మహాపురుషుల జీవితములు/సర్ సయ్యదు మహమ్మదుఖాను
సర్ సయ్యదు మహమ్మదుఖాను
సయ్యదు మహమ్మదుఖాను 1813 వ సంవత్సరము 17 వ అక్టోబరు తారీఖున ఢిల్లీలో జన్మమొందెను. అతని పూర్వులు మొగలాయి చక్రవర్తులవద్ద గొప్ప యుద్యోగములు చేయుచువచ్చిరి. ఆతనితండ్రి సయ్యదు మహమ్మదుటర్కీ ఢిల్లీచక్రవర్తియగు రెండవయక్బరునకు బ్రాణమిత్రుఁడై యుండెను. ఈ టర్కీమహమ్మదుగారే యా చక్రవర్తవద్ద మంత్రియై యుండెను. ఆ మంత్రి మృతినొందినప్పుడు చక్రవర్తియైన రెండవ షాలం గతించిన మంత్రియొక్క బిరుదులు మొదలగునవి మహమ్మదు టర్కీకి నియ్యదలంచెను. కాని టర్కీ యవి తన కక్కరలేదని చెప్పెను. మహమ్మదుటర్కీ 1836 వ సంవత్సరమున మృతి నొందెను. అప్పటికి సయ్యదు మహమ్మదుఖాను పందొమ్మిదేండ్ల ప్రాయము గలవాఁడైనను గడపటి ఢిల్లీ చక్రవర్తియగు బహదూరుషా మాతామహుని బిరుదులన్నియు వానికిచ్చి యనుగ్రహము చూపెను.
అహమ్మదుఖాను పసిబిడ్డయైనపుడు తల్లినోటనుండియే చదువు నేర్చుకొనెను. అతఁడు పగలు నేర్చుకొన్న చదువంతయు వాని తల్లి రాత్రి వానివద్ద నప్పగించుకొనుచు వచ్చెనట. అతఁడు యింగ్లీషు నేర్చుకొనలేదు. నేర్చుకొన్న స్వభాషావిద్యయు పితృమరణమువలన గాబోలు 1837 వ సంవత్సరమున సమాప్తి యయ్యెను. అందుచేత నతఁడా సంవత్సరమున నుద్యోగమునకై బ్రయత్నించి ఢిల్లీలోనున్న సర్కారువారి సాదరమీను కోర్టులో స్తిరస్తదారుగ బ్రవేశించెను. అతఁ డుద్యోగమున ప్రవేశించిన స్వల్పకాలములోనే యభివృద్ధిని పొందెను. అపనిలోఁ బ్రవేశించిన రెండేండ్లకే యాగ్రా కమీషనరు
గారివద్ద వానికి సాయబుమునిషీ పని యయ్యెను. 1841 వ సంవత్సరమం దతనిని దొరతనమువారు సిక్రీపట్టణమున మునసబుగా నియమించిరి. 1846 సంవత్సరమున మునసబుగానే ఢిల్లీకి బోయి పని చేసెను. 1850 సంవత్సరమందు వానికి రహతుకుపట్టణమున సబుజడ్జీపని యయ్యెను. సిపాయి పితూరి జరుగుటకు రెండేండ్లముందు దొరతనమువారు వానిని బిజనూరునకు మార్చిరి. అతఁ డక్కడ నుండగానే యాపితూరీ బయలు దేరెను. ఆసమయమున నతఁడు గవర్నమెంటువారికి జేసిన యమితోపకారమునుబట్టి వానికీర్తియంతయు హిందూస్థానమందంతట వ్యాపించెను. పితూరీ బయలుదేరిన వార్త తెలియునప్పటికి బిజనూరులో నింగ్లీషువారుస్త్రీలు పురుషులు బాలురు గలసి యిరువదిమంది యుండిరి. షేక్స్పియరను నొక దొర యాగ్రామము వారిలో గొప్పయుద్యోగస్థుఁడు. పితూరీదారులు కనబడిన తెల్లవారినెల్ల నరుకుచుండుటచే నా తెల్లవారుభయబ్రాంతులై యుండ నహమ్మదుఖాను నూరుమంది పటాను గుఱ్ఱపురౌతులను సిద్ధముచేసి పితూరీని గూర్చి నిజమైనవార్త నెప్పటికప్పుడు తెలియుటకు నమ్మికగల వేగులవాండ్రను బెట్టెను. కాని యా పటానులు శయితము పితూరీదార్లతోగలసి కుట్రచేయుటచే నొక నాడాయిరువది మంది తెల్లవారిని పితూరీదారు లెనిమిదివందలమంది వచ్చి చుట్టుముట్టిరి. అహమ్మదుఖాను దొరల నివాసము రహస్యముగ ప్రవేశించి వారితో సత్వరముగ నాలోచన చేసి తాను స్వయముగ పితూరీదారుల సేనాధిపతి యొద్దకుఁబోయి తెల్లవారిని వీరోపాయముగ బారిపోవనిమ్మని వేడుకొనెను. ఆ సేనాపతియు నా ప్రాంతభూమి ఢిల్లీ చక్రవర్తి స్వాధీనము చేసినట్లు తెల్లవారిలో ముఖ్యులు పత్రములు వ్రాసియిచ్చినయెడల జోవనిత్తుమని చెప్పి యట్లు వ్రాయించుకొని వారిని బోవనిచ్చెను. ఆ పత్రము వ్రాయించునపు డహమ్మదు
ఖాను మరల నింగ్లీషువారి భూమి పుచ్చుకొనుటకు వచ్చువఱకు ననుమాట లాకాగితమందు మెలకువతో జేర్పించెను. పిమ్మట నింగ్లీషువారు నిరపాయముగా బోవ నాయూరు పితూరీదారు లాక్రమించిరి. పితూరీదారులలో ననేకులు తురకలగుటచే దెల్లవారితో జేరి యహమ్మదుఖాను తమప్రయత్నము విఫలము చేయుచున్నాడని స్వమతస్థులు వానిపై ద్వేషము బూనియుండిరి. అది కారణముగ బ్రాణభీతిజెంది యహమ్మదుఖాను మొదటహాలుదారు గ్రామమునకు బిదప మీరతుపట్టణమునకు బారిపోయి యచ్చట గూడ సురక్షితుఁడు గామి ఢిల్లీ ఇంగ్లీషువారి స్వాధీనమైన పిదప యక్కడికిని బారిపోయెను. ఈ సిపాయి పితూరీలో నితఁడు చేసిన యుపకారమునకుఁ గృతజ్ఞులై దొరతనమువారు రెండు తరములవఱకు నెలకు రెండువందల రూపాయలచొప్పున వాని కుటుంబమునకు భరణ మేర్పరచి వానికిఁ జాల బిరుదులు నిచ్చిరి. ఈవిధములైన సత్కారములు వానికిఁ జేయవలసినదని షేక్స్పియరు దొరగారు దొరతనము వారికి గట్టిగా సిపారసు చేసిరి.
ఆ పితూరీ ముగిసిన వెనుక నహమదుఖాను పితూరీవచ్చుటకు ముఖ్యకారణముల నొక పుస్తకముగ హిందూస్థానీభాషలో వ్రాసెను. ఆ గ్రంథము నతఁడు పేర్కొన్న ముఖ్యకారణము లివి. 1 ప్రజలు దొరతనమువారి యభిప్రాయములను దెలిసికొనక యపోహపడుట. 2. ప్రజల పూర్వాచార వ్యవహారములకు విరుద్ధముగ నుండునట్టి చట్టములను దొరతనమువారు నిర్మించుట. 3. ప్రజల యాలోచనలను వారి యాచారపద్ధతులను గవర్నమెంటువారు తెలిసికొనక పోవుట. 4 మంచి పాలనమునకు ననుకూలమగు విషయములను దొరతనమువారు శ్రద్ధచేసి కనుఁగొనకపోవుట. 5. సైన్యమునందు దొరతనమువారిమీఁద నసహ్యము కలుగుట. అయోధ్య రాజ్యమును నవాబుల
స్వాధీనమునుండి తప్పించి యింగ్లీషువారు కలుపుకొనుట పితూరీకి ముఖ్యకారణమని హిందూదేశములో గొప్పవా రభిప్రాయపడినను ఖానుగా రదియొక కారణముగ దలంపరైరి. ఈవిధముగ సిపాయి పితూరీలో దొరలకుఁ జేసిన సాయమునుబట్టి యతఁడు మహాప్రఖ్యాతుఁడైనను కేవల మదియే యతని ప్రఖ్యాతిఁ గారణమని దలంపఁగూడదు. బాల్యమునుండియు నతనికి విద్యావ్యాసంగము మీఁదగల యభిరుచి చేతను తనతోడి తురకల యవస్థను విద్యాభ్యాసాదుల యందు వృద్ధిచేయుటకుఁ బడిన పాటు చేతను వానికి మహాప్రసిద్ధి గలిగెను. పురాతన శిలాతామ్రశాసనములను వెదకి పూర్వచరిత్రముల నరయుటలో నతనికి బాల్యమునుండియు నభిరుచి గలదు. ఆ విషయమున జాల ప్రయత్నముచేసి యతఁడు 1847 సంవత్సరమున ఢిల్లీ ప్రాచీన చరిత్రమును వ్రాసి ప్రకటించెను. ఈ గ్రంథమును ఫ్రెంచివాఁ డొకఁడు తన భాషలోనికి మార్చుకొనెను. అందువలన నతనికి యూరపుఖండమునందు సయితము మేలు కలుగ లండను పట్టణములోని రాయలేషియాటిక్కు సంఘమువారు వానిని దమ సభలోఁ జేర్చికొనిరి. అహమదుఖాను స్వమతాభిమాని, అందుచేత స్వదేశాభిమాని యని గూడ చెప్పవచ్చును. అట్టి యభిమానముండుటచేతనే 1860 సంవత్సరమం దతఁడు హిందూదేశపు మహమ్మదీయుల రాజభక్తి యను బేరుపెట్టి యొక చిన్న పుస్తకమును వ్రాసెను. మహమ్మదీయులు చాల విశ్వాసముగలవారనియు వారిలో గొందఱు సిపాయిపితూరీలో దొరతనమువారికి జాల సాయము జేసిరనియుఁ దెలుపుటయే యీ గ్రంథరచనలో వాని ముఖ్యోద్దేశము తనతోడి తురకలు మిక్కిలి దీనదశలో నుండుటకుఁ గారణము నతఁడు చిరకాలము విచారించి విద్యావిహీనతయే వారి భ్రంశమునకు హేతువనిసిద్ధాంతీకరించెను. చదువేతురకలగుసర్వార్ధ సాధకమని
యతని నిశ్చితాభిప్రాయము. హిందూ దేశములో సాంఘిక రాజకీయ విషయములలోఁ బ్రజలకుగల లోపముల కంతకు విద్యాహీనతయే మూలమని యతఁడు నమ్మెను. వేళ్ళు బాగుచేయుడు వృక్షము దానంత టదియే వృద్ధిపొందునని యతఁడు పలుమారు చెప్పుచువచ్చెను. అట్టి నమ్మకము నిశ్చయముగ నుండుటచేతనే యతఁడు 1858 వ సంవత్సరమున మహమ్మదీయులు దేశచరిత్రములను జదువుకొనుటకు మురాదాబాదులో నొకపాఠశాల పెట్టించెను. దేశచరిత్రా బోధకములగు గ్రంథములు హిందూస్థానీ భాషలో లేనందున నాగ్రంథ దారిద్ర్యమును నివారించుట కతడు భాషాంతరీకరణ సంఘము నొక దానిని నేర్పరచెను. ఇంగ్లీషులోని చరిత్రలను హిందూస్థానీలోనికి మార్చుటయే దాని ముఖ్యోద్దేశము. 1862 వ సంవత్సరమున నతఁడు షాజి పురమందు సబుజడ్జిగానుండి, యాకాలమందే క్రైస్తవ వేదమగు బైబిలునకు వ్యాఖ్యానము వ్రాసెను. అతని కింగ్లీషురాదు గావున బైబిలుమీఁదనున్న గ్రంథములన్నియు ముందు హిందూస్థానీలోనికి మార్పింపజేసి పిదప నీవ్యాఖ్యానమును ప్రారంభించెను. పైనచెప్పిన భాషాంతరీకరణ సంఘము నతఁడు షాజిపురమున నుండగానే 1864 వ సంవత్సరం జనవరి 9 వ తారీఖున స్థాపించెను. ఈ సంఘమే పిదప కొంతకాలమునటఁ బ్రకృతిశాస్త్ర సంఘమనుపేర నల్లి ఖరుపట్టణమున బయలుదేరెను. ఈ సంఘము మంచియుపకారము చేసెను. ఏలయన నింగ్లీషుభాషలోనున్న సద్గ్రంధము లెన్నో హిందూస్తానీ భాషలోనికి మార్చబడెను. ఆ సంవత్సరమే దొరతనమువా రహమ్మదుఖానును, ఆల్లీఖరుపట్టణమునకు సబుజడ్జీగా బదిలీ చేసిరి. ఈపట్టణము యతఁడు కావించిన సత్కార్య సంతతికి జన్మభూమి. ఈ పట్టణముపేరు తప్పక దలంపవలసి యుండును. 1866 వ సంవత్సరమందు గవర్నరు జనరలుగారగు లారెన్సు ప్రభువుగారు వాని చేసిన విద్యాభివృద్ధికి సంతసించి యొక బంగారు పతకమును మెకాలే కవిరచితమైన గ్రంథమును
వానికి బహుమాన మిచ్చిరి. ఆ పతకముమీఁద నిట్లు వ్రాయఁబడి యున్నది. "తన స్వదేశస్థులలో ప్రకృతి శాస్త్రాదివిద్యలు వ్యాపింపఁ జేయుటకుఁబడిన పరిశ్రమమునకు సంతసించి సర్ సయ్యదు అహమ్మదుఖానునకు గవర్నరు జనరలు బహుమానము చేసిన పతకము."
ఇట్లు దొరతనమువారు తగిన ప్రోత్సాహము నిచ్చుటచే నతఁడు మునుపటికంటె కార్యలోలుఁడై విదేశముల యందలి పద్ధతులు జాడఁదలచి 1869 వ సంవత్సరమున నింగ్లాండునకుఁబోయెను. అతనికి లండను పట్టణమునం దున్నప్పుడె సి. యస్. ఒ. యను బిరుదము వచ్చెను. మరియు నింగ్లాండు దొరతనమువారు వాని యందుఁ బ్రీతిగలిగి సంవత్సరమునకు మూడువేల రూపాయల చొప్పున రెండేండ్లు బహుమాన మిచ్చిరి. అతడక్కడ నుండగనే యతఁడు స్వమతగురువగు మహమ్మదువారి చరిత్రమును మఱికొన్ని యితర గ్రంథములను వ్రాసి ప్రకటించెను. ఆదేశమును స్వయముగ జూచుటచేత నతని కింగ్లీషువారి మీఁదను వారి విద్యాశాలలు మొదలయిన వానియందును మిక్కిలి మంచి యభిప్రాయము గలిగెను. లండను పట్టణమునుండి యతఁడు హిందూదేశములోనున్న యొక మిత్రునిపేర వ్రాసిన యీక్రింది జాబునుబట్టి వాని కింగ్లీషువారియెడ గల గౌరవము తేటపడును. "హిందూదేశములోనున్న మనము జ్ఞానము లేని పశువులమని యింగ్లీషువా రనుకొనుటకుఁ గారణము లున్నవి. ఈవిధముగా నేను వ్రాయుటకు మనవద్దనున్న విశేషలోపము లేవి వారివద్దనున్న యనంత సద్గుణము లేవి యని సందేహించి నామీఁద మీరుకోపము వహింపవచ్చును. వచ్చిననేమి? నేను చెప్పునది నిజము. ఇక్కడనున్న దంతయు మనవారు తలంచుటకైన నూహించుటకైన సమర్థులుగారు. నేను ప్రతిదినము చూచునది నిశ్చయముగ నూహించుటకైన హిందూదేశస్థుల తరముగాదు.
నేను చెప్పునది మనదేశస్థులు నమ్మనియడల పరమమూర్ఖులని మీరనుకొనవలసినదే. పుట్టుగ్రుడ్డిసూర్య తేజస్సునుగాని, మనోహరమైన చంద్రప్రకాశమునుగాని మన మెన్ని విధముల చెప్పినను భావింపఁ గలఁడా?"
అహమ్మదుఖాను తన కుమారుడైన సయ్యదు మహమ్మదును విద్యాభ్యాసము నిమిత్తము కేంబ్రిడ్జిపట్టణములో దిగవిడిచి 1870 వ సంవత్సరమున హిందూ దేశమునకు మరలివచ్చెను. ఆబాలుఁడగు సయ్యదు మహమ్మదు తరువాత నలహబాదు హైకోర్టులో జడ్జీ యయ్యెను. అహమ్మదుఖాను సీమనుండి వచ్చిన పిదప గాశీపట్టణములో జడ్జియయ్యెను. ఇంగ్లండునకుఁబోయి వారి యాచారముల జూచుటచేత నతఁడు సంఘసంస్కర్తయై మహమ్మదీయులలోనున్న మూఢవిశ్వాసములు దురాచారములు తొలగించుటకు మహమ్మదీయ సంఘసంస్కర్తయను పేర నొకపత్రికను బ్రకటింపఁజొచ్చెను. నిష్పక్షపాతముగ నిర్దాక్షిణ్యముగ దురాచారములను ఖండించుటచేఁ బూర్వాచారపరాయణులగు మహమ్మదీయులు వారిని ద్వేషించినను బత్రిక ప్రకటింపఁబడిన తొమ్మిది సంవత్సరములలో సంఘస్థుల యభిప్రాయములు చాల మారెను. తురకలు రాజద్రోహులని యెవరైన నన్నప్పు డహమ్మదుఖాను వారి వాదమును కఠినముగ ఖండించు చుండువాఁడు. 1872 వ సంవత్సరము సర్ విలియము హంటరుదొరగారు హిందూదేశపు మహమ్మదీయులనుపేర నొక చిన్న గ్రంథ మింగ్లీషులో వ్రాసి మహమ్మదీయులకు రాజభక్తిగలదాయని యందుసందేహముఁ గనఁబరచిరి. అహమ్మదుఖానా గ్రంథముజదవి మహమ్మదీయులయం దట్టిలోపము లేదని తెలుపుచు దానికుత్తరముగ మఱియొక పుస్తకము వ్రాసెను.
ఇంగ్లాండునుండి వచ్చినదిమొదలు సయ్యదమహ్మదుఖాను మహమ్మదీయుల యుపయోగము నిమిత్తము కేంబ్రిడ్జిలోనున్న కాలే
జీలవంటి కాలేజీయొకటి స్థాపింప నుద్యుక్తుడై యుండెను. ఆకోరిక కొనసాగించుట కతఁడు ముందుగా నొక చిన్నసభ నేర్పరచి దాని ముఖ్యోద్దేశము తురకలకు విద్యావ్యాప్తి నెక్కువజేయుటగ నేర్పరచెను. 1872 వ సంవత్సరము 15 వ యేప్రియల్ తారీఖున నాసభకు మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజి కమిటీయని పేరు పెట్టించెను. అది మొదలుకొని పనిచేసి 1875 వ సంవత్సరమున నా సభ వారు చిన్న పాఠశాలను స్థాపించిరి. ఆరంభము స్వల్పమైనను సయ్యదుమహమ్మదు గొప్ప యూహలు మనసులో పెట్టుకొని దానికి మూలధనము సంపాదింపఁదలఁచి గవర్నమెంటుక్రింద యుద్యోగము మానుకొన్నపక్షమున తనసంకల్పము సులభముగ నెరవేరునని 1876 వ సంవత్సరమున నుద్యోగము మాని పించను పుచ్చుకొనెను. అనంతరమతఁడు కొంతమూలధనము సంపాదించి కళాశాల ప్రారంభింప నప్పటి గవర్నరు జనరలుగారగు లిట్టనుప్రభువుగారు 1877 వ సంవత్సరం జనవరి 7 వ తారీఖున దాని స్థాపనోత్సవము జరిపిరి. 1878 వ సంవత్సరమున దొరతనమువా రతనిని గవర్నరుజనరలు గారి శాసననిర్మాణసభలో సభికుడుగ నేర్పరచిరి. అతఁడట్లు సభికుడుగ రెండుసారులు నియమింపఁబడెను. అతని జీవితవి శేషమంతయు నల్లీఖరుపట్టణమున మహమ్మదీయుల నిమిత్తము స్థాపింపబడిన యా కళాశాలకు మూలధనమునుబ్రోగుచేసి వృద్ధిచేయుట చేవిని యోగింపఁ బడెను. 1882 వ సంవత్సరమున హైదరాబాదు దివానగు సర్ సలారుజంగు కాలేజీని సందర్శించెను. అహమ్మదుఖాను వానికిమరల చూచుటకుబోయి వానివద్దనుండి కాలేజీకి కొంతధనము స్వీకరించెను. 1884 వ సంవత్సరమం దతఁడు మూలధనము సంపాదించుటకు పంజాబు దేశమందు సంచారము చేసెను. ఎక్కడకుఁ బోయినను మహమ్మదీయులు వానిని విశేషముగ గౌరవించుచు వచ్చిరి. అతఁ
డును నట్టిగౌరవములతో సంతసింపక కళాశాలయం దభిమానము గలవారు తమ యభిమానమును ధనరూపముగా జూపవలసినదని చెప్పి విశేషధనము సంపాదించెను. ఆసంవత్సరమే గవర్నరుజనరలు గారగు రైఫన్‌ప్రభువుగారు కళాశాలనుజూచి సయ్యదహమ్మదుఖానుచేసిన యద్భుతకార్యమును జాల శ్లాఘించిరి. 1888 వ సంవత్సరమున నతనికి కే. యస్. ఏ. యను బిరుదమునిచ్చిరి. తన పూనిన సత్కార్యమును మిగుల బరిశ్రమచేయుచు నతఁడు మఱి పదిసంవత్సరములు జీవించి 1898 వ సంవత్సరము మార్చి 27 వ తారీఖున మృతి నొందెను.
ఈ మహమ్మదుఖాను చరిత్రము చిత్రమైనది. అతని కింగ్లిషు రాకపోయినను దానిని గట్టిగ చదివిన వాఁడువోలె వర్తమాన వ్యవహారముల నన్నియుఁజక్కగ నెఱిఁగి యతఁడు కాలోచితముగఁ బనిచేసెను. హిందూదేశస్థులు స్థాపించిన దేశీయమహాసభ కితఁడు విరోధియని మనవారు నమ్ముదురు. ఆసభ దొరతనమువారికి విరుద్ధమైనదని నమ్మి మహమ్మదీయుల లాసభకుఁ బోఁ గూడదని యతఁడు శాసించెను. ఆతనిమాట శిరసావహించి మహమ్మదీయు లీనాఁటికి దేశీయ మహాసభలోఁ దరుచుగ జేరుచుండుటలేదు. ఈతఁడు స్వమతస్థుల యభివృద్ధికొఱకు మిక్కిలి పాటుపడియెను. హిందూ దేశస్థులలోని సత్పురుషులలో నితఁడొకడని చెప్పవచ్చును. ఇంగ్లీషు వారు దయామయులని వారిని నమ్మి దయకుఁ బాత్రులమైతిమేని వారు మనకు సర్వసౌఖ్యములు నీయగలరనియు నీతని నమ్మకము. ఈతనిపేరు విన్న మహమ్మదీయుల కిప్పటికిఁ జాల గౌరవము.