్న పిల్లవాడు యుద్దమున కెట్లు వచ్చెను మహాప్రభూ!
ఈ రీతిగ పృధ్వీ మహారాజు కుబ్జ విష్ణువర్ధనుని కుంభ మిత్రుని యెదుట హేళన చేసెను.
ఆవగింజంత మాత్రమే మెదడున్న కుంభమిత్రునకు ఆ అవహేళన మర్ధము కాలేదు.
10
పృధ్వీ మహారాజుకు కుంభమిత్రునకు సంభాషణ కోటలోపలి గోడపై జరుగుచున్నప్పుడే, అశ్వారూఢులై కుబ్జ విష్ణువర్ధనుడును, ఆయన నను గమించిన కాలకంపన ప్రభువును, ఆతని కొమరుడు జయనందియు దమ సైన్యముల వెనక నొక తోటలో నిలుచుండి యింకొక సంభాషణ నెరపుచుండిరి.
విష్ణువర్ధనుడు: కంపనప్రభూ! బలముచే నీ కోటను పట్టుకొనవలె నన్నచో నన్నగా రుపయోగించిన బలమునంతను ఉపయోగించవలసియుండును, మన సైన్యముతో నీ కోటను జయింప యత్నించుట కొండద్రవ్వి నెత్తి నెత్తుకొన జూచుట వంటిది.
కాలకంపనుడు: అగును, మహాప్రభూ! దీనికి దగు నుపాయమును దామే పన్నవలయును. కుబ్జ: ఈ పృధ్వీమహారాజు కాలనేమివంటివాడు. జిత్తులమారి, స్వామిద్రోహి. ఈతనివలన నటు కళింగ రాజ్యమును, ఇటు విష్ణుకుండిన రాజ్యమును రెండును మోసగింపబడినవి.
జయనంది: మహాప్రభూ!ఇంతవరకు నొక పెద్దయుద్దమైన చవిచూచి యెరుగను. మా చేతులు నిదురపోవుచున్నవి. మాకు సెలవిండు. మూడు కోటగోడలు గలిగిన యీ త్రిపురమునకు మేము పురహరుల మయ్యెదము.
కుబ్జ: త్వరపడకు మయ్యా! గుమ్మడికాయంత పండు నిచ్చి మ్రింగమందును, అపు డేమిసేతువు?
జయ: అది మెత్తని పండా, గట్టి పండా మహాప్రభూ!
కుబ్జ: పండు మెత్తని దగుటలోనను, గట్టిదగుటలోనను ఏమున్నది?
జయ: మెత్తని దగుచో ముక్కలు చేసి మ్రింగవచ్చును.
'కుబ్జ: గట్టిదయినచో?
జయ: దానిని ముక్కలుగా కోసి, నమలిమ్రింగ వలయును?
కుబ్జ: కావున ముక్కలు చేయుట పండు ఎట్టిదైనను సమానమన్నమాట!
జయ: చిత్తము.
కాల: కావున నీ కోటను బట్టుటకు, గోటసంరక్షకుని ఏకాగ్రతను జెదరగొట్టవలెనని మహాప్రభువులు -
కుబ్జ: అదియే నా త్రిప్పికొట్టు తంత్ర ప్రయోగము. కోట బాహిరముననున్న మనపై శత్రువుల దృష్టి కేంద్రీకరింపబడి యున్నది. మనమేమి పన్నాగములు పన్నినను, శత్రువులు దానికి ప్రతిని బన్నుచునేయుందురు. కావున, కోట లోపలనొక సంక్షోభమునకు వారి దృష్టిని మరల్ప గల్గినచో వారి యేకాగ్రత ద్విముఖమగును. రెండు ముఖ్యములున్న దానిని బహుముఖములుగా మార్చుట మతిసులభము.
జయ: లో మన మెట్లు సంక్షోభమును సృజింప గలము మహారాజా?
కుబ్జ: ఓపిక పట్టుము.
ఆ రాత్రి చాళుక్యసైన్యము లన్నియు నప్రమత్తతతోనే మహారాజు నాజ్ఞ కొఱకు నేదురు చూచుచుండినవి.
నడిరేయి యగునప్పటికి బదివేల రెండెడ్ల బండ్లను ఎద్దులవిప్పివైచి ఒక్కొకబండి నెనిమిదిమంది వీరుల చొప్పున లాగికొనుచు, సార్ధయోజనము చుట్టుకొలతగల కోటచుట్టును మూడు యోజనముల వృత్తముగా నాక్రమించిన చాళుక్య సైన్యములను కుబ్జవిష్ణువర్ధనుల యాజ్ఞగా జయనంది కొని వచ్చెను. ప్రతిబండిపైనను దిట్టములైన దూలముల నడ్డముగా, నిలువుగా గట్టించినాడు జయనంది. చక్రములకు వాని వెడల్పునకు సరిపడు పొడుగుగల సన్నని గట్టి దూలములను గట్టించినాడు. ఇవన్నియు విషమసిద్ది మహాప్రభువు నాజ్ఞలే! ఒక్కొక బండి క్రిందుగా నలుగురు విలుకాండ్రును, నెనిమిదీ మంది బండిని వెనుక నుండి త్రోయుటకును నుండుటకు మహా ప్రభువు నాజ్ఞ.
ఈ బండ్ల వెనుక శిలాపాతనయంత్రములు, నగ్నిబాణ యంత్రములు, శిలా చక్రయుక్తము లైనవి, రథములవలె బోవుటకుగా సిద్దము చేయబడినవి. కోటలో నర్థరాత్రి భేరీ నినదించిన గడియకు పుర మధ్యమునఁ బెద్ద గగ్గోలు బయలుదేరెను. నిదుర గూరిన ప్రజలందరు నొక్కసారి మేల్కొనిరి. అటనట కొన్ని యిండ్లంటుకొని పోయినవి. హాహాకారములు మిన్నుముట్టెను ఇంతలో శత్రువులు కోటలో బ్రవేశించిరను గందరగోళము నగరమంతయుఁబ్రాకిపోయినది. కోట గోడలపై నచ్చటచ్చట “శత్రువులు ప్రవేశించినారు, శత్రువులు ప్రవేశించినా” రనుకేకలు రణభేరీ నినాదములు నొక్కుమ్మడిగ నుద్భవించినవి. ఎక్కడేమి జరుగుచున్నదియు నేరికిని దెలియలేదు.
ఉన్నట్లుండి నగర పూర్వగోపుర మహాకవాటములు తెరుచుకొనిపోయినవి. ఆ ద్వారమున శత్రువు లాక్రమించి వారిని అక్కడకు దొందరపాటుగ వచ్చిన పృధ్వీమహారాజు కనుగొని మఱల వేగముగ వెనుకకు దానెక్కిన యశ్వమును పరుగెత్తించుచు రాజప్రసాద గోపురము కడకు జేరెను. ఈ సంక్షోభమునకుఁగారణ మేమైయుండునో యని తికమక పడుచు దన పట్టపుటేనుగు నెక్కబోవు పృధ్వీమహారాజునకు ఉపసేనాధిపతి తూర్పుద్వారము శత్రువుల వశమయ్యెనని మనవి చేసినాడు. కోటగోడలపైన అమర్చిన శతఘ్ని యంత్రాదికముల నుపయోగించుడని యాజ్ఞ నిడువారైన లేకపోయిరి. శత్రువుల వైపునుండి యంత్రము నుపయోగించు రంగురంగుల బాణాసంచులు వచ్చి కోటగోడమీద సైనికులను, ముట్టడించువారికి స్పష్టముగ జూపుచున్నవి.
తూర్పు ద్వారమునుండి చాళుక్యసైనికులు తండోప తండములుగ కోటలోనికి గట్టుతెగిన ప్రవాహమువలె రా జొచ్చిరి. ఆ సైన్యమును నడుపుకొనుచు చాళుక్యవిష్ణువర్ధనుండు నారాయణహస్త వినిర్ముక్త చక్రములె, తూర్పు గోపురద్వారములను మూటిని దాటి నగరములోనికి వచ్చి పడెను. అతనితో సమముగ కేతనముధరించి అంగరక్షక దళాధిపతి బుద్దవర్మ వచ్చుచుండెను. “కుజ్జ విష్ణువర్ధనుడు! కుబ్జ విష్ణువర్ధనుడు!” అను నినాదములు మిన్నుముట్టగనే యాతని వేగము నడ్డగించువారుగూడ నాయుధములు విడిచి, జోహారు లొనర్చిరి.
ఇంతలో నుత్తర గోపురద్వారములు మూడును దెరచుకొని పోయినవి. అవియు చాళుక్య సైనికుల హస్తగతములైనవి. ఆ ద్వారములనుండి యేనుగులనడుపుకొనుచు సేనాధి పతి కాలకంపన ప్రభువు, లోనికి చొచ్చుకొని వచ్చినాడు.
యుద్ధప్రారంభమున గగ్గోలు బయలుదేరిన ప్రథమ క్షణములందు కోటగోడలమీది సైనికు లేమిచేయుటకును దోచక, మ్రాన్పడిపోయినను, శత్రువులమీదికి వారందు. బాటులోనున్నను, లేకపోయినను నగ్నిబాణములు గండశిలలు ప్రయోగింపసాగిరి.
చాళుక్యసైన్యములందుండి యెడ్లులేని బండ్లు వానియంతటనవే నడుచుచు వచ్చుచున్నట్లు, వానిలో మండు కాగడాల వెలుతురులో గోటగోడలమీది సైనికులకుగన్పడి యీవిచిత్ర మేమని వారు చూచుచుండగనే వానికి నాతిదూరమునశిలలు నగ్ని బాణములు విసరివేయు యంత్రములు వచ్చుచుండెను.
నగరములో గగ్గోలెక్కువైనది. లోపలనుండియే చాళుక్య సైనికులు కోటగోడలపై వచ్చి పడుచుండిరి. చాళుక్య సైనికులాక్రమించుకొన్న ప్రతి కుడ్య గోపురమునను రంగుల బాణాసంచులు వెలుగ నారంభించినవి. ఎడ్లులేని బండ్లు మరియు దగ్గరకు వచ్చినవి. రాళ్ళగట్టిన నిచ్చెనత్రాళ్ళను యంత్రములద్వారా చాళుక్యసైనికులు కోటగోడలపైకి విసిరి వైచిరి. పృధ్వీమహారాజు సైన్యములుగాని, కళింగ సైన్యములుగాని, కోటగోడల నుండి, యా వచ్చు బండ్లపైన నెన్నియస్త్ర ప్రయోగములు చేసినను ప్రయోజనము లేకపోయినది. శత్రువులు పూర్తిగ నగరము నాక్రమించిరని నినాదములు బయలు వెడలినవి.
రాచకోట ముందు నేనుగు నెక్కిన పృధ్వీమహారాజు చుట్టును చాళుక్యసైన్యములు క్రమ్ముకొన్నవి. తన యుత్తమ ధవళాజానేయము నెక్కి చాళుక్యవిష్ణువర్ధను డెదుట ప్రత్యక్షమైనాడు. వచ్చుటయేమి, యా పిశాచపు బొట్టవాడింద్రుని వజ్రాయుధమువంటి బాణమును ప్రయోగించినాడు. అది చువ్వున వచ్చి, పృధ్వీమహారాజు కుడిభుజమున నాటుకొని పోయినది. ఇవి సూదులని హేళనచేసి తినే యని అనుకొనుచు నా అంబారి పైననే ఆ రాజు త్రెళ్ళిపడిపోయినాడు. ఆతని సైన్యము లెక్కడి వక్కడ చాళుక్య సైన్యములకు లోబడిపోయెను.
11
పిష్టపురము వశమయిన వెనుక చాళుక్యవిష్ణువర్థనుడు ఆ నగరమంతయు మరల బాగుచేయించుటకును, కృత్రిమాగ్నులచే, ముట్టడిచే నష్టపడిన ప్రజలకు పరిహార మిప్పించుటకును, కాలకంపన ప్రభువునకు అనుమతి నిచ్చెను. తన సైనికులకు బహుమానము లిచ్చి, వారిని తృప్తిపరచెను.
ఒకనాడు విష్ణువర్ధనుడు ఆలోచనామందిరమున సింహాసన మధివసించి యుండెను. అప్పుడు కాలకంపన ప్రభువును జయనందియు సమీపించి “మహాప్రభూ! శత్రువుల చిత్తై కాగ్రతను ఎట్లు భేదించగలిగినారో, నా కిప్పటికీ అర్థము గాలేదు” అని, వినయముగ బ్రశ్నించినారు.
విష్ణువర్ధనుడు నవ్వుచు జయనందితో, “ఓయి వెఱ్ఱివాడా! నేను వాతాపి నగరము నుండి బయలుదేరినప్పుడు పిష్టపురదుర్గ వ్యవహారము నేమియు నెఱుగక బయలు దేరితి నను కొంటివా! అన్నగారు ఈ దుర్గమ దుర్గమును బట్టలేదా! అన్నగారి సేనాధిపతుల కీ కోటసంగతి పూర్తిగ దెలియదా! ఈ దుర్గమునందున్న ప్రత్యంగుళ భాగమును, అందలి రహస్యము లన్నింటిని, మున్నే తెలిసికొంటిని. అన్నగారు బహు పరాక్రమముచే దీనిం గెలిచిరి. నేను గంభీర రహస్యోపాయముచే దీని సాధింపదలచితిని. వాతాపినగరమునుండి సైన్యములతో యుద్దయాత్ర సాగించుటకు మున్నే వేవురు జైన సన్యాసులు, నాలుగు వేల భిక్షకులు, రెండుమూడు వేల పల్లె ప్రజలు వచ్చిరి. ఒక వేయిమంది వర్తకులు, మూడువేల గుఱ్ఱములగొని ఆస్మిక వణిజులటుల వచ్చిరి. వివిధ వేషములతో బదివేలమంది దిట్టరులైన మన సైనికులాయా వేషములతో నీ నగరమున వచ్చి చేరిరి. ఆటగాండ్రుగా దళవాయులు వచ్చిరి. తోలుబొమ్మల యాటకాండ్రుగా సేనాపతులు చేరిరి. శివదాసులుగా గూఢచారులు వచ్చియుండిరి. కొందరు విరోధుల సైనికులను మన పక్షమునకు ద్రిప్పివేసిరి. మన సైనికులు చాలామంది, పృధ్వీమహారాజు సైన్యములో జేరవచ్చినట్లు వచ్చిరి. అన్నగారితో చేసిన యుద్ధములో పిష్టపుర సైన్యము లెన్నియో మడిసినవి గదా! కాల: కావున లోపల లొటారము పైకి బటారముగ పిష్టపురము సిద్దమైనదా మహారాజా?
కుబ్జ: ఈ కోటను జేరవచ్చిన వారును, ఒకరి మంత్రాంగ మింకొకరు ఎరుగకయే యిచ్చటకు వచ్చిరి. కాని, యిట వారు కలుసుకొనునట్లు పాయములుపన్ని పంపినాను.
కాలకంపన ప్రభువును వారి కుమారుడు జయనందియు పొందిన యాశ్చర్య మపారము.
అప్పుడు కుబ్జ విషువర్ధనుడు “కంపనప్రభూ! ఒక పక్షము దినములు మన సైన్యములను విశ్రాంతి తీసికొననిండు. ఈ రాష్ట్ర ప్రజలు విష్ణువర్థన చాళుక్యు నుత్తమ పరిపాలన మెట్టిదో చవిచూచెదరు గాక" యని మందహాసవదనుడై పలికెను.
“ఈ లోన శత్రువులు బలమును కూడదీసికొనరా మహాప్రభూ?”
“అటుల నగుటయే ఉత్తమముకాదా కంపనప్రభూ! యుద్ధనీతి ద్వివిధము. విగ్రహమున శత్రురాజుల నందరిని చీలదీసి వేరువేరుగా నొకరొకరిని నాశనము సేయు టొక విధానము. శత్రువు లందరను నేకముగావచ్చి, అప్పుడు వారితో దలపడి శత్రుని శ్శేషము సల్పుట రెండవ విధానము!
“మొదటి విధానము సులభమును ఉత్తమము గాదా మహాప్రభూ!”
“నూతన రాజ్యము స్థాపించునాడు రెండవది మహోత్తమము. అట్లుకానిచో, శత్రునిశ్శేషము జరుగక, మఱల మఱల గుట్రలు తలయెత్తుచుండును. విడివిడిగా నోడిపోయిన శత్రువులు మనమందరము గలిసినచో, విజయము మనదే యై యుండెడిదని యాలోచించుకొందురు. రాజ్యమున సంక్షోభములు తప్పవు.”
కాలకంపనుడు తన ప్రభువు యుద్ధనీతికి నాశ్చర్యమందెను. ఆ మరునాడు కుమార విష్ణువర్థన ప్రభువు నిండు పేరోలగంబున గొలువుతీర్చియుండ దీనవదనయగు నొక బాలిక సింహాసన వేదికా సోపానపాదపీఠకు కడకు పరుగిడి వచ్చి సాష్టాంగముపడి “దేవా! రక్షించుము! రక్షించుము!” అని యరచి, మూర్చపోయెను.
తమ కష్టముల నివేదించుకొనుటకు రాజదర్శనార్థ మెవరు రాఁదలచుకొన్నను వారికెట్టి యాటంక ముండరాదని విష్ణువర్ధను నాజ్ఞ. కాలకంపన ప్రభువు తన యాసనము నుండి దిగ్గునలేచి, యా బాలికకడకు బోయి, మోకరించి “బాలిక మూర్ఛపోయినది. మహాప్రభూ!” యని విన్నవించి వెంటనే పన్నీరము కొనిరండని దౌవారికుల కాజ్ఞయిచ్చెను.
విష్ణువర్ధనుని చిన్నతనము నుండియు బెంచినవారిలో నొకడగు రాజవైద్యు డింతలో నచటకు వచ్చి, యా బాలిక ననాయాసమున నెత్తుకొని, రాజసభామందిరమునకు వెనుక నున్న యాలోచనా మందిరమునకు గొంపోయి, యచట నొక మంచాసనముపై బరుండబెట్టి నాడి పరీక్ష సేయు చుండెను. వైద్యుని వెనుకనే విష్ణువర్ధనుడు కాలకంపన ప్రభువును వచ్చిరి. పన్నీరులు గొని పరిచారికలును వచ్చి చేరిరి.
“మహాప్రభూ! బాలిక మూర్చపోయినది. అదిగో! యామెకు మెలకువ వచ్చినది. ఒక కలికమును బెట్టెదను. అంతలో నీమెకు పూర్తిగ మెలకువ వచ్చి యధాస్థితి నందు” నని ఆ వైద్యుడు విష్ణువర్ధనునితో విన్నవించుచు కలికము బెట్టెను. “ఆ! ఆ!” యని యా బాలిక యొక్కసారిగా లేచి కూరుచున్నది. “ఏమియు భయము లేదు. పరుండు మమ్మ! నేను వైద్యుడను. వీరుగో మహాప్రభువులు. అదే వారు కాలకంపన ప్రభువులు. తేనెతో రంగరించిన ఈ మందు సేవించి స్వాస్థ్యమునంది యా వెనుక మహారాజుతో నీవు చెప్పుకొనునది మనవి చేసికొమ్ము” అని యావైద్యుడు చల్లని మాట లాడుచు ధైర్యము చెప్పెను.
“మూడు దినములనుండి తిండి లేకుండటచే దల తిరిగి, మూర్చ వచ్చినది మహాప్రభూ! అందుకు క్షంతవ్యను. రాజకుమారి! మా రాజకుమారి! మహాప్రభూ!...” ఆమె కంఠము రుద్దమై మాటలాడలేకపోయివది. ఆమే కన్నుల జలజల నీరు ప్రవహించినది. విష్ణువర్ధను డా బాలికవైపు చూచుచు, “మీ రాజకుమారిక?” అని సాంత్వనముగ ఆమె కంఠము!
“మహాప్రభూ! మా మహారాజకుమారి యీ యంతఃపుర మందిరములలో నభ్యంతర కారాగారమునందు మూడు దినములనుండి పస్తుపడియున్నది. ఆ పిశాచులు మమ్ముపెట్టిన బాధలు-” ఆమె కన్నులనుండి మఱల బాష్పప్రవాహములు పొరలివచ్చినవి.
విష్ణువర్ధనుడు గంభీరస్వరమున “కాలకంపన ప్రభూ! మీరు వెంటనేపోయి ఈ దుష్ట సంఘటన మేమో కనుగొని రండు ఆరాజకుమారికకు సకలోపచారములు చేయింపుడు...రాజవైద్యునివైపు తిరిగి “వినయ దీక్షితులవారూ! మీరును కంపన ప్రభువు ననుసరించుడు. ఆ రాజకుమారికకు మీ వైద్య మవసరముండునేమో యని నాకు దోచుచున్నదని వహించినాడు.
“మహారాజా! నా కిప్పుడు సత్తువ వచ్చినది. ఈ పరిచారికల సహాయమున నేను మా రాజకుమారి కడకుబోయిన తరువాత తమతో నన్నియు మనవి చేసికొందు” నని యా బాలిక మంచాసనము పై నుండి లేచినది. విష్ణువర్ధనుడు దయార్ధ్రదృక్కుల నామెపై బరపుచు, “అటులనే పోయిరమ్ము” అని యామె కానతి యిచ్చినాడు. పరిచారికల సహాయ మక్కర లేకయే యా బాలిక లేచి, విష్ణువర్ధనునకు నమస్కరించి, యభ్యంతర మందిరము లోనికి వెడలిపోయినది.
విష్ణువర్ధనుడొక్కడు అచటనున్న సుఖాసనముపైనధివసించినాడు. ఎవరీ రాజకుమారీ! పరిచారికలకన్న నికృష్టముగా జూచి, యామెను బంధించిన మహాపాపి ఎవడు? ఒక్కొక్కప్పుడు మానవుడు నరపిశాచియే యగును. మనష్యుని కాంక్ష లనంతములు. మానవ ధర్మముకై, పురషార్ధ సాధనమునకై తమ జీవితములు సమర్పించు మానవులేపాటి గలరు! దురాశా పిశాచగ్రస్తుడైన మనష్యుడు హీనాతిహీనముగ సంచరించును అని యాలోచించుకొనుచు నా బాలిక స్థితి యేట్లున్నదో తెలిసికొనుటకై తొందరపడుచుండెను.
ఇంతలో రాజవైద్యుడును, కాలకంపన ప్రభువును నచ్చటకు విచ్చేసినారు.
వైద్యుడు: మహారాజా! ఆ బాలిక వేంగీపుర విష్ణుకుండిన మహారాజు నేక పుత్రిక. అంశుమత్యభిథాన. ఆమె జాతకమునందు గొన్ని గ్రహదోషముల బరిహరింప వారి రాజగురు వామెను మాఖస్నాన వ్రతశీలను జేసెనట. ఆ రాకుమారి నాలుగు దినముల పూర్వము వఱకు గోవూరు నందు విడిది తీర్చి గౌతమిలో స్నాన వ్రతమును సంపూర్ణము సేయుచుండినది. ఆ సాయంకాలము కోటి లింగాల క్షేత్రమున నున్న సర్వ బ్రాహ్మణ్యమునకు వివిధ దానము లర్పించి తిరిగి, తన రాజనౌకపై గోవూరు జేరబోవు సమయమున, నామెను, చెలియైన నీ బాలికను ఎత్తుకొని, ఇచ్చటకు దెచ్చి, రాజాంతః పురాంతర కారాగారమున బంధించారట!
విష్ణు: ఎవరా నరరూప నిశాచరులు? కంపన ప్రభూ! మీరీ విషయమంతయు నామూలాగ్రముగ విచారించి, యా దుర్మార్గులెవరో కనుగొనుడు.
కాలకంప: మహాప్రభూ! ఆ బాలికను గొనివచ్చిన నీచులు కాళింగులే! నే నపచెడే యీ రాణివాస పరిచారకులను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది.
విష్ణు: ఆ దురాశ ఈనాటిది కాదు గదా!
కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడినచో నల్లుడైన కళింగునకు ఆంధ్ర సామ్రాజ్యమంతయు దత్తమగును గదా?
విష్ణు: అయినచో రాకుమారి హస్తమును కళింగనగర మహారాజర్థించి యుండవచ్చునుగదా!
కాల: ఈ రాకుమారి కళింగ యువరాజు చిత్రము చూచి తనకా యువకుడు తగిన వరుడు గాడని నిస్సంశయముగ దెలిపివైచెనట.
రాజవైద్యు: అదే కారణము మహాప్రభూ! తన్ను వరించదని యెప్పుడు నిర్ధారితమయ్యెనో, కళింగ యువరాజప్పుడే ఈ బాలికను దస్కరించి కొనిపోయి, బలత్కరించి వివాహము చేసికొన నిశ్చయించి, ఈ దౌర్మార్యమున కొడిగట్టినాడు.
విష్ణు: కాలంపన ప్రభూ! విష్ణుకుండిన రాజకుమారి స్వస్థత నొందగనే, వారిని సగౌరముగా గోవూరు కంపి వేయుడు. మూడు దినములలో మన సైన్యములు కళింగ నగరాభిముఖములైయజేయ్యములై జైత్రయాత్రను సాగించుగాక!
కాల: చిత్తము మహాప్రభూ!
12
విష్ణువర్ధనుడు ప్రతి యుషస్సునను దప్పకలేచి తన యుత్తమాశ్వము నధిరోహించి, కొన్ని గోరుతముల దవ్వు అశ్వయానము చేసి తిరిగివచ్చి, యోగాసనాదు లొనరించి, యా వెనుక స్నానము సలిపి సంధ్యావందన మాచరించుకొనును. ఆపై నాతఁడుద్యాన వనవిహారము సేయును. పిష్టపుర మాతని హస్తగతమైన నాల్గవ నాడాతడు తన యలవాటు చొప్పున రాజోద్యానమున విహరించుచు, నా వన మధ్యస్థమైన కృత్రిమ సరోవర సోపానమున గూర్చుండి అలవోకగా నేదియో పాడుకొనుచుండెను. విష్ణువర్ధను డెంత వీరవిక్రముడో యాతని కంఠమంత మధురమై బాలకుని కంఠమువలె పంచమ శృతు లీనుచుండును.
ఆరోగ్యము పూర్తిగా గోలుకొన్న అంశుమతీ రాజకుమారి నిత్యాభ్యస్తమైన యుదయకాల విహారమునకై అప్పు డొంటరిగ నా ప్రదేశమునకే విచ్చేసెను.
ఎవరో యొక బాలుడు, చాళుక్య మహారాజు పరివారములోనివాడు, వన విహారమునకై వచ్చి యానందమున బాడుకొనుచున్నాడని యా బాలిక యనుకొన్నది. ఆమె కదలక యచ్చటనే నిలుచుండి యా మనోహర గాంధర్వము నాలకించుచు నానందము ననుభవించుచుండెను.
ఏమి యా బాలుని భక్తి పారవశ్యము! ఎంత సుందరముగ నున్నాడు! ఈతని జూచినంతనే తన హృదయ మేలనో యార్ధ్రతనొందుచున్నదని తలపోయుచు నటనే నిలుచున్నది. పాట ముగించుచునే విష్ణువర్ధనుడు తన సమీపమున నెవరో నిలుచుండిరని గ్రహించి యా వైపునకు జూపులు పరపెను. అప్రతిమాన సౌందర్యవతియగు బాలికయోర్తచట నిలుచుండు టాతడు చూచి, తాను కూరుచుండిన మెట్టుపై నుండి లేచి-
“ఎవరు మీరు? ఇచ్చటికి వచ్చినారు?” అని ప్రశ్నించినాడు.
“మీరెవరు? ఇది శుద్ధాంతోద్యానవనము. ఇందు పరపురుషులెవ్వరు ప్రవేశింపరే” ఆమె యతడు బాలకు డనియే యెంచెను.
“రాణివాసము వా రెవ్వరిచట లేరుగదా యని ధైర్యమున నిటకు వాహ్యాళికై వచ్చితిని.”
“మీ మహారాజు రాణివాస మింకను రాలేదా?”
“మా మహారాజనగా?”
“మీరు చాళుక్య శ్రీవిష్ణువర్థన మహారాజు పరివారములోనివారు కారా?”
“అవును! అవును! అయినను పరివారములోని వాడను కాను.”
“అనిన?”
“అవును, పరివారములోని వాడనే కాని, గట్టిగ నాలోచించిన కాను కూడను.”
“మీ మాటలు స్వవచనవ్యాఘాతదోషయుక్తములు.”
“మరి - మరి - నేను రాజబంధువుడను.”
“అదియా! అందుకనియా! మీరింత గజిబిజిపడినారు?”
“మీ రెవ్వరు? శ్రీగంగరాణివాసమువారా? పరస్త్రీతో నిర్భయముగ మాట్లాడు చుంటిని, క్షంతవ్యుడను.”
“మీరుకాదు, మాటలు ప్రారంభించినది నేను. అయినను నేను గాంగరాణివాసపు బాలికనుగాను. నేను - నేను - నేను శ్రీవిష్ణుకుండిన రాజకుమారిక చెలియను. శ్రీవిష్ణుకుండిన మహారాజులకు నేను సమీపబంధువును.”
“క్షమింపుడు. నేనెంతయో తప్పిద మొనరించితిని.”
“ఇందు దప్పేమి యున్నది? మీరును నేనును రాజబంధువులమైనను పరివారజనములోని వారము. మీ నామధేయము నాకు దెలియవచ్చునా?”
“నన్ను ప్రియదర్శి అని మీరు పిలువవచ్చును. మీ మహారాజకుమారి క్షేమముగ నున్నారా? సంపూర్ణారోగ్యము నందినారా?”
“వారు సంపూర్ణారోగ్యము నందినారు. మఱల గౌతమీస్నాన వ్రతమునకు దొందరగ బోవలయునట. ఈ యైదారు దినములు వారు వ్రతము మానివేయవలసి వచ్చినందుకు ప్రాయశ్చిత్తములు జరుపుకొనవలయునేమో! శ్రీ విష్ణువర్ధన మహారాజ కుమారుల ప్రతాపముచే నరకము వంటి యీ కారాగారమునుండి మాకు విముక్తి ప్రసాదింప బడినది. ఆ మహారాజునకు మా రాకుమారి యెంతయు గృతజ్ఞురాలు.”
“మా మహారాజు కళింగనగరముపై జైత్రయాత్రకు బోవుచున్నాడు. మీ రాజకుమారిని సర్వ మర్యాదలతో గోవూరు పురమునకు గొనిపోవ నాజ్ఞయిచ్చిరి.
ఇంతలో దూరమునుండి “మహారాజకుమారీ! మహారాజకుమారీ!” యని మాధవి కేకలు వినవచ్చినవి.
“ప్రభూ! ఇక సెలవు. మహారాజకుమారిని మాధవి కాబోలు పిలుచుచున్నది. నన్ను కిరణవతి యని మీరు పిలువవచ్చును” అని అంశుమతి చిరునవ్వు నవ్వుచు “మీకు నాయీడు ఉండునని అనుకొందును. భగవంతుడు మీ మహారాజును సర్వవిధముల రక్షించుగాక!” అనుచు నంశుమతి విసవిస నడిచిపోయినది.
ఓహో! ఏమి యీ బాలిక సౌందర్యము. జగన్మోహిని. విష్ణుకుండిన మహారాజునకు సామంతుడైన ప్రభు వెవ్వరికో యీమె తనయయై యుండవచ్చును. ఏమి మధుర కంఠము! ఆమె మాటలు కోకిల పులుగు కువకువలువలె దేనియలు చెమరించినవి. తానింతవరకు స్త్రీల నెవ్వరి నిటుల పలుకరించి యుండలేదు. ఈ బాలికకు వివాహమై యుండ నేరదు. అయినచో రాజకుమారికి సఖిగా నెట్లు రాగలుగును?
అందరివలెనే యీ బాలయు దన్ను బాలకు డనుకొనినది. ఆమె యీడెంత యైయుండును! పదునేడు పదునెనిమిది వర్షముల పడుచుప్రాయము. ఈ బాలిక తన్ను బదునెనిమిది వత్సరముల బాలుడని యెంచినది కాబోలు, అని ఆ యువమహారాజు మనస్సు కొంచెము భిన్నమయ్యెను.
తన వంశమున నేరును బొట్టివారు ఉద్భవించలేదట. తాను బూర్వజన్మమునందే కుబ్జుని జూచి పరిహసించెనో యీ జన్మమున నిట్లుద్భవించినాడు. కాని తాను మరుగుజ్జు మాత్రము గాదు. బాలకునివలె గన్పించును. అయినను తన పూర్వకర్మము వలననో, భగవంతుని కృపవల్లనో సంభవించిన ఈ వామనత్వమున కీ పది సంవత్సరములనుండియు తన మనస్సు అప్పుడప్పుడు దుఃఖము నందుచు దన్ను గుజ్జువానిగ నెంచినవారి నెల్లరను ద్వేషించుచు నానాటికి గర్కశత్వమును దాల్చినది.
తనలోని క్రోధమునకు దానే భయపడిపోవువాడు. ఆ క్రోధము తన్నే దహించివేయు ననుకొన్నాడు. లోక మసహ్య మయిపోయినది. లోకప్రఖ్యాతి నంది, చతుస్సముద్ర వేలాయత మహాసామ్రాజ్యమును పాలించుచున్న పరమ బ్రహ్మణ్యుడైన తన అన్నగారు తన్నపరిమిత ప్రేమతో హృదయమునకు హత్తుకొని నప్పుడా ప్రేమ కరుణచే జనించిన దనుకొని తా నెంతయో బాధ నందినాడు. తన పెద్దతమ్మునికన్న జిన్నతమ్మునిపై నెక్కుడు ప్రేమ గలుగుట కీ మరుగుజ్జుతనమె కారణమని యాతడు పొందిన వేదన వర్ణనాతీతమై పోయినది. అన్నగారు, చిన్నన్నగారు నిరువుర దనపై జూపుప్రేమకు గారణము, జాలిగాదని యెన్ని యో సారులు నిర్ధారితమైనను ఆ యనుమాన మప్పుడప్పుడు పీడించుచునే యున్నది. కాని, యీ బాలిక, యీ పరమసుందరి, దివ్యగాత్ర తనకారీతి ప్రత్యక్షమైన మఱుక్షణమునుండి తన జీవితమున నేదియో అమృతశాంతి యలముకొన్నట్లయినదీ. ఏ సామంతుని కొమరితయో యీ బాలిక!
13
గౌతమీ కార్తీక స్నానవ్రతమును సమాప్తము గావించి విష్ణుకుండిన రాజకుమారి అంశుమతి వేంగీపురము చేరుకొన్నది. స్నానవ్రత మాహాత్య్మమో, మరియే కారణమో అంశుమతి గోవూరునుండి వచ్చిన నాటనుండియు నానందముచే గలకలలాడిపోవు చుండెను. ఆమె యెప్పుడును నెవియో పాటలు పాడుచునేయుండును. తానేర్చిన నాట్యకళా వైదుష్యమంతయు వెల్లి విరియ తా నాడును, చెలికత్తియల నాడించును. సన్నిహిత భాంధవియగు మాధవిచే నుషాబాల వేషము వేయించి, తా ననిరుద్ధుడై యవరోధ జనము నెదుట నుషాపరిణయ నాటకమును బ్రదర్శించినది. ఉష యాంధ్రుల యాడుబడుచు. ఉషకు బడమటి నుండి యనీరుద్దుడు వేంచేసినాడు! ఆమె తనలో నవ్వుకొన్నది. ఏమి తనకీ యానందము!
ఆ నాటక మెంతయో రక్తిగట్టినది. మహారాణి తన కొమరిత నాట్యకౌశలమున కెంతయో పొంగిపోయినది. సంజ్ఞాదేవి హైహయుల యాడుబడుచు. కోనదేశాధిపతి యగు హైహయ మాధవవర్మమహారాజు సూర్యోపాసకుడు. బిడ్డలకై సూర్యు నారాధించి, కొమరితయగు సంజ్ఞాదేవిని, కొమరు డాదిత్యవర్మను బడసెను. హైహయులు విష్ణుకుండి నలును దగ్గఱి బంధువులు. సంజ్ఞాదేవి విష్ణుకుండిన యువ మహారాజు మంచన భట్టారకునికి ఉద్వాహము గావింపబడి యువరాణి యయినది. నేడు రాణి.
మహారాణి కొమరిత నంతఃపురమునకు గొనిపోయి తన మాంగళ్యమందిరమున గాశ్మీర దుకూలాంబర రత్న కంబళముపై నధివసించి, యుపధానముల నానుకొని, కొమరితను దగ్గఱగ గూర్చుండ బెట్టుకొన్నది.
"తల్లీ! మహారాజు నీ వివాహ విషయమున బెంగగొని యున్నారు. అనువైన సంబంధముల నన్నింటిని వలదంటివి. కళింగ గాంగులు, కాంచీపుర పల్లవులు, వాతాపి చాళుక్యులు బలవంతులై విష్ణుకుండిన వేంగీరాష్ట్రములకు శత్రువులై యీ రాజ్యమును హరింప గంకణము ధరించినారు” అని కొమరిత వైపు విచారము కుములుకొను తన మోమును తిప్పినది.
“అమ్మగారూ! నాయనగారు ధీరశాంతులు. వారికి యుద్దమన విముఖత్వము. వారు సర్వధర్మప్రియులు. తాము చిత్రరథస్వామి భక్తులయ్యు, జైనులను, బౌద్దులను, శైవులను, బూర్వమీమాంసకులను సమానప్రేమతో నాదరించుచున్నారు. వివిధ ధర్మావలంబములైన సంస్థలకెల్లను నెన్ని గ్రామములు ధనరాసులు దానము లీయలేదు!”
“అవును తల్లీ! వారు నీ కొఱకై తమ రాజ్యమునే దానమిచ్చుటకు సంసిద్దులుగా నున్నారు గదా!”
“నేను బాలకుడనై పుట్టకపోవుట నాయనగారికి మఱియు నానందము సమకూర్చినది కాబోలు. ఆ యీ సంభాషణలలో వారాభావమును వెల్లడించుచునే యున్నారు. కాని, నేను మాత్రమెన్నియో మారులు పురుషుడను కాక పోతిననియు, విష్ణుకుండిన మహాసామ్రాజ్యమును సుస్థిర మొనర్పజాలక పోతిననియు దుఃఖించితిని. ఏమి రాజ్యములు, ఏమి రాజులు! కాకులవలె గ్రద్దలవలె సైన్యములు సమకూర్చుకొని యనిత్యమును, గల్మశమునగు కీర్తికై యొకరి తల నొకరు నఱుకుకొనుచు, నొకరి రాజ్య మొకరు హరించుచున్నారు.”
“అవును కన్నతల్లీ! నీవు బాలకుడవై పుట్టవలెనని వాంఛించినట్లీ నీ వేషమే నిదర్శనము. ఎంత జక్కగ నభినయించితివి. నాకు నీవు బాలకుడ వయియే జనించితివేమో యని యొక నిమేషమాత్ర మనిపించినది. నీ వన్నట్లు రాజ్యము లెప్పుడును పాపకరములు. అహింసావ్రతమే ముక్తికి నిజమైన మార్గము. ఇతరులకు హానిచేయుట కన్నదన్ను దాను హింసించుకొని జినదేవలోకము నార్జించుట పరమధర్మమన్నారు...”
“ఏమిటా మాటలు జననీ! నే నీ వారము దినముల నుండియు నే కారణముననో ఆనందము నందుచు బొంగిపోవుచున్నాను. నా కీ పొడియారిన వేదాంతపు మాట లెందుకు? నా వివాహము విషయమై మాట్లాడుటకు దీసికొని వచ్చినారు. నే నొక పరమపురుషునికై యెన్ని యుగముల నుండియే యెదురు జూచుచున్నట్లుగ దోచెడిది. నేడు నాకా మహాభాగుడు పిష్టపురమున దర్శన మిచ్చినాడు. వాతాపి చాళుక్య సామంతులలో నొక ప్రభువు కుమారు డాతడు. పిష్టపుర రాణివాసపు టుద్యానమున నా వీరుని దర్శనమును హఠాత్తుగ బొందగలిగితిని”
“ఏమిటి? కన్నతల్లీ! ఎవరిని దర్శించితి నంటివి?”
“నా చేయిని గ్రహించి, నన్నీ లోకయాత్రలో దివ్యపథములకు గొనిపోగలిగిన నా నాయకుని సందర్శించితిని.”
“అదేమీ తల్లీ! ఒక సామాన్య సామంతుని నీవు వలచినావా! ప్రేమించినావా!”
“అవును అమ్మగారూ! అవును. అది ప్రేమయో, వలపో, నాకు దెలియదు, ఆతనికి నేనా పవిత్రక్షణముననే నా హృదయమును, నా సర్వస్వము నర్పించుగొంటిని. ఆయన సామాన్యుడగు సామంతుడైనను, చక్రవర్తియైనను నా కాతని స్థితితో నవసరము లేదు. ఆతడు చాళుక్య యువరాజైన విష్ణువర్థన మహారాజుతో గలసి కళింగ గాంగ మహారాజులపై దాడి వెడలినాడు. నా హృదయ మాతని కర్పించితినమ్మా.”
ఆ బాలిక మహారాణి కంఠమును బిగియార గౌగిలించి యామె హృదయమున దన మోము గాఢముగ నదిమి కొనుచు “అమ్మా నా కే మహారాజును, జక్రవర్తియు వలదు. నా కేడుగడయైన యా ప్రియదర్ని నిర్వక్ర పరాక్రములని నా హృదయమున వెంటనే స్పురించినది.” అని డగ్గుత్తికపడ్డ మాటలతో నా బాలిక తన హృదయరహస్యమును వెల్లడించెను.
మహారాణి నిరుత్తరయే యేమియు మాట్లాడనేరక తన కూతురును హృదయమునకు గాఢముగ హత్తుకొన్నది. మఱునాడు నారసింహభట్టుపండితులవారిని విష్ణుకుండిన మహారాజు తమ యాలోచనా మందిరమునకు రప్పించుకొనిరి. “గురుదేవా! ఈనాటి కమ్మాయి హృదయ మార్థ్రత నందినది. చాళుక్య యువమహారాజు ననుచరుడైన యొక సామంత యువకు నమ్మాయి వరించినదట. నాయాశలు భగ్నము లైన”వని దీనదృష్ణుల జూచుచు మహారాజు పలికెను.
నారసింహభట్టు పండితు లాశ్చర్యము వెలిబుచ్చుచు “ఇదేమి ప్రభూ! ఈ సంఘటన యెట్లు ఘటిల్లినది?”
“అమ్మాయిని దుర్మార్గు లెత్తుకొనిపోవుట. గోవూరు నందున్న తా మెఱుగుదురు గదా! వారు గాంగులై యుండవలెను. కళింగగాంగ యువరాజుపై నాకు బూర్తిగ ననుమాన మున్నది. పిష్టపురమునుండి గాంగుల దరిమి, యా నగరమును చాళుక్య విష్ణువర్ధన మహారాజు స్వాధీన మొనర్చుకొన్నప్పుడు, అమ్మాయిని జెర విడిపించిన కొలది దినములకు నామే చాళుక్య సామంతుడైన యువకు నొకని జూచినదట. ఆ ముహూర్తముననే యాతడే తనకు గాబోవు భర్త యని నిర్ణయించుకొన్నదట. తాము దక్క యితరు లెవ్వరును మాకు సరియగు నాలోచన సెప్పువారు లేరు.”
“మహాప్రభూ! మీరు నన్ను ప్రశ్నించిన యీ సమయమే మిక్కిలి యుత్తమము. రాజకుమారికి ఆ యువకుడే భర్త యగును. ఆతడే భావి యాంధ్రసామ్రాట్టు.
“చాళుక్య విష్ణువర్ధన యువమహారాజు కళింగాధిపులను బూర్ణముగ నోడించి వారి నుండి ప్రాభృతము గైకొని యతివేగమున వేంగీరాష్ట్రముపై నెత్తి వచ్చుచున్నాడట.”
“మహాప్రభూ! నేను మంత్రాంగమున నాలోచించినను జ్యోతిష పరముగ విచారించినను దమ రాజ్యములో యుద్దము పొసగనేరదు. పులకేశి మహారాజు వచ్చినప్పుడును దాము వారితో యుద్దము సేయరైరి. మి మ్మా ప్రభువు పదచ్యుతిని జేయలేదు. సరిగదా, మీ రాజ్యమును సుస్థిరము సేయుటయే తన తలంపనియు మీ సహాయార్ధము మాత్రమే తాను తన సేనాపతియగు పధ్వీరాజేంద్రవర్మ నిచ్చట నుంచితి ననియు దెలిపిరిగదా! ఆ భావమునకు నేడేమియు భంగము జరుగదు.”
“ఏ దెట్లు జరుగునో చిత్రరథస్వామి యిచ్ఛ.”
14
వేంగీనగర మారు గోరుతముల పొడవును, నాలుగు గోరుతముల వెడల్పును గలిగిన మహానగరము. ఈ నగరమును నిర్మించినవారు సాలంకాయన ప్రభువులు. సాలంకాయనులు శాతవాహనులలో నొక శాఖవారు. సాతవాహన శ్రీముఖ చక్రవర్తి, రాజబంధువగు కాన్హసాలం కాయనుని ఆంధ్ర కళింగరాజ్యపు టెల్లల కాపాడ, రాజ ప్రతినిధిగా నియమించి,గోదావరీతీరమున నొక దుర్గము నిర్మించుకొని, గోదావరీ తీరమును సంరక్షింప నాజ్ఞాపించెను.
గృధ్రవాడ విషయములో నాలుగు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు కలిగిన మహాసరస్సొకటి సొంపారి యున్నది. ఆ సరస్సులో ననేక చిన్న చిన్న నదులు సంగమించుచున్నవి. వేయి జల శకుంత సంతానజాతు లా కొలనులో నివసించుచు నిత్యకలకలారావ సంగీత మాలపించుచుండును. షోడశ పత్రములు, ద్వాత్రింశత్ పత్రములు, శతపత్రములు నగు కమలములును, రంగురంగుల కలువ పూవులును ఆ సరస్సునకు అలంకారములై పరీమళములు వెదజల్లుచుండును.
ఆ కొలని పడమటి తీరమున పద్మానది సంగమించిన తీరభూమిని రెండు యోజనముల పొడవును, నొక యోజనము వెడల్పును గల నగరమును కాన్హసాలం కాయనుడు నిర్మించినాడు.
సాలంకాయనుల కులదైవము చిత్రరథస్వామి. శాతవాహన సామ్రాజ్య మంతరించిన వెనుక యిక్ష్వాకులతోబాటు సాలంకాయనులు రాజచిహ్నమైన 'భట్టారక' శబ్దమును వహించిరి.
విష్ణుకుండిన మంచనభట్టారక మహారాజు, కొమరిత అంశుమతి శత్రువుల బారినుండి తప్పించుకొని క్షేమముగ వేంగీపురము చేరినందులకు చిత్రరథస్వామిని స్వయముగ నర్చింప సకల సామంత సేనాధిప రాజోద్యోగి సహితముగ పాదచారియై దేవాలయమునకు బయలుదేరెను. సింహ లాంఛిత విష్ణుకుండిన పతాక మెగురుచుండ, నా ధ్వజమును మోయుచు పట్టపుటేనుగు ముందు నడువ, వందిమాగధులు, నా వెనుక వేత్రహస్తులు 'జయజయ' ధ్వానములు సలుపుచు బారులుతీర్చి నడుచుచుండిరి.
వారివెనుక గంగా గోదావరీ కృష్ణా జలములు గల స్వర్ణకుంభముల వహించిన ధవళవృషభముల నడిపించుచు, వేదమంత్రములు పఠించుచు బ్రాహ్మణులు నడుచుచుండిరి. వారి ననుసరించి, ముఖపతులు, దళపతులు, సేనాపతులు నడచుచుండిరి. సకల రత్నాలంకారయుక్తమైన సామ్రాజ్య శ్వేతచ్చత్రము పట్టి ఛత్రధారులు నడచుచుండ నా ఛత్రము క్రింద మహారాజు, రాజగురువు కైదండగొని, మదగజమువలె గంభీర యానమున నడచుచుండెను. మహారాజు వెనుక సామంతులును, రాజబంధువులును ననుగమించుచుండిరి. పూజాద్రవ్యములు గ్రహించి బ్రాహ్మణ పుణ్యస్త్రీలా వెనుక వచ్చుచుండిరి. ఎద్దులబండ్లు శతపత్రములు మోసికొనుచు వచ్చుచున్నవి.
మహారాణియు రాజకుమారి అంశుమతియు శిబికలపై బరిచారికాజనములు గొలిచిరా జిత్రరథస్వామి కొలువునకు వెడలుచుండిరి. దేవాలయ ప్రాంగణము, ప్రదక్షిణపథము, కల్యాణమండపము, ముఖమండపము, గర్భాలయమును మనోహరా లంకారములతో ధగధగ వెలిగిపోవుచుండెను నాగస్వర కాహళ, ముఖవీణ భేరీ భాంకారాది మంగళవాద్యములు, దశదిశల నింపివేయుచున్నవి. ఒకవైపున నాట్యాంగనలు నాట్యకళావైదుష్యమును బ్రదర్శించుచుండిరి.
మూలవిరాట్టైన చిత్రరథస్వామి నవగ్రహ, అష్టదిక్పాలకాది పరివారదేవతలతో ఛాయాసంజ్ఞాసమేతుడై యా దేవాలయమున వేంచేసియుండెను. క్షేత్రపాలకుడైన కొలని భట్టారకేశ్వరుని యుపదేవాలయ మామహాక్షేత్రము నందున్నది. ఒకచో గొందరు బ్రాహ్మణు లాదీత్య మంత్రమును జపించుచుండిరి.
దేవాలయమంతయు నొక మహారథమువలె నిర్మింపబడినది. ముఖమండపము ముందు, నేనుగులంత పెద్దవియైన యేడు రాతిగుఱ్ఱములు గంభీర శిల్పాకృతిగలవి, ఆకాశమున నెగిరి పోవుచున్నట్లు విన్యసింపబడినవి. పోని దోలబోవుచున్నట్లు గరుడాకృతిని ననూరుడు మునిమండప పరోభాగస్థమగు నొక చిరువేదికపై అధివసించి యున్నాడు. చిత్రరథస్వామికి వైభవముగ బూజలు జరిగిపోయినవి. ఆ దినమున మహారాజు రాజబంధుల కందరకును విందు చేసినాడు. బ్రాహ్మణులకు షోడశోపచారములును షోడశ మహా దానములును సలిపినాడు. ఆ మహానగరమునం దుండుజనాలయ సంఘారామాదులలో బౌద్ద సంఘారామ చైత్య జినాలయ సంఘారామాదులలో బౌద్ధ సంఘారామ చైత్యాలలో బుద్ధదేవ జినదేవార్చనలు, భిక్షుక భక్తజన సమారాధనలు, సంఘారామములకు దానములు విష్ణుకుండిన మహారా జర్పించినాడు.
15
ఆ సాయంకాలము చాళుక్య విష్ణువర్ధనుడు తన సైన్యములతో గోదావరిని దాటి, గోపాదక్షేత్రమున దండు విడిసియున్నాడనియు కోనరాష్ట్రమునుండి హైహయు లా యువరాజును సందర్శించి, సామంతప్రాభృతములను సమర్పించినారనియు, మంచన భట్టారక మహారాజునకు వార్త వచ్చినది. ఆ విష్ణుకుండినమహారాజు చాళుక్య యువరాజు రాకకు దమ యానందము వెలిబుచ్చుచు, నగరమంతయు బ్రజ అలంకరింప వలెనని యాజ్ఞ దయచేసినాడు. చిత్రరథస్వామి మహోత్సవముల కొఱకు బట్టణ మిదివరకే సుందరతరముగా నలంకరించుకొన్నారు నగరప్రజలు.
ఆ మరునాటి యుదయముననే వేంగీమహాపురమున కుత్తర గోపురముకడకు విష్ణువర్ధనుడు తన సైన్యముల నడిపించుకొని వచ్చెను. నగర బాహిరోద్యానముల సైన్యములకన్నింటికి శిబిరము లేర్పరుపబడినవి. యువమహారాజు నంగరక్షక బలముమాత్రము విష్ణువర్ధనునితో నగరము బ్రవేశించినది.
గోపురద్వారము కడనే విష్ణుకుండిన రాజ్యమహామంత్రి ఆదిత్యకీర్తియు, రాజగురువగు నారసింహభట్టులవారును, సర్వసేనాధిపతియగు విజయేంద్రగోపుడును రాజోద్యనులతో, సామంతులతో నెదుర్కొని జయములు బలికినారు. బ్రాహ్మణులు విష్ణువర్ధనునకు బూర్ణ కుంభ మిచ్చినారు. లాసికలు చాళుక్యునకు నారతు లెత్తినారు. చాళుక్య యువమహారాజునకు మహాక్రీడామందిరమును విడిదిగ నేర్పాటుచేసినారు. ఆ సాయంకాలము కోటలో, రాజసభామందిరములో విష్ణువర్ధన యువమహారాజునకు మంచన భట్టారక మహారాజు స్వాగతమిచ్చి తన యర్దసింహాసనమున గూర్చుండబెట్టు కొనినాడు.
“చాళుక్య యువమహారాజా! తమ యన్నగారు చాళుక్య చక్రవర్తి పధ్వీవల్లభ పులకేశి మహారాజాధి రాజులును, తమ చిన్నన్నగారు ఘూర్జర మహారాజు జయసింహ మహాప్రభువును క్షేమముగ నున్నారని తలంతును.”
“అన్నగార లిరువురును క్షేమము మహాప్రభూ! కళింగగాంగులు నాతో యుద్ద మొనరింపకయే సామంత ప్రాభృత మర్పించుట నాకు వింతగనే కన్పించినది. అయినను జాగ్రత్త కొఱకు బిష్టపురమున నొక మహాసైన్యముతో నాకు బితృసమానుడగు కాలకంపన ప్రభువును నిల్పియే వచ్చినాను.” “అవును మహాప్రభూ! కాళింగు లెప్పుడును దురాశ కలవారు. మా రాజ్యమునకును, వారి రాజ్యమునకును తీవ్రమైన పోరాట మేన్నండును లేదు. గోదావరీనది సరిహద్దుగ నేర్పరచుకొనుచు, నెన్నియో పర్యాయములు వేంగీ రాజ్యమునకును, కళింగరాజ్యమునకును సంధి జరుగుచుండెడిది ఆ సంధిని భగ్నపరచినవా రెప్పుడును గాళింగులే. యువ మహారాజా! మీరు మా వేంగీనగరమును దమ యావాస నగరముగ జేసికొనుడు. ఇచ్చటనుండియే తా మటు ఈశాన్యమున గళింగగాంగులను, దక్షిణమున బల్లవులను అణచి యుంచువచ్చును.”
“కృతజ్ఞుడను మహాప్రభూ! విష్ణుకుండిన సామంతులే కొందరు తిరుగుబాటులు చేయుచున్నారు. గృధలవాడ రాష్ట్రాధిపతి పల్లవ వంశీయుడు. తాను కాంచీపుర పల్లవ మహారాజునకును, నిటు తమకును గప్పము కట్టక, తాను భట్టారక శబ్దము వహించి స్వాతంత్ర్యము బ్రకటించుకొన్నాడని వేగువచ్చినది. అట్టి వారందరు తిరిగి తమకు గప్పము గట్టగలరు.”
ఈ విధముగ గుశల ప్రశ్నము లనేకములు జరిగినవి. ఆ వెనుక విష్ణువర్ధనునకు మహారాజు సగౌరవముగ వీడ్కోలిచ్చెను. ఆ రాత్రి విష్ణువర్ధనుడు తన విడిదియం దొంటరిగ గూర్చుండి వివిధాలోచనములకు లోనయ్యెను. తాను విష్ణుకుండిన మహారాజుకడ గప్పము గైకొనుటయా! మానుటయా! తాను పిష్టపురమునా, లేక విష్ణుకుండిన నగరమునా స్థిరనివాసము చేసికొనుట! పల్లవులకు బుద్దిగరపుటకు దాను కాంచీపురమువఱకు బోవలయునా, లేదా! అప్పటి కైదు సంవత్సరములకు పూర్వము పల్లవులు, చోళులు, పాండ్యులు నందరును 'దాసోహ'మ్మని కప్పములు గట్టుకొన్నారు తన అన్నగారికి.
అన్నగారు “తమ్ముడా! ఎప్పుడో యొకనాడు ఆంధ్ర మహాసామ్రాజ్య భాగమైన చళుక రాష్ట్రమునుండి వచ్చిన వారమే మనము. ఆంధ్రరాజులు పౌరుషవంతులు. వాతాపి నగరమున నుండి ఆంధ్ర రాజ్యములను లోబరుచుకొని యుండుట యెంతటి వీరుడైన వానికిని దుస్సాధ్య మగుచున్నది. పెద్దతమ్ముడు జయసింహప్రభువు ఘూర్జరమున సుస్థిరమగు రాజ్యమును నెలకొల్పి యున్నాడు. నీవు తూర్పుతీరమున మూడవ చళుక్య రాజ్యమును స్థాపింపుమయ్యా! నీకు శ్రేయమగును" అనుచు దన్నాశీర్వదించినారు. తానట్టి రాజ్యమును నిర్మింపగలుగునా!
తనకు సరియైన సైన్యమున్నచో, నెదిరి యెట్టి దిట్టయైనను యుద్ధమున దా నసమాన విజయ మొందగలడని యాతని కెప్పుడును ధైర్యమే. తా నింతదనుక నన్నగారికి ప్రతినిధిగమాత్ర మున్నాడు. రాజప్రతినిధిగనుండి పాలించుట వేరు, స్వతంత్ర రాజ్యమును స్థాపించి పరిపాలించుట వేరు.
ఇంతలో నాతనికి బిష్టపుర రాజోద్యానమున గనబడిన బాలిక స్మృతికి వచ్చెను. ఆతడు పొట్టివాడై యెప్పుడును బాలకుడుగ గన్పించుటచే దన బందుగులు తనయందు గనబరుచు బాలభావమువలన నాతని హృదయమున నాలోచనలెప్పుడును సుడిగుండములు తిరుగుచుండును. ఈ భావ సంఘాతముల వలననే యొకరిద్దరనిన తప్ప మనుష్యులన్న నాతనికి బరమజుగుప్స. ఇంక స్త్రీలన్న నాతనికి మరియునేవము. సాధారణ రాజకుమారులు పరిచర్యలన్నియు దాసీజనముల వలననే పొందుదురు. విలాసవతులును, నందకత్తెలను నగు బరిచారిక లా రాజకుమారుల కనుసన్నల మెలగు చుందురు. కాని విష్ణువర్ధనుడు శైశవమునందే తన్ను బెంచు దాదులను నిరసించువాడు. ఆడువా రాతని కంట బడగూడదు. అట్లని యాతడు స్త్రీవిద్వేషియు గాడు.
ఇట్టి చిత్తవృత్తి గలిగిన విష్ణువర్ధను డెటుల పిష్టపురమున నాబాలికను బలుకరింపగలిగినాడో యాతనికే ఆశ్చర్య మొదవినది. కళింగ జైత్రయాత్రా దినములలో, నప్పుడప్పుడా బాలిక యాతని మనఃపథమున బ్రత్యక్షమగుచుండెడిది. ఆ భావము నాతడు వెంటనే సాలెగూటి దారములను దులిపివేసినట్లు దులిపివేసికోనువాడు నేడు వేంగీపుర మునకు వచ్చుటచే గాబోలు తన యంతర్వృత్తియం దట్లు చొచ్చుకొని యా బాలికను గూర్చిన తలపులు వచ్చుచున్నవి. ఆ బాలిక యిప్పు డేమి సేయుచుండును! రాజకుమారితో మంతనము సలుపుచుండును గాబోలు. మహారాజులకు మాత్రమే అనన్య సౌందర్యవతులగు బాలిక లుద్భవింతురను కొననక్కరలేదు. తక్కువలోతుగల సముద్ర భాగములందే అనన్యమైన ముతైములు దొరకును.
ఏమిటికో యీ యాలోచనలు తనకు! తనకును నా బాలికకును నేమి సంబంధము! తూర్పుతీర రాజ్యములలో బలవత్తరము పల్లవసామ్రాజ్యము. అది యెప్పటికప్పుడు ప్పొంగుచు నుప్పెనవలె బైకెగయుచు, బ్రాంతీయరాజ్యములపై విరుచుకొని పడుచుండును. పల్లవులవలన నెన్ని రాజ్యము లస్తమించిపోలేదు! త్రినయన పల్లవుడుగదా, తన ముత్తాత తాతగారైన విజయాదిత్యునితో యుద్ధములు చేసి యనేక పర్యాయములోడి తుద కాతని జంపివేసెను ఏమైనను బల్లవులు దండార్హులు. వారిని గాంచీపుర రాజ్యములోనే బంధించి వేయవలసి యున్నది. ఆతడొక నిట్టూరుపు విడిచినాడు.
16
చాళుక్య విష్ణువర్ధనుడు రాజోద్యానమున వివిధాలోచనల పాలయిన సమయముననె, అంశుమతీకుమారి తన యంతఃపురసౌధోపరిభాగమునందు రత్నకంబళముపై నధివసించి, దిండ్లనానుకొని, యా ఫాల్గుణ శుద్ద దశమీచంద్రు నవలోకించుచు, వెన్నెలలు చెట్లకొమ్మలపై ఆకులపై నృత్యము చేయుట గనుగొనుచు నాలోచనాధీనయైనది.
తండ్రిగారికి విష్ణువర్ధన మహారాజును జూడగనే మనస్సార్ధ్రత జెందినదట! ఈ మహావిక్రముడు తన కల్లుడైనచో విష్ణుకుండిన చాళుక్య వంశ సంజాతులైన మహాపురుషు లుద్భవించి, లోకోత్తరమైన మహదాంధ్ర సామ్రాజ్యము నిర్మింతురని యాశించుచుండిరట!
అందుకు తల్లిగారు “ఒకనాడు యావదాంధ్రసామ్రాజ్యము జగద్వైభవముగ నేలిన విష్ణుకుండిన వంశమునకు జివరికొమ్మగ నుద్భవించిన అంశుమతి యొక సాధారణ సామంతబాలుని పరిణయమాడుట తమ రాజవంశమునకు దీరని కళంక” మని పలికిరట.
ఈ సంభాషణ మంతయు దన యాంతరంగికురాలగు చేటిక యోర్తు తనకు నివేదించినది. ప్రత్యూషము నుండియు దా నానందముచే నుప్పొంగిపోయినది. ఏదియో శుభము తనకు సన్నిహిత మగుచున్నదని దినమంతయు దన కంతర్వాణి బోధించి నట్లయినది. చిత్రరథస్వామి పూజలో దివ్యతేజస్వరూపుడైన యా దేవుడు జాజ్వల్యమాన కాంతులు ప్రసరించుచు దనకు బ్రత్యక్షమైనట్లైనది. ఇంతలో జలిపిడుగువలె దన తల్లిదండ్రుల సంభాషణ తెలియవచ్చినది. ధర్మహృదయ యగు స్త్రీకి దనకు గారాని పురుషునియందు మనస్సు లగ్నమగు టెట్లు!
"రాజకుమారీ! ఒక్కరు నేమి సేయుచున్నారమ్మా! పరిచారిక లెవ్వరు నుండరాదని యాజ్ఞ పెట్టితిరట” యనుచు చెలి మాధవీలత యచటకు వచ్చినది.
“మాధవీ! వచ్చితివా! పరిచారికల పొడిమాటలు నాకు విసువు గలిగించుచున్నవి. ఆకాశమును, జంద్రుడును మన కందిచ్చు భావములు నిశ్శబ్దములయ్యు మధురములు గదా!”
విష్ణువర్ధనమహారాజు మన మహాసభకు వచ్చినప్పటి వైభవమును జూచుటకు మీరు రాకపోతిరి
“అవును మాధవీ! విష్ణువర్ధన మహారాజుతో గలిసి యా బాలకుడు వచ్చునో రాడో! నా హృదయమంతయు నీకు సంపూర్ణముగ దెలిపికొనియుంటిని. నా హృదయ మిసుమంతయేని దెలియని తల్లిదండ్రులు నన్ను విష్ణువర్ధన మహారాజున కీయ సంకల్పించినారట!”
“ఔనమ్మాఔను. మనము గోవూరునుండి వచ్చినది మొదలీ విషయమును గురించి యంతఃపురము నందు భాషించుచున్నారట. రాజుల రహస్యము లన్నియు బరి చారికలకు దెలియకుండుటెట్టు! మహారాజున కిది గాటమగు గోర్కెగా బరిణమించినది. మహారాణియు దలయూపిరట. నారసింహభట్టులవారు, మహారాజుగారి యాలోచన లెస్స యనిరట. విష్ణువర్థన మహారాజు మన నగరమునకు విచ్చేయుటయు నందుకు శుభశకునమట! కాని, వీరందరికి నొక పరమరహస్యము తెలియదు.”
“ఏమిటది?”
“అది నాకనుమాన మాత్రము సుమా రాజకుమారీ! నే నది తమకు విన్నవించుట మంచిది కాదేమోయని సందేహించుచున్నాను.”
“మాధవీ! నీవును నేనును జిన్నతనము నుండియు నొక్కచో బెరిగిన వారము. ఒక గురువునొద్ద విద్య నేర్చిన వారమును. ఒకచో బండుకొంటి మొకచోట నిదురగూరితిమి. నీకును నాకును రహస్యము లెక్కడున్నవి!”
“అవునమ్మా అవును. కాని, యెంత స్నేహము సల్పినవారమైనను తమతమ ప్రణయవిషయముల నొకే మార్గమున నెట్లు సంచరించగలము! నాకు దెలిసిన విషయము నే ననుమానించుచున్న విషయమును నీ హృదయమున నినుపముల్లువలె గ్రుచ్చుకొను నేమోయని భయము నందుచున్నాను.”
“ఆ రహస్య మెప్పుడైన నాకు గంటకమగునుగదా! ఈ పూట దాని బారినుండి నీవు తప్పింతువు. రేపది వేఱొక మార్గమున నాకు ఎదురగును. నా ప్రాణమిత్రమవగు నీ నోటనుండి యా మాటవిని యా బాధ నీ సమక్షమున ననుభవించుట నాకు సుకరమగును.” “ప్రాణసఖీ! ఈ రహస్యము నీకు బాధ గలిగించునది కాదు. దీని నంటివచ్చు పరిణామములు నీకు బాధా కరములు గావచ్చును. అదే నా యాలోచన. విష్ణువర్థన మహారాజు చాలా బొట్టివాడు. తాను చాళుక్య చక్రవర్తికి దమ్ముడగుటచే నేరాజకన్య యైన దన్ను వివాహమాడుటకు సమ్మతించునేగాని, ఇసుమంతయుదన్ను ప్రేమించబోదని భయము వారిని పీడించుచున్నదట. అందుకని ఆ మహారా జింతవరకును వివాహము చేసికొనుటకు నిరాకరించెనట. ఈ విషయము మన పరిచారికలలో గనకాంగి యనునది గ్రహించి నాకు జెప్పినద."
“ఈ విషయము దానికెట్లు తెలియవచ్చినది?”
పిష్టపురము విష్ణువర్ధనుని హస్తగతమైన రెండవ దినమున మన పరిచారిక లందరును గోవూరునుండి పిష్టపురమునకు వచ్చిరి గదా!”
"అవును.”
“ఆ వచ్చినవారిలో గనకాంగియు నున్నది. విష్ణువర్ధను సంగరక్షక దళపతులలో నొక డామె కీ రహస్యము తెల్పినాడట.”
“ఇది నిజమైనచో నాకు బాధ యెట్లగును?”
“నిజమైనచో నీకు బాధగలుగదు. ఇది వట్టియూహా జనితమైనచో నీ మనస్సంకటమునకు బరిమితి యుండదు.”
“విష్ణువర్థన మహారాజంత పొట్టివాడా!”
“అవును! అందుకనియే వారికి కుజ్జవిష్ణువర్ధనుడని పేరు వచ్చినదట.”
“అందుకనియే కాబోలు -”
“ఏమిటందుకనియే కాబోలు?. నాతో జెప్పగూడదు కాబోలు”
“నీకు జెప్పక దాచగలనా! పిష్టపురమును చాళుక్యులాక్రమించిన నాలుగు దినములకు గదా నాకు బూర్తిగా బలము కలిగినది! ఒక దినమున నేనంతఃపురోద్యానమున విహరించుచుంటిని. అప్పుడొక యిరువది యిరువదొక సంవత్సరముల యీడుగల యువకు నొకని దర్శించితిని, ఆయన నామము ప్రియదర్శి' యట.”
“ఇదంతయు నాకు దెల్పితివి కాదటమ్మా!”
“ఆతనియందు నా మనస్సు లగ్నమైనదని చెప్పితిని. ఆ మహాభాగుడును దన యీడుకు దగిన పొడుగరి కాడు, అదియే నేను తెల్సునది.”
“నీ యుద్దేశము విష్ణువర్ధన మహారాజు తాను బొట్టి వాడగుటచే తన పరివారమున గూడ బొట్టివారినే చేర్చు కొనుచున్నాడని.......!”
“పొట్టిపొడుగులకును బ్రేమకును సంబంధమేమి చెలీ!”
“ఇంతకును నెవరో యా సామంతరాజకుమారుడు!”
ఆకసమున జిరుమబ్బులు పొడసూపినవి. అవియు వెన్నెలలో దడియుచు దెల్లందనమును దాల్చినవి. ఇంతలో “భర్తృదారికకు భోజనమునకు వేళయైనది, వడ్డనకు నాజ్ఞ వేడుచున్నాను” అని పరిచారిక యొకర్తు మనవిచేసికొన్నది. “వచ్చుచున్నాము. వడ్డనకు సన్నాహములు చేయవచ్చు” నని పరిచారికకు సెలవిచ్చి యంశుమతి లేచినది. మాధవీ లతయు లేచినది.
17
విష్ణువర్ధనుడు మహావేగముతో సైన్యములను నడిపించుకొనుచు రెండుదినములలో గృష్ణాతీరమునకు వచ్చి విజయవాటికను ప్రవేశించెను. ఆ నగరమున వేంచేసియున్న మల్లేశ్వరస్వామిని గనకదుర్గాంబను అర్చించి, బౌద్ద సంఘారామములకు నివేదన లర్పించి, యా సాయంకాలముననే కృష్ణ దాటెను.
కాలకంపనప్రభువుకుమారుని పట్టవర్థన జయందిని దనకు బ్రతినిధిగ గొలది సైన్యములతో విజయవాటిక యందుంచి విష్ణువర్థనుడు ఇంకను మహావేగమున కర్మకరాష్ట్ర భాగములైన వెలనాటిని, గొండపడమటి రాజ్యమును, గొండతూర్పురాజ్యమును, పోక రాష్ట్రమును జయించు కొనుచు, దక్షిణమునకు సాగినాడు. విష్ణువర్ధనూ నెదురులేని యా వేగమున సామంతు లొకరి వెనుక నొకరాతనికి పాదాక్రాంతు లగుటయ బల్లవ మహారాజగు రాజేంద్రవర్మ కెప్పటి కప్పుడు వేగు వచ్చుచునే యున్నది. మహేంద్రవర్మ రెండవ పులకేశి నెదిరించి యోడిపోయినాడు. పులకేశి పృధ్వీవల్లభునకు దాను గప్పము గట్టినాడు. ఆతడు మహా విక్రముడు. ఇప్పుడు మహేంద్రవర్మ కుమారుడు యువమహారాజు నరసింహవర్మ యనేక దిగ్విజయములు గాంచుచు దక్షిణమున జోళులను, పడమట గాంగువాడి రాష్ట్రమున దక్షిణ గాంగులను, వనవాసి కదంబలను, వాతాపిచాళుక్యులను, ఉత్తరమున విష్ణుకుండినులను దమదమ రాజ్యపుటెల్లలలో నిలువరించి, దండ్రి మహేంద్రవర్మ మహారాజు కాంచీపురమున సుఖ సంవిధానమున రాజ్యముసేయు నరువు చేసినాడు.
యువమహారాజు చాళుక్య విష్ణువర్ధనుండు కృష్ణదాటి పల్లవ సామ్రాజ్యమును బ్రవేశించి నిరవరోధవేగమున వరదలు పొంగిన గంగవలె బ్రవహించి వచ్చుచున్నాడు. ఆ రాష్ట్రములకు నంగరక్షకదళాధిపతి బుద్ధవర్మను సామంత పట్టాభిషిక్తుని చేసినా డతడు. వనవాసి కదంబులును, కందనోలు చాళుక్య రాజప్రతినిధి పులకేశి పృధ్వీవల్లభ మహారాజు మూడవ కుమారు డాదిత్యవర్మయును గలసి పల్లవరాజ్యముపై నెత్తిరాగా, యువరాజు నరసింహవర్మవారి నెదిరించుటకు వెడలియుండెను. ఆ సమయముననే పిట్టపిడుగు వలె నీ గుజ్జురాజు పల్లవ రాజ్యమును సగముభాగమాక్రమించుకొని విక్రమసింహపురము వరకును వచ్చినాడు. పల్లవ మహారాజు మహేంద్రవర్మ వృద్దుడు. ఆ మహారాజు సేనాపతులలో వ్యూహరచనా సమర్థుడై, విష్ణువర్థను నెదుర్కొను పోడిమీ గల వీరు డెవ్వడును లేడు.
మహేంద్రవర్మ గత్యంతరములేక విష్ణువర్ధనుడు కాంచీపురముపై విరుచుకొని పడనున్నాడని, కుమారుడైన నరసింహవర్మకు వేగు పంపినాడు. నరసింహవర్మ అడకత్తెరలో పోకయై గజిబిజి పడిపోయెను. ఈ వైపు కదంబులను, ఆదిత్యవర్మను జయింపకుండ విష్ణువర్ధన చాళుక్యు నెదిరించుటకు బోయినచో వీరును వారును గూడ గాంచీపురముపై నొక్కసారిగ విరుచుకొని పడుట సంభవించును. తానును తన సైన్యములును హతులై నాశన మందవలసి వచ్చును. కావున దనకు గర్తవ్యము? కదంబులను, జాళుక్యులను నోడించుటయే. ఆ వెనుక విష్ణువర్ధనుని పని పట్టించవచ్చును. ఆ యాలోచననే నరసింహవర్మ తండ్రికి వేగు బంపినాడు. విష్ణువర్ధనుడు పుట్టెడు బుద్దుల పొట్టివాడనియు జండ విక్రముడనియు నాతని ధాటిని నీ సమయమున నెవ్వరు నాపలేరనీయు గావున విష్ణువర్ధనుని సగౌరవముగ దండ్రిగా రాహ్వానించి కొంచెము పెద్దమొత్తమును సమరాజోప గ్రాహ్యముగ నర్పించుడనియు, నుత్తముడైన యతిధి వచ్చినప్పుడు సేయదగు వినోదములన్నియు జేయింపుడనియు గుమారుడు నరసింహవర్మ తండ్రికి రహస్య సందేశ మంపెను.
కావున విష్ణువర్ధనుడు విక్రమసింహపురమునకు వచ్చునప్పటికి నగరపాలకులు, రాజప్రతినిధియైన సేనాపతియు, విష్ణువర్ధను నెదుర్కొని, సర్వోపచారముల నతని కర్పించుచు గోటను ప్రవేశపెట్టిరి. మూడుదినములైన వెనుక పల్లవ ప్రధానియు రాజపురోహితుడును, పల్లవ మహారాజు ప్రేమతో విష్ణువర్ధను నాహ్వానించుచున్నట్లున్న లేఖను గొనివచ్చిరి.
విష్ణువర్ధనున కేదియో అనుమాన ముదయించెను. చాళుక్యులకు నిత్యవిరోధియైన పల్లవేంద్రు డొక్కడు తన్నిట్లు సగౌరవముగ నాహ్వానించుటలో నంతరార్థమేదియో యుండవలెనని యాతడనుకొనెను. ఇంతలో నాతని మనసున మెరుపు మెరిసినట్లు పల్లవ రాజు తన కంపిన యాహ్వానమున కర్థము గోచరించినది. తనయన్న పులకేశి చక్రవర్తి మూడవ కుమారుడు పదునారేండ్లవాడయినను వీరవిక్రముడు. ఆ బాలకునోడించి, తొల్లిపరాభవము దీర్చుకొనవలెనని పల్లవ యువరాజు నరసింహవర్మ కందనోలుపై (కర్నూలు) దండు వెడలినాడు. ఆదిత్యవర్మ మేనమామలైన కదంబులను సహాయమడిగి సైన్యముల రప్పించుకొన్నాడు.
చాళుక్యులను స్నేహితులుగ మహేంద్రవర్మ పరిగణించినచో, యువరాజగు నరసింహవర్మను కుమారుడగు నాదిత్యవర్మపై బంపుటేల! దీనికి బ్రతి తాను కాంచీపురముపై దండెత్తుటమాని, పడమటకు జైత్రయాత్ర మరలించి తొందర తొందరగ బ్రయాణము సాగించుచు బది దినములలో, గందనోలు ముట్టడించి, యుద్దము సాగించుచున్న నరసింహవర్మపై బడుటయే! అనుకొనుట యేమి ఆతడట్లొనరించినాడు.
నరసింహవర్మ చేయునదిలేక పరాజితుడ నైతినని ఖడ్గమర్పించినాడు. విష్ణువర్ధను డన్నకుమారు నాదిత్యవర్మను గలిసి, యాతని గాఢముగ గౌగిలించుకొని, నరసింహవర్మ ఖడ్గము నాతనికి బహూకరించెను.
విష్ణువర్ధనుడు తన ద్వితీయోపసేనాధిపతి ఇంద్రదత్తుని సైన్యాధిపతిగజేసి, విక్రమసింహపురమున (నేటి నెల్లూరు) గావుంచినాడు. మూడువంతుల సైన్యమును విక్రమపురము ననే యుండ నేర్పాటుచేసినాడు. ఏనుగులు, గుఱ్ఱములు, భూషణములు విష్ణువర్ధను నకర్పించి, నరసింహవర్మ కాంచీ పురమునకు దరలిపోయినాడు. విష్ణువర్ధను డాతని వెనుకనే చళుక రాష్ట్రమున నధిపతియొద్ద కప్పముగొని, పదునైదు దినములలో విక్రమ సింహపురము తిరిగి వచ్చెను.
పల్లవులతో దనకు విరోధము లేదనియు, పోక రాష్ట్రమునకు దక్షిణమున పల్లవులు నిరాటంకముగ బరిపాలించ వచ్చుననియు దన యన్నగారు చాళుక్య చక్రవర్తి తన్నాంధ్ర చాళుక్య రాజ్యమును స్థాపింప నాశీర్వదించి పంపినాడనియు, దక్షిణకళింగము, వేంగీరాష్ట్రము, పోకరాష్ట్రము నీమూడు రాష్ట్రములను గలిపి వేంగీపురము రాజధానిగ దన రాజ్యమును స్థాపింప బోవుచుంటిననియు, విష్ణువర్ధమడు పల్లవులకు సందేశ మంపినాడు.
18
ఉత్తర కళింగరాజధానియైన కళింగ నగరమున కళింగ యువరాజగు దానార్ణవు డంశుమతీరాకుమారిని పిష్టపురమున నా బాలికకు దెలియకుండగనే తానుజూచిన విషయము నొక్కడు దన యభ్యంతరమందిరమున గూరుచుండి యాలోచించుకొను చుండెను. ఆమె జగదేకసుందరి. ఆమె సర్వకళాభిజ్ఞ, శారద రాకాపూర్ణిమనుగూడ నలుపుసేయగల కాంతిగలది. ఆమెను వివాహమాడ తాను గాఢముగ సంకల్పించుకొని యుండెను. తాను విన్నది, తాను జూచిన దానిలో సహస్రాంశమైన లేదని పిష్టపురమున రాణివాస మందు బంధింపబడిన యా బాలికను జూచినప్పుడే యనుకొన్నాడు. విష్ణువర్ధనుడు వచ్చి పిష్టపురము ముట్టడించు గడబిడలో నాత డా దుర్గమునుండి తప్పించుకొని కళింగమునకు పారిపోయినాడు."
విష్ణుకుండిన మంచనభట్టారకునకు గొమరులులేరు. ఆ ప్రభువునకు దరువాత సింహాసన మెక్కగల సన్నిహిత జ్ఞాతులును నెవ్వరులేరు. ఒక్కగానొక్క కొమరిత మాత్రమున్నది. ఆమెను వివాహమాడినవారి కారాజ్యము హస్తగతమగును. కావుననేకదా పల్లవయువరాజు నరసింహ వర్మయు నా బాలికను నర్ధాంగిని జేసికొన వాంఛించు చున్నాడు. ఆ మఱుగుజ్జు విష్ణువర్థన చాళుక్యుడుగూడ నిట్టి కాంక్షతోడనే తూర్పుతీరమునకు వచ్చియుండవచ్చును. లేనిచో, నంత పటాటోపముగ పిష్టపురమును బట్టినట్లు నంశుమతిని విడిపించినట్లును నాటకమాడు టెందులకు! విష్ణువర్ధనుడు వేంగీపురముపై దాడి వెడలుచున్నాడని తాననుకొనుటవలన గదా తాను బ్రమత్తుడై యుండినాడు! అందు వలననే కళింగసైన్యములును బ్రమత్తములై యుండినవి.
చోళులను బాండ్యులను ననేక యుద్దముల నోడించిన పల్లవ యువరాజు నరసింహ వర్మయు వోడిపోయినాడని, వేగు వచ్చినదిగదా! అందువలన పొట్టిచాళుక్యునకు గర్వము మెండైనది. ఉత్తరదేశ చక్రవర్తి శిలాదిత్యహర్షవర్ధను నోడించగల మేటి పులకేశి పృధ్వీవల్లభు నెదుట తనతండ్రి నిలువలేనిమాట నిజము కావచ్చును. కాని ఈ కుబ్జుడు గూడ బ్రతాపము నెరపుటయేనా? అంశుమతీ బాల వానినెట్లు వరించును! రాయబారములు నిష్పలములైన మీదనే తానిట్లు బలవంతముగ నామె నెత్తుకొని వచ్చుట కేర్పాటు చేయవలసి వచ్చినది. తానా బాలను వివాహమాడినచో గళింగ గాంగ సామ్రాజ్యము కృష్ణాతోయముల నొరసి మహదాంధ్ర సామ్రాజ్యమగును.
తాను కళింగసైన్యము గట్టిపరుపవలయును. ఇంకను బెక్కుసైన్యముల బెంచవలసియున్నది. గాంగుల ప్రతాప మెట్టిదో, చాళుక్యు డిప్పటికైన జవి చూచునుగాక!
ఈ రీతిగ దానార్ణవుని హృదయమున నంశుమతీ కుమారి విశ్వరూపమెత్తినది. మున్ను శ్రీకృష్ణుడు రుక్మిణి దెచ్చినట్లాతడు అంశుమతీ బాలను గొనిరా నిశ్చయించెను. భారతీయస్త్రీ దాను వివాహమాడిన భర్తను ప్రేమించి తీరును. బలవంతముగనైనను నంశుమతీకుమారిని వివాహ మాడగల్గినచో దన యదృష్టము మిన్నుముట్టును.
ఒకనాడు దానార్ణవుడు తన యాంతరంగిక మిత్రుడగు కుంభమిత్రుని బిలచి, “మిత్రమా నీవు అంశుమతీ రాకుమారిని పిష్టపురమును జేర్చునపుడామె దగ్గరి బందుగురాలును, నందమున నామెకు మాత్రమే తీసిపోవు మాధవీలతకాకుమారిని జూచియుంటివి గదా! ఆమెనుగూర్చి నీ వేమాలోచించుచుంటి”వని ప్రశ్న జేసెను.
“నేను ఏమాలోచించు చుంటిని! ప్రభువులయాజ్ఞ నేరవేర్చుటయే నా యాలోచన.”
“అవును. నీవు ప్రభుభక్తి పరాయణుడవు, అయినను నా బాలికను జూచితివిగదా యని యడుగుచున్నాను.”
“చూచితిని ప్రభూ! మీరు అంశుమతీ రాకుమారిని బ్రేమించి మీదేవేరిని జేసికొన దలంచినారు గదా! అయినచో మాధవీకుమారి ప్రసక్తి యేమున్నది?”
“నీవు మాధవుడవు రావలయునయ్యా!”
“నేను గుంభమిత్రుడను మాధవుడుగా నెట్లు కాగలను ప్రభూ?”
“ఓయి కుంభకర్ణబలుడా!”
“ఔను నేను కుంభకర్ణుడనే, నలువురి గుంభకర్ణుల నా భుజముల మోచికొని సముద్రమున బారవైచి రాగలను.”
“అది కాదయ్యా మిత్రమా! మాధవుడన్న వసంతుడని. అతని భార్య మాధవి”.
“అటులనా మహాప్రభూ! అర్థమైనది. నేను మాధవిని వివాహమాడెదను గాక!”
“మేము నీకై యుద్దేశించిన యా బాలికను నీవు గొనిరావలయును. ఆమె యొక్కరిత వచ్చుట గౌరవభంగము. కావున నీ వంశుమతిని గూడ గొనిరావలయును. ఇందు నీ కేమియు నడ్డు రాగూడదు. అట్లు వచ్చిన వారిని హతమార్పుము. ఆ పొట్టిచాళుక్యుని పని నే బట్టించెదను. ఆ కుబ్జుడు వేంగీనగరము వీడి వచ్చునట్లు నే జేసెదను. నీవు తాడిచెట్టునైన విరచి మొగము కడుగుకొను పరాక్రమవంతుడవు... దిట్టలగు వారిని పదిమంది బంటుల గొనిపొమ్ము. ఎటుల దరలించి తెత్తువో ఆ యిరువురి బాలలను! ఇది నా యాజ్ఞ”.
“ప్రభూ! మీరు సముద్రమున నురుకుమన్న నురికెదను. ఆ సముద్రమును ద్రాగివేయమన్నను అట్ల చేసెదను. సాధారణ దళపతి కొమరుని నన్ను మీరు చేరదీసి ప్రియమిత్రునిగ జేసికొన్నారు. మీపై నింతవఱకును నీగనైన వ్రాలనిచ్చితినా?”
“కావున నీవు మూడు ఆరైనను, ఆరు మూడైనను నా బాలిక లిరువురను గొని తేవలసినదే.”
“ఇదిగో పోవుచున్నాను, మహాప్రభూ!”
19
వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగమునకు “జలసీమ” యనిపేరు. ఆ సరస్సు అతిపురాతనము. భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును బంగారు పంటలు పండుచుండును. ఈ సీమనంతను బరిపాలించు సామంతుడు బృహత్పాలాయనుండైన పృద్వీశవర్మ. పృధ్వీశవర్మ కిరువురు కొమరులును నొక కొమరితయు గలరు. ఆ కొమరితయే మాధవీలతాకుమారి.
వేంగీరాజ్యము నిప్పుడు పాలించుచున్న మంచనభట్టారక మహారాజు కన్న బృధ్వీశవర్మ యయిదారేడులు పెద్ద. చాళుక్య విష్ణువర్ధనుడు వేంగీనగరము వచ్చునప్పటికి గృష్ణా సముద్ర సంగమతీర సీమలోని సామంతుడొకడు దిరుగుబాటు చేయుటచే పృద్వీశవర్మ వాని నణచుటకు బోయెను. మాధవీలతాకుమారి కలతీర్థ (కలిదిండి) పట్టణమునకు దన తండ్రి వచ్చినాడని తెలిసి తన కుటుంబముతో గొన్ని దినములు గడుపనెంచి కలతీర్థ నగరమునకు బయనమయ్యెను. స్నేహితురాలగు నంశుమతీకుమారిని గౌగలించుకొని ఆమెచే వల్లె యనిపించుకొని పరివారముతో బడవల నెక్కికొల్లేటిపై బ్రయాణము సాగించెను. ఆ సరస్సునందనేక ద్వీపములున్నవి. అందగ్నికులజులైన పల్లెవారు నివసించుచు జేపల పట్టి వేంగీనగరమున అమ్ముచుందురు. ఆ సరస్సున యానము సల్పు బడవల నన్నిటిని వారే నడుపుదురు. ఈ యగ్నికులజు లందఱకు గడు గూర్చువాడు పృధ్వీశవర్మ మండలేశుడు.
మాధవీలతాకుమారి యట్లు ప్రయాణముచేసి “జలకంఠేశ్వరుడు” వెలసిన ద్వీపము జేరెను. ఆ దేవుని దేవేరి జలదుర్గ. ఆ దేవి దేవాలయ మా ప్రక్కనే యున్నది. మాధవీలత యచటికి వచ్చునప్పటికి జెల్లెలికెదురై యామె యన్న త్రినయనేశ్వరుడు భార్యాపుత్రాదులతో నటకుజేరెను. మాధవీలత వదినగారికి అన్నగారికిని పాదములకు నమస్కరించినది. వదినగారా బాలికను దన హృదయమున కదుకొన్నది. మేనల్లుండ్ర నిరువురను మేనగోడలిని నామె యెత్తుకొని ముద్దాడుచుండ బెద్దమేనగోడలు జలదుర్గాంబిక “అత్తయ్యగారూ! వేంగీపురములో బిన్నిగారు, అమ్మమ్మగారు, తాతయ్యగారును క్షేమమా?” యని పలకరించెను.
మాధవీలత పక్కున నవ్వుచు, “ఎంత జాణవమ్మా! ఈ యొప్పిద మెవరు నేర్పిరమ్మా నీకు!” అనునంత, నా యెనిమిదేడుల బాలికయు నత్తగారిని జూచి చిఱునవ్వు నవ్వుచు “నేను మీ కోడలనుగానా?” అని యెదురు ప్రశ్నవేసెను. అందఱును బకపక నవ్విరి..
దేవాలయమున బూజలైన వెనుక యందఱునుగలసి కలతీర్థపట్టణమునకు బోయి చేరిరి. ఆ పట్టణము చుట్టును తోటలే. పండ్ల తోటలు, కాయగూరల తోటలు, పూవుల తోటలును.
మాధవీలత యిరువుర బరిచారికల వెంట దీసికొని నగరము చుట్టునున్న తోటల దిరుగుట కెంతయు ముచ్చట పడును. ఒకనాడాతోటలో నా ఫాల్గుణమాసపు మలయమారుత మనుభవించుచు సాయంకాలమందు చెలులతో మాధవీలత యొక మామిడిచెట్టు క్రింద గూర్చుండి యుండెను. ఏలనో యామెకు జటుక్కున మనోనేత్రముల కొక విగ్రహము ప్రత్యక్ష మయ్యెను. పిష్టపురమునందు దన చెలి మూడు దినము లుపవాసము లొనరించి యొడలు తెలియక పడిపోయినప్పుడు తాను వేగిరపాటుతో భయముతో సిగ్గంతయు విడచి విష్ణువర్ధన ప్రభువుకడకు బరుగిడిపోయినది. తాను భర్తృదారిక స్థితిని భయము నిండిన మాటలతో నా మహారాజునకు జెప్పునపు డాతని పీఠముదాపున నిలబడి సమున్నతాంగుడై, గంభీర తేజస్వియై, తన దిక్కుదయార్ధ్ర దృష్టిని బరపి, తన్ను కులీనయగు బాలిక యని గ్రహించి చూపులు క్రిందికి వాల్చివేసిన యొక పురుషమూర్తి యీనాడు తన మనో గగనమున దళ్కుమని మెఱసినాడు. ఆ సంభ్రమస్థితిలో నాత డెవడో తనకు డెలియకపోయినను యా పురుషపుంగవు విగ్రహము మాత్రము మనస్సున స్పష్టముగ జిత్రింపబడినది. ఆతని గూర్చి యాలోచించుటకే యా బాలిక సిగ్గుపడినది. అట్లాలోచించుట తన చెల్లి గ్రహించునేమో యని ఆమె చకిత యగుచుండెడిది. తన రాజకుమారికి బరిచర్యలు సేకూర్చుటలో నిమగ్నమైన యా బాలిక హృదయమునుండి యా పురుషవిగ్రహము గుప్తమైపోయినది. నే డా పూరుషుడు మఱల దోతెంచుటకు గారణమేమి!
ఆమె కన్ను అర్ధనిమీలితము లైనవి; మెల్లగ బూర్ణ నిమీలితము లైనవి. మరల గన్నులు పూర్తిగ దెరచినంత నాబాలికయెదుట, లోనిమూర్తియే బ్రత్యక్షమగుట చూచి, పగటికల యనుకొనుచు గలలు దిరుగు కన్నులతోడనే యామూర్తి నామె తిలకించుచుండెను తన వెనుక కొలది యలికిడి యగుట గ్రహించి, వెనుకకు దిరిగి, పరిచారిక లిరువురు నిలబడియుండుట నామె కనుగొన్నది. మఱల మోము త్రిప్పి యెదుట జూడ నామూర్తి తన్ను దీక్షణముగ జూచుచు నిలిచియుండుట గననయ్యెను. ఆమె యాశ్చర్య మందుచు చుటుక్కున నిలుచుండెను.
అప్పు డా యువకుడు చిరునవ్వు నవ్వుచు "రాజకుమారీ! క్షంతవ్యుడను. ఇది శుద్దాంతజనముల తోటయని అనుకొనలేదు. నన్ను “జయనంది” యందురు. ఈ పట్టణపు దోటలు బహు సుందరములును, ఫలపుష్పపూర్ణములును, కనుగొన నా కెంతయో ముచ్చటపుట్టి యొంటిగా నీ తోటలోనికి వచ్చితిని. నేను సెలవుతీసికొనెద" నని యా యువకుడు మనవి చేసినాడు.
“చేయరాని పనిజేసి క్షమార్పణవేడుట పశ్చిమదేశముల వారి యాచారము కాబోలు” నని మాధవీలత కొంచెము చురుకుగనే పై కన్నది.
ఆ యువకుడు కలత నొందని మోముతో జిరునవ్వు నవ్వుచు, “మేము చేయరాని పనుల జేసెడివారమని యేకవి గ్రంథము వ్రాసినాడు? అని ప్రత్యుత్తర మిచ్చెను.
“క్షమించదగినవా రెవరో తెలిసికొనక క్షమించుటెట్లు?” అని మాధవీలత తలవంచుకొనియే పలికినది.
“మా జనకులు పట్టవర్ధన కాలకంపన ప్రభువులు, శ్రీ విష్ణువర్థన మహారాజాధి రాజులకు సర్వసేనాధిపతులు. నేనా మహాప్రభువు ఉపసేనాధిపతులలో నొకడను.”
“ఓహో యెంత చరిత్రయున్నది! తోటల దిరుగుటను గూర్చి యావల నాలోచింతము. చాళుక్యసేనాపతులకు దమ ప్రభువును యుద్ధమున వదలి తోటలు, పేటలు, బాటలును జూచుట యలవాటు కాబోలు!”
“అంతియ కాదు ఆ తోటలో నీటుకత్తెలగు రాకొమరితల దర్శించుటయు నలవాటు.” “మాటలలో గోటలును గోడలును దాటు పోటు మానుసులు గూడ నుందురని నేటి కెరిగితిని.”
ఆ బాల చటుక్కున దిరిగి చిరునవ్వున పరిచారికలతో నాసందె చీకటులలో విసవిస నడచి మాయమైపోయినది.
20
శ్రీచాళుక్య విష్ణువర్ధనుడు తన ద్వితీయోపసేనాపతియైన ఇంద్రదత్తునికి విక్రమ సింహపురమున సామంత పట్టాభిషేక మొనర్చి యప్రమత్తుడవై పల్లవుల గనిపెట్టి యుండుమని యానతిచ్చి, తన సైన్యమున నెక్కువభాగము నాతని పాలనమున నుంచి యుత్తరాభిముఖుడయ్యెను.
గిరిపశ్చిమరాష్ట్ర (కొండవీడు రాష్ట్రము) సామంతుడైన బుద్దవర్మ, విష్ణువర్ధను భగవంతునిగ నెంచి పూజించును. ఆతడు నాదెండ్లను తన రాజధానిగ జేసికొనెను. తన మహాప్రభువుత్తరాభిముఖుడై వచ్చుచున్నాడని తెలియగనే యెదురుగ బోయి కుబ్జ విష్ణువర్ధనుని సర్వసార్వభౌమ లాంఛనములతో దన రాజధానీ నగరమున కాహ్వానించెను.
“మహాప్రభూ! తాము రెండవ త్రివిక్రములు, తమ యానతి చొప్పున నీ రాష్ట్రముల, నీ సీమల శత్రుకంటక శూన్యముచేసి, మేఘములు లేని రాత్రివలె నొనర్చితిని. షోడశకళాపూర్ణ చంద్రులై పాండవవంశ కులతిలకులగు తామీ విశాలాంధ్ర మహా రాజ్యమునకు సామ్రాజ్యపట్టాభిషేక మొనరించుకొనవలసియున్న"దని మనవి చేసినాడు.
కుబ్జవిష్ణువర్ధనుని మోము కాంతివంతమై వెలిగిపోయినది.
“బుద్దవర్మప్రభూ! విక్రమసింహపురమున నింద్రదత్త ప్రభువు నివే మాటల ననినాడు. అన్నగారీ యీ రాజ్యములు దిగ్విజయము కొఱకు జయించినారు. వారి యానతి ననుసరించి మే మిచ్చట సామ్రాజ్యము స్థాపించెదమనుమాట నిశ్చయము.”
“మహాప్రభూ! అనుగ్రహింపబడితిని.”
“మన విజయము లన్నిటికిని సకలాంధ్రసామ్రాజ్యమును బరిపాలించు శ్రీశైల మల్లికార్జునదేవ వరప్రసాదమే కదా మూలకారణము!”
“చిత్తము మహాప్రభూ!”
“భ్రమరాంబికా ద్వితీయ మల్లికార్జునదేవునకు మనము సర్వపూజలు నొనరింప వలెను. కాని, యాపరమశివునకు మల్లికార్జున నామ మెట్లు వచ్చినదో!”
“అది యిచ్చట చరిత్రప్రసిద్దము మహాప్రభూ! మహా కోసల ప్రభువులైన సోమవంశీయులు తమ అన్నయ్యగారు పృధ్వీవల్లభసార్వభౌములకు గప్పము గట్టిరిగదా!”
“అవును”
“ఆ కప్పము గట్టినది సోమవంశ చంద్రగుప్తుని కొమరుడైన హరగుప్త మహారాజు, చంద్రగుప్త మహారాజు కొమరిత చంద్రావతి. ఆ దేవి పుట్టిననాట నుండియు మహాశివుని భక్తురాలై, యోగినీవేషము ధరించి, సర్వకాలములయందు శివపంచాక్షరి జపించుకొనుచు లౌకిక ప్రపంచము మలచి యుండెడిదట.” “అంత యనన్యభక్తియుండవలెను. అప్పుడే జన్మము తరించును.”
“ఆ చంద్రావతికి సర్వకాలములయందును శ్రీశైల దేవుడైన యర్జునేశ్వరస్వామి ప్రత్యక్ష మగుచుండెడివాడట. చంద్రగుప్తమహారాజు ఆంధ్రసార్వభౌముడైన శ్రీ విక్రమాశ్రయ గోవిందవర్మ విష్ణుకుండిన మహారాజునకు దన కొమరిత నిత్యము నర్జనేశ్వరు నర్చించుట కనుమతిని వేడుచు రాయబారమం పెనట.”
“అవును! పవిత్ర శ్రీశైలక్షేత్రము వారి రాజ్యముననే కదా యుండినది!”
“చంద్రావతి తగుపరివారముతో శ్రీశైలక్షేత్రము చేరినదట. ఆమె చంద్రావతి, సోమవంశజ, చంద్రగుప్తుని తనయ. ఆమె వెన్నెలయే రూపొందిన మల్లికా కుసుమములను మాలలుగ రచించి జంద్రచూడుని జటామకుటముపై నలంకరింప సంకల్పించినదట.”
“ఓహో! ఏమి విచిత్ర చంద్రికాభావము!”
“మహాప్రభూ! శ్రీశైలగిరిపై మల్లికా నికుంజములు పెంచినారు పరిచారికలు. బొడ్డుమల్లెలు, జంటమల్లె, సదా మల్లెలు, గుత్తులు గుత్తులై రాసులు రాసులై యా కొండను రజతాద్రి తుల్యముగ జేసినవట.
“ఇది యంతయు మహాపవిత్రమైన గాదయే.”
“చంద్రావతీదేవి భక్తికి బరమశివుడు కరుణించి యామెకు స్వప్నమున సాక్షాత్కరించి, "చంద్రావతీ కుమారీ! విష్ణుకుండిన మహారాజు గోవిందవర్మకు నా యంశమున మాధవవర్మ జనించినాడు. ఆతని నీ వుద్వాహ మయ్యెదవు గాక! ఇది మొదలు వట్టి యర్జునేశ్వరుడుగా గాక మల్లికార్జునుడుగా బ్రసిద్ధి గాంతు”నని యనుగ్రహించి యంతర్ధాన మయ్యెనట. విష్ణుకుండిన మంచన భట్టారకుని తల్లి యేయా చంద్రావతీదేవి.”
“ధన్యుడను. ఈ గాధయే సర్వపాపహరణము. మనము శ్రీ మల్లికార్జునదేవు దర్శనము నెంతేని తొందరగ జేసికోవలెను.”
శ్రీశైల పుణ్యక్షేత్రము శిఖరము దర్శించినంతనే యెట్టి పాపాత్ములైనను బుణ్యమూర్తులై తేజోవిలసితు లగుదురట. ఎంత దివ్యక్షేత్రమిది! అని చాళుక్యుడు మనస్సున నా శ్రీశైల పుణ్యపర్వతమునకే జోహారు లర్పించుకొన్నాడు.
చాళుక్యులు మొదటనుండియు శివభక్తి పూరితులు. వారు పరమమాహేశ్వరులే యగుదురుగాక. ఆ దీక్ష అతని బులకితుని జేసినది.
“హే!
నాగభూష! నందివాహా!
నిన్ను దెలియ, నిన్ను కొలువ
నన్నుబోటి వారలేడ
నాగశయన మిత్ర! దేవ!
వేగరావ! నన్ను బ్రోవ!
నాగభూష! నందివాహన!”
అని యా ప్రభువు మధురదీప్త కంఠమెత్తి పాడుకొనినాడు. కుబ్జ విష్ణువర్ధనమహారాజు శ్రీశైల మల్లికార్జున దేవుని దర్శించి వైభవోపేతముగ బూజ లొనరించినాడు. ఆ సమయమున మండలేశ్వరుడు బుద్దవర్మ తన మహాప్రభువు క్షేమమునకై మహాదానము లెన్నిటినో చేసినాడు.
21
జయనంది తాను మాధవీలతాకుమారిని వరించినట్లును, ఆమె తల్లిదండ్రులు నా రాజకుమారియు తమ సంబంధమున కత్యంతహర్షితులై యామోదించిరనియు దండ్రికి రహస్యలేఖలు పంపినాడు. అరువదియైదు వర్షముల వృద్దుడైన కాలకంపన ప్రభువు తన కీసంబంధ మత్యంతము నభీష్టమనియు దాను మహారాజు ననుమతిని వేడుచు నుత్తరము పంపుచుంటిననియు, గొమరునికి వార్త పంపినాడు.
పట్టవర్ధనరాజ పురోహితుడు లేఖలుగొని వేంగీపురమునకు వచ్చినాడు. ఆతడు వచ్చిన మూడుదినములకు గుబ్జ విష్ణువర్ధనమహారాజు ససైన్యముగ వేంగీపురమును జేరినాడు.
తన ప్రాణహితుడగు జయనంది బృహత్పలాయన రాజకన్యకను వివాహమాడుట తనకు నత్యతానందమును సమకూర్చు విషయమని, విష్ణువర్ధనుడు జయనందిని తన సమ్ముఖమునకు రావించుకొని యాతని నాశీర్వదించెను.
జయ: మహాప్రభూ! తాము బృహత్పలాయన రాజకన్యకను జూచియున్నారు.
విష్ణు: అవును, పిష్టపురమున నామెను జూచితిని గదా! ఆమె పేరు, మాధవీలతాకుమారి కాదా?
జయ: చిత్తము.
విష్ణు: మిత్రమా! నీ వెంతయో అదృష్టశాలివి. ఆ బాలిక గుణరూపసమన్విత, ఆమెకు విష్ణుకుండిన రాకుమారి యనిన నెంతభక్తి!
జయ: ప్రభూ! చాళుక్య కులదీపకులు - తమరు...
విష్ణు: అయినచో...
జయ: చాళుక్యవంశము, చంద్రవంశము.
విష్ణు: మంచిది!
జయ: ఆ చంద్రవంశమున బూర్ణ చంద్రులు మీరు.
విష్ణు: నాచుట్టును చంద్రికలు లేవుకదా!
జయ: మహాప్రభూ! ఆ చంద్రికాదేవికై లోకమెల్ల నేదురు చూచుచున్నది.
విష్ణు: నేను అమావాస్య చంద్రుడను.
జయ: పాప ముశమించుగాక! మహాప్రభూ! తాము రాకాచంద్రులగుట కొక అంశువుమాత్రము లోటైనది.
విష్ణు: ఆ యంశువును శివుని జటాజూటమునుండి కొనివత్తువా.
జయ: మీ శిష్యులము కైలాసమునకైన బోగలము.
జయనంది విష్ణువర్ధనునికడ సెలవు గైకొని వెడలి పోయెను. విష్ణువర్ధను డా సంభాషణమునే తలచుకొనుచు దన జన్మము రాకాపూర్ణిమగ నెట్లు మారునని యను కొన్నాడు. చంద్రావతీదేవి గాధ యెంత పవిత్రమైనది. విజయవాటిక నింద్రకీలమున దపమాచరించిన యర్జునునకు బ్రత్యక్షమైన పరమేశ్వరుడు 'అర్జునేశ్వరు' డైనాడు. చంద్రావతిదేవి మల్లీపుష్పముల బూజించిన యా శ్రీశైలేశ్వరుడు మల్లికార్జునుడైనాడు. భగవంతు డెంత భక్తవత్సలుడు!
ఆలోచనాధీనుడై విష్ణువర్ధనుడు తన భవనోద్యాన వాటిక బ్రవేశించినాడు. ఒంటిగా నుద్యానవనమున సంచరించుచు నా సాయంకాలము విరియబూచిన మల్లెపొదలను జూచి యొక్క నిట్టూర్పు విడిచినాడు. చంద్రకిరణములు భూమిని వ్రాలి, కాకుసుమములైనవట! కవులెంత మతి లేనివారో యని యనుకొనినాడు. ఒక బొడ్డుమల్లె నతడు కోసి, కన్ను లరమూతలువడ నాఘ్రాణించుచుండెను.
తన వెనుక నెవరో వచ్చినట్లు పదముల చప్పుడుకాగా నాతడు చటుక్కున వెనుదిరిగెను. పిష్టపురమున దానుజూచిన బాలిక యెదుట నిలిచియున్నది.
“మీరా!”
“నీవా!”
“చాళుక్యమహారాజు వచ్చెను, గాన మీరు తప్పక దర్శన మీయగలరనియే నే నిచ్చటకు వచ్చితిని.”
“అదెట్లు సంభవము?”
“తమకు దోటలన్న నిష్టమని గ్రహించితిని.”
“అవును, నాకిష్టమే! రాజసేవకులకు మాకు వనవిహార మొనర్చుటకు దీరిక యెక్కడిది!”
“ప్రభూ! పూవులు పూయని ప్రదేశము లోకమున నుండునా!”
“ఆ! మరుభూములు. నా బ్రతుకే మరుభూమి.”
“అట్లనకుడు ప్రభూ! అంతర్విచారణోన్ముఖులైనవారి కొక్కొకపు డిట్టి విషాద భావములు గ్రమ్ముకొను చుండును.”
“రాజకుమారీ! మీ మహారాజకుమారి సేవను వదలి నీవెట్లు రాగలిగితివి?”
“దుఃఖభూయిష్టమైన యీ లోకములో నిట్టియుత్తమ స్నేహములే యానందము నిచ్చునవి. మనుష్యుడు స్నేహమును వాంఛించును. అందుకై పరితపించును.”
“తమ తల్లిదండ్రు లెవరు?”
“నాకు దల్లిదండ్రులు లేరు. అన్నగార లిరువురున్నారు. వారువారి పనులలో నిమగ్నులై యుందురు. నేను 'దేశమ్మకాకి'నై యిట్లు తిరుగుచుందును.”
“అదేమి ప్రభూ! విష్ణువర్ధన మహారాజులు ప్రేమార్ణవులని చెప్పుకొందురే!”
“అది నాకేమి లాభము! వారు నాకింత యాశ్రయ మిచ్చిరి. వారితో వచ్చుట వలన, నా యావేదన తీరునట్లు దేశము తిరుగుట కనువైనది.”
“సర్వసౌందర్యములును రూపొందిన యా బాలిక మోము చంద్రకాంతులు ప్రసరించి, యామె నొక దివ్యభామిని యనిపించినవి. ఆమె పెదవుల క్రీడాభరిత మందహాసములు విరిసినవి. ఆమె దోసెడు మల్లికాకుసుమములు కోసికొని విష్ణువర్ధనుని కడకు వచ్చి “ప్రభూ! తామొక్క మల్లికాకుసుమమే కోసికొన్నారు. ఈ పూమొత్తము లన్నింటిని గ్రహింపుడు. అప్పుడే మీకీ పూవుల రహస్యము హృద్గతము కాగలద”ని తలవాల్చి పలికినది.
విష్ణువర్ధను డామెను చేయెత్తి వారించి “రాజకుమారీ నీవు విష్ణుకుండిన రాజకుమారి చెలియలవు. నేనెవరైనది నీకు బూర్ణముగ దెలియదు. నేను పొట్టివాడను. నాకిప్పు డిరువదెనిమి దేండ్లున్నవి, అయినను నాగుజ్జుదనము వలన నొకబాలకునివలె గన్పట్టుదును. నీవు నన్ను బాలకునిగా దలచి నిస్సందేహముగ నాతో మాటలాడుచుంటివేమో” యని యాతడు సవిచారముగ బల్కినాడు.
22
విష్ణువర్ధనుని మాటల కంశుమతీకుమారి యిసుమంతయు గలత నందలేదు. ఆమె సునిశ్చల మనస్కయై అటులనే నిలుచుండెను. మోమున చిరునగ వింతేని జెదిరిపోలేదు.
“ప్రభూ! నేను కులీనను. ప్రేమకు బొట్టి పొడుగు లాలంబనములు గావు. నిర్మల హృదయమే యాలంబనము. తొలిసారి మిమ్ము పిష్టపురమున జూచినప్పుడే నా హృదయ కుసుమమునకు మీరే తావియని దివ్యభావము స్పురించినది.”
విష్ణువర్ధనుని ఆశ్చర్యమునకు మేరలేదు. “రాకుమారీ! నీవు విష్ణుకుండినుల చుట్టమవు. మీరు బ్రాహ్మణక్షత్రియులు గదా! ఇక నే నెట్టి కులమువాడనో! హీనవంశజులు గూడ సామంతులు కావచ్చును గదా! అదియును గాక! నే నొక సామంతుడను, సైనికుడను.”
“ప్రభూ! సామంతత్వముగాని మహారాజాధికారము గాని అంతఃకరణ వృత్తికి నుద్దీపనమెట్లగును! నిజమును గోచరింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్టపురముననే సత్యము దర్శన మిచ్చినది. నే నచ్చటనుండి నా తల్లిదండ్రుల కడకు వచ్చిన తోడనే వారికి బ్రభువుల గురించి నివేదించితిని వారి యనుమతి పొందితిని. మా కులగురువు నారసింహ భట్టువారును నందు కనుమతించి నన్నాశీర్వదించినారు”
“ఎవరు రాకుమారీ! నీ తల్లిదండ్రులు? నేను దిగ్భ్రమ నందుచున్నాను.”
“ప్రభూ! నేను మంచనభట్టారక మహారాజు తనయను, నన్నంశుమతి యందురు.”
“ఏమీ! మీరు మహారాజు తనయ అంశుమతీ కుమారికలా!”
ఆత డొక్కనిమేష మక్కడుండలేక, వేగమున మోము వెనకకు ద్రిప్పి చూడకయే వెడలిపోయినాడు. అంశుమతీ కుమారి తెల్లబోయి, రిచ్చవడి యచటనే నిలుచుండి పోయెను.
అప్పుడు మాధవీలత పకపక నవ్వుచు నామె కడకు వచ్చి “దొంగా! ఎంతపని చేసితివమ్మ? నా కిసుమంత యేని జెప్పక నీహృదయ - చోరుని గలియుటకు దొంగవలె నిచటకు వచ్చితివా?”
“నేను దొంగనగుటెట్లు మాధవీ? మన పరిచారికలతో నిచ్చటకు బోవుచుంటినని చెప్పియే వచ్చితిని.” “నీతో జెప్పి వచ్చుటకు నీవు కనబడవైతివి. వారి గలసికొనగలనని నమ్మకమున్నది. కలిసి కొంటిని.”
“ఆయన యెవ్వడో తెలియునా నీకు?”
“ఎవ్వరైన నేమి! ఉత్తమ చరిత్రుడు”
ఆ బాలిక లిరువురు నంతఃపురములోనికి వెడలిపోయిరి.
“ఇదియిది” యని తెలియరాని యాలోచన లెన్నియో యుద్భవించి యాప్రభువును గలతవెట్టుచుండెను. తానెవ్వరో ఆ బాలిక యెరుగునా! విష్ణుకుండిన రాజకుమారి జగదేకసుందరియని విని, తనయన్నగారు వివాహము చేసికొమ్మని తన్నెన్నిసారులో కోరినారు. కాని తన రాజ్యమున దన్ను ప్రేమింపవచ్చు నాడది యుండునా! ప్రేమలేని వివాహమును తానెట్లొప్పుకొనగలడు! కాని యీబాలమాటలలో నసత్యము గోచరించదు. తన కెట్లీ సందిగ్ధావస్థ తీరును.
స్వచ్చజీవనయగు విజనప్రదేశపుష్పము నొకదానిని సేకరించగలిగితినని కొంత యానందపులకితుడనైన మాట నిజము. కాని యీపుష్పము రాజోద్యానమున ఉద్భవించినదేకదా!
ఆ రాత్రి మాధవీలత మంచనభట్టారక మహారాజు కడకు బోయి, మహారాజును దర్శించి వారితో నంశుమతీ కుమారి కుబ్జ విష్ణువర్ధనునే ప్రేమించుచున్నదనియు నాతడొక సామాన్య సామంతు డనుకొనియే ఆయనను ప్రేమించిన దనియు, నా ప్రేమకు విష్ణువర్ధన చాళుక్యుడును సముఖుడై యున్నట్లు భావించవచ్చుననియు, నాతడును అంశుమతి యొక సామంతుని కొమరితయని తెలిసియు ననుకూలుడుగ నుండెననియు నా సామంతనమే తాను విష్ణుకుండిన మహారాజు పుత్రికనని యంశుమతి విష్ణువర్ధనునికి దెలిపెననియు జెప్పెను.
మహారాజు నానందమునకు మేరలేకపోయెను. వెంటనే యామహారాజు తన దేవేరి మందిరమునకు బోయి “దేవీ! నేనింత కాలమును వృధాభయములకులోనై గురువుగారిని జాతకము లడుగుచుంటిని. అమ్మాయి ప్రేమించినది విష్ణువర్ధనమహారాజు” అని తెలిపెను.
“మహాప్రభూ! విష్ణువర్ధనమహారా జిందుకు సుముఖుడేనా!”
“సుముఖుడైనట్లు సౌభాగ్యవతి మాధవీలత చెప్పుచున్నది.”
మహారాజు యంతఃపురపు బరిచారికలకు సంతోషమున బహుమతు లర్పించినది. మంచెన భట్టారక మహాప్రభువు ఉదయమున సకలాలయములయందును నర్చనలు జరిపింపుమని తన యాంతరంగికుడగు గంచుకికి నానతి యిచ్చెను. ఆ రాత్రి యెవరికిని నిదుర పట్టలేదు.
మరునాడు సాయంకాలము బంగారు నీరెండలు తోటలలో దోబూచులాడుచు బరుగులిడుచున్నవి. ఆకసమున బసిమిరంగు కుంకుమరాగమలముకొనుచున్నది. సాయంకాలము సకలవర్ణములకు నిలయము సంధ్యా నటేశ్వరుని తాండవక్రీడా దివ్యసుముహూర్తము! సంధ్యాకాలముల దివ్య లోకమునకు మర్త్యలోకమునకు రాచబాటలు నిష్పన్న మగునట.
విష్ణువర్ధను డా దిన మెట్లు గడపెనో! ఏ రాజ కార్యము, లెట్లు నిర్వహించెనో! ఏ సామంతుల కే యాజ్ఞా పత్రములు పంపెనో! కాని, సాయంకాలము వలదనుకొని నను ఆతడు నిన్నటి తోటలోని పోయినాడు. ఆ మల్లికా నికుంజములనే తారసిల్లినాడు. మల్లియలలో మహాత్య మేమై ఉన్నదా! యనుకొనుచు నాతడు నవ్వుకొనినాడు. అంశుమతీదేవి శీతాంశుమతియా! చండాంశుజ్వాలయా! |
ఆపొదల దాటి, క్రీడాశైలము దాటి, కృత్రిమ సరోవరము దాటి, కేళాకూళులుదాటి గుబురులుగ బెరిగిన గున్న మామిడి తోటలోనికి బోవ విష్ణువర్ధనుడు సంకల్పించునప్పటికి నా మామిడితోటలోనుండి అంశుమతీ రాకుమారియు మాధవీలతయు నాయన కెదురైనారు. ఆ బాలిక లిరువురు విష్ణువర్ధనునికి నమస్కరించినారు. ఆ ప్రభువు తడబడుచు బ్రతినమస్కార మిచ్చినాడు. ఇంతలో నా తోటలోనుండి కుంభకుర్ణునివలె భయంకరుడైన యొక మానిసియు నార్గురు రాక్షసులను బోలు ముష్కరులును పరుగున వచ్చి వీరి మువ్వురను జుట్టు ముట్టిరి.
23
విష్ణువర్థనుడు సింహమువలె మారిపోయినాడు. ఆతడు నిరాయుధుడు. మొలనున్న రతనాల పిడిగల ఛురిక తప్ప వేరాయుధము ప్రభువుకడ లేదు. బాలిక లిరువురు నాయన ప్రక్కకురికిరి, విష్ణువర్ధనుడు కన్నుల నగ్నివర్షము కురిపించుచు “ఎవరు మీరు? ఈ రాజాంతఃపురోద్యానమున కేల వచ్చిరి?” అని తరిగిన లోహపుధారవంటి వాక్కుల బ్రశ్నించినాడు. అవి యెంత మెల్లగ నున్నవో అంత భయంకరములు.
“నీవా! కుబ్జవిష్ణువర్ధనుడవా! మా మహారాజు దానార్ణవు విరోధివా! అవునురా! నే నీ మాధవీలతను బెండ్లి యాడెదను. ఆమెను భగవంతుడు నాకోసము సృష్టించెనని మా ప్రభువానతి యిచ్చినాడు.” అని యెనిమిదడుగుల పొడవున కొండవలెనున్న దానార్ణవుని బంటు కుంభమిత్రుడు పలికినాడు.
“ఓరీ! గౌడ మహిషమా” విష్ణువర్ధనుని మాటలు పిడుగులవలె జ్వలించినవి.
“ఈ కుంభమిత్రు డపరఘటోత్కచుడు అని మాప్రభువు పలికెనే! ఈమాటకు నిన్ను నాయెడమచేతితో బురుగును నలిపినట్లు నలిపెదను.”
వారింకను చుట్టుముట్టిరి. కుంభమిత్రుడు చెట్టువలెనున్న తన గదనెత్తి విష్ణువర్ధనునిపై కురికెను.
“మీరు వారు పట్టుకొనినను గడబిడ పడకుడు” అని తల త్రిప్పకుండగనే విష్ణువర్ధను డా బాలికలకు చెప్పి మొల నున్న ఛురికను దీసి, ఆ భయంకర నిశాచరునితో బోరు సలుప నిలచినాడు.
ఆ కిరాతులలో నలుగురు చటుక్కునవచ్చి విష్ణువర్ధనుని వెనుకనున్న యా బాలికల చేతులను బట్టుకొనినారు. విష్ణువర్ధనుని గుంభమిత్రుడు గదతో ముక్కలు చేయుటకు దాని నెత్తిన క్షణముననే “ఛీ! రాక్షసుడా! నాప్రభువు పైననే గదనెత్తుట” అని అంశుమతీకుమారి యాడుపులియై యొక్క విదల్పున దన్నదిమిపట్టిన చేతులు విదల్చుకొని, విష్ణువర్ధనుని ముందున కురికి, యా ప్రభువును వెనుకకు నెట్టి వేసినది. కుంభమిత్రుడు కన్నులింతలు చేసికొని, “ఆ! నిన్ను బూవులలోబెట్టి కొనిరమ్మని నా ప్రభువు సెలవిచ్చినాడు. ఒక్క క్షణమున్నచో నీవు తుత్తునియలైపోయి యుందువు” అని యరచి యెత్తినగద నట్లనే యుంచినాడు. ఆ క్షణికమాత్ర సమయములో విష్ణువర్ధనుడు ఛంగున కుంభమిత్రుని కంఠముకడ కురికి, తన ఛురికను నాతని భుజమున పిడివరకును దింపి వేసినాడు,
“అమ్మో” యని, చేతిగద జారిపోవ, నెడమచేతితో గుంభమిత్రుడు కుబ్జవిష్ణుని బట్టుకొనబోయినాడు. విష్ణువర్ధను డచటలేడు. కుంభమిత్రుని నడుమున గట్టిన మహాఖడ్గము విష్ణువర్ధనుడు చఱ్ఱునలాగి వేసి, యెంతవేగమున ముందున కురికెనో, యంతవేగమున వెనుక కురికినాడు. ఆ ఖడ్గము విష్ణువర్ధను నంతయున్నది. ఆ మహావీరుడు రెండుచేతుల నాఖడ్గమును మెఱుపు వేగమున బ్రయోగించుచు, దిరిగి యంశుమతిని బట్టుకొని యెత్తుకొని పరుగిడిపోవు ముష్కరుల వెన్నాడెను.
అంత కొక్కక్షణము ముందుగనే మాధవీలతకు నోట గుడ్డలు గ్రుక్కి నలుగురు ముష్కరు లెత్తుకొని పారిపోవుచుండిరి. విష్ణువర్ధనుని వేగము నిరుపమానము. అంశుమతిని బట్టిన యొకని తల డుల్లిపడిపోయెను. తక్కిన యిరువు రామెను క్రింద జారవిడచి, పలాయనమంత్రము పఠింప నుద్యుక్తులైరి కాని యొకని చేయి తెగిపడినది. రెండవవాడు రెండు తుండెములై పడిపోయినాడు.
ఆ ఖడ్గమును భుజమున ధరించి మరుక్షణమున చిందువువలె నా ప్రభువు తోట ద్వారమును దాటి ప్రక్కతోటలో బరుగిడిపోవు ముష్కరులను సమీపించినాడు. అచ్చట విష్ణువర్ధను నిరువదిమంది విరోధులు ముట్టడించిరి.
పడిపోయిన యంశుమతి చివ్వునలేచి విష్ణువర్ధన మహారాజు విడిది చేసిన భవనము దిశకు బరుగెతైను. ఆమె కేకలు విని, జయనందియు గొంద రంగరక్షకులును దోటలోనికి బరుగిడి వచ్చిరి. “మహాప్రభూ! - దొంగలు - రక్తము ఎత్తుకొనిపోయిరి” అని చెప్పుచునే అంశుమతి మూర్చపోయినది.
జయనంది అంగరక్షకు నొకని జూచి రాకుమారి కుపచారము సేయ బరిచారికల బిలువు మన చిప్పి శంఖ మూదుమని దళవాయి నొక్కని కాజ్ఞ యిడెను. ఆతడప్పుడే శంఖము తీయుచున్నాడు.
“భోం, భోం, భోం,” అని శంఖధ్వానము దెసలు నిండినది. అచ్చట కావలియున్న అంగరక్షక సైనికులు జయనంది కడ కురికిరి. జయనంది వేగముగ మామిడితోట వైపునకు బరుగిడ నారంభించెను. అతని వెనుక అంగరక్షక సైనికు లర్థచంద్ర వ్యూహముగ బరుగిడ నారంభించిరి.
శంఖధ్వానము లొకటి కొకటి యుప్పందించుకొనినట్లు ఆ తోటల నావరించి, మహికుడ్యమున కావలను “భోం భోం” అని నినదింప సాగినవి. ఎచ్చోటు జూచినను నంగ రక్షక సైన్యములు నిండిపోయినవి.
(24)
మాధవీలతాకుమారి నెత్తుకొనిపోవు ముష్కరులు తాము నిర్దేశించుకొన్న స్థలము కడకు పరుగిడి పోవుచుండిరి. వారా బాలిక కదలకుండ రజ్జువులచే గట్టివేసిరి. నోట గుడ్డను గ్రుక్కిరి.
సరిగ వారచ్చట చేరబోవునప్పటికి చాళుక్యాంగ రక్షక దళములు వారిని చుట్టముట్టినవి. వారు తమ ఆయుధముల బారవేసి, తలలు వాల్చి నిలిచిపోయిరి. మాధవీలతాకుమారికట్ల నొక్కవృద్దసేనాపతి విప్పి, నోటి గుడ్డలాగి వేసినాడు.
విష్ణువర్ధన ప్రభువు బలమెట్టిదియో కాని కుంభమిత్రుని మహాఖడ్గమును తూలికవలె త్రిప్పుచు, ఏటుకొక ముష్కరుని తీతకొక రాక్షసుని ఆ వీరాధివీరుడు హతమార్చు చుండెను.
కుంభమిత్రు డెడమచేత, కుడిభుజమున దిగిన విష్ణువర్ధనుని ఛురికను లాగివేసి రక్తము చిమ్మన ప్రవహింపుచు దన్ను తడిపివేయుచున్నను లెక్కజేయక రోజుకొనుచు, నెడమచేత గదను ధరించి, విష్ణువర్ధనుని కడకు బరునికి వచ్చెను.
విష్ణువర్ధనుని జుట్టిముట్టినవారు నలుగురైదుగురు హతమారినారు. ఆ ప్రభువునకు రెండుచోట్ల గాయములు తగిలినవి. -
కుంభమిత్రు డాప్రభువుని వెనుకనుండి పొడిపొడిచేయ గద నెత్తినాడు. ఆ గండరగండ డక్కడ లేనేలేడు. తన కున్న బలమంతయు నుపయోగించి ఒక్క యురుకున ఒక మామిడిచెట్టు మొగ కావీరు డురికినాడు. ఆ చెట్టునకు వీపాన్చి రోజుచు ఖడ్గమునెత్తి తనకడకు వచ్చు ప్రతివానిని తెగటార్ప సిద్ధముగ నుండెను. కుంభమిత్రుడు తన గదను గిరగిర నెడమచేతితోడనే త్రిప్పుచు, పాము మాపులు విష్ణువర్ధనునిపై బరపుచు, నొక్కొక్క అడుగున నా ప్రభువును దరియుచుండెను.
ఆ సమయమున సింహగర్జన నొనరించుచు జయనంది పరుగున వచ్చినాడు. “ఎవడురా నా రాజును ఎదుర్కొన్నది” అని జయనంది అరచి వజ్రపాతమువలె కుంభమిత్రుని దాకినాడు.
విష్ణువర్ధనుని అంగరక్షకులు రామబాణ వినిర్ముక్త మృత్యుశరములవలె వచ్చి ఆ ముష్కరులపై దలపడినారు.
కుంభమిత్రుని తల ఎగిరి భూమిపై పడినది.
జయనంది, నిశ్చలుడై చెట్టు మొదల నిల్చియున్న చాళుక్యుని కడ మోకరిల్లి కన్నుల నీరుతిరుగ "మహా ప్రభూ! తమ కెంతటి యాపత్తు తెచ్చినాను. నా ప్రమత్తతయే దీనికి గారణ” మనచు దన యుత్తమాంగ మా ప్రభువు పాదముల కాన్చినాడు.
విష్ణువర్ధనుడు చిరునవ్వున జయనంది నెత్తి, తన హృదయమున కదుమునొన్నాడు.
అతని హృదయమున యంశుమతి దివ్యదేవియై సాక్షాత్కరించినది.
ఇంతలో ఒక వైపునుండి మాధవీలతాకుమారియు, మరియొక వైపునుండి అంశుమతీకుమారియు, నచ్చటకు బరుగిడి వచ్చిరి. పులకేశి మహాప్రభువు కడకు నారసింహభట్టులవారు సకల పరివారసమేతులై విష్ణుకుండిన మంచన భట్టారకు నేక పుత్రిక నంశుమతీ దేవిని చక్రవర్తి ప్రియానుజులైన శ్రీసత్యా శ్రయ విషమసిద్ది విష్ణువర్ధన మహారాజున కుద్వాహ మొనరింప ననుమతి వేడుటకు వచ్చినారు. తన కత్యంత ప్రియతమమగు నా యానందవార్తను విని, పులకేశి పృధ్వీవల్లభుడు సింహాసనమునుండి దిగివచ్చి నారసింహభట్టు పాదములకు నమస్కరించి, ఆయన హస్తము గ్రహించి, తన యర్థసింహాసనమున గూర్చుండబెట్టు కొనెను.
నార: మహారాజాధిరాజా! సకలభూమండలాఖండలా! మా మహారాజు తమ కూతురి నిచ్చి విష్ణువర్ధన మహారాజులకు వివాహము చేసిన వెనుక తృతీయాశ్రమస్వీకారము చేయుదురట. విష్ణుకుండిన సింహాసనమున కంశుమతీ దేవియేకదా అధికారిణి. ఆమెకు గాబోవు భర్తయైన విష్ణువర్ధన మహారాజు వేంగీ సింహాసనాసీన స్వత్వుడగును. తమ జామాతకు మా మహాప్రభువు మూర్ధాషేక మొనర్చి తాము శ్రీశైలమునకు దపస్సుచేయ బోవునట. తమ యాజ్ఞకు నేను నిరీక్షించుచున్నాను.
పులకేశి మహారాజు "మహాతపస్వీ! ఈ శుభవార్తకై యిన్ని సంవత్సరములనుండియు నెదురు చూచుచుంటిమి. వివాహ పట్టాభిషేకములకు మాప్రతినిధులుగ మా పుత్రులందరును, మా మహారాణియు విచ్చేయుదురుగాక! మాయనుంగు దమ్ముని మనస్సు వశీకరింపగల బాలిక యీ రేడులోకముల లేదను కొంటిమి. అంశుమతీ మహారాజకుమారి అమృతాంశుమతియే!”
వేంగీ రాష్ట్రమున మహోత్సవములు యుగయుగములు కవులు కావ్యములు రచింప దగునంత వైభవముగ జరుగుచున్నవి.
శ్రీసత్యాశ్రయ చాళుక్యకులాభరణ పరమమాహేశ్వర పరమభట్టారక, లాట, మాళవ, సురాష్ట్ర, కుంతలాది సకలభువన రాజన్యకిరీటాంచిత రత్న కాంతినీరాజిత పాదసరోరుహ, పరమబ్రహ్మణ్య, సర్వసిద్ది పలకేశి పృద్వీవల్లభ చక్రవర్తి యనుగుతమ్ముడు, శ్రీసత్యాశ్రయ పరబ్రహ్మణ్య పరమమహేశ్వర అపరత్రివిక్రమ, చాళుక్యకులాభరణ, విషమసిద్ది కుబ్జ విష్ణువర్ధన మహారాజునకును; జనాశ్రయ, పరమబ్రహ్మణ్య పరమభట్టారక, పరమభాగవత, శ్రీవిష్ణుకుండిన మంచనభట్టారక, మహారాజాధిరాజు నేకతనయ యంశుమతీదేవికిని, విష్ణునకు లక్ష్మికిని జరిగినంత మహావైభవముగ వివాహము జరిగెను.
ఆ శుభముహూర్తముననే శ్రీపట్టవర్ధనకులతిలక, కాలకంపన మహాసామంత ప్రభువు కొమరుడు జయనంది ప్రభువునకును, కలతీర్థ మహాసామంత, బృహత్పాలాయన పృధ్వీశవర్మ ప్రభువు కొమరిత మాధవీలతాదేవికిని వేంగీపురముననే వైభవమున వివాహము జరిగెను.
ఆంధ్రమహాభూమి నింకొక్క శుభముహూర్తమున పాళికేతన మెగురుచు దనకాంతుల నింపినది. యజ్ఞవరాహ దేవుడే ఆ మహారాజ్యమును సంరక్షింప లాంఛన రూపమున వెలసినాడు. చాళుక్యుల వెల్లగొడు గంధ్రభూమి నంతయు గప్పినది. పంచ మహాశబ్దము లవతరించినవి. గంగాయమునా కలశములు వెలసినవి. ప్రతిఢక్కా ధ్వానములు మారుమ్రోగినవి. మకరతోరణయుక్తమై చాళుక్యపతాక, కాంతసింహాసనముల వెలిగిపోవుచుండ, నాసింహాసన స్వర్ణ సోపానపంక్తి నెక్కుచు, కనకదండయుక్తుడై, కాలకంపన మహారాజు కుడివైపున నిలువ, జయనంది బుద్ధవర్మలు వింజామరలు వీవ, పృధ్వీశవర్మ దవళచ్చత్రము ధరింప, నుత్తమ త్రయీపాఠులు, గంగాయమునా పవిత్ర జలములు నిండిన సకల రత్నఖచితస్వర్ణ కలశములు ధరించి, యీవలావలనిలువ ఉత్తమ చాళుక్య కుబ్జవిష్ణువర్ధన మహారాజు పరమభట్టారకుడై ఆంధ్రచాళుక్య సామ్రాజ్యమునకు బట్టాభిషిక్తుడయ్యెను.
సమాప్తం
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.