అంటువ్యాధులు/పదియవ ప్రకరణము
పదియవ ప్రకరణము
కల్పితరక్షణశక్తి
ఒక్కొక్క వ్యాధి యొక్కొక సారి వచ్చి పోయిన తరువాత తిరిగి ఈ వ్యాధి మనల నంటదని మశూచకము, ఆటలమ్మ మొదలగు కొన్ని వ్యాధులను చూచి మనము తెలసికొనియున్నాము. ఇట్టి రక్షణశక్తి పుట్టుకలో మనకు సహజముగ వచ్చినదికాదు. కావున నిది కల్పితరక్షణశక్తియే యగును. ఇదిగాక టీకాలు మొదలగు సాధనములవలన మనమిప్పుడు కొన్ని వ్యాధులు మన కంటుకొనకుండ జేసికొనుచున్నాము. ఇట్టి రక్షణశక్తియు కల్పితరక్షణశక్తియే. కొన్ని వ్యాధులు తగిలి కుదిరినతరువాత నవి తిరిగి యంటవను విధి లేదు. పచ్చసెగ, న్యూమోనియా యను జ్వరము, సర్పి, చలిజ్వరము మొదలగునవి యీ జాతిలోనివని జ్ఞప్తి యుంచు కొనవలేను.
కల్పితరక్షణశక్తియందు తిరిగి రెండు విధములు కలవు. కొన్ని వ్యాధులలో రక్షణ శక్తి కలిగించు పదార్థములను మన శరీరమునందే పుట్టించి వాని మూలమున మనకు రక్షణ శక్తి కలిగింపవచ్చును. దీనికి శరీరజనిత రక్షణశక్తి (Isopathic or Active) యని పేరు. మరికొన్ని వ్యాధులలో నీపదార్థ
ములను మనము వెలుపలనే తయారు చేసి వానిని రోగియొక్క శరీరములో ప్రవేశ పెట్టుటవలన వ్యాధినుండి రక్షణశక్తి కలుగుచున్నది. ఇట్టి రక్షణశక్తికి బహిర్జనితరక్షణశక్తి (Antitoxic or Passive) యని పేరు.
శరీరజనితరక్షణశక్తిని మనము కలిగించు నపుడు రోగి యొక్క శరీరములో నొక విధమైన మార్పుగలిగి సాధారణముగా జ్వరము వచ్చును. ఈ సమయమునందు సూక్ష్మజీవులకు విరోధకరములగు విరుగుడు పదార్థములు శరీరములో పుట్టును. ఇవి పుట్టి వీనివలన శరీరమునకు రక్షణశక్తి కలుగుటకు కొన్ని దినములు పట్టును. ఇట్లు కలిగిన రక్షణశక్తి కొన్ని నెలలవరకు మన శరీరములో నుండును. ఇట్టి రక్షణశక్తి కలిగించు పదార్థములు మన శరీరములోనుండు కండ నరము మొదలగు సంహతులను గట్టిగ నంటిపట్టుకొని యుండి, శరీరమును కోసి చాలరక్తమును తీసివేసిననుకూడ విడువక అవి శరీరమునంటి రక్షణశక్తిని చూపుచున్నవి. ఇట్లుండ బహిర్జనితరక్షణశక్తి కలిగించునప్పుడు సూక్ష్మజీవులకు హానికరములగు విరుగుడుపదార్థములు గుర్రముయొక్కగాని, ఇతర జంతువులయొక్కగాని శరీరములో పుట్టించి దాని నెత్తురునందలి రసమునెత్తి దానిని రోగియొక్క నెత్తురులోనికి బోలుగనుండు సూదిగుండ చర్మముక్రింద టీకావేయవలెను. ఈ రసముతో కూడ విరుగుడు పదార్థములు రోగి శరీరములో ప్రవేశించి
సూక్ష్మజీవులచే నదివరకే పుట్టియున్న విషములను విరిచివేయును. ఇది రక్తమునందుగాని శరీరమునందుగాని, అధికమగు మార్పును కలుగజేయదు. దీనివలన రక్షణశక్తి సామాన్యముగ 15దినములకంటెహెచ్చుగనుండదు. అంటువ్యాధులలో కొన్ని సూక్ష్మజీవుల మూలమునను కొన్ని వాని విషముల మూలమునను రోగిని వధించునని చెప్పియుంటిమి. రక్షణశక్తి కూడ సూక్ష్మజీవులవలన గలుగు నపాయమునుండి రక్షించుశక్తియు, వాని విషములను విరిచివేయ తగిన రక్షణ శక్తియు అని రెండు విధములగు రక్షణశక్తి కలిగింప వచ్చుననియు చెప్పియుంటిమి. ధనుర్వాయువునందు, రోగిశరీరమునందు పుట్టు విషములకు విరుగుడుపదార్థములు గుర్రముయొక్క నెత్తురు నందలి రసములో పుట్టించి ఆ రసమును రోగియొక్క శరీరములోని కెక్కించి వానివలన సూక్ష్మజీవుల విషములను విరిచివేసి రోగము కుదుర్చుచున్నారు. కలరా, టయిఫాయిడు జ్వరములలో నిట్లుగాక వ్యాధి సూక్ష్మజీవులచేతనే కలుగుచున్నందున నితర జంతువుల శరీరములోనికి ఆయా సూక్ష్మజీవుల నెక్కించి వానిరక్తములోనుండి సూక్ష్మజీవనాశకమగు రసముతీసి దాని రోగియొక్కశరీరములోనికి బోలుసూదిగుండ ఏక్కింతురు. దీని వలన రోగిశరీరమునందలి సూక్ష్మజీవులుచచ్చి రోగికి ఆరోగ్యముకలుగవచ్చును. ఇందుచే రోగిశరీరములో చచ్చిన సూక్ష్మ జీవులనుండి పుట్టువిషపదార్థము లట్లేయుండి యొకానొప్పుడు రోగి కపాయముగలిగింపవచ్చును.
శరీరజనితరక్షణశక్తి
శరీరజనితరక్షణశక్తిని గలిగించుటకు నాలుగువిధములగు పద్ధతులు గలవు.
1.తీవ్రమైనట్టి సూక్ష్మజీవులు గలిగిన టీకారసమును శరీరములోనికి గ్రుచ్చి యెక్కించుటచేతను,
2. జీవముతోనున్నను తీవ్రము తగ్గియున్న సూక్ష్మజీవులుగల టీకారసమును శరీరములోనికి గ్రుచ్చి యెక్కించుట చేతను,
3. జీవములేని సూక్ష్మజీవులును అనగా వాని శవములుగల టీకారసమును శరీరములోనికి గ్రుచ్చి యొక్కించుట చేతను,
4.సూక్ష్మజీవులనుండి పుట్టినవిషములు గల టీకారసములను శరీరములోనికి గ్రుచ్చి యెక్కించుటచేతను,
వివిధములగు అంటువ్యాధులలో వివిధసాధనముల సాయముచే శరీరజనితరక్షణశక్తి కలిగింపవచ్చును.
1. తీవ్రమైనట్టి సూక్ష్మజీవులుగల టీకారసమును శరీరములోనికి గ్రుచ్చియెక్కించుట.
అనాదినుండియు మశూచకపు రోగియొక్క కండలలోనుండు చీమునెత్తి ఇతరుల కంటించి వారి కా వ్యాధికలిగించెడివారు. అందుచే వారికికూడ మశూచకము వచ్చును గాని సామాన్యముగా నిట్టివారలకు వచ్చుమశూచకము ఇతరులకు
వచ్చుదానికంటె తక్కువ తీవ్రముగ నుండెడిది. కాని క్రింద నుదాహరించిన ప్రకార మీపద్ధతి యొట్లుఅను యుక్తమును అపాయకరము నగునో తెలిసికొనగలరు. తీవ్రముగనున్న కలరామొదలగు సూక్ష్మజీవులుగల టీకారసమును చర్మముక్రిందికి బోలుగనుండు సూదితో నెక్కించి ఆ యా వ్యాధులకు చికిత్స చేయవలెనని యనేకులు ప్రయత్నించునున్నారు. కాని యీపద్ధతి అంతగా జయప్రదము కాలేదు.
2. జీవించియున్నను తీవ్రము తగ్గియున్నసూక్ష్మజీవుల మూలమున శరీరజనితరక్షణ శక్తికలిగించు పద్ధతి వెర్రికుక్క కాటునందును మశూచకమునందును మిక్కిలియుపయుక్తము గనున్నది.
సూక్ష్మజీవులయొక్క తీవ్రత తగ్గించుటకు అనేక పద్ధతులను అప్పటప్పటశాస్త్రజ్ఞు లుపయోగించు మచున్నారు. అందు వేడిచే సూక్ష్మజీవుల తీవ్రము తగ్గించు పద్ధతిని పశువుల దొమ్మ వ్యాధినివారించుట కుపయోగింతురు. దొమ్మసూక్ష్మజీవులు 55 అనగా మన చేతికిపట్టనంతవేడికి వచ్చువరకు కాచునెడల వాని తీవ్రము తగ్గును. ఇట్లీ సూక్ష్మజీవులుగల టీకారసమును తగిన మోతాదులుగ నేర్పరచి పశువులకు బోలుసూదితో గ్రుచ్చి చర్మముక్రింది కెక్కించినయెడల నాపశువులకు సంవత్సరము వరకు దొమ్మవ్యాధిరాదు. దొమ్మవ్యాధి తీవ్రముగల ప్రదేశములలో మందలోని పశువులకన్నిటికి నిట్టి రక్షణశక్తి కలిగిం
29-వ పటము.
30-వ పటము.
చుట యుక్తము. హంగేరీ దేశములో దొమ్మవ్యాధి తీవ్రముగ నున్నప్పుడు 16,082 గుర్రములకును, 2,10,750 పశువులకును, 11,18,443 గొర్రెలకును ఇట్టి టికాలువేయగా అంతకు పూర్వము వేయింటికి 25 చచ్చుమందలో వేయింటికి 5 పశువులకంటె యెక్కువచావలేదు. కాబట్టి దీని యుపయోగము రైతులందరు గుర్తెరిగి లాభమును పొందదగియున్నది.
౨. ఏ జంతువు యొక్క రక్తమునందు నొకజాతి సూక్ష్మజీవులుచక్కగ పెరుగవో ఆజంతువున కాజాతి సూక్ష్మ జీవులనంటించి వానితీవ్రము తగ్గించుట:—ప్రస్తుతము మశూచకము రాకుండ టీకాలు వేయుపద్ధతి దీనినుండి పుట్టినదియే. మనుష్యునకు తీవ్రముగవచ్చు మశూచియే ఆవునకంటునప్పుడు మిక్కిలితేలికయయినదై పొగుదుమీద కొన్ని పొక్కులుగా కనబడి దానికేమియును కీడుగలుగ జేయకుండ విడిచివేయును. ఈమర్మమును కనిపెట్టినదిమొదలు మశూచకమున కిప్పటి పద్ధతిని టీకాలువేయు నాచార మేర్పడినది.
ఇప్పుడు టీకాలువేయువాడుక యెల్లయెడల వ్యాపించి యున్నప్పుడు దీని విలువ మనకంతగా తెలియకపోవచ్చును. పూర్వకాలమునందు ప్రప్రథమమున మశూచకమొక దేశము నందు వ్యాపించినపుడు ఈ పెద్దమ్మవారు ప్రజలకుకలిగించు నాశమును, వికారరూపమును వర్ణింపనలవికాదు. అమెరికాదేశములో ౧౮-వ శతాబ్ద ప్రారంభమున ప్రవేశించి ఒక కోటి
- 7
ఇరువదిలక్షలమంది ఇండియనులలో (Indians) ఆరువదిలక్షల మందిని అనగా సగముమందిని తన పొట్ట పెట్టుకొనెను. ఈ వ్యాధిప్రపంచమునందలి మారెమ్మ లన్నిటిలో బహు భయంకరమైనదై యొక దేశమునైన విడువక మూలమూలలను వెదకుకొని ప్రవేశము గనెను. టీకాలువేయుట కనిపట్టక పూర్వము మశూచకమువలని ఉపద్రవము ఎంత హెచ్చుగ నుండెనో మనపమిప్పు డూహింపజాలము గాని పూర్వమొకప్పుడు మశూచకము పడనివానికి తనజీవితకాలము ప్రతినిమిషమును సందేహాస్పదముగనే యుండెను. 29, 30-వ పటములను జూడుము. చక్కని పిల్లయని వివాహమాడిన వరునకు పదిదినములలో గాఢాంధురాలగు కురూపి తటస్తమగుచుండెను. యవ్వనవతులగు పడుచులను తల్లులు విడిచి పారిపోవలసి వచ్చుచుండెను. పదుగురు అన్నదమ్ములలో చెప్పుకొనుటకు ఒక్కడైనను లేకుండ వంశము నిర్మూలమగుచుండెను. ఇట్టివ్యాధికి మన యదృష్టవశమున జెన్నరు (Edward Jenner) అనునొక ఆంగ్లేయ వైద్యునిచే కనిపట్టబడిన ఈ టీకాలయొక్క విలువ మనకిప్పుడు తెలియకపోవుట ఆశ్చర్యముకాదు.
ఆనాదినుండి చీనా (China) దేశములో మశూచకపు రోగియొక్క చీమునుతీసి మరియొకనికి అంటించి క్రొత్త వారలకు నీ వ్యాధినంటించుట వాడుకలోనుండెనట. మశూచకపు పొక్కులపై నేర్పడు పక్కుల నెండబెట్టి వాని నరగ
దీసిన గంధముతో టీకాలువేయువారలు మొన్న మొన్నటి వరకు నైజామురాజ్యములో నుండిరని తెలియుచున్నది. ఈ తూర్పుదేశముల నుండియే యితర దేశములకు మశూచకము చీమునుండి టీకారసమును తీయుపద్ధతి వ్యాపించి యుండవచ్చును. ఈ వ్యాధిని కలిగించు సూక్ష్మజీవులు గాలిలోనుండి నెత్తురులోనికి బహుశః మన ఊపిరితిత్తులగుండ ప్రవేశించి వ్యాధికలుగచేయును. ఇట్లుగాక శరీరములోని గాయముగుండ నొకని కీసూక్ష్మజీవులను అనగా మశూచకపు చీమును ప్రవేశపెట్టినప్పుడు వానికి మశూచకము వచ్చునుగాని తీవ్రము తగ్గివచ్చును. ఇట్లుచేయుటవలన కొంతమంది కుపకారము కలుగుచు వచ్చెనుగాని మొత్తముమీద వ్యాధియొక్క యుధృతము మాత్రము దేశమునందు తగ్గియుండలేదు. దీనికి రెండు కారణము లూహించియున్నారు.
i. మన మంటించిన వ్యాధి యొకానొకప్పుడు బలమై అది నిరపరాధుడగువానిని నిష్కారణముగ చంపవచ్చును. మన మంటించు వ్యాధి స్వల్పముగవచ్చి తేలిపోవునో ఉపద్రవముగ విజృంభించి మ్ర్రింగివేయునో చెప్పుట కెవ్వరికిని వీలులేక యుండెను ఎంతచీమును ఎట్టిదశలో అంటించిన రోగికి క్షేమకరమో తెలిసికొనుటకు ఆధార మెద్దియులేకయుండెను.
ii. రెండవ యుపద్రవమేమనగా మశూచకమెన్నడెరుగని యూరిలోనికి నొకరినెవ్వరినైనను కాపాడవలెనని మశూ
చకపు చీమును పంపితిమా అది వానికి ప్రయోజనకారిగా కుండుట యటుండగా ఆ యూరిలోనుండు ఇతరుల నందఱకును కొని తెచ్చుకొన్నట్లు ఈ వ్యాధి సంప్రాప్తమగుచుండెను. ఈ రెండు కారణములచేత ఒకానొకచోట ఇట్టి పద్ధతి వలన కొందఱకు ఉపకారము కలుగుచుండినను అది సర్వ జనోపయోగముగ నుండలేదు.
ఇట్టి దినములలో లండనులో(London) నుండు జా హంటర్” (John Hunter) అను ఒకవైద్యునియొద్ద ౧౭౬౯ సంవత్సరములో ఎడ్వర్డు జెన్నరు (Edward Jenner)అను నతడొకడు శిష్యుడుగా ప్రవేశించెను. 31-వ పటమును జూడుము. ఆ కాలములో మశూచకము ఆ దేశమునందు మిక్కిలి ప్రబలి యుండెను. అట్టి సమయమునందు గొల్లవారలకు ఎందుచేతనో గానిమశూచకము వచ్చుచుండుటలేదు. ఇటు నటునుండు ఇండ్లలో లెక్కలేకుండపీనుగలు పడుచుండినను మధ్యనుండు గొల్ల వానియింటిలో ఎందుచేత నీఅమ్మవారు ప్రవేశింపదో ఎవ్వరికిని తెలియని మాయగానుండెను. ఒకనాడొక గొల్లపిల్ల వచ్చి జెన్నరుతో నిట్లనియె. ‘అయ్యో! నా చేతిమీద పాలపొక్కులు (Cow pox) పొక్కినవి. నాకింక పెద్దమ్మరాదు’ అనెను. ఇది వినినతోడనే జెన్నరు తన గురువువద్దకు పోయి ‘అయ్యా యీ గొల్లపిల్ల యిట్లు చెప్పెను. దీనికి ఏమికారణము’ అనియడిగెను. అప్పుడుగురువు జెన్నరుతో‘ఊరకే వట్టియూహలుచేయకుము.
సత్యమును ఓపికయు విడువకుము. శోధింపుము’ అనెను. అప్పటినుండియు నీ అంశములను మనస్సులో బెట్టుకొని యెల్లప్పుడును ఆలోచించుచు తన చేతనైనంతవరకు శోధించుచు వచ్చెనుగాని రమారమి ముప్పదిసంవత్సరములవరకు దాని నిజము చక్కగా నతనికి చిక్కలేదు. ఈ లోపుగ ౧౮౮౦-వ సంవత్సరములో నొకనాడు అతని స్నేహితునొకనితో ఒంటరిగా ప్రయాణముచేయుచు అతనితో నిట్లనెను. ‘గొల్లవార్లకు పెద్దమ్మవారు రాదని చెప్పినమాట నిజమైనయెడల వీరలకుండు పొక్కులను ప్రజలకందరకు అంటించి వారికికూడ పెద్దమ్మవారు రాకుండ చేయుట సాధ్యము కాకూడదా?’ అని చెప్పుచు అతనికి తానిట్లు చెప్పినట్లు యెవ్వరికిని తెలియనీయవలదని బ్రతిమాలుకొనెను. ఒకవేళ అందఱును ఈ మాటను వినినయెడల తన్ను వెక్కరింతురేమోయని జెన్నరుకు భయముగనుండెను. అయినను అనేక సంవత్సరములు గడచినను తనకు ఏమియు నంతు చిక్కకపోయినను విడువక ఈ విషయమునే తన మనస్సునందుంచుకొని ఊరక ఆలోచించుచుండెను. తుదకు పదియునారు సంవత్సరములు గడచినపిమ్మట ఒకనాడు జెన్నరొక గొల్లపిల్ల చేతిమీది పొక్కులోని చీమునుకొంచెమెత్తి ఒకపిల్లవాని కంటించెను. ఇప్పుడు మనకు టీకాలువేసినప్పుడు పొక్కులు పొక్కినట్లు వానికి పొక్కులు పొక్కి అవి రెండు వారములలో మానెను. అటుపిమ్మట కొంతకాల
మయిన తరువాత జెన్నరు వానికి మశూచకపు చీమును అంటించెను. కాని ఎన్నివిధముల ప్రయత్నించినను వానికి మశూచకము అంటలేదు. ఇదిచూచి జెన్నరు సంతసించి ఇట్లనేకమందికి రెండు సంవత్సరములవరకు మొదట గొల్లవాండ్ల పొక్కు చీమును దానిపొక్కు మానినతరువాత పెద్దమ్మ చీమును అంటించుచు అనేకులమీద శోధనలుచేసెను. టీకాలు చక్కగ అంటినవారి కెవ్వరికిని పెద్దమ్మవారు సోకదని అతడు కనిపెట్టెను. ఇదిగాక ఈ రెండువ్యాధులకును ఎదో ఒకవిధమయిన సంబంధము గలదనియు బహుశః ఈ రెండు వ్యాధులు ఒకటే వ్యాధియనియు ఆ వ్యాధిపశువులకు వచ్చినప్పుడు దాని ఉధృతము తగ్గి హానిలేని పొక్కులుగా బయలుదేరి తేలికగా పోవుననియు ఈ వ్యాధియే మనుష్యులలో ప్రవేశించినపుడు ఉపద్రవమై భయంకరమైన మారిగా పరిణామము చెందుననియు జెన్నరు ఊహచేసెను.
పైని వ్రాసినది చదివిన యెడల ‘ఇంతేకదా మహాకార్యము’ అని తోచవచ్చును. కాని లక్షలకొలది కోట్లకొలది ప్రతిదినమును రూపు మాసిపోవు ఆ దినములలో నితడు చేసిన పరిశ్రమకు యింతింతని వెలగలదా? ప్రపంచమునందలి కిరీటాధిపతు లందరు జెన్నరున కప్పుడు ‘దాసోహ’మనిరి. నెపోలియన్ అంతటివాడు జెన్నరునకు ‘ఏమి యడిగిన నిచ్చెద’ ననెనట!
జెన్నరు చూపిన మార్గమున ననుసరించి ఇప్పటివైద్యులు అనేకములయిన అంటువ్యాధులకు టీకాలు వేయు పద్ధతిని కనిపట్టియున్నారు. ఇంక ననేకవ్యాధులవిషయమై యింకను గట్టి ప్రయత్నములు చేయుచున్నారు. దీని కంతకును జెన్నరే మూలపురుషుడు. వందనీయుడగు మహాత్ముడు. జెన్నరు టీకాలు కనిపట్టినతరువాత ‘వేలకొలది మైళ్లదూరములోనున్న అమెరికా మొదలగు ఖండాంతరములకు ఈ టీకారసములను ఎట్లు పంపుట? ఇది యనేకదినములు నిలిచియుండదుగదా?’ అని యొక గొప్ప సంశయము కలిగెను. అంతట వారీ క్రింది యుక్తిని పన్నిరి. ఆ కాలములలో పడవలు ఇప్పటివలే యంత్ర శక్తిచే వారముకను వేలకొలదిమైళ్లు పరుగెత్తునవికావు. అప్పుడొక చిన్న ప్రయాణమనిన ఆరుమాసములు పట్టెడిది. అప్పటి పుణ్యాత్ములు కొందరు దండు కట్టుకొని ఇరువది లేక ముప్పది చంటిబిడ్డలను తగినంతమంది వైద్యులను, దాదులను చేర్చుకొని టీకారసమును కొని పోవుటకు ఖండాంతర ప్రయాణమునకై ఓడ నెక్కుదురు. వారితోకూడ నొకరిద్దరు పిల్లలకు టీకాలు వేసి తీసికొనిపోవుదురు. ఎనిమిది దినములయినతరువాత నీ యిద్దరు పిల్లలనుండి మరిద్దర కీ చీమునుమార్చుదురు. ఇట్లు వారము వారమునకు మిక్కిలి జాగ్రత్తతో మార్చుకొనుచు వాని బలము తగ్గిపోకుండ నెలల తరబడి కాపాడుచు తమ గమ్యస్థానమును చేరుదురు. ఇట్లా దినములలో ననేక కష్టముల కోర్చి ప్రపంచమంతటకు నీ టీకారసమును వ్యాపింపజేసిరి.
పెద్దమ్మవారనిన భయములేనట్టి యీ దినములలో టీకాలువేసికొనుమనిన ‘మాకు వద్దు వద్దు’ అని పారిపోవు వారు ఈ చరిత్రమునంతయు వినినతరువాత నట్లు చేయుదురా?
iii. విషమును ఆరబెట్టుటవలన దాని తీవ్రమును తగ్గించుట;—ఈ ప్రకారము చేయు చికిత్సలలో వెర్రికుక్క కాటునకు చేయునది మిక్కిలి జయప్రదముగనున్నది. ఇది పాస్టరు అను జీవశాస్త్రవేత్త మనకు ప్రసాదించిన యమూల్యమైన వరము. 33-వ పటమును జూడుము. వెర్రికుక్క కాటునందలి విషమును కలిగించు నిజమైన సూక్ష్మజీవు లింకను సరిగా తెలియలేదు. అయినను పాస్టరీ వ్యాధి రాకుండ కాపుదలగా నుండు మందు ననేక సంవత్సరముల క్రిందటనే కనిపట్టి ప్రపంచమునకు మహోపకారమును చేసియున్నాడు. మిక్కిలి తీవ్రమగు పిచ్చియెత్తిన చెపులపిల్లల వెన్నెముక నడుమనుండు వెనుపాము అను నరముల త్రాటినెత్తి దాని ననేక ముక్కలుగ నరికి వేరువేరు ముక్కలను ఒక దానికంటె నొకటి యెక్కువగ ఆరునట్లు కొన్నింటిని రెండుదినములును ఇంక కొన్నిటిని ౩,౪,౫ మొదలు పది పదునైదు దినముల వరకనగా కడపటి వాని యందలి విషమంతయు నశించిపోవువరకు ఆరబెట్టుదురు.
వెఱ్ఱికుక్క కరచినవారలు కూనూరు (Coonoor) నకు పోయినపుడు వారలకు మొదటిదినమున మిక్కిలి బలహీనమయిన కషాయమును అనగా బొత్తిగ విషము లేకుండ నారబెట్టిన తునకలనుండి యెత్తిన టీకారసమును కండలోనికి బోలు
31-వ పటము.
EDWARD JENNER.
ఎడ్వర్డు జెన్నరు;
32-వ పటము.
LOUIS PASTEUR.
లూయిపాస్టరు.
సూదిగుండ ఎక్కింతురు. దీనికి అతడు తాళుకొనినపిమ్మట క్రమక్రమముగ నొకనాటికంటె మరియొకనాడు హెచ్చు మోతాదుల నెక్కించి తుదకెంత హెచ్చయిన విషమునైనను తాళుకొను శక్తివచ్చునట్లు చేయుదురు. ఇట్లు ఇరువదిదినములలోపల రెండుదినములుమూత్ర మారబెట్టిన తునకలనుండి తీసిన టీకా రసము నెక్కింతురు. ఇందుచే పిచ్చికుక్కకాటువలన అతని శరీరమునందు పుట్టు విషమంతయు విరిగిపోయి దానివలన కుక్క కాటువలన రాబోవు బాధ ఎంతమాత్రమును లేకుండపోవును. మొదటనే ఎండపెట్టకుండ తయారుచేయబడిన తీక్షణమయిన పచ్చివిషమును ఎక్కించినయెడల రోగి చచ్చిపోవును. కాని క్రమక్రమమున శరీరమునకు అలవాటు చేసినప్పుడు ఎంతతీక్షణమయిన విషమునయినను తాళుకొనగలడు.
ఈ వైద్యము ప్రారంభించిన తరువాత మూడు లేక నాలుగు వారములకుగాని యీ టీకాలగుణము చక్కగ పట్టునని చెప్పుటకు వీలులేదు. కాబట్టి కుక్క గరచినవారలు వెంటనే వైద్యమునకు ప్రారంభించినగాని ప్రయోజనముండదు. వ్యాధిరాక పూర్వము చికిత్సచేసి వ్యాధి రాకుండజేయవచ్చును. కాని వ్వాధియొక్క యుధృతము ప్రారంభించిన తరువాత కుదుర్చుటకు వీలులేదు. వెర్రినక్కలు గరచినగాని కుక్కలకు వెర్రి యెత్తదని ప్రజల యభిప్రాయము. కాని కుక్కలే దీనికి ముఖ్యకారణములని యీ క్రింది లెక్కలనుబట్టి తెలియగలదు. ఉత్తర హిందూ స్థానములో కౌశాలి యనుచోట గల వైద్యశాలలో వైద్యము చేసికొనినవారి సంఖ్యనుబట్టి వ్రాయబడిన
ఈ క్రింది సంఖ్యలవలన ఈ విషయము స్పష్టముకాగలదు. 1902 మొదలు 1942 వరకు గల కాలములో 14,730 కుక్కలును 2,491 నక్కలును, 140 గుర్రములు, 78 పిల్లులును, 71 తోడేళ్లును, 16 పశువులును, 79 మనుష్యులును కరచుటవలన వెర్రికలిగినది. దీనినిబట్టి కుక్కలే యీ వ్యాధికి ముఖ్యకారణములని తెలియగలదు. మన రాజధానిలో వెర్రికుక్క కాటుకు చికిత్సచేయు ఔషధశాల కూనూరునందు కలదు. ఈ క్రింది 33-వ పటము జూడుము. అక్కడకు పోవు
33-వ పటము.
వారలు తాలూకా మేజస్ట్రీటునకుగాని డిష్ట్రిక్టు సర్జనునకుగాని తమ యభిప్రాయమును తెలిసినయెడల వారు రోగులకు రైలు చార్జి వగయిరాలిచ్చి సదుపాయములన్నియు జెప్పుదురు.
౩. ఇంతవరకుజీవించియుండియు తీవ్రము తగ్గినవిషయములచే శరీరజనితరక్షణశక్తిని కలిగించుటనుగూర్చి చెప్పియున్నాము. ఇక జీవములేని సూక్ష్మజీవుల కళేబరములనుండి తీసిన రసమునెత్తి దానితో అంటువ్యాధులను గుదుర్చుమార్గములను జూపెదము. బ్రతికియున్న సూక్ష్మజీవులను మన శరీరములోని కెక్కించి నప్పుడు ఒకానొకచో నపాయము కలుగవచ్చును. ప్రాణములేని సూక్ష్మజీవుల నుపయోగించునపు డట్టి యపాయముండదు. కొన్ని సూక్ష్మజీవుల మృతకళేబరముల నుండి కూడ నుపయోగకరములగు టీకారసములను మనము తయారుచేయవచ్చును. కలారా, టైఫాయిడుజ్వరము, మహామారి (ప్లేగు). క్షయ మొదలగు వ్యాధులం దీ పద్థతి ప్రస్తుతము కొంతవర కుపయోగములోనున్నది.
తీవ్రమైన కలరా సూక్ష్మజీవులను తగినన్నిటిని బోలు సూదిగుండ కడుపులోనికి పిచికారీ చేసినయెడల చుంచులు పిల్లులు మొదలగు జంతువులు చచ్చును. కాని కలరా వ్యాధి వచ్చి నెమ్మదియయిన రోగిశరీరము నుండి కొంచెము రక్తము నెత్తి దానియందలి రసముతో పైని చెప్పినన్ని కలరా సూక్ష్మజీవులనే కలిపి యా మిశ్రపదార్థమును ఆ జంతువుల కడుపు లోనికి బోలుసూదిగుండ నదేప్రకార మెక్కించినప్పు డవి చావవు. అనగా కలరా సూక్ష్మజీవుల శక్తి రోగియొక్క రసమునందుండు విరుగుడు పదార్థములచే నశించిపోయినది. ఈ
రసమునందున్న గుణ మితర మానవుల రసమునందున్నట్టిది కాదు. కొంతవరకు మనయందుండు రక్తమునందలి రసమునందును సూక్ష్మజీవులను చంపు శక్తికలదని చెప్పియున్నాము. అట్టిశక్తి అన్నిజాతుల సూక్ష్మజీవులను సమానముగా చంపునుగాని కలరావ్యాధివచ్చి తేలిన రోగియొక్క రక్తమునందుండు రసము కలరా సూక్ష్మజీవులను మిక్కిలి వేగముగ చంపును. కావున ఇట్టివాని రసమునందుండు పదార్థములను కలరా నాశకపదార్థములని చెప్పవచ్చును. ఇట్లే టైఫాయిడు జ్వరమువచ్చి కుదిరినవారి నెత్తురులో టైఫాయిడు నాశకపదార్థములును, ప్లేగువచ్చి, కుదిరినవారి శరీరములో ప్లేగు నాశకపదార్థములును ఉండును. ఒకటి రెండువారములు టైఫాయిడు జ్వరము పడినవారి నెత్తురు నీ టైపాయిడు నాశకపదార్థములుండుటనుబట్టి ఫలానా రోగియొక్క జ్వరము టైఫాయిడు జ్వరము అగునా కాదా యను విషయమునుకూడ తెలిసికొనవచ్చును. అనుమానముగ నున్న రోగియొక్క రక్తమునుండి యొకబొట్టు రసమునెత్తి దానిలో కొంచెము టైఫాయిడు సూక్ష్మజీవులను కలిపి సూక్ష్మదర్శినిలో పరీక్షించిన యెడల అవియన్నియు చలనము మాని ముద్దలుముద్దలుగా కూడుకొనుట చూడనగును. ఆ రోగియొక్క జ్వరము టైఫాయుడు జ్వరము కానియెడల మనము కలిపిన టైఫాయుడు సూక్ష్మజీవులా రసములో యధేచ్చముగా గంతులువేయుచు మెలికలు తిరు
గుచు పరుగులెత్తుచుండును. దీనినిబట్టి రోగిజ్వరము టైఫాయిడుజ్వరము అగునా కదా యని తెలియనగును.
ఆ యా రోగుల నెత్తురు ఆ యా జాతి సూక్ష్మజీవులను చంపు శక్తి నధికముగ పొంది యున్నదను విషయము తెలిసిన తరువాత ఆరోగ్యవంతుల శరీరములో నిట్టిశక్తి మనమెట్లయిన పుట్టింపగలమా యని యనేక వైద్యులు ప్రయత్నించిరి. తీవ్రమైన సూక్ష్మజీవులను మానవుల కంటించుట ఒక్కొక్కప్పు డపాయకరము కావున చచ్చిన సూక్ష్మజీవులనే యుపయోగింపనగును. ఈ ప్రకారము తయారు చేయబడిన టీకారసములు కలరాకును, టైఫాయిడుజ్వరమునకును, ప్లేగు నకునుకూడ ప్రస్తుతము మందులషాపులలో విక్రయిముకు దొరకును.
కలరా టీకారసము
1894 సంవత్సరములలో కలకత్తాలో నీ కలరా టీకారసమును 36 ఇండ్లలో 521 మంది కుపయోగించిరి. అందొక యింటిలో 18 మంది మనుష్యులుండిరి. వారిలో 11 గురికి కలరాటీకాలు వేసిరి. 7 గురికి కలరాటీకాలు వేయలేదు. టీకాలులేని 7 గురిలో 4 గురికి కలరావచ్చి ముగ్గురు చనిపోయిరి. టీకాలు వేసిన 11 గురిలో నొక్కరికికూడ కలరా రాలేదు. కాని కలరా టీకారసమువలన పుట్టిన రక్షణశక్తిటీకాలు వేసినదిమొదలు 15 దినములకంటె హెచ్చుకాలముండదు.
అందుచేత నీవిధమైన చికిత్స సర్వత్ర ఉపయోగించుట కనుపయుక్తముగనున్నది.
టైఫాయిడు టీకారసము
టైఫాయిడు టీకారసమును తగిన మోతాదును చర్మము క్రిందికి పిచికారితో ఎక్కించినయెడల టైఫాయిడుజ్వరము రాకుండ కొంతవరకు కాపాడును. ఎక్కించినదినమున 101 లేక 102 డిగ్రీలవరకు జ్వరమును, తలనొప్పియు కొంత భారకింపును కలిగించును. చుట్టుప్రక్కలనుండు బిళ్లలు కొంచెముబ్బి నొప్పిగనుండును. ఒకానొప్పుడు సీమనుండి హిందూ దేశమునకువచ్చు పటాలములోని సోల్జర్లకందరకును నీ టీకారసమును ఎక్కించెడివారు. కాని ఈ పద్థతియొక్కయుపయోగమునుగూర్చి నిర్ధారణగా చెప్పుటకు వీలులేదు.
ప్లేగు టీకారసము
ప్లేగు సూక్ష్మజీవులను ఒక నెలవరకు మాంసరసములో పెంచి దానిని తగినంతవరకు కాచి దానియందలి సూక్ష్మజీవులను చంపి ఆ రసములో 50 లేక 60 చుక్కలు కండలోనికి ఎక్కించినయెడల అట్టి స్థలమునందు కొంచెము వాపును నొప్పియు కలిగి కొద్దిపాటి జ్వరమువచ్చును. ఇట్టి వారలకు 8, 10 రోజులు గడచినపిమ్మట తిరిగి ఇంకకొంచెము హెచ్చు మోతాదుగల టీకారసము ఎక్కించినయెడల వారలకు సామాన్యముగ అనేక నెలలవరకు ప్లేగువ్యాధిరాదు. బొంబా
యిలో అధికముగ ప్లేగువచ్చియున్నప్పుడు అక్కడిజెయిలులోని 154 గురు జనులకు ప్లేగు టీకాలువేసిరి. 177 గురు టీకాలు లేకయుండిరి. టీకాలు వేసినవారిలో నొక్కడును ప్లేగుచే మృతినొందలేదు. కాని టీకాలు వేసికొనని వారిలో 14 గురికి ప్లేగువచ్చి 6 గురు మృతినొందిరి. కాబట్టి యీ ప్లేగు టీకాలను వ్యాధి ముమ్మరముగ గలయన్నిచోట్లను వైద్యులకును పరిచారలకులకును సేవకులకును నిర్బంధముగ వేయవలెను. ప్రజలకుకూడ నీటీకాల యుపయోగమునుగూర్చి బోధించి సర్వత్ర వ్యాపించునట్లు ప్రోత్సాహపరచవలెను.
క్షయ టీకారసము
దీనిని ప్రస్తుతము పెద్దపట్టణములన్నిటి యందును వైద్యు లుపయోగపరుచుచున్నారు. ఇందు రెండు విధముల టీకారసములు గలవు.
1. క్షయ సూక్ష్మజీవులను చంపి వాని శరీరములో నుండు విషములను వేడినీళ్లు గ్లిసరిౝ మొదలగు ద్రావకములతో కలిపి విడదీసి ఆ విషములను ద్రవరూపముగ శరీరము లోనికి ఎక్కించుట.
2. క్షయ సూక్ష్మజీవులను మెత్తగనూరి పొడిగాజేసి ఆ పొడిని పరిశుభ్రమయిన నీటిలో కలిపి ఆ నీటిని తగు మోతాదులతో చర్మముక్రింద ఎక్కించుట.
ఇట్టి టీకాలవలన మన శరీరమునందు సూక్ష్మజీవుల కపకారులగు తెల్లకణములును విరుగుడు పదార్థములును వృద్ధియై అవి శరీరమునకు రక్షణశక్తిని హెచ్చుచేయును. నిజముగ కుదిరినదని చెప్పుటకు సామాన్యముగ రెండు సంవత్సరములవర కీవిధమయిన చికిత్స చేయవలెను.
క్షయ టీకారసము ఇతరులయందుకంటె క్షయరోగులయందు నొప్పి, వాపు, జ్వరము, మొదలగు గుణములను కలిగించును. దీనినిబట్టి ఒకానొక రోగి క్షయరోగియగునా, కాదా, యను విషయమును గుర్తించుటకు తగిన మార్గములు ఏర్పరచియున్నారు. టీకావేసినచోట వాపు ఎరుపు మొదలగునవి కలిగినయెడల నా రోగికి క్షయవ్యాధి యున్నట్టును అట్టి వాపు ఎరుపు లేనియెడల క్షయవ్యాధి వానికి లేనట్లును గ్రహింపవలెను.