భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/జ్ఞానప్రసూనాంబికాశతకము

పీఠిక

ఈశతకము రచించినకవి శిష్టు సర్వశాస్త్రి. ఈయన సర్వకామదాది మహాప్రబంధములు వ్రాసిన షడ్దర్శనీపారగులగు శ్రీశిష్టు కృష్ణమూర్తిశాస్త్రిగారి కుమారుఁడు. వాసిష్ఠగోత్రుఁడు, ఆపస్తంబసూత్రుఁడు. కాసలనాటి వైదికబ్రాహ్మణుఁడు.

శ్రీ శిష్టు కృష్ణమూర్తికవి సంస్కృతాంధ్రములయందు బహుగ్రంథములను రచించి యాకాలమున సుప్రసిద్ధములై యున్న మాడుగుల, శ్రీకాళహస్తి, పిఠాపురము, కిర్లంపూడి లోనగు సంస్థానములయం దమిత గౌరవసత్కారముల నంది యనన్యసాధ్యమగు ప్రజ్ఞావిశేషముచే దిగ్గజమువలె విజృంభించి చరించినటులఁ దెలియవచ్చుచున్నది. ప్రకృతశతకకర్తయు కృష్ణమూర్తిశాస్త్రి గారిపుత్రుఁడు నగు నీసర్వశాస్త్రిగారు తండ్రియంత లోకవిఖ్యాతవిద్వాంసులు కాకపోయినను ఉభయభాషలలో సరసమగు సాహిత్యము, అవధాననైపుణ్యము, గ్రంథరచనాప్రతిభ కలవారై కొంతకాలము కాళహస్తిసంస్థానాధీశ్వరు లగు శ్రీదామెర వేంకటపతి రాజన్యుని యాస్థానమునం దాదరసత్కారముల నొందుచు నుండెను. ఈజ్ఞానప్రసూనాంబికాశతకము కాళహస్తివారియాస్థానములో నున్నపుడు రచింపఁబడినదియే.

సర్వశాస్త్రి తనతండ్రిగారు గతించిన రెండుసంవత్సరములకు అనఁగా క్రీ॥శ॥ 1872 సంవత్సరమునఁ గీర్తిశేషుఁడయ్యెను. ఈయన వ్రాసిన పుస్తకములలో జనాదరణపాత్రమైనది యమరుక ఆంధ్రీకరణము. ఇది చిరకాలముక్రింద ముద్రితమైనది. ఇపు డీప్రతులు సైతము లభించుట లేదు. జ్ఞానప్రసూనాంబికాశతకము నిర్దుష్టముగ ధారాశోభితముగ నున్నది. కవి యుభయభాషలలో నిరంకుశుఁడనుట కిందలిపద్యములే తార్కాణము కాగలవు. తెలుగుభాషలో నిట్టి సర్వాంగసుందరములగు శతకములు చాలయరుదుగా నున్న వనుట సత్యదూరముకాదు. ఈశతకమును జక్క సంస్కరించి యీభక్తిరసశతకసంపుటమున కలంకారప్రాయముగఁ జేర్చితిమి.


చెన్నపురి.

ఇట్లు,

26.1.1926

వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్

శ్రీరస్తు

శ్రీ శిష్టు సర్వశాస్త్రికవిరచిత

జ్ఞానప్రసూనాంబికాశతకము

శా.

శ్రీ మద్దామరవేంకటక్షితిపతి క్షేమంకరప్రక్రియో
ద్దామాత్మీయదయారసప్రసరసిధ్యన్మంజులాపాంగవీ
మందస్మితసుందరాస్య మెలమి న్గన్పట్టఁ బ్రత్యక్షమై
సామంజస్య మెసంగఁ బ్రోవుము ననున్ జ్ఞానప్రసూనాంబికా.

1


శా.

శ్రీమాన్యం బగుకాళహస్తినగరీసీమంబున న్సజ్జన
క్షేమప్రక్రియఁ గూర్చుచు న్సకలశక్తిస్తోమము ల్గొల్వఁ గొ
ల్వై మాన్యస్థితి నున్న ని న్విడిచి నే నన్యాశ్రయయం బొల్ల నన్
సామాన్యంబుగఁ జూడకమ్మ పుడమిన్ జ్ఞాన...

2


మ.

దిగధీశు ల్నినుఁ గొల్చి రక్కసులఁ బ్రోదిం దోలి యాత్మప్రధా
నగతిం గాంచి సమస్తభాగ్యముల సన్మానంబులం బొంది రె
న్నఁగ వేమాట లిఁకేల యెంతయును నానావాంఛితార్థాప్తికై
జగతీసంతతి ని న్భజించునుగదా జ్ఞాన...

3

మ.

పరమానందముతోడ నిన్ను మదిలో భావించి సేవించి స
ద్వరము ల్గాంచి యగస్త్యముఖ్యు లహహా వారాశ్యుపస్పర్శన
స్ఫురణాదిం బ్రథఁ జెంది రీవు గరుణం జూడంగ దుస్సాధదు
స్తరదుష్ప్రాపము లేలగల్గు జగతిన్ జ్ఞాన...

4


మ.

ధరణిం గల్గినగొప్పగొప్పపదము లత్తద్విశేషంబులుం
బరికింప న్మదిఁ దోఁచె నేఁటికి నిను న్భావించి సేవింప నే
పురుషార్థంబును గల్గు నంచును మనస్స్ఫూర్తి న్వచింతు న్స్వదా
సరమాధాయక సత్కటాక్షకలితా జ్ఞాన...

5


మ.

తరమే నీమహిమంబు లెన్నఁగ వసద్భావంబు లేకుండ న
ప్పరమామ్నాయము లాఱునుం గని తలంప న్దుస్తరప్రక్రియన్
దిరమై మించుపథంబునం దగు నశీతిన్యాసము ల్సేయు భా
స్వరమంత్రజ్ఞులఁ బ్రోచి తీవ కదవే జ్ఞాన...

6


మ.

కలుము ల్నిత్యము లంచు నమ్మి మదిలో గర్వించి యిద్ధారుణిం
గలమూఢాతులు నిన్నుఁ గొందఱు గనంగారాక నీసేవలం
దొలఁగింపం దలపోసి దుర్గతులపొందుం జెందువారేకదా
జలజాతప్రతిమానమానసకళా జ్ఞాన...

7


మ.

అకలంకంబగు నీదుసేవకయి మాన్యానూనమాణిక్యమౌ

క్తికపంకేరుహరాగ విద్రుమముఖాగ్రీయోజ్జ్వలద్రత్న యు
క్తకరాంభోరుహపాత్రికాకలన నిత్యంబు న్నినుం గొల్వరా
సకలామర్త్యసతీతతిం దనుపవే జ్ఞాన...

8


మ.

చెలువ ల్నిన్నొకసారి చేరి యెలమి న్సేవింప సౌభాగ్యముం
దెలివి న్సంతతి నిత్యసంపదయుఁ బాతివ్రత్యముం గల్గఁజే
సి లసద్దివ్యదయాకటాక్షముల వాసిం గూర్తు వంతంతకున్
జలజాతాసనముఖ్యదైవతసుతా! జ్ఞాన...

9


శా.

ధైర్యశ్రీ మది నూలుకొల్పి సతతోద్యద్భక్తియుక్తి న్జనా
శ్చర్యప్రక్రమ మొప్ప మెప్పుగను బూజాప్రక్రియం గాంచి యై
శ్వర్యప్రాప్తిమదంబుఁ జెందక సదాసక్తి న్సముద్యత్తప
శ్చర్యం బూనినవానిఁ బ్రోతువుగదా జ్ఞానప్రసూనాంబికా.

10


మ.

లలితంబై తగునీమహామహిమ వాలాయంబు వర్ణింపఁగాఁ
గలనా నేనని యూరకుండ కిపు డీకావ్యంబు సేయంగ ని
మ్ముల నే నెంచితి నీభరం బడరు పెంపుం జెంది యిందీవర
స్థలనాపాదనలోచనద్వయకళా జ్ఞాన...

11


మ.

చకితాత్మీయజనాంతరంగ భయసంసర్గాపనోదక్రియా

ధికమందస్మిత సుందరాస్య హిమరుగ్దీప్తిప్రసారాంచిత
ప్రకటానర్గళసుప్రభావవిలసద్భవ్యాకృతిశ్రీయుతా
సకలామర్త్యచయావనక్రమహితా జ్ఞాన...

12


మ.

జయలక్ష్మీకరమైన నీమహిమచే సంప్రాప్యము ల్సంపదల్
భయము ల్దూరము లౌ నటంచు మదిలో భావించి నీసద్దయా
శ్రయముం గాంచి ప్రియార్థము ల్గను టవశ్యం బేరికిం జూడ భా
చయనిర్థూతనభోంబుభృత్పటలికా జ్ఞాన...

13


శా.

అత్యాలన్యముఁ జెంది నీభజనమం దాసక్తి యింతైన స
ద్వృత్తానందము గల్గఁజెంద కెపుడు నృత్సంగతిం గాంచ కే
నిత్యం బంచును సంసృతిం దలఁచి మానిత్వంబుతో నుంటి నా
సత్యాదిత్యనుతా దయ న్దనువుమో జ్ఞాన...

14


మ.

కలరా నీసరివేల్పు లీజగతిలోఁ గల్యాణకల్యాత్మతన్
వెలయింపం దగువా రటంచు సరిగా విజ్ఞానముం జెంది నే
వలనొప్ప న్భవదీయపాదయుగళీవర్తిష్ణుధీవృత్తి నై
చలనంబందకయుంటిఁ బ్రోవఁగదవే జ్ఞాన...

15


శా.

మార్గంబు ల్పదివేలు లోకమున సన్మాన్యస్థితిం జెందఁ ద
ద్దుర్గాధ్వప్రతిపత్తి మాని విగళద్దోషాళినై మించి స

ద్వర్గస్తుత్యతఁ గన్న నీభజన సల్పం బూనితి న్నిత్యమున్
స్వర్గాధ్యక్షనుతాంఘ్రి ప్రోవఁగదవే జ్ఞాన...

16


మ.

స్థిరకీర్తి న్వెలయంగఁ జేయు నియత శ్రేయోనివాసిత్వముం
బరగంజేయు సువర్ణరత్నముఖసంపల్లీలలం గూర్చు దు
స్తరదుఃఖంబులఁ బాఱఁదోలి మఱి సంతానాదిసౌఖ్యంబులున్
సరవి న్నించుచు మించు నీభజనమో జ్ఞాన...

17


శా.

చిత్తాయత్తము లైనకోరుకుల వాసిం గూర్చి భక్తాళికిం
దత్తాదృగ్విభవంబుఁ జేర్చి రిపుల న్దండింపఁగా నేర్పి దు
ర్వృత్తంబు ల్దొలఁగింపఁ బేర్చి ఘససంవిన్మార్గము న్దాల్చి నీ
సత్తం దెల్లము సేసి ప్రోవఁగదవే జ్ఞాన...

18


శా.

జంబాలంబును బోని పాపముల నోజందాఁకకుండంగ దూ
రంబై పోవఁగఁజేయ మెట్టునెడఁ దీర్థంబై తగం జేయ శా
పంబు న్స్వస్తియుఁ దత్క్షణంబుననె చూప న్నీదుశ్రీచక్రరా
జం బర్చించు మహాత్ముఁ డోపునుగదా జ్ఞాన...

19


మ.

ననవిల్తుం గనుమంటలో మిడుతకూనంబోలె మండింపఁ జూ
చిన జేజేగమి గచ్చువిచ్చయి కడ ల్సేరంగఁ జెంత న్వసిం

చిన నీవంతనవంతలోఁ గొనక వాసిం బూచిరా మేన ని
చ్చనఱ న్హత్తితి ని న్నుతింపఁ దరమే జ్ఞాన...

20


మ.

అలశ్రీపట్టనసీమలో బహులసాలాంతస్థలోద్యానపం
క్తులలో మందమరుత్కిశోరకసముద్ధూతాగ్రకాదంబవా
టి లలిం గేళిక సల్పు నిన్నుఁ గని పాటింపంగ రాలేమి ని
చ్చలు నిం దెల్లరు గొల్వవచ్చిరిగదా! జ్ఞాన...

21


శా.

చింతారత్నగృహాంతరాళమున వాసి న్బ్రహ్మవిష్ణ్వాదిమం
చాంతస్స్థాయిని వై జగంబుల సముద్యల్లీల రక్షింప న
ట్లంతం బొందఁగఁ జేయ నీవొకతెవే యాధారశక్త్యాత్మతన్
సాంతత్యంబున నున్నదానవుగదా జ్ఞాన...

22


మ.

మనసా చంచల మింద్రియప్రతతి దుర్మార్గప్రవృత్తంబు ని
త్యనిరాబాధత మించు నీపదసపర్యం జేయుపర్యాయ మె
ట్లు నయం బంది గ్రహించువాఁడ నమరాలోకాభినంద్యప్రభాం
చనవత్కాంచనరత్నభూషణయుతా జ్ఞాన...

23


మ.

చలువ ల్నల్గడఁ జిల్కుగట్టునకు నెంచం గూఁతురై మించు నీ
వెలమి న్బత్తుల యుత్తలంబులను మాయింప న్సమస్తావనీ
తలవంద్యోజ్జ్వలభోగభాగ్యముల నందంజేయు మేల్ చూపులం
జలువ ల్గల్గఁగఁజేయు టబ్బురమొకో జ్ఞాన...

24

శా.

కైలాసాచలసీమసంగతలసత్కల్పద్రుమాకల్ప నీ
పాళీపాళివిహారకృన్మధుకరీ వ్యాహారవీణాకళా
లోలీభూతవితంద్రమంద్రరవవల్లోలంబ కేళీవనీ
జాలాక్రీడితకౌతుకాంచితమతీ జ్ఞాన...

25


మ.

సరళం బైనమతంబుఁ జెంది నియమాసక్తాతులై సంతతాం
తరపూజాపరమాదరంబుఁ గని యుద్యద్భావుకజ్ఞానులై
స్థిరయోగంబున నిన్నె కొల్చుసుజనుల్ శ్రేయోవిశేషాప్తి హె
చ్చ రమావాప్తనివాసు లై వెలయరే జ్ఞాన...

26


శా.

నీవే సిద్ధివి నీవె బుద్ధి వనుచు న్నిర్వ్యాజభక్తిక్రియా
ప్రావీణ్యంబున సంతతంబు నిను సంప్రార్థించు ధీరు ల్సమ
స్తావన్యుత్తమసిద్ధిబుద్ధికలనావాప్తిన్రమావశ్యయో
షావశ్యాదికలీలల న్వెలయరే జ్ఞాన...

27


మ.

నినుఁ జిత్తంబున సంస్కరించుచు నరణ్యానీసరణ్యంతరం
బున నైనం జనువేళ వ్యాఘ్రచయముం బోత్రివ్రజంబుం దర
క్షునికాయంబును సింహసంతతియు మ్రుచ్చు ల్బోవఁగాఁ జేసి దా
సనితాంతోన్నతిఁ జేయు దీవ కదవే జ్ఞాన...

28


శా.

పారావారము నీఁదశక్య మని చెప్ప న్వచ్చు ధాత్రీధరో
ద్ధారం బౌనని యెంచవచ్చు నటులన్ ధాత్రీస్థలీరేణువుల్

తారావారము లెక్కపెట్టఁదగు లోఁ దర్కింప నీసత్కళా
స్ఫారశ్రీగరిమల్ గణింపఁ దరమా జ్ఞాన...

29


మ.

భవదీయాంఘ్రిసరోరుహద్వయమునం బ్రవ్యక్తభంగి న్విహా
రవిలాసస్థితి నుండి యెల్లెడల సర్వప్రక్రియ ల్మాని యే
కవశం బయ్యె మదీయమత్యళిని నింకం బ్రోవుమమ్మా జన
స్తవనీయోన్నతిఁ గల్గఁజేసి యెపుడున్ జ్ఞాన...

30


శా.

నీవే దిక్కని నీదుసన్నిధిని నే నిత్యంబు సేవార్థినై
భావం బన్యగతం బొనర్పక వసింపం బెంపు దీపింప సం
భావింపం దగునమ్మ భవ్యమతి సంపత్త్యాదుల న్నించి వాం
ఛావిశ్రాంతి నొనర్ప నెవ్వ రిఁక శ్రీజ్ఞాన...

31


మ.

నయమార్గంబున భూప్రజం దనుపగా న్యాయక్రియాసంగతిం
బ్రియసామంత మహాప్రధానహృదయప్రేమాతిరేకంబు సే
య యశోలక్ష్మి దనర్పఁ జేయఁదగు నీయర్చల్ ప్రభుశ్రేణికు
చ్ఛ్రయసంధానసమేధమానకరుణా జ్ఞాన...

32


మ.

వెనకయ్య న్వలచేత డాపలికయి న్వెన్కయ్య వెన్కయ్య లా
లనలం బుజ్జవ మొప్ప నివ్రుచు మదాలస్యంబున న్నిల్చు నీ

వెనుకై యామరసుందరు ల్నిలిచి ఠీవిం గన్గొనం గంటి ని
చ్చననుం దాదృశరీతిఁ బ్రోవగదవే జ్ఞాన...

33


శా.

నీనామం బొకసారి నెమ్మనమున న్నెక్కొల్పిన న్రాజస
న్మానంబు న్నిగమాగమోక్తిపదవీ నానార్థనిశ్చాయక
త్వానూనప్రతిభావిశేషమును నిత్యంబేకదా భక్తదుర్
జ్ఞానోచ్చాటనపాటవస్ఫుటకథా జ్ఞాన...

34


శా.

సారంబైన భవద్దయారసమున న్సాధింపఁగా వచ్చు దు
ర్వారారాతినికాయము న్సకలసంపల్లీలలు న్మున్నుగాఁ
జేరన్ హెచ్చఁగవచ్చు నేరికయినన్ శ్రీకాళహస్తీశయో
షారత్నంబ మదంబ శాంభవినుతా జ్ఞాన...

35


మ.

ప్రసరచ్ఛీతలతావిశేషముల సంపాదించుమిన్నేఱురా
త్రిసతీశాంశము నౌదల న్నిలిపియుం దెంపేదుతాపంబునన్
విసపున్మేఁతరి నీదుమోవిరసము న్వేమాఱుఁ గ్రోలంగఁ దా
నసిగా నిల్చెను సర్వలోకవినుతా జ్ఞాన...

36


శా.

లీనప్రజ్ఞలకుం బ్రకృష్టధిషణాలీలావిశేషాప్తి య
న్యూనోక్తిప్రథమానశాస్త్రపదవీప్రోజ్జృంభమాణప్రథా
ధీనశ్లాఘ్యవదావదత్వమును సంధిల్లుంగదా తావకా
ర్చానిష్ఠాగరిమంబు గల్గుకతనన్ జ్ఞాన...

37

మ.

నిరతి న్నీపదపద్మపూజనవిధానిష్ణాతుఁడై సంతతం
బరసాన్యామరసేన నాదరములో నల్పంబుగా నైనఁ జొ
న్ప రహిం జూడక యేకభక్తి నిను లోన న్నిల్పువాఁ డీచరా
చరసంపూర్ణజగత్తతి న్మిగులు నోజ్ఞాన...

38


శా.

పంచాస్త్రుండు త్వదీయసన్నిధిని నీభర్తం బ్రయత్నంబుతోఁ
బంచాస్త్రిం బెదరింపఁబోయి త్రుటిలో భస్మంబు దానయ్యె న
న్నుంచే గంతలు పుట్టె నంచు దయఁ దద్యోగంబునం గన్గొనం
జంచద్దర్పకకోటి నించితి వవున్ జ్ఞాన...

39


శా.

పారావారసుతాదిలేఖసుదతీ పారంపరీగీతికా
పారానంద పురంధ్రివర్గనియత ప్రాంచద్వివాహాంగణో
దారామోదయుతాత్మబాంధవసతీతత్యాశ్రితస్వాంతిక
స్ఫారాచారకృతిప్రమోదభరితా జ్ఞాన...

40


శా.

ఆసా మిక్కిలి గల్గి యున్నది మహాహంకారమా మెండు వి
శ్వాసం బెందును లేదు పూర్ణము నృశంసత్వంబు సత్యార్థవి
న్యాసం బన్నది వాసె నిట్టిజడు నిన్నన్ బ్రోవఁగాఁ ద్వత్కృపా
శ్వాసం బొక్కటిదక్క వేఱుగలదే జ్ఞాన...

41


శా.

విశ్వాతీతపరాక్రమక్రమ సమావిర్భూతనిత్యప్రభా

వైశ్వర్యాహమికావిశృంఖలవిహారాత్యంతభీతద్యుష
ద్విశ్వాస్యేతరచండఖండనదిశావిశ్రాంతజన్యప్రథా
శశ్వద్విశ్రుతశక్తి వీవకదవే జ్ఞాన...

42


మ.

ఫల మొక్కింతయు నీనివేల్పుల భజింపన్ దాన నేమౌ నటం
చెలమి న్నిన్నె సమగ్రభక్తిపథసౌహిత్యంబుతోఁ గొల్వని
చ్చలు నన్నుం గనకున్న నెవ్వ రిఁక శశ్వల్లీలఁ బోషింప ని
శ్చలకారుణ్యకటాక్షవైభవయుతా జ్ఞాన...

43


శా.

శోణాంభోరుహజైత్రపాదయుగళీశోభాకృదుద్యన్మణి
శ్రేణిహంసకమంజుగుంజితసమాకృష్టావదాతచ్ఛద
క్వాణాకర్ణవమోదమానహృదయాగచ్ఛద్యుషత్కిన్నర
స్త్రైణాలోకనహృద్యమందరగతీ జ్ఞాన...

44


మ.

నునుమైచాయలు దాసనంవునన చెన్నుంబూని మిన్నందఁ గ్రొ
న్ననయమ్ముం గొని తుంటవింటనెలమిన్నం టొప్పఁగాఁ జేసి యిం
పున ముల్లోకము గెల్చు వశ్యముఖివై పొల్పొందు నిన్ గొల్చెదన్
జననీ సర్వజగత్ప్రమోదజననీ జ్ఞాన...

45


మ.

కపురంపు న్విడె మానసంబున సమగ్రస్థూలముక్తాసరా
నుపమాలంకృతి చన్గవం గటితటి న్హొంబట్టుఁబుట్టంబు సం

న్నపు మైపూఁత భుజంబుల న్వెలయ నున్న నిన్నుఁ గన్గొన్న న
చ్చపుఁబ్రేమన్ గిరిశుండు వీడఁ డహహా జ్ఞాన...

46


శా.

జేజేరాయనిఱాలచెల్వమున మైచెల్వొంద బల్వేలుపున్
రాజస్య ల్నలువంకలం గొలువులోనం గొల్వ బృందారకో
ర్వీజోద్భూతపరిస్రుతాలసగతి న్వీణాకల న్మించి వా
చాజాలాతిగ వైఖరి న్మెఱసితౌ జ్ఞాన...

47


మ.

ఘనవృష్టి న్భువి సస్యజాతము సమగ్రప్రక్రియ న్మొల్క లె
త్తి నవోదగ్రఫలం బొసంగుగతిఁ ద్వద్దివ్యానుకంపాకటా
క్షనికాయంబున సర్వసంపద యుదర్కప్రాప్తి గల్గించు దు
ర్జనదౌరాత్మ్యనిరాసకారిమహిమా జ్ఞాన...

48


మ.

జయశబ్దం బొనరించుచు న్దివిజు లోజ న్ముంగల న్నిల్వ ది
వ్యయమివ్రాతము సామగీతు లనయంబు న్వీనుల న్నింప హృ
ద్దయ క్రీఁగన్నుల నంకురింప సురలన్ దైన్యంబు వోఁ ద్రోసి ని
శ్చయసౌభాగ్యము నింతు వీవకదవే జ్ఞాన...

49


మ.

పలుమాఱు న్నిను భక్తియుక్తి భజియింపంగోరి వేళాప్తి నీ
కొలువుం గూటముఁ జేరి తావకదృగంకూరత్కృపాపూరసం

కలితోదారతరార్థకావ్యరచనాకల్యాతులౌ వారిలోఁ
జలనం బేద నను న్ఘటింపఁ గదవే జ్ఞానం...

50


మ.

ముద మొప్ప న్మది నిన్నుఁ జేర్చి భయసమ్మోదంబు లొక్కుమ్మడిం
బొదలం దావకపాదుకార్చన కథాపూతాత్ములై నిత్యని
ర్మదవృత్తి న్భజియించువారు చెలువారం గాంతు రిష్టార్థముల్
చదువు ల్పెక్కులు చిక్క నేమిఫలమౌ జ్ఞాన...

51


మ.

సతతంబు న్దురితావహంబయిన సంసారంబునం బుత్రమి
త్రతరుణ్యాదివిచారయోగమున నైరంతర్యదుఃఖక్రియా
యుతుఁడై చేడ్పడుకన్న నిన్ను మదిలో నొందించి సంధింపఁగా
జతనంబైనను జాలు నంచుఁ దలఁతున్ జ్ఞాన...

52


మ.

క్రతువు ల్నూ ఱొనరించి యింద్రుఁడయి స్వారాజ్యంబు పాలించి సం
భృతమందారతరుప్రసూనశుభీకాభిష్టుత్యకోటీరకో
టితచే మించి సుధర్మ నున్నతఁడు బల్ఠీవిం ద్వదీయాద్భుత
క్రతుశీలుం బురుడింపలేఁడు గదవే జ్ఞాన...

53


మ.

కమలాభారతు లిర్వురు న్సురటులం గైఁబూన వేల్పుం గొమల్
క్రమ మొప్పం గొలువంది కట్టెదుటఁ జొక్కం బైనగీతప్రసం
గము సల్పం గొలువున్న నిన్నుఁ గని శక్రాదు ల్భజింతు ర్గదా
కమలారాతికళాభియాతివదనా జ్ఞాన...

54

మ.

చద లొక్కుమ్మడి మ్రింగఁగా మనమునం జర్చించుచు న్మించు దు
ర్మదనక్తంచరయోధవీరపృతన ల్రా నారదుం డాట పా
ట దలిర్పం గనుఁగోఁగదైత్యహతిగాటంబైన తేజంబునం
గదనప్రక్రియ మింతు రెవ్వ రహహా జ్ఞాన...

55


మ.

వికలంబై చకితాక్షమై యసురరాడ్వీరాళిప్రాసాసిశ
క్తికఠారాదికసాధనవ్రజము భీతి న్బాఱఁగా వైచి నే
రక నీచేరువ వచ్చినా మనుచు దూరం బందఁగాఁ దోలితౌ
సకలామర్త్యనికాయగేయచరితా జ్ఞాన...

56


శా.

హాళి న్నీకు సభక్తికంబుగను సాష్టాంగంబు లర్పించి యా
శాళీవిశ్రుతతావకీనచరితాశ్రాంతశ్రుతి న్మించి య
న్యాలాపంబుల మాని తావకసమాఖ్యాపాఠముం జేయుచో
జాలం బేటికి నన్నుఁ బ్రోచుటకు నై జ్ఞాన...

57


శా.

నింద ల్సేయుదు రెందఱో ధరణిలో నీరోధదోక్తి నా
నందం బందుదు రెందఱో సుగుణసంతానంబు లెక్కించి యీ
చందంబు ల్మదిఁ జేర్ప నీదయ మదాసక్తి న్విజృంభింపఁ ద్వ
చ్ఛందం బెట్టిదొ తెల్పవమ్మ వడిగా జ్ఞాన...

58


శా.

ధీరశ్రేణికి మెచ్చు సేయు కవితాస్థేమంబు నేమంబుతో

రారాజద్గుణరాజరాజసభల న్రంజిల్ల వాగ్వైదుషీ
పారావారులు నీకటాక్షమహిమావాప్తింగదాధారుణిన్
స్ఫారఖ్యాతి వహింతు రెంతయును శ్రీజ్ఞాన...

59


మ.

జగతి న్నెమ్మది నెన్న మానుషము దుష్ప్రాపంబు పై నందులో
న గణింపందగు నాల్గువర్ణములలోనం బుట్టు టబ్రంబు పెం
పగుబ్రాహణ్యము దానిలో నచట పర్యాయంబునన్ జ్ఞానయో
గగురుత్వంబు భవత్కటాక్షముననౌ జ్ఞాన...

60


మ.

సమదానేకమతంగజావళియు నాజానేయవారంబు ను
త్తమరథ్యాళి రథంబులు న్సమరవిద్యాపాండితీమండితా
సమయోధావళి రత్నకాంచనసమంచత్పుత్రదారాదియో
గము నీపూజ లభించు నోజ నిజమో జ్ఞాన...

61


మ.

భరమా నీకు మదర్థసంఘటనశుంభద్భావసంభూతస
త్కరుణాపూరతరంగసంగసతతోదంచత్కటాంచల
స్ఫురణాపాదన మేల జాల మిఁక హెచ్చుం బల్కు లేలా భవ
త్స్మరణం గల్గని దేమిగల్గు భువిలో జ్ఞాన...

62


మ.

తెలియ న్రాదిల నీమహామహిమ బుద్ధింజూడ బ్రహ్మాదిది
వ్యులకైన న్నిజమంచు నాగమపదవ్యుక్తు ల్వంచింపంగ వీ

నులలో సోఁకియుఁ గొంతవర్ణనము నేనుం జేయుదంచుం దదా
కలనాయత్తుఁడ నైతి నీభరమె సూ జ్ఞాన...

63


మ.

సమయం బిద్దియటంచు నే నెఱిఁగి నీసాన్నిధ్యముం జెంది నే
మముతో సేవ యొనర్పఁజాలఁ గవితామార్గంబునం బ్రౌఢిమం
గ్రమ మొప్పం గనినాఁడఁగాను జడుఁ డింక న్వీఁడటంచు న్ననున్
సమతం గన్గొని వేగ ప్రోవఁ గదవే జ్ఞాన...

64


మ.

నలుమోముల్గలవేల్పుఁగన్నదొర యెన్న న్నీకుఁ దోఁబుట్టుక
ల్వలరాతున్కతలంగలాఁ డొడయఁ డేలంజాలు నీ విజ్జగ
ములనానిమ్ముల నిన్ను గొల్వఁ దలఁపుంబూనం దగు న్లోక ము
త్కలికామాత్ర నుతింతు నన్నుఁ గనవే జ్ఞాన...

65


శా.

పొంగట్టు న్విలుదాల్పుమేన నఱయై పొల్పొందుని న్జూచి యా
బంగార్పుట్టపువేల్పురాణి యిటులై పల్వన్నె నవ్వెన్ను హ
త్తం గానంగదె యంచు ముచ్చట నెడందం జెంద మేల్ఠీవిసా
గంగా జాణతనంబు నూనితిగదా జ్ఞాన...

66


మ.

వెలయు న్నీకరుణావిశేషము సదావిర్భూతమై భక్తకో
టులయం దంచుఁ దలంచి యెందుఁ బొరపాటు న్లేక నిన్బూజ సే
య లలిం జులను నీవె ప్రోవఁదగవౌ నగ్రస్ఫురద్దాడిమీ
కలికాగుచ్ఛసదృశకాంతికలితా జ్ఞాన...

67

శా.

ఈ వేలోకముల న్సృజింప నెలమి న్హెచ్చింప డిందింప ని
త్యావిర్భూతమహాప్రభావయుతవై యాత్మేశుని న్సౌఖ్యలీ
లావిష్టాత్ముని జేయుదంచు నిగమవ్యక్తోక్తి నేవింటి న
న్గావం జాలవొకో నమన్మునివరా జ్ఞాన...

68


శా.

బంధూకప్రతిమాళికస్థల కనద్బాహ్లీక రఖా జగ
ద్బంధూడుప్రభుకర్ణపూరయుగళీ భాస్వచ్ఛృతీసత్కృపా
బంధూరస్థితి నన్నుఁ జూచుచుఁ గళాపాండిత్యముం బాణిక
ర్కంధూరీతిగ నేర్పరింపఁ గదవే జ్ఞాన...

69


మ.

తెలి వొక్కింతయు లేనివాఁడని ననుం దీలైచెడం జేయకు
జ్జ్వలమైనట్టి భవత్కటాక్ష మిఁక నాపైఁ బర్వ సర్వంసహా
వలయస్థాఖిలసత్కవీంద్రతతిలో వర్ధిష్ణునిం జేయు ము
త్కళికావత్కమలానుతాకృతియుతా జ్ఞాన...

70


మ.

చరణార్చాపరభక్తరక్షణపరాసక్తి న్నినుం గొల్వఁగా
నరుదా సంపద లబ్రమా ముదము లత్యాశ్చర్యమా పుత్రపౌ
త్రరమావత్త్వము చిత్రమా పరజనారబ్ధాంతరాయప్రతీ
కరణం బంబుజగర్భసన్నుతపదా జ్ఞాన...

71


మ.

ధరణి న్నిశ్చలమైన నీకరుణ నిర్దంభోదితం బైనయ
ప్పరమాహ్లాదవినోది గాంచు నియతప్రఖ్యాతినీతిక్రమ

స్థిరతం బ్రాజ్యసమస్తసంపదలవృద్ధిం బుద్ధియోగోల్లస
త్సరసానందకవిత్వసంపదయు శ్రీజ్ఞాన...

72


శా.

శ్రీచక్రార్చన సేయుచు న్సతతనిస్సీమస్థిరత్వోదయ
ప్రాచుర్యప్రథమానభ క్తినియతప్రజ్ఞావిశేషం బటుల్
వాచామాధురి నీదునామపఠనవ్యాకోచకావ్యక్రియా
సాచివ్యంబును గాంచు మందుఁ డయినన్ జ్ఞాన...

73


మ.

కలికాలం బిది దీనియం దొకఁ డనేకప్రక్రియాయుక్తిని
శ్చలభక్తి న్నినుఁ గొల్వలేఁడు జనుఁ డాశాయోగమా మెండు త్రో
వలనేకంబులు విఘ్నయోగములకుం బాటిల్లు నీభక్తిలోఁ
గలుగంజేయఁగ నీవదిక్కు గదవే జ్ఞాన...

74


మ.

అలసత్వం బధికంబు గ్రంథములు పర్యాయంబునం జూడఁగాఁ
గలనా లెక్కకురాని వెట్లయినఁ జక్కంజేసి చూడంగ నం
దలితాత్పర్యము దుర్లభం బనుచుఁ గానంజాలకున్నాఁడఁ ద్వ
త్కలితానుగ్రహ మొక్కఁడుండఁ గొఱఁతా జ్ఞాన...

75


మ.

గలుప న్రేయిఁ ద్వదీయసత్కరుణకై భావించి సేవించెదం
దగ నిన్నిట్లిది చూచి వీఁడు మదసుధ్యానైకతాత్పర్యని

ష్ఠగలాఁడంచు మదిం దలంచి కరుణాసాంతత్యసంబంధస
జ్జగతిం బ్రోవఁగ రావి దేమి యకటా జ్ఞాన...

76


మ.

కలి నంతంతకు ధర్మకర్మపథసంస్కారంబు మాసె న్మహా
బలవంతంబయి కానిపించె నహహా మాన్యావమానక్రియా
కలనల్ నీకరుణాకటాక్షమున నిక్కాలంబు దోలందగుం
జలనం బింతయుఁ జెందకుండ జననీ జ్ఞాన...

77


మ.

ప్రియము ల్వల్కిన నప్రియంబులని సంప్రీతి న్వగ ల్జెంద కే
మయినం జూచుచు నీయనుగ్రహముగా నాంతర్యమం దెంచుచు
న్భయ మొక్కింతయు లేక నిన్ను మదిలో భావింపఁగా బుద్ధిని
శ్చయ మి మ్మోజననీ హితార్థజననీ జ్ఞాన...

78


మ.

సరసాలాపవిలాస హాసరచనాచాతుర్యసుస్థైర్య భా
స్వరదివ్యస్వరరీతిసంతతతతవ్యాసంగదివ్యాంగనా
పరిపాటీగణనావినోదవిలసద్భవ్యాదరోద్యత్స్మితా
చరణాంభోజనతామరవ్రజహితా జ్ఞాన...

79


మ.

స్ఫుటతారానికరస్ఫురచ్ఛుచిమణీ శోభాంకహారావళీ
ఘటితోత్తుంగకుచద్వయోపరిలసత్కంజాతరాగారుణో
ద్భటకూర్పాసవిభాసమానకురువిందశ్రేణికాప్రోల్లస
త్కటకాలంకృతపాదపద్మయుగళీ జ్ఞాన...

80

మ.

అగరాజాత్మజతావకీనకరుణాయత్తంబు ముల్లోక మెం
చఁగ నీదైనమహావిభూతివశమే సర్వామరశ్రేణికై
న గణింపన్ భవదీయసద్విభవ మీ నా కెట్లు వర్ణింప నౌ
జగతీనిర్భరగర్భగోళకలితా జ్ఞాన...

81


శా.

జల్పాకామరకామినీకృతకథాసారస్యలీలాకళా
నల్పోదంచితమందహాసలలితస్వాస్యావలోకాహిపా
కల్పాత్మేష్టసహాసికాఘటనకృత్కాదంబవాటికన
త్కల్పోద్యానవిహారకేళిరసికా జ్ఞాన...

82


శా.

సర్పాధీశ్వరతల్పసోదరి జగజ్జాలాభినంద్యోక్తిమ
ద్గీర్పకృత్యాదినుతాత్మచాతురి త్రిలోకీసుప్రసిద్ధాంగనా
దర్పాపాకరణాత్మసుందరి నినున్ ధ్యానింతు నే నెప్పుడుం
గర్పూరాగురుకుంకుమాంకితకుచా జ్ఞాన...

83


శా.

భద్రాపాదనముఖ్యమై తనరు నీభక్తి న్సమస్తార్థసం
పద్రాజిప్రద మంచు నెంచి జగతీపాలుర్ దదాయత్తులై
సద్రూఢిన్ భజియింతు రేనటులు గాంచం జాల సేవాస్థితిం
గద్రూజాతకలాపకంజనయనా జ్ఞాన...

84


మ.

విడువ న్నీపదసన్నతి క్రమగతి న్వేదార్థసూక్తిస్థితిం
గడవ న్లోకమున న్వదాన్యతతి నెక్కాలంబు నేమైననుం

దడవ న్సత్యము గాఁగఁ బల్కెదఁ బ్రశస్తం బైననీసత్కృపం
గడువంత ల్దొలఁగింపవమ్మ జననీ జ్ఞాన...

85


శా.

చింతారత్ననివాసవాసరసికా శ్రీపుర్యుదారాసికా
శాంతాత్మాంతరసీమసాధువసతీ శ్యామాభిరామద్యుతీ
సంతాపాపహృతిప్రవీణచరణా శత్రుచ్ఛిదాకృద్రణా
స్వాంతాంతర్విలగజ్జగత్పటలికా జ్ఞాన...

86


మ.

చెడుమార్గం బని యించుకైన మదిలోఁ జింతింపకే నెప్పుడున్
విడనాడందగు చెయ్వులన్నియును నువ్విళ్లూరుచుం జేసితిం
బొడగానందదుపారతి న్మదిని దప్పు ల్జూడ కొక్కుమ్మడిన్
గడకంటం గని ప్రోవుమమ్మ దయతో జ్ఞాన...

87


మ.

స్ఫుటమై నీకరుణారసం బెవనిపై సోఁకు న్వెసన్ ధాత్రి వాఁ
డటవీవీథుల శత్రుమధ్యమున నుద్యద్వారిపూరాంతరో
త్కటవీథీనిచయంబునం బడిన వేగం బ్రోతువౌ నీవె ధూ
ర్జటివామాంగనివాసభాసురతనూ జ్ఞాన...

88


మ.

నవకావ్యంబు రచించి ప్రాజ్ఞులును నానావృత్త్యలంకారరీ
తివిశేషంబుల మెచ్చువచ్చునటు లుద్దీపింపఁగా నర్థసం
భవసారస్యముఁ దెల్పలే రిపుడు నామా టెంత యొక్కింతనా
కవితం గైకొనుమమ్మ యెట్టులయినన్ జ్ఞాన...

89


మ.

తపముం జేయుచు నీమనంబునకు సాంతత్యంబుగా సంతసం

.

బెపుడుం జేయఁగఁజాల నీమనుజపం బెంతే నొనర్పందగం
గృపఁ బుట్టించు మృదూక్తి నేనెఱుఁగ నొక్కింతైన నీవిప్పుడొ
క్కపరిం జూడు మహేతుకోదితదయన్ జ్ఞాన...

90


మ.

అమరీలోకము వేళవేళలఁ ద్వదాయత్తస్థితి న్సేవస
ల్ప మహానందముతోడఁ గొల్వయిన నీపాదంబు లర్చించున
ట్టి మహాభాగ్యము నారదాదులకుఁ బాటింపం దగుంగాక ని
క్కముగా ని న్గొలువంగఁజాల రితరుల్ జ్ఞాన...

91


మ.

వశమా మాదృశులైనవారలకు నిన్ వాక్రుచ్చి వర్ణింప నీ
యశముం బేర్కొని సంస్తుతింప మఱి నీయక్షీణకారుణ్యలే
శశతాంశం బయిన న్లభింపక జగత్సంభావ్యసృష్టిక్రియా
కశతానందశతాభినంద్యచరణా జ్ఞాన...

92


మ.

జయ మాతంగి! మణీవిపంచివిలసత్సప్తస్వరీసజ్ఝరీ
నయసంద్రావితమేరుశై లగతనానారత్నవాఃపూరసం
చయనానారుచిమద్ధునీశతసహస్రప్రాప్తనవ్యక్రియా
జయ నిర్ధూతసమస్తదైవతభయా జ్ఞాన...

93


మ.

సవినోదోద్యతసంయుతాయుతకరా సక్తిస్ఫురద్వీక్షణా
దివిశేషాభిమతప్రకార మృదుగీతిస్ఫూర్తిరేఖాజవా

ఢ్యవిహారాభినయప్రపంచనియతవ్యాపారరంభాదిలా స్యవిలాసోన్నతిదర్శనాద్రుతిమతీ జ్ఞాన...

94


మ.

దయ యొక్కించుక నాపయి న్నిలిపి నీదాసుండనౌ నన్ను ని
ర్భయునిం జేసి సమస్తకార్యముల నబ్రం బైనసాఫల్య మూ
న్చి యనన్యాదృశ మైనతెల్వి దయతో నీఁజాలు దీవేకదా
జయసమ్మోదితదేవతాపటలికా జ్ఞాన...

95


శా.

పంచాస్యంబు హయంబుగా సమదసంప్రాప్తాసురవ్రాతమున్
గొంచెం బైనను జిక్కనీక దునుమం గోదండపాండిత్యలీ
లాంచత్పాణివిలాసవై తనరు నీయబ్రంపుశక్తి న్సమి
త్సంచారాంచితశక్తిసేన లెఱుఁగున్ జ్ఞాన...

96


మ.

కమలాదేశకృదాయతాక్షియుగళీ కల్యాణభూభృద్రుచి
క్రమనిర్మోటనపాటవోరసిజయోగశ్రీసమేతావదా
తమణీహారవిరాజమానగళ మిథ్యామధ్యమా పూర్ణిమా
కమనీయేందువిభాసమానవదనా జ్ఞాన...

97


మ.

కలరా వేల్పులు నీకు సాటి యనఁగాఁ గన్గోఁగ లే రేల ప
ల్కులు నీవే ననుఁ బోవఁగావలె దొసంగు ల్బాఱఁగాఁ దోలి నా
వలన న్నేరము లున్న నీమదిని జేర్పంబోక రక్షింపుమీ
జలజాతప్రభవాంగనాదివినుతా జ్ఞాన...

98

శా.

నానావుష్పఫలావళీసతతదానప్రోల్లసద్భవ్యసం
తానానోకహమధ్యవీథ్యుదిత విస్తారస్ఫురచ్ఛాఖికా
ధీనానేకమధుప్రతీపరభృతీదివ్యశ్రవస్సౌఖ్యద
స్వానోద్యానవిహారకేళిరసికా జ్ఞాన...

99


శా.

సందేహం బొకయింతయేని మదిలో సంధింప కెవ్వేళ నీ
వందారుప్రజరక్షణక్షమదృశావ్రాతం బపేక్షించి య
స్పందప్రక్రియ నున్నవాఁడ మనుపన్ భారంబు నీదేకదా
ఛందోవీథివిహారలాలసమతీ జ్ఞాన...

100


మ.

లలితాష్టాదశపీఠికాకలితలీలారూపవై జప్యకృ
త్పలదానాప్రతిమప్రభావవిలసత్కారుణ్యపూరంబు దొ
ల్క లలిం దాదృశహేలలం దగు నినుం గాంతుంగదా యింద ని
ష్కలుషంబై తగ భక్తియుక్తి జననీ జ్ఞాన...

101


శా.

శ్రేయస్సంతతధామ దామరకుల శ్రీ వేంకటేంద్రాజ్ఞఁ బ్ర
జ్ఞాయత్తౌచితి సర్వశాస్త్రి యిటు లొయ్యంజేసె జ్ఞానాంబికా
గ్రీయానుగ్రహలీలఁ బద్యశత మీరీతిం బఠింపన్ జనుల్
ధీయుక్తస్థితి నన్నివిద్యలఁ బ్రశస్తిం జెంది పెంపెక్కరే.

102

జ్ఞానప్రసూనాంబికాశతకము సమాప్తము.