పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/208

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్షేత్రస్వరూప రచన - కంచెలు

విషయములపై ఆధారపడి, పొలములయొక్క పరిమాణము నిర్ణయింపబడవలసి యున్నది.

వ్యవసాయమునకు ఉపయోగపడు పరికరములనుబట్టి, యంత్రములనుబట్టిగూడ పొలముయొక్క పరిమాణము మారవచ్చును. ఉదాహరణమునకు (ఎ) 1/40 ఎకరము విస్తీర్ణముగల తోటలలో గడ్డపలుగువంటి పరికరము (బి) యెకరము విస్తీర్ణముగల పొలములలో దేశవాళీ నాగలి; (సి) 10 మొదలు 15 యెకరముల విస్తీర్ణముగల భూములలో ట్రాక్టరు ఉపయోగపడును.

మెట్ట వ్యవసాయమందు పెద్ద పరిమాణముగల భూ ఖండములు లాభదాయకము కాగా, పల్లపు వ్యవసాయమందు అంతకంటె తక్కువ విస్తీర్ణముగల ఖండములు ప్రయోజనకరములగుచున్నవి.

వ్యాపారపు పంటలు పండు భూములు పెద్ద ఖండములుగా విభజింపబడును. కాని పరిశోధనముల కుపయోగ పడు భూములు అంతకంటె తక్కువ పరిమాణముగల ఖండములుగా విభజింపబడు చున్నవి.

భూమిని చక్కగా, సమతలముగ మట్టముగావించినచో, దానిని అధిక ప్రమాణముగల ఖండములుగ విడదీయవచ్చును. కాని సమతలముగ లేని ప్రదేశమందు భూమి కోతకోయబడకుండ తప్పించుటకై స్వల్ప పరిమాణముగల ఖండములుగ విభజించుటయే మంచిది. భూమియొక్క ఏటవాలుడు (slope), నిట్రముగ (steep) నున్నచో, కట్టలు నిర్మించి సమతలములైన ఖండములను తయారుచేయ వచ్చును.

లోతులేని నీటి వనరులపై ఆధారపడు భూములను 1/5 యెకరము విస్తీర్ణముగల ఖండములుగను, బావినీరుపై ఆధారపడు భూములను 1/2 నుండి 1 యకరము విస్తీర్ణముగల ఖండములుగను గొట్టపు బావులపై ఆధారపడు, భూములను 1 నుండి 2 యకరముల విస్తీర్ణముగల ఖండములుగను, కాలువనీటి సాయముపై ఆధారపడు భూములను నీటిపారుదల స్థితినిబట్టి ఎక్కువ తక్కువ విస్తీర్ణములుగల ఖండములుగను విభజింపనగును.

రోడ్లు, మంచినీరు పారుదల మార్గములు : పొలములపై పంటపండి సిద్ధముగా నున్నప్పుడుగాని, లేక వర్షాకాల మందుగాని, కార్మికులు పొలములందు ప్రవేశించి పని చేయుటకు రోడ్లు ఉపయోగపడును. ఈ రోడ్లు పొలములకు సరిహద్దులుగను, గట్లుగగూడ నుపయోగపడును. ఇట్టి రోడ్లు సాధ్యమైనంత ఎత్తుగానుండి, వర్ష జలము వాటిపై పొర్లిపోకుండ నుండవలయును. ఇవి బండ్లు పోవుటకుగూడ నుపయోగపడవలెనన్నచో ఇవి 10 అడుగుల వెడల్పున నున్న సరిపోవును. కాని అంతకంటె ఎక్కువ వెడల్పయిన సాధనములకు రోడ్డును 15 అడుగుల వరకు విస్తృత పరచవచ్చును.

భూమి సమతలముగ నున్నయెడల భూమట్టమునకు క్రిందుగా ఒక అడుగులోతున కాలువలు తవ్వినచో, పొలమునందలి రోడ్లు మురుగునీరు ప్రవహించుట కుపయోగించును. ఇందువలన భూమి వృధాకాక, పొదుపగును. పొలముల మట్టముకంటె నీటి పారుదల మార్గములను లోతుగ త్రవ్వినచో, అవి మురుగునీటి కాలువలుగా నుపయోగ పడగలవు.

కంచె నిర్మాణమందలి ఉద్దేశము: పెంపుడు జంతువులు గాని, ఇతర జంతువులు గాని ఒక ప్రదేశమందు స్వేచ్ఛగా సంచరింపకుండ నిరోధించుటయే కంచెవేయుట యందలి ఉద్దేశమైయున్నది. కంచె నిర్మాణము మూడు కార్యములకై ఉపయోగ పడుచున్నది మొదటిది, ఒక నిర్ణీత ప్రదేశమందు జంతువులను నిర్బంధమందుంచుట: రెండవది, సరిహద్దును ఏర్పరచుకొనుట; మూడవది, విచ్చలవిడిగా తిరుగు జంతువులనుండి పంటలను రక్షించుట.

కంచె యందలి రీతులు : వర్తమాన కాలములో కంచె నిర్మించుటయందు వేర్వేరు రీతులు ఆచరణయందున్నవి. ప్రధానమైన విధానములు వీటిలో మూడు: (1) సచేతనములైన మొక్కలతో కంచె నిర్మించుట. (2) అచేతనములైన ఇటుక, కొయ్య, రాయి, ఇనుప ఊచలు, తీగెలు మొదలగువాటితో కంచె నిర్మించుట. (3) ఎలెక్ట్రిక్ తీగెతో కంచెవేయుట.

సచేతనమైన కంచె : సీమచింత, గోరింట, కిత్తనార, నాగదాళిచెట్లు, సరుగుడు, వెదురు, చిల్లకంప, బ్రహ్మజెముడు మున్నగునవి కంచె నిర్మించుట కుపయోగపడు చున్నవి. వీటిని వర్షములలో నాటి చక్కగ పోషింపవలయును. వీటి అగ్రములు సమముగ కత్తిరింపనిచో, అవి ఎగుడు దిగుడుగా పెరుగును.

165