కన్నీటి కైవల్యం
"కవి కౌస్తుభ” డా॥ ఆచార్య తిరుమల 301, నందిని కాంప్లెక్స్ మోజంజాహి మార్కెట్, హైదరాబాదు-95
అనువాద ప్రక్రియ ద్వారా ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, పరిధిని విస్తృతం చేసిన మహనీయుల్లో ప్రాతఃస్మరణీయులు బ్రహ్మశ్రీ వావిలాల సోమయాజులు. గారు. సంస్కృతాంగ్ల హిందీ భాషల్లోని ఉత్తమోత్తమ రచనల్ని తెలుగువారి కందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. సంస్కృతం నుండి నీలకంఠ దీక్షితులవారి కలి విడంబన శతకం, భరత రస ప్రకరణం, సర్వేపల్లి వారి గీత, ఆంగ్లం నుండి షేక్స్పియర్ మేక్బత్, ఆంటోని అండ్ క్లియోపాత్ర, జూలియస్ సీజర్ - నాటకాలు, రాబర్ట్ స్టీవెన్ సన్ నవల డాక్టర్ జెకిల్ అండ్ మిష్టర్ హైడ్, ట్రయల్ బై జ్యూరీ - న్యాయనిర్ణేత, ఠాగూర్ మహాకవుల మతం-హిందీ నుండి జయ శంకర ప్రసాద్ 'కామాయని', 'ఆంసూ' - వంటివి వావిలాల వారి అనువాద రచనల్లో రత్న సదృశాలు. అంతే కాకుండా కేథలిక్ క్రైస్తవ మతసాహిత్యాన్ని కూడా ఆంగ్లం నుండి తెనిగించి విద్వత్కవికి కావల్సిన మతాతీత మానవతా ధర్మాన్ని కూడా ఆయన ప్రదర్శించారు. ఈ విషయంలో విశ్వనాథ, దేవులపల్లి వంటి వారిలో లేని ఒకానొక విశిష్టగుణం వావిలాల వారిలో మనకు కనిపిస్తుంది. కాగా -
అనువాదం - 'యథామాతృకం', 'యథేచ్ఛ' అని రెండు విధాలు. వావిలాల వారు రెండిటా సిద్దహస్తులు. వీరి షేక్స్పియర్ నాటకాలు యథామాతృకాలు కాగా మిగిలిన అనువాదాలు యథేచ్ఛగానే కనిస్తాయి. అసలు, ఏ అనువాదం చదివితే మూలం చదవాలని బుద్ధిపుట్టదో ఆ అనువాదం ఉత్తమం. అటువంటి ఉత్తమోత్తమ అనువాదాలు వావిలాల వారివి. వాటిలో ఈ 'కన్నీరు' - (ఆంసూ) ప్రస్తుత పరిశీలనా పరిధి! కన్నీరు 685