పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/274

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గజశాస్త్రము

దులవలని భీతివలనను, గజములకు మదక్షీణత సంభవించును. మదము క్షీణించిన మాతంగ మిట్లుండును. కనుల చాయ గోల్పోవును. తొండము నేలవాల్చును, ఏవి తనకు వెరచుచుండెనో, ఆ జంతువులవలననే తాను వెరచును. మేను కొంత రేగియుండును. తల యాడింపదు. కరిణిని డాయదు. స్తంభములతో ఆడదు, గండములను ఆఘ్రాణింపదు. కర్ణకటాదులను ఒరయదు. అన్యగజముల మూత్రపురీషాదులను మూచూడదు. అనాయాసముగా మావటివానికి లొంగిపోవును. చురుకుదనములేక నిద్రమత్తు గలదిగా కనబడును.

గజచికిత్స: మదము క్షీణించిన నాగములకు తిరిగి మదముకలుగుటకు మానసోల్లాసములో పెక్కు విధములైన బృంహణౌషధములు చెప్పబడినవి. (చూ. మానసోల్లాసము. 192-194 పుటలు) గజములకు వచ్చు వివిధ రోగములకు చికిత్సాక్రమము, ఔషధప్రయోగ వివరణ పూర్వకముగా అగ్నిపురాణమున (287 అధ్యా.) నిరూపితమైనది. ఇందు చటకాపురీషాది నేత్రాంజనములు, ధూపములుకూడ చెప్పబడినవి. అగ్నిపురాణములోనే (291 అధ్యా.) ప్రత్యేకముగా గజ శాంతివిధానము లిఖింపబడినది. ఈ శాంతి విధానమును శాలిహోత్రుడు చెప్పినట్లున్నది. 'గజశాంతిం ప్రవక్ష్యామి గజరోగ విమర్దనీమ్' అనుటచే గజ చికిత్సలో పూర్వులు ద్రవ్యౌషధములనే గాక మంత్రాగదములనుగూడ వినియోగించుచుండిరని తెలియుచున్నది.

సప్తశోభలు : బలవర్ధకములును, మదహేతుకములును అను ఔషధములను సేవింపజేయుటచే, బృంహితము లైన గజములకు ఏడువిధములగు శోభలు పొడమును. (1) సంజాతరుధిర (2) ప్రతిచ్ఛన్న (3) పక్షలేపని (4) వరిష్ఠ (5) సమకల్ప (6) వ్యతికేర్ణిక (7) ద్రోణిక. ఇవి సప్తశోభలు. ఆయాశోభలను గురించి గజస్వరూప చేష్టాదులలో గలుగు మార్పులును గ్రంథ కారులచే వర్ణితములైనవి.

గజగమనరీతులు : మానవునకు గాని, గజమునకుగాని తేలికగా పాదముల నుంచుచు దూరదూరముగా అడుగులు వేయుచు, గాత్రవిక్షేప మెక్కువ కలుగని సమ వేగముతోడి గమనము యుక్తమైనది. ఆబోతు, సింహము నడకవంటి నడక శుభమైనది. ఆయాసపూర్వకముగా గాత్రమును కదలించుచు ఎత్తుపల్లముల యందు అల్ప క్రమముగలిగి, మందవేగముతోగూడి, నక్కయొక్కయు, గాడిద యొక్కయు నడకను బోలియుండు గజగమనము అధమమయినది. పది యడుగుల దూరమునుండి తాను లేచినపుడే లేచి మానవవేగముతో పరుగిడు గజమును ఏ గజము పరుగిడకుండ, ఏబదియడుగులు వేసి పట్టుకొన గలదో ఆ గజ వేగము ఉత్తమ మైనది. ఏడడుగుల దూరము నుండి కడువేగముతో పరుగిడు మానవుని నూరడుగులు వేసి పట్టుకోగలిగినచో, ఆ గజ వేగము మధ్యమము. అయిదడుగుల దూరమున నుండి అతి జవమున పరుగిడు మనుష్యుని నూటయేబది యడుగులు వైచి తాకగల్గినట్టి కరివేగము అధమము. ఇట్లే యింత సమయములో ఇంతదూరము నడచునది యిట్టిది అని శాస్త్రకారులు గజవేగమును నిర్ధారణము చేసియున్నారు.

గజబలసత్వములు – పరీక్ష : ఎంత మంచిలక్షణములు గలది యైనను, బలహీనమైనచో అట్టి కరివలన ప్రయోజన మేమి? కావుననే 'గుణే భ్యోపి బలం శ్రేష్ఠం తత్పరక్షేత పండితః' అన్నారు గజశాస్త్ర కోవిదులు.

బలము పరీక్ష : ఏది 95 మణుగుల (స్వర్ణతామ్రరజతములలో ఒకదానిని) బరువును వేసికొని యెనుబదిమైళ్ళ దూరమును అనాయాసముగా నడచిపోవునో అది యుత్తమబలసమన్వితమగు కుంభి యనవలెను. ఏది డెబ్బది మూడు మణుగుల బరువు మోయుచు, ఏబదియారుమైళ్లు శ్రమలేక నడచిపోవునో యది మధ్యమబలయుతము. ఏబదిరెండు మణుగుల బరువుకట్టుకొని, నలుబదిమైళ్ళు అక్లేశముగా ఏది నడచిపోవునో యది నీచబలయుత గజమని గుర్తింపదగును. గజబలపరీక్షలో నితర విధానములును అవలంబింపబడును. 24 మూరల పొడవు - నాలుగు మూరల చుట్టుకొలతగల చండ్ర, యేగి, మద్ది వంటి దారుస్తంభమును అనాయాసముగా విరిచి వేయగల యేనుగుయొక్క బలము ఉత్తమమైనదిగా నిర్ణయింప బడును. మధ్య మాధమ బలములను ఇట్లే పరీక్షింపనగును.

సత్వపరీక్ష : దేహగురుత్వాదు లన్నింటిలో సత్వమే ప్రధానమైనది.

231